
తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
సాక్షి: ఖమ్మం జిల్లా: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీసీల పట్ల రేవంత్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. ఓట్ల కోసం సీఎం రేవంత్ డ్రామాలు చేస్తున్నాడని.. 45 ఏళ్లు పాటు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే.. ఒక్క బీసీ, ఎస్టీలను ముఖ్యమంత్రి చేయలేకపోయారని మండిపడ్డారు.
‘‘బీసీల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు. అందుకే ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించాలి. ఎవరు మనవాళ్లు, అనేది చూసి ఓటు వేయాలి. మాట ఇస్తే నిలబడే వ్యక్తికి ఓటు వేయాలి. మోసం చేసేవారికి కాదు. టీచర్స్ ఎమ్మెల్సీ ప్రచారంలో ఉపాధ్యాయులు నుంచి మంచి స్పందన వస్తుంది. 317 జీవో తీసుకొచ్చి ఉపాధ్యాయుల జీవితాల్లో మట్టి కొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతున్న ఇప్పటికీ డీఏలు, ఇంక్రిమెంట్లు లేవు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు బెనిఫిట్స్ అందించలేని ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం’’ అంటూ ఈటల దుయ్యబట్టారు.