2013లో ‘ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం’ రూపొందడం వెనుక చారిత్రక నేపథ్యం, రాజ్యాంగ రక్షణ, ఉద్యమ సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా.. సబ్‌ప్లాన్ అవసరం, దాని అమలు తీరుతెన్నులపై అసెంబ్లీలో మొదట గళం విప్పింది వైఎస్సార్ అనే వాస్తవాన్ని విస్మరించడానికి లేదు. 2001లో ప్రతిపక్ష నాయకులైన వైఎస్సార్ సబ్ ప్లాన్ గురించి ప్రస్తావించడం వల్లనే ఆ అంశం రాజకీయ ఎజెండాలోకి చేరి, చివరికి చట్టం రూపం దాల్చింది. ఇప్పుడీ చట్టం కాలపరిమితి ముగిసే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని; దాన్ని మరో ఇరవై ఎళ్ళు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆర్డినెన్స్ జారీకి చొరవ చూపడం ముదావహం. దళితుల, ఆదివాసుల అభివృద్ధికి... ఈ చట్టం పొడిగింపు ఉపకరిస్తుంది.
‘‘ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టా నికి 2023 జనవరి 23తో పదేళ్ళ కాలపరిమితి ముగియనున్నందున, ఆ చట్టం లక్ష్యాలు ఇంకా నెరవేరాల్సి ఉన్నందున, ఆ చట్టాన్ని మరో ఇరవై సంవత్సరాలు పొడిగిస్తున్నాం’’ అంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జనవరి 22న ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. శాసన సభ, శాసనమండలి సమావేశాలు ఆ సమయానికి జరగటం లేనందువల్ల ఈ ఆర్డినెన్స్ అవసరమైందని కూడా ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. మరికొన్ని అవసరమైన మార్పులను సైతం ఇందులో పేర్కొన్నారు. వీటితో పాటు, చట్టం పేరును ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం’ అనడానికి బదులుగా ‘ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ కాంపోనెంట్, ఎస్టీ కాంపోనెంట్ చట్టం’గా మార్చారు. గతంలో ఉన్న విధంగా బడ్జెట్‌లో ప్లాన్, నాన్ ప్లాన్ లేనందువల్ల ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తున్న భాగాన్ని సబ్‌ప్లాన్‌కు బదులుగా కాంపోనెంట్‌గా పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కాలపరిమితి ముగిసే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, దళిత సంఘాల, సంస్థల అభ్యర్థనలను కూడా పరి గణనలోనికి తీసుకొని చట్టం కాలపరిమితిని మరో ఇరవై సంవత్స రాలు పొడిగించాలని నిర్ణయించినందుకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి అభినందనీయులు. ఈ చట్టం పట్ల, అదే విధంగా రాజ్యాంగం పట్ల ఆయన తన గౌరవాన్ని ఆచరణాత్మకంగా వ్యక్తం చేయడం ప్రశంసనీయం. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం– 2013’ రూపొందడం వెనుక చారిత్రక నేపథ్యం, రాజ్యాంగ రక్షణ, ఉద్యమ సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వపరంగా ఎటువంటి నిర్ణయాలు జరగాలన్నా, ప్రగతిశీల చట్టాలు అమలులోకి రావాలన్నా ప్రజల కోర్కెలు, ఉద్యమాలతో పాటు, రాజకీయ పార్టీల, సంస్థల అంగీకారం, రాజ్యాంగపరమైన ఆమోదం తప్పనిసరి. అలాంటి అన్ని రకాల మద్దతులను కూడగట్టిన చట్టాలలో సబ్‌ప్లాన్ చట్టం ఒకటి. మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు సబ్‌ప్లాన్ ఉద్యమంతో, చట్టం రూపకల్పనతో పాటు, దాని అమలు విషయంలో భాVýæమున్న వారిలో నేనూ ఒకరిని. సబ్‌ప్లాన్ అమలు కోసం జరిగిన యత్నాలలో భాగంగా సబ్‌ప్లాన్ నిధుల దారి మళ్ళింపు, అమలులో లోపాలపై నేను రాసిన వార్తాకథనం 2001 మార్చి 29న ఒక దినపత్రికలో అచ్చయింది. అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ వార్తాకథనాన్ని ఆనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో స్వయంగా పేపర్‌ని చూపించి మరీ ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాన్ని చరిత్ర మరువదు. శాసనసభలో ఆనాడు వైఎస్ ప్రస్తావించడంతో అది రాజకీయ ఎజెండాలోకి చేరింది. సబ్‌ప్లాన్ అవసరం, దాని అమలు తీరుతెన్నులపై మొదట గళం విప్పింది వైఎస్‌ఆర్ అనే వాస్తవాన్ని ఎన్నటికీ విస్మరించడానికి లేదు. 2004లో వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్’ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ని కలిసి సమర్థంగా సబ్‌ప్లాన్ అమలుచేయాలని అభ్యర్థించాం.
ఒకవైపు ప్రభుత్వంతో ఈ విషయమై సంప్రదిస్తూనే, రెండోవైపు సబ్‌ప్లాన్ విషయంలో చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ క్రమంలోనే 2007లో సీపీఎం నాయకత్వంలోని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో సబ్‌ప్లాన్ అమలు కోసం అప్పటి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు నేతృత్వంలో అక్టోబర్‌లో నిరాహార దీక్షలు జరిగాయి. ఆ సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ స్పందించి, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు కోసం నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. ఆ తర్వాత నోడల్ ఏజెన్సీతో పాటు సబ్ ప్లాన్ చట్టం కోసం విశాలమైన ఉద్యమం జరిగింది. దాదాపు 150కి పైగా సంఘాలతో ఏర్పాటైన ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 2012 మార్చిలో 72 గంటల దీక్ష జరిగింది. ఇందులో కేవీపీఎస్, డీబీఎఫ్, సీడీఎస్, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్ ఫోరం, దళిత, ఆది వాసీ, సంఘాలతో పాటు సీపీఎం, సీపీఐ, టీఆర్‌ఎస్, బీజేపీ, వైఎస్ ఆర్‌సీపీ, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ పార్టీలు తమ మద్దతును తెలియజేశాయి. వీటన్నింటితో పాటు, అధికార కాంగ్రెస్ పార్టీలోని ఎస్సీ, ఎస్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్యమానికి మద్దతు తెలిపారు. దీనితో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 2012 డిసెంబర్ 2న చట్టం అసెంబ్లీ ఆమోదం పొందింది. గెజిట్‌లో జనవరి 23 నుంచి అమలులోకి వచ్చింది. ఈ ఉద్యమ ప్రస్థానంలో చాలామంది వ్యక్తులతో పాటు సంస్థలూ పాల్గొన్నాయి. ఆ వివరాలన్నీ ఇక్కడ ప్రస్తావించడం సాధ్యం కాదు. అయితే చట్టం ఏర్పడిన నేపథ్యం అర్థం కావడానికే ఈ ప్రాథమిక విషయాల ప్రస్తావన.
సబ్‌ప్లాన్ అనే ఒక అంశం రూపొందడానికి చారిత్రక నేపథ్యం ఉంది. ఈరోజు షెడ్యూల్డ్ కులాలుగా పిలువబడుతున్న అంటరాని కులాల సామాజిక, విద్య అభివృద్ధి కోసం ప్రత్యేక పాఠశాలలు, పథకాలు ఉండాలని మొదట మాట్లాడిన సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు ఫూలే. బ్రిటిష్ ప్రభుత్వం 1882లో ఏర్పాటు చేసిన హంటర్ కమిషన్‌కు ఆయన ఇచ్చిన విజ్ఞాపనలో అంటరాని కులాలైన మహర్, మాంగ్, మాతంగ్‌లకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయా లని కోరారు. భారతదేశంలో ఇది మొట్టమొదటి ఆలోచన. ఆ తర్వాత సాహూ మహారాజ్, శాయాజీరావు గైక్వాడ్‌లు రిజర్వేషన్‌లు మొదలు పెట్టారు. అనంతర కాలంలో భారతదేశ చిత్రపటం మీదకి వచ్చిన బాబాసాహెబ్ అంబేడ్కర్ 1927లో బొంబాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న సమయంలో కౌన్సిల్‌లో మాట్లాడుతూ, అణగారిన వర్గాలైన అంటరాని కులాల పిల్లల విద్యాభివృద్ధికి ప్రత్యేక హాస్టల్స్ నిర్మించాలని ప్రతిపాదించారు. నేటి మన రెసిడెన్షియల్ పాఠశాలల వ్యవస్థకు అదే పునాది. అలాగే 1932 సెప్టెంబర్ 24న గాంధీ–అంబేడ్కర్‌ల మధ్య కుదిరిన పూనా ఒడంబడికలోని 9వ అంశంలో అంటరాని కులాల విద్యార్థుల విద్య కోసం ప్రతి రాష్ట్రం, కేంద్రం కళాశాల నిధులను కేటాయించాలని ఉంది. ఇది ఒక రకంగా మొట్టమొదటి బడ్జెట్ ప్రస్తావన. 1944లో బాబాసాహెబ్ అంబేడ్కర్ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, విదేశీ విద్య ప్రోత్సాహం, ఉద్యోగాల రిజర్వే షన్లు సాధించారు. వీటన్నింటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 46ను చేర్చి ప్రభుత్వాలు షెడ్యూల్డ్ కులాల, తెగల అభివృద్ది కోసం సత్వరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అయితే ప్రప్రథమ ప్రధాని నెహ్రూ కాలంలో ఇటువైపు అడుగులు పడలేదు. 1970 తర్వాత అప్పటి ప్రధాని ఆనాటి రాజకీయ, ఉద్యమ ప్రభావాలతో 1974 ఎస్సీ సబ్‌ప్లాన్‌ను, 1980లో ఎస్సీ కాంపోనెంట్ ప్లాన్‌ను ప్రారంభించారు. 2006లో ఎస్సీ కాంపోనెంట్ ప్లాన్‌ను ఎస్సీ సబ్ ప్లాన్‌గా మార్చారు.
అయితే ఈ పథకాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్.రాజశేఖర్ రెడ్డి లేవ నెత్తేంత వరకు దీని గురించిన అవగాహన ఎవ్వరికీ లేదనడంలో సందేహం అక్కర్లేదు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చట్టం ఏర్పడిన తర్వాత కర్ణాటకలో, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లలో ఇటువంటి చట్టాలు అమలులోకి వచ్చాయి. పంజాబ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ క్రమంలో.. ఈ ఏడాదితో కాల పరిమితి తీరిన ‘ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని మరో ఇరవై ఏళ్లు పొడిగిస్తూ ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహర్‌రెడ్డి ఆర్డినెన్స్‌కు చొరవ చూపారు. దళితుల, ఆదివాసుల అభివృద్ధికి... ప్రత్యేకించి నివాస, మౌలిక సదుపాయాల, విద్యావకాశాల మెరుగు కోసం, ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలను చేపట్టడం ద్వారా వారు ప్రగతి సాధించడానికి ఈ చట్టం పొడిగింపు ఉపకరిస్తుంది. ఈ ఉన్నత లక్ష్యసాధనలో మరిన్ని ముందడుగులు పడాలని ఆశిద్దాం.
మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077
Comments
Please login to add a commentAdd a comment