subplan
-
‘సబ్‌ప్లాన్’ను మాయం చేశారు
సాక్షి, హైదరాబాద్: దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉదాత్త ఆశయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్ విధానాన్ని ప్రారంభించి, ఆయా వర్గాల పేదల సంక్షేమానికి చర్యలు తీసుకుంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం దానిని తొలగించి పేదల సంక్షేమాన్ని దెబ్బతీసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ ప్లాన్ నిధులతో ఆయా వర్గాల వారికి ఎంతో లబ్ధి కలిగిందని, సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక్కో గ్రామానికి పది వరకు యూనిట్లు దక్కాయని గుర్తు చేశారు. కానీ గత ప్రభుత్వం ఆ విధానాన్ని తొలగించి, దళితబంధు పేరుతో నిధులు పక్కదారి పట్టించిందని ఆరోపించారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చను ప్రారంభించారు. ఆయన ప్రసంగం ప్రారంభించగానే బీఆర్ఎస్ సభ్యులు తమ పార్టీ నుంచి వెళ్లిపోయి మాట్లాడుతున్నావంటూ వ్యాఖ్యానించారు. ‘నన్ను ఓ మనిషిగా చూడలేని మిమ్మల్ని వదిలి ఆదరించిన కాంగ్రెస్‌లో చేరి గెలిచా. అన్నీ చెప్తా.. వినే ఓపిక ఉందా, నన్ను గెలకొద్దు, గెలికించుకోవద్దు’అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణస్వీకారం చేస్తూనే తెలంగాణ సమాజం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవటం ప్రారంభించిందన్నారు. అంతా బాగుంటే ప్రజలు ఎందుకు ఓడించారు దొరల పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తమను గెలిపించారని, దొరల పాలనకు గుర్తుగా ఉన్న ప్రగతి భవన్ కంచెలు తొలగించామని వీరేశం పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేశామని గత ప్రభుత్వంలో గొప్పలు చెప్పుకొన్నారని, మరి సంక్షేమం బాగుంటే ప్రజలు ఎందుకు ఓడించారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను చైతన్యపరిచేందుకు కృషి చేసిన గద్దర్‌ను ప్రగతి భవన్‌లోకి అనుమతించకుండా అవమానించారని, ఇప్పుడు ఆయన సేవలను తమ ప్రభుత్వం తగు రీతిలో గౌరవించుకుంటోందన్నారు. అబద్ధానికి ప్రతిరూపం కేసీఆర్: యెన్నం అబద్ధానికి ప్రతిరూపంగా కేసీఆర్ నిలుస్తారని అధికార పక్ష సభ్యుడు యెన్నం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కృష్ణానదికి కాళ్లు అడ్డుపెట్టి పాలమూరును సస్యశ్యామలం చేస్తామని ఎంపీగా అక్కడి నుంచి గెలిచి, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా మహబూబ్‌నగర్‌ను పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని.. కానీ, నాలుగు సార్లు దావోస్ వెళ్లి రూ.19 వేల కోట్లకు మించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోలేకపోయిందని యెన్నం ఎద్దేవా చేశారు. అయితే సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే దావోస్ వెళ్లి ఏకంగా రూ.40 వేల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్న ఘనత రేవంత్‌దన్నారు. -
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు
మన్సూరాబాద్/ఘట్కేసర్: తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే 80 రోజుల్లో ఎన్నికలు రానున్నాయని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్రస్థాయి సమ్మేళనాన్ని మన్సూరాబాద్‌లో నిర్వహించారు. మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి కిషన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. అలాగే మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అవుషాపూర్‌లో నిర్వహించిన బీజేవైఎం రాష్ట్రస్థాయి సమావేశానికి కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాల్లో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన కేసీఆర్.. ఎన్నికల ఫలితాలు వెలువడగానే వారికి వెన్నుపోటు పొడిచి దగా చేశారని ధ్వజమెత్తారు. దళితబంధు పేరుతో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను నిర్విర్యం చేశారని మండిపడ్డారు. ఈ నెల 17న పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉద్యోగాలు రాక తెలంగాణ యువత కన్నీరు పెడుతోందని ఈటల రాజేందర్ ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి డప్పుకొట్టి కార్యకర్తల్లో జోష్ నింపారు. కాగా, తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలనను అంతమొందించడానికి బీఆర్ఎస్ను, దేశంలో గాంధీ కుటుంబ పాలన రాకుండా కాంగ్రెస్‌ను ఓడించాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బీజేవైఎం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏ ఒక్కటేనన్నారు. బుధ, గురువారాల్లో నిరుద్యోగ దీక్ష, 15న హైదరాబాద్– పరకాల బైక్ ర్యాలీ ఉంటాయని తెలిపారు. -
సబ్‌ప్లాన్ అంటే లోకేష్‌కు తెలుసా?: మంత్రి మేరుగ నాగార్జున
సాక్షి, విజయవాడ: దళితుల గురించి మాట్లాడే అర్హత నారా లోకేష్‌కు లేదని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. సబ్‌ప్లాన్ అంటే లోకేష్‌కు అసలు తెలుసా? అని ప్రశ్నించారు. పాదయాత్రలో జనం లేక లోకేష్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. దళితులను మోసం చేసిన చరిత్ర.. దళితుల నిధులను పక్కదారి పట్టించిన ఘనత చంద్రబాబుదేననని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు సబ్ ప్లాన్‌ను నాశనం చేశాడని.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సబ్‌ప్లాన్‌ను అమలు చేశారని గుర్తు చేశారు. దళితుల అభ్యున్నతికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ ప్లాన్ కింద నిధులు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఒక్క రూపాయి అవినీతి లేకుండా పరిపాలన అందిస్తున్నామన్నారు. ‘దళితుల మీద దాడి చేస్తే నీపైన ఏంటి.. మీ నాన్న పైన కూడా కేసు పెడతాం. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పొలంబడి, రైతు క్షేత్రాలు, నేప్కీన్లు, పెళ్లి కానుక, ఎన్టీఆర్ సుజల స్రవంతికి ఖర్చు పెట్టామని చంద్రబాబు చూపించాడు. ఎస్సీ, ఎస్టీ, పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్య, ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకున్నది మీ బాబు, నువ్వు కాదా?. విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహం పెడుతుంటే టీడీపీ ఓర్వలేకపోతోంది. గతంలో ఎస్సీలకు రుణాలు పేరుతో అవినీతికి పాల్పడ్డారు. చంద్రబాబు హయాంలో దళితులపై జరిగిన దాడులపై చర్చించడానికి నేను సిద్ధం’ అంటూ లోకేష్‌కు మంత్రి సవాల్ విసిరారు. -
సకల శక్తుల సాధన సబ్‌ప్లాన్
2013లో ‘ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం’ రూపొందడం వెనుక చారిత్రక నేపథ్యం, రాజ్యాంగ రక్షణ, ఉద్యమ సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా.. సబ్‌ప్లాన్ అవసరం, దాని అమలు తీరుతెన్నులపై అసెంబ్లీలో మొదట గళం విప్పింది వైఎస్సార్ అనే వాస్తవాన్ని విస్మరించడానికి లేదు. 2001లో ప్రతిపక్ష నాయకులైన వైఎస్సార్ సబ్ ప్లాన్ గురించి ప్రస్తావించడం వల్లనే ఆ అంశం రాజకీయ ఎజెండాలోకి చేరి, చివరికి చట్టం రూపం దాల్చింది. ఇప్పుడీ చట్టం కాలపరిమితి ముగిసే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని; దాన్ని మరో ఇరవై ఎళ్ళు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆర్డినెన్స్ జారీకి చొరవ చూపడం ముదావహం. దళితుల, ఆదివాసుల అభివృద్ధికి... ఈ చట్టం పొడిగింపు ఉపకరిస్తుంది. ‘‘ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టా నికి 2023 జనవరి 23తో పదేళ్ళ కాలపరిమితి ముగియనున్నందున, ఆ చట్టం లక్ష్యాలు ఇంకా నెరవేరాల్సి ఉన్నందున, ఆ చట్టాన్ని మరో ఇరవై సంవత్సరాలు పొడిగిస్తున్నాం’’ అంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జనవరి 22న ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. శాసన సభ, శాసనమండలి సమావేశాలు ఆ సమయానికి జరగటం లేనందువల్ల ఈ ఆర్డినెన్స్ అవసరమైందని కూడా ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. మరికొన్ని అవసరమైన మార్పులను సైతం ఇందులో పేర్కొన్నారు. వీటితో పాటు, చట్టం పేరును ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం’ అనడానికి బదులుగా ‘ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ కాంపోనెంట్, ఎస్టీ కాంపోనెంట్ చట్టం’గా మార్చారు. గతంలో ఉన్న విధంగా బడ్జెట్లో ప్లాన్, నాన్ ప్లాన్ లేనందువల్ల ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తున్న భాగాన్ని సబ్‌ప్లాన్‌కు బదులుగా కాంపోనెంట్గా పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కాలపరిమితి ముగిసే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, దళిత సంఘాల, సంస్థల అభ్యర్థనలను కూడా పరి గణనలోనికి తీసుకొని చట్టం కాలపరిమితిని మరో ఇరవై సంవత్స రాలు పొడిగించాలని నిర్ణయించినందుకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అభినందనీయులు. ఈ చట్టం పట్ల, అదే విధంగా రాజ్యాంగం పట్ల ఆయన తన గౌరవాన్ని ఆచరణాత్మకంగా వ్యక్తం చేయడం ప్రశంసనీయం. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం– 2013’ రూపొందడం వెనుక చారిత్రక నేపథ్యం, రాజ్యాంగ రక్షణ, ఉద్యమ సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వపరంగా ఎటువంటి నిర్ణయాలు జరగాలన్నా, ప్రగతిశీల చట్టాలు అమలులోకి రావాలన్నా ప్రజల కోర్కెలు, ఉద్యమాలతో పాటు, రాజకీయ పార్టీల, సంస్థల అంగీకారం, రాజ్యాంగపరమైన ఆమోదం తప్పనిసరి. అలాంటి అన్ని రకాల మద్దతులను కూడగట్టిన చట్టాలలో సబ్‌ప్లాన్ చట్టం ఒకటి. మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు సబ్‌ప్లాన్ ఉద్యమంతో, చట్టం రూపకల్పనతో పాటు, దాని అమలు విషయంలో భాVýæమున్న వారిలో నేనూ ఒకరిని. సబ్‌ప్లాన్ అమలు కోసం జరిగిన యత్నాలలో భాగంగా సబ్‌ప్లాన్ నిధుల దారి మళ్ళింపు, అమలులో లోపాలపై నేను రాసిన వార్తాకథనం 2001 మార్చి 29న ఒక దినపత్రికలో అచ్చయింది. అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ వార్తాకథనాన్ని ఆనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో స్వయంగా పేపర్ని చూపించి మరీ ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాన్ని చరిత్ర మరువదు. శాసనసభలో ఆనాడు వైఎస్ ప్రస్తావించడంతో అది రాజకీయ ఎజెండాలోకి చేరింది. సబ్‌ప్లాన్ అవసరం, దాని అమలు తీరుతెన్నులపై మొదట గళం విప్పింది వైఎస్ఆర్ అనే వాస్తవాన్ని ఎన్నటికీ విస్మరించడానికి లేదు. 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్’ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ని కలిసి సమర్థంగా సబ్‌ప్లాన్ అమలుచేయాలని అభ్యర్థించాం. ఒకవైపు ప్రభుత్వంతో ఈ విషయమై సంప్రదిస్తూనే, రెండోవైపు సబ్‌ప్లాన్ విషయంలో చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ క్రమంలోనే 2007లో సీపీఎం నాయకత్వంలోని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో సబ్‌ప్లాన్ అమలు కోసం అప్పటి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు నేతృత్వంలో అక్టోబర్‌లో నిరాహార దీక్షలు జరిగాయి. ఆ సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ స్పందించి, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు కోసం నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. ఆ తర్వాత నోడల్ ఏజెన్సీతో పాటు సబ్ ప్లాన్ చట్టం కోసం విశాలమైన ఉద్యమం జరిగింది. దాదాపు 150కి పైగా సంఘాలతో ఏర్పాటైన ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 2012 మార్చిలో 72 గంటల దీక్ష జరిగింది. ఇందులో కేవీపీఎస్, డీబీఎఫ్, సీడీఎస్, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్ ఫోరం, దళిత, ఆది వాసీ, సంఘాలతో పాటు సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్, బీజేపీ, వైఎస్ ఆర్సీపీ, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ పార్టీలు తమ మద్దతును తెలియజేశాయి. వీటన్నింటితో పాటు, అధికార కాంగ్రెస్ పార్టీలోని ఎస్సీ, ఎస్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్యమానికి మద్దతు తెలిపారు. దీనితో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 2012 డిసెంబర్ 2న చట్టం అసెంబ్లీ ఆమోదం పొందింది. గెజిట్‌లో జనవరి 23 నుంచి అమలులోకి వచ్చింది. ఈ ఉద్యమ ప్రస్థానంలో చాలామంది వ్యక్తులతో పాటు సంస్థలూ పాల్గొన్నాయి. ఆ వివరాలన్నీ ఇక్కడ ప్రస్తావించడం సాధ్యం కాదు. అయితే చట్టం ఏర్పడిన నేపథ్యం అర్థం కావడానికే ఈ ప్రాథమిక విషయాల ప్రస్తావన. సబ్‌ప్లాన్ అనే ఒక అంశం రూపొందడానికి చారిత్రక నేపథ్యం ఉంది. ఈరోజు షెడ్యూల్డ్ కులాలుగా పిలువబడుతున్న అంటరాని కులాల సామాజిక, విద్య అభివృద్ధి కోసం ప్రత్యేక పాఠశాలలు, పథకాలు ఉండాలని మొదట మాట్లాడిన సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు ఫూలే. బ్రిటిష్ ప్రభుత్వం 1882లో ఏర్పాటు చేసిన హంటర్ కమిషన్‌కు ఆయన ఇచ్చిన విజ్ఞాపనలో అంటరాని కులాలైన మహర్, మాంగ్, మాతంగ్లకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయా లని కోరారు. భారతదేశంలో ఇది మొట్టమొదటి ఆలోచన. ఆ తర్వాత సాహూ మహారాజ్, శాయాజీరావు గైక్వాడ్‌లు రిజర్వేషన్లు మొదలు పెట్టారు. అనంతర కాలంలో భారతదేశ చిత్రపటం మీదకి వచ్చిన బాబాసాహెబ్ అంబేడ్కర్ 1927లో బొంబాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న సమయంలో కౌన్సిల్లో మాట్లాడుతూ, అణగారిన వర్గాలైన అంటరాని కులాల పిల్లల విద్యాభివృద్ధికి ప్రత్యేక హాస్టల్స్ నిర్మించాలని ప్రతిపాదించారు. నేటి మన రెసిడెన్షియల్ పాఠశాలల వ్యవస్థకు అదే పునాది. అలాగే 1932 సెప్టెంబర్ 24న గాంధీ–అంబేడ్కర్ల మధ్య కుదిరిన పూనా ఒడంబడికలోని 9వ అంశంలో అంటరాని కులాల విద్యార్థుల విద్య కోసం ప్రతి రాష్ట్రం, కేంద్రం కళాశాల నిధులను కేటాయించాలని ఉంది. ఇది ఒక రకంగా మొట్టమొదటి బడ్జెట్ ప్రస్తావన. 1944లో బాబాసాహెబ్ అంబేడ్కర్ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, విదేశీ విద్య ప్రోత్సాహం, ఉద్యోగాల రిజర్వే షన్లు సాధించారు. వీటన్నింటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 46ను చేర్చి ప్రభుత్వాలు షెడ్యూల్డ్ కులాల, తెగల అభివృద్ది కోసం సత్వరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అయితే ప్రప్రథమ ప్రధాని నెహ్రూ కాలంలో ఇటువైపు అడుగులు పడలేదు. 1970 తర్వాత అప్పటి ప్రధాని ఆనాటి రాజకీయ, ఉద్యమ ప్రభావాలతో 1974 ఎస్సీ సబ్‌ప్లాన్‌ను, 1980లో ఎస్సీ కాంపోనెంట్ ప్లాన్‌ను ప్రారంభించారు. 2006లో ఎస్సీ కాంపోనెంట్ ప్లాన్‌ను ఎస్సీ సబ్ ప్లాన్‌గా మార్చారు. అయితే ఈ పథకాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్.రాజశేఖర్ రెడ్డి లేవ నెత్తేంత వరకు దీని గురించిన అవగాహన ఎవ్వరికీ లేదనడంలో సందేహం అక్కర్లేదు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చట్టం ఏర్పడిన తర్వాత కర్ణాటకలో, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లలో ఇటువంటి చట్టాలు అమలులోకి వచ్చాయి. పంజాబ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ క్రమంలో.. ఈ ఏడాదితో కాల పరిమితి తీరిన ‘ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని మరో ఇరవై ఏళ్లు పొడిగిస్తూ ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహర్రెడ్డి ఆర్డినెన్స్‌కు చొరవ చూపారు. దళితుల, ఆదివాసుల అభివృద్ధికి... ప్రత్యేకించి నివాస, మౌలిక సదుపాయాల, విద్యావకాశాల మెరుగు కోసం, ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలను చేపట్టడం ద్వారా వారు ప్రగతి సాధించడానికి ఈ చట్టం పొడిగింపు ఉపకరిస్తుంది. ఈ ఉన్నత లక్ష్యసాధనలో మరిన్ని ముందడుగులు పడాలని ఆశిద్దాం. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
పక్కదారి పడుతున్న సబ్‌ప్లాన్ నిధులు
– నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయని నందికొట్కూరు ఎమ్మెల్యే వై. ఐజయ్య అన్నారు. శనివారం.. కర్నూలు నగరం సుంకేసుల రోడ్డులోని బీఎస్ఎన్ఎల్ జీఎం కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, పక్కనే పీఅండ్‌టీ కాలనీలో బాబూ జగజ్జీవన్‌రామ్‌ల సిమెంటు విగ్రహాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని పారుమంచాల గ్రామ సమీపంలో బ్రిడ్జి నిర్మాణానికి రూ. 3 కోట్ల సబ్‌ప్లాన్ నిధులు వాడారన్నారు. ఎస్సీలకు 15, ఎస్టీలకు 7 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని, దళితులు కలిసికట్టుగా వాటిని పెంచుకునేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. పోస్టల్, టెలికాం శాఖలు కలిసి ఉన్న సమయంలో పీఅండ్‌టీ కాలనీ ఏర్పడిందని, 1956లో ఈ కాలనీ నిర్మాణానికి అప్పటి డిప్యూటీ ప్రధాని బాబుజగజ్జీవన్రామ్ శంకుస్థాపన చేశారని తెలిపారు. ఆయన శంకుస్థాపన చేసిన కాలనీలోనే విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా చాలా ఆనందం కలిగిందన్నారు. బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ పి.ఎస్.జాన్ అధ్యక్షతన నిర్వమించిన కార్యక్రమాల్లో జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు, పోస్టుమాస్టర్ వై.డేవిడ్, బీఎస్ఎన్ఎల్ డీజీఎంలు టి.సురేశ్, ఎస్.పి.నాగరాజురావు, అక్బర్‌బాష, ప్రభుత్వ ఆసుపత్రి ప్రొఫెసర్ డాక్టర్ శ్రీరాములు, మాజీ కార్పొరేటర్ గున్నామార్క్ పాల్గొన్నారు. రెండు విగ్రహాలను సొంత ఖర్చుతో ఏర్పాటు చేయడం పట్ల దళిత సంఘాల నాయకులను ఐజయ్య అభినందించారు. తాను ఇప్పటి వరకు 36 అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించినట్లు తెలిపారు. -
బీసీలకు సబ్‌ప్లాన్ అమలు చేయాలి
అనంతపురం సప్తగిరిసర్కిల్ : బీసీలకు సబ్‌ప్లాన్‌ను అమలు చేయాలని బీసీ ఐక్య సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షుడు నారగోని డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లను 25 శాతం నుంచి 44 శాతానికి పెంచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బండి శివ, ప్రధాన కార్యదర్శి నవీన్‌కుమార్, ప్రచార కార్యదర్శి మహేష్, జిల్లా నాయకులు రఘు, మల్లేష్, శీనా, శంకరయ్య, బాలకృష్ణ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
దళితులపై దాడులను నియంత్రించాలి
- సబ్‌ప్లాన్‌ను సక్రమంగా అమలు చేయాలి - సీపీఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా కర్నూలు(న్యూసిటీ) : దళితులపై దాడులు పెరిగిపోతున్నా నియంత్రణకు సర్కారు చర్యలు తీసుకోవడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి కె. రామాంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు కావస్తున్నా నేటికీ దళితులపై దాడులు జరుగుతుండడం దురదృష్టకరమన్నారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా చేపట్టారు. ముందుగా రాజ్‌విహార్ దగ్గర ఉన్న అంబేడ్కర్ భవన్ నుంచి బుధవారపేట మీదుగా కలెక్టరేట్ వరకు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీగా వచ్చారు. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సక్రమంగా వినియోగించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. హైదరబాదు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు ఆర్ఎస్ఎస్ నాయకులే కారణమన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి భీమలింగప్ప మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఇతర పనులకు మళ్లించకుండా దళిత, గిరిజనుల అభివృద్ధికే ఖర్చు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు గోదావరి, కృష్ణా పుష్కరాలకు ఈ నిధుల నుంచి రూ.వెయ్యి కోట్లు మళ్లించడం ఎంతవరకు సమంజసమన్నారు. వేలాది ఎకరాల భూములను పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేశారని ఆరోపించారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.శేఖర్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాలు, కమిటీ నాయకులు ఎన్.మనోహర్ మాణిక్యం, పి.గోవిందు, ఆర్.గురుదాస్, కె.రాధాకృష్ణ, ఎన్.లెనిన్ బాబు, మునెప్ప, రామకృష్ణారెడ్డి, మద్దిలేటి శెట్టి తదితరులు పాల్గొన్నారు. -
దళితబాట సరే..సబ్‌ప్లాన్ ఊసేదిబాబూ
జిల్లాలో సబ్‌ప్లాన్ పనుల్లో తీవ్ర జాప్యం పాలకుల నిర్లక్ష్యమే కారణమంటున్న దళిత నాయకులు సబ్‌ప్లాన్ కే దిక్కులేదు.. దళిత బాట దేనికంటూ ఎద్దేవా..! సమీక్షలు, సమావేశాలు పెట్టని కమిటీలు దేనికంటూ దళితుల ప్రశ్న? భానుగుడి (కాకినాడ) : ప్రభుత్వ పథకాలు కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమవుతున్నాయని జిల్లాలో ఎస్సీ,ఎస్టీల ప్రగతిని గమనిస్తే తెలుస్తోంది. దళితుల సామాజిక స్థితిగతులను మార్చే దిశగా ఉన్నత లక్ష్యంతో 2013లో ప్రవేశ«పెట్టిన సబ్‌ప్లాన్ నిధులు సైతం తాజాగా ఆ కోవలోకి చేరాయి. శాఖల వారీగా కేటాయింపులు జరిగినా పనుల నిర్వహణ ’ఎక్కడి గొంగళి అక్కడే’ అన్న చందంగా చతికిలపడింది. అధికారుల, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఒక బృహత్తర ప్రణాళిక పేద ప్రజలకు చేరడం లేదు. లోపాలను సరిదిద్దకుండా దళితబాట కార్యక్రమాలేమిటని దళిత సంఘాల ప్రతినిధులు, బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇదీ సబ్‌ప్లాన్ . దళితులకోసం ప్రత్యేకంగా కేటాయించిన నిధులను దామాషా ప్రాతిపదికన వారి ప్రగతికే ఖర్చు చేయాలన్న నిబంధనతో ప్రత్యేక అభివృద్థి కమిటీల ఏర్పాటుతో 2013లో ఈ సబ్‌ప్లాన్ రూపుదిద్దుకుంది. రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీల ప్రగతికి 17.01 శాతం, ఎస్టీలకు 5.53 శాతం నిధులను కేటాయిస్తున్నారు. ఈ నిధులను సబ్‌ప్లా¯ŒSలో భాగంగా మంత్రులు, ప్రిన్సిపల్ కార్యదర్శి, శాఖల ముఖ్య అధికారులు సభ్యులుగా ఉన్న నోడల్ ఏజెన్సీలు, హైలెవల్ వర్కింగ్ కమిటీ, రాష్ట్ర కౌన్సిల్లు శాఖల వారీగా ప్రత్యేక ప్రణాళికల ఆధారంగా కేటాయిస్తారు. సబ్‌ప్లాన్ యాక్ట్ ప్రకారం ఈ కమిటీలు ప్రతి రెండు నెలలకోసారి సమావేశం నిర్వహించి ప్రగతిపై చర్చ జరపాలి. తొలినాళ్ళలో సమావేశం నిర్వహించి తర్వాత చేతులు దులుపుకున్నారు. ఇప్పటికి ఒకే ఒక్కసారి మినహా సమావేశం నిర్వహించిన దాఖలాలు లేకపోవడం దళితుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుధ్ధి అవగతం అవుతోంది. జిల్లాలో పరిస్థితి ఇదీ..! ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం భారీ బడ్జెట్లు ప్రవేశపెట్టి అరకొర నిధులు వెదజల్లి అయిందనిపిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 2016–17 సంవత్సరానికిగాను రాష్ట్రంలో సబ్‌ప్లాన్ నిధుల రూపంలో రూ.8856 కోట్లు ఎస్సీల అభివృధ్దికి, 3099 కోట్లు ఎస్టీల అభివృధ్దికి కేటాయించారు. కేటాయింపులు జరిగాయి గానీ శాఖల వారీగా ప్రగతి ఆశించిన స్థాయిలో లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలకులకు చిత్తశుద్ధి లేమి కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందని దళితులు వాపోతున్నారు. రహదారుల సంగతేంటి? దళితులు 40 శాతంకంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి పంచాయతీ రాజ్‌శాఖలో 140 పనులను గుర్తించారు. వీటికి జిల్లాలో రూ.40 కోట్లు కేటాయించారు. ట్రైబల్ సబ్‌ప్లాన్ కింద 19 పనులు గుర్తించగా 19.26 కోట్లు కేటాయించారు. ఈ పనుల్లోనూ ఎటువంటి పురోగతీ లేదు. స్త్రీనిధి.. టీడీపీ వారికి మాత్రమే..! గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దళిత మహిళల ప్రగతికి స్త్రీనిధిని ప్రభుత్వం అందిస్తోంది. స్థానిక జన్మభూమి కమిటీ సభ్యులు, నాయకుల కారణంగా అసలైన లబ్థిదారులకు ఈ నిధులు అందడం లేదు. దీనికి సబ్‌ప్లా¯ŒS నిధుల రూపంలో రూ.14 కోట్లు విడుదలయ్యాయి. 31 మండలాల్లో 3622 మంది మహిళలకు రూ.14కోట్లు మంజూరు చేశారు. వీటిని సగం మందికి కూడా ఇంకా అందివ్వ లేదు. టీడీపీలోని పలుకుబడి ఉన్న వారికి మాత్రమే ఈ ఫలాలు అందుతున్నాయని, సామాన్యులకు ఇవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రచారం లోటు.. సబ్‌ప్లాన్ నిధుల్లో భాగంగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్స్, సివిల్స్ కోచింగ్ నిమిత్తం జిల్లాకు వెయ్యి సీట్లు కేటాయించగా ఇందులో ఎస్సీలకు 700, ఎస్టీలకు 300. దీనికి నెలకు ప్రతి విద్యార్థికి 8 వేలు ఉపకారవేతనం అందిస్తారు. జిల్లాలో ఈ పథకం ప్రచార లేమి కారణంగా కేవలం 24 మంది ఎస్సీ విద్యార్థులు, ఏడుగురు ఎస్టీ విద్యార్థులు మాత్రమే ఎంపికవడం విచారకరం. ఎస్సీ రుణాల గ్రౌండింగ్ ఎప్పటికి పూర్తయ్యేనో.... షెడ్యూల్డ్ కులాల అభివృద్ధే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామంటున్న ప్రభుత్వ ప్రకటనలు ప్రచార ఆర్భాటానికే తప్ప క్షేత్ర స్థాయిలో చంద్రన్న సంక్షేమం కానరావడం లేదు. షెడ్యూల్డ్ కులాలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే రుణాల ప్రగతి అంతంతమాత్రంగా ఉంది. 2015–16 ఆర్థిక సంవత్సర లబ్థిదారుల రుణాల గ్రౌండింగ్ నేటికీ వందల సంఖ్యలోనే ఉంది. సబ్సిడీ రుణం మంజూరు చేసినప్పటికీ వాటికోసం సంవత్సర కాలంగా లబ్థిదారులు ఎస్సీ కార్పొరేషన్, బ్యాంకుల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నా ఫలితం లేని దుస్థితి. ఈ ఆర్థిక సంవత్సరానికి (2016–17)కు అర్ధ సంవత్సరం దాటినా లబ్థిదారుల నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణలోనే ఉన్నారు. జిల్లాలో 2015–16 సంవత్సరానికి రూపొందించిన రుణ ప్రణాళిక ప్రకారం స్వయం ఉపాధి పథకాలకు ఆర్ధిక సహాయం అమలు చేసేందుకు రూ.112.11 కోట్లతో 8,473 మందికి లబ్థి చేకూర్చేందుకు లక్ష్యాన్ని నిరే్ధశించారు. దీనిలో బ్యాంక్ లింకేజీ పరంగా 2,594 మంది లబ్థిదారులకు రూ.3644.86 లక్షలు మంజూరు ఉత్తర్వులు ఇచ్చారు. కాని కేవలం 127 మంది లబ్థిదారులకే ఇప్పటి వరకు రుణాల గ్రౌండింగ్ పూర్తయింది. అలాగే బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా రుణాలు అందజేసే ఎన్ఎస్ఎఫ్డీసీ స్కీంలో రూ.566.14 లక్షలతో 316 మంది లబ్థిదారులకుగాను రూ.198.25 లక్ష్యలతో 90 మందికి, ఎన్ఎస్కెఎఫ్డీసీ స్కీంలో రూ.166.35 లక్షలతో 109 మందికిగాను రూ.29.50 లక్షలతో 90 మందికి రుణ మంజూరు అయితే చేశారు కానీ నేటికీ ఒక్క పైసాకూడా లబ్థిదారులకు ఇవ్వలేదు. సబ్‌ప్లాన్ ఊసేదీ : సబ్ ప్లాన్ కమిటీ సభ్యులు రెండు నెలలకోసారి సమావేశం కావాలి. 2013లో ఈ కమిటీ ఏర్పడింది. ఆదిలో ఓసారి సమావేశమయ్యారు. తరువాత ఆ ఊసే లేదు. నిధులు సరే, అమలేదీ : 2016–17 సంవత్సరానికిగాను రాష్ట్రంలో సబ్‌ప్లాన్ నిధులు రూ.8,856 కోట్లు ఎస్సీల అభివృద్ధికి, రూ.3,099 కోట్లు ఎస్టీల అభివృద్ధికి కేటాయించారు. జిల్లాలో అధిక సంఖ్యలో ఎస్సీ, ఎస్టీలున్నా ఈ నిధుల వ్యయం అంతంతమాత్రమే. అతీగతీలేని భవనాలు : మంజూరైన 76 సామాజిక భవనాల్లో 56 మాత్రమే ప్రారంభమయ్యాయి. వీటిలో 30కి పైగా వివిధ దశల్లో నిలిచి పోయాయి. రహదారుల సంగతేంటి? : గిరిజన ప్రాంతాల్లో 19 రహదారి పనులను సబ్ ప్లా¯ŒS కింద గుర్తించి రూ.19.26 కోట్లు కేటాయించారు. ఈ పనుల్లోనూ ఎటువంటి పురోగతీ లేదు. శ్మశాన వాటికల మాటేమిటి! సబ్‌ప్లాన్ లో భాగంగా జీవో నంబరు 715,1235 ప్రకారం జిల్లాలో దళితులకు ప్రత్యేకంగా శ్మశాన వాటికలు ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే అయినవిల్లి, అంబాజీపేట మండలాల్లో వీటికోసం ప్రత్యేకంగా దరఖాస్తులు సమర్పించినా ఎటువంటి పరిష్కారమూ చూపించలేదు. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద విదేశాల్లో పీజీ చదివే విద్యార్థులకు రూ.15 లక్షలు ప్రభుత్వం అందిస్తుంది. ప్రతి ఏడాది 500 మంది విద్యార్థులకు ఈ పథకానికి సంబంధించి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నా ఈ ఏడాది కేవలం ఏడుగురు మాత్రమే విదేశాలకు ఉన్నత చదువులకు వెళ్ళారంటే ఈ పథకం తీరు అర్ధం చేసుకోవచ్చు. అతిగతీలేని సామాజిక భవనాలు... సబ్‌ప్లాన్ నిధుల కింద ఈ ఏడాది 76 సామాజిక భవనాలు జిల్లాకు మంజూరయ్యాయి. ఇందులో 56 భవనాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. వీటిలో వివిధ దశల్లో నిలిచిపోయిన భవనాలు 30కి పైగా ఉన్నాయి. ప్రారంభమై ఏళ్ళు గడుస్తున్నా అర్థంతరంగానే ఉన్నాయి . వీటికోసం వెచ్చించిన రూ.5 కోట్ల 70 లక్షల సబ్‌ప్లాన్ నిధులు కేవలం ఫౌండేషన్లకే పరిమితమయ్యాయి. 50 యూనిట్ల ఉచితం విషయం తెలియదు దళితులకు 50 యూనిట్లులోపు కరెంటు ఉన్న ఇళ్ళకు ఏపీఈపీడీసీఎల్ ఉచిత విద్యుత్ ఇస్తుంది.ఈ వెసులుబాటు ఉందన్న విషయమే చాలా మందికి తెలియదు. దీంతో ఎవరూ దీన్ని వినియోగించుకోవడం లేదు. – ఐ.సుభాష్, దళిత సామాజిక కార్యకర్త ప్రతి పాదనలు పంపించాం దళిత గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కోసం రూ.53 కోట్లు ప్రతిపాదనలు జిల్లాలో సిద్ధం చేశారు. వీటిని నోడల్ ఏజేన్సీకి పంపారు. ఆర్అండ్బి ద్వారా జిల్లాలో రూ.92 కోట్లు ప్రతిపాదనలు పంపారు. వీటిలో ఎక్కువగా ట్రైబల్ ఏరియాలో రహదారుల పనులే ఎక్కువ. ఈ నిధుల మంజూరుకు కృషి చేస్తున్నాం. – ఎన్ స్టాలిన్ బాబు, జిల్లా మానిటరింగ్ నాన్ అఫీషియల్ కమిటీ సభ్యులు -
సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేయకుంటే చర్యలు
కర్నూలు సిటీ: ఎస్సీ సబ్‌ప్లాన్ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు. ఇందుకు కేటాయించిన నిధులు ఖర్చు చేయకుంటే సంబంధిత అధికారులపై అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఎస్సీ సబ్‌ప్లాన్‌పై అధికారులతో జేసీ సమీక్షించారు. సబ్‌ప్లాన్‌కు కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలన్నారు. మున్సిపాల్టిలో 40 శాతం ఎస్సీ జనాభా ఉన్నట్లు ధ్రువీకరించిన తర్వాతే పనులు చేపట్టాలన్నారు. 2014–15కు సంబంధించిన పనులు పెండింగ్‌లో ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇకపై సబ్‌ప్లాన్ కింద చేస్తున్న పనులపై రెగ్యులర్‌గా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని, అందుకు సంబంధించి పూర్తి వివరాలతో రావాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రతి కుటుంబానికి నెలకు రూ.10 వేల ఆదాయం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికలు తయారు చేయాలన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ప్రసాద్ రావు, ఆయా శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
బంగారు తెలంగాణే లక్ష్యం
కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలన్నది నా ప్రధాన లక్ష్యం. దీనిలో భాగంగా ఎమ్మెల్యేగా గెలిచిన మూడు, నాలుగు నెలల్లో తొలి ప్రాధాన్యత కింద జిల్లాలో పెండింగ్‌లో ఉన్న తాగు, సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా. నియోజకవర్గంలో తొలి విడత శాటిలైట్ టౌన్షిప్ పేరుతో ఐదు వేల ఇళ్ల నిర్మాణం చేపడతా.జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీతో పాటు దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తా . నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా.. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఐటీ పార్కు ఏర్పాటు, ప్రభుత్వ భూములు సేకరించి పేదలకు పంపిణీ చేస్తా. మేజర్ గ్రామపంచాయతీల్లో ప్రభుత్వ భూములు సేకరించి శాటిలైట్ టౌన్ షిప్‌లు ఏర్పాటు చేయిస్తా. ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి ప్రత్యేక రాష్ట్రంలో సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలు నాకు ఉన్నాయి. కానీ సీఎం పదవి కంటే కూడా ఈ ప్రాంత ప్రజల బాగోగులు చూసుకోవడం ముఖ్యం. టీ కాంగ్రెస్ మేనిఫెస్టోల్లో పేర్కొన్న అంశాలను అమలు చేసేందుకు కృషి చేస్తా. రైతులకు రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేయిస్తా. బీసీలు, ముస్లింలు, మైనార్టీలకు సబ్‌ప్లాన్ ఏర్పాటుకు కృషి, హైదరాబాద్-విజయవాడ ప్రధాన రహదారిపై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయిస్తా. వృద్ధులకు, వికలాంగులకు పింఛన్‌ను రూ.వెయ్యికి పెంచేందుకు పాటుపడతా. రైతులకు 9 గంటల పాటు నిరంతరాయం గా విద్యుత్ సరఫరా చేయిస్తా. స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తా. -
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల దుర్వినియోగం
ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగితే చాలు.. పార్టీతో సంబంధం లేకుండా నిధులు వరదై పారుతాయి. అవీఇవీ అనే తేడా లేకుండా మళ్లించేస్తారు. అడ్డుకట్ట వేసేందుకు చట్టాలు చేసినా నిలువరించే పరిస్థితి లేకపోతోంది. పైకి అలాంటిదేమీ లేదనే వాదనలు వినిపిస్తున్నా.. అధికారిక గణాంకాలు అసలు నిజాన్ని వెల్లడిస్తున్నాయి. సాక్షి, కర్నూలు: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపులో వివక్ష కొనసాగుతోంది. జనాభా ప్రాతిపదికన కేటాయించిన నిధులను ఇతర ప్రాంతాలకు, వర్గాలకు కేటాయిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఈ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో చట్టం చేసిన తర్వాత కూడా.. నిధుల మళ్లింపులో మార్పు రాకపోవడం గమనార్హం. జనరల్ స్థానాలకు నిధులను అధికంగా కేటాయిస్తూ.. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలకు మొండిచేయి చూపడం సర్వసాధారణమవుతోంది. పభుత్వాన్ని, ముఖ్యులను ఎంతగా ప్రభావితం చేయగలరో వారే నిధులను అధికంగా రాబట్టుకోగలుగుతున్నారనేది స్పష్టమవుతోంది. సబ్‌ప్లాన్‌లో భాగంగా విద్యార్థుల సమగ్ర సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కళాశాలల వసతిగృహ భవనాలు, సమీకృత వసతి గృహ సముదాయాలు, వసతి గృహ భవనాలకు 2013-14 సంవత్సరం మొదటి విడతగా విడుదల చేసిన నిధులను ‘సాక్షి’ లోతుగా పరిశీలించింది. మొత్తం రూ.46 కోట్లు మంజూరు కాగా జిల్లాలోని 13 నియోజకవర్గాలకు పంపిణీ చేశారు. పస్తుత నియోజకవర్గాలను 2001 జనాభా ప్రాతిపదికన.. 2008-09లో పునర్విభజన చేశారు. ఆ ప్రకారం చూసినా నిధుల కేటాయింపులో వివక్ష తేటతెల్లమవుతోంది. జిల్లాలో రెండు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. సబ్‌ప్లాన్ ప్రకారం చూస్తే.. ఈ రెండు నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు కేటాయించాల్సి ఉంది. అయితే జనరల్ స్థానాలైన కర్నూలు, బనగానపల్లె, ఆదోని నియోజకవర్గాలకు పెద్దపీట వేశారు. ఈ పరిస్థితి కాంగ్రెస్, టీడీపీ నేతల ప్రమేయాన్ని చెప్పకనే చెబుతోంది. వాటి విషయాన్ని పక్కనపెడితే.. ఎస్సీ నియోజకవర్గమైన నందికొట్కూరుకు అతితక్కువగా రూ.125.44 లక్షలు మాత్రమే కేటాయించారు. శ్రీశైలం నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి అధికార పార్టీ నాయకుడే అయినా నిధులను రాబట్టుకోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. మంత్రాలయం నియోజకవర్గానికి అత్యంత తక్కువగా రూ.12 లక్షలు కేటాయించగా.. ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ఒక్క పైసా కేటాయించకపోవడం గమనార్హం. జనాభా ప్రాతిపదికన చూపినా నందికొట్కూరు నియోజకవర్గానికి నిధులు ఎక్కువగా కేటాయించాల్సి ఉంది. అయితే రూ.125 లక్షలతోనే సరిపెట్టడం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం అమలు తీరుకు అద్దం పడుతోంది. -
ఎస్సీ, ఎస్టీ వాడల్లో...ఉచిత ‘వెలుగులు’
సాక్షి, కడప: దారిద్య్రరేఖకు దిగువనున్న నిరుపేదలకు స్వాంతన చేకూర్చాలనే ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద దళిత, గిరిజనుల ఇళ్లకు ఉచితంగా విద్యుత్‌ను అందించే చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. బిల్లుల చెల్లింపునకు సంబంధించి సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్‌పీటర్ ఈనెల 2న జీవో 58 జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 93, 159 ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి. వీరిలో 50 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే కుటుంబాలు 23,176 ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 20,260 కుటుంబాలకు సంబంధించిన పాత బకాయిలు కూడా ఉన్నాయి. వీటితో పాటు జూలై నెల నుంచి విద్యుత్ బిల్లులన్నింటినీ చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ జిల్లా సాంఘిక సంక్షేమశాఖకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులకు అనువుగా జిల్లాలోని లబ్ధిదారులు, వారికున్న బకాయిల వివరాలను పంపించాల్సిందిగా విద్యుత్‌శాఖను సాంఘిక సంక్షేమశాఖ కోరింది. వారిందించే వివరాల ఆధారంగా పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రతి నెలా మొదటివారంలోనే వాటిని చెల్లించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. జూలై నుంచి రెగ్యులర్ బిల్లులు చెల్లిస్తారు. బకాయిలను మాత్రం రెండు విడతల్లో చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్టీలకు ఎప్పుడో..!: ఎస్సీల విద్యుత్తు బిల్లుల చెల్లింపుపై జీవో జారీ చేసిన ప్రభుత్వం ఎస్టీల విషయంలో నిర్లిప్తత వహించింది. గిరిజన తాండాల్లో నివసించే ఎస్టీల బిల్లులు చెల్లించేందుకు ఇంకా ఉత్తర్వులు వెలువరించలేదు. దీంతో జూలైకు సంబంధించిన ఎస్సీల బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తే, ఎస్టీలు మాత్రం వారి బిల్లులు వారే చెల్లించుకోవాల్సి ఉంది. జిల్లాలో మొత్తం 15, 178 గిరిజన కుటుంబాలు ఉన్నట్లు అంచనా. ఇందులో కొన్ని తాండాలకు ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదు. తాండాల్లో నివసించేవారిలో 60 శాతం మంది 50 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగిస్తున్నట్లు అధికారిక నివేదికలు చెబుతున్నాయి. మిగిలిన వారి పరిస్థితేంటి..!: దళిత, గిరిజన వాడల్లోని ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా విద్యుత్‌ను అందించాలనే నిర్ణయం మంచిదైన్పటికీ అద్దె ఇళ్లలో ఉంటున్నవారు, ఇతర ప్రాంతాల్లో నివసించే వారిలో 50 యూనిట్ల విద్యుత్‌ను వాడే వారి పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పేదవర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీలందరికీ మేలు చేసేలా వ్యవహరించాల్సిన ప్రభుత్వం కేవలం సమూహంగా ఉండే కాలనీలకే వర్తింపజేస్తామనే విధానం సరైంది కాదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో నివసించేవారిలో మెజార్టీ శాతం కూలీపైనే ఆధారపడి జీవిస్తున్నవారు ఎందరో ఉన్నారు. తమను పట్టించుకోకుండా కేవలం దళితవాడలకు ఇస్తామనడంలో తమకు అన్యాయం చేసినట్లేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు. బిల్లులు చెల్లిస్తాం: పీఎస్ఏ ప్రసాద్, జేడీ జూలై నెల నుంచి ఎస్సీల విద్యుత్తు బిల్లులను చెల్లిస్తాం. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా 50 యూనిట్లలోపు ఎంతమంది విద్యుత్తును వినియోగిస్తున్నారో ఆ వివరాలను ఎస్పీడీసీఎల్ అధికారులు పంపిస్తే బిల్లులను మేమే చెల్లిస్తాం. పాత బకాయిలను రెండు విడత లుగా చెల్లిస్తాం.