దేశంలో ఎటువంటి పరిస్థితి తలెత్తినా అది ధనికుల సంపదనూ, బీదల సంఖ్యనూ మరింత పెంచేదిగా ఉండటం గమనార్హం. ‘కోవిడ్–19’ సమయంలో ఒకవైపున లక్షలు, కోట్లాది మంది ప్రాణాలు కోల్పోతున్న కాలంలో కూడా కోట్లకు పడగలెత్తుతూ వచ్చిన సంపన్నుల వైనం-దొంగ చేతికి తాళం అందించినట్టయింది. సకాలంలో సరైన మందులు వాడక పోవడంవల్ల మరణించిన వారికన్నా.. సామాజిక వ్యవస్థల్లో అసమానతల వల్ల చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువని గణాంకాలు వెల్లడిస్తుండటం మరొక చేదు వాస్తవం. ధనికుల సంపదపై పన్నులు తగ్గించడం వల్ల వారికి లాభం కలుగగా, సామాన్య మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం పెరిగింది. ఒక్క 2020లోనే ఇందువల్ల అత్యంత దారిద్య్రంలోకి జారుకున్న వారి సంఖ్య 4.6 కోట్లు.
రాజు (పాలకుడు) నోటినుంచి వచ్చిందీ; న్యాయస్థానాలు, న్యాయమూర్తుల లేదా మేజిస్ట్రేట్‌ల నుంచీ వెలువడే తీర్పులన్నీ ధర్మాలు కావనీ, హాస్యాస్ప దాలుగా ఉంటాయనీ నిరూపిస్తూ లోకరీతిని పొల్లుపోకుండా వివరించిన మేటి కథల్లో ఒకటి-సుప్రసిద్ధ కథకుడు పతంజలి చెప్పిన ‘పిలక తిరుగుడు పువ్వు’! ఒక గ్రామంలో కులాల వారీగా ప్రజలు రెండు ముఠాలుగా చీలిపోయి భూమి గుండ్రంగా ఉందని ఒక వర్గం; కాదు, భూమి బల్లపరుపుగా ఉందని మరో వర్గం భావించడంతో బయలుదేరిన కక్షల కారణంగా గొడవలు జరిగాయి.
పోలీసులు రెండు వర్గాల వారినీ పిలక పట్టుకుని తీసుకొచ్చి దొమ్మీ నేరంమీద, హింసాకాండ రెచ్చగొడుతున్నారన్న ఆరోపణ మీద కేసును మేజిస్ట్రేట్ ముందు దాఖలు చేశారు. న్యాయమూర్తి కేసును కొత్త తరహాలో విచారించడం మొదలుపెడతారు. ఎలా? జీవితమే నమ్మకాలకూ, ఆచరణకూ పొంతన లేకుండా ఉంది కాబట్టి, జీవితమే బల్లపరుపుగా ఉంది కనుక ఫలానా ఊళ్లో ఇలాంటి తగవు తలెత్తిందని భావించిన న్యాయమూర్తి.. నిజానికి భూమి గుండ్రంగా ఉంటే జీవితం ఇలా ఉండదనీ, అందుకే భూమి బల్లపరుపుగా ఉందనీ తీర్పు చెప్పి రెండు పక్షాల కక్షిదారుల్ని విడుదల చేసేశారు!
మా రాజులు, మా పాలకులు ఏమిటంటే కోర్టువారు కూడా అదే రైటన్నప్పుడు (భూమి గుండ్రంగా లేదు, బల్లపరుపుగా ఉందని).. కోర్టును మాత్రం పాలకుడు ఎందుకు గౌరవించాలని అడుగుతారు. ఏతావాతా పాలకుడికి సమర్థనగా కోర్టు ‘చట్టబద్ధంగా ఏర్పడిన భారత గణతంత్ర వ్యవస్థను కుట్రపూరితంగా కూల్చివేయడానికి కుత్సిత బుద్ధితో ప్రతిపక్షం (ముద్దాయిలు) పన్నిన పన్నాగం’ అని తీర్పు చెప్పడం... నేటి ‘పిలక తిరుగుడు పువ్వులు’గా మారిన కొందరి పాలకుల నడవడికగా కనిపిస్తుంది.
స్వార్థ ప్రయోజనాలు
అలా దూసుకువచ్చిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల తతంగం ద్వారా దేశంలో ఎక్కడా, ఏ రాష్ట్రంలోనూ లేని 80 మంది పార్లమెంటు సభ్యులతో దేశ పాలనను చేతిలో పెట్టుకుని దేశాన్ని ఉత్తర-దక్షిణ భారతాలుగా చీల్చి ఏలుబడి సాగించుకుంటున్నారన్న అపవాదును యూపీ ఆధారంగా పాలకులు మూటగట్టుకుంటున్నారు. ఈ వాస్తవాన్ని గ్రహించిన భారత రాజ్యాంగ ప్రధాన నిర్ణేత అయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఉత్తర-దక్షిణ భారతాల పేరిట చీలుబాటలకు అడ్డుకట్ట వేయడానికే దక్షిణ భారత ప్రత్యేక రాజధానికి బీజావాపనం చేశారని గుర్తించాలి.
ఉత్తరప్రదేశ్ కేంద్రంగా జరుగుతున్న ఈ ‘బహుళార్థ సాధక’ రాజకీయ కుట్రలకు, వక్ర రాజకీయాలకు స్వస్తి చెప్పాలన్నదే అంబేడ్కర్ ఆకాంక్ష అని మరచిపోరాదు. అంతకన్నా ఘోరమైన, అనూహ్యమైన పరిణామం-జాతీయ స్థాయి గొప్ప సంస్థగా పేరుమోసిన ఒకనాటి నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)కి సారథ్యం వహిస్తూ వచ్చిన చిత్రా రామకృష్ణ ఉన్న ట్టుండి బీజేపీకి సన్నిహితుడైన ఒక యోగి పన్నిన వ్యూహంలో చిక్కుకోవడం.
అతగాడు చెప్పినట్టు నిర్ణయాలు తీసుకునే మైకంలో చిక్కుబడిపోయి తన వ్యక్తిత్వాన్ని మంటగలుపుకున్నదంటే-పాలక వర్గాల్లోని ‘గాడ్‌మెన్’ల ముసుగుల్లో స్వార్థ రాజకీయ పాలకుల ప్రయోజనాల్ని కాపాడుతూండటం వల్లనే ఇలాంటి విషమ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో హర్షద్ మెహతా లాంటి ‘నడమంత్రపు సిరి’ రాయుళ్లు దేశ ఆర్థిక వ్యవస్థకు తలపెట్టిన పూడ్చలేని హానికర పరిణామాలకు మరొక ఉదాహరణే చిత్రా రామకృష్ణ పతనం.
మరింత పేదరికంలోకి..
ఇదే సమయంలో ప్రపంచ దేశాల్ని కల్లోల పరుస్తోన్న ‘కోవిడ్-19’ అంటువ్యాధి సమయంలో ఒకవైపున లక్షలు, కోట్లాది మంది ప్రాణాలు కోల్పోతున్న కాలంలో కూడా కోట్లకు పడగలెత్తుతూ వచ్చిన సంపన్నుల వైనం-దొంగ చేతికి తాళం అందించినట్టయింది. కోవిడ్-19 వైరస్ వల్ల సకాలంలో సరైన మందులు వాడక పోవడంవల్ల మరణించిన వారికన్నా... సామాజిక వ్యవస్థల్లో అసమానతల వల్ల చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అత్యంత సంపన్న వర్గాలపై విధించే పన్నులను తగ్గించడంవల్ల ఆ పన్నుల భారాన్ని సామాన్య, మధ్యతరగతి ప్రజల భుజస్కంధాలపైన మోపడం వల్ల విషమ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక్క 2020లోనే ఇందువల్ల అత్యంత దారిద్య్రంలోకి జారుకున్న వారి సంఖ్య 4.6 కోట్లని తేలింది.
ప్రపంచంలో కొత్తగా పెరిగిన పేదల సంఖ్యలో వీరే సగంమంది ఉంటారని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అంతేగాదు, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ఫలితంగా... ఒక వైపున పేదలు, పేదరికం పరిధిలోకి జారడానికి దగ్గరలో ఉన్న నిరుపేదల సంఖ్య ఆర్థికంగా అత్యంత సంపన్న వర్గాలకు అనుకూలంగా దేశ ఆర్థిక వ్యవస్థను మలచడం వల్లనే పెరిగిపోతోందని ‘ఆక్స్‌ఫామ్’ సాధికార సంస్థ వెల్లడించింది. చివరికి పచ్చి హిందూ తత్వవాది, ఆరెస్సెస్ అధ్యక్షుడైన మోహన్ భగవత్ ‘ఒక వైపున ఆర్థిక ప్రగతి కనిపిస్తున్నా, ప్రపంచ ఆర్థిక సంపదపైన పెత్తనం మాత్రం కొలది మందిది మాత్రమే’ కొనసాగు తోందని స్పష్టం చేశారు.
ఇది మరీ విచిత్రమైన పరిణామం-దేశంలో అసాధారణంగా పెరిగిపోతున్న కొలదిమంది అత్యంత సంపన్నుల ఆస్తిపాస్తులను తైపారు వేసి చూస్తే-కొందరు మాత్రమే అగ్ర స్థానంలో ఉండటమేగాక, భారతదేశ సంపదపై ‘ఉగ్రరూపం’లో భల్లూకపు పట్టు సంపాదించారు. ఈ విషమ పరిణామాన్ని మన తరంలో మనం ఇప్పుడు దర్శిస్తున్నాం గానీ... సరళీకరణ, ప్రైవేటీ కరణ, ప్రపంచీకరణ పేర్ల చాటున ప్రపంచబ్యాంకు రుద్దే సంస్కరణల ప్రభావం ప్రజా బాహుళ్యంపైన ఎలా ఉంటుందో.. తొలుత ఆడమ్ స్మిత్ రాసిన ‘జాతుల సంపద’ అనే ప్రపంచ ప్రసిద్ధ ఆర్థిక శాస్త్ర అనర్ఘరత్నం తర్వాత, అంత గొప్పదిగా పేరుగాంచిన డాక్టర్ డేవిడ్ కార్టన్ రాసిన ‘కార్పొరేట్ రంగం ప్రపంచాన్ని ఏలబోతున్న వేళ’ (వెన్ కార్పొరేషన్స్ రూల్ ది వరల్డ్) అన్న గ్రంథం మరిన్ని సత్యాలను కళ్లకు కట్టి చూపింది. కార్టన్ కనీసం 15 ఏళ్ల నాడే ప్రపంచ దేశాలను ఇలా హెచ్చరించాడు:
శ్రీమంతుల కోసమేనా?
‘స్వల్పాదాయ వనరులున్న దేశాలలో శరవేగాన ప్రవేశపెట్టే ఆర్థిక ప్రగతి పథకాల వల్ల వచ్చే ఫలితం-శ్రీమంతులకు పనికివచ్చే ఆధు నిక ఎయిర్‌పోర్టులు, టెలివిజన్లు, భారీ ఎక్స్‌ప్రెస్ రహదార్లు, ఫ్లైఓవర్లు; సంపన్న వర్గాల అవసరాలు తీర్చిపెట్టే అత్యాధునిక ఎలెక్ట్రానిక్స్ వస్తువులతో నిండిన ఎయిర్ కండీషన్డ్ షాపింగ్ కేంద్రాలు, ఫ్యాషన్ లేబుల్స్ వగైరా. ఇందువల్ల అసంఖ్యాక ప్రజాబాహుళ్యం జీవన పరిస్థితులు మెరుగుపడవు. ఈ రకమైన ఆర్థిక ప్రగతి ఎగుమతుల్ని పెంచే ఆర్థిక వ్యవస్థను కోరుకుంటుంది. తద్వారా సంపన్న వర్గాలు కోరుకునే వస్తువుల కొనుగోలుకు అవసరమైన విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించడం దాని లక్ష్యం.
కాగా, ఈ తరహా అభివృద్ధి మూలంగా పేదల భూములన్నింటినీ కేవలం ఎగుమతుల్ని పెంచే వాణిజ్య పంటలకు మళ్లించేస్తారు. ఈ భూముల్ని సాగు చేసుకుంటూ వచ్చిన పాతకాపులందరూ బతుకుతెరువు కోసం, చాలీ చాలని కూలికి పట్టణ మురికివాడల్లో కుదురుకుని ఎగుమతులకు ఉద్దేశించిన వస్తూత్పత్తిలో పాల్గొనాల్సి వస్తుంది. తద్వారా కుటుం బాలు విచ్ఛిన్నమవుతాయి. సామాజిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే స్థితికి చేరుతుంది. హింస, దౌర్జన్యాలు సమాజంలో సర్వసామాన్య మైపోతాయి!’’ పదిహేను ఏళ్లనాడు డాక్టర్ కార్టన్ చేసిన ముందస్తు హెచ్చరిక నేటి మన దుస్థితికి చెరపలేని నిలువుటద్దం!
-ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment