సాక్షి,హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి (cm revanthreddy) కార్యాలయంపై మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (etela rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కార్యాలయం నుంచి భూ మార్పిడి జరుగుతుందని ఆరోపించారు. మంగళవారం రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై ఈటల రాజేందర్, ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనలో ఈటలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పేదల జోలికి వచ్చినా, మహిళలను ఇబ్బంది పెట్టినా చీల్చి చెండాడుతాం. టైగర్ నరేంద్ర, బద్దం బాల్ రెడ్డి, బండారు దత్తాత్రేయ వరకు పేదలకి అండగా నిలిచిన పార్టీ బీజేపీ(bjp). రేవంత్ సర్కారు రావడంతోనే హైడ్రా పేరుతో పేదలపై విరుచుకుపడింది. హైడ్రా, మూసి బాధితులకు బీజేపీ అండగా నిలబడింది. రియల్టర్ల పేరుతో దౌర్జన్యానికి దిగుతున్నారని సీపీ దృష్టికి తీసుకెళ్లాం కానీ ఫలితం లేదు. కలెక్టర్, సీపీకి సమస్య వివరించినా పరిష్కారం దొరకలేదు.
కబ్జా చేసి పహిల్వాన్‌లను పెట్టి స్థానికులను, మహిళలను బెదిరించారు. ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో వారి దౌర్జన్యాలు చూస్తే అర్ధం అవుతుంది. నేను ఎవరిని కొట్టాలని అనుకోలేదు. కానీ వ్యవస్థ విఫలమైంది. పేదల బాధ చూసి ఆవేశం వచ్చింది. పేదల జోలికి వచ్చినా, మహిళలను ఇబ్బంది పెట్టినా చీల్చి చెండాడుతాం.
2005లో ఏకశిలా నగర్ రాజు, వెంకటేష్, భాస్కర్ అనే ముగ్గురు ప్లాట్లను కొన్నట్టు దొంగ డాక్యుమెంట్లు సృష్టించారు. వాటితో లోన్లుకూడా తీసుకున్నారు. అయితే 2010లో బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన కోర్టు సైతం బాధితులకు అనుకూలంగా తీర్పిచ్చింది. హర్ష కన్‌స్ట్రక్షన్ కంపెనీ వెంకటేష్ ప్లాట్ల ఓనర్లను ఇంకా భయపెడుతున్నారు. ధరణి లోసుగులతో ఇష్టారీతిన ల్యాండ్‌లు మార్చుకున్నారు.
అధికారులు కూడా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. బాసుల మెప్పు కోసం కాదు పేదలకు న్యాయం చేసేలా అధికారులు పని చేయాలి. అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తే డీవోపీటీకి ఫిర్యాదు చేస్తాం. నాడు, నేడు సీఎంల కార్యాలయాల్లోనే ఈ ల్యాండ్ మార్పిడులు జరుగుతున్నాయి. కాళేశ్వరం కాదు అంతకంటే ఎక్కువ కోట్ల అవినీతి ఈ ల్యాండ్ దందాలలో జరిగింది. కేసులకు భయపడను. తెలంగాణ ఉద్యమంలో 150 కేసులు ఉన్నాయి. ఇప్పుడు 156 అవుతాయి’ అని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment