కరోనా విలయానికి కారకులెవరు? | ABK Prasad Guest Column On Coronavirus | Sakshi
Sakshi News home page

కరోనా విలయానికి కారకులెవరు?

Published Tue, Mar 31 2020 1:01 AM | Last Updated on Tue, Mar 31 2020 8:30 AM

ABK Prasad Guest Column On Coronavirus - Sakshi

భారతీయ మహా కోటీశ్వరుల నుంచి భారతదేశం కోరుకునేది వారు ఖాళీ పళ్లేల్లో విది లించే ముష్టి కాదు. పీడనా, దోపిళ్లు లేని సమ సమాజ వ్యవస్థ (సోషలిస్టు వ్యవస్థ)ని! కరోనా వైరస్‌ అంటువ్యాధి నివారణకు మందు మహా కోటీశ్వరులు కారని భారతదేశం ఇప్పటికైనా గుర్తించడం అవసరం. దానికి బలమైన ఔషధం ప్రభుత్వ వ్యవస్థ మాత్రమేనని గుర్తించాలి. కరోనా అంటువ్యాధి కేవలం ప్రజల ఆయురా రోగ్యాల సమస్య మాత్రమే కాదు. అది పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షో భమనీ, పెట్టుబడిదారీ వర్గాల, వారి కార్పొరేషన్ల, వ్యవస్థకు చెందిన సామాజిక సంక్షోభమని మరచిపోరాదు. ఇందులోని సందేశం గోప్య మైనది కాదు. ఇది స్పష్టమైన బహిరంగ రహస్యం.
– దళిత రాజకీయ నాయకుడు జిగ్నేష్‌ మేవాని
(ది ప్రింట్, 25–03–2020)
‘‘దారిద్య్రం తాండవించే వ్యవస్థ ఎక్కడున్నా అది ప్రపంచంలో ప్రతిచోటా సంపదైశ్వర్యాలకు వినాశనమే తెచ్చిపెడుతుంది’’
– అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) రాజ్యాంగపత్రం హెచ్చరిక

సూర్యుని చుట్టూ ఉండాల్సిన కాంతివలయం (కరోనా) కాస్తా భూఖండవాసులకు ఆధునిక పరిభాషలో అకస్మాత్తుగా భ్రాంతి వలయంగా మారి, ప్రపంచదేశాలపై విషవాయువుల్ని ప్రసరింప చేస్తోంది. లక్షల, కోట్లాది ప్రజల ప్రాణాలను హరించే దశకు చేరుకుంది. అంటురోగం కాస్తా దేశాలు, ఖండాంతరాలు దాటి మహ మ్మారిగా మారింది. ఈ మహమ్మారి వ్యాధికి ఎవరు కారకులో, ఏ పరిస్థితులు కారణం, ఎక్కడ ప్రబలి, ప్రపంచాన్ని అలుముకుంటూ వచ్చిందన్నది నేడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అందుకు చెబు తున్న.. వ్యాప్తిలో ఉన్న, వ్యాప్తి చేస్తున్న కారణాలలో ఏది సత్యం, ఏదసత్యం అన్నది.. మిలియన్‌ డాలర్ల ప్రశ్న! మానవుడి శరీరమే క్రిముల జలాశయం (రిజర్వాయర్‌) కాబట్టి మన శరీరంలోని జన్యు కణాలు రకరకాల మార్పులకు నిలయంగా ఉంటాయి. ఆ మార్పు లలో కూడా మనిషి ఆరోగ్యానికి తోడ్పడే మంచి క్రిములు ఉంటాయి. మంచి వాటిని ప్రతిఘటించే చెడ్డ క్రిములూ ఉంటాయి.

నిత్యం ఈ రెండింటి మధ్య నిరంతర పోరాటంలో ఏ క్రిమిది పైచేయి అయితే ఆ క్రిమి మన శరీర ఆరోగ్య వృద్ధి, క్షీణతలకు దోహదంచేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడొచ్చిపడిన సమస్యల్లా వ్యాధి క్రిముల్ని మానవులే, పరిశోధన పేరుతో శాస్త్రవేత్త లేదా దుష్ట పాలకుడి సామ్రాజ్య తృష్ణలో భాగంగా వాడి చేతిలో పనిముట్టుగా మారి ఊడిగం చేస్తూ మానవు లపై విషక్రిముల్ని కృత్రిమంగా పరిశోధనాగారాల్లో సృష్టించడమే. తర్వాత తమకు లొంగి రాని దేశాలను, ప్రజలను కృత్రిమరోగాల పాలు చేయడానికి విష ప్రయోగాలకు సిద్ధమవుతారని, దేశాల ప్రజల స్వాతంత్య్ర కాంక్షను, అణగదొక్కేందుకు వెనుకాడరని సామ్రాజ్య వాద, ఫాసిస్టు రాజ్యాలు, వాటి పాలకులు నిరూపించారు. ఆ అవ సరం సమ సమాజ, సంక్షేమ వ్యవస్థల్ని కాపాడుకోదలిచిన సోషలిస్టు, ప్రజాస్వామ్య దేశాలకు ఉండదు. ఆ అవసరం దోపిడీ వ్యవస్థల్ని, రక్షిం చుకునే సామ్రాజ్యవాద శక్తులకు మాత్రమే ఉండటం వల్ల–విష క్రిముల ప్రయోగాలకు, వాటినుంచి ఆశించే ఫలితాల కోసం సర్వ ప్రయత్నాలు చేస్తాయి.

ఈ ప్రయత్నాలలో భాగంగానే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆ తరువాతా సామ్రాజ్యవాద పెట్టుబడి దేశాలు యుద్ధాలకు మూలమైన దోపిడీ పెట్టుబడిదారీ వ్యవస్థలన్నింటినీ పెంచి పోషిస్తూ వచ్చాయి. కానీ ఆ కుట్రలకు వ్యతిరేకంగా కొన్ని దేశాలు మహోద్యమం ద్వారా, ప్రజాహిత విప్లవోద్యమాల ద్వారా కోట్లాది మంది దేశీయ ప్రజల సమీకరణ ద్వారా ప్రతిఘటించి వర్గ రహిత సమాజ వ్యవస్థల్ని నిర్మించుకున్నాయి. అయినా ప్రపంచాన్నే కబళించాలన్న లక్ష్యాన్ని మానుకోజాలని సామ్రాజ్య పెట్టుబడి దారీ శక్తులు సోషలిస్టు దేశాల్ని, అక్కడి ప్రజలను ఇంకా లొంగదీసుకునే ప్రయత్నాన్ని మానుకోనందున.. నిరంతరం విషక్రిముల సృష్టిద్వారా మానవులలోని జన్యుకణాల ఉత్పత్తి, పునరుత్పత్తి దశలనే కృత్రి మంగా మార్చడానికి ప్రయోగశాలలో నిరంతర ప్రయోగాలు చేయడం లేదని భావించగలమా?

 ఈ దశలోనే సోషలిస్టు చైనాలోని హూపే రాష్ట్రంలోని వూహాన్‌ నగరంలో ప్రబలి ప్రపంచ మంతటా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి వ్యాధి కారణాల గురించి కొన్ని రోజుల వ్యవధి, తర్వాత గానీ రకరకాల వార్తలు, కథలు, దంతకథలు సామ్రాజ్యవాద, పెట్టు బడి దేశాల పాలకులనుంచీ పాలకప్రతిపక్ష నాయకులనుంచీ వినరా లేదు. వాటిలో కీలకమైనది ఏమిటంటే, కరోనా చైనా విష ప్రయోగ పరిశోధనా కేంద్రాలనుంచే వచ్చి ఉంటుందన్న వార్తో, నీలి వార్తో వెలువడింది. ఆ ఊపులోనే అమెరికా పాలకుడు ట్రంప్‌ నోటి నుంచే సరాసరి చైనా వ్యతిరేక ప్రకటన వెలువడి, అది ప్రపంచమంతా పాకింది. ‘ద్వేషం ఇచ్చే పర్సంటేజీని ప్రేమ ఇవ్వద’న్న శ్రీశ్రీ లోకోక్తి ఎంత నిజమో అప్పుడుగానీ అర్థం కాదు.

 నిజానికి ఈరోజు దాకా, ఈ క్షణం దాకా జరిగిన యుద్ధాలకు గానీ, లక్షల కోటానుకోట్ల సామాన్యుల, నిరుపేదల మరణాలకుగానీ కారణం సామ్రాజ్యవాద ప్రభుత్వాలు, వాటి దురా క్రమణ విధానాలే కారణం. ఇక రోజన్‌బర్గ్‌∙దంపతుల్ని, ఆఫ్రికా ఖండంలోని కాంగో ప్రియతమ నాయకుడైన పాట్రిస్‌ లుముంబాను హతమార్చింది అమె రికా పాలకులు కాక మరెవరు? లావోస్, చిలీ, బ్రెజిల్, అర్జెంటీనా, నికరాగ్వాలలోని ప్రజా నాయకుల్ని పొట్టనబెట్టు కున్నది అమెరికా, దాని తైనాతీలు కాక మరెవరు? నిన్నగాక మొన్న దక్షిణ అమెరికాలోని వెనిజులా ప్రజా నాయకుడు చావెజ్‌ను, మదురోలను మట్టుబెట్టడా నికి కుట్రలు పన్నిందెవరు? 
ప్రపంచవ్యాప్తంగా వెల్లడైన, బహిర్గతమవుతున్న ఇన్ని వాస్త వాల మధ్య చైనాపై కొత్తగా అమెరికన్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ వ్యాప్తి చేసిన కరోనా వ్యాధి విష ప్రయోగం ‘దంత కథ’ వెనుక దాగిన అసలు రహస్యం ఏమిటి? ట్రంప్‌ చైనా వ్యతిరేక ప్రచారం వెనుక దోబూచు లాడినవాడు మహా కోటీశ్వరుడైన ఎలన్‌ మస్క్‌ అని, ఇతడి ద్వారా చైనా వ్యతిరేక ప్రచారాన్ని సాగించినవి.. తప్పుడు ప్రచారాలకు మూల మైన ‘ఫాక్స్‌ న్యూస్‌’ తదితర సంస్థలనీ తేలింది. ఈ రహస్యాన్ని బయటపెట్టినవారు మరెవరో కాదు–స్వయంగా ట్రంప్‌ అధ్యక్ష కార్యా లయం కరోనా వైరస్‌ ప్రతిఘటనకు ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు ఆంథోని ఫాస్‌.

అంతేగాదు, అమెరికా ప్రసిద్ధ మీడియా ‘మూన్‌ ఆఫ్‌ అలబామా’ ఈ కరోనా మహమ్మారి త్వరలోనే అదుపులోకి వచ్చి, అంతమవు తుందని తెలిపింది. ఇంతకుమించిన కొత్త విశేషాన్ని ప్రసిద్ధ అమెరికన్‌ స్కాలర్, విశ్లేషకుడు డాక్టర్‌ పాల్‌క్రీగ్‌ రాబర్ట్‌ (2.2.2020) బయట పెట్టాడు. ‘కరోనా వైరస్‌ జన్యుకణాల్లో ఎయిడ్స్‌ వ్యాధి (హెచ్‌ఐవీ) మూలకాలు ఉన్నాయని, భారత శాస్త్రవేత్తల బృందం కనుగొన్నది. ఇది రోగం సోకడానికి ప్రబలం కావడానికి కారణమవుతుందని వారు కనుకొన్నారు. దీన్నిబట్టి, జీవకణాల్ని తారుమారు చేసే జీవాయు ధంగా కొత్త కరోనా వ్యాధిని ఉపయోగించే ప్రమాదం ఉంది. కానీ, ఈ కుట్రను చైనాకు మాత్రం భారత శాస్త్రవేత్తలు ఆపాదించలేదు’ అని రాబర్ట్‌ పేర్కొన్నారు. కానీ అమెరికా యుద్ధతంత్ర వ్యవస్థ ‘పెంటగన్‌’ ముఖ్యంగా దాని రక్షణ శాఖ తాలూకు అడ్వాన్స్‌డ్‌ రీసెర్చి శాఖ అయిన ‘డీఏఆర్‌పీఏ’ మానవ జన్యు కణాలను చంపేసే వివాదాస్పద పరిశోధ నలు తలపెట్టడం, ఇందుకు ఉపకరించే టెక్నాలజీని యుద్ధ ఆయు ధంగా వినియోగించేందుకు చేస్తున్న ప్రయత్నాలూ ఈ అనుమానా లను పెంచుతున్నాయని ప్రసిద్ధ చిలీ జర్నలిస్టు విట్నీ వెబ్‌ పేర్కొంది.

 నిజానికి రష్యాతో అమెరికా ఆయుధ నియంత్రణ ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రాతిపదిక–జీవ విధ్వంసక ఆయుధాలను (బయో వెపన్స్‌) తయారు చేయకుండా నిరోధించడమే. అందుకే, ఇలాంటి జీవ విధ్వంసక ఆయుధాలను ఉత్పత్తి చేసినా, చేయకపోయినా ఈ దేశాలు తమ పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నాయి. మనముందున్న అసలు సిసలు ప్రశ్న. ‘కరోనా లాంటి వినాశకర జీవ విధ్వంసక ఆయుధాన్ని నెత్తిమీదకు కొని తెచ్చుకోవడంకన్నా వ్యాధుల నివారణకు జరిగే పరిశో ధనల వల్ల ప్రయోజనం ఆహ్వానించదగిందా, కాదా’ అని ఆమె ప్రశ్నిం చింది. ఈ విషయంలో, పరిశోధనా రంగంలో పారదర్శకత లేనప్పుడు బహిరంగ చర్చకు స్థానం లేనప్పుడూ మోసాలకు, ద్రోహాలకూ అవ కాశం ఉంటుందని కూడా విట్నీ వెబ్‌ హెచ్చరించింది.

ఇందుకు ఉదాహరణ కోసం ఎక్కడికో పోనక్కర్లేదు. 9/11 అమె రికన్‌ టవర్స్‌ విధ్వంసం సందర్భంగా దొరికిన ‘ఆంత్రాక్స్‌’ విధ్వంసక జీవాయుధం ఎక్కడోకాదు, కేవలం అమెరికా ప్రభుత్వ పరీక్షా కేంద్రం లోనే లభ్యమవుతుందని అమెరికన్‌ రీసెర్చర్‌ డాక్టర్‌ క్రీగ్‌ రాబర్ట్స్‌ రాస్తున్నాడు. ఈ సత్యాన్ని ప్రపంచం తెలుసుకోకుండా దాచి పెట్టడం కోసం ‘ఆంత్రాక్స్‌’  విషాయుధ క్రియను ఓ చనిపోయిన వాడి మీదికి పాలకులు నెట్టేయడం ఇక్కడ కొసమెరుపు. అంతేగాదు, కొత్తగా ప్రపంచ రంగస్థలంపై జడలు విప్పుకొని నర్తిస్తున్న రోబోటిక్స్, కృత్రిమ మేధా యంత్రాల గురించి ఎంతో తరచి ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. బహుశా ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే అయి ఉంటుంది. కరోనా వైరస్‌ విషయంలో కేవలం చైనా ప్రభుత్వాన్ని, చైనా ప్రజల్ని, మిగతా ప్రపంచాన్ని వంచించి మోసగించడానికే, చైనా ఆర్థిక వ్యవస్థను నష్టపరిచేందుకే ‘చైనా సృష్టించిన కరోనా వైరస్‌’ అన్న ప్రచారాన్ని ఆంగ్లో–అమెరికన్‌ సామ్రాజ్యవాద శిబిరాలు లేవనెత్తాయి. కానీ నవ్విన నాపచేనే పండిందన్న సామెత సాక్షిగా ఆ వైరస్‌ను 60 రోజుల్లోనే కొంత నష్టం మధ్యనే చైనా జయప్రదంగా అదుపు చేయగలిగినప్పుడు ప్రపంచం నివ్వెరపోయింది. కానీ అదే సామ్రాజ్యవాద శక్తిగా, అపార సంపద ఐశ్వర్యాలు ఉన్న అమెరికా అపార నష్టాలకు తెర లేపుకున్నది. అదీ సామ్రాజ్యవాద పెట్టుబడికీ, సామ్యవాద శ్రమ జీవన సౌందర్య పెట్టుబడికీ మధ్య ఉన్న తేడా!


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement