రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం: డిప్యూటీ సీఎం భట్టి
రైతులకు వివిధ పథకాలతో రూ.50,933 కోట్లు అందించాం
భూమిలేని పేదలకు రూ.12 వేలు.. ఈనెల 28న శ్రీకారం
ఖమ్మం వన్‌టౌన్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎడాపెడా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, ఇప్పుడు ఆ అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల కాలంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.7,11,911 కోట్ల అప్పులు చేసి ప్రజలపై తీరని భారం మోపిందన్నారు.
రాష్ట్రానికి తెచ్చిన అప్పులను బీఆర్‌ఎస్ నాయకులు దోచుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అప్పులతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే వాళ్లు తెచ్చిన అప్పులు తీరుస్తున్నామని పేర్కొన్నారు. ఖమ్మం డీసీసీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ పారీ్టనే అప్పుల పాలు చేయగా.. ఇప్పుడు హరీశ్‌రావు, కేటీఆర్ గాయిగత్తర చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలను శ్వేతపత్రం ద్వారా విడుదల చేసి ప్రజల ముందు ఉంచామని భట్టి గుర్తుచేశారు. రానున్న సంక్రాంతికి రైతు భరోసా డబ్బు సైతం జమ చేస్తామని, ఇప్పటివరకు మొత్తం రూ.50,953 కోట్లను రైతుల కోసం ఖర్చు చేశామని వివరించారు.
పేదలకు రెండు విడతలుగా సాయం
ఈ నెల 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భూమి లేని నిరుపేదలకు రూ.12 వేల చొప్పున రెండు విడతలుగా సాయం అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడతామని భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు వరంగల్, రామగుండం, ఆదిలాబాద్, కొత్తగూడెంలో విమానాశ్రయాలు నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేసి రైతులకు వారంలోపే డబ్బులు, సన్నాలకు బోనస్‌ను సైతం అందిస్తున్నామని తెలిపారు.
అన్ని జిల్లాలను కలుపుతూ రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఓఆర్‌ఆర్–ట్రిపుల్ ఆర్ మధ్య ఇండస్ట్రియల్, హౌసింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకు అందిస్తామని చెప్పారు. వసతి గృహాల్లో నూతనంగా పెంచిన డైట్ చార్జీలతో ప్రభుత్వంపై ఏడాదికి రూ. 541 కోట్ల భారం పడుతుందని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో డైట్ చార్జీలు పెంచలేదని, అందుకే అన్నంలో పురుగులు వంటివి వచ్చాయని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వంపై, సీఎం రేవంత్‌రెడ్డిపై తప్పుడు కథనాలు ప్రచురిస్తే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 56 వేల మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment