Vemula Veeresham
-
తెలివిమీరిన సైబర్ నేరగాళ్లు.. ఎమ్మెల్యే పేరుతో డబ్బులు వసూలు
నల్లగొండ జిల్లా :సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథా ఎంచుకుంటున్నారు. కొంగొత్త మార్గాల్లో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో రకాల మోసాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ మోసమో మరోసారి వెలుగు చూసింది.ఈసారి సైబర్ నేరగాళ్ల అమాయకుల్ని మోసం చేసేందుకు ప్రజా ప్రతినిధుల్ని ఎంచుకున్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కుటుంబ సభ్యుల పేరుతో సైబర్ నేరగాళ్ల వాట్సాప్ కాల్స్ చేశారు.ఎమ్మెల్యే వేముల వీరేశం పేరుతో డబ్బులు కావాలంటూ ఆయన సన్నిహితులకు మెసేజ్, వాట్సాప్ కాల్స్ చేశారు. సైబర్ కేటుగాళ్ల గురించి సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వీరేశం తన పేరుతో మెసేజ్‌లు,కాల్స్ వస్తున్నాయని,అలాంటి వాటికి స్పందించొద్దని కోరారు. -
‘సబ్‌ప్లాన్’ను మాయం చేశారు
సాక్షి, హైదరాబాద్: దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉదాత్త ఆశయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్ విధానాన్ని ప్రారంభించి, ఆయా వర్గాల పేదల సంక్షేమానికి చర్యలు తీసుకుంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం దానిని తొలగించి పేదల సంక్షేమాన్ని దెబ్బతీసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ ప్లాన్ నిధులతో ఆయా వర్గాల వారికి ఎంతో లబ్ధి కలిగిందని, సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక్కో గ్రామానికి పది వరకు యూనిట్లు దక్కాయని గుర్తు చేశారు. కానీ గత ప్రభుత్వం ఆ విధానాన్ని తొలగించి, దళితబంధు పేరుతో నిధులు పక్కదారి పట్టించిందని ఆరోపించారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చను ప్రారంభించారు. ఆయన ప్రసంగం ప్రారంభించగానే బీఆర్ఎస్ సభ్యులు తమ పార్టీ నుంచి వెళ్లిపోయి మాట్లాడుతున్నావంటూ వ్యాఖ్యానించారు. ‘నన్ను ఓ మనిషిగా చూడలేని మిమ్మల్ని వదిలి ఆదరించిన కాంగ్రెస్‌లో చేరి గెలిచా. అన్నీ చెప్తా.. వినే ఓపిక ఉందా, నన్ను గెలకొద్దు, గెలికించుకోవద్దు’అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణస్వీకారం చేస్తూనే తెలంగాణ సమాజం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవటం ప్రారంభించిందన్నారు. అంతా బాగుంటే ప్రజలు ఎందుకు ఓడించారు దొరల పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తమను గెలిపించారని, దొరల పాలనకు గుర్తుగా ఉన్న ప్రగతి భవన్ కంచెలు తొలగించామని వీరేశం పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేశామని గత ప్రభుత్వంలో గొప్పలు చెప్పుకొన్నారని, మరి సంక్షేమం బాగుంటే ప్రజలు ఎందుకు ఓడించారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను చైతన్యపరిచేందుకు కృషి చేసిన గద్దర్‌ను ప్రగతి భవన్‌లోకి అనుమతించకుండా అవమానించారని, ఇప్పుడు ఆయన సేవలను తమ ప్రభుత్వం తగు రీతిలో గౌరవించుకుంటోందన్నారు. అబద్ధానికి ప్రతిరూపం కేసీఆర్: యెన్నం అబద్ధానికి ప్రతిరూపంగా కేసీఆర్ నిలుస్తారని అధికార పక్ష సభ్యుడు యెన్నం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కృష్ణానదికి కాళ్లు అడ్డుపెట్టి పాలమూరును సస్యశ్యామలం చేస్తామని ఎంపీగా అక్కడి నుంచి గెలిచి, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా మహబూబ్‌నగర్‌ను పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని.. కానీ, నాలుగు సార్లు దావోస్ వెళ్లి రూ.19 వేల కోట్లకు మించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోలేకపోయిందని యెన్నం ఎద్దేవా చేశారు. అయితే సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే దావోస్ వెళ్లి ఏకంగా రూ.40 వేల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్న ఘనత రేవంత్‌దన్నారు. -
బీఆర్ఎస్ పాలనలో దోపిడీ తప్ప మరేమీ లేదు
-
కాంగ్రెస్ ప్రభంజనం చూసి బీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుంది
-
నకిరేకల్ లో ఎంపీ కోమటిరెడ్డితో కలిసి వేముల వీరేశం ర్యాలీ
-
బీసీలకు సీట్లపై ఆందోళన వద్దు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నేతలకు సీట్ల కేటాయింపు విషయంలో ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. తెలంగాణలో బీసీలకు కనీసం 34 సీట్లు కేటాయించాలన్న డిమాండ్‌తో గత రెండు రోజులుగా ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలుస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతలు పలువురు శనివారం సాయంత్రం ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఖర్గే ఆరా తీశారు. బీసీ నేతలు చేస్తున్న కనీసం 34 స్థానాల డిమాండ్‌పై మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ నేతృత్వంలోని బృందంతో చర్చించారు. అనంతరం తెలంగాణ భవన్లో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కత్తి వెంకటస్వామి సహా పలువురు తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలతో కలసి మధుయాష్కీ గౌడ్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక సమతౌల్యం పాటించడంతోపాటు బీసీలకు సీట్ల కేటాయింపుపై ఖర్గేతో చర్చించామని... తెలంగాణ అంటే తనకు ప్రత్యే క శ్రద్ధ అని ఖర్గే అన్నారని మధుయాష్కీ చెప్పారు. సర్వేలు సహా ఇతర అన్ని విష యాలు తమ దృష్టిలో ఉన్నాయని తెలిపా రన్నారు. ఈ విషయంలో పాత, కొత్త నేతలెవరూ ఆందోళన చెందొద్దని ఖర్గే హామీ ఇచ్చారని.. ఈ అంశంపై ఖర్గేతో చేపట్టిన చర్చలతో అధిష్టానంపై తమకు పూర్తి విశ్వాసం ఏర్పడిందని తెలిపారు. సీట్ల కేటాయింపు విషయంలో తెలంగాణలో అన్ని వర్గాలకు సమతుల్యం పాటించేలా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అన్ని వర్గాలు కలసికట్టుగా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని ఖర్గే సూచించారని మధు యాష్కీ తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న పూర్తి రాజకీయ పరిణామాలపై ఖర్గేకు పూర్తి అవగాహన ఉందని... రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీసీలకు ఎలాంటి అన్యాయం జరగదని మధుయాష్కీ భరోసా ఇచ్చారు. -
కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, భువనగిరి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వీరితో పాటుగా మైనంపల్లి కుమారుడు రోహిత్, కంభం అనిల్ కూడా హస్తం గూటికి చేరారు. వీరికి కండువా కప్పి మల్లికార్జున ఖర్గే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంఛార్జ్ మానిక్రావ్ ఠాక్రే ఉన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఇటీవలే మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, తన కుమారుడు రోహిత్‌కు బీఆర్ఎస్లో టికెట్ దక్కకపోవడంతో మైనంపల్లికి బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్లో రాజకీయ పరిణామాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. #WATCH | Delhi: BRS MLA Mynampally Hanumantha Rao along with his son joined the Congress Party in the presence of the Congress president Mallikarjun Kharge and party's Telangana unit chief Anumula Revanth Reddy. BRS Ex MLA Vemula Veeresham also joined the party today. pic.twitter.com/rLG2pMHcgL — ANI (@ANI) September 28, 2023 ఈ సందర్బంగా కుంభం అనిల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లడం వల్ల కేడర్‌కు దూరం అయ్యాను. భువనగిరి ప్రజల ఆలోచనతో మళ్ళీ పార్టీలోకి వచ్చాను. భువనగిరిలో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తాను. టికెట్ కేటాయింపు అంశం అధిష్టానం చూసుకుంటుంది. ఇది కూడా చదవండి: ‘రాష్ట్రంలో ఏ పార్టీకీ గెలిచే బలం లేదు. నేను బీజేపీలోనే ఉంటా’ -
ఎవరూ ఆవేశపడొద్దు: కోమటిరెడ్డి
సాక్షి, నల్లగొండ: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ వైపు చూస్తుండడం.. ఆ చేరికకు తెలంగాణ పీసీసీ సైతం పచ్చ జెండా ఊపిందనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈలోపు అనూహ్యాంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్లీ తెర మీదకు వచ్చారు. శనివారం నకిరేకల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, తన అనుచరులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ‘‘బీఆర్ఎస్కు రాజీనామా చేస్తే కాంగ్రెస్ తరపున టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు కాబట్టే కాంగ్రెస్ వైపు అడుగులేస్తున్నారు. ఎవరో వస్తున్నారన్న వార్తలు నమ్మి కార్యకర్తలు ఆవేశపడొద్దు. కారక్యర్తలు ఎవరి పేరు చెబితే.. వాళ్లనే అభ్యర్థిగా ప్రకటిస్తా. ఉచిత విద్యుత్‌పై రేవంత్ నోరు జారితే.. లాగ్‌బుక్ పెట్టి నష్టనివారణ చేయించింది నేనే అని కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. నల్లగొండ కాంగ్రెస్ చేరికలపై కోమటిరెడ్డితో మరో సీనియర్.. ఎంపీ ఉత్తమ్‌కుమార్ సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అందరినీ కూడదీసుకుని బీఆర్ఎస్కు ఢీ కొట్టాలనే ఆలోచనతో ఉన్న పీసీసీ చేరికలకు ఆటంకం కలగకుండా ఈ ఇద్దరు సీనియర్లను బుజ్జగించే సంప్రదింపులు జరుపుతోంది. అయితే కోమటిరెడ్డి మాత్రం కార్యకర్తల మనోభావాల్ని పరిగణనలోకి తీసుకోవాలని పీసీసీకి, కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతూ వస్తున్నారు. -
బీఆర్ఎస్ పార్టీకి వేముల వీరేశం రాజీనామా
సాక్షి, నల్లగొండ జిల్లా: టికెట్ ఇస్తారన్న ఆశతో ఉన్నా మాజీ ఎమ్మెలే వేముల వీరేశానికి బీఆర్ఎస్ మొండిచేయి చూపడంతో నిరాశే మిగిలింది. దీంతో ఆ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. నకిరేకల్‌లో ఆత్మీయ సమ్మేళనంలో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వారం రోజుల్లో ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ‘‘వేముల వీరేశం ఏం చేశాడని నాలుగున్నరేళ్లుగా హింసిస్తున్నారు. ఉద్యమకాలంలో దెబ్బలు తిని జైలుకు పోయింది నేను కాదా.. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులతో కొట్టించినా జిల్లా నాయకత్వం పట్టించుకోలేదు. గన్మెన్లను కూడా తొలగించారు. ఇన్ని బాధలు పెట్టినా భరించా.. అయినా ఇంకా భరిస్తూ బీఆర్ఎస్ పార్టీలో ఉండాలా’’ అంటూ తన అనుచరులు ముందు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: కేసీఆర్.. క్యాన్సర్ కంటే డేంజర్: బండి సంజయ్ ‘‘ఈ రోజు నుంచి బీఆర్ఎస్తో తనకు ఉన్న బంధం తెగిపోయింది. నా రాజీనామా లేఖను అనుచరులు, నియోజకవర్గ ప్రజల ముందు ఉంచుతున్నా. నియోజకవర్గంలో జరుగుతున్న దారుణాలపై బహిరంగ చర్చకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమా’’ అంటూ వీరేశం సవాల్ విసిరారు. -
ఎవరో చెబితే చేర్చుకోవడమేనా?: టీ కాంగ్రెస్‌లో హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికలపై చీలికలు మొదలయ్యాయా?. ఇప్పటికే పొంగులేటి, జూపల్లి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామెదర్‌రెడ్డి చేరికలు ఖరారు అయిపోయాయి. అయితే తేదీల విషయంలో మాత్రం ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. వీళ్ల చేరికలపై నేతల్లో ఏకాభిప్రాయం ఉంది. అయితే ఈలోపు మరికొందరి చేరికలపై హడావిడి నడుస్తుండగా.. పలువురు సీనియర్లు మాత్రం అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నట్లు సమాచారం. నల్లగొండ నకిరేకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత వేముల వీరేశం కాంగ్రెస్ గూటికి చేరే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుత ఎమ్మెల్యే చిన్నయ్యతో ఆయనకు పడదన్న సంగతి తెలిసిందే. అదే టైంలో టికెట్ కూడా దక్కే ఛాన్స్‌లు కనిపించడం లేదు. దీంతో వీరేశంతో పాటు కోదాడకు చెందిన శశిధర్‌రెడ్డి సైతం హస్తం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో పొంగులేటి ఇంటికి ఈ ఇద్దరూ వెళ్లినట్లు సమాచారం. వేముల వీరేశం అయితే.. వీరేశం, శశిధర్‌రెడ్డి చేరికల అంశాన్ని నల్లగొండ సీనియర్లు ఉత్తమ్, కోమటిరెడ్డిలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా చేర్చుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది అవమానించడమే అవుతుందని, సునీల్ కనుగోలు(ఎన్నికల వ్యూహకర్త) చెబితే చేర్చుకోవడమేనా? అని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి ఇంటికి పీపీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ గెలుపే ముఖ్యమన్న కోమటిరెడ్డికి ఆయన చేరికలపై నచ్చజెప్పి.. ఆపై ఇద్దరూ పొంగులేటి ఇంటికి వెళ్తారని సమాచారం. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ నుంచి కొత్త మనోహర్‌రెడ్డి సైతం కాంగ్రెస్ గూటికి చేరుకోనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. 2014లో మహేశ్వరం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేశారీయన. పొంగులేటితో పాటే కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు మనోహర్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన రేవంత్‌రెడ్డితో భేటీ కానున్నారు. ఇదీ చదవండి: పక్కా.. బీఆర్ఎస్ నేతలు పార్టీ మారతారు చూస్కోండి! -
నకిరేకల్ బీఆర్ఎస్లో వర్గపోరు.. వీరేశంపై ఎమ్మెల్యే చిరుమర్తి ఫైర్..
