
స్వయంగా పరిశీలించనున్న సభ్యులు
సాక్షి, హైదరాబాద్ : హెచ్‌సీయూ పరిధిలో ఉన్న 400 ఎకరాలకు సంబంధించి ఏం జరిగిందనే దానిపై క్షేత్రస్థాయి పరిశీలనతోపాటు, జరిగిన నష్టంపై సొంతంగా అంచనా వేసేందుకు గురువారం సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ హైదరాబాద్‌కు రానుంది. ఈ బృందంలో ఇద్దరు లేదా ముగ్గురు కేంద్ర ప్రభుత్వ అధికారులు, న్యాయ, పర్యావరణ వేత్తలు, ఆయా రంగాలకు చెందిన వారున్నట్టు సమాచారం. పర్యటనలో భాగంగా ఈ సమస్యతో ముడిపడిన అంశాలపై పరిశీలనతోపాటు ప్రభుత్వ అధికారులు, వివిధ రంగాలకు చెందిన, పర్యావరణ నిపుణులను ఈ బృందం భేటీ కానున్నట్టుగా తెలిసింది.
ఇది అటవీ ప్రాంతమా.. ప్రదేశమా అనే దానితో నిమిత్తం లేకుండా...దాదాపు వందకు పైగా ఎకరాల్లో జరిగిన చెట్ల నరికివేత, వన్యప్రాణులు, పర్యావరణానికి ఏ మేరకు నష్టం జరిగిందనే అంశాలకు ఇప్పుడు ప్రాధాన్యం ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 11వ తేదీలోగా ఆయా అంశాలపై సుప్రీంకోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించాల్సి ఉండగా, హెచ్‌సీయూ పరిశీలనకు స్వయంగా ఎంపవర్డ్ కమిటీ వస్తున్నట్టుగా తెలుస్తోంది.
అటవీశాఖ తీరుపైనా చర్చ
హెచ్‌సీయూ పరిధిలోని 400 ఎకరాల భూమి రక్షిత అటవీ ప్రాంతం కాకపోయినా చెట్ల కూల్చివేత, వన్యప్రాణులు, జీవవైవిధ్యానికి జరిగిన నష్టం చర్చనీయాంశమయ్యాయి. 40 ఏళ్లుగా పెరిగిన చెట్లతోపాటు వన్యప్రాణులు, జంతువుల సంచారం పెరగడం, రకరకాల పక్షులకు ఇది కేంద్రంగా మారిన విషయం తెలిసిందే. అటవీశాఖ పరంగా జరిపిన పరిశీలనలో ఈ ప్రాంతంలో ఎక్కువగా సుబాబుల్ చెట్లున్నాయని, అధిక శాతం డీగ్రేడెడ్ ఫారెస్ట్‌గానే ఉందనే నివేదిక ప్రభుత్వానికి అందజేసినట్టు సమాచారం.
ఇటీవల వందకు పైగా ఎకరాల్లో చెట్ల కూల్చివేత జరిగిన ప్రదేశంలో ఎక్కువ సుబాబుల్ చెట్లు్ల ఉన్నాయని ఆ నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. అయితే ఈ 400 ఎకరాలు రక్షిత అటవీ ప్రాంతం కాదనే వాదననే వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి అటవీశాఖ పదే పదే నివేదించడం చర్చనీయాంశమవుతోంది.
ఈ ప్రాంతం విభిన్న రకాల చెట్లు, జంతువులు, పక్షులు, పర్యావరణ వ్యవస్థ, జీవవైవిధ్యం ఏర్పడిందనే విషయాన్ని...ఇటీవల చెట్ల కూల్చివేతలు, క్లియరెన్స్ అనేది నియమనిబంధనలకు అనుగుణంగానే జరిగిందా లేదా అన్న దానిపై స్పష్టత ఇవ్వకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఎన్యుమరేషన్‌కు సంబంధించి హెచ్‌సీయూ పాలకవర్గానికి గతంలోనే అటవీశాఖ ప్రతిపాదన పంపించగా...ఫండింగ్ అనేది ఆర్థికభారంగా మారినందున అది ముందుకు సాగలేదని అధికారులు చెబుతున్నారు.
కూల్చిన చెట్ల సంఖ్యపైనా అస్పష్టత...
గతంలోనే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫర్ నేచర్ హైద రాబాద్...హెచ్‌సీయూ పరిధిలోని భూమిలో పర్యా వరణ వ్యవస్థ, జీవావరణం, జీవవైవిధ్యంపై అధ్య యనం నిర్వహించింది. వర్సిటీలో ‘బయోడైవర్సి టీ’భేషుగ్గా ఉందని, వివిధ రకాల జంతువులు, చెట్లతో అలరారుతోందని ఈ వర్సిటీకి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నివేదిక సమర్పించింది. ఇటీవల జరిగిన చెట్ల కూల్చివేతకు సంబంధించి కూడా డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌కు స్పష్టమైన సమాచారం అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.
రాష్ట్రస్థాయిలో ‘ట్రీ ప్రొటెక్షన్ కమిటీ’దీనిపై పూర్తి వివరాలేవి అందలేదని తెలుస్తోంది. ఈ కమిటీలోని వివిధ స్వచ్ఛంద సంస్థలు, ఇతర సభ్యులు కూడా నేలమట్టమైన చెట్ల డేటా ఇవ్వాలని ‘ట్రీ ప్రొటెక్షన్ కమిటీ’చైర్‌పర్సన్ డా.జి.రామలింగంకు లేఖ రాసినట్టు సమాచారం. ఈ అంశాలన్నింటిపైనా ఎంపవర్డ్ కమిటీ దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది.
బీజేపీ ఎంపీలతో హెచ్‌సీయూ వీసీ, రిజిస్ట్రార్ భేటీ
» ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నివాసంలో సమావేశం
» హాజరైన ఈటల రాజేందర్, రఘునందన్‌రావు
» వాస్తవాలు తెలుసుకునేందుకే సమావేశమయ్యామన్న ఎంపీలు
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ భూములకు సంబంధించి వివాదం తలెత్తడం, ఇందులో ఓ బీజేపీ ఎంపీ ప్రమేయం ఉందంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్, ఎం.రఘునందన్‌రావులతో వర్సిటీ వీసీ జగదీశ్వరరావు, రిజిస్ట్రార్ సమావేశమయ్యారు. బుధవారం చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నివాసంలో ఈ సమావేశం జరిగింది. సమావేశానంతరం ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడారు.
ఈ భూములకు సంబంధించి ఎంపీలుగా వాస్తవ విషయాలు తెలుసుకుని, ప్రజల ముందు ఉంచేందుకే ఈ భేటీ నిర్వహించామని కొండా చెప్పారు. ‘హెచ్‌సీయూ వీసీ, రిజిస్ట్రార్‌తో సమావేశమయ్యాం. లీగల్ డాక్యుమెంట్స్ పరిశీలించాం. 2,300 ఎకరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. వర్సిటీకి ప్రస్తుతం ఎన్ని ఎకరాలు ఉన్నాయి.
దీనిపై సర్వే చేసే అవకాశం ఉందా? అసలు భూమి ఎవరిదన్న విషయాలపై చర్చించాం’ అని ఆయన తెలియజేశారు. ఈ భూముల వ్యవహారంపై ఇటీవల సచివాలయంలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ హాజరుకావడం పట్ల విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే.
కేటీఆర్ ఆరోపణలపైనా..
హెచ్‌సీయూ భూముల విషయంలో ఓ బీజేపీ ఎంపీ ప్రమే యం ఉందంటూ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్య లు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీల సమావేశం చ ర్చనీయాంశమైంది. కేటీఆర్ ఆరోపణలపై వీసీతో మాట్లాడి వాస్తవ విషయాలను తెలుసుకునేందుకు ఎంపీలు సమావేశ మయ్యారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ వర్సిటీ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఉండటంతో స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చొరవ తీసుకొని సమావేశం నిర్వహించార ని తెలుస్తోంది.
ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లా డుతూ.. 2012లో అప్పటి రంగారెడ్డి కలెక్టర్ 2,185 ఎక రాలు హెచ్‌సీయూకు చెందినదని సీసీఎల్‌ఏకు లేఖ రాశారు. సుప్రీంకోర్టులో రేవంత్ ఈ భూమిపై ఎప్పుడు పోరాడారని ఆయన ప్రశ్నించారు. ‘వివాదాస్పదంగా ఉన్న 400 ఎకరాలు పక్కనపెట్టి 1,785 ఎకరాల భూమికి గత పదేళ్లలో ఎందుకు కాంపౌండ్ వాల్ కట్టలేదు.
ఈ వర్సిటీకి చెందిన 134 ఎకరా లు మాజీ సీఎం కేసీఆర్ టీఎన్జీవోలకు ఎందుకు ఇచ్చారు? కేటీఆర్ ఆరోపణలు చేయడం కాదు. ఏ ఎంపీ చేశారో చెబితే పార్టీ తరఫున మేం సమాధానం చెబుతాం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లిన అనంతరం ఇష్యూపై ముందుకు వెళ్తాం’ అని రఘునందన్ తెలిపారు.