కోవిడ్–19 గత చరిత్ర కనీవినీ ఎరుగని రీతిలో ఒక ప్రపంచ ప్రళయాన్ని సృష్టించింది. ఇది అంతర్జాతీయ మహా విపత్తు. ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వంపై బాధ్యత ఇంకా పెరుగుతుంది. కరోనాపై పోరుకు లాక్‌డౌన్‌నే ముఖ్యమైన ఆయుధంగా భావిస్తున్నాం. నిజానికి ఇది పరిష్కారం కాదు. ఊపిరి పీల్చుకునే ఒక అవకాశం మాత్రమే. ఈ సమయంలో మనం వైద్య రంగంలో అన్ని రకాల అస్త్రాలను సమకూర్చుకోవాలి. కేంద్రం వెంటనే ఒక సమగ్ర వ్యూహాన్ని రూపొందిం చాలి. ఇందులో రాష్ట్రాలకు ఆర్థిక వనరులను, వైద్య పరికరాలనూ, మందులను సమకూర్చుకోవడం, పనులు కోల్పోయిన ప్రజలను ఆదుకోవడానికి ప్రాధాన్యతను ఇవ్వాలి. కేంద్రం ఎట్లా స్పందిస్తుంది? ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది? అనేదాన్ని బట్టి కోటానుకోట్ల భారతజాతి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.
‘‘భారతదేశంలోని రాష్టాలన్నింటినీ కలిపి ఒక గుంపుగా తయారుచేయాలనే ఆలోచన నాకు నచ్చడంలేదు. భారతదేశం స్వతంత్రంగా సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం కావాలి. బ్రిటిష్ పాలనలో భాగంగా రూపొందిన 1935 భారత చట్టం కన్నా శక్తివంతంగా కేంద్ర ప్రభుత్వం ఉండాలి. అందుకు తగ్గట్టుగా భారత రాజ్యాంగ సభ, దానికి సంబంధించిన నిబంధనలన్నింటినీ మనం రూపొందించ బోయే రాజ్యాంగంలో చేర్చాలి’’ అంటూ 17 డిసెంబర్, 1946న బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగసభలో చేసిన తనమొదటి ప్రసం గంలో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే రాజ్యాంగంలో కేంద్రా నికి ఎన్నో అసాధారణ అధికారాలను అప్పగించారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేసే 356 అధికరణాన్ని కూడా రాజ్యాం గంలో చేర్చారు.
చాలాసార్లు కేంద్రానికున్న విశేషాధికారాలపై విమ ర్శలు ఉత్పన్నం అయ్యాయి. అంబేడ్కర్ ప్రజాక్షేమంకోసం బలమైన కేంద్రం అవసరమని భావించారు. అధికారాలతోపాటు, కొన్ని బాధ్య తలను కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ, రాజ్యాంగంలో కొన్ని అధికరణలను పొందుపరిచారు. ‘భారత ప్రజల శ్రేయస్సును, సంక్షే మాన్ని సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో పెంపొందించడానికి భారత ప్రభుత్వం కృషి చేయాలి. ప్రజల మధ్య, వివిధ వృత్తులను అనుసరించే వ్యక్తుల మధ్య మాత్రమే కాకుండా, రాష్ట్రాల మధ్య ఉన్న అసమానతలను తొలగించడానికి కృషి చేయాలంటూ’ రాజ్యాంగం తన ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్నది. ముఖ్యంగా వరదలు, కరువులు, ఉప్పెనలు, భూకంపాల లాంటి విపత్తులను జాతీయ విపత్తులుగా గుర్తించాలని కూడా మన చట్టాలలో పొందుపరుచుకున్నాం. అత్యంత విపత్కర పరిస్థితులనెదుర్కొనే సామర్థ్యం రాష్ట్రాలకు ఉండదు. కేంద్ర సాయం అత్యంతావశ్యం.
యావత్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోన్న కోవిడ్–19 గత చరిత్ర కనీవినీ ఎరుగని రీతిలో ఒక ప్రపంచ ప్రళయాన్ని సృష్టించింది. మాన వజాతి మనుగడకే ప్రశ్నార్థకంగా మారిన ఈ విపత్కర స్థితి ఈ జాతికి సంభవించిన అన్ని విపత్తులకన్నా మించిన విపత్తు. ఈ సమయంలోనే కేంద్రంపై బాధ్యత ఇంకా పెరుగుతుంది. ఏవో కొన్ని ప్రాంతాలు మినహా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలూ కరోనా దాడికి అతలా కుతలం అవుతున్నాయి. దీనిని ఎదుర్కోవడానికి కేంద్రంతో సహా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. దీనివల్ల ఈ వ్యాధి తొందరగా వ్యాపించకుండా ఉంటుందని భావిస్తున్నారు.
కానీ కోవిడ్ –19ను ఎదుర్కోవడానికి లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారమా? అంటే ఎంతమాత్రం కాదనే చెప్పాల్సి వస్తుంది. నిజానికి కరోనా విజృంభణను ఎదుర్కోవడానికి మూడు రకాల వ్యూహాలు అవసరం. ఒకటి ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి వైద్య సదుపాయాలను, మందులను, పరికరాలను సమకూర్చుకోవడం తక్షణావసరం. రెండవది ఎవరైతే తాత్కాలికంగా పనులు కోల్పోయారో, కోల్పోతారో వారందరినీ గుర్తించి కొంత కాలంపాటు సహాయం అందించేందుకు ప్రభుత్వాలు సిద్ధం కావాలి. అంతేకాకుండా చిన్న, మధ్యతరహా పరిశ్రమలను నిర్వ హిస్తున్న యాజమాన్యాలు నిలదొక్కుకునే విధంగా ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించడం చాలా కీలకం. మూడవది రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం తోడ్పాటు. కేంద్రం ప్రత్యేకమైన గ్రాంట్లను విడుదల చేయాలి.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చొరవ కేవలం నైతిక మైనదే. ఆర్థికంగా కేంద్రం ఎటువంటి సమగ్ర విధానాన్నీ ప్రకటించ లేదు. తాత్కాలికంగా లక్షా 70 వేల కోట్లు కేటాయించామని మొదట కేంద్రం ప్రకటించింది. కానీ ఇప్పటికి విడుదల చేసింది 17,287 కోట్లు, ఇందులో 6,195 కోట్లు 15వ ఆర్థిక సంఘం రెవెన్యూలోటు గ్రాంటు కింద అందించినవి. ఇందులో కూడా రెండు తెలుగు రాష్ట్రాలు తెలం గాణ, ఆంధ్రప్రదేశ్‌లకు తీరని అన్యాయమే జరిగింది. తెలంగాణకు కేవలం 224 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు 559 కోట్లు విడుదల చేశారు. ప్రస్తుత కల్లోల సమయంలో ఈ నిధులు ఏ మూలకూ సరిపోవు. దీంతోపాటు దేశ వ్యాప్తంగా జన్‌ధన్ ఖాతాల్లోకి మరో 15 వేల కోట్లు జమచేశారు. కరోనా భయంకర మహమ్మారి అని చెపుతూ, దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని ప్రధాని దేశ ప్రజలకు సందేశమి చ్చారు. కానీ ఈ మహమ్మారిని తరిమికొట్టడం మాటలతో సాధ్యం కాదు. మాటలతో మనసుకి ఉపశమనం కలగొచ్చు, కానీ అంతిమంగా కార్యాచరణే ప్రజలను కాపాడగలుగుతుంది.
ఇంతటి కీలక సంద ర్భంలో కేంద్రం మౌనముద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆర్థిక అలజడిని సృష్టి స్తోంది. గత నెల 23వ తేదీ నుంచి లాక్‌డౌన్ ప్రారంభమైంది. అంటే మార్చిలో మూడింట రెండు వంతుల ఆదాయం వచ్చింది. అందులో సగం జీతాలు ఇచ్చి, మిగతావి రెండు రాష్ట్రాలూ రిజర్వులో పెట్టుకు న్నాయి. ఏప్రిల్ నెల పూర్తిగా ఆదాయం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్‌టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ లాంటి వివిధ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం శూన్యమని మనందరికీ తెలిసిందే. ఇది రెండు మూడు నెలలతో ముగిసేది కాదు. భవిష్యత్తు అనూహ్యంగా ఉంది. పైగా రెండు ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభిం చాయి. వాటి మీదే ఆధారపడిన ఏ దిక్కూలేని లక్షలాది మంది పేద ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటున్నారు. పెన్షన్ల చెల్లింపు అత్యంత కీలకం. మొదటి తారీఖు కల్లా ఖాతాల్లోకి వెళ్ళాలి. లేదంటే పూటగడవని స్థితిలో వేలాది మంది ఉంటారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని విజ్ఞప్తులు చేశారు. దానికి ఎటువంటి స్పందన లేదు. ఆయన అడుగుతున్న దాంట్లో మొదటిది హెలికాప్టర్ విధానం ద్వారా అదనపు కరెన్సీని ముద్రించి కరెన్సీని చలామణిలోకి తేవడాన్ని చాలా మంది ఆర్థిక వేత్తలు సమర్థిస్తున్నారు. ప్రణబ్ సేన్ అనే ఆర్థిక వేత్త ‘‘రిజర్వు బ్యాంకు తన నిబంధనలను సడలించి కరెన్సీని, రిజర్వులను విడుదల చేయాలి. దీని వల్ల ద్రవ్యోల్బణం వస్తుందని తెలుసు. దానిని తర్వాత ఎదుర్కోవచ్చు. ముందుగా ప్రజలను ప్రత్యేకించి కోట్లాది మంది శ్రమజీవులను కాపాడుకోవాలి. చిన్న చిన్న వ్యాపారులను, పరిశ్రమ లను రక్షించుకోవాలి’’ అని స్పష్టం చేశారు. రిజర్వు బ్యాంకు దగ్గర రిజర్వులో ఉన్న నిధులను విడుదల చేయాలంటే, పార్లమెంటు ఆమోదం కావాలి కనుక అందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇప్పటి వరకు జీఎస్‌డీపీలో 3 శాతం వరకు మాత్రమే అప్పు తీసుకునే అవకాశం ఉన్నది. దానిని అయిదు శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునే అవకాశం ఉంటుంది. దీనిపై కేంద్రం నుంచి ఎటువంటి సమాధానం లేదు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం కరోనాను ఎదుర్కోవడానికి లాక్‌డౌన్‌నే ముఖ్యమైన ఆయుధంగా భావిస్తున్నాం. నిజానికి ఇది పరిష్కారం కాదు. ఊపిరి పీల్చుకునే ఒక అవకాశం మాత్రమే. ఈ సమయంలో మనం వైద్య రంగంలో అన్ని రకాల అస్త్రాలను సమకూర్చుకోవాలి. కానీ అవి ఆశించినంతగా అమ లౌతోన్న దాఖలాల్లేవు. ఇప్పటికే ఎంతోమంది డాక్టర్లు, వైద్య సిబ్బంది సరైన రక్షణ కవచాలు లేకవ్యాధి బారినపడ్డారు. పడుతున్నారు. ఇది ఇట్లాగే కొనసాగితే వైద్యులు పారిపోయే పరిస్థితి వస్తుంది. ప్రాణ భయం ఎవ్వరికైనా ఒక్కటే.
అందుకే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక సమగ్ర వ్యూహాన్ని రూపొందించాలి. ఇందులో రాష్ట్రాలకు ఆర్థిక వనరులను సమకూర్చు కోవడం, వైద్య పరికరాలనూ, మందులను సమకూర్చుకోవడం, పనులు కోల్పోయిన ప్రజలను ఆదుకోవడం, మిలియన్ల కొద్దీ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐలలో ఏళ్ళకొద్దీ మూలుగుతోంది. గోడౌన్లలోని ధాన్యాన్ని వెలికి తీసి, ప్రజల ఆకలి తీర్చేందుకు ఉపయోగించాలి. మొత్తంగా ఈ రోజు దేశ ఆర్థిక వ్యవస్థను పునఃపరిశీలించాలి. ఈ ఆర్థిక సంవత్సరానికి ఆమోదించుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ లన్నింటినీ పునఃసమీక్షించాలి. ఒకరకంగా మన ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వనరులను ఉపయోగించాలి.
కేంద్రం దగ్గర మాత్రం డబ్బు ఎక్కడ ఉంటుందనే తేలికైన వాదన వెనువెంటనే వస్తుంది. నిజమే. కానీ కేంద్రం దగ్గర రిజర్వు బ్యాంకు నిధులున్నాయి. అవి చాలకపోతే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల నుంచి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునే అవకాశం కేంద్రానికి ఉంది. కేంద్రం ఎట్లా స్పంది స్తుంది? ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది? అనేదాన్ని బట్టి కోటా నుకోట్ల భారత జాతి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. నిద్రించే వారిని మేల్కొల్పడం వీలవుతుంది. కానీ నిద్ర నటిస్తూ ఉంటే మాత్రం యావత్ దేశం ప్రమాదంలో పడిపోవడం ఖాయం.
మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077
Comments
Please login to add a commentAdd a comment