నల్లగొండ: నకిరేకల్ బీఆర్ఎస్లో వర్గపోరు మరోసారి బయటపడింది. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని టార్గెట్ చేస్తూ ప్రస్తుత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్ర విమర్శలు చేశారు. నాలుగు సంవత్సరాలుగా ఆయనకు పార్టీలో సభ్యత్వమే లేదని వ్యాఖ్యానించారు. వీరేశం ఎక్కడ ఉంటున్నాడో, ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. 'ఒకసారి ఎంపీగా పోటీ చేస్తా అంటావు. మరొకసారి ఇంకో నియోజకవర్గం పేరు చెప్తావు. ఇంకోసారి ఎమ్మెల్సీ, మంత్రి అంటున్నావు. గతంలో తొడలుకొట్టి ఓ పేపరు చూపించారు. ఇప్పుడు అది ఎటుపోయిందో ఎవరికీ తెలియదు. ప్రజల్ని అనుచరులని అయోమయానికి గురి చేస్తున్నావు. గతంలో జిల్లాలో ఎక్కడపడితే అక్కడ కబ్జాలు జరిగేవి. నకిరేకల్‌కు గతంలో కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నా.' అని చిరుమర్తి వ్యాఖ్యానించారు. చదవండి: రాజకీయం రసకందాయం! సబిత పెత్తనం ఏమిటంటున్న తీగల -
కేసీఆర్ ప్రకటనే అసలు సమస్య.. మాజీ ఎమ్మెల్యే దారేటు?
గతంలో మాదిరిగా ఈసారి కూడా సిటింగ్‌లకే సీట్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అనేక స్థానాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు. గతం నుంచీ అక్కడ గులాబీ పార్టీకి సేవ చేస్తున్నవారి పరిస్థితి ఏంటి? గతం నుంచి సీటిస్తామంటూ హామీ పొందినవారి సంగతేంటి? ఇటువంటి వారంతా సీట్ల కోసం ఏం చేయబోతున్నారు? ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నేతలు ఏమంటున్నారు? నకిరేకల్‌లో రసవత్తరం ఈసారి టికెట్ వస్తుందో రాదో అన్న అనుమానం ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత ఇచ్చిన భరోసా వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ పట్టరాని సంతోషం కలిగించింది. కొందరిని మాత్రం తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. సిట్టింగులకే సీట్లు అంటే తమ పరిస్థితి ఏంటని పార్టీలో ఉన్న ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల తర్వాత గెలిచిన పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలున్న స్థానాల్లో ఈ ఆందోళనలు కాస్త ఎక్కువే ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటి నియోజకవర్గాల్లో నల్లగొండ జిల్లా నకిరేకల్ కూడా ఒకటి. ఇక్కడ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన వేముల వీరేశంపై కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిపోయారు. ఈ ఫిరాయింపుతోనే అసలు సమస్య మొదలైంది. కారు నడిపేది నేనే..! ప్రత్యర్థులుగా పోటీ చేసి గెలిచిన, ఓడిన నాయకులు ఇద్దరు ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నారు. ఇద్దరు కూడా వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకున్నారు. కానీ అధినేత మాత్రం సిట్టింగులకే సీట్లు అని ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులతో సమావేశమైన సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా పోటీ చేస్తానని అందుకు మీరు కూడా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొందామని... మన మౌనం పిరికితనం కాదని గోడకు వేలాడ దీసిన తుపాకీ లాంటిదని ఘాటు కామెంట్స్ చేశారు. ఎంత తొక్కాలని చూస్తే బంతిలా అంత పైకి ఎగురుదామని వీరేశం మాట్లాడిన తీరు చూస్తే ఆయన ఖచ్చితంగా పోటీలో ఉండటం ఖాయం అని తెలుస్తోంది. కమలం కొత్త వ్యూహం అయితే వీరేశం ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ లోనే కొనసాగినా.. మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి చెందిన వారిని ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేయించి సొంత పార్టీకి ధీటుగా కౌన్సిలర్లను గెలిపించుకున్నారు. అందువల్ల ఆయన కూడా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తు మీద పోటీ చేస్తారా? లేక ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే వేముల వీరేశంపై ఇటు కాంగ్రెస్ తో పాటు అటు బీజేపీ కూడా ఓ కన్నేసి ఉంచాయి. కాని ఇప్పటికే చెరుకు సుధాకర్ కాంగ్రెస్‌లో చేరి ఆయన భార్య లక్ష్మీని నకిరేకల్ నుంచి బరిలో దింపేందుకు ప్లాన్ చేశారు. ఇలాంటి సమయంలో వేముల కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది అనుమానమే. అదే సమయంలో బీజేపీలో చేరడానికి సిద్ధాంత వైరం అడ్డుగా ఉంది. వీరేశం మాజీ మావోయిస్టు. అలాంటి వ్యక్తి బీజేపీలో చేరుతారా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. టికెట్ వచ్చినా రాకున్నా.. బరిలో ఉంటా.! వీరేశానికి టీఆర్ఎస్ టికెట్ రాకున్నా పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఏ పార్టీ నుంచి బరిలో ఉంటారన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆయన అనుచరులు మాత్రం ఇండిపెండెంట్ గా పోటీ చేయవద్దనే సూచిస్తున్నారు. పలు సంస్థలు చేసిన సర్వేల్లో ప్రస్తుత ఎమ్మెల్యే కంటే తనకే అనుకూలత ఎక్కువ ఉందని వీరేశం చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వేలతో పాటు టీఆర్ఎస్ చేయించిన సర్వేలో కూడా సానుకూలత తనకే ఉందని వీరేశం అంటున్నారని టాక్. తనకు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతుందా అన్న నమ్మకం ఆయనకు ఏమూలనో ఉందని అంటున్నారు. నకిరేకల్‌లో వేముల వీరేశం, చిరుమర్తి లింగయ్య మధ్య మరోసారి రసవత్తర పోరు జరగనుందని అర్థం అవుతోంది. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
‘ట్రక్’ గుర్తు చేటుపై ..తర్జన భర్జన!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపోటములను తారుమారు చేయడమే కాదు, కొన్ని నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థుల మెజారిటీలను గణనీయంగా తగ్గించిన ‘ట్రక్’ గుర్తు చేసిన నష్టంపై అధికార పార్టీలో తర్జన భర్జన నడుస్తోంది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నాలుగు చోట్ల విజయం సాధించగా, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో ఓటమి పాలైంది. సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ (ఎస్ఎఫ్బీ) పార్టీకి ఈ ఎన్నికల్లో ట్రక్ గుర్తును కేటాయించారు. ఇది టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు ‘కారు’ను పోలి ఉండడంతో గ్రామీణులు, ముఖ్యంగా నిరక్షరాస్యులు ట్రక్ గుర్తును చూసి కారనుకున్నారన్న వాదన టీఆర్ఎస్ వర్గాలనుంచి వినిపిస్తోంది. ఎస్ఎఫ్బీ పార్టీనుంచి అభ్యర్థులు పోటీలో లేని నియోజకవర్గాల్లో ట్రక్ గుర్తును కోరుకున్న స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారు. ప్రధానంగా వయో వృద్ధులు ఈ గుర్తు విషయంలో చాలా గందరగోళానికి గురయ్యారని, తమ పార్టీ అభ్యర్థులకు పడాల్సిన ఓట్లు ట్రక్ గుర్తుకు పడ్డాయని టీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. ఎస్ఎఫ్బీ పార్టీ నుంచి పోటీలో నిలబడిన వారు ఎవరూ నియోజకవర్గాల్లో ఎలాంటి ప్రచారం చేయలేదని, విస్తృతంగా ప్రచారం చేసిన బీజేపీ, సీపీఎం వంటి పార్టీలకన్నా ఎక్కువ ఓట్లు ట్రక్ గుర్తున్న అభ్యర్థులకు పోలయ్యాయని చెబుతున్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో అత్యధిక పర్యాయాలు సీపీఎం ప్రాతినిధ్యం వహించింది. తొలి ఎన్నికల నుంచి 2014 ఎన్నికల దాకా కాంగ్రెస్ రెండు సార్లు, టీఆర్ఎస్ ఒకరి మాత్రమే గెలిచాయి. కానీ, ఈ ఎన్నికల్లో సీపీఎం పోటీలో ఉన్నా, ఆ పార్టీ అభ్యర్థికి కేవలం 4543 ఓట్లు రావడాన్ని ప్రస్తావిస్తున్నారు. అదే ఎస్ఎఫ్బీ అభ్యర్థి ట్రక్ గుర్తుపై ఏకంగా 10,383 ఓట్లు పోల్ కావడాన్ని వీరు ఉదహరిస్తున్నారు. జిల్లాలో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 9818 ఓట్లు, మునుగోడులో 2279 ఓట్లు ఎస్ఎఫ్బీ అభ్యర్థులకు పోల్ కాగా, ట్రక్ గుర్తుపొందిన ఇండిపెండెంట్ అభ్యర్ధులు ఉన్న మిర్యాలగూడలో 4,758, నల్లగొండ నియోజకవర్గంలో 2,932 ఓట్లు పోలయ్యాయి. ఈ అంశాలను విశ్లేషించుకున్న నేతలు కారు గుర్తును పోలిన ట్రక్ గుర్తు తమ అభ్యర్థుల మెజారిటీలు తగ్గించిందని, నకిరేకల్ నియోజకవర్గంలో ఏకంగా ఓటమికి కారణమైందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. రీ ఎలక్షన్‌కు డిమాండ్ నకిరేకల్ నియోజకవర్గంలో ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం తన ఓటమికి దారితీసిన ట్రక్ గుర్తు వ్యవహారంపై కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన తన న్యాయవాదులు, పార్టీ అధినాయకత్వంతో చర్చించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య 8,259 ఓట్ల మెజారిటీతో వేముల వీరేశంపై విజయం సాధించారు. అయితే, ట్రక్ రూపంలో తమ అభ్యర్ధికి 10,383 ఓట్లకు గండిపడిందన్నది టీఆర్ఎస్ నేతల అభిప్రాయం. ట్రక్ గుర్తు లేని పక్షంలో తమ అభ్యర్థి కనీసం 1500 నుంచి 2వేల ఓట్ల మెజారిటీతో గెలిచేవారని పేర్కొంటున్నారు. జాతీయ స్థాయిలో రిజిస్టర్డ్ పార్టీ అయిన సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ తమ అభ్యర్థులకు కామన్ గుర్తుగా ‘ట్రక్’ను కోరడంలో ఒక వ్యూహం దాగి ఉందన్నది వీరి అభిప్రాయం. ఈ గుర్తు చేసే నష్టాన్ని అంచనా వేసిన కొన్ని నియోజకవర్గాల్లో ఆ అభ్యర్థులను పోటీలో లేకుండా కొందరు మేనేజ్ చేసుకున్నారని, అయినా, ఇండిపెండెంట్లకూ ఇదే గుర్తు కేటాయింపు జరగడంతో తమ మెజారిటీలు తగ్గాయని అంటున్నారు. ప్రత్యేకించి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, ఈ ఎన్నికల్లో ఓడిపోయిన వేముల వీరేశం తమ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ, పోలింగ్ సరళిపై పూర్తి వివరాలు కావాలని జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కలెక్టర్‌ను కోరారని తెలిసింది. అంతే కాకుండా గుర్తు చేసిన చేటు, గుర్తు కేటాయింపు తదితర అంశాలపై కోర్టును ఆశ్రయించనున్నట్లు చెబుతున్నారు. తమ నియోజకవర్గానికి రీ ఎలక్షన్ జరిపించాలని ఈసీని కూడా డిమాండ్ చేస్తూ కేసు వేయనున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. -
కాళేశ్వరంతో వేలాది ఎకరాలకు సాగునీరు : వేముల వీరేశం
సాక్షి, రామన్నపేట : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మండలంలోని వేలాది ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నట్లు నకిరేకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం తెలిపారు. బుధవారం రామన్నపేటలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనేక ప్రజాసంక్షేమ పథకాలతో ప్రజల మనసును చూరగొన్న కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు, ఆసరా పెన్షన్ల రెట్టింపు, నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు. ధర్మారెడ్డిపల్లి కాలువ పనులు వేగంగా జరుగుతున్నాయని త్వరలోనే చెరువులను నింపుతామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గంగుల వెంకటరాజిరెడ్డి, నాయకులు పూస బాలకిషన్, ముక్కాముల దుర్గయ్య, సోమనబోయిన సుధాకర్‌యాదవ్, అంతటి రమేష్, ఆకవరపు మధుబాబు, గుత్తా నర్సిరెడ్డి, రామిని రమేష్, సాల్వేరు లింగయ్య, మినుముల వెంకటరాజయ్య, ఎండీ నాజర్, చల్లా వెంకట్‌రెడ్డి, పోచబోయిన మల్లేశం పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
టీఆర్ఎస్కు బ్రహ్మరథం : వీరేశం
సాక్షి, నకిరేకల్ : నకిరేకల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచా రంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా ప్రజలు టీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారని నకిరేకల్ తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం అన్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా న కిరేకల్ మండలం నెల్లిబండ, నకిరేకల్‌లోని రెహమత్నగర్, 5, 12, 13, 14వ వార్డుల్లో సోమవారం ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నెల్లిబండ గ్రామంలో ప్రజలు కోళాటాలు, పూల వర్షంతో స్వాగతం పలికారు. నకిరేకల్‌లోని 5వ వార్డులో, రెహమత్‌నగర్‌లో వివిధ పార్టీల నుంచి పలువురు టీఆర్ఎస్లో చేరారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన ప్రచార కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. మరోసారి టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ పూజర్ల శంభయ్య, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పల్రెడ్డి నర్సిం హారెడ్డి, కొండ వెంకన్నగౌడ్, జెట్పీటీసీ పెండెం ధనలక్ష్మీసదానంద,ం నెల్లిబండ సర్పంచ్ ముస్కు పాపమ్మపుల్లయ్య, నాయకులు వీర్లపాటి రమేశ్, యానాల లింగా రెడ్డి, మంగినపల్లిరాజు, కొండ శ్రీను, సామ శ్రీని వాస్‌రెడ్డి, యానాల శేఖర్‌రెడ్డి, రాచకొండ వెంకన్న, య ల ్లపురెడ్డి సైదారెడ్డి, కదిరె రమేశ్, షబానా, చిట్యాల, ని ర్మల, నర్సింహ, గంగాధర పద్మ, సబితలు ఉన్నారు. ఆశీర్వదించి మరోసారి గెలిపించాలి.. నార్కట్‌పల్లి : ప్రజ సేవ చేయడానికి మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం అన్నారు. మండలంలోని నెమ్మాని గ్రామంలో సోమవారం ప్రచారం నిర్వహించి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలే మరోసారి తనను గెలిపిస్తాయని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రేగట్టే మల్లిఖార్జున్‌రెడ్డి, గంట్ల నర్సిరెడ్డి, సట్టు సత్తయ్య, గాయం శ్యాంసుందర్‌రెడ్డి, ఎంపీటీసీ ఊయాల అనితవెంకన్న, తదితరులు ఉన్నారు. -
యాసంగిలోపు నీళ్లు అందిస్తాం..
సాక్షి, నల్గొండ: వచ్చే యాసంగి నాటికి బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు కింద నకిరేకల్, నల్గొండ నియోజకవర్గాలకు మొదటి దశలో నీళ్లు అందిస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి బ్రాహ్మణవెల్లెంల గ్రామంలో 100 డబుల్ బెడ్రూంల ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..తెరాస ప్రభుత్వంలో నకిరేకల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మారుమూల గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో డబుల్ బెడ్రూంల ఇళ్లు వేగంగా పూర్తి అవుతున్నాయని..మరి కొద్ది రోజుల్లో అన్నింటిలోకి గృహ ప్రవేశాలు చేస్తామని పేర్కొన్నారు. -
నన్ను చంపేందుకు తెలంగాణ ప్రభుత్వం కుట్ర
-
‘నన్ను చంపేందుకు కుట్ర’
సాక్షి, నల్లగొండ: తనను హత్య చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. కొందరు టీఆర్ఎస్ నేతలు తమ అనుచరులతో తనను హత్య చేయించాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండలో గురువారం ఇక్కడి మీడియాతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతుల కోసం పోరాడినందుకే తనను అసెంబ్లీ నుంచి బహిష్కరించారని పేర్కొన్నారు. ప్రజలు తనవైపు ఉన్నంత కాలం వంద మంది కేసీఆర్‌లు వచ్చినా తనను ఎమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సాధన ఉద్యమ సమయంలో కేసీఆర్ తన పదవి కోసం దీక్ష చేయగా.. తాను మాత్రం ప్రజల కోసం దీక్ష చేశానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులతో తనను చంపించే ప్రయత్నం చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చించి, ఆయన అనుమతితో ప్రజా సమస్యలపై తెలంగాణ అంతటా పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. తన పాదయాత్రలో సీఎం కేసీఆర్ పతనం ప్రారంభమయినట్టేనని వ్యాఖ్యానించారు. -
కోమటిరెడ్డి పతనం ఏనాడో ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి పతనం ఏనాడో ప్రారంభమైందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వ్యాఖ్యానించారు. గురువారం అసెంబ్లీ లాబీల్లో తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. నల్లగొండలో టీఆర్ఎస్ అభ్యర్థిగా భూపాల్‌రెడ్డి ఉంటారని చెప్పారు. నల్లగొండ, అలంపూర్లకు ఉపఎన్నికలు వస్తాయనే భావిస్తున్నామన్నారు. నల్లగొండ లోక్‌సభ నుంచి సీఎం కేసీఆర్ పోటీచేసే అవకాశాలున్నాయని, సిట్టింగులు అందరికీ టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు. -
కాల్‌డేటాలో ‘వేముల’ గుట్టు!
-
కాల్‌డేటాలో ‘వేముల’ గుట్టు!
సాక్షి, హైదరాబాద్: ఒక హత్య.. అనేక అనుమానాలు.. మరెన్నో ఆరోపణలు.. తూతూమంత్రంగా పోలీసుల దర్యాప్తు.. ఇలా రాష్ట్రంలో సంచలనం రేపిన నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యోదంతం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితులతో నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం అన్న కుమారులు వేముల సుధీర్, వేముల రంజిత్‌లు మాట్లాడిన కాల్‌డేటా శనివారం బయటపడింది. హత్య జరిగిన రోజున ఉదయం నుంచి వారు తరచూ ఫోన్లో మాట్లాడారని, ఘటన సమయంలోనూ ఫోన్‌కాల్స్ వెళ్లాయని వెల్లడైంది. ఎమ్మెల్యే వీరేశం ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగినట్టు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు ఈ పరిణామాలు బలం చేకూర్చుతున్నాయి. అయితే ఈ కేసులో పోలీసుల తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య జరిగి 11 రోజులైనా పోలీసులు తగిన విధంగా ఎందుకు స్పందించడం లేదని, నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించడం లేదెందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిమిష నిమిషానికీ అప్డేట్! జనవరి 24వ తేదీ అర్ధరాత్రి 11:50–12:10 గంటల సమయంలో బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య జరిగింది. నిందితులు రాంబాబు, మల్లేశ్ ఇద్దరూ ఆ రోజున ఉదయం నుంచి వేముల రంజిత్, వేముల సుధీర్లతో టచ్‌లో ఉన్నట్టు వారి ఫోన్ కాల్‌డేటా పరిశీలనలో బయటపడింది. ఆ రోజున రాత్రి 7.45 గంటల సమయంలో మిర్చి బండి వద్ద జరిగిన గొడవ నుంచి శ్రీనివాస్ హత్య వరకు నిందితులు ప్రతి విషయాన్నీ సుధీర్, రంజిత్‌లకు ఫోన్లో వివరించినట్లు కాల్‌డేటా ప్రకారం స్పష్టమవుతోంది. వీరితోపాటు సుధీర్ స్నేహితుడు సంపత్, విష్ణు అనే మరో వ్యక్తితో సైతం నిందితులు మాట్లాడినట్టు కాల్‌డేటాలో వెల్లడైంది. నిందితుల కాల్‌డేటా ప్రకారం.. జనవరి 24వ తేదీన రాత్రి 10:18 గంటలకు మల్లేశ్ ఫోన్ (9533423191)కు సుధీర్ ఫోన్ (7013863277) నుంచి కాల్ వచ్చింది. 39 సెకన్ల పాటు మాట్లాడుకున్నారు. సుధీర్ స్నేహితుడు సంపత్ (9966449992) నుంచి 10:20 గంటల సమయంలో మల్లేశ్‌కు ఫోన్ వచ్చింది. 16 సెకన్లు మాట్లాడుకున్నారు. అనంతరం ఈ కేసులో ఏ2గా ఉన్న రాంబాబు (9885056608) నుంచి మల్లేశ్‌కు కాల్ వచ్చింది. 34 సెకన్ల పాటు మాట్లాడుకున్నారు. తర్వాత మల్లేశ్ మరో నాలుగు నంబర్లకు కాల్ చేసి మాట్లాడాడు. అనంతరం హత్య జరగడానికి ముందు 10:59 గంటలకు విష్ణుతో, తర్వాత 11:23 గంటలకు సంపత్తో మాట్లాడాడు. ఇక 12:12 గంటలకు మల్లేశ్ విష్ణుతో మాట్లాడగా.. వెంటనే సంపత్ నుంచి, తర్వాత వేముల సుధీర్ నుంచి మల్లేశ్‌కు ఫోన్ కాల్స్ వచ్చాయి. సుధీర్‌తో 21 సెకన్ల పాటు మాట్లాడిన మల్లేశ్.. శ్రీనివాస్ హత్య విషయాన్ని సుధీర్‌కు చెప్పినట్టు తెలిసింది. ఇక హత్య జరిగాక మరుసటి రోజు (జనవరి 25న) ఉదయం మల్లేశ్‌కు 9160228753, 8897647058, 8639052004, 9052525213, 9490825164, 96421841184 ఫోన్ నంబర్ల నుంచి ఎస్సెమ్మెస్‌లు వచ్చాయి. ఇవన్నీ ఉదయం 7:25 గంటల నుంచి 7:27 గంటల మధ్య రెండు నిమిషాల వ్యవధిలోనే వచ్చాయి. ఇదే సమయంలో 7:26 గంటలకు వేముల రంజిత్ నుంచి మల్లేశ్‌కు ఫోన్ వచ్చింది. ఆ వెంటనే మల్లేశ్ 8897647058 నంబర్‌కు ఫోన్ చేసి 25 సెకన్ల పాటు మాట్లాడాడు. ఆ రోజున ఉదయం 7 గంటల సమయం నుంచి మల్లేశ్ నకిరేకల్‌లోని పన్నాలగూడెంలో ఉన్నట్టు సెల్‌ఫోన్ లొకేషన్ డేటాలో బయటపడింది. అంతకు రెండు రోజుల ముందు.. ఎమ్మెల్యే వేముల వీరేశం, వేముల రంజిత్ల మధ్య జనవరి 22 వరకు ఫోన్‌కాల్ సంభాషణలు, ఎస్సెమ్మెస్‌లు ఉన్నట్టు కాల్‌డేటాలో పోలీసులు గుర్తించారు. ఆ రోజున మధ్యాహ్నం 1:30 గంటలకు వారి మధ్య చివరి ఫోన్‌కాల్ ఉన్నట్టు బయటపడింది. మరోవైపు ఈ హత్య కేసులో మరో నిందితుడిగా ఉన్న చింతకుంట్ల రాంబాబుకు వేముల రంజిత్, మేరుగు గోపి, విష్ణుల మధ్య ఫోన్‌కాల్స్ వెళ్లినట్లు కాల్‌డేటాలో బయటపడింది. హత్య జరిగిన రోజు రాత్రి 9:27 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7:30 గంటల వరకు వారి మధ్య ఫోన్ సంభాషణలు జరిగినట్లు గుర్తించారు. ఆద్యంతం అనుమానాలే..! ఈ కేసు దర్యాప్తు మొదలుపెట్టినప్పటి నుంచీ పోలీసుల తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హత్య జరిగిన రోజు రాత్రి 7:45 గంటల సమయంలో మిర్చి బండి దగ్గర గొడవ జరిగింది. దీంతో మిర్చి బండి యజమాని యాదయ్య నల్లగొండ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదని, అప్పుడే పోలీసులు వస్తే తన భర్త హత్య జరిగేది కాదని బొడ్డుపల్లి శ్రీనివాస్ భార్య, నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి పేర్కొన్నారు. – వాస్తవానికి మేరుగు గోపి, ఇతరులు ఘర్షణ పడుతున్నట్టు బొడ్డుపల్లి శ్రీనివాస్‌కు తెలిసింది. దీంతో శ్రీనివాస్ తన అనుచరుడు మోహన్‌తో కలసి బైక్‌పై అక్కడికి వెళ్లారు. తర్వాత చాలాసేపైనా శ్రీనివాస్ ఇంటికి రాకపోవడంతో భార్య లక్ష్మి వెళ్లి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్త కనిపించడం లేదని, మోహన్ ఫోన్ లిప్ట్ చేయడం లేదని పోలీసులకు చెప్పారు. అయితే అప్పటికే పోలీస్‌స్టేషన్‌లో ఉన్న మోహన్.. శ్రీనివాస్ హత్యకు గురైనట్లు చెప్పాడు. దాంతో వారు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని చూశారు. – తన భర్త ఇంటికి తిరిగి రాలేదని ఫిర్యాదు చేయడానికి లక్ష్మి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఆ తర్వాతే హత్య విషయం ఆమెకు తెలిసింది. కానీ పోలీసులు మాత్రం.. శ్రీనివాస్ హత్యకు గురైనట్లుగా ఆయన భార్య లక్ష్మి తమకు సమాచారమిచ్చారని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. అంతేకాదు లక్ష్మి వాంగ్మూలం కూడా ఇప్పటివరకు తీసుకోలేదు. దీనితో పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లుపై ఒత్తిళ్లు? శ్రీనివాస్ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న నల్లగొండ టూటౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు రెండు రోజుల క్రితం అదృశ్యమయ్యారు. మాడుగుల పోలీస్‌స్టేషన్‌లో తన పిస్టల్, పోలీసు సిమ్‌కార్డు అప్పగించి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారు. ఆయన గుంటూరులోని ఓ రిసార్ట్‌లో శనివారం గుర్తించారు. అయితే ఇన్స్పెక్టర్ అదృశ్యం వెనక ఉన్న శక్తులు ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇన్స్పెక్టర్పై తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు వస్తున్నాయంటూ నల్లగొండ పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు కాంగ్రెస్ పార్టీ నేతలు బహిరంగంగానే ఎమ్మెల్యే వేముల వీరేశంపై ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సమయంలో హత్య కేసు నిందితులతో ఎమ్మెల్యే వీరేశం అన్న కుమారులు సంభాషించినట్టు బయటపడింది. కానీ వారిని అరెస్టు చేయకుండా ఇన్స్పెక్టర్పై ఒత్తిళ్లు వచ్చాయని.. మరోవైపు దర్యాప్తు తీరుపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. దీంతో తాను ఉద్యోగం చేయలేనంటూ ఇన్స్పెక్టర్ అదృశ్యమైనట్టు చర్చించుకుంటున్నారు. వారిని ఎందుకు విచారించడం లేదు? బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో నిందితులైన రాంబాబు, మల్లేశ్‌లతో వేముల సుధీర్, వేముల రంజిత్, వారి స్నేహితులు విష్ణు, సంపత్ తరచూ మాట్లాడినట్లు కాల్‌డేటాలో వెల్లడైంది. హత్య జరిగిన సమయంలో, ముందు, తర్వాత కూడా సంభాషణలు జరిగాయి. వారిపై అనుమానాలూ వ్యక్తమయ్యాయి. ఇలాంటి సమయంలో వీరందరినీ కూడా పోలీసులు ప్రశ్నించాల్సి ఉంది. కానీ విచారించలేదు. కేవలం వేముల రంజిత్‌ను మాత్రమే, అది కూడా ఫోన్ చేసి వివరణ అడిగారు. న్యాయ సలహా, బెయిల్ విషయంపై మల్లేశ్ తనకు కాల్ చేసినట్లు రంజిత్ పోలీసులకు చెప్పారు. మరి అంతకు ముందు జరిగిన సంభాషణల సంగతేమిటని పోలీసులు విచారించలేదేమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కస్టడీ ఎందుకు కోరలేదు? ఒక ప్రజాప్రతినిధి భర్త, చాలాఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య జరిగితే... పోలీసులు ఇప్పటికీ నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించకపోవడం వెనుక ఆంతర్యమేమిటనే సందేహాలు వస్తున్నాయి. జనవరి 24న రాత్రి హత్య జరిగితే.. ఇప్పటివరకు నిందితులను కస్టడీలోకి తీసుకోలేదు. ఇక 11 మంది నిందితులుగా ఉన్న ఈ కేసులో.. నిందితులు మహేశ్, దాములూరి సతీశ్, సాయి, మేరుగు గోపి, మాతంగి మోహన్, శ్రీకాంత్‌లకు బెయిల్ వచ్చింది. వారి బెయిల్‌ను రద్దు చేయాలని గానీ, మిగతా వారిని కస్టడీకి ఇవ్వాలనిగానీ పోలీసులు కోర్టును కోరకపోవడంపైనా అనుమానాలు వస్తున్నాయని శ్రీనివాస్ భార్య లక్ష్మి పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఒత్తిడి వల్లే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉచ్చు బిగిసేనా? కాల్‌డేటా ఆధారంగా వ్యవహారం బయటపడడంతో ఎమ్మెల్యే వీరేశం అన్న కుమారులిద్దరి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది. ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు దర్యాప్తు వేగం పెంచుతున్నట్టు తెలిసింది. లక్ష్మి హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో పోలీసు శాఖపై ఒత్తిడి పెరిగింది. వేముల సుధీర్, వేముల రంజిత్లతోపాటు విష్ణు, సంపత్‌లను విచారించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ కేసు దర్యాప్తు అధికారుల తీరుపై ఆగ్రహంగా ఉన్న పోలీసు ఉన్నతాధికారులు.. ఈ దర్యాప్తు అధికారులతోపాటు జిల్లా ఎస్పీపై వేటు వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. -
'శ్రీనివాస్ హత్యను రాజకీయం చేస్తున్నారు'
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో జరిగిన మునిసిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యను కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయం చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. నమ్మినవారే హత్య చేశారని మృతుడి భార్యే చెప్పిందన్నారు. అదనపు గన్మెన్లు కావాలని డీజీపీని కోరిన కోమటిరెడ్డి.. శ్రీనివాస్ కుటుంబానికి రక్షణ కావాలని ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న ఈ మూడున్నరేళ్ల ఫోన్ కాల్ డేటాను బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్సేనని.. నయీమ్‌ను పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీనే అని వేముల ఆరోపించారు. -
' వీరేశం బడా నయీం.. రేపు అంతా షాకవుతారు '
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వీరేశం నయీంకంటే డేంజర్ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆ నయీంకంటే వీరేశమే బడా నయీం అని అన్నారు. తన ప్రధాన అనుచరుడు శ్రీనివాస్‌ను హత్య చేయించింది ముమ్మాటికి ఎమ్మెల్యే వీరేశమేనని, ఆయన కాల్ డేటా, ఆయన కిరాయి హంతకుల కాల్ డేటా చూస్తే ఆ విషయం తెలిసిపోతుందని అన్నారు. హంతకులు హత్య చేసి నేరుగా నకిరేకల్ వెళ్లి ఆగినట్లు స్వయంగా డీజీపీ కూడా చెప్పారని, వీరేశం చెబితేనే తాము హత్య చేసినట్లు నిందితులు కూడా ఇప్పటికే డీజీపీ వద్ద ఒప్పుకున్నారని, ఆ వార్తలు రేపు మీరు టీవీల్లో చూసి షాక్ కు గురవుతారని కోమటిరెడ్డి చెప్పారు. వీరేశం అనే వ్యక్తిని ఎమ్మెల్యే అనడానికి తనకు సిగ్గుగా ఉందన్న కోమటి రెడ్డి సినీ ఫక్కీలో శ్రీనివాస్‌ను హత్య చేయించారని అన్నారు. ఒక మున్సిపల్ చైర్మన్ భర్తను చంపడం మాములు విషయం కాదని, కోట్లు ఖర్చు చేసి శ్రీనివాస్‌ను హత్య చేశారని తెలిపారు. మూడేళ్ల నుంచే శ్రీనివాస్ హత్యకు కుట్ర చేశారని చెప్పారు. శ్రీనివాస్‌కు అపాయం ఉందని గతంలోనే భార్యభర్తలను అసెంబ్లీ చాంబర్‌కు తీసుకెళ్లి ముఖ్యమంత్రి కాళ్లు పట్టుకున్నంత పనిచేసినా ఆయన కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటి నుంచో పార్టీ మారాలని శ్రీనివాస్‌పై ఒత్తిడి తెస్తున్నారని, తన (వెంకట్‌రెడ్డి) సంగతి మేం (టీఆర్ఎస్) చూసుకుంటామని బెదిరించారని, అయినా అతడు వినకపోవడంతోనే ఈ హత్య చేయించారని అన్నారు. శ్రీనివాస్ తనకు కుటుంబ సభ్యుడిలాంటివాడని, 25 ఏళ్లుగా తనతోనే ఉన్నాడని చెప్పారు. 'వీరేశం అనే వాడు బడా నయీం. ఆ నయీంను ఎన్కౌంటర్ చేసినప్పుడు ఈ వీరేశంను ఎందుకు ఎన్ కౌంటర్ చేయరు. అవసరం అయితే నా ఫోన్ కాల్ డేటా తీసుకోవాలి. వీరేశం కాల్ డేటా, వీరేశం కిరాయి హంతకుల కాల్ డేటా తీసుకుంటే హంతకులు ఎవరో? ఎవరు హత్య చేయించారో అనే విషయం తేలిపోతుంది. వేముల విరేశం వల్లే శ్రీనివాస్ హత్య జరిగింది. సీఎం, మంత్రి జగదీష్ రెడ్డి అండ చూసుకొని వీరేశం బెదిరింపు కాల్స్ చేయిస్తున్నారు. నాకు, లింగయ్యకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. టీఆర్ఎస్ నాయకులకు సిగ్గుండాలి. కాంగ్రెస్‌పై విమర్శలు చేయడానికి. న్యాయం జరగకపోతే కోర్టుకు వెళతాం. చంపుకుంటూ పోతే కత్తులే మిగులుతాయి. సీఎం మా సహనాన్ని పరక్షించవద్దు' అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. -
‘దగ్గరుండి ప్లాన్ చేసింది డీఎస్పీనే’
సాక్షి, నల్లగొండ : తన ప్రధాన అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యపై సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్య వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని... డీఎస్పీని ఇక్కడకు తీసుకు వచ్చి అరాచకం సృష్టిస్తున్నారని, ఈ హత్యకు దగ్గరుండి ప్లాన్ చేసింది డీఎస్పీనేని ఆరోపించారు. కోమటిరెడ్డి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘ఆరేళ్ల క్రితం (డిశెంబరు 2011) నా కొడుకు చనిపోయినప్పుడు సగం చనిపోయిన. ఇప్పుడు నా ప్రాణానికి ప్రాణం తన తమ్ముడిలాంటోన్ని చంపారు. హంతకులు ఊటకూరు గ్రామంలో ఉన్నారని సమాచారం ఉంది. హత్యలే చేయాలనుకుంటే మీరెవ్వరు మిగలరు. మా పద్ధతి అదికాదు. దోషులను శిక్షిస్తే శ్రీనివాస్ కుటుంబానికి శాంతి కలుగుతుంది. ఆ కుటుంబం కోసం నా ప్రాణాలు ఇస్తా. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నవారిపై చర్యలుతీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. మరోవైపు శ్రీనివాస్ హత్యపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మాట్లాడుతూ... ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ హత్య చేయించినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. మాఫియా డాన్ నయీమ్‌కు వీరేశంకు దగ్గర సంబంధాలున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యే మనుషులే ఈ హత్యను చేసినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఇది చంపడం కాదని, బీసీల ఆడపడుచు బొట్టు తీసేశాడని వీహెచ్ వ్యాఖ్యానించారు. ఈ హత్య వెనుక నల్లగొండ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంఛార్జ్ హస్తం కూడా ఉందన్నారు. ఇది ముమ్మాటికి టీఆర్ఎస్ చేయించిన హత్యేనని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ పతనం నల్లగొండ నుంచే ప్రారంభం అవుతుందని అన్నారు. -
అన్యాయంపై ప్రజాప్రతినిధిగా మాట్లాడా!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తన నియోజకవర్గానికి చెందిన మహిళకు జరుగుతున్న అన్యాయంపై ఓ ప్రజాప్రతినిధిగా మాట్లాడానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం నల్లగొండలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డీసీసీబీలో నిధుల దుర్వినియోగం విషయమై 21 మంది ఉద్యోగులపై చర్య తీసుకోవాలని సదరు బ్యాంకు ఆదేశించిందన్నారు. అయితే.. నంబర్ 9 గా ఉన్న ఉద్యోగి లక్ష్మిని ఆరు నెలలు సస్పెండ్ చేశారని తెలిపారు. సస్పెన్షన్ కాలంలో విచారణ చేసి తొలగించినా తమకు అభ్యంతరం ఉండేది కాదన్నారు. సస్పెండ్ పీరియడ్ ముగిసిన తర్వాత ఏడాది నుంచి తాను 50 సార్లు బ్యాంకు సీఈవోను సంప్రదించానని, ఆమె కూడా చాలా మందికి తన బాధను మొర పెట్టుకుందన్నారు. ఆమె వికలాంగురాలని, భర్త ఆరోగ్యం కూడా సరిగా లేదని, రూ.50 లక్షలు అతని వైద్యం కోసం ఖర్చు చేసిందని ఎమ్మెల్యే వివరించారు. కుటుంబమంతా ఇబ్బందుల్లో ఉండటంతో ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో తన వద్దకు వచ్చిందని పేర్కొన్నారు. దీనిపైనే తాను ఫోన్లో అడిగితే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుచరుడు సంపత్‌రెడ్డి, సీఈవో కలసి రికార్డు చేశారని, మాట్లాడుతున్న సందర్భంలో దొర్లిన పదాన్ని పట్టుకొని ఉద్దేశపూర్వకంగా రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు. బాధితురాలు తన బంధువు కాదని.. సామాన్య వ్యక్తని, అందుకే ఆమెకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడానని వీరేశం వివరణ ఇచ్చారు. ఆమెకు న్యాయం జరిగే వరకు తోడ్పాటును అందిస్తానన్నారు. విలేకరుల సమావేశంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.