సాక్షి, హైదరాబాద్: దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉదాత్త ఆశయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్ విధానాన్ని ప్రారంభించి, ఆయా వర్గాల పేదల సంక్షేమానికి చర్యలు తీసుకుంటే, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దానిని తొలగించి పేదల సంక్షేమాన్ని దెబ్బతీసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ ప్లాన్ నిధులతో ఆయా వర్గాల వారికి ఎంతో లబ్ధి కలిగిందని, సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక్కో గ్రామానికి పది వరకు యూనిట్లు దక్కాయని గుర్తు చేశారు.
కానీ గత ప్రభుత్వం ఆ విధానాన్ని తొలగించి, దళితబంధు పేరుతో నిధులు పక్కదారి పట్టించిందని ఆరోపించారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చను ప్రారంభించారు. ఆయన ప్రసంగం ప్రారంభించగానే బీఆర్‌ఎస్ సభ్యులు తమ పార్టీ నుంచి వెళ్లిపోయి మాట్లాడుతున్నావంటూ వ్యాఖ్యానించారు. ‘నన్ను ఓ మనిషిగా చూడలేని మిమ్మల్ని వదిలి ఆదరించిన కాంగ్రెస్‌లో చేరి గెలిచా. అన్నీ చెప్తా.. వినే ఓపిక ఉందా, నన్ను గెలకొద్దు, గెలికించుకోవద్దు’అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణస్వీకారం చేస్తూనే తెలంగాణ సమాజం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవటం ప్రారంభించిందన్నారు.
అంతా బాగుంటే ప్రజలు ఎందుకు ఓడించారు
దొరల పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తమను గెలిపించారని, దొరల పాలనకు గుర్తుగా ఉన్న ప్రగతి భవన్ కంచెలు తొలగించామని వీరేశం పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేశామని గత ప్రభుత్వంలో గొప్పలు చెప్పుకొన్నారని, మరి సంక్షేమం బాగుంటే ప్రజలు ఎందుకు ఓడించారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను చైతన్యపరిచేందుకు కృషి చేసిన గద్దర్‌ను ప్రగతి భవన్‌లోకి అనుమతించకుండా అవమానించారని, ఇప్పుడు ఆయన సేవలను తమ ప్రభుత్వం తగు రీతిలో గౌరవించుకుంటోందన్నారు.
అబద్ధానికి ప్రతిరూపం కేసీఆర్: యెన్నం
అబద్ధానికి ప్రతిరూపంగా కేసీఆర్ నిలుస్తారని అధికార పక్ష సభ్యుడు యెన్నం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కృష్ణానదికి కాళ్లు అడ్డుపెట్టి పాలమూరును సస్యశ్యామలం చేస్తామని ఎంపీగా అక్కడి నుంచి గెలిచి, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా మహబూబ్‌నగర్‌ను పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతున్నారని.. కానీ, నాలుగు సార్లు దావోస్ వెళ్లి రూ.19 వేల కోట్లకు మించి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోలేకపోయిందని యెన్నం ఎద్దేవా చేశారు. అయితే సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే దావోస్ వెళ్లి ఏకంగా రూ.40 వేల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్న ఘనత రేవంత్‌దన్నారు.
Comments
Please login to add a commentAdd a comment