
సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి. చిత్రంలో మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు
హెచ్‌సీయూ విద్యార్థులపై కేసుల ఉపసంహరణకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
వీసీ హామీ ఇస్తే వర్సిటీ నుంచి పోలీసు బలగాలు వెనక్కి: మంత్రుల కమిటీ
ఆ 400 ఎకరాల్లో బందోబస్తు యథాతథం
అధ్యాపకులు, విద్యార్థులను అక్కడ ‘సర్వే’కు అనుమతించేది లేదు
మంత్రుల కమిటీతో యూహెచ్‌టీఏ, పౌరసమాజ ప్రతినిధులు సమావేశం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసు అధికారులను ఆదేశించారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ క్రమంలో న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీస్ అధికారులకు తగు సూచనలు చేయవలసిందిగా న్యాయశాఖ అధికారులను ఆదేశించారు. కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల సబ్ కమిటీ సోమవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం అధ్యక్షతన సమావేశమైంది.
కమిటీ సభ్యులైన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ శివధర్‌రెడ్డి, సైబరాబాద్ పోలీసు కమిషనర్ అభిషేక్ మహంతి ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయ ఉపాధ్యాయ సంఘం (యూహెచ్‌టీఏ), పౌర సమాజ ప్రతినిధులు కూడా వారితో సమావేశమై పలు డిమాండ్లు ప్రస్తావించారు. ఈ సమావేశం అనంతరం డిప్యూటీ కీలక ఆదేశాలు జారీ చేశారు.
అక్కడ పోలీసు పహారా తప్పనిసరి
పౌర సమాజ ప్రతినిధులు, యూహెచ్‌టీఏ ప్రస్తావించిన పలు అంశాలు, డిమాండ్లపై మంత్రుల ఉప కమిటీ కీలక ప్రకటన చేసింది. యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఇతర ప్రాంతాల నుంచి పోలీసు బలగాల ఉప సంహరణ కోసం హెచ్‌సీయూ వీసీకి లేఖ రాస్తామని హామీ ఇచి్చంది. విద్యార్థులు, హాస్టళ్ల భద్రతకు సంబంధించి వీసీ హామీ ఇస్తే బలగాలను ఉపసంహరిస్తామని పేర్కొంది. అయితే వివాదానికి కేంద్ర బింధువుగా ఉన్న 400 ఎకరాల్లో మాత్రం పోలీసు బందోబస్తు కొనసాగుతుందని మంత్రులు స్పష్టం చేశారు.
ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 400 ఎకరాల భూమిని రక్షించేందుకు పోలీసు పహారా తప్పనిసరి అని పేర్కొన్నారు. అధ్యాపకులు, విద్యార్థులు సహా ఎవరినీ 400 ఎకరాల్లో సర్వేకు అనుమతించలేమని తెలిపారు. విద్యార్థులు కోరిన విధంగా యూనివర్సిటీని సందర్శించడానికి మంత్రుల కమిటీ సానుకూలంగా ఉందని, అయితే సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికిప్పుడు యూనివర్సిటీకి రాలేమని చెప్పారు. అయితే విద్యార్థులపై కేసులను సాధ్యమైనంత త్వరగా ఉపసంహరించుకునేలా పోలీసు, న్యాయ శాఖతో సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారు.
డిమాండ్లు అంగీకరిస్తేనే జేఏసీ నేతలు వస్తారు: యూహెచ్‌టీఏ
మంత్రుల సబ్ కమిటీని కలిసిన యూనివర్సిటీ అధ్యాపక, పౌర సమాజ ప్రతినిధులు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. హెచ్‌సీయూ నుంచి పోలీసు బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, నిషేధాజ్ఞలను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై ఇటీవల నమోదు చేసిన అన్ని కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు పోలీసు కస్టడీలో ఉన్న ఇద్దరు విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర సాధికార కమిటీ క్యాంపస్‌ను సందర్శించే ముందు 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూమిలో నష్టాన్ని అంచనా వేయడంతో పాటు జీవవైవిధ్య సర్వే నిర్వహించడానికి నిపుణులైన అధ్యాపకులు, పరిశోధకులకు అనుమతి ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్లే విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ ఈ సమావేశానికి హాజరు కాలేదని మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు.
పైన పేర్కొన్న తక్షణ డిమాండ్లు నెరవేర్చిన తర్వాతే విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మంత్రుల కమిటీ నిర్వహించే సమావేశానికి హాజరవుతారని యూహెచ్‌టీఏ, పౌర సమాజ ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రొఫెసర్లు సౌమ్య, శ్రీపర్ణ దాస్, భంగ్యా భూక్యా, పౌర సమాజ ప్రతినిధులు విస్సా కిరణ్ కుమార్, వి.సంధ్య, కె.సజయ, ఇమ్రాన్ సిద్దికీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.