![Sakshi Guest Column On India can compete with China in AI](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/china.jpg.webp?itok=igh_Jubx)
అభిప్రాయం
లియాంగ్ వెన్‌ఫెంగ్ అనే 39 ఏండ్ల చైనా యువకుడు తన నూతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ– కృత్రిమ మేధ) కంపెనీలో అతి తక్కువ ఖర్చుతో ఒక అద్భుతం చేశాడు. అతను డీప్‌సీక్ అనే కొత్త చాట్ బాట్ యాప్‌ను కనిపెట్టి ప్రపంచ మార్కెట్‌లో ప్రవేశపెట్టాడు. జనవరి చివరి వారంలో ప్రవేశపెట్టిన ఈ సెర్చ్ ఇంజిన్ ఒక్కరోజులోనే అమెరికాకు ఒక ట్రిలియన్ డాలర్లు, అంటే ఒక లక్ష కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్‌లు తయారుచేసే కంపెనీలు భారీ నష్టాన్ని చవి చూశాయి.
సులభంగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు ప్రపంచ సమాచార సెర్చ్ అంతటినీ గూగుల్ కంపెనీ గుప్పిట్లో పెట్టుకొని ఉంది. అంతేకాకుండా ఇతర యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ మొదలైనవన్నీ అమెరికన్ల పరిశోధనలో రూపుదిద్దుకున్నవే. ఈ రంగంలో చైనా వారు కూడా ఈ అమెరికా టెక్నాలజీని తీసుకొని తమ దేశ అవసరాలకు అప్లై చేసుకుంటున్నారు. లియాంగ్ ఒక ఇంట ర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం, చైనాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ ఇప్పటివరకు జరుగలేదు. ఆధార ఏఐ సైన్సును లియాంగ్ ఇన్నోవేటివ్ సైన్సుగా మార్చాడు.
హేతుపూర్వక సమాజం
ఐతే చైనా చాలా ఇతర రంగాల్లో ఇన్నోవేషన్లు చేస్తూ వస్తున్నది. అది కమ్యూనిస్టు దేశంగా మారకముందే తమ దేశంలోని అగ్రి కల్చరిజం అనే ఫిలాసఫీని కన్ఫ్యూషియనిజం, బుద్ధిజంతో జతపర్చి సమాజాన్ని ఒక హేతుపూర్వక సమాజంగా మారుస్తూ వచ్చింది. మతతత్వానికంటే ముందే వారు వ్యవసాయ తత్వానికి పాఠశాలల్లో ఉన్నత స్థానమిచ్చారు. పిల్లల్ని బడి నుండి పొలానికి, పొలం నుండి బడికి పంపి... పని, పాఠాలు కలగలిపి నేర్పించారు. చైనా పాఠశాల విద్యా విధానం వందల సంవత్సరాల శ్రమ జీవన పాఠాలతో ముడిపడింది.
ఆ దేశంలో మతాన్ని, హేతుబద్ధతను ముడేశారు. దాన్ని పిల్లలకు నేర్పే అగ్రికల్చరిజం ఫిలాసఫీతో అనుసంధానించారు. భూమికి, ఆకాశానికి, ప్రకృతికి, వానకు, గాలికి గల సంబం«ధాన్ని మెటీరియలిస్ట్ ఆధ్యాత్మికతకు అనుసంధానించడం వల్ల చిన్న ప్పటినుండే పిల్లల మెదళ్లలో క్రియేటివ్ దైవవాదం ఏర్పడింది. ఈ విధానాన్ని సభ్య సమాజమంతటికీ అనుసంధానించారు. తద్వారా వారి దైవం ఉత్పత్తిలో భాగమయ్యాడు లేదా అయింది.
అందుకే గన్ పౌడర్, కాగితం, కంపాస్, అచ్చు యంత్రం, సిస్మోమీటర్ (భూకంపాల అధ్యయన మిషన్) ముందు వాళ్ళే కనిపెట్టారు. సిస్మోమీటర్‌ను 1880లో బ్రిటిష్ జాన్ మిల్నే కను క్కున్నాడని రాసుకున్నప్పటికీ అది మొదలు చైనా కనిపెట్టిందే. ఆ సైన్సు తరువాత జపానుకు పాకి వారిని చాలా భూకంపాల నుండి కాపాడింది.
డెంగ్ షియావోపింగ్ కాలంలో ప్రపంచ ఆధునిక సైన్సుతో తమ సైన్సును అనుసంధానం చేస్తున్నప్పుడు, మావో ధరించే ‘బంద్ గలా కోటు’ తమదేనా లేదా ‘టై అండ్ సూట్’ తమదా అని చర్చ జరిగింది. ఐతే టై–సూట్ చైనా డిస్కవరీ అని చారిత్రక ఆధారాలు దొరికాయి. దాంతో అధ్యక్షుడి నుండి కిందిస్థాయిల వరకు టై– సూట్‌ను అధికార డ్రెస్‌కోడ్‌గా మార్చుకున్నారు.
ఇండియా పరిస్థితి ఏమిటి?
చైనా యువకులు గత ముప్పయి సంవత్సరాలుగా యూరో– అమెరికా డిస్కవరీస్‌తో పోటీ పడాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మావో కల్చరల్ రెవల్యూషన్ కాలంలో ఇచ్చిన నినాదం ‘మాయా వాదాన్ని బద్దలుకొట్టి, ప్రకృతిని పఠించు’. ఆయన యునాన్ రిపోర్టులో ఆ దేశంలోని అగ్రికల్చరిజం తత్వభూమికను బాగా అర్థం చేసుకున్నాడు. ఈ మొత్తం పరిణామ క్రమమే చైనాలో సైన్సు,మతం, నైతికత జాగ్రత్తగా అనుసంధానం కావడం. ఆ సామాజిక చైతన్యం నుండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వాళ్ళు అమెరికాను తలదన్నే మార్గంలో ఉన్నారు. అందులో భాగమే డీప్‌సీక్. మరి మన దేశం స్థితి ఏమిటి?
రుగ్వేద రచనా కాలంలోనే ఇక్కడి అగ్రికల్చరిజం ఫిలాసఫీని చంపేశారు. ఉత్పత్తి రంగంలో శాస్త్రీయ శ్రమ చేస్తున్న శూద్రులను (దళితులూ అందులో భాగమే) బానిసలుగా మార్చి, శ్రమశక్తి అజ్ఞాన మని నిర్వచించారు. ఈ ఆలోచనను బలోపేతం చెయ్యాలని ఆరెస్సెస్–బీజేపీ నాయకత్వం సైన్సు నుండి మతాన్ని సంపూర్ణంగా విడగొట్టాలనే భావనతో పయనిస్తోంది.
చైనా డీప్‌సీక్ కనిపెట్టి అమెరికాను అతలాకుతలం చేసిన రోజులలోనే కుంభమేళాపై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఖర్చవుతున్నాయి. ఉత్పత్తికీ, ఆధునిక సైన్సుకూ పూర్తిగా దూరంగా ఉండేవారికి మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. వీటి ప్రభావం లక్షలాది మంది స్కూలు, కాలేజీ పిల్లల మీద పడి దీన్నే భారతదేశ మార్గంగా భావించే దశకు తీసుకెళ్తున్నారు. ఉత్పత్తితో ముడిపడినవారికి స్తుతి చెయ్యట్లేదు. కూర్చొని తినేవారికి రాజ్యం గౌరవ పీఠం వేస్తుంది.
ఇంగ్లిష్ వ్యతిరేక ప్రచారం, పురాతన దుస్తులు ధరించాలనే ప్రచారం యువకులను కచ్చితంగా సైన్సు వ్యతిరేకులను చేస్తుంది. ఈ దేశపు యువతను సీరియస్ యూనివర్సిటీ పరిశోధ కులను చెయ్యనివ్వకుండా మూఢ నమ్మకస్తుల్ని చేస్తుంది.
ప్రశ్నించే తత్వం ముఖ్యం
చైనాలో అది మతరంగంలోగాని, ఉత్పత్తి రంగంలో గాని, యూనివర్సిటీలోగాని ప్రశ్నించే తత్వాన్ని బాగా నేర్పుతారు. మావో ‘వంద ఆలోచనలు ఘర్షణ పడనివ్వు, వంద పువ్వులు వికసించనివ్వు’ నినాదం వాళ్ళ సంఘర్షణల చరిత్ర నుండి వచ్చింది. కానీ ఇండియాలో స్కూళ్లు, యూనివర్సిటీల్లో మతరంగాన్ని, అంతకంటే ముఖ్యంగా ఉత్పత్తి రంగాన్ని ఆలోచనల ఘర్షణలకు బయట నడవాలనే సంప్రదాయాన్ని ప్రచారం చేస్తున్నారు.
మోహన్ భాగవత్ ఉత్పత్తికీ, దేవుడికీ మధ్య సంబంధం, ఘర్షణ గురించి ఒక్క ఉప న్యాసం ఇవ్వగా మనం చూడలేదు. మోదీ కూడా నెహ్రూ లాగా సైన్సు మీద ఒక్క సుదీర్ఘ ఉపన్యాసం ఇవ్వలేదు. చైనాతో సమానంగా ఉన్న ఇంత పెద్ద జనాభాను సైన్సుకు శత్రువులను చేస్తే కొత్త ఆలోచనలు యువతకు ఎక్కడి నుండి వస్తాయి?
నేను ఇంతకుముందు వ్యాసంలో చెప్పినట్లు... కులం, ఏకవృత్తి, మూఢ నమ్మకాలు వేల ఏండ్లుగా మన మెదడు చిప్‌ను లాక్ చేసిన స్థితి ఉన్నది. ఆరెస్సెస్/బీజేపీ ప్రయత్నం ఈ లాక్ చెయ్యబడ్డ చిప్‌ను ఓపెన్ చెయ్యడం వైపు లేదు. వారి రాజకీయ మూఢ నమ్మకం ఈ లాక్‌ను తుప్పు పట్టించింది. అది పగల కొడితే తప్ప ఓపెన్ కాదు.
కానీ అలాంటి ప్రయత్నం మన విద్యా రంగంలో ఎవరు మొదలు పెట్టినా వారిని దేశద్రోహులు, సనాతన వ్యతిరేకులు అని ముద్ర వెయ్యడం, భయభ్రాంతులకు గురి చెయ్యడం మామూ లైంది. ఈ స్థితిలో చైనాతో పోటీపడే డిస్కవరీస్ ఇక్కడ ఎలా జరుగుతాయి? కొత్త డిస్కవరీలు జరగడానికి డబ్బు ఒక్కటే సరి పోదు. సైంటిస్టును అభివృద్ధి చేసే సామాజిక, గృహ, మార్కెట్, మత పునాది ఉండాలి.
ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు
Comments
Please login to add a commentAdd a comment