స్పీకర్‌ను కలసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
అప్పులపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపాటు
అసెంబ్లీలో పరిమితుల విధింపుపై కేటీఆర్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌లో రాష్ట్ర అప్పులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారని బీఆర్‌ఎస్ పార్టీ విమర్శించింది. సోమవారం ఈ అంశంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆయన చాంబర్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అప్పులపై శాసనసభ, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు.
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
‘2023 డిసెంబర్ 20న అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేసిన శ్వేతపత్రంలో తెలంగాణ అప్పులను రూ.6.71 లక్షల కోట్లుగా చూపించారు. ఈ ఏడాది జూలై 25 నాటి బడ్జెట్ ప్రసంగంలోనూ ఇవే అంకెలను వల్లె వేశారు. కానీ ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్’నివేదికలో 2014–15లో తెలంగాణ మొత్తం రుణాలు రూ.72, 658 కోట్లు కాగా 2024 మార్చి నాటికి రూ.3.89 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించింది.
కానీ ఆర్థిక మంత్రి అప్పులపై ఉద్దేశ పూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారు. ఈ నేప థ్యంలో ఆర్థిక మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నాం’అని బీఆర్‌ఎస్ ప్రకటించింది.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల హక్కులకు భంగం: కేటీఆర్
‘బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అప్పులపై తప్పుదోవ పట్టిస్తున్నందునే సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చాం’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ లాబీలో తనను కలసిన మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించారు. ‘గతంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఇచ్చిన హక్కుల ఉల్లంఘన నోటీసును నాటి స్పీకర్ మనోహర్ అంగీకరించి సభలో చర్చకు వీలు కల్పించారు.
ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు అప్పులపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉండగా కేవలం టూరిజంపైన రాష్ట్ర ప్రభుత్వం చర్చ పెట్టడం బాధాకరం. రాష్ట్రంలో ఢిల్లీ టూరిజం, జైలు టూరిజం బాగా నడుస్తున్నాయి. శాసనసభలో లగచర్ల అంశానికి సంబంధించిన అంశాన్ని చర్చకు తీసుకురావాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశాం’అని కేటీఆర్ పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యేలను కూడా అడ్డుకుంటున్నారు
‘గతంలో ఎన్నడూ లేని రీతిలో మాజీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వైపు రాకుండా అడ్డుకుంటున్నారు. గతంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సీఎంను కలిసే అవకాశం ఉండేది. ప్రస్తుతం కనీసం ప్లకార్డులను కూడా తీసుకురాకుండా అడ్డు కుంటున్నారు. మమ్మల్ని కట్టడి చేసి, ప్రభుత్వం తన వైఫల్యాలను దాచుకోవాలని అనుకుంటున్నది. రైతు కూలీలకు రూ.12 వేల అర్థిక సహాయం చేస్తామని ఆర్థిక మంత్రి భట్టి చేసిన ప్రకటన అసెంబ్లీ వ్యవహారాలకు విరుద్ధం. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నప్పుడు విధానపరమైన నిర్ణయాలను సభలోనే ప్రకటించాలన్న అంశాన్ని భట్టి విక్రమార్క విస్మరించారు’అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment