హెచ్‌సీయూ వివాదం: సుప్రీంకోర్టు నిర్ణయంపై కిషన్‌రెడ్డి రియాక్షన్‌ | Kishan Reddy Response To Supreme Court Order On Hcu Lands | Sakshi
Sakshi News home page

హెచ్‌సీయూ వివాదం: సుప్రీంకోర్టు నిర్ణయంపై కిషన్‌రెడ్డి రియాక్షన్‌

Published Thu, Apr 3 2025 6:36 PM | Last Updated on Thu, Apr 3 2025 7:29 PM

Kishan Reddy Response To Supreme Court Order On Hcu Lands

సాక్షి, ఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూమిలో పర్యావరణ విధ్వంసంపై ‘స్టే’ విధిస్తూ.. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 400 ఎకరాల్లో పర్యావరణం, జీవ వైవిధ్యతను కాపాడాలంటూ అన్ని వర్గాల ద్వారా జరుగుతున్న ఆందోళనలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుని.. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది’’ అని కిషన్‌రెడ్డి చెప్పారు.

హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన తీర్పులోని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని.. వెంటనే ఈ భూముల్లో చెట్ల నరికివేతను తక్షణమే ఆపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం నెలరోజుల్లో ఓ నిపుణుల కమిటీని ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఆరు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని చెప్పింది. సుప్రీంకోర్టు నిర్ణయం.. విద్యార్థులు చేస్తున్న పోరాటానికి ప్రతిఫలం దక్కినట్లుగా భావిస్తున్నాము’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.

‘‘కంచ గచ్చిబౌలి ప్రాంతంలో అటవీ సంపదను నష్టపరిచే ప్రయత్నం జరుగుతోందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక చెట్టు నరికేందుకే అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తంలో చెట్లను నరికేందుకు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా?. జీవవైవిధ్యత కళ్లముందు కనబడుతున్నప్పటికీ.. చెట్లను నరికివేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఇవాళ ఉదయం ఈ అటవీ సంపద విధ్వంసాన్ని సుమోటోగా తీసుకున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా.. ఉదయం నుంచి చెట్ల నరికివేతను కొనసాగించడం దురదృష్టకరం’’ అని కిషన్‌రెడ్డి చెప్పారు.

‘‘ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తమ ఆలోచనను మార్చుకుని.. వ్యక్తిగత అహాన్ని పక్కనపెట్టి.. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరుతున్నాను. పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా అరెస్టు చేసిన విద్యార్థులను, బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement