చైనాలో బీఎఫ్.7 వేరియంట్ బాధితుల శవాల గుట్టలతో మార్చురీలన్నీ నిండిపోతున్నాయనీ, 20 లక్షల మంది చనిపోవచ్చనీ అమెరికా నుంచి వార్తలు వండుతున్నారు. కోవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు చైనా విధించుకున్న ఆంక్షలను ఎత్తి వేయాలని గగ్గోలు పెట్టినవాళ్లే, ఆ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కూడా పరిస్థితులలో మార్పు లేదని ఎత్తిపొడుస్తున్నారు.
నిజానికి ప్రజల ఆరోగ్య భాగ్యాలే ప్రాధాన్యతగా చైనా వ్యవహరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. ఒక్క చైనీయుడూ చనిపోకుండా చేయడం కాదు, సాధ్యమైనంత తొందరలో వ్యాధిని అదుపు చేసి సామాజికులపై పడే ఖర్చుల భారాన్ని కనీస స్థాయికి తేవడమే ఆ దేశ విధానమని ‘లాన్సెట్’ చెబుతోంది. కాబట్టి విమర్శకులు ముందు తమ ఇంటిని చూసుకోవాలి.
‘‘ఏ ప్రజా సమస్యల విషయంలోనైనా మన దృష్టిలో ఉండవలసింది ప్రజలు, వారి ఆరోగ్య భాగ్యాల సమస్య. ఈ తాత్విక దృక్కోణం ఆధారంగానే చైనా ప్రభుత్వం వ్యవహరించింది. విదేశాల నుంచి చైనా సందర్శనకు వచ్చిపోయే ఆగంతుకుల నుంచి చైనాలో ‘కోవిడ్–19’ వైరస్ వ్యాపిం చింది. అయినా కోవిడ్–19 వైరస్ వ్యాప్తి నిరోధానికీ, నిర్మూలనకూ చైనా అన్ని చర్యలూ తీసుకుంది. ఫలితంగా ఈ విషయంలో చైనా ప్రభుత్వం వుహాన్‌లో వైరస్ వ్యాప్తి ఉధృతిని నిలువరించి గణనీయమైన క్రియాశీల ఫలితాలు సాధించింది.’’
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గెబ్రీయేసస్
‘‘చైనాలో వైరస్ వ్యాధి విస్తరణ వల్ల చనిపోయిన వారి సంఖ్య ప్రపంచంలోనే తక్కువ. కోవిడ్–19 వైరస్ మహమ్మారి వల్ల ప్రపం చంలో అదనంగా చనిపోయినవారి సంఖ్య 1 కోటి 82 లక్షలని అంచనా. ప్రపంచవ్యాపితంగా చూస్తే ఈ వైరస్ మూలంగా ప్రతి లక్షమంది ప్రజలకు 120 మరణాలు నమోదు కాగా, అందులో 179 మరణాలు అమెరికాలో నమోదైతే – చైనాలో కేవలం 0.6 మరణాలు మాత్రమే నమోదైనాయి. చైనా అనుసరిస్తున్న విధానం ఒక్క చైనీయుడు కూడా ఈ మహమ్మారి వల్ల చనిపోకుండా చేయడం కాదు, సాధ్యమై నంత తొందరలో కోవిడ్–19 వ్యాధిని అదుపు చేసి సామాజికులపై పడే ఖర్చుల భారాన్ని కనీస స్థాయికి తేవడం. తద్వారా కోటానుకోట్లమంది ఆరోగ్యాన్ని, సాధారణ జీవితాన్ని, సరకులు ఉత్పత్తి క్రమాన్ని సాధ్యమై నంత వేగంగా తిరిగి నెలకొల్పడం. పశ్చిమ పసిఫిక్ ప్రాంత ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ సహితం చైనా కృషిని కొనియాడారు.’’
– సుప్రసిద్ధ అంతర్జాతీయ సైన్స్ జర్నల్ ‘లాన్‌సెట్’
‘‘కరోనా కేసుల సంఖ్యపై చైనా గోప్యత. రోజువారీ కేసుల వివరా లను ఇకనుంచీ వెల్లడించబోవటం లేదని చైనా జాతీయ ఆరోగ్య సంస్థ తెలిపింది. జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తివేసిన 20 రోజుల్లోపే 25 కోట్ల మంది ప్రజలకు కరోనా సోకింది. దేశంలో ఆస్పత్రులలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లన్నీ కొత్తగా సోకిన బీఎఫ్.7 వేరియంట్ బాధితుల శవాల గుట్టలతో మార్చురీలన్నీ నిండిపోతున్నాయి. 2023వ సంవత్సరంలో చైనాలో 20 లక్షల మంది కోవిడ్‌తో చనిపోవచ్చని ఒక అంచనా. ఒక మున్సిపాలిటీలో ఒక్క రోజులోనే 5.3 లక్షల కేసులు నమోదైనట్టు సమాచారం. ఆ లెక్కల్ని ఆన్‌లైన్‌లో అధికారులు తొలగించేశారు.’’
– అమెరికా నుంచి విడుదలైన (25.12.22) ఒక వార్త
ఇలాంటి ‘వార్తలు’ ఇలా విడుదలవుతూ ఉండగానే సుప్రసిద్ధ వ్యంగ్య చిత్రకారుడు మంజుల్ ఈనాటి భారత పాలకులు విడుదల జేస్తున్న కొన్ని ఆంక్షలపై ఒక చరుపు చరుస్తూ కార్టూన్ (26.12.22) వేశాడు. ‘అక్కర్లేదు. నేవెడుతున్నది ఒక పెళ్లి కార్యక్రమానికి గానీ, నోరు మూసుకుని పడుండే పార్లమెంటుకు కాదు సుమా’ అని వ్యంగ్యాస్త్రం విసిరాడు. సరిగ్గా ఇదే సమయంలో జాతీయ స్థాయిలో ఇమ్యునైజేషన్ టెక్నికల్ సలహా సంఘ అధినేత ఎన్.కె. అరోరా ‘భారతదేశంలో కోవిడ్–19 మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితులు ‘అదుపు’లోనే ఉన్నాయి గానీ, అప్రమత్తత మాత్రం అవసర’మని చెబుతూ, ‘ఇలాంటి అంటువ్యాధుల్ని అరికట్టడం అసలు సాధ్యమా? వ్యాక్సిన్‌లు పని చేస్తున్నట్టా, లేనట్టా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు.
అంతే గాదు, ‘ఇలాంటి మహమ్మారిని అరికట్టడం అసాధ్యం. ఫలితంగా కొన్ని చోట్ల వ్యాధి తీవ్రత ఎక్కువ కావొచ్చు, మరికొన్ని చోట్ల తక్కు వగా ఉండొచ్చు, అంతే తేడా’ అని అరోరా అన్నారు. ఆధునిక శాస్త్ర వైజ్ఞానిక దృష్టితో వైరస్ క్రిములను అరికట్టే విధానాన్ని జయప్రదమైన ప్రయోగాలతో నిరూపించిన శాస్త్రవేత్త, 19వ శతాబ్దపు సుప్రసిద్ధ భౌతికవాద శక్తి లూయీ పాశ్చర్! ఇంతటి వైజ్ఞానిక ప్రగతి బాటల్ని విస్మరించి పాలకులూ, కొన్ని వ్యాపార పత్రికలూ ఏ అమెరికా నుంచో విడుదలయ్యే చౌక బారు కథనాలను భుజాన వేసుకుని ప్రజా బాహు ళ్యాన్ని గందరగోళపర్చడం ఒక ఆనవాయితీగా మారింది.
అంతేగాదు, ఏనాడో భారతదేశంలో దేశ వైద్య పరిషత్ ఖరారు చేసిన శాస్త్రీయ నిర్ణయాలను, ఆదేశాలను పక్కనపెట్టి, వ్యాపార సరళిలో ప్రయివేట్ మందుల కంపెనీలతో మిలాఖత్ అయ్యి, భారత మెడికల్ కౌన్సిల్ అప్పజెప్పిన సాధికారిక ఆదేశాలను పెక్కుమంది వైద్యులు, ఇతర ఆరోగ్య శాఖ అధికారులు విస్మరించడంవల్ల – దేశ ఆరోగ్య వ్యవస్థే ప్రయివేట్ వ్యాపార ధోరణికి అలవాటు పడి పోయింది. అందుకే భారత మెడికల్ అసోసియేషన్, దేశీయ డాక్టర్లకు వంద రకాల ప్రశ్నలను సంధించి, సుమారు 81 శాతం మంది డాక్టర్ల నుంచి సమాధానాలు రాబట్టింది. వారిలో 37 శాతం మంది మెడికల్ కంపెనీల ప్రతినిధులతో వారానికి ఒకసారి సంభాషిస్తామని చెప్పగా, 25.9 శాతం మంది నెలకు రెండుసార్లయినా చర్చిస్తామని చెప్పారు.
కాగా, 69.1 శాతం మంది డాక్టర్లు మాత్రం ప్రయివేట్ వైద్య కంపెనీల ప్రతినిధులు తమకు ఇవ్వజూపే మందుల ప్రయోజనాలను అతిగా చూపుతూ, సదరు కంపెనీల మందులవల్ల కలిగే ఇబ్బందుల్ని గురించి తక్కువగా చెబుతున్నామని తెలిపారు. ఇటు 63 శాతం మంది డాక్టర్లు ప్రయివేట్ కంపెనీల నుంచి తమకు స్టేషనరీ సామాను, మందుల శాంపిల్స్, కంపెనీల తాలూకు జర్నల్స్ ఉచితంగా అందుతున్నాయని వెల్లడించగా, ప్రయివేట్ ఫార్మా కంపెనీలతో గానీ, వాటి ప్రతినిధు లతోగానీ మాట్లాడే సందర్భాల్లో పాటించాల్సిన జాగ్రత్తల గురించి భారత వైద్య పరిషత్ నిర్ణయించిన జాగ్రత్తలను, హెచ్చరికలను 70.4 శాతం డాక్టర్లు బొత్తిగా చదవలేదని రుజువైంది.
ప్రయివేట్ ఫార్మా కంపెనీలతో చర్చల్లో వైద్యులు పాటించాల్సిన నైతిక ప్రమాణాలను ఉల్లంఘిస్తే ఎదుర్కోవలసిన శిక్షలు కూడా వైద్యులకు తెలియక పోవడం మరీ ఆశ్చర్యకరం. 2014 నాటికే భారత వైద్యమండలి నిర్ణ యించిన నైతిక ప్రమాణాలు, ఫార్మా కంపెనీలతో పాలకుల లోపాయి కారీ ఒప్పందాల ఫలితంగా మరింత దిగజారిపోతూ వచ్చాయి. కాగా, ఇంత దిగజారుడు ప్రవర్తన మధ్య కూడా 58 శాతం మంది డాక్టర్లు ప్రయివేట్ ఫార్మా కంపెనీల నుంచి ప్రలోభాలకు లొంగడం ‘అనైతిక ప్రవర్తన’గా ప్రకటించడం సంతోషకరం.
అర్ధ సత్యాలతో కూడుకున్న ప్రస్తుత పరిస్థితులలో గమనించ వలసిన విషయం ఏమిటంటే, కోవిడ్–19 వ్యాప్తిని నిరోధించేందుకు చైనా విధించుకున్న ఆంక్షలను ‘ఎత్తి వేయాలని’ గగ్గోలు పెట్టిన విదేశీ పాలకులే (భారతదేశం సహా), ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కూడా పరిస్థితులలో మార్పు లేదని ‘ఎత్తిపొడుపు’ మాటలు వల్లించడం ఎలాంటి ‘నీతో’ సంతృప్తికరంగా వివరించ గలగాలి. లూయీ పాశ్చర్ అన్నట్టు ‘మానవ ఆరోగ్య రక్షణకూ, క్రిముల సంహారానికీ ప్రాథమిక గ్యారంటీ – శాస్త్ర విజ్ఞా నమేగానీ చిట్కాలు కావు’!
అందుకే కవి పెరుగు రామకృష్ణ అంటాడు: ‘‘జీవితమే వ్యాపా రమై పోయిన వ్యవస్థలో/ రోజూ మరణించడం/ మళ్లీ రోజూ బతకడం/స్నానమయ్యాక గుడ్డలు తొడుక్కున్నట్టే!’’ ఎందుకీ పరిస్థి తుల వైపు మన దేశం పరుగెడుతోందన్న ప్రశ్నకు నివృత్తిగా విశ్వకవి టాగూర్ ప్రార్థనను మరొక్కసారి విందాం: ‘నన్ను ప్రార్థించనీ/ ప్రమాదాల నుంచి రక్షించమని కాదు/ ధైర్య సాహసాలతో ఎదుర్కొనే శక్తిని/ కలిగించమని ప్రార్థించనీ/ నన్ను కోరుకోనీ/ నాకు సంభవించే నా బాధలను పోగొట్టమని కాదు/ కష్టనష్టాలను అతి తేలిగ్గా భరించగల/ శక్తిని కోరుకోనీ/ నన్ను ఆశించనీ, నా జీవిత పోరాటంలో మిత్రుల సహకారాన్ని/ దిగ్విజయం పొందడానికి నా సొంత శక్తిని ఆశించనీ/ నన్ను అర్థించనీ/ ఆతు రతతో భయపడి రక్షణ కోసం కాదు/ నేను నా స్వాతంత్య్రాన్ని సిద్ధించుకోవడానికి శక్తి సామర్థ్యాలు అర్థించనీ/ ఓ ప్రభూ!/ నాకు కలిగే దిగ్విజయాలలో మాత్రం నీ కరుణా/ కటాక్షాలను స్మరించే పిరికివానిగా చేయకు/ పరాజయాలలో నీ చేయూత అర్థించనీ!’
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
Abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment