kothakonam
-
సకల శక్తుల సాధన సబ్‌ప్లాన్
2013లో ‘ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం’ రూపొందడం వెనుక చారిత్రక నేపథ్యం, రాజ్యాంగ రక్షణ, ఉద్యమ సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా.. సబ్‌ప్లాన్ అవసరం, దాని అమలు తీరుతెన్నులపై అసెంబ్లీలో మొదట గళం విప్పింది వైఎస్సార్ అనే వాస్తవాన్ని విస్మరించడానికి లేదు. 2001లో ప్రతిపక్ష నాయకులైన వైఎస్సార్ సబ్ ప్లాన్ గురించి ప్రస్తావించడం వల్లనే ఆ అంశం రాజకీయ ఎజెండాలోకి చేరి, చివరికి చట్టం రూపం దాల్చింది. ఇప్పుడీ చట్టం కాలపరిమితి ముగిసే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని; దాన్ని మరో ఇరవై ఎళ్ళు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆర్డినెన్స్ జారీకి చొరవ చూపడం ముదావహం. దళితుల, ఆదివాసుల అభివృద్ధికి... ఈ చట్టం పొడిగింపు ఉపకరిస్తుంది. ‘‘ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టా నికి 2023 జనవరి 23తో పదేళ్ళ కాలపరిమితి ముగియనున్నందున, ఆ చట్టం లక్ష్యాలు ఇంకా నెరవేరాల్సి ఉన్నందున, ఆ చట్టాన్ని మరో ఇరవై సంవత్సరాలు పొడిగిస్తున్నాం’’ అంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జనవరి 22న ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. శాసన సభ, శాసనమండలి సమావేశాలు ఆ సమయానికి జరగటం లేనందువల్ల ఈ ఆర్డినెన్స్ అవసరమైందని కూడా ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. మరికొన్ని అవసరమైన మార్పులను సైతం ఇందులో పేర్కొన్నారు. వీటితో పాటు, చట్టం పేరును ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం’ అనడానికి బదులుగా ‘ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ కాంపోనెంట్, ఎస్టీ కాంపోనెంట్ చట్టం’గా మార్చారు. గతంలో ఉన్న విధంగా బడ్జెట్లో ప్లాన్, నాన్ ప్లాన్ లేనందువల్ల ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తున్న భాగాన్ని సబ్‌ప్లాన్‌కు బదులుగా కాంపోనెంట్గా పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కాలపరిమితి ముగిసే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, దళిత సంఘాల, సంస్థల అభ్యర్థనలను కూడా పరి గణనలోనికి తీసుకొని చట్టం కాలపరిమితిని మరో ఇరవై సంవత్స రాలు పొడిగించాలని నిర్ణయించినందుకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అభినందనీయులు. ఈ చట్టం పట్ల, అదే విధంగా రాజ్యాంగం పట్ల ఆయన తన గౌరవాన్ని ఆచరణాత్మకంగా వ్యక్తం చేయడం ప్రశంసనీయం. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం– 2013’ రూపొందడం వెనుక చారిత్రక నేపథ్యం, రాజ్యాంగ రక్షణ, ఉద్యమ సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వపరంగా ఎటువంటి నిర్ణయాలు జరగాలన్నా, ప్రగతిశీల చట్టాలు అమలులోకి రావాలన్నా ప్రజల కోర్కెలు, ఉద్యమాలతో పాటు, రాజకీయ పార్టీల, సంస్థల అంగీకారం, రాజ్యాంగపరమైన ఆమోదం తప్పనిసరి. అలాంటి అన్ని రకాల మద్దతులను కూడగట్టిన చట్టాలలో సబ్‌ప్లాన్ చట్టం ఒకటి. మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు సబ్‌ప్లాన్ ఉద్యమంతో, చట్టం రూపకల్పనతో పాటు, దాని అమలు విషయంలో భాVýæమున్న వారిలో నేనూ ఒకరిని. సబ్‌ప్లాన్ అమలు కోసం జరిగిన యత్నాలలో భాగంగా సబ్‌ప్లాన్ నిధుల దారి మళ్ళింపు, అమలులో లోపాలపై నేను రాసిన వార్తాకథనం 2001 మార్చి 29న ఒక దినపత్రికలో అచ్చయింది. అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ వార్తాకథనాన్ని ఆనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో స్వయంగా పేపర్ని చూపించి మరీ ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాన్ని చరిత్ర మరువదు. శాసనసభలో ఆనాడు వైఎస్ ప్రస్తావించడంతో అది రాజకీయ ఎజెండాలోకి చేరింది. సబ్‌ప్లాన్ అవసరం, దాని అమలు తీరుతెన్నులపై మొదట గళం విప్పింది వైఎస్ఆర్ అనే వాస్తవాన్ని ఎన్నటికీ విస్మరించడానికి లేదు. 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్’ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ని కలిసి సమర్థంగా సబ్‌ప్లాన్ అమలుచేయాలని అభ్యర్థించాం. ఒకవైపు ప్రభుత్వంతో ఈ విషయమై సంప్రదిస్తూనే, రెండోవైపు సబ్‌ప్లాన్ విషయంలో చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ క్రమంలోనే 2007లో సీపీఎం నాయకత్వంలోని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో సబ్‌ప్లాన్ అమలు కోసం అప్పటి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు నేతృత్వంలో అక్టోబర్‌లో నిరాహార దీక్షలు జరిగాయి. ఆ సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ స్పందించి, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు కోసం నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. ఆ తర్వాత నోడల్ ఏజెన్సీతో పాటు సబ్ ప్లాన్ చట్టం కోసం విశాలమైన ఉద్యమం జరిగింది. దాదాపు 150కి పైగా సంఘాలతో ఏర్పాటైన ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 2012 మార్చిలో 72 గంటల దీక్ష జరిగింది. ఇందులో కేవీపీఎస్, డీబీఎఫ్, సీడీఎస్, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్ ఫోరం, దళిత, ఆది వాసీ, సంఘాలతో పాటు సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్, బీజేపీ, వైఎస్ ఆర్సీపీ, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ పార్టీలు తమ మద్దతును తెలియజేశాయి. వీటన్నింటితో పాటు, అధికార కాంగ్రెస్ పార్టీలోని ఎస్సీ, ఎస్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్యమానికి మద్దతు తెలిపారు. దీనితో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 2012 డిసెంబర్ 2న చట్టం అసెంబ్లీ ఆమోదం పొందింది. గెజిట్‌లో జనవరి 23 నుంచి అమలులోకి వచ్చింది. ఈ ఉద్యమ ప్రస్థానంలో చాలామంది వ్యక్తులతో పాటు సంస్థలూ పాల్గొన్నాయి. ఆ వివరాలన్నీ ఇక్కడ ప్రస్తావించడం సాధ్యం కాదు. అయితే చట్టం ఏర్పడిన నేపథ్యం అర్థం కావడానికే ఈ ప్రాథమిక విషయాల ప్రస్తావన. సబ్‌ప్లాన్ అనే ఒక అంశం రూపొందడానికి చారిత్రక నేపథ్యం ఉంది. ఈరోజు షెడ్యూల్డ్ కులాలుగా పిలువబడుతున్న అంటరాని కులాల సామాజిక, విద్య అభివృద్ధి కోసం ప్రత్యేక పాఠశాలలు, పథకాలు ఉండాలని మొదట మాట్లాడిన సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు ఫూలే. బ్రిటిష్ ప్రభుత్వం 1882లో ఏర్పాటు చేసిన హంటర్ కమిషన్‌కు ఆయన ఇచ్చిన విజ్ఞాపనలో అంటరాని కులాలైన మహర్, మాంగ్, మాతంగ్లకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయా లని కోరారు. భారతదేశంలో ఇది మొట్టమొదటి ఆలోచన. ఆ తర్వాత సాహూ మహారాజ్, శాయాజీరావు గైక్వాడ్‌లు రిజర్వేషన్లు మొదలు పెట్టారు. అనంతర కాలంలో భారతదేశ చిత్రపటం మీదకి వచ్చిన బాబాసాహెబ్ అంబేడ్కర్ 1927లో బొంబాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న సమయంలో కౌన్సిల్లో మాట్లాడుతూ, అణగారిన వర్గాలైన అంటరాని కులాల పిల్లల విద్యాభివృద్ధికి ప్రత్యేక హాస్టల్స్ నిర్మించాలని ప్రతిపాదించారు. నేటి మన రెసిడెన్షియల్ పాఠశాలల వ్యవస్థకు అదే పునాది. అలాగే 1932 సెప్టెంబర్ 24న గాంధీ–అంబేడ్కర్ల మధ్య కుదిరిన పూనా ఒడంబడికలోని 9వ అంశంలో అంటరాని కులాల విద్యార్థుల విద్య కోసం ప్రతి రాష్ట్రం, కేంద్రం కళాశాల నిధులను కేటాయించాలని ఉంది. ఇది ఒక రకంగా మొట్టమొదటి బడ్జెట్ ప్రస్తావన. 1944లో బాబాసాహెబ్ అంబేడ్కర్ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, విదేశీ విద్య ప్రోత్సాహం, ఉద్యోగాల రిజర్వే షన్లు సాధించారు. వీటన్నింటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 46ను చేర్చి ప్రభుత్వాలు షెడ్యూల్డ్ కులాల, తెగల అభివృద్ది కోసం సత్వరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అయితే ప్రప్రథమ ప్రధాని నెహ్రూ కాలంలో ఇటువైపు అడుగులు పడలేదు. 1970 తర్వాత అప్పటి ప్రధాని ఆనాటి రాజకీయ, ఉద్యమ ప్రభావాలతో 1974 ఎస్సీ సబ్‌ప్లాన్‌ను, 1980లో ఎస్సీ కాంపోనెంట్ ప్లాన్‌ను ప్రారంభించారు. 2006లో ఎస్సీ కాంపోనెంట్ ప్లాన్‌ను ఎస్సీ సబ్ ప్లాన్‌గా మార్చారు. అయితే ఈ పథకాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్.రాజశేఖర్ రెడ్డి లేవ నెత్తేంత వరకు దీని గురించిన అవగాహన ఎవ్వరికీ లేదనడంలో సందేహం అక్కర్లేదు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చట్టం ఏర్పడిన తర్వాత కర్ణాటకలో, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లలో ఇటువంటి చట్టాలు అమలులోకి వచ్చాయి. పంజాబ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ క్రమంలో.. ఈ ఏడాదితో కాల పరిమితి తీరిన ‘ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని మరో ఇరవై ఏళ్లు పొడిగిస్తూ ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహర్రెడ్డి ఆర్డినెన్స్‌కు చొరవ చూపారు. దళితుల, ఆదివాసుల అభివృద్ధికి... ప్రత్యేకించి నివాస, మౌలిక సదుపాయాల, విద్యావకాశాల మెరుగు కోసం, ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలను చేపట్టడం ద్వారా వారు ప్రగతి సాధించడానికి ఈ చట్టం పొడిగింపు ఉపకరిస్తుంది. ఈ ఉన్నత లక్ష్యసాధనలో మరిన్ని ముందడుగులు పడాలని ఆశిద్దాం. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
దళిత ఉద్యమాలకు ఉగ్రరూపం
యాభై ఏళ్ల కింద మహారాష్ట్రలో మొదలైన ‘దళిత్ పాంథర్’ ఉద్యమ స్ఫూర్తి నేటికీ కొనసాగుతోంది. భారతదేశ ప్రజా ఉద్యమాల్లో, ప్రత్యేకించి దళిత ఉద్యమాల్లో ఇది ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నది. దళిత్ పాంథర్ వివిధ పద్ధతుల్లో దాడులనూ, దౌర్జన్యాలనూ ప్రతిఘటించి, దళితుల్లో ఒక భరోసాను నింపింది. గ్రామాల్లో కులతత్వ దాడులను ప్రత్యక్షంగా ఎదుర్కొని, దళితులకు ఒక రక్షణ కవచంగా నిలిచింది. ఇది మహారాష్ట్రకే పరిమితం కాలేదు; దేశంలోని అన్ని రాష్ట్రాల దళితుల మీద ప్రభావాన్ని కలిగించింది. దానితో పాటు, మరాఠా దళిత సాహిత్యాన్ని దేశానికే మార్గదర్శకంగా మలచడంలో ఈ ఉద్యమం పాత్ర మరువలేనిది. ఆ ప్రభావం ఇతర భాషల దళిత సాహిత్యం మీద కూడా పడింది. శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ స్పీకర్, మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూర్చున్నారు. చర్చలు సాగుతున్నాయి. అంతలో సందర్శకుల గ్యాలరీలో ఏదో అలజడి. ఇద్దరు యువకులు భాస్కర్ గవలి, నారాయణ్ మోరే సభలోకి అగ్నిగోళాలు విసిరారు. అగ్నిగోళాలు విసురుతుండగానే ‘బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్ధిల్లాలి’ అంటూ నినాదాలతో సభ దద్దరిల్లింది. అగ్నిగోళాలు అంటే, కిరోసిన్‌లో ముంచిన గుడ్డతో చేసిన బంతులు. రాష్ట్ర మంత్రి శంకర్ రావు పాటిల్ రాజీనామ చేయాలని కూడా ఆ యువకులు నినదించారు. అంతేకాకుండా, దళితులకు ప్రత్యేక దేశం కావాలంటూ ప్రచురించిన కరపత్రాలను సభలోకి విసిరారు. ఇది 1972 జూన్ 12న మహారాష్ట్ర శాసనసభలో జరిగిన ఘటన. స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ ఇండియా పార్లమెంటులో పొగబాంబులు వేసి నినదించిన భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ల తర్వాత మళ్ళీ ఈ దళిత నాయకులే అటువంటి వీరోచితమైన పనికి పూనుకున్నారు. ఇది జరిగి యాభై సంవత్సరాలు గడిచాయి. ఈ సంఘట నకు ఒక సంస్థ ఆవిర్భావం ప్రధాన కారణం. దాని పేరే, ‘దళిత్ పాంథర్’! ఆ సంస్థ కేవలం మహారాష్ట్రలోనే కాదు, భారతదేశ ప్రజా ఉద్యమాల్లో, ప్రత్యేకించి దళిత ఉద్యమాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నది. అందుకే ఆ సంస్థ స్వర్ణోత్సవాలను దేశ వ్యాప్తంగా దళితులు ఒక ఉద్యమ స్ఫూర్తితో జరుపుకొంటున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన దళిత పాంథర్ స్వర్ణోత్సవాలను ప్రారంభించే అవకాశం నాకు రావడం ఒక గొప్ప అనుభూతిని కలిగించింది. అంతకుమించిన గొప్ప అనుభవాన్నిచ్చింది. ఇద్దరు దళిత యువకులు మహారాష్ట్ర అసెంబ్లీలో అగ్నిగోళాలు విసిరేంతటి సాహసానికి పూనుకోవడానికి రెండు దుస్సంఘటనలు కారణమయ్యాయి. ఒకటి, పుణే జిల్లాలోని బావ్డా గ్రామంలో దళితులను మిగతా కులాలన్నీ ఏకమై వెలివేశాయి. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శంకర్ రావు సోదరుడు శహాజిరావు పాటిల్ దీనికి నాయకత్వం వహించారు. రెండవది, పర్భని జిల్లా భాహారా గావ్‌లో ఒక అగ్రవర్ణానికి చెందిన బావి నుంచి ఇద్దరు దళిత మహిళలు నీళ్ళు తోడుకొని తాగుతున్నందుకు వారిని పట్టుకొని నగ్నంగా ఊరేగించారు. ఇది వారి గుండెల్ని మండించింది. ఈ సాహసం చేయడానికీ, దళిత పాంథర్ ఉద్యమం ప్రారంభం కావడానికీ ఆనాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులే కారణం. అప్పటి కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇలయపెరుమాళ్ కమిటీ నివేదిక దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న అత్యాచారాల వివరాలను 1969లో బయటపెట్టింది. 1965లో విచారణ ప్రారంభించిన కమిటీ 1969 జనవరి 30 నాడే నివేదికను పార్లమెంటుకు అందజేసింది. ఆ నివేదిక పార్లమెంటును కుదిపివేసింది. అందులో మహారాష్ట్రకు సంబంధించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇవి యువకులనూ, రచయితలనూ బాగా కదిలించాయి. వీటికి వ్యతిరేకంగా ఒక ప్రతిఘటనను నిర్మించాలనీ, ప్రభుత్వాలకు ఒక గుణపాఠం నేర్పాలనీ ఆ కార్యకర్తలు నిర్ణయించారు. ఈ ఉద్యమ ప్రయత్నంలో జేవీ పవార్, దయా పవార్, అర్జున్ డాంగ్లే, నామ్‌దేవ్ దసాల్, ప్రహ్లద్ చార త్వంకర్లను మొదటి వ్యక్తులుగా చెబుతున్నారు. ‘ముందుగా ఒక ప్రకటన చేయాలని నిర్ణయించుకుంటున్నాం. దళితులపైన జరుగుతున్న దాడులనూ, దౌర్జన్యాలనూ వివరిస్తూనే, దళితులపై జరుగుతున్న దౌర్జన్యాలను, అన్యాయాలను ప్రభుత్వం అరికట్టకపోతే, చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుంది’ అని ఆ ప్రకటన స్పష్టం చేసింది. దానిమీద రాజా ధాలే, నామ్‌దేవ్ దసాల్, అర్జున్ డాంగ్లే, భీంరావు షిర్వాలే, ఉమాకాంత్ రణధీర్, గంగాధర్ పంతాల్నే, వామన్ నింబల్కర్, మోరేశ్వర్ వహానే సంతకాలు చేశారు. ఆ విధంగా ప్రారంభమైన దళిత్ పాంథర్ ఉద్యమం 1972 నుంచి 1977 వరకు మరెన్నో ఉద్యమాలకు ఊపిరిపోసింది. ఇదే స్ఫూర్తితో అక్కడక్కడా అనేక దళిత పోరాటాలు సాగాయి. దారుణమైన నిర్బంధాన్నీ, అరెస్టులనూ ఈ ఉద్యమం ఎదుర్కొన్నది. అయితే వివిధ పద్ధతుల్లో దాడులనూ, దౌర్జన్యాలనూ ప్రతిఘటించి, దళితుల్లో ఒక భరోసాను నింపింది. ప్రభుత్వాలను తమ తప్పు తెలుసుకునేటట్టు చేయగలిగింది. కులతత్వాన్ని బోధించే హిందూ శక్తులను ప్రతి ఘటించింది. గ్రామాల్లో కులతత్వ దాడులను ప్రత్యక్షంగా ఎదుర్కొని, దళితులకు ఒక రక్షణ కవచంగా నిలిచింది. 1992 ఆగస్టు 12న ఎరగావ్లో ఒక దళిత రైతును దేవుడికి బలిచ్చిన దారుణమైన అకృత్యం జరిగింది. రామ్‌దాస్ నార్నవరె అనే దళిత రైతు ఎనిమిది ఎకరాల ఆసామిగా ఉండి, ఆత్మగౌరవంతో తల ఎత్తి నిలబడడం కులతత్వ వాదులకు నచ్చలేదు. అతడిని అత్యంత దారుణంగా ముక్కు, చెవులు కోసి, గొంతు కోసి చంపేశారు. పోస్టు మార్టమ్, పోలీసు కేసు కూడా లేకుండా అతని దేహంతో పాటే ఈ దేశ దళితుడి ఆత్మగౌరవాన్ని భూమిలో పాతేశారు. ఇది తెలిసిన దళితులు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టారు. ప్రభుత్వం దిగివచ్చి శవాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టమ్ నిర్వహిస్తే, నిజాలు బట్టబయలయ్యాయి. అప్పుడు నిందితులను అరెస్టు చేయక తప్పలేదు. పుణే జిల్లా భంగావ్ గ్రామంలో 1973 సెప్టెంబర్ 17న దళిత్ పాంథర్స్ కార్యకర్తలు జరిపిన బహిరంగ సభ ఆ గ్రామంలోని దళితులను ఏకం చేసింది. రాజ్‌గురు తహశీల్‌లోని అస్థేడ్ గ్రామంలో దళిత రైతుకు చెందిన 30 ఎకరాల భూమిని సాగుచేయకుండా, తుపాకితో బెదిరించిన భూస్వామిని నిలదీసి ఆ భూమిని ఇప్పించారు. దళిత్ పాంథర్‌కు చెందిన 92 మంది యువకులు ప్రత్యక్షంగా గ్రామంలోకి వెళ్ళారు. వాళ్ళ మీద అగ్రకులాలు దాడిచేశాయి. వాళ్ళను ప్రతి ఘటించి విజయం సాధించారు. ఇట్లా ఎన్నో సంఘటనల్లో తమదైన మార్గంలో ఉద్యమాన్ని నిర్వహించారు. ఒకానొక దశలో యావత్ దేశానికే మార్గదర్శకంగా నిలిచారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యక్షంగా నిలబడి పోరాటం సాగించడం వల్ల దళితుల్లో ఒక విశ్వాసం ఏర్పడింది. అప్పటికి వివిధ పార్టీలలో ఉన్న దళిత నాయకులు నిర్లిప్తంగా ఉండడం, ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేడ్కర్ స్థాపించిన భారత రిపబ్లికన్ పార్టీ నాయకత్వ అవకాశవాదాన్ని ఈ ఉద్యమం బహిర్గత పరిచింది. శివసేన, కాంగ్రెస్ పార్టీలతో అంటకాగిన ఆర్పీఐ నాయకత్వం దళితులకు దూరమైంది. ఆనాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ పుణే పర్యటనలో దళిత్ పాంథర్స్ ప్రతిఘటనల పిలుపుతో తన ప్రయాణాన్నే మార్చుకోవాల్సి వచ్చింది. దళిత్ పాంథర్ ఉద్యమం ఒక రకంగా నాటి కుల సమాజాన్నీ, దౌర్జన్య కాండనూ సవాల్ చేసింది. ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీలతో అంటకాగకుండా స్వతంత్ర మార్గంలో సాహసోపేతంగా ఉద్యమాన్ని నడిపింది. ఇది మహారాష్ట్రకే పరిమితం కాలేదు. గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తమిళ నాడులలో అన్ని రాష్ట్రాల దళితుల మీద ప్రభావాన్ని కలిగించింది. దానితో పాటు, మరాఠా దళిత సాహిత్యాన్ని దేశానికే మార్గదర్శకంగా మలచడంలో ఈ ఉద్యమం పాత్ర మరువలేనిది. ఆ ప్రభావం ఇతర భాషల దళిత సాహిత్యం మీద కూడా పడింది. ఎంతో మంది దళిత రచయితలు రాసిన తమ స్వీయ చరిత్రలు నూతన సాహిత్య విలు వలకూ, ధోరణులకూ పునాదులు వేశాయి. గత యాభై ఏళ్ళలో దళితుల జీవితాల్లో మార్పు రాలేదని అనలేం. కానీ దాడులు, అత్యాచారాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే, దళిత సమస్యలే అజెండాగా, రాజకీయ అవకాశ వాదంలేని ఒక స్వతంత్ర దళిత ఉద్యమం మళ్ళీ ఆరంభం కావాల్సిన సమయం ఆసన్నమైంది. - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
ఆయుధ వ్యాపారమే అసలు ముద్దాయి
ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని వెనుక కొన్ని అదృశ్య శక్తులు ఉంటాయి. ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్ల మధ్య సాగుతున్న యుద్ధానికి పైకి కనిపిస్తున్న కారణాలకు మించి మరోటున్నది. అమెరికా, మరికొన్ని ఇతర దేశాలూ చేస్తున్న ఆయుధ వ్యాపారమే ఇందుకు అసలు కారణం. ఉక్రెయిన్‌కి రష్యా బూచిని చూపించి, 2014 నుంచి ఇప్పటి వరకు అమెరికాతోపాటూ కెనడా, చెక్ రిపబ్లిక్, పోలండ్, టర్కీ, యూఏఈ, బ్రిటన్ వంటి దేశాలు ఉక్రెయిన్‌తో ఆయుధాల వ్యాపారం చేస్తున్నాయి. ఈ దేశాలన్నీ రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోవాలని ఇవ్వాళ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. వీటికి చిత్తశుద్ధి ఉంటే ఆయుధ వ్యాపారాన్ని ఆపాలి. ఆయుధ వ్యాపారం ఉన్నంత కాలం... ప్రపంచంలో యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ‘‘యుద్ధం ఒక పెద్ద వ్యాపారం. డబ్బు పెద్ద మొత్తంలో చేతులు మారుతుంటుంది. అంతే కాదు, యుద్ధం ద్వేషాన్నీ, భయాన్నీ, అపనమ్మకాన్నీ పెంచు తుంది. ఈ యుద్ధాల్లో ఎంతో మంది సైనికులు, సాధారణ ప్రజలు అనివార్యంగా అనేక విధాలైన బాధలకు; మానసిక, శారీరక గాయాలకు... చివరకు మృత్యువుకు బలవుతారు’’ అంటూ బ్రిటిష్ సంగీత విద్వాంసుడు జాన్ అండర్సన్ యుద్ధం గురించిన ఒక సజీవ సత్యాన్ని మన కళ్ళ ముందుంచారు. తన యుద్ధాలతో యూరప్‌ను గడగడ లాడించిన ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టి ‘యుద్ధం హంత కుల వ్యాపారం’ అని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో రాచరికాలు పోయాయి, నియంతృత్వాల స్థానంలో ప్రజాస్వామ్యం నెలకొన్నది. ఈ ఆధునిక యుగంలో యుద్ధం అవసరం మారిపోయింది. 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు బ్రిటిష్ వ్యాపారులు భారత దేశంతో పాటు, ప్రపంచం మీద ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి డబ్బు, వ్యాపారంతో పాటు ఆయుధాలనూ నమ్ముకున్నారు. అయితే 1945ల తర్వాత, అంటే రెండవ ప్రపంచయుద్ధం అనంతరం చాలా దేశాలు బ్రిటిష్, ఫ్రెంచి, డచ్ తదితర సామ్రాజ్య వాద విస్తరణ వాదుల నుంచి విముక్తి పొంది, ప్రజాస్వామ్య ప్రభు త్వాలను ఏర్పరుచుకున్నాయి. ఇక ప్రపంచం శాంతియుతంగా సహ జీవనం సాగిస్తుందని అనుకున్నాం. కానీ యుద్ధాలు ఆగలేదు. గతంతో పోలిస్తే యుద్ధాలు తక్కువ జరిగినా ఆయుధ వ్యాపారం ఆగలేదు. ప్రపంచంలోని 36 దేశాలు మినహా మిగతా అన్ని దేశాలూ పెద్ద ఎత్తున సైన్యాలు కలిగి ఉన్నాయి. ఇవన్నీ చాలా చిన్న దేశాలు. కానీ మిగతా దేశాలన్నీ కూడా సైన్యాన్నీ, ఆయుధాలనూ వీలైతే అణ్వాయుధాలనూ కలిగి ఉన్నాయి. అంతర్జాతీయ న్యాయవేదికలు, నిర్దిష్టమైన సరిహద్దులు, ప్రజలు ఎన్నుకుంటున్న ప్రభుత్వాలు ఉన్న సమయంలోనూ యుద్ధాలు తప్పవా? వాస్తవానికి యుద్ధాలు లేని ప్రపంచాన్ని నిర్మించుకునేంత ప్రజాస్వామిక భావజాలం నెలకొని ఉన్నది. కానీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. నిజానికి యుద్ధాలు జరుగుతున్నాయనడం కంటే యుద్ధాలు చేయిస్తున్నారు అనడం సబబుగా ఉంటుంది. ప్రస్తుతం మనం ప్రతిరోజూ ఉక్రెయిన్‌పై రష్యా దాడిని, దాని పర్యవసానాలను చూస్తున్నాం. ఇప్పటికే లక్షలాది మంది నిరాశ్రయు లయ్యారు. ఎంతోమంది ఆప్తులను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో కూరుకుపోయారు. చివరకు మన తెలుగు విద్యార్థులూ ఎంతో మంది నరకాన్ని అనుభవించారు. రష్యా – ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో పాత్రధారులుగా రష్యా, ఉక్రెయిన్లే కనిపిస్తున్నా... కని పించని కుట్రలు చేస్తోన్న అగ్రరాజ్యం అమెరికా... ఈ యుద్ధంలో ప్రప్రథమ భాగస్వామి అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అమెరికాతో సహా అనేక యూరప్ దేశాలూ ఈ యుద్ధంలో తమ వంతు మంటలు రాజేసినవే! ఈ యుద్ధానికి అసలు కారణం వ్యాపారం. ఎందుకంటే ఉక్రె యిన్‌కి రష్యా బూచిని చూపించి, అమెరికా తన ఆయుధ వ్యాపారాన్ని సమర్థంగా కొనసాగించుకుంటోంది. ఉక్రెయిన్‌కి ఆయుధాలు అంట గట్టడంలో అమెరికా చాలాకాలంగా సఫలమౌతోంది. రష్యాతో ఉక్రె యిన్ ఘర్షణలు మొదలైనప్పటి నుంచి అమెరికాతో పాటు అనేక దేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకోవడం పెరిగింది. 2014 నుంచి, ఇప్పటి వరకు కెనడా, చెక్ రిపబ్లిక్, పోలండ్, టర్కీ, యూఏఈ, బ్రిటన్ దేశాలు ఉక్రెయిన్‌తో ఆయుధాల వ్యాపారం చేస్తున్నాయి. ఇందులో అమెరికా భాగమే అధికం. 1993లో యుఎస్ఎస్ఆర్ నుంచి ఉక్రెయిన్ విడిపోయినప్పుడు ఆ దేశం రక్షణ బడ్జెట్ స్థూల జాతీయోత్పత్తిలో 0.35 శాతం. అంటే 0.12 బిలియన్ డాలర్లన్నమాట. 2014లో అది 3 బిలియన్ డాలర్లకు పెరిగి, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 2.25 శాతం వరకు పెరిగింది. అంటే దాదాపు 19 రెట్లు రక్షణ బడ్జెట్ పెంచుకోవాల్సి వచ్చింది. 2015 నాటికి 2.96 బిలియన్ డాలర్ల (జీడీపీలో 3.25 శాతం)కు చేరింది. 2019 వచ్చేసరికి ఈ కేటాయింపులు 5.23 బిలియన్ డాలర్ల (జీడీపీలో 4 శాతం)కు చేరుకున్నాయి. 2014 సంవత్సరంలో రష్యాతో ఘర్షణలు ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోవడం ప్రారంభమైంది. ఈ ఘర్షణల వల్ల 2014లో 28.6 శాతం ఉన్న ఉక్రెయిన్‌లోని పేదరికం 2016కి వచ్చేసరికి 58.6 శాతానికి పెరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి మరింత దిగజారిపోయింది. రెండేళ్ళ క్రితం ప్రపంచాన్ని చుట్టుముట్టిన కోవిడ్ కాలంలో ఎన్నో పరిశ్రమలు దెబ్బతిన్నాయి. కానీ ఆయుధ కర్మాగారాలు లాభాలు గడించాయి. స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో పనిచేస్తున్న స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన లెక్కల ప్రకారం ప్రపంచంలో ఉన్న వంద అగ్రశ్రేణి కంపెనీలు అత్యధిక లాభాలను ఆర్జించినట్టు తెలియజేసింది. ఈ వంద కంపెనీల్లో అమెరికాకి చెందినవే 48 ఉన్నాయంటే అమెరికా ఆయుధ వ్యాపారం ఎటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా ప్రపంచంలో ఆయుధాలు ఎగుమతి చేస్తున్న పది అగ్రదేశాల్లో అమెరికాది అగ్రస్థానం. 2016–2020 వరకు సేకరించిన గణాంకాల ప్రకారం ప్రపంచంలో ఆయుధాల అమ్మకంలో అమెరికా భాగం 37 శాతంగా ఉంది. 20 శాతంతో రెండో స్థానంలో రష్యా ఉంది. 2011–15 వరకు అమెరికా భాగస్వామ్యం 32 శాతంగా మాత్రమే ఉండేది. 2011–2015 మధ్య రష్యా ఆయుధ వ్యాపార అమ్మకాలు 26 శాతంగా ఉండేవి. దీన్ని బట్టి ఆరు శాతం అమ్మకాలను రష్యా కోల్పోయింది. ఫ్రాన్స్ (8.2 శాతం), జర్మనీ (5.5 శాతం) వరుసగా మూడు, నాలుగు స్థానాలను ఆక్రమించాయి. చైనా (5), బ్రిటన్ (6), స్పెయిన్ (7), ఇజ్రాయెల్ (8), దక్షిణ కొరియా(9), ఇటలీ (10) ఆయుధ వ్యాపారంలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. డబ్బుల్లో ఆయుధ వ్యాపారాన్ని లెక్కిస్తే, 2020లో ప్రపంచం మొత్తం ఆయుధాలు, రక్షణ మీద పెట్టిన ఖర్చు 1.951 ట్రిలియన్ డాలర్లు. ఇందులో అమెరికా ఒక్కటే చేసిన ఖర్చు 778 బిలియన్ డాలర్లు. ఖర్చులో చైనా 252 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉంది. మనదేశం 72.9 బిలియన్ డాలర్ల ఖర్చుతో మూడవ స్థానాన్ని ఆక్రమించింది. ఆ తర్వాతి స్థానాల్లో రష్యా (61.7 బిలియన్ డాలర్లు), బ్రిటన్ (59.2 బిలియన్ డాలర్లు), సౌదీ అరేబియా (57.5 బిలియన్ డాలర్లు), జపాన్ (49.1 బిలియన్ డాలర్లు), దక్షిణ కొరియా (45.7 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. అయితే ఇందులో ఒక ముఖ్యమైన అంశమేమిటంటే అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, రష్యా లాంటి దేశాలు వ్యాపారం చేసుకోవడానికి పెట్టుబడులు పెట్టి అంతకంతకు ఎక్కువ లాభాలు సంపాదిస్తున్నాయి. కానీ ఇండియా లాంటి పేదదేశం ఆయుధాలను కొనడానికి మాత్రమే లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. ఆయుధాలను దిగుమతి చేసుకుంటోన్న దేశాల్లో సౌదీ అరేబియా, భారత్, ఈజిప్టు, ఆస్ట్రేలియా, చైనా, అల్జీరియా, దక్షిణ కొరియా, ఖతార్, యూఏఈ, పాకిస్తాన్‌లు వరుసగా మొదటి పది స్థానాల్లో ఉన్నాయి. అంటే అమెరికా యూరప్ దేశాలు తమ ఆయుధాల వ్యాపారానికి ఆసియాను కేంద్రంగా ఉప యోగించుకుంటున్నాయన్నమాట! యుద్ధం ఏదైనా అది లక్షలాది మంది ప్రజల ప్రాణాల హననం. కోట్లాది మందిని దిక్కులేని వారిగా తయారుచేసే దుర్మార్గ వ్యాపార వ్యసనం. యుద్ధం వద్దనుకుంటే ఆయుధ వ్యాపారం ఆగిపోవాలి. ఆయుధాల వ్యాపారం కొనసాగినంత కాలం ఏదో ఒక మూల యుద్ధ జ్వాలలు రగులుతూనే ఉంటాయి. కాదు యుద్ధాన్ని రగిలిస్తూనే ఉంటారు. అందులో పేద దేశాల ప్రజలెప్పుడూ బలౌతూనే ఉంటారు. ఇదే ప్రతి యుద్ధం నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం. - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
సాధికారత సాధించని ఒడంబడిక
ఎన్నికల్లో ఇప్పుడు రిజర్వుడు స్థానాలుగా ప్రతిఫలించిన పూనా ఒడంబడిక జరిగి తొమ్మిది దశాబ్దాలు గడిచింది. స్వాతంత్య్ర పూర్వ భారతదేశంలో అంబేడ్కర్‌కూ, మహాత్మాగాంధీకీ కుదిరిన ఈ ఒడంబడిక గట్టి వాదోపవాదాలకు కేంద్రబిందువైంది. అంటరాని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, దీనికి నామినేషన్ పద్ధతి కాకుండా, వాళ్ళ ఓట్ల ద్వారా వాళ్లే ప్రతినిధులుగా ఎన్నిక కావాలని అంబేడ్కర్ వాదించారు. ఇది హిందూ సమాజాన్ని మరింత చీల్చుతుందని గాంధీజీ భావించారు. ఈ నేపథ్యంలో ఇద్దరిమధ్యా కుదిరిన, కుదిర్చిన రాజీయే పూనా ఒడంబడిక. ఈ ఒడంబడిక రావడానికి కారణమైన ముందటి, అనంతర పరిణామాలు స్వాతంత్య్ర పోరాటానికి సమాంతరమైన చరిత్ర! ‘‘భారత సామాజిక నిర్మాణం రెండు ముఖ్యమైన భాగాలుగా విభజితమైంది. అందులో ఒకటి వర్ణం, రెండవది అవర్ణం. వర్ణంలో ద్విజులు, ద్విజులు కానివారు ఉంటారు. అవర్ణంలోని వారిని అంటరాని తెగలు, నేరస్థ, ఆదిమ తెగలుగా వర్గీకరించారు. అయితే వర్ణంలోని ద్విజులు, ద్విజులు కానివారి మధ్య విభజన ఉంటుంది. అది పెద్దగా కనిపించని సన్నని పొర. అవర్ణంలోని ఆదిమ తెగలు ఎవరికి వారుగానే జీవిస్తారు. వర్ణంలోని కులాలతో వీరికి అంతగా సంబంధాలుండవు. అయితే వర్ణా నికి బయట అవర్ణులుగా ఉన్న అంటరాని కులాలకు, మిగతా సమా జానికీ మధ్య ఉన్న వైరుధ్యం ఇనుప కంచె లాంటిది. దానిని ఛేదిం చడం అంత సులువు కాదు.’’ బాబాసాహెబ్ అంబేడ్కర్ 1940కి ముందే చేసిన విశ్లేషణ ఇది. ఆ రోజు అంటరాని కులాలుగా పిలిచిన నేటి షెడ్యూల్డ్ కులాలు, రాజకీయ పరిభాషలో దళితులు ఈ సమా జంలో ఇప్పటికీ భాగం కాలేకపోయారు. భారతదేశంలో ప్రజా ప్రభుత్వాల ఏర్పాటు, ప్రజాప్రాతినిధ్యం, ప్రజాస్వామ్య స్థాపన అవగాహనల కోసం 1919లో భారత దేశం సందర్శించిన సౌత్‌బరో కమిటీ ముందు ఒక ముప్ఫై యేళ్ళ యువ కుడైన అంబేడ్కర్, అమెరికాలో చదివిన ఉన్నత విద్యావంతుడిగా సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. భారతదేశంలో కులాల మధ్య ఉన్న అంతరాలు, ముఖ్యంగా అంటరాని కులాలకూ, ఇతర కులాలకూ మధ్య ఉన్న అసమానతలు ప్రభుత్వాల ఏర్పాటులో ప్రభావం చూప కూడదంటే, అంటరాని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించా లని, దీనికి నామినేషన్ పద్ధతి కాకుండా, వాళ్ళ ఓట్ల ద్వారానే వాళ్ళ ప్రతినిధులుగా ఎన్నిక కావాలని, ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో జరగా లని సూచించారు. అంటే సమాజంలోని విద్యావంతులకు, సంపన్ను లకు, భూస్వాములకు, వ్యాపారస్తులకు మాత్రమే ఓటు హక్కు కల్పిం చడం సరిపోదని, కుల, మత, ప్రాంత భేదం లేకుండా ప్రతి వయో జనుడికీ ఓటు హక్కు కల్పించాలని సౌత్ బరో కమిటీ ముందు ప్రతిపాదించాడు ఆ యువకుడు. ఆ తర్వాత సైమన్ కమిషన్ ముందు, 1930–32 మధ్య జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లలోనూ ఆయన ఇదే అంశాన్ని మరింత శాస్త్రీయ పద్ధతిలో వాదించారు. అప్పటికే ముస్లింలకు, క్రిస్టియన్లకు అమలు జరుగుతున్న ప్రత్యేక ఎన్నిక విధా నాన్ని, అంటే తమ అభ్యర్థులకు తామే ఓట్లు వేసుకునే పద్ధతిని అప్పుడు డిప్రెస్డ్ క్లాసెస్‌గా పిలుస్తోన్న అంటరాని కులాలకు వర్తిం పజేయాలని వాదించారు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశాలకు గాంధీజీ హాజరుకాలేదు. బాబాసాహెబ్ అంబేడ్కర్ మొదటి సభలో ఈ విషయంపై చేసిన ప్రతిపాదనను విని బెంబేలెత్తిపోయిన గాం«ధీజీ, రెండో సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశంలో గాంధీజీ అత్యంత శ్రద్ధపెట్టిన అంశం డిప్రెస్డ్ క్లాసెస్‌కు ప్రత్యేక ఎన్నిక విధానాన్ని వ్యతిరేకించడమే. అంబేడ్కర్, గాం«ధీ మధ్య ఈ విషయమై తీవ్ర వాదోపవాదాలు జరి గాయి. అంటరాని కులాలను తరతరాలుగా వెలివేశారని, హిందువు లలో భాగంగా వారిని ఎన్నడూ చూడలేదని, ఆర్థిక, సామాజిక అణచివేతకు గురిచేశారని అంబేడ్కర్ వాదించారు. ఈ కారణంగానే వారికి రాజకీయ హక్కులు, ప్రాతినిధ్యం కావాలని; వారి ప్రతినిధు లను వారే ఎన్నుకునే అవకాశం కల్పించాలని కుండబద్దలు కొట్టారు. లేదంటే, రాజకీయ స్వేచ్ఛకు బదులు దళితులు తరతరాల బానిసత్వా నికి బలి కావాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. అంబేడ్కర్ సూచించి నట్టుగా, అంటరాని కులాలకు ప్రత్యేక ఎన్నిక విధానంలో తమ అభ్యర్థులను తామే ఎన్నుకునే విధానానికి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. అందుకు అనుగుణంగా నాటి బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్ ఒక ఉత్తర్వును జారీచేశారు. దానిపేరే కమ్యూనల్ అవార్డు. అయితే, గాంధీ దీనిని జీర్ణించుకోలేకపోయారు. 1932, మార్చి 11న బ్రిటిష్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఒక లేఖ రాశారు. ‘అంటరాని కులాలకు ప్రత్యేక ఓటింగ్ విధానం కల్పించి, వారి అభ్యర్థిత్వాన్ని వారే ఎన్నుకునే అవకాశాన్ని కల్పిస్తే, నేను ఆమరణ దీక్షకు పూనుకుం టాను’ అన్నారు. రామ్సే మెక్‌డొనాల్డ్ గాంధీ లేఖకు, ‘‘మీ ఉద్దేశం హిందువులకు, అంటరాని కులాలకు కలిపి ఓటింగ్ ఉండాలని కాదు. హిందువుల మధ్య ఐక్యత సాధించాలని కాదు. అంటరాని కులాల తరఫున శాసనసభలో నలుగురు నిజమైన ప్రజాప్రతినిధులు రాకుండా అడ్డుకోవడమే తప్ప మరొకటి కాదు’’ అని తీవ్రంగా జవాబి వ్వడం గమనించాల్సిన విషయం. రామ్సే మెక్‌డొనాల్డ్ ఉత్తర్వులకు వ్యతిరేకంగా గాంధీజీ ఆమరణ నిరాహార దీక్ష చేశారు. దానితో కాంగ్రెస్ పార్టీ, హిందూ సంఘాల నాయకులు అంబేడ్కర్ మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. చివరిదాకా అంబేడ్కర్ వాళ్ళ ఆలోచనలకు తలొగ్గలేదు. కానీ, ఒకవేళ గాంధీ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడితే గ్రామాల్లో అల్పసంఖ్యాకులుగా ఉన్నవారిపై, అగ్రవర్ణాలు దాడులకు తెగబడతారనే భయంతో రామ్సే మెక్‌డొనాల్డ్ ఇచ్చిన ఉత్తర్వులను వదులుకోవాల్సి వచ్చింది. దాని స్థానంలో 1932 సెప్టెంబర్ 24వ తేదీన పూనా ఒడంబడిక జరిగింది. పూనా ఒడంబడిక ద్వారా ప్రత్యేక ఓటింగ్, అంటే తమ అభ్యర్థులను తాము మాత్రమే ఎన్నుకునే విధానానికి బదులుగా, రిజర్వుడు నియోజక వర్గాల విధానం అమలులోకి వచ్చింది. ప్రస్తుతం మనం చూస్తున్న రిజర్వుడు స్థానాల ఎన్నికల విధా నంలో కేవలం ఆధిపత్య కులాల, సవర్ణ హిందువుల అంగీకారం ఉన్నవాళ్ళే ఎస్సీ ప్రతినిధులుగా ఎన్నికవుతూ వస్తున్నారు. దళితుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న వాళ్ళు, కులసమాజానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళు ఎస్సీల ప్రతినిధులు కాలేకపోతున్నారు. కారణం మనందరికీ తెలుసు. ప్రస్తుతం భారత దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు మెజారిటీగా ఆధిపత్య కులాల నాయకత్వంలో ఉన్నాయి. అంతేకాకుండా, ఓటర్లలో నూటికి 70 నుంచి 80 శాతం మంది దళి తులు కానివారే. అందువల్ల కూడా నిజమైన దళిత ప్రజాప్రతి నిధులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నిక కావడం లేదు. ఎవరు కాదన్నా అవునన్నా ఇది నిజం. దీనికి ప్రస్తుతం ఎన్నికవుతున్న ఎస్సీ ప్రజాప్రతినిధులను బాధ్యులను చేయాల్సిన అవసరం లేదు. దీనికి కారణం ఎన్నికల విధానమే తప్ప వ్యక్తులు కాదు. ఒకవేళ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశించినట్టుగా, తమ ప్రతి నిధులను తామే ఎన్నుకునే అవకాశం ఉన్నట్లయితే ఇప్పటికే భారత సామాజిక, రాజకీయ రంగంలో మౌలికమైన మార్పులు వచ్చేవి. కానీ ఎస్సీ ప్రతినిధులందరూ ఈ రోజుకు కూడా అసెంబ్లీలోగానీ, పార్లమెంటులో గానీ దళితుల పక్షాన నోరు విప్పలేని స్థితిలో ఉన్నారు. అప్పుడప్పుడు కొంత మంది మాట్లాడుతుంటారు. వాళ్ళంతా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు. మళ్ళీ వాళ్ళే అధికార పక్షంలోకి వెళ్తే నోటికి తాళాలు పడిపోతాయి. ఇది ఒక కఠోర వాస్తవం. అయితే దీనికి పరిష్కారమేమిటి అనే సందేహం వస్తుంది. తక్షణమైతే ప్రజా ప్రతినిధులు తమలో తాము అవలోకనం చేసు కోవాలి. కనీసం తక్షణ సమస్యలపైనైనా దళితుల పక్షాన నిలబడ టానికి ప్రయత్నించాలి. అంతిమంగా ఈ ఎన్నికల విధానాన్ని మార్చడానికి మళ్ళీ ఒక రాజకీయ ఉద్యమం జరగాలి. తమ ప్రతినిధులను తామే ఎన్నుకునే విధానంపైన ఒక చర్చ జరగాలి. ఇందుకుగాను దళితులు రాజకీయ ఉద్యమానికి సన్నద్ధం కావాలి. సమాజంలోని ప్రజాస్వామిక శక్తులు, అసమానతలు తొలగిపోవాలనే వ్యక్తులు, సంస్థలు, దళిత ప్రజాప్రతినిధుల ఎన్నిక విధానంలో మార్పు కోసం కలిసి రావాలి. లేనట్లయితే సామాజిక ఆర్థిక అసమానతలకు తోడుగా రాజకీయ బానిసత్వం ఇంకా పాతుకుపోయే ప్రమాదం ఉంటుంది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
రెక్కల గుర్రానికి కీలెరిగి వాతపెట్టాలి
పెగసస్ వైరస్... కోవిడ్ కన్నా ప్రమాదకరం. కేంద్రప్రభుత్వం పెగసస్ వైరస్‌ను వాడి, వ్యక్తి స్వేచ్ఛను ఎందుకు హరించివేస్తోంది? ఆర్థిక రంగంలో కొనసాగుతున్న కుట్రలను ప్రతిఘటిస్తున్న ప్రజలెవరైనా భారత ప్రభుత్వాలకు శత్రువులే. అందుకే వాళ్ళ మీదకు పెగసస్ రెక్కల గుర్రాన్ని వదులుతున్నారు. ఈ విషయాలపై రాస్తున్న, మాట్లాడుతున్న రచయితలను, జర్నలిస్టులను, సామాజిక కార్యకర్తలను, రాజకీయ నాయకులను రెక్కల గుర్రానికి అప్పజెబుతున్నారు. పెగసస్ రెక్కల గుర్రం... రోగం మాత్రమే. రోగానికి మూలం ఈ దేశ సామాజిక, ఆర్థిక అసమానతలు, వివక్ష, దోపిడీ. అంబేడ్కర్ చెప్పినట్టు... రాజకీయ ప్రజాస్వామ్యానికి రక్షణగా నిలవాలంటే ఆర్థిక, సామాజిక రంగాల్లో ప్రజాస్వామ్యం కోసం కూడా పోరాడాల్సి ఉంటుంది.‘‘జనవరి, 26, 1950 నుంచి మనం ఒక వైరుధ్యాల జీవితంలోకి అడుగిడబోతున్నాం. రాజకీయాల్లో సమానత్వాన్ని, ఆర్థిక, సామాజిక రంగాల్లో అసమానత్వాన్నీ కలిగి ఉన్నాం. ఒక మనిషికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒక విలువ ద్వారా రాజకీయాల్లో ప్రజాస్వామ్యం ఉంది. కానీ ఆర్థిక, సామాజిక రంగాల్లో ఇంకా అసమానతలు కొనసాగుతున్నాయి. ఇవి ఇలాగే కొనసాగితే రాజకీయ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుంది’’ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ సభ చివరి రోజైన నవంబర్, 25, 1949న చేసిన ప్రసంగంలోని కీలకమైన అంశం ఇది. డెబ్భై ఏళ్ళ క్రితం అంబేడ్కర్ చేసిన ఈ వ్యాఖ్యలను తిరిగి మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. పెగసస్ వైరస్ ద్వారా కొన్ని వందల మంది ప్రముఖుల ఫోన్లను నిఘాలో పెట్టినట్టు రుజువైంది. నిజానికి ఇది కోవిడ్ కన్నా ప్రమాదకరం. నూటికి నూరుపాళ్ళూ ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. అయితే ఎందుకు ఈ ప్రభుత్వం పెగసస్ వైరస్‌ను వాడి వ్యక్తి స్వేచ్ఛను హరించివేస్తోంది? ఇది కేవలం రాజకీయ ప్రజాస్వామ్యానికి సంబంధించినది మాత్రమే కాదు. ఈ దేశంలో కొనసాగుతున్న ఆర్థిక గుత్తాధిపత్యం, సామాజిక వివక్షలు, అణచివేతలు రోజురోజుకీ వికృత రూపం దాల్చుతున్నాయి. గత కొన్ని వేల ఏళ్ళ నుంచి ప్రజల మధ్య అసమానతలు, వివక్షను పెంచి పోషిస్తోన్న కుల వ్యవస్థను కీర్తించే ప్రయత్నం జరుగుతున్నది. కుల వ్యవస్థ పునాది కలిగిన హిందూ మతం ప్రాముఖ్యతను చాటి చెప్పడానికి కావాల్సిన ప్రచారం ముమ్మరమైంది. అంతేకాకుండా, ఇతర మతాలు, సాంప్రదాయాలు ప్రజావ్యతిరేకమైనవనే అభిప్రాయం కూడా బలంగా ముందుకు తెస్తున్నారు. అంటే సామాజిక అసమానతలను నిర్మూలించే వైపు కాకుండా, రోజురోజుకీ మరింత పెంచే విధంగా ప్రయాణం సాగుతోంది. అలాగే, ఆర్థికంగా కొన్ని కులాలు, వర్గాలు మాత్రమే బలపడేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. అంటే దీనికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ప్రభుత్వం దృష్టిలో శత్రువులుగానే ఉన్నారు. దీంతో ఎవరినైనా తన శక్తితో ఎగరేసుకుపోగలిగే అస్త్రంగా రెక్కల గుర్రం పెగసస్‌ను ప్రయోగించారు. ఇక రెండో అంశం తాము చేస్తున్న అక్రమ నిఘాను సమర్థించుకోవడానికి ఒక శత్రువును ఎప్పటికప్పుడు సృష్టించడం. అది టెర్రరిజం కావచ్చు. తీవ్రవాదం కావచ్చు, అతివాదం కావచ్చు, ఇతర హింసాత్మక బూచీలేవైనా కావచ్చు. వాటిని బూచీగా చూపి తమ పబ్బం గడుపుకోవడానికి తమ రాజకీయ శత్రువులను అందులోకి లాగడం. పెగసస్‌ను ప్రవేశపెట్టక ముందే ఇంకా కొన్ని నియంతృత్వ పోకడలను మన ముందుకు తెచ్చిందీ ప్రభుత్వం. అది, పాలనా రంగంలో ఉన్న ప్రజాస్వామ్య విధానాలను పూర్తిగా విస్మరించడం. అదేవిధంగా న్యాయవ్యవస్థలను నిర్వీర్యం చేయడం. దీంతో ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వ్యవస్థలను దాదాపు స్తంభింపచేయడం జరిగింది. జరుగుతోంది. అంతేకాకుండా, మెజారిటీ వర్గాలను తమ వైపు నిలబెట్టుకోవడానికి అప్పటికే ప్రజల్లో ఉన్న వైరుధ్యాలను, ద్వేషాలను మరింత పెంచి పోషించడం, ఎటువంటి వ్యాఖ్యలకైనా వెనుకాడకపోవడం జరుగుతోంది. ఒక కులాన్ని, మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం సర్వసాధారణమైంది. దీంతో మెజారిటీ వర్గం ప్రజలను సంతోషపెట్టేం దుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడుతున్నారు. అంతేకాకుండా, కొన్ని జాతీయ చిహ్నాలను.. గాంధీ, నెహ్రూ లాంటి జాతీయ నాయకులను అభాసుపాలు చేయడానికి సంకోచించడం లేదు. కొన్ని వర్గాల ప్రజలపైన ముఖ్యంగా దళితులపైన, ముస్లింలపైనా దాడులు చేసి, వాటిని తామే మీడియాలో చిత్రీకరించి మరింత వికృతానందాన్ని పొందుతున్నారు. దీనివల్ల ఆ వర్గాలకు వ్యతిరేకంగా ఉన్న మెజారిటీ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నానికి పూనుకుంటున్నారు. దీనితో పాటు, ప్రస్తుతం భారత ప్రజల్లో ఉన్న సాంస్కృతిక వైవిధ్యానికి భిన్నంగా ఏకీకృత వ్యవస్థని ఏర్పాటు చేసుకునేందుకు తమ సొంత పౌరసత్వ విధానాన్ని ప్రవేశపెట్టడానికి పూనుకుంటున్నారు. వీటన్నింటి తోడ్పాటులో తాము ఊహిస్తున్న, ఆశిస్తున్న ఒక వివక్షాపూరితమైన తమదైన దేశాన్ని నిర్మించే లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పెగసస్ కూడా, పాక్షికంగా కొనసాగుతున్న రాజ కీయ ప్రజాస్వామ్య హక్కులను సైతం నిరాకరించే ప్రయత్నంలో భాగమే. అయితే పెగసస్ ఈ రోజే పుట్టుకొచ్చిన కొత్త దాడి కాదు. ఇది చివరిది కూడా కాదు. భారతీయ సమాజంలో వేళ్ళూనుకొని ఉన్న ఆర్థిక వైరుధ్యాలు, అసమానతలు, వివక్ష కొనసాగినంత కాలం ఈ దేశంలో ఉడుత ఊపులకు సైతం రాజకీయ ప్రజాస్వామ్యం చివురుటాకులా వణికిపోతూనే ఉంటుంది. అందుకే ఈ రోజు మరొక్కసారి, అంబేడ్కర్ సూచించిన నిజమైన ప్రజాస్వామ్యం వైపు సమాజాన్ని నడిపించకుండా ఈ చట్టాలు, నిఘా రెక్కల గుర్రాలు ప్రజల మీద ఎక్కి సవారీ చేస్తూనే ఉంటాయి. అంబేడ్కర్ ప్రజాస్వామ్యం గురించి వివరించిన మాటలను మనం ఇక్కడ స్ఫురణకు తెచ్చుకోవాలి. ‘‘ప్రజాస్వామ్యం ఒక ప్రభుత్వ విధానం, పాలన నుంచి వచ్చేది కాదు. పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా అమలు జరిగేది సంపూర్ణ ప్రజాస్వామ్యం కాదు. సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఉన్న సంబంధాలు ప్రజాస్వామ్య విలువలకు అద్దంపడతాయి’’. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం అనే అంశాలు కీలకమైనవి. ఇందులో స్వేచ్ఛ, సమానత్వం అనే అంశాలు సోదరత్వం అనే భావన మీద ఆధారపడుతూ ఉంటాయనేది అంబేడ్కర్ అభిప్రాయం. ప్రజల మధ్య సోదరత్వం లేకుండా, స్వపర భేదాలు కొనసాగినంత కాలం సమానత్వం, స్వేచ్ఛ అనేవి కూడా సంపూర్ణంగా అమలు జరగవు. ఇదే ఈ రోజు భారతదేశ వాస్తవికత. సామాజికంగా కుల వ్యవస్థ బతికి ఉన్నంతకాలం రాజకీయంగా అమలులో ఉన్న సమానత్వం సరిౖయెన ఫలితాలను ఇవ్వదు. అందువల్లనే రాజకీయ పార్టీలు ప్రజల మధ్య ఉండే ఈ భేదాలను తమ అధికారం కోసం చాలా సమర్థవంతంగా వాడుకుంటున్నాయి. పైగా, ఇటీవల కాలంలో ఆర్థిక రంగంలో వస్తున్న మార్పులు, పెరుగుతున్న అసమానతలు సమాజాన్ని మరింత అగాధంలోకి నెట్టబోతున్నాయి. ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీలు కొన్ని కార్పొరేట్ కంపెనీల ఎదుగుదలకు తోడ్పతున్నాయి. వాటికోసం ప్రజల భూములను, సహజవనరులను ధారాదత్తం చేస్తున్నాయి. దీనిపై తిరుగుబాటు చేస్తున్న ప్రజలు సహజంగానే ప్రభుత్వాలకు దేశ ద్రోహులుగా కనపడతారు. ప్రస్తుత ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వాలు కూడా ఆర్థికాభివృద్ధి పేరుతో ప్రజలను నిరాశ్రయులను చేశాయి. అడవులను స్వాహా చేస్తోన్న కార్పొరేట్ కంపెనీలను, అందుకు కొమ్ముగాస్తోన్న ప్రభుత్వాలను ప్రతిఘటిస్తోన్న ఆదివాసులు, అడవి బిడ్డలు రాజద్రోహులవుతున్నారు. అకారణంగా సంవత్సరాల తరబడి జైళ్ళలో మగ్గుతున్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పడానికి చేసిన కుయత్నాల ఫలితమే సుదీర్ఘ రైతాంగ పోరాటానికి దారితీసిందన్నది ఓ కఠోర సత్యం. దేశాన్ని సుసంపన్నంగా నిలిపే సత్తా ఉన్న రైతన్న ప్రభుత్వాల కుట్రలకు గురికావాల్సిన దుఃస్థితి. అంటే ఆర్థిక రంగంలో కొనసాగుతున్న ఈ కుట్రలను ప్రతిఘటిస్తున్న ప్రజలెవరైనా భారత ప్రభుత్వాలకు శత్రువులే. అందుకే వాళ్ళ మీదికి పెగసస్ రెక్కల గుర్రాన్ని వదులుతున్నారు. ఈ విషయాలపై రాస్తున్న, మాట్లాడుతున్న రచయితలను, జర్నలిస్టులను, సామాజిక కార్యకర్తలను, రాజ కీయనేతలను రెక్కల గుర్రానికి అప్పజెప్పుతున్నారు. పెగసస్ రెక్కల గుర్రం రోగం మాత్రమే. రోగానికి మూలం ఈ దేశ సామాజిక, ఆర్థిక అసమానతలు, వివక్ష, దోపిడీ. పెగసస్ మీద నిరసన తెలుపుతున్న మనందరం అంబేడ్కర్ చెప్పినట్టు.. ఆర్థిక, సామాజిక రంగాల్లో ప్రజాస్వామ్యం కోసం కూడా పోరాడాల్సిందే తప్ప మరో మార్గం లేదు. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
కలల్ని భగ్నం చేసిన కాలం
అబ్దుల్ కలాం మన పిల్లలందరినీ కలలు కనమన్నారు. మనం కూడా మన పిల్లలకు అదే నేర్పించాం. కానీ మనం కలలు కంటూనే ఉన్నాం. కానీ మన ప్రభుత్వాలు మన దేశాన్ని కలకాలం కలల్లోనే ఉండేలా చేశాయి. మన పిల్లల స్వప్నాలు సత్యాలు కాలేదు. కానీ మనకు ఈ కరోనా ఒక మేల్కొలుపునిచ్చింది. ప్రభు త్వాల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేసింది. అయితే కరోనా ఇచ్చిన అనుభవమే రేపటి సమాజ మార్పునకు ఒక హెచ్చరిక కావాలి. మనం వీడ్కోలు పలుకు తున్న 2020 సంవత్సరం తెచ్చిన ఉపద్రవం మనకు అత్యంత కఠినమైన అనుభవాలను మిగిల్చింది. 2020ని సంతోషంగా సాగనంపడమంటే, మన పాలకుల పట్ల మనకున్న భ్రమలను తొలగించి, వాస్తవాలను కళ్ళకు కట్టిన చేదు అనుభవాలు పునరావృతం కాకుండా మేల్కోగలగడమే. ఇదే మనకొక కనువిప్పు. ‘‘కరోనా మహమ్మారి విలయతాండవం చేసిన 2020 ప్రపంచ ప్రజలందరినీ, ప్రత్యే కించి భారతదేశ వాసులందరినీ అభద్రతకు, అశాంతికి గురిచేసింది. అసమానతలను, అగాధాలను సృష్టించింది. ఇటీవల సంవత్సరాలలో వచ్చిన ఉపద్రవాలన్నింటికన్నా కరోనా కల్లోలం మానవాళిని అన్ని రంగాల్లో వెనక్కు నెట్టింది’’అని 2020 సంవత్సరాన్ని సమీక్షిస్తూ, ప్రపంచ బ్యాంకు ఆర్థిక వేత్తలు విశ్లేషించారు. కరోనా సృష్టించిన సంక్షోభం వల్ల కోట్లాది మంది పేదరికంలోకి దిగజారిపోనున్నారు. చాలా దశాబ్దాల తర్వాత పేదరికంపై జరుగు తున్న పోరాటాన్ని ఈ కరోనా వెనక్కు నెట్టివేసింది. గతం కన్నా అధికంగా ప్రజలు పేదరికంలోకి దిగజారిపోతున్నారు. ప్రపంచంలోని చాలా దేశాలలోని ప్రజలు రోజుకు కేవలం 100 రూపాయలకు మించని ఆదాయంతో గడ్డుపరిస్థితుల నెదుర్కోబోతున్నారు. ఇది భవిష్యత్ చిత్రం. ప్రపంచబ్యాంకు నిపుణులు అనేక అంశాలపై సవివరమైన అధ్యయనాలను చేసి, ఎన్నో వివరాలను వెల్లడించారు. ప్రపంచంతో పాటు, భారతదేశంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు సృష్టించిన అసమానతలను కరోనా రెట్టింపు చేసింది. ఈ కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా అదనంగా మరో 8 కోట్ల 80 లక్షల మంది ప్రజలు పేదరికంలోకి జారిపోతున్నారు, ఇందులో అత్యధికంగా భారతదేశంతో సహా దక్షిణాసియా దేశాల ప్రజలున్నట్టు అధ్య యనాలు వెల్లడించాయి. అసంఘటిత రంగం, ప్రత్యేకించి నిర్మాణ రంగం, ఉత్పత్తి రంగాల నుంచి ఎక్కువ మంది ఉపాధి కోల్పోను న్నారని ‘‘పావర్టీ అండ్ షేర్డ్ ప్రాస్పరిటీ రిపోర్టు’’ వెల్లడించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇటువంటి సంక్షోభం తలెత్తలేదని, ఆరోగ్య రంగంలో బయటపడిన బలహీనతలు, మరణాలు ప్రపంచ వ్యాప్త ఆర్థిక సంక్షోభం విశ్వవ్యాప్తంగా ఉన్న మానవాళిని అతలా కుతలం చేశాయని, ‘‘గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్’’ నివేదిక తెలియజేసింది. కరోనా వల్ల సమాజంలో ఉన్న అసమానతలు, అభద్రత, అశాంతి ముసుగు తొలగించుకొని బయటకొచ్చాయి. మానవాళి ప్రాణ రక్షణకు మాస్క్‌లు అందించిన కరోనా, పాలకులు వేసుకున్న అభివృద్ధి ముసుగుని నిలువునా తొలగించివేసింది. ఇదే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక సర్వేలు రుజువు చేశాయి. ముఖ్యంగా ఈ సంక్షోభం వల్ల ప్రజలు ఉపాధినీ, ఉద్యోగాలనూ కోల్పోయి అభద్రతలోకి వెళ్ళిపోయారు. ప్రాణాలు ఉంటాయో పోతాయో అనే భయంతో అశాంతికి గురయ్యారు. ఆయా రంగాల్లో ఉన్న వ్యత్యాసాలు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్తుని అగమ్యగోచరంలోకి నెట్టివేశాయి. ఆ పరిస్థితులను తట్టుకోలేక ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వలస కార్మికులు ఉపాధిని కోల్పోయారు. చాలా దేశాలు వలస కార్మికుల విదేశీ మారకద్రవ్యం మీద ఆధారపడి ఉన్నారు. కొన్ని కోట్ల కుటుంబాలు తమ వాళ్ళు పంపి స్తున్న డబ్బుతో జీవితాలను వెళ్లదీస్తున్నారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. 2021 చివరి వరకు విదేశాల నుంచి వచ్చే ఆదాయంలో దాదాపు 14 శాతం తగ్గిపోనున్నది. ఆధునిక చరిత్రలో ఇటువంటిది ఇదే మొదలు. స్వస్థలాలకు వెళ్ళిన వారు ఎక్కువ మంది తిరిగి తాము ప నిచేసే దేశాలకు వెళ్ళే స్థితి లేదని తెలుస్తున్నది. దీంతో పేదరికం మరింత పెరిగే ప్రమాదం ఉన్నది. దీనితో గతంలోలాగా ఆహారం, ఆరోగ్య భద్రత కష్టమవుతుందని వలస కార్మికులు ఆందోళన చెందు తున్నారు. దీంతోపాటు, చాలా కంపెనీలు గతంలో లాగా ఎక్కువ మంది కార్మికులను నియమించుకోవడానికి సిద్ధంగా లేవు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఏర్పడింది. అంతే కాకుండా భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని, మనుషులమీద ఆధారపడకుండా, సాంకేతిక సహకారంతో కంపెనీలను ఆధునీకరించి కార్మికులను తగ్గించుకోవాలని కంపెనీలు ఆలోచిస్తున్నాయి. భారతదేశంలో దాదాపు 14 కోట్ల మంది వలస కార్మికులున్నారు. వీళ్ళు రాష్ట్రాలను దాటి వెళ్లేవారు. అంటే అంతర్రాష్ట్ర కార్మికులు. వీళ్ళంతా తమ పల్లెల్లో పనులు లేక పొరుగు రాష్ట్రాలకు ప్రత్యేకించి వలసలు వెళ్ళి దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు. ఇటువంటి పరిస్థితులు గతంలో ఉన్నప్పటికీ కరోనా వల్ల వలస కార్మికుల దీన గాథలు ప్రపంచానికి తెలియవచ్చింది. ఒకరకంగా ఈ దేశం దౌర్భా గ్యస్థితిని బయటపెట్టింది. మరొక సమస్య నేరుగా కరోనాతో ముడి పడి ఉన్న ఆరోగ్యరంగం. మన ఆరోగ్య రంగం ఎదుర్కొంటోన్న అనేక అవరోధాలను కరోనా బహిర్గతం చేసింది. కరోనా వల్ల భయానకమైన స్థితిని ప్రజలే స్వయంగా అనుభవించారు. కానీ ప్రభుత్వాలు చేసింది నామమాత్రమే. ఉపన్యాసాలకు మాత్రమే పరిమితమైన వీరివల్ల ఒరిగిందేమీ లేదు. ప్రభుత్వాలు వైద్యం మీద పెడుతున్న ఖర్చుకన్నా ప్రజలు చేస్తున్న ఖర్చు అనేక రెట్లు అధికం. ఒక అంచనా ప్రకారం, ప్రపంచంలో ప్రజలు వైద్యం కోసం చేస్తున్న ఖర్చు దాదాపు 38 లక్షల కోట్లు. భారతదేశం వాటా ఇందులో చాలా ఎక్కువే. ప్రతి సంవత్సరం ఆరోగ్య సమస్యల వల్ల 90 కోట్ల మంది తీవ్రమైన ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని, 9 కోట్ల మంది పేదరికంలోకి దిగజారిపోతున్నారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. కరోనా సమయంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న కుటుం బాలు సామాజిక వెలివేతకు గురవడం మాత్రమే కాకుండా, లక్షల రూపాయల అప్పుల్లో కూరుకుపోయారు. ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజ లను నిలువుదోపిడీ చేస్తుంటే, ప్రభుత్వాలన్నీ ప్రేక్షక పాత్ర వహించాయి. ప్రభుత్వాలకు దూరదృష్టి లేకపోవడం వల్ల ఇటువంటి దుష్పరిణామాలు సంభవించాయి. మన దేశంలో పదివేల మంది జనాభాకు కేవలం 8 బెడ్లు, పదివేల మంది జనాభాకు 8 మంది డాక్టర్లు ఉన్నారు. దీనితోపాటు, 80 మందికి ఎటువంటి ఆరోగ్యభీమా లేదు. గతంతో పోలిస్తే ప్రభుత్వ ఆసుపత్రులలో ఇచ్చే మందులు చాలా తగ్గిపోయాయి. ఈ పరిస్థితులు కరోనా సమయంలో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. అదే సమయంలో లాక్డౌన్ తొలగించిన తర్వాత ప్రారంభించిన చదువులు మనదేశంలో ఉన్న అసమానతలను బయటపెట్టాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య, పేదలు, ధనికుల మధ్య, మైదాన ప్రాంతాలు, అటవీప్రాంతాల మధ్య ఉన్న తేడాలు మరోసారి తేట తెల్లమయ్యాయి. అంతేకాకుండా సమాజంలో వివక్షకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థినీ విద్యార్థులు కూడా ఆన్లైన్ క్లాసులకు దూరమవుతున్నారు. ఈ విషయాలపై ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోన్న ఒక సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం, 56.01 శాతం విద్యార్థినీ, విద్యా ర్థులకు స్మార్ట్ ఫోన్లు లేవని తేల్చారు. అంటే దాదాపు సగానికిపైగా విద్యార్థులు ఈ సంవత్సరం చదువులకు దూరమైనట్టే. స్మార్ట్ ఫోన్ ఉన్న విద్యార్థులకు చాలా ప్రాంతాల్లో సరిౖయెన నెట్వర్క్ లేనందువల్ల చదువుల్లో అంతరాయం కలిగిందని ఆ సర్వే తెలిపింది. మరికొన్ని సందర్భాల్లో ఆన్లైన్ క్లాసులు విన్నప్పటికీ సరిగ్గా అర్థం కావడం లేదని ఆ సర్వే తేల్చి చెప్పింది. మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం లాంటి వాళ్ళ విజన్–2020 పేరుతో మార్గదర్శకాలను తయారుచేశారు. అబ్దుల్ కలాం మన పిల్లలందరినీ కలలు కనమన్నారు. మనం కూడా మన పిల్లలకు అదే నేర్పించాం. కానీ మనం కలలు కంటూనే ఉన్నాం. కానీ మన ప్రభు త్వాలు మన దేశాన్ని కలకాలం కలల్లోనే ఉండేలా చేశాయి. మన పిల్లల స్వప్నాలు సత్యాలు కాలేదు. కానీ మనకు ఈ కరోనా ఒక మేల్కొ లుపునిచ్చింది. ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేసింది. అయితే కరోనా ఇచ్చిన అనుభవమే రేపటి సమాజ మార్పుకు ఒక హెచ్చరిక కావాలి. మనం వీడ్కోలు పలుకుతున్న 2020 సంవత్సరం తెచ్చిన ఉపద్రవం మనకు జీవితంలో అత్యంత కఠినమైన అనుభవాలను మిగిల్చింది. 2020ని సంతోషంగా సాగనంపడమంటే, మన పాలకుల పట్ల మనకున్న భ్రమలను తొలగించి, వాస్తవాలను కళ్ళకు కట్టిన చేదు అనుభవాలు పునరావృతం కాకుండా మేల్కోగలగడమే. ప్రజలను మభ్యపెట్టి, మాయజేసే విధానాల పట్ల అప్రమత్తంగా ఉండడమే. ఉపాధి, ఉద్యోగ, ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వాలు తమ బాధ్యతను మరిచిన సత్యాన్ని చెంపఛెళ్ళుమనింపిచేలా కొట్టిన ఘనత 2020కే దక్కింది. ఇదే మనకొక కనువిప్పు. ప్రభుత్వాల విషయంలో ప్రజ లకూ, ప్రజల పట్ల వ్యవహరించే తీరులో పాలకులకూ ఇదొక హెచ్చరిక కావాలి. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
కలరా నుంచి కరోనా దాకా..
‘‘మనుగడ కోసం మానవజాతి నిరంతరం సంఘర్షణ జరుపుతూనే ఉంటుంది. అది కూడా మెరుగైన జీవితం కోసం తపనపడు తుంది’’ జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతి పాదించిన ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ చెప్పిన మాటలివి. పంతొమ్మిదవ శతాబ్ది తాత్వికవేత్త, హెర్బర్ట్ స్పెన్సర్ వ్యాఖ్య లను చార్లెస్ డార్విన్ మరింత పదునుగా చెప్పారు. ఆ తర్వాత మార్క్సిస్టు తాత్విక వేత్తలు కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్‌లు ఆ అవగాహనను రాజ కీయాలకు అన్వయించారు. ఆ రణనినాదమే ‘స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్’. నిరంతర సంఘర్షణ, నిత్య యోచన, సమాజానికి తనను తాను అర్పించుకోగల త్యాగనిరతి వెరసి సమాజ గతిని మార్చగలవు. ఆ సంఘర్షణే మానవాళి పురోభివృద్ధికి తోడ్పడగలదన్న విశ్వాసాన్ని పై వాక్యాలు ధ్రువ పరుస్తున్నాయి. అవి సామాజిక సమస్యలు కావచ్చు. ప్రకృతి వైపరీత్యాలూ కావచ్చు, లేదా మరెన్నో వినాశకర విపత్తులు నిత్యం సమాజాన్ని అతలాకుతలం చేస్తాయి. మనిషి మాత్రం ఆత్మ విశ్వాసాన్ని వదలకుండా, వాటిని అధిగమించేందుకు వ్యక్తిగతంగా, సామాజిక పరంగా ఎన్నో సాహసాలు చేస్తాడు. అది మానవజాతి మహోన్నత లక్షణం. అదే నేటి అభివృద్ధికి కొలమానం. కొన్ని విప త్తులు మనిషి మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తాయి. ఊహించని నష్టాలు సంభవిస్తాయి. అయినా మనిషి విపత్తులను అధిగమించడా నికి తన జీవితాన్ని సైతం ఫణంగా పెట్టి త్యాగాలకు పూనుకుంటాడు. అయితే తన కోసం కాకుండా సమాజం మేలు కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టేవారు అతి కొద్దిమందే ఉంటారు. అటువంటి అరుదైన వారి వల్లనే ఈ సమాజం ఈనాటికీ మనుగడ కొనసాగిస్తోంది. కరోనా లాంటి విలయతాండవాన్ని స్వయంగా అనుభవిస్తోన్న నేటి తరుణంలో చరిత్రపుటల్లో దాగిన, మానవజాతి మనుగడను శాసించే విపత్తులను అధిగమించి, సమాజం పురోగమించేందుకు యత్నించిన ఎందరో మహానుభావుల సాహస చర్యలు మనకళ్ళ ముందు కదలాడుతాయి. 1892 సంవత్సరం జూలై 18వ తేదీన ప్రపంచాన్ని ప్రత్యేకించి ఆసియా, యూరప్ ఖండాలను శవాల గుట్ట లుగా మార్చిన కలరా మహమ్మారికి విరుగుడుగా తాను కనుగొన్న వ్యాక్సిన్‌ను, మొదటగా తనమీద, తన సన్నిహితులు, మిత్రుల మీద ప్రయోగించి చూసుకున్న వ్లాదిమిర్ హాఫ్‌కైన్‌ను స్మరించుకోవడం సందర్భోచితం. తన ప్రాణం కన్నా సమాజ రక్షణ, కోట్లాదిమంది ప్రాణాలు ముఖ్యమని భావించడంవల్ల హఫ్కైన్ ఈ సాహసానికి దిగారు. ఆ ప్రయోగం ఎటువంటి అవరోధాలు లేకుండా విజయవంత మైంది. ఆ ప్రయోగం ఫలప్రదం అవడంతో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. తత్ఫలితంగా కోట్లాది మంది ప్రాణాలను కాపాడగలిగారు. కలరా మొదటిసారిగా 1817లో బెంగాల్లో ప్రబలింది. 1920 కల్లా భారతదేశమంతటా వ్యాపించింది. ఇందులో ఒక కోటి యాభై లక్షల మంది మరణించారు. మరో రెండు కోట్ల 30 లక్షల మంది 1865–1917 మధ్య కలరా వల్ల ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో రష్యాలో 20 లక్షల మంది మరణించారు. 1817 నుంచి 1923 వరకు ఆరుసార్లు కలరా మహమ్మారి విజృంభించి ప్రపంచాన్ని వణికించింది. ఇందులో కొన్ని కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. 1817–1824 మధ్య మొదటిసారి, 1829–1837 మధ్య రెండవసారి, 1840–1860 మధ్య మూడవసారి, 1863–75 మధ్య నాల్గవసారి, 1881–1896 మధ్య ఐదవసారి, 1899–1923 మధ్య ఆరవసారి, 1961–1975 మధ్య ఏడవసారి కలరా వచ్చింది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 1961–1975 మధ్య ఇండియాలో కలరా విజృంభించలేదు. 1899–1923 మధ్య కలరా విజృంభణ తర్వాత, భారత ప్రజలపైన కలరా అంతగా ప్రభావం చూపలేదు. 1865–1917 మధ్య వచ్చిన కలరా రెండు కోట్ల 30 లక్షల మందిని కబళిస్తే, 1965–1971 మధ్య వచ్చిన కలరా మనలను తాకలేకపోయింది. దీనికి ఏకైక కారణం వ్లాదిమిర్ హాఫ్‌కైన్ కృషి, పట్టుదల, త్యాగమే. వ్లాదిమిర్ హాఫ్‌కైన్ జీవితం చాలా సాదాసీదాగా ప్రారంభమైంది. రష్యాలోని ఉక్రెయిన్ ప్రాంతంలో ఉన్న ఓడరేవు పట్టణం ఒడిస్సాలోనే సాగింది. మలరొస్కికి విశ్వవిద్యాలయంలో నేచురల్ సైన్సెస్‌లో హాఫ్‌కైన్ పట్టా పొందారు. ఎలిమెచిన్ కాఫ్ అనే జీవశాస్త్రవేత్త ప్రభావం హాఫ్‌కైన్ మీద పడింది. ఎలిమెచిన్కు నోబెల్ బహుమతి లభించింది. అయితే ఆయన అదే విశ్వవిద్యాలయంలోని మ్యూజియంలో ఉద్యోగిగా చేరారు. జీవసంబంధమైన పరిశోధనలు చేసి, అయిదు పరిశోధనాత్మక పత్రాలను రూపొందించారు. అయితే హాఫ్కైన్లో మరొక కోణం కూడా ఉంది. 1880 ప్రాంతంలో జార్ చక్రవర్తికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు ఉద్యమాలలో హాఫ్‌కైన్ పాల్గొనేవాడు. అందుకుగాను మూడుసార్లు జైలుకెళ్ళాడు. రష్యా చక్రవర్తి రెండవ అలెగ్జాండర్‌ను విప్లవ తిరుగు బాటుదారులు హత్య చేసిన సందర్భంగా హాఫ్‌కైన్ కూడా నిర్బంధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన ప్రత్యక్షంగా అందులో పాల్గొనక పోయినా ఆ సంబంధిత సంస్థతో ఉన్న సంబంధాల వల్ల జైలుకెళ్ళాల్సి వచ్చింది. అయితే జీవశాస్త్ర పరిశోధనలలో ఉన్న ఆసక్తి వల్ల ఆయన 1888లో రష్యాను వదిలిపెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత స్విట్జర్లాండ్ జెనీవాలోని విశ్వవిద్యాలయంలో అధ్యా పకుడిగా చేరారు. వ్యాక్సిన్లకు పితామహుడిగా పేరొందిన లూయీస్ పాశ్చర్ పారిస్‌లో స్థాపించిన పాశ్చర్ ఇన్స్టిట్యూట్లో చేరారు. అప్ప టికే ప్రపంచాన్ని వణికిస్తోన్న కలరాపైన పరిశోధనలో భాగస్వామి అయ్యారు. కలరా వైరస్‌కు విరుగుడు కనిపెట్టడంలో హాఫ్‌కైన్ విజయం సాధించారు. ప్రతివారం జరిగే పారిస్ బయోలజీ సొసైటీ సమావేశం సందర్భంగా 1892లో హాఫ్‌కైన్ ఈ విషయాన్ని ప్రక టించారు. ఆ తర్వాత హాఫ్‌కైన్ కుందేళ్ళు, పావురాళ్ళపైన ప్రయోగం చేసి వ్యాక్సిన్‌ను రుజువు చేశారు. ఆ తర్వాత వెంటనే అంటే 1892వ సంవత్సరం జూలై 18వ తేదీన మనుషులలో ఈ వ్యాక్సిన్ ప్రయోగం చేయాలనుకున్నప్పుడు ప్రయోగానికి తనను, తన రాజకీయ మిత్రు లను హాఫ్‌కైన్ ఎంచుకున్నారు. ఆ తర్వాతనే ఆయన ఇతరుల మీద ప్రయోగం చేశారు. ఈ వ్యాక్సిన్ పరిశోధనకు సంబంధించిన విషయాలన్నింటినీ బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు. దీనిని ప్రజలకు అందించ డానికి హాఫ్‌కైన్ రష్యాతో సహా ఇతర దేశాలను అభ్యర్థించారు. అయితే కేవలం బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మాత్రమే సానుకూల స్పందన లభించింది. అప్పటికి భారతదేశంలో కలరా విజృంభించి, లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకొని, విలయతాండవం సృష్టించింది. అందువల్ల దీని క్షేత్ర ప్రయోగం కోసం కలకత్తాను ఎంచుకోవాలని పారిస్‌లోని బ్రిటిష్ దౌత్యవేత్త లార్డ్ ఫ్రెడరిక్ సూచనతో మార్చిలో కలకత్తాలోని ప్రెసిడెన్సీ హాస్పిటల్లో బ్యాక్టీరియాలజిస్ట్గా చేరారు. అయితే కలకత్తాలోని డాక్టర్లు, హాఫ్‌కైన్ ప్రయోగాలను అపహాస్యం చేశారు. ఇది అసాధ్యమని పెదవి విరిచారు. చివరకు కొంతమంది హాఫ్‌కైన్‌ను హత్య చేయడానికి ప్రయత్నించారు. అయితే ఆ తర్వాత ఆగ్రాలో నూతనంగా స్థాపించిన బాక్టీరియాలాజికల్ లేబొరేటరీ బాధ్య తలు తీసుకొని సైన్యంలోని సిబ్బందిపై, ఇతర పౌరులపై దానిని ఉప యోగించాలని కోరారు. దాదాపు 37,000 మంది భారతీయులపై, 5 వేల మంది బ్రిటిష్ సిబ్బందిపై ఈ వ్యాక్సిన్ ప్రయోగం జరిగింది. దానిశక్తి సామర్థ్యాలపై బ్రిటిష్ ప్రభుత్వం సంతృప్తిని వ్యక్తం చేసింది. 1896 సెప్టెంబర్ చివరలో బొంబాయిలో ప్లేగు వ్యాపించింది. బ్రిటిష్ ప్రభుత్వం హాఫ్‌కైన్‌ను అక్కడికి పంపించింది. ప్లేగ్‌కు కూడా ఆయన మందును తయారుచేసి, ఎంతోమంది ప్రాణాలను కాపా డారు. 1896లోనే హాఫ్‌కైన్ ఇండియన్ సివిల్ సర్వీసులో చేరారు. అయినప్పటికీ సమాజాన్ని అతలాకుతలం చేస్తోన్న మహమ్మారి రోగాలకు మందులను కనుగొనడంలో తన అవిశ్రాంత కృషిని కొన సాగిస్తూనే వచ్చారు. తన ఈ సర్వీసులో కూడా ఎన్నోరకాల ఔషధా లను కనుగొన్నారు. ఆయన పరిశోధించి కనుగొన్న ప్రతి వ్యాక్సిన్‌ను మొదట తన మీదనే ప్రయోగం చేసుకోవడం తప్పనిసరి అలవాటుగా మార్చుకోవడం ఆయనలోని దృఢచిత్తానికి నిదర్శనం. 1897లో ఆగాఖాన్ అనే ముస్లిం సంపన్నుడు బొంబాయిలోని ఖుస్సో లాడ్జి భవనాన్ని హాఫ్‌కైన్ నివాసంగా ఇచ్చాడు. దీనిని కూడా ప్లేగ్ పరిశోధనా కేంద్రంగా మార్చారు. పారిస్‌లోని పాశ్చర్ ఇన్స్టి ట్యూట్ తరహాలో బొంబాయిలో ఒక సంస్థను నెలకొల్పాలని హాఫ్‌కైన్ ఆగాఖాన్‌ను కోరారు. అది స్థాపించడం మాత్రమే కాకుండా, ఆ తర్వాతి కాలంలో దానినే హాఫ్‌కైన్ ఇన్స్టిట్యూట్గా పేరు మార్చారు. ఆయన భారతదేశంలో 20 ఏళ్లు గడిపి కలరాపై పరిశోధనల్లో విశేష కృషి చేశారు. 1927లో ఆయనను రష్యాలో గొప్పగా సత్కరించారు. రష్యా సోషలిస్టు విప్లవం తర్వాత ఆయన రష్యాలో అడుగుపెట్టారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆయన పేరు మీద ఒక స్టాంప్‌ను విడుదల చేసి తమ కృతజ్ఞతను ప్రకటించుకుంది. రష్యా ప్రభుత్వం ఆయనను ‘‘మానవాళి రక్షకుడు’’గా ప్రకటించింది. కరోనాను ఎదుర్కోవడానికి కూడా ఎంతోమంది శాస్త్రవేత్తలు, సంస్థలు వ్యాక్సిన్‌ను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పటి కన్నా ఇప్పుడు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎన్నో ఉన్నతమైన మార్పులు వచ్చాయి. లూయీస్ పాశ్చర్, వ్లాదిమిర్ హాఫ్కైన్ల స్ఫూర్తితో సాగు తున్న ఈ పరిశోధనలు, ప్రయోగాలు విజయవంతం అవుతాయని ఆశిద్దాం. హాఫ్‌కైన్ లాంటి ఒక శాస్త్రయోధుడినే కాదు, ప్రపంచ జనావళిని ఆదుకునేందుకు ఎందరో, ఎందరెందరో శాస్త్రయోధులను సృష్టించు కోవాల్సిన తక్షణ అవసరం ప్రపంచం ముందుంది. ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే మరెందరో హాఫ్కైన్లు పుట్టుకురావాలని మనసారా కోరుకుందాం. (జూలై 18, హాఫ్‌కైన్ తనను తాను వ్యాక్సిన్ ప్రయోగానికి సమర్పించుకున్నరోజు) మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
రాష్ట్రాలకు సాయమే కీలకం
కోవిడ్–19 గత చరిత్ర కనీవినీ ఎరుగని రీతిలో ఒక ప్రపంచ ప్రళయాన్ని సృష్టించింది. ఇది అంతర్జాతీయ మహా విపత్తు. ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వంపై బాధ్యత ఇంకా పెరుగుతుంది. కరోనాపై పోరుకు లాక్‌డౌన్‌నే ముఖ్యమైన ఆయుధంగా భావిస్తున్నాం. నిజానికి ఇది పరిష్కారం కాదు. ఊపిరి పీల్చుకునే ఒక అవకాశం మాత్రమే. ఈ సమయంలో మనం వైద్య రంగంలో అన్ని రకాల అస్త్రాలను సమకూర్చుకోవాలి. కేంద్రం వెంటనే ఒక సమగ్ర వ్యూహాన్ని రూపొందిం చాలి. ఇందులో రాష్ట్రాలకు ఆర్థిక వనరులను, వైద్య పరికరాలనూ, మందులను సమకూర్చుకోవడం, పనులు కోల్పోయిన ప్రజలను ఆదుకోవడానికి ప్రాధాన్యతను ఇవ్వాలి. కేంద్రం ఎట్లా స్పందిస్తుంది? ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది? అనేదాన్ని బట్టి కోటానుకోట్ల భారతజాతి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ‘‘భారతదేశంలోని రాష్టాలన్నింటినీ కలిపి ఒక గుంపుగా తయారుచేయాలనే ఆలోచన నాకు నచ్చడంలేదు. భారతదేశం స్వతంత్రంగా సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం కావాలి. బ్రిటిష్ పాలనలో భాగంగా రూపొందిన 1935 భారత చట్టం కన్నా శక్తివంతంగా కేంద్ర ప్రభుత్వం ఉండాలి. అందుకు తగ్గట్టుగా భారత రాజ్యాంగ సభ, దానికి సంబంధించిన నిబంధనలన్నింటినీ మనం రూపొందించ బోయే రాజ్యాంగంలో చేర్చాలి’’ అంటూ 17 డిసెంబర్, 1946న బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగసభలో చేసిన తనమొదటి ప్రసం గంలో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే రాజ్యాంగంలో కేంద్రా నికి ఎన్నో అసాధారణ అధికారాలను అప్పగించారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేసే 356 అధికరణాన్ని కూడా రాజ్యాం గంలో చేర్చారు. చాలాసార్లు కేంద్రానికున్న విశేషాధికారాలపై విమ ర్శలు ఉత్పన్నం అయ్యాయి. అంబేడ్కర్ ప్రజాక్షేమంకోసం బలమైన కేంద్రం అవసరమని భావించారు. అధికారాలతోపాటు, కొన్ని బాధ్య తలను కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ, రాజ్యాంగంలో కొన్ని అధికరణలను పొందుపరిచారు. ‘భారత ప్రజల శ్రేయస్సును, సంక్షే మాన్ని సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో పెంపొందించడానికి భారత ప్రభుత్వం కృషి చేయాలి. ప్రజల మధ్య, వివిధ వృత్తులను అనుసరించే వ్యక్తుల మధ్య మాత్రమే కాకుండా, రాష్ట్రాల మధ్య ఉన్న అసమానతలను తొలగించడానికి కృషి చేయాలంటూ’ రాజ్యాంగం తన ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్నది. ముఖ్యంగా వరదలు, కరువులు, ఉప్పెనలు, భూకంపాల లాంటి విపత్తులను జాతీయ విపత్తులుగా గుర్తించాలని కూడా మన చట్టాలలో పొందుపరుచుకున్నాం. అత్యంత విపత్కర పరిస్థితులనెదుర్కొనే సామర్థ్యం రాష్ట్రాలకు ఉండదు. కేంద్ర సాయం అత్యంతావశ్యం. యావత్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోన్న కోవిడ్–19 గత చరిత్ర కనీవినీ ఎరుగని రీతిలో ఒక ప్రపంచ ప్రళయాన్ని సృష్టించింది. మాన వజాతి మనుగడకే ప్రశ్నార్థకంగా మారిన ఈ విపత్కర స్థితి ఈ జాతికి సంభవించిన అన్ని విపత్తులకన్నా మించిన విపత్తు. ఈ సమయంలోనే కేంద్రంపై బాధ్యత ఇంకా పెరుగుతుంది. ఏవో కొన్ని ప్రాంతాలు మినహా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలూ కరోనా దాడికి అతలా కుతలం అవుతున్నాయి. దీనిని ఎదుర్కోవడానికి కేంద్రంతో సహా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. దీనివల్ల ఈ వ్యాధి తొందరగా వ్యాపించకుండా ఉంటుందని భావిస్తున్నారు. కానీ కోవిడ్ –19ను ఎదుర్కోవడానికి లాక్డౌన్ ఒక్కటే పరిష్కారమా? అంటే ఎంతమాత్రం కాదనే చెప్పాల్సి వస్తుంది. నిజానికి కరోనా విజృంభణను ఎదుర్కోవడానికి మూడు రకాల వ్యూహాలు అవసరం. ఒకటి ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి వైద్య సదుపాయాలను, మందులను, పరికరాలను సమకూర్చుకోవడం తక్షణావసరం. రెండవది ఎవరైతే తాత్కాలికంగా పనులు కోల్పోయారో, కోల్పోతారో వారందరినీ గుర్తించి కొంత కాలంపాటు సహాయం అందించేందుకు ప్రభుత్వాలు సిద్ధం కావాలి. అంతేకాకుండా చిన్న, మధ్యతరహా పరిశ్రమలను నిర్వ హిస్తున్న యాజమాన్యాలు నిలదొక్కుకునే విధంగా ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించడం చాలా కీలకం. మూడవది రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం తోడ్పాటు. కేంద్రం ప్రత్యేకమైన గ్రాంట్లను విడుదల చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చొరవ కేవలం నైతిక మైనదే. ఆర్థికంగా కేంద్రం ఎటువంటి సమగ్ర విధానాన్నీ ప్రకటించ లేదు. తాత్కాలికంగా లక్షా 70 వేల కోట్లు కేటాయించామని మొదట కేంద్రం ప్రకటించింది. కానీ ఇప్పటికి విడుదల చేసింది 17,287 కోట్లు, ఇందులో 6,195 కోట్లు 15వ ఆర్థిక సంఘం రెవెన్యూలోటు గ్రాంటు కింద అందించినవి. ఇందులో కూడా రెండు తెలుగు రాష్ట్రాలు తెలం గాణ, ఆంధ్రప్రదేశ్‌లకు తీరని అన్యాయమే జరిగింది. తెలంగాణకు కేవలం 224 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు 559 కోట్లు విడుదల చేశారు. ప్రస్తుత కల్లోల సమయంలో ఈ నిధులు ఏ మూలకూ సరిపోవు. దీంతోపాటు దేశ వ్యాప్తంగా జన్‌ధన్ ఖాతాల్లోకి మరో 15 వేల కోట్లు జమచేశారు. కరోనా భయంకర మహమ్మారి అని చెపుతూ, దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని ప్రధాని దేశ ప్రజలకు సందేశమి చ్చారు. కానీ ఈ మహమ్మారిని తరిమికొట్టడం మాటలతో సాధ్యం కాదు. మాటలతో మనసుకి ఉపశమనం కలగొచ్చు, కానీ అంతిమంగా కార్యాచరణే ప్రజలను కాపాడగలుగుతుంది. ఇంతటి కీలక సంద ర్భంలో కేంద్రం మౌనముద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆర్థిక అలజడిని సృష్టి స్తోంది. గత నెల 23వ తేదీ నుంచి లాక్డౌన్ ప్రారంభమైంది. అంటే మార్చిలో మూడింట రెండు వంతుల ఆదాయం వచ్చింది. అందులో సగం జీతాలు ఇచ్చి, మిగతావి రెండు రాష్ట్రాలూ రిజర్వులో పెట్టుకు న్నాయి. ఏప్రిల్ నెల పూర్తిగా ఆదాయం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ లాంటి వివిధ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం శూన్యమని మనందరికీ తెలిసిందే. ఇది రెండు మూడు నెలలతో ముగిసేది కాదు. భవిష్యత్తు అనూహ్యంగా ఉంది. పైగా రెండు ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభిం చాయి. వాటి మీదే ఆధారపడిన ఏ దిక్కూలేని లక్షలాది మంది పేద ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటున్నారు. పెన్షన్ల చెల్లింపు అత్యంత కీలకం. మొదటి తారీఖు కల్లా ఖాతాల్లోకి వెళ్ళాలి. లేదంటే పూటగడవని స్థితిలో వేలాది మంది ఉంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని విజ్ఞప్తులు చేశారు. దానికి ఎటువంటి స్పందన లేదు. ఆయన అడుగుతున్న దాంట్లో మొదటిది హెలికాప్టర్ విధానం ద్వారా అదనపు కరెన్సీని ముద్రించి కరెన్సీని చలామణిలోకి తేవడాన్ని చాలా మంది ఆర్థిక వేత్తలు సమర్థిస్తున్నారు. ప్రణబ్ సేన్ అనే ఆర్థిక వేత్త ‘‘రిజర్వు బ్యాంకు తన నిబంధనలను సడలించి కరెన్సీని, రిజర్వులను విడుదల చేయాలి. దీని వల్ల ద్రవ్యోల్బణం వస్తుందని తెలుసు. దానిని తర్వాత ఎదుర్కోవచ్చు. ముందుగా ప్రజలను ప్రత్యేకించి కోట్లాది మంది శ్రమజీవులను కాపాడుకోవాలి. చిన్న చిన్న వ్యాపారులను, పరిశ్రమ లను రక్షించుకోవాలి’’ అని స్పష్టం చేశారు. రిజర్వు బ్యాంకు దగ్గర రిజర్వులో ఉన్న నిధులను విడుదల చేయాలంటే, పార్లమెంటు ఆమోదం కావాలి కనుక అందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు జీఎస్డీపీలో 3 శాతం వరకు మాత్రమే అప్పు తీసుకునే అవకాశం ఉన్నది. దానిని అయిదు శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునే అవకాశం ఉంటుంది. దీనిపై కేంద్రం నుంచి ఎటువంటి సమాధానం లేదు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం కరోనాను ఎదుర్కోవడానికి లాక్‌డౌన్‌నే ముఖ్యమైన ఆయుధంగా భావిస్తున్నాం. నిజానికి ఇది పరిష్కారం కాదు. ఊపిరి పీల్చుకునే ఒక అవకాశం మాత్రమే. ఈ సమయంలో మనం వైద్య రంగంలో అన్ని రకాల అస్త్రాలను సమకూర్చుకోవాలి. కానీ అవి ఆశించినంతగా అమ లౌతోన్న దాఖలాల్లేవు. ఇప్పటికే ఎంతోమంది డాక్టర్లు, వైద్య సిబ్బంది సరైన రక్షణ కవచాలు లేకవ్యాధి బారినపడ్డారు. పడుతున్నారు. ఇది ఇట్లాగే కొనసాగితే వైద్యులు పారిపోయే పరిస్థితి వస్తుంది. ప్రాణ భయం ఎవ్వరికైనా ఒక్కటే. అందుకే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక సమగ్ర వ్యూహాన్ని రూపొందించాలి. ఇందులో రాష్ట్రాలకు ఆర్థిక వనరులను సమకూర్చు కోవడం, వైద్య పరికరాలనూ, మందులను సమకూర్చుకోవడం, పనులు కోల్పోయిన ప్రజలను ఆదుకోవడం, మిలియన్ల కొద్దీ టన్నుల బియ్యం ఎఫ్సీఐలలో ఏళ్ళకొద్దీ మూలుగుతోంది. గోడౌన్లలోని ధాన్యాన్ని వెలికి తీసి, ప్రజల ఆకలి తీర్చేందుకు ఉపయోగించాలి. మొత్తంగా ఈ రోజు దేశ ఆర్థిక వ్యవస్థను పునఃపరిశీలించాలి. ఈ ఆర్థిక సంవత్సరానికి ఆమోదించుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ లన్నింటినీ పునఃసమీక్షించాలి. ఒకరకంగా మన ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వనరులను ఉపయోగించాలి. కేంద్రం దగ్గర మాత్రం డబ్బు ఎక్కడ ఉంటుందనే తేలికైన వాదన వెనువెంటనే వస్తుంది. నిజమే. కానీ కేంద్రం దగ్గర రిజర్వు బ్యాంకు నిధులున్నాయి. అవి చాలకపోతే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల నుంచి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునే అవకాశం కేంద్రానికి ఉంది. కేంద్రం ఎట్లా స్పంది స్తుంది? ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది? అనేదాన్ని బట్టి కోటా నుకోట్ల భారత జాతి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. నిద్రించే వారిని మేల్కొల్పడం వీలవుతుంది. కానీ నిద్ర నటిస్తూ ఉంటే మాత్రం యావత్ దేశం ప్రమాదంలో పడిపోవడం ఖాయం. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
దళితులపై హింసపట్ల స్పందన ఏది?
భారత పౌరసత్వ సవరణ చట్టం బహు గొప్ప విషయంగా భావిస్తున్న నాయకులు, మేధావులు తమ దేశంలో తమ పౌరులపై సమాజం చేస్తోన్న దురాగతాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లో హిందువులపై జరుగుతున్న హింస, వివక్షను పట్టించుకోవడం తప్పు కాదు. కానీ నీ పౌరులు,నీ దేశం బిడ్డలు, నీకు ఓట్లు వేసి గెలిపించిన నీ ఓటర్లు వేలాదిగా కుల హింసకు రాలిపోతుంటే, దేశంలో జరుగుతున్న అరాచకాలను చూసీచూడనట్లు నటిస్తూ, పరోక్షంగా వాటిని ప్రోత్సహిస్తున్నట్టు కాక మరేమిటి? ఈ స్థాయిలో దళితులపైనా, మైనారిటీలపైనా జరుగుతున్న హింస వారిని ఏ తీరాలకు నెడుతోంది? కొత్తగా పౌరసత్వం ఇవ్వడం అటుంచి, ఈ గడ్డమీద పుట్టి ఈ గడ్డమీదే పెరిగిన ఎందరో బిడ్డలు క్షణక్షణం ప్రాణభయంతో భీతిల్లుతోన్న స్థితిలో వీరంతా ఎక్కడ తలదాచుకోవాలి? ‘‘ఒక వ్యక్తి స్వేచ్ఛను కోల్పోతే, మొత్తం సమాజం సర్వస్వం కోల్పోతుంది. ఒక వ్యక్తి స్వాతంత్య్రాన్ని నిరాకరిస్తే సమాజం నిర్మాణం జరగదు. ఇది సమాజానికీ, మనిషికీ ఉన్న వైరుధ్యం. ఒక వ్యక్తి తన శక్తి సామ ర్థ్యాలను ప్రదర్శించడానికి సంపూర్ణ స్వేచ్ఛకావాలి. వ్యక్తిగత స్వేచ్ఛ, సమాజం స్వాతంత్య్రం రెండూ పరస్పర ఆధారితాలు.’’ మహాత్మా గాంధీ వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రాల గురించి చేసిన వ్యాఖ్యానమిది. ప్రభుత్వాలకైనా, సమాజానికైనా, సమూహాలకైనా, వ్యక్తులకైనా ఈ మాటలు శిరోధార్యాలు కావాలి. అయితే గత కొంతకాలంగా భారత దేశంలో జరుగుతున్న పరిణామాలు ఇటువంటి వాతావరణాన్ని కల్పించకపోగా, మరింత ఆందోళనకర పరిస్థితులను సృష్టిస్తున్నాయి. భారతదేశంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఆమోదం పొందిన తర్వాత ప్రజల్లో పెరిగిన అశాంతిని ప్రభుత్వాలు లక్ష్యపెట్టడంలేదు. పైగా ఈ చట్టాన్ని ఒక చారిత్రక సంఘటనగా అభివర్ణిస్తున్నారు. పైగా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తోన్న వాళ్ళందరినీ దేశద్రోహులుగా ముద్ర వేస్తున్న పరిస్థితి భిన్నాభిప్రాయాలను సహించలేని తత్వాన్ని బయట పెడుతోంది. పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో హింసకు గురై నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పించి, వారికి పౌరసత్వం ఇవ్వడమే ఈ చట్టం ఉద్దేశ్యమని వాదిస్తున్నారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తోన్నవారిని మానవత్వం లేని మనుషులుగా చిత్రీకరిస్తున్న పరిస్థితి ఆందోళనకు గురిచేస్తోంది. ఆయా దేశాల్లో ముస్లిమేతరులపై, ప్రత్యేకించి హిందువుల పట్ల వివక్ష పెరిగినమాట వాస్తవమే, వారిపై దాడులూ నిజమే. ఎవరైతే అక్కడి నుంచి పారిపోయి వచ్చారో వారిని ఆదుకోవడం మానవ త్వమే. అయితే ఆ పని మనదేశం ఒక్కటే చేయడం లేదు. చాలా యూరప్ దేశాలు ఇతర దేశాల నుంచి రక్షణ కోసం వలసవచ్చిన వారిని ఆదుకుంటున్నాయి. శరణార్థులుగా వారికి అండగా నిలుస్తు న్నాయి. కానీ మన దేశంలో మతప్రాతిపదిక మీద జరుగుతున్న ఈ ప్రక్రియ కొంత అనుమానాస్పదంగా ఉంది. పొరుగుదేశాల్లో హిందు వులపై జరుగుతున్న దాడులను చాలా దయార్ద్ర హృదయంతో అర్థం చేసుకొని ఈ కార్యక్రమాన్ని రూపొందించామంటున్నారు కానీ.. తాము పాలిస్తున్న గడ్డమీద జరుగుతోన్న భయానకమైన దాడుల విష యంలో ఇప్పటి వరకు ప్రభుత్వం పెదవి విప్పి ఒక్కమాట కూడా మాట్లాడినట్టు కనపడకపోవడానికి కారణం ఎప్పుడైనా ఆలోచిం చారా? దీన్నెవరైనా ప్రశ్నిస్తే వారిని దేశ ద్రోహులుగానూ, సమాజ విద్రోహులుగానూ పేర్కొంటోన్న పరిస్థితి. ఇటీవల జెఎన్యూ పరిణామాలు అందుకు ఒక ఉదాహరణ మాత్రమే. పొరుగు దేశాల్లో హిందువులపై జరుగుతున్న దాడులతో పోలిస్తే దేశంలోని దళితులపై జరుగుతున్న దాడులు ఏవీ తక్కువ కాదన్న విషయాన్ని గ్రహించాలి. మనదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 72 ఏళ్ళు దాటాయి. ఇంత కాలం తర్వాత కూడా దళితులపైనా, అణగారిన వర్గాలపైనా జరుగు తున్న అత్యాచారాల లెక్కలను చూస్తూ కూడా మానవత్వం ఉన్న పెద్దలకు ఎందుకు మనసు చలించడం లేదో అర్థం కాదు. ఈ దేశంలో అంటరాని కులాలకు తమ సామాజిక వర్గాన్ని ఏ పేరున పిలవాలో నిర్ణయించుకునే హక్కు లేదు. దళిత అనే పదాన్ని సైతం వాడరా దంటూ నిషేధం విధించారు. ఈ గడ్డమీద పుట్టి, ఈ మట్టిలో పెరిగిన అదే సామాజిక వర్గాలకు గానీ, లేదా ఇతర మతస్తులకు గానీ తమకు నచ్చిన ఆహారం తీసుకునే కనీస హక్కులేదు. పిలిచే పేరునీ, తినే తిండినీ ఒక సామాజిక వర్గం శాసించే స్థితి ఈ వ్యవస్థ వాస్తవికతకు దర్పణంగా నిలుస్తుంది. 1950 నుంచి 1994 వరకు ప్రత్యేకంగా దళితుల మీద జరిగిన అత్యాచారాల లెక్కలను జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్సీఆర్బీ) డాక్యుమెంట్లలో పొందపరచలేదు. అయితే 1994 నుంచి 2018 వరకు అందుబాటులో ఉన్న లెక్కలను పరిశీలిస్తేనే హృదయమున్న ప్రతిమనిషీ చలించక తప్పదు. 1994 నుంచి 2018 వరకు కేవలం 24 ఏళ్లలో 16 వేల ఏడు మంది హత్యకు గుర య్యారు. 37,596 మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. ఆధిపత్య కులాల దాడుల్లో 82,335 మంది తీవ్రగాయాల పాల య్యారు. ఇందులో ఎంతో మంది అంగవికలులయ్యారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి మనిషిని మానవత్వం వైపు నడిపిస్తుందని భావించడం తప్పేమీ కాదు. అది భారతదేశంలో పూర్తిగా అబద్ధమని తేలిపోయింది. ప్రతియేటా హత్యలు, అత్యాచారాలు, దాడుల సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గు తున్న దాఖలాల్లేవు. కుల విద్వేషం ప్రత్యేకించి అంటరాని కులాల పట్ల ఉన్న ద్వేషం ఈ దాడులకు కారణంగా భావించక తప్పదు. 1994లో 546 మంది దళితులు హత్యకు గురైతే, 2004లో అది 654కి చేరింది. 2014 వచ్చేసరికి 704 మంది దళితులు హత్యకు గుర య్యారు. భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హత్యల సంఖ్య మరింత పెరిగింది. 2018 లెక్కల ప్రకారం 798 మంది కుల హింసకు బలయ్యారు. అదేవిధంగా 1994లో 992 మంది దళిత మహిళలపై కులోన్మాద అత్యాచారాలు జరిగితే, 2004 వచ్చేసరికి 1157 మందికి ఆ సంఖ్య చేరింది. 2014లో 2233 మంది దళిత మహిళలు అత్యాచారాలకు, హింసకు బలయ్యారు. భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంఖ్య తారాస్థాయికి చేరింది. 2015లో 2326, 2016లో 2541, 2017లో 2714, 2018లో 2936 మంది దళిత మహిళలపై అత్యాచారాలు జరిగాయి. మొత్తం ఈ 24 ఏళ్ళలో ఎనిమిది లక్షల 24వేల 652 కేసులు నమోదయ్యాయి. 1994లో 33,908 కేసులు నమోదుకాగా, 2018లో 42793 కేసులు రిజిస్టర్ అయ్యాయి. కానీ శిక్షలు పడింది మాత్రం అత్యల్పం. 2017– 18 హోంమంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం కేవలం 16.3 శాతం శిక్షలు పడినట్టు నమోదైంది. చాలా కేసుల్లో కింది స్థాయి న్యాయస్థానాలు విధించిన శిక్షలను హైకోర్టులు, సుప్రీంకోర్టులు కొట్టివేసి, నిందితు లను నిర్దోషులుగా వదిలిపెడుతున్నాయి. ఇక్కడ కుల పక్షపాతమే ప్రధానంగా కనిపిస్తున్నది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన చుండూరు కేసు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఎంతో సంచలనం సృష్టించిన ఆ కేసులో ముద్దాయి లందరూ నిర్దోషులుగా హైకోర్టు తీర్పు చెప్పడం ఎంతో బాధను, ఆవేదనను కలిగించింది. 1994కు ముందు జరిగిన కొన్నివేల సంఘటనలకు సంబంధించి ప్రభుత్వాలు లెక్కలు చూపడం లేదు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలులోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ సంఘటనలను ప్రత్యేకంగా చూపెట్టారు. మొత్తం ఏడు దశాబ్దాల భారత రాజ్యాంగం అమలులో 45 సంవత్సరాల పాటు దళితులపై జరిగిన అత్యాచారాల లెక్కలే నమోదుకాలేదు. సరాసరి లెక్కలను కనుక చూస్తే ప్రతి సంవత్సరం కనీసం 500 మంది దళితులు హత్యకు గురైతే, ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 23 వేలకు చేరుకుంది. అంటే, ఇప్పటి వరకు 40 వేల మంది దళితులు కుల హింసకు, అంటరానితనమనే దుర్మార్గానికీ బలయ్యారు. అదే విధంగా 45 సంవత్సరాలలో అత్యాచారాలకు బలైన మహిళల సంఖ్య ఇంకొక 40 వేలకు కలిపితే 60 వేలకుపైగా మహిళలు అత్యాచారాలకు బలయ్యారు. ఈ స్థాయిలో హింస జరిగినా కూడా ఇక్కడున్న పాల కులకు దీనిని నివారించాలని గానీ, నిర్మూలించాలనిగానీ అనిపించ కపోవడం, కులతత్వం అనుకోవాలా? మానవత్వం అనుకోవాలా? భారత పౌరసత్వ సవరణ చట్టం బహు గొప్ప విషయంగా భావిస్తున్న నాయకులు, మేధావులు తమ దేశంలో తమ పౌరులపై సమాజం చేస్తోన్న దురాగతాల గురించి ఆలోచించాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లో హిందువులపై జరుగుతున్న హింస, వివక్షను పట్టించుకోవడం తప్పుకాదు. కానీ నీ పౌరులు, నీ దేశం బిడ్డలు, నీకు ఓట్లు వేసి గెలిపించిన నీ ఓటర్లు వేలాదిగా కుల హింసకు రాలిపోతుంటే, దేశంలో జరుగుతున్న అరాచకాలను చూసీచూడనట్లు నటిస్తూ, పరోక్షంగా వాటిని ప్రోత్సహిస్తున్నట్టు కాక మరేమిటి? నీ దేశం పట్ల ఇంత నిర్లక్ష్యం ఏ మానవత్వా నికి, ఏ రాజనీతిజ్ఞతకు అద్దం పడుతుందో అంతుపట్టదు. ఈ స్థాయిలో దళితులపైనా, మైనారిటీల పైనా జరుగుతున్న హింస వారిని ఏ తీరాలకు నెడుతోంది? కొత్తగా పౌరసత్వం ఇవ్వడం అటుంచి, ఈ గడ్డమీద పుట్టి ఈ గడ్డమీదే పెరిగిన ఎందరో బిడ్డలు క్షణక్షణం ప్రాణభయంతో భీతిల్లుతోన్న స్థితిలో వీరంతా ఎక్కడ తలదాచుకోవాలి? ఎక్కడికి పారిపోవాలి? ఏ దేశంలో తమ చిరునామాని వెతుక్కోవాలి? ఎవరి శరణుకోరాలి? ఇదే ఇప్పుడు ఈ దేశపాలకులు నిర్లక్ష్యం చేయకూడని తక్షణ సమస్య. ఇప్పటికైనా ఈ విషయాల్లో ప్రభుత్వాలు, వ్యక్తులు, సంఘాలు, సంస్థలు సమూహాలు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
ధనస్వామ్యానికి చట్టసభల దాసోహం
ఓటు వేసే కోట్లాదిమంది ప్రజలకు తాము ఓటు వేసే ప్రతినిధుల పట్ల నూటికి నూరు శాతం విశ్వాసంలేదు. ఓటు వేసి గెలిపించిన తర్వాత ప్రజాప్రతినిధుల వ్యవహారశైలి అసంతృప్తినే మిగులుస్తున్నది. గడచిన లోక్‌సభ 2014లో వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు పారిశ్రామిక వేత్తల సంఖ్య 20 శాతానికి పెరిగింది. అంటే దాదాపు వంద మందికి పైగా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు ప్రజాప్రతినిధులుగా పార్లమెంటులోకి అడుగుపెట్టారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఎక్కువ భాగం పారిశ్రామిక వేత్తలకూ, పెట్టుబడిదారులకూ లబ్ధి చేకూర్చేవిగా ఉన్నాయి. దీనివల్ల పేదలు, సామాన్య ప్రజలు ప్రభుత్వాల దృష్టి నుంచి జారిపోయారు. ‘‘ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగి ఉండడం, ప్రజల అభిప్రాయాలకు అమిత మైన గౌరవం ఇవ్వడం, వాళ్ళ తలలో నాలుకలాగా మెలగడం, ప్రజలు సాగించే కార్యకలాపాలకు అండదండగా నిలబడడం, ప్రజల కోసం ఎటువంటి త్యాగానికైనా వెనుదీయకపోవడం నిజమైన ప్రజాప్రతినిధికి ఉండాల్సిన లక్షణాలలో కొన్ని ప్రధానమైన అంశాలు. అయితే అవి మాత్రమే సరిపోవు. ప్రజల క్షేమం, సంక్షేమం, ప్రగతితో పాటు, ప్రజలకు ఏమి కావాలో, దేశానికీ, సమాజానికీ ఏది అవసరమో, ఏది కాదో నిర్ణయించుకోగలిగే వివేచన, విచక్షణా జ్ఞానం ప్రజాప్రతినిధికి ఉండాల్సిన గుణాలలో అత్యుత్తమమైనది’’ అంటూ 1774 నవంబర్, 3న గ్రేట్ బ్రిటన్‌లోని బిస్టల్లో ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త, రాజనీతిజ్ఞుడు ఎడ్మండ్ బర్క్ చేసిన ప్రసంగంలోని మాటలివి. ఆనాడు అక్కడి పౌరులతో మాట్లాడుతూ, ప్రజలు ఏది చెబితే అదే వేదమని కూడా నమ్మకూడదనీ, వాళ్ళు చెప్పిన దాంట్లో మంచీ, చెడులను బేరీజు వేసుకోగలిగే శక్తి ఉండాలనీ, ప్రజలు ఆశించిన దానితో పాటు, వాళ్ళకు ఏది అవసరమో తెలుసుకొని, ప్రజలను ఒప్పించగలిగే మేధో శక్తి ప్రజాప్రతినిధులకు అవసరమని కూడా ఎడ్మండ్ బర్క్ స్పష్టం చేశారు. ఎడ్మండ్ బర్క్ పద్ధెనిమిదవ శతాబ్దంలో రాజకీయ పరిణామాలను విశ్లేషించిన గొప్ప రాజనీతిశాస్త్రవేత్త. బాబాసాహెబ్ అంబేడ్కర్ లాంటి వాళ్ళు చాలా మంది ఎడ్మండ్ బర్క్ రచనల నుంచి ఎంతో స్ఫూర్తిని పొందారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ రాసిన ‘కుల నిర్మూలన’ పుస్తకంలో ఎడ్మండ్ బర్క్ వ్యాఖ్యానాలను ఉటంకించడం విశేషం. అయితే ప్రస్తుతం ఎడ్మండ్ బర్క్ ప్రస్తావన ఎందుకనే ప్రశ్న రాకమానదు. భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు జరిగే ఈ ఎన్నికల్లో 543 మంది లోక్‌సభ సభ్యులను మన ప్రతినిధులుగా ఎన్నుకోబోతున్నాం. అయితే ఓటు వేసే కోట్లాదిమంది ప్రజలకు తాము ఓటు వేసే ప్రతినిధుల పట్ల నూటికి నూరు శాతం విశ్వాసంలేదు. చాలాసార్లు అయిష్టంగానో, ఏం చేయాలో తోచని నిర్లిప్తతల మధ్య ఓట్లు వేయకతప్పని పరిస్థితుల్లో కూడా ఓట్లు వేస్తున్నారు. ఓటు వేసి గెలిపించిన తర్వాత ప్రజాప్రతినిధుల వ్యవహారశైలి అసంతృప్తినే మిగులుస్తున్నది. ఇటీవల కాలంలో ఇది మరింత పెరిగింది. అసంతృప్తినీ, అశాంతినీ మిగిల్చిన పరిస్థితులను సహిస్తూ ప్రజలు ఎల్లకాలం అట్లాగే ఉంటారని భావించకూడదు. ప్రజలు తమ అవసరాలకు తగ్గట్టుగా ఉండగలిగే వ్యవస్థను సృష్టించుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. శాంతియు తంగా, సాయుధంగా సాగిన ఎన్నో ఉద్యమాలు, విప్లవాలు ప్రజల ఆశలనూ, ఆకాంక్షలనూ నెరవేర్చుకునే మార్గాలయ్యాయి. పరిస్థితులు మారుతున్న కొద్దీ కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అందుకే ఈ సందర్భంలో జరుగుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి, అందులో పాత్రధారులైన ప్రజాప్రతినిధులు, ఓటర్ల గురించి కొంత చర్చించుకోవడం అవసరమనిపిస్తోంది. ఆనాటి జనపదాల ఆదిమ ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి, నేటి ప్రజాస్వామ్య వ్యవస్థల దాకా భారత దేశం ఎన్నో అనుభవాలను చవిచూసింది. మరెన్నో పాఠాలను, గుణపాఠాలను నేర్చుకున్నది. విదేశీ పాలకులు, స్వదేశీ రాజులు సాగించిన రాచరిక పాలనను కూడా భారత దేశం రుచిచూసింది. పదిహేడవ శతాబ్దం నుంచి బ్రిటిష్ పాలకులు సాగించిన పాలన కూడా భారత దేశానికి ఎన్నో విషయాలను నేర్పిం చింది. అందుకే 1947వ సంవత్సరంలో బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత ఎటువంటి పాలనావ్యవస్థ ఉండాలనే అంశం మీద సుదీర్ఘమైనా, లోతైన చర్చ జరిగింది. అన్ని రకాల వ్యవస్థలనూ పరిశీలించిన అనంతరం భారత దేశానికి ప్రజాస్వామ్య వ్యవస్థ అవసరమని భావించారు. అందులో కూడా ఆమెరికాలో లాగా, అధ్యక్ష తరహా పాలన కావాలా? బ్రిటన్‌లో లాగా పార్లమెంటరీ వ్యవస్థ కావాలా? అనే అంశంపై రాజ్యాంగసభలో పెద్దలు సుదీర్ఘంగా చర్చిం చారు. అయితే చాలా మంది పార్లమెంటరీ వ్యవస్థవైపే మొగ్గుచూపారు. అధ్యక్షతరహా పాలన నియంతృత్వ విధానాలకు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. పార్లమెంటరీ వ్యవస్థలో అటువంటి చెడు పరిణామాలకు తావుండదని భావించారు. పార్లమెంటరీ వ్యవస్థ నిజమైన ప్రజల భాగస్వామ్యానికీ, ప్రజాస్వామ్య స్ఫూర్తికీ బాటలు వేస్తుందని రాజ్యాంగసభ అభిప్రాయపడింది. అయితే అందులో ఇద్దరు పాత్రధారులు. ఒకరు ప్రజాప్రతినిధులు, రెండోవారు ఓటర్లు. అయితే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ గత ఏడు దశాబ్దాలుగా అందించిన అనుభవాలను మనం ఒకసారి మననం చేసుకోవడం అవసరం. ప్రజల భాగస్వామ్యంతో కొనసాగే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే నిర్ణేతలు. భారత రాజ్యాంగంలోని పీఠికలో కూడా ‘భారత ప్రజలమైన మేము’ అని మొదలవుతుంది. అంటే భారతదేశ ప్రజలందరూ ఆమోదించినవిగా భావించాలి. భారత ప్రజలందరి తరఫున కొంత మంది బాధ్యత తీసుకొని మన రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆ తర్వాత అది ప్రజలందరూ ఆమోదించినదిగా మనం భావిస్తున్నాం. అట్లాగే భారత దేశంలో పాలన సాగించాలంటే 120 కోట్ల మంది ప్రజలు ఒక చోట కూర్చొని నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదు. అందుకే నిర్ణీత జనాభా కలిగిన ప్రాంతానికి ఒక ప్రతినిధిని ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. దానినే ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ అంటున్నాం. అంటే 543 మంది లోక్‌సభ సభ్యులు 120 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధులు. అందుకే వారి మీద చాలా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ప్రజల తరఫున వారే ఆయా సభలలో ప్రజల ఆర్థిక, సామాజికాభివృద్ధితోపాటు ప్రజలు ఎదుర్కొంటోన్న అనేక సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇటీవలి పరిణామాలు దానికి భిన్నంగా ఉన్నాయి. ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్న వాళ్ళ స్వభావాన్ని బట్టి చూస్తే ప్రజాస్వామ్యం ఎదుర్కొంటోన్న సంక్షోభం అర్థం అవుతుంది. లోక్‌సభలో వృత్తుల వారీగా సభ్యుల స్వభావాన్ని బట్టి చూస్తే ప్రస్తుత పరిస్థితులు మనకు అర్థం అవుతాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మొదటి లోకసభ నుంచి తొమ్మిదవ లోక్‌సభ వరకు అంటే 1952 నుంచి, 1989 వరకు వ్యాపారస్తులుగా, పారిశ్రామికవేత్తలుగా చెప్పుకోదగిన వాళ్ళెవరూ ఆయా సభల్లో ఉండేవారు కాదు. అట్లా తమను తాము ప్రకటించుకున్న వారు చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. కానీ గడచిన లోక్‌సభ 2014లో వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు పారిశ్రామిక వేత్తల సంఖ్య 20 శాతానికి పెరిగింది. అంటే దాదాపు వంద మందికి పైగా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు ప్రజాప్రతినిధులుగా పార్లమెంటులోకి అడుగుపెట్టారు. అయితే పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులెవరైనా పౌరులే కదా? వారికి మాత్రం పోటీచేసే హక్కులేదా? అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఎక్కువ భాగం పారిశ్రామిక వేత్తలకూ, పెట్టుబడిదారులకూ లబ్ధి చేకూర్చేవిగా ఉన్నాయి. దీనివల్ల పేదలు, సామాన్య ప్రజలు ప్రభుత్వాల దృష్టి నుంచి జారిపోయారు. అటవీ ప్రాంతాల్లో సహజవనరులను, ఖనిజాలను కొన్ని కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నాలు జరిగాయి. జరుగుతున్నాయి. అంతే కాకుండా, ప్రభుత్వ రంగంలో లాభాలతో నడిచే పరిశ్రమలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పుతున్నారు. ప్రభుత్వ సంస్థలు నిర్వహించే ఉత్పత్తులను, పరిశ్రమ కార్యకలాపాలు కొద్ది మంది పారిశ్రామికవేత్తలకు అప్పజెప్పుతున్నారు. ఇది పూర్తిగా దేశంలో ఆర్థిక వ్యత్యాసాలను పెంచే ప్రక్రియగా సాగుతున్నది. ఎన్నడూ లేనంతగా ప్రజాధనం కొద్ది మంది చేతుల్లోకి చేరిపోతోంది. అంతేకాకుండా, పారిశ్రామక వేత్తలు, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు ధనవంతులు తమ వ్యాపార ప్రయోజనాల కోసం గతంలో ఎన్నడూలేని విధంగా వందల కోట్ల రూపాయలను ఎన్నికల్లో వెదజల్లుతున్నారు. ఆ విధంగా ప్రజలను ఒకరకంగా ఓట్లు అమ్ముకునే అవినీతిపరులుగా తయారుచేస్తున్నారు. ఓట్లు కొనడానికి మాత్రమే కాదు, సభలకు జనాన్ని సమీకరించడానికి కూడా డబ్బులు గుమ్మరిస్తున్నారు. దీనివల్ల ఎన్నికల ప్రక్రియ పూర్తిగా అవినీతిమయమైపోయింది. అందుకే లోక్‌సభలు, శాసనసభలు ఈ రోజు డబ్బున్న వాళ్ళకు దాసోహమైపోయాయి. అయితే ఇక్కడే రెండవ పాత్ర పోషించే ఓటర్లు ఇప్పటికైనా తమ బాధ్యతను గుర్తెరగాలి. ఓటు వేసే వరకే ప్రజాస్వామ్యమనే భావన మనందరిలో ఉంది. నిజమే అది ముఖ్యమే. కానీ ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న వేల, లక్షల కోట్ల బడ్జెట్ నిధులు ఏమైపోతున్నాయనే విషయంలో ఎవరికీ పట్టింపులేదు. ఒకనాటి ప్రధాని రాజీవ్‌గాంధీ చెప్పినట్టు ప్రభుత్వం అభివృద్ధి పేరుతో చేస్తున్న ఖర్చులో కేవలం 18 శాతం మాత్రమే ప్రజలకు చేరుతుందనే అభిప్రాయం ఈనాటికీ నిజం. అందుకే ప్రజాధనమైన బడ్జెట్ నిధులు సక్ర మంగా అమలు జరిగే నిఘా వ్యవస్థ ప్రజల నుంచి ఉద్భవించాలి. అప్పుడు పారిశ్రామిక వేత్తలకు, కాంట్రాక్టర్ల ఇండ్లల్లోకి ధనప్రవాహం ఆగిపోతుంది. అప్పుడు ప్రభుత్వంలోకి రావడానికి వారు ఇష్టపడరు. దానితో నిజమైన ప్రజాసేవ చేసే ప్రజానాయకులు ప్రజల నుంచే పుట్టుకొస్తారు. అటువంటి ప్రయత్నం ఎప్పుడైనా ప్రారంభం కావచ్చు. తాత్కాలికంగా చరిత్ర గతిని మరల్చగలరేమో, చరిత్ర పరిణామక్రమంలో మార్పు అనివార్యం, ఆ మార్పుని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదన్నది కూడా అనేక సార్లు రుజువవుతూ వచ్చింది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
కారు చీకట్లలో చైతన్య దీప్తులు
కొత్త కోణం కేరళ సమాజం వర్ణ, కుల విభేదాలతో చీలిపోయి, అశాంతితో ఉన్న కాలంలో శ్రీ నారాయణ గురు సాగించిన సాంఘిక సంస్కరణోద్యమం అందరిదీ ఒకటే కులమని, అందరికీ దేవుడు ఒకడేనని చాటింది. గురు స్ఫూర్తితో అంటరాని పరయా కులానికి చెందిన అయ్యంకాళి కులాధిపత్యానికి, వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. గురు ఉద్యమం విద్య, విజ్ఞానంతో సాగితే, అయ్యంకాళికి ప్రతిఘటన తప్పలేదు. ఈ ఇద్దరు వ్యక్తులు, రెండు ఉద్యమాలు రగిల్చిన చైతన్యమే కేరళలో ప్రగతిశీల, ప్రజాస్వామ్య భావాల వ్యాప్తికి, అభివృద్ధికి పునాదులను వేశాయి. గ్రామ పరిపాలనలో, విద్య, వైద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో, మహిళా, శిశు సంక్షేమంలో మనం మొదటగా చెప్పుకునే రాష్ట్రం కేరళ. ప్రజాభివృద్ధి ప్రస్థానంలో ఆ రాష్ట్రం యావత్ భారతంలో ప్రప్రథమ స్థానంలో నిలుస్తోం దంటే అందుకు కారణం అక్కడి మట్టి నుంచి పుట్టిన చైతన్యపు కెరటాలే. కేరళ చరిత్రలో 19వ శతాబ్దం చివరి అర్ధభాగం నుంచి 20వ శతాబ్దం మొదటి అర్థభాగం వరకు జరిగిన ఎన్నో సంఘర్షణలు, సంస్కరణలే ఈనాటి ప్రగతికి సోపానాలు. ఈ ప్రయాణంలో ఎన్నో సంస్థలు, వ్యక్తులు, సంఘాలు, ఉద్య మాలు ఉన్నప్పటికీ ఈ రోజు ఇద్దరు వ్యక్తులను, రెండు ఉద్యమాలను మన నం చేసుకోవాల్సి ఉంది. కేరళలో 1855 ఆగస్టు 26న జన్మించిన శ్రీ నారా యణ గురు, 1863 ఆగస్టు 28న జన్మించిన అయ్యంకాళి ఆ ప్రాంత చరిత్రను తిరగరాశారు. శ్రీ నారాయణ గురు ఉద్యమమే దళిత ఉద్యమ పోరాట యోధుడు అయ్యంకాళికి స్ఫూర్తినిచ్చింది. వివక్ష, ఆంక్షల చెరసాలలో... ‘‘నేను ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో పర్యటిస్తున్నాను. కేరళకు చెందిన స్వామి నారాయణ గురును మించిన గొప్ప ఆధ్యాత్మికవేత్త నాకు ఎక్కడా తారసపడలేదని నిజాయితీగా ఒప్పుకుంటున్నాను’’ అంటూ రవీంద్రనాథ్ ఠాగూర్ చేసిన వ్యాఖ్యలు నారాయణ గురు ఔన్నత్యాన్ని చాటుతున్నాయి. మహా త్మాగాంధీ హరిజనోద్ధరణ కార్యక్రమం రూపుదిద్దుకోవడానికి ముందే నారాయణ గురును కలిసి మతం, కులం, మతాంతరీకరణ, అంటరానితనం లాంటి అనేక సమస్యలపై మాట్లాడారు. అంటే నారాయణ గురు ప్రభావం మహాత్మాగాంధీ మీద ఉన్నదని అర్థం. నారాయణ గురు సామాజిక కార్య క్రమంలో ప్రవేశించే నాటికి కేరళలో కులవ్యవస్థ బలంగా ఉండేది. అణచి వేత, వివక్షలు విపరీతంగా సాగుతుండేవి. కులాల అడ్డుగోడలు ప్రజల మధ్య అశాంతికి కారణమయ్యాయి. ఆధిపత్య కులాలకు అదనపు సౌకర్యాలు, హద్దుమీరిన హక్కులు, కింది కులాలకు ఆంక్షలు, అమానుష శిక్షలు అమ లులో ఉండేవి. ఆధిపత్య కులాలుగా సవర్ణుల జాబితాలో నంబూద్రీలు (కేరళ బ్రాహ్మణులు), క్షత్రియులు ఉంటే ఆ తరువాత స్థానంలో శూద్రులుగా పిలిచే నాయర్లు ఉండేవారు. ఈళవ (ఎజవ)లు అవర్ణుల జాబితాలో పైస్థాయిలో ఉండగా, పులయ, పరయ, నాయాదీలు ఇంకా దిగువన అంటరానివారుగా ఉండేవారు. అగ్రవర్ణాలతో నిమ్నకులాలు కలిసినప్పుడు వారు ఎంత దూరం పాటించాలో కూడా నిర్ణయించారు. నంబూద్రీలకు, దేవాలయ గర్భగుడికి క్షత్రియులు కనీసం రెండడుగుల దూరాన్ని పాటించాలి. నాయర్లు 16 అడు గుల దూరం, ఈళవలు 32 అడుగుల దూరం, పులయ, పరయలు 64 అడు గుల దూరం. నాయాదీలనే మరో అంటరాని కులం నంబూద్రీల కనుచూపు మేరలో కూడా కనిపించకూడదు. పొరపాటున ఏ నాయాదీనైనా బ్రాహ్మ ణులు చూస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అవర్ణులలోని అంటరానికులాలైన పులయ, పరయ, నాయాదీలపై మరిన్ని తీవ్ర ఆంక్షలుండేవి. ఏ అవర్ణుడైనా నిర్ణీత దూరాన్నిమించి ఒక నంబూద్రికి దగ్గరగా వచ్చినట్లయితే తీవ్ర శిక్షలు ఉండేవి. అవర్ణులను చంపిన ఘటనలు కూడా ఉన్నాయి. నిమ్న కులాలకు గుర్తుగా ఆ కులాల స్త్రీలు ఛాతీ మీద వస్త్రాలు కప్పుకోవడానికి, రవికలు తొడుక్కోవడానికి వీలులేదు. అవరు ్ణలంతా చెప్పులు తొడుక్కోడానికి అనర్హులు. వర్షం పడుతున్నా గొడుగులు వాడకూడదు. మంచి బట్టలు వేసుకోరాదు, నగలు ధరించరాదు. ఆధిపత్య కులాలతో మాట్లాడేటప్పుడు ‘‘తమ బానిసను మాట్లాడుతున్నాను’’ అని మొదలు పెట్టాలి. ‘‘మనుషులందరిదీ ఒకే కులం, ఒకే దేవుడు’’ ఇటువంటి పరిస్థితుల్లో 1855 ఆగస్టు 26న శ్రీ నారాయణ గురు ఈళవ కులం లో పుట్టారు. ఈ కులం అవర్ణులలో ఎగువ స్థాయిలో ఉన్నప్పటికీ వారికి పాఠ శాలల్లో, దేవాలయాల్లో ప్రవేశం ఉండేది కాదు. అయితే ఈ కులంలో కొంద రికి భూములుండేవి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉండేది. జనాభాలో వీరు 30 శాతం వరకు ఉండేవారు. బంధుమిత్రుల సహకారంతో నారాయణ గురు తల్లిదండ్రులు కుమారునికి విద్యాబుద్ధులు నేర్పించారు. గురు ఆయు ర్వేద వైద్యం, సంస్కృతం, తత్వశాస్త్రం, హిందూ మత గ్రంథాల్లో మంచి పరిజ్ఞానం సంపాదించారు. అయితే ఆయన తను నేర్చుకున్న విద్యను పుల య, పరయ కులాల పిల్లలకు నేర్పడానికి ప్రయత్నిస్తే ఈళవ కులంతోపాటు, తల్లిదండ్రులు కూడా వ్యతిరేకించారు. దానితో ఇల్లు విడిచిపెట్టి, ఈ వివక్షను పోగొట్టడానికి మార్గాలను అన్వేషించారు. అనేక మంది వ్యక్తులతో, సంస్థ లతో, క్రైస్తవ, ముస్లిం మత పెద్దలతో చర్చలు జరిపారు. అంటరాని కులాల ఇళ్లలో ఉన్నారు. అందరితో సహవాసం చేశారు. చివరకు ముల్లును ముల్లుతోనే తీయాలని... తిరువనం తపురం సమీపంలోని ‘అరువిప్పురం’ అనే గ్రామంలో 1888 శివరాత్రి ఉదయం ఒక శివలింగాన్ని ప్రతిష్టించారు. దేవాలయాల్లోకి ప్రవేశం లేదని ఆవేదన చెందే ప్రజలకు ఇది పెద్ద ఊరటనిచ్చింది. అక్కడే నారాయణ గురు ఒక గురుకులాన్ని, ఒక సంస్కృత పాఠశాలను ప్రారంభించారు. ఆయన అలా కేరళ, తమిళనాడు, కర్ణాటక, శ్రీలంకల్లో అరవై దేవాలయాలను నిర్మించారు. ప్రతి దేవాలయం గోడల మీద ఉండే ‘‘మనుషులందరిదీ ఒకే కులం, ఒకే దేవుడు’’ ‘‘కులం అడగొద్దు, కులం చెప్పొద్దు, కులం గురించి ఆలోచిం చొద్దు’’ ‘‘మతం ఏదైనా మనిషిని ఎదగ నివ్వాలి’’ అనే నినాదాలు ప్రజలను మేల్కొల్పేవి. అయితే, నారాయణ గురు అనతికాలంలోనే ఆలయాల నిర్మా ణానికి స్వస్తి చెప్పి, నిమ్న కులాల వారి చదువులు, ఆర్థిక పరిస్థితిని మెరు గుపరచడం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ‘‘విద్య ద్వారా స్వేచ్ఛ, సంఘటి తమవడం ద్వారా శక్తి, పరిశ్రమించడం ద్వారా ప్రగతి’’ అనే సూక్తులు కేరళ లోని నిమ్నవర్గాల ప్రజలను, ప్రత్యేకించి ఈళవ కులస్తులను చైతన్య పరి చాయి. ఆయన తన ఉద్యమాన్ని సంఘటితం చేయడానికి డాక్టర్ పల్పు వంటి వాళ్లతో కలిసి ‘శ్రీ నారాయణ గురు ధర్మ పరిపాలనా యోగం’ (ఎస్ఎన్డీపీ) అనే సంస్థను స్థాపించారు. కులం ముళ్ల కంచెల్లో రగిలిన చైతన్యం మరొక పోరాట యోధుడు అయ్యంకాళి ఇదే కాలంలో కులాధిపత్యానికి, వివ క్షకు వ్యతిరేకంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆయన తిరువనంతపురా నికి దగ్గరలోని వెంగనూరులో పులయ అంటరాని కులంలో జన్మించారు. ఆయనకు చదువులేదు. కూలిగా పనిచేశాడు. నారాయణ గురు ఉద్యమం విద్య, విజ్ఞానంతో సాగితే, అయ్యంకాళికి ప్రతిఘటనా పోరాటం చేపట్టడం, రక్తం చిందించడం తప్పలేదు. అవర్ణులలోని పైస్థాయి వారైన ఈళవలను కొం త వ్యతిరేకతతోనైనా సమాజం అంగీకరించింది. కానీ అంటరాని పులయ, పరయలను వర్ణ సమాజం, ఆధిపత్య కులాలు గుర్తించడానికి ఇష్టపడలేదు. అందుకే సంఘర్షణ అనివార్యమైంది. రక్తపాతం జరిగింది. సమాజంలో ఎన్ని వైరుధ్యాలున్నా, కులాల మధ్య ఎన్ని విభేదాలున్నా, అంటరాని కులాల విష యానికి వచ్చేసరికి ఇనుప కంచెలు మొలుస్తాయన్న అంబేడ్కర్ మాటలు అక్షరసత్యాలయ్యాయి. పులయలు వీధుల్లో నడవరాదనే ఆంక్షలను అయ్యంకాళి ఎదిరించారు. అనేక మంది యువకులతో నడక పోరాటాన్ని చేపట్టారు. బలరామాపురం లోని చళియార్ బజార్‌కు చేరుకునేసరికి అగ్రవర్ణాల గుంపు ఎదురు నిలి చింది. కోట్లాట మొదలై, ఇరువర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. దీన్ని కేరళలో దళితుల మొదటి సాయుధ ఘర్షణగా చెప్పుకోవచ్చు. పులయలు సంఘటితమవుతుండటంతో ఆధిపత్య కులాలు దాడులకు దిగాయి. అయ్యం కాళి వాటిని ఎదిరించడానికి ఆత్మరక్షణ దళాలను నిర్మించారు. ఉద్యమాన్ని సంఘటితం చేయడానికి ‘సాధుజన పరిపాలన సంఘం’ స్థాపించారు. దాని తరఫున కొన్ని డిమాండ్లతో ప్రభుత్వానికి దరఖాస్తులను సమర్పించారు. వాటిలో ఒకటైన పాఠశాలల్లో అంటరాని కులాల పిల్లలను చేర్చుకోవడం పట్ల ఆనాటి ట్రావెంకూర్ సంస్థానం దివాను రాజగోపాలాచారి సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు ఇచ్చారు. భూస్వాములు వాటి అమలుకు నిరాకరిం చారు. దీనికి విరుగుడుగా అయ్యంకాళి ‘‘మీరు మా పిల్లలను చదువుకోనివ్వక పోతే మీ పొలాల్లో పిచ్చిగడ్డి మొలుస్తుంది. మీ పొలాలు బీళ్ళు పడతాయి’’ అని హెచ్చరించారు. దీనితో భూస్వాములు దిగివచ్చారు. అయితే ఒక అమ్మా యిని బడిలో చేర్పించడానికి వెళ్తే ఆధిపత్య కులాల వారు దాడిచేశారు. దానిని అయ్యంకాళి ప్రతిఘటించారు. ఇట్లా కొన్ని పదుల సంఘర్షణలు జరిగాయి. అయ్యంకాళిని హత్యచేయడానికి కిరాయి గూండాలతో దాడి చేయించారు. ట్రావెంకూర్ సంస్థానం ప్రజాసభలో పులయల సమస్యలపై, ప్రత్యేకించి విద్యాసౌకర్యాల కల్పన గురించి ఆయన చేసిన ప్రసంగాలు అందరినీ ఆకట్టు కున్నాయి. దేశ చరిత్రలోనే మొదట కూలీల సమ్మెను నిర్వహించిన ఘనత అయ్యంకాళిదే. సభకు పోలీసులు అనుమతి నిరాకరిస్తే, సమీపంలోని సము ద్రంలో పడవలన్నింటిని ఒక చోటకి చేర్చి సభ నిర్వహించిన గొప్ప ఉద్యమ వ్యూహకర్త అయ్యంకాళి. ఆయనది అత్యంత సాహసోపేతమైన ప్రతిఘటనా ఉద్యమం. శ్రీ నారాయణ గురు సంస్కరణోద్యమం, అయ్యంకాళి ప్రతిఘటనోద్య మం తర్వాతి కాలంలో కేరళ కమ్యూనిస్టు ఉద్యమానికి బీజాలు వేశాయి. అం తేకాదు కేరళలో ప్రగతిదాయకమైన, ప్రజాస్వామ్య భావాలకు, అభివృద్ధికి పునాదులను వేశాయి. కేరళ చైతన్యానికి శ్రీకారం చుట్టిన శ్రీ నారాయణ గురు, అయ్యంకాళి చిరస్మరణీయులు. మల్లెపల్లి లక్ష్మయ్య (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213.