ఈ సర్వే ఆధారంగా మరింత మెరుగ్గా సంక్షేమ పథకాలు
గత ప్రభుత్వం చేసిన కుటుంబ సర్వేలో శాస్త్రీయత లేదు
కమిషన్ నివేదిక ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేపడతాం
మండలిలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడి
సర్వే వివరాలు ఇవ్వలేదని బీఆర్‌ఎస్ సభ్యుల వాకౌట్
సాక్షి, హైదరాబాద్: ప్రజా సంక్షేమ పథకాలను మరింత సమర్థంగా అమలుచేసేందుకు తమ ప్రభు త్వం నిర్వహించిన ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే– 2024’సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. భవిష్యత్‌లో అమలుచేయబోయే సంక్షేమ పథకాలను ఈ సర్వే గణాంకాల ఆధారంగానే చేపడుతా మని చెప్పారు. శాసనమండలిలో మంగళవారం ఆయన సమగ్ర కుల సర్వేతోపాటు, ఎస్సీ వర్గీకరణ నివేదికలను ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. దేశంలో ఇంతటి శాస్త్రీయతతో ఏ రాష్ట్రంలోనూ సర్వే చేయలేదని తెలిపారు. అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ప్రత్యేక రూట్‌మ్యాప్ ఆధారంగా సర్వే నిర్వహించామని చెప్పా రు. 50 రోజులపాటు నిర్వహించిన సర్వేలో 96.9% స్పష్టమైన వివరాలు వచ్చాయని వెల్లడించారు. గత ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేకు శాస్త్రీయత లేదని, ఆ వివరాలను అప్పటి ప్రభుత్వం ఎక్కడా బహిర్గతం చేయలేదని విమర్శించారు.
సర్వేలో ఉద్దేశపూర్వకంగా పాల్గొనని పెద్ద మనుషులు కూడా ఉన్నారని ప్రతిపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సర్వేలో పాల్గొనని వారి వివరాల నమోదుకు మరోమారు అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందని వెల్లడించారు. కమిషన్ ఇచి్చన నివేదిక ఆధారంగా వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.
సర్వే వివరాలు బయటపెట్టకుండా చర్చ ఏంటి?
సమగ్ర సర్వేకు సంబంధించిన వివరాలు సభ్యులకు ఇవ్వకుండా సభలో చర్చఎలా నిర్వహిస్తారని మండలిలో ప్రతిపక్ష నేత మధసూదనాచారి ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వ నిర్ణయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సరికాదని అన్నారు.
ప్రకటనలు ప్రవేశపెట్టేందుకు అసెంబ్లీ వేదిక కాదని, కనీసం లోతైన చర్చ కూడా జరపకపోవడం దారుణమని ఆగ్ర హం వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వేలో అన్ని వర్గాల జనాభా తగ్గిందని, ఓసీల జనాభాను మాత్రం భారీగా పెంచి చూపించారని ఆరోపించారు.
బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వండి: బండ ప్రకాశ్
గత ప్రభుత్వం చేసిన సమగ్ర సర్వే వివరాలు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ వైబ్‌సైట్‌లో ఉన్నాయని మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కోరారు. అందుకు సభ్యులు కూడా మద్దతుగా నిలుస్తారని తెలిపారు.
సర్వే విషయంలో ప్రభుత్వం నుంచి సమాచారం అందకపోవడం, స్పష్టత లేకుండా సభ నిర్వహించడంపై నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ చర్చలో పాల్గొన్నారు. సమగ్ర కుటుంబ సర్వే, ఎస్సీ వర్గీకరణపై సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీర్మానాలు ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment