సరిహద్దు గొడవలను ఆసరా చేసుకుని దేశంలో చైనా సరుకుల్ని తగలబెట్టాలని పిలుపునిచ్చి ఉద్యమం సాగిస్తున్నారు. కానీ చైనా సరుకులను బహిష్కరించడం అనేది చాలా పెద్దమాటే అని చెప్పాలి. ఎందుకంటే ఆటోమొబైల్స్ వంటి రంగాల్లో కీలకమైన విదేశీ సంస్థలేవీ భారత్‌లో పెద్దగా ఉనికిలో లేని నేపథ్యంలో దేశంలోకి చైనా వస్తూత్పత్తులే వెల్లువెత్తుతూ వస్తున్నాయి. వీటిని అడ్డుకుంటే వినియోగదారులు, పారిశ్రామిక కంపెనీల అవసరాలపై తీవ్ర ప్రభావం చూపించడం ఖాయం. అందుకే సైనికులను పోగొట్టుకున్న సమయంలో మనోభావాలు దెబ్బతిని దేశంలో చైనా వ్యతిరేక సెంటిమెంట్లు ప్రబలిపోయిన నేపథ్యంలోనూ దేశ రాజకీయ నాయకత్వం కాస్త సంయమనంతో వ్యవహరిస్తూ వస్తోంది.
భారత్–చైనా సరిహద్దుల్లో ఇటీవల జరి గిన సైనిక ఘర్షణల నేప«థ్యంలో, ఇప్పటిదాకా మన దేశంలోకి దిగుమతి అవుతున్న పలురకాల చైనా ఉత్పత్తులను బహిష్కరించాలంటూ కొందరు ప్రకటనలను జారీ చేస్తూండడాన్ని మాజీ ప్రధాని హెచ్.జి. దేవెగౌడ ఖండిస్తూ ప్రధాని మోదీకి ఒక లేఖ రాశారు. చైనాపై ఆర్థిక దిగ్బంధానికి పిలుపివ్వడం భారత ఆర్థిక వ్యవ స్థపై ఈ దశలో తీవ్ర ప్రభావం నెరుపుతుంది. కాబట్టి అలాంటి ప్రకట నలు ఉభయదేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నం మాత్రమే.
– బెంగళూరులో విడుదలైన దేవెగౌడ ప్రకటన
‘‘నేటి పరిస్థితుల్లో దేశంలో చైనా ఉత్పత్తుల బహిష్కరణ సాధ్యపడే విషయం కాదు. మనదేశంలో చాలాకాలంగా చైనా సంస్థలు పాతుకు పోయాయి. పైగా అవి చాలా చౌకగా ప్రజలకు అందుబాటు ధరలకు లభిస్తున్నాయి. మనం కూడా అలా సరుకులను ప్రజలకు అందు బాటులో ఉంచాలంటే దేశంలోనే దీర్ఘకాలిక ప్రణాళిక ద్వారా నాణ్యమైన వస్తువుల్ని చౌకధరలకు తయారుచేస్తూ రాబోయే అయిదేళ్లలో చైనా వస్తువుల్ని, సేవల్ని బహిష్కరించే దిశగా అడుగులు వేయవచ్చు.
– ‘ఎల్ అండ్ టి’ కంపెనీ ఎం.డి. ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్.
సరిహద్దు తగాదాలతో లేదా అడపాదడపా ఘర్షణలతో ముడి పెట్టు కుంటే దేశ ఆర్థిక వ్యవస్థకు కలుగబోయే ఇబ్బందులేమిటో బహుశా తెలిసినందునే దీర్ఘదృష్టిలో చాలాకాలంగా శాశ్వత పరిష్కారంగా దేశీయ ఉత్పత్తులను దేశంలోనే తయారు చేసుకోవాలని (మేక్ ఇన్ ఇండియా) అదే నిజమైన స్వావలంబన అవుతుందని కొంతకాలంగా ప్రకటనలు విడుదల చేస్తున్నారు. ‘స్వదేశీ వస్తు ఉద్యమం’ విదేశీ బహి ష్కరణ నినాదాలు భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక నాయకుడు దాదాభాయ్ నౌరోజీ, మహాత్మాగాంధీ, తదనంతర పలువురు జాతీయ నాయకుల నుంచీ వినవస్తున్నవే.
కాకపోతే 73 ఏళ్ల తర్వాత మరోసారి బీజేపీ, పాలక నాయకులనుంచి పదే పదే వింటున్నాం. మరో తాజా విశేషమేమంటే జాతీయ పార్టీల పేరిట అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ప్రధానమంత్రుల స్థాయిలో ఇరువురూ (పాతవారు, కొత్తవారు) ఏదో ఒక పేరిట పార్టీ నిధి సంస్థలు లేదా పాలక నాయ కుల పేరిట ‘జాతీయ నిధి’ పేరుతో దఫ దఫాలుగా వసూలు చేస్తున్న నిధులలో విదేశీ ప్రభుత్వాల లేదా సంస్థల నుంచి అందుతున్న మొత్తంలో ఎంతెంత, ఎలా, ఎందుకు, ఎటువైపుగా మళ్లిపోతున్నా యన్న ప్రశ్న బాహాటంగా లేవనెత్తుతున్నారు. కొన్ని రోజులుగా సరి హద్దు సమస్యల్ని మరుగుపరుస్తూ ఈ నిధుల తాలూకు శషభిషలు, కాంగ్రెస్– బిజెపి నాయకుల మధ్య పెరిగిపోయాయి.
ఈ ‘విదేశీ నిధుల’ తబిశీళ్ల సంగతేమో గాని కరోనా కల్లోలాన్ని కూడా మింగేసేం తగా మనదేశంలో పాగా వేసిన చైనా ఉత్పత్తుల బహిష్కరణోద్యమం కొన్ని వర్గాలలో ప్రబలమవుతోంది. దీన్ని కట్టడి చేయాలంటే దేశ వ్యాప్తంగానే మొత్తం జాతీయోద్యమ కాలం నాటి అసలు సిసలు విదేశీ వస్తు బహిష్కరణతో పాటు దేశీయ స్వదేశీ వస్తూ త్పత్తిని, విదేశీ, స్వదేశీ భారీ గుత్త పెట్టుబడుల విశృంఖలతనూ కట్టడి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన దేశీయ ఆర్థిక వనరులను ముడి సరుకుగా తమ దేశానికి తరలించుకుని, మన పొగాకు నుంచే తమ దేశంలో తయారీ చేసుకుని అలా తయారైన ‘చుట్టల్ని ’ మన నోట్లోకి ఎగుమతి చేసిన బ్రిటిష్ వలస సామ్రాజ్య పాలకుల చర్యను ‘ఊడ్చుకు పోతున్న భారతీయ సంపద (డ్రైయిన్ థీరీ) అన్నాడు దాదాభాయ్ నౌరోజీ! ఉదాహరణ చెప్పిన ఒక్క పొగాకు కాదు, అన్ని రకాల దేశీయ సంపదను ఇలాగే తరలించేది చాలక, దేశ స్వాతంత్య్రం తర్వాత గత ఏడున్నర దశాబ్దాలుగానూ సాగుతున్న దేశ, విదేశీ గుత్తపెట్టుబడుల దోపిడీని మన పాలకులు మరిచిపోయారు.
బహుశా భగత్ సింగ్ అందుకే అన్నాడేమో... ‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాత విదేశీ పెట్టుబడుల దోపిడీతోపాటు స్వదేశీ గుత్త పెట్టు బడులు కూడా రెండు చేతులా సామాన్య పేద, మధ్య తరగతి ప్రజా బాహు ళ్యాన్ని జమిలిగా దోచుకుంటాయని హెచ్చరించిపోయాడు! ఈ పరి ణామం ప్రపంచ బ్యాంక్ ప్రజావ్యతిరేక సంస్కరణల ద్వారా ఇప్పుడు మన ప్రజల అనుభవంలోకి వచ్చి కూర్చుంది. ఈ దశలో ‘సందోయ్ సందోయ్’ అంటూ చైనా పెట్టుబడులు కూడా వర్తక వ్యాపార నీతిలో భాగంగా మన దేశీయ మార్కెట్‌ను ముమ్మరించాయి. పైగా, భారత దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోకి ప్రవేశించనంత స్థాయిలో 2015 నాటికే గుజరాత్ రాష్ట్రంలో చైనా భారీ పెట్టుబడులు తిష్ట వేయడంపై మనం ఏమాత్రం ప్రశ్నించుకోకుండా ఉంటున్నాం.
బీజేపీలోని కొన్ని వర్గాలు సరిహద్దు గొడవలు ఆసరా చేసుకుని దేశంలో చైనా సరుకుల్ని బహిష్కరించాలని, తగలబెట్టాలని పిలుపు నిచ్చి ఉద్యమం సాగిస్తున్నా ప్రధాని మోదీ ఈ ‘బహిష్కరణోద్య మాన్ని’ ఎందుకు ఖండించలేక పోయారు? ఆ మౌన రాగంలో అర్థం ఏమై ఉంటుంది? మరోవైపు నుంచి భారత ప్రసిద్ధ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులైన రాహుల్ బజాజ్, ‘ఎల్ అండ్ టి’ కంపె నీలు చైనా ఉత్పత్తుల్ని మనం ఇప్పుడు ఆపివేస్తే భారత పరిశ్రమలు చైనాపై ఆధారపడి భారీ ఎత్తున తెచ్చుకుంటున్న ముడిసరుకు రాక పోతే దెబ్బతినిపోతామని ‘బీద అరుపులు’ అరవవలసి వస్తోంది?! ఎందుకంటే దీనివెనుక రహస్యం అంతా గుజరాత్‌లోనే ఉంది. గుజ రాత్‌లోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించి, కొత్తగా రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం చైనా లఘు, మధ్యరకం పరిశ్రమల ప్రోత్సాహక సంస్థ (సీఏఎస్ ఎంఈ)తో గుజరాత్ బీజేపీ ప్రభుత్వం 2015లో కుదుర్చుకుంది.
దీనికిముందు 2014లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గుజరాత్ పర్యటనకు రావడం, ఆ తర్వాత 2015లో గుజ రాత్ ప్రతినిధి వర్గం చైనా సందర్శించడం జరిగింది. పర్యవసానంగా ఈ ఒప్పందంలో గుజరాత్‌లో 2022 నాటికల్లా చైనా కంపెనీలు భారీ స్థాయిలో ‘విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని’ పెట్టాలని నిర్ణయించారు. ఈ ఒప్పందాన్ని వివరిస్తూ ‘రాష్ట్రంలో భారీగా ఉత్పత్తి అవకాశాలను పెంచి, భారత్–చైనాల మధ్య సంబంధాల్ని ఇతోధికంగా ‘బలపర్చు కోవచ్చునని గుజరాత్ ముఖ్యమంత్రి రూపానీ ప్రకటించారు. అంతే గాదు చైనా, ఇండియాలకు భారీగా మార్కెట్లు ఉన్నాయి. ఈ అవకాశం ఉభయ దేశాలకూ ఈ ఒప్పందం పరస్పరం లాభదాయకం’ అని కూడా గుజరాత్ ప్రకటించింది. దీని పర్యవసానమే– సుమారు రూ.
11 వేల కోట్ల పెట్టుబడితో చైనా ప్రభుత్వ సంస్థ గుజరాత్‌లో పెద్ద పారిశ్రామిక పెట్టుబడి సముదాయమైన ‘ధోలవీరా’ పారిశ్రామిక నగరాభివృద్ధికి సిద్ధమయింది. పైగా, ఇప్పుడు భారత ప్రభుత్వం దిగుమతి సుంకాలను పెంచడంవల్ల ‘చైనా నుంచి భారీ యంత్రాలకు ఆర్డర్లు పెట్టి ఉన్నందున’ ఇక్కడ దిగుమతి సుంకాలు తమకు భారమ వుతాయని కొందరు భారత పారిశ్రామికవేత్తలు గగ్గోలు పెడుతు న్నారు. అంతేగాదు, ఇప్పటికి మనం చైనా నుంచి దాదాపు 3,800 సరుకుల్ని దిగుమతి చేసుకుంటున్నామని మరవరాదు. ఒక్క ఎలెక్ట్రానిక్స్ రంగంలోనే మనతో చైనా కంపెనీలు రూ. 1.4 లక్షల కోట్లు వ్యాపారం చేస్తు న్నాయి. చైనాపై మన సంస్థలుగాని, కంపెనీలుగానీ, చిన్న, మధ్యతర గతి వర్గాలు, భారీ పరిశ్రమలుగానీ ఆధారపడుతున్నది ఒకటీ అరా కాదు.
టిక్‌టాక్ యాప్, ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్లు, సెల్‌ఫోన్లలో వాడే చిప్స్ దగ్గర నుంచి అన్ని విడి భాగాలు, స్మార్ట్ ఫోన్లు, భారీ ప్రైవేట్, ప్రభుత్వ రంగ వాహనాలలో వాడే కీలకమైన విడి భాగాలు, ల్యాప్‌టాప్‌లు స్మార్ట్ టీవీలు, షావోమీ వస్తువులు, ఆటోమొబైల్ రంగంలో మరే కంపెనీలు పెద్దగా ఉనికిలో లేనందున చైనా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకే గిరాకీ. ఒక్క రాహుల్ బజాజ్ ఆటో మొబైల్ కంపెనీలకే 20 శాతం విడిభాగాల్ని చైనా సరఫరా చేస్తోంది, ఫలితంగా రూ. 1,000 కోట్లు చైనాకు దక్కుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, 4.5 బిలియన్ డాలర్ల (27 శాతం) దిగుమ తులు చైనా నుంచే వస్తున్నాయని బజాజ్ వెల్లడించారు.
ఇక సైకిళ్లు వగైరా ద్విచక్ర వాహనాలు తయారుచేసే టీవీఎస్ కంపెనీ చైనా కంపె నీతో చేతులు కలిపింది. ఈ అన్ని పరిణామాలను బేరీజు వేసుకున్న తరువాతనే బహుశా–భారత్, చైనా సరిహద్దుల అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఇప్పటిదాకా దేశ ప్రధానుల హోదాలో చైనాతో సంప్రదింపు ల్లోగానీ, దౌత్యపరమైన చర్చల్లోగానీ, పరస్పర పర్యటనల్లోగానీ ఇంత వరకూ జాగరూకతతో వ్యవహరిస్తూ వచ్చినవారు రాజీవ్‌గాంధీ, వాజ్‌పేయి, పీవీ నరసింహా రావు, నరేంద్ర మోదీ అని చెప్పుకోవచ్చు. అయితే అన్ని చోట్ల, అన్ని సందర్భాలలోనూ మాకియవెల్లి, భారత చాణక్య నీతి మాత్రం చెల్లకపోవచ్చు!
వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు, ఈమెయిల్: abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment