ధరణిని అడ్డుపెట్టుకొని వేలాది ఎకరాలు ఆక్రమణ
కాంగ్రెస్ పాలనలో పేదలకు 26 లక్షల ఎకరాలు పంపిణీ
ప్రస్తుతం వాటి పరిస్థితిపై లెక్కలు తీస్తున్నాం
అన్యాక్రాంతమైనట్లు తేలితే తిరిగి పేదలకు పంచుతాం
కులగణన కొందరికి ఇబ్బంది.. అందుకే వ్యతిరేకిస్తున్నారు
మీడియా చిట్‌చాట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని గత పదేళ్లలో బీఆర్‌ఎస్ నేతలు వేలాది ఎకరాల అసైన్డ్ భూములను ఆక్రమించారని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు 26 లక్షల ఎకరాల భూములు పంచాయని, ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చిన తర్వాత.. వాటి పరిస్థితి ఏమిటో ఆరా తీస్తున్నట్లు చెప్పారు. అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైనట్లు తేలితే, వాటిని తిరిగి అర్హులైన పేదలకు పంచుతామని వెల్లడించారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
కులాల లెక్కలు కొందరికి ఇష్టం లేదు
రాష్ట్రంలో ఏ కులం జనాభా ఎంత ఉందన్న లెక్కలు తీయటం కొందరికి ఇష్టంలేదని, అందుకే ప్రభుత్వం నిర్వహిస్తున్న సామాజిక, ఆర్థిక సర్వేకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని భట్టి విక్రమార్క విమర్శించారు. ‘కులాలను విడగొడుతున్నామని విపక్షాలు మా ప్రభుత్వంపై నిందలేస్తున్నాయి.
మేం కులాలను కొత్తగా సృష్టించడం లేదు. అవి శతాబ్దాలుగా ఉన్నాయి. రాష్ట్రంలో ఏయే కులం జనాభా ఎంత ఉన్నది? రాజ్యాంగం ప్రకారం అందరూ సమానంగా ఎదిగారా? అనేది సర్వే ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇంతకాలం రాష్ట్రాన్ని దోపిడీ చేసిన బ్యాచ్ మళ్లీ దోపిడీ చేయాలని చూస్తోంది. అందరి లెక్కలు బయటకు వస్తే వాళ్లకు ఇబ్బంది’అని విమర్శించారు.
హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం
ఎన్నికల సమయంలో ఇచి్చన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ‘మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించి, వారి పక్షాన ప్రభుత్వం ప్రతినెలా రూ.400 కోట్లు ఆర్టీసీకి చెల్లిస్తోంది. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లకు త్వరలోనే భూమి పూజ చేయబోతున్నాం.
15 రోజుల్లోనే రైతు రుణమాఫీ కింద రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశాం. రేషన్‌కార్డు ఉన్న అన్ని రైతుకుటుంబాలకు రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేశాం. త్వరలోనే అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. రైతు భరోసా తప్పకుండా ఇస్తాం. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించాం’అని వివరించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై, ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేత కేటీ రామారావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని భట్టి మండిపడ్డారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కనీస సంస్కారం లేకుండా జిల్లా కలెక్టర్‌ను సన్యాసి అంటారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఇమడలేకనే పార్టీ మారుతున్నారని పేర్కొన్నారు.
పెరుగుతున్న కాంగ్రెస్ గ్రాఫ్..
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతోందని భట్టి విక్రమార్క తెలిపారు. అదే సమయంలో బీజేపీ పతనం మొదలైందని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారని గుర్తుచేశారు.
మధ్యప్రదేశ్‌లో బీజేపీ మంత్రిని కాంగ్రెస్ అభ్యర్థి ఓడించారని చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలున్నాయని పేర్కొన్నారు. చిట్‌చాట్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment