బీఆర్‌ఎస్ గత పదేళ్లలో చేసి ఉంటే.. మాకు పని ఉండేదే కాదు
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
కొణిజర్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయభరోసా, రైతుభరోసా పథకాలకు ఏటా రూ.45 వేల కోట్లు వెచ్చిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఖర్చుకు వెరవకుండా సంక్షేమ పథకాల అమలులో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం చిన్నగోపతిలో ఆదివారం ఆయన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసి మాట్లాడారు.
ఇటీవల గ్రామసభల్లో లక్షలాది దరఖాస్తులు అందగా, వాటిని క్రోడీకరించి ప్రతీ నిరుపేదకు లబ్ధి జరగాలనే లక్ష్యంగా రాష్ట్రంలోని 66 మండలాల్లో ఒక్కో గ్రామంలో లాంఛనంగా పథకాలు ప్రారంభించామని తెలిపారు. దీనిపై బురదజల్లే యత్నం చేస్తూ ‘ఎక్స్’లో పోస్టులు పెట్టిన మాజీమంత్రి కేటీఆర్ సంక్షేమ పథకాల ప్రవాహంలో కొట్టుకుపోవడం ఖాయమని చెప్పారు.
గత పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసి ఉంటే.. ఇప్పుడు త మకు పని ఉండేది కాదని భట్టి తెలిపారు. రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతీ నిరుపేదకు గూడు కల్పించే వరకు పథకం కొనసాగుతుందని, రాబోయే ఐదేళ్లలో మహిళలకు రూ.లక్ష కోట్ల రుణాలు ఇస్తామని భట్టి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment