మూడో అల ఉంటుంది – ఉండదు, ఉన్నా ఇప్పుడే రాదు – ఇంకా సమయం పడుతుంది, వస్తుంది – కానీ, పెద్దగా ప్రభావం ఉండదు... ఇలా భిన్న వాదనలు ఇన్నాళ్లూ వినిపించినా, వచ్చేసినట్టే అని అత్యధికులు అంగీకరిస్తున్నారు. రెండో అల ఉధృతికి, మూడో అల పుట్టుకకు కారణమైన ప్రభుత్వాలు, పౌరుల నిర్లక్ష్యమే కొంప ముంచింది. తాజా అల తీవ్రతను నియంత్రణలో ఉంచేది పౌర సమాజమే! నాణ్యత కలిగిన మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరాన్ని విధిగా పాటించడం, ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రపరచుకోవడం మన నిరంతర ప్రవర్తన కావాలి. జీవన సంస్కృతిలో ఇదొక భాగమవాలి.
కోవిడ్–19 రెండో అల సమిసిపోకముందే, మూడో అల ముంచుకువస్తోంది. పలు ప్రపంచ దేశాల్లో, మన దేశంలో, తెలుగు రాష్ట్రాల్లోనూ ఇవే పరిస్థితులు నెలకొంటున్నాయి. అధ్యయనాలే కాక దేశంలోని వివిధ రాష్ట్రాల్లో... తాజా కేసులు, పాజిటివిటీ రేటు, వైరస్ పునరుత్పత్తి (ఆర్–ఫ్యాక్టర్) విలువ పెరుగుతున్న తీరు ఇదే చెబు తోంది. జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేస్తోంది. పటిష్ట చర్యలతో వ్యాధి వ్యాప్తిని అరికట్టాలని సూచిస్తోంది. రానున్న పండుగలు, ఉత్సవాల సందర్భంగా జనం పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా ముందే కట్టడి విధించాలని నిర్దేశించింది. భయపడొద్దు, భద్రంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని పౌర సమాజాన్ని శాస్త్రవేత్తలు, వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మూడో అల ఉంటుంది– ఉండదు, ఉన్నా ఇప్పుడే రాదు– ఇంకా సమయం పడుతుంది, వస్తుంది–కానీ, పెద్దగా ప్రభావం ఉండదు.... ఇలా భిన్న వాదనలు ఇన్నాళ్లూ వినిపించినా, వచ్చేసినట్టే అని అత్యధికులు అంగీకరిస్తు న్నారు. వ్యాధి వ్యాప్తి వేగం కూడా అంచనాలకు మించి ఉంటోంది. ముఖ్యంగా డెల్టా వైవిధ్యం తాజా విధ్యంసానికి కారణమని సర్వత్రా నిర్ధారణ అవుతోంది. ఇది మరో వైవిధ్యం కింద రూపాంతరం చెందితే... ఇంకా ప్రమాదమంటున్నారు. భారత్‌తో పాటు చైనా, బ్రెజిల్, అమెరికా, ఇండోనేషియా, ఇరాన్ వంటి దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చైనాలో డెల్టా తాజా విధ్వంసానికి కఠినతర ఆంక్షలు మొదలయ్యాయి. అమెరికా, కెనడాలో కేసులు పెరిగాయి.
మన దేశంలో తాజా అల ప్రభావం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఎప్పుడు తీవ్ర స్థాయి... అనే కాలమానంపై భిన్నాభిప్రాయాలు న్నాయి. మొత్తమ్మీద ప్రపంచంలోని 130 దేశాల్లో డెల్టా తాజా వైవిధ్యమే వ్యాధి వ్యాప్తికి ముఖ్య కారణం. మహమ్మారి మొదలైన ప్పటి నుంచి ప్రపంచంలో కోవిడ్ వైరస్ సోకిన వారి సంఖ్య 20 కోట్లు (2.6 శాతం ప్రపంచ జనాభా) దాటింది. ఆశించినంత వేగంగా టీకా ప్రక్రియ (వాక్సినేషన్) జరుగక, అంచనా వేసిన స్థాయిలో సామూహిక రోగనిరోధకత పెరుగక... అలమటిస్తున్న భారత్ వంటి వ్యవస్థల్లో పౌరసమాజమే మూడో అలను సమర్థంగా ఎదుర్కొవాలి.
వ్యాప్తి పెరుగుతోంది
కరోనా వ్యాధి వ్యాప్తిని పెంచుతున్న వైరస్ పునరుత్పత్తి (‘ఆర్’ ఫ్యాక్టర్) రేటు ప్రమాదకరమైన ఒకటి (1) దాటుతోంది. వ్యాధి సోకిన ఒకరు సగటున ఎంతమందికి వ్యాప్తి చేస్తున్నారనేది దీనిపైనే ఆధార పడుతుంది. ఇది ఒకటి లోపైతే వ్యాధి వ్యాప్తిని నిరోధించి, తాజా కేసుల సంఖ్యను పరిమితం చేయవచ్చు. పాజిటివిటీ రేటు పెరుగు దలకు ఇదే కారణం. దేశంలోని 10 రాష్ట్రాల్లో, 46 జిల్లాల్లో çపరిస్థితి తీవ్రంగా ఉంది. పరీక్షించిన వారిలో పది శాతం మందిపైనే కోవిడ్ నిర్దారణ (పాజిటివిటీ రేటు) అవుతోందని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్ టాస్క్‌ఫోర్స్ బృంద నేత వి.కె.పాల్ కథనం ప్రకారం, ‘ఆర్’ వ్యాల్యూ 0.6 లోపుంటే, వ్యాధి వ్యాప్తిని అదుపులో ఉంచొచ్చు. కానీ, దేశంలోని పది రాష్ట్రాల్లో ఈ సగటు 1 పైనే ఉంది. ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాలు 1కి దగ్గర్లో ఉన్నాయి.
ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాథమెటికల్ సైన్స్ (ఐఎమ్మెస్) నివేదిక ప్రకారం ముంబై, పుణే మినహా దేశంలోని అన్ని మెట్రో నగరాల్లోనూ ఇది 1 ని మించింది. ‘మూడో అల’కిదే సంకేతం, అంచనా కన్నా ముందే, కేరళలో తాజా అల ప్రవేశించినట్టే లెక్క’ అని వైరాలజిస్టుల వ్యాఖ్య! దేశంలో రెండో అల విధ్వంసం సృష్టించిన ఎక్కువ కాలం, దేశ సగటు ‘ఆర్’ వ్యాల్యూ 1 పైనే ఉంది. గత ఫిబ్రవరి 14 నుంచి, మే 7 వరకు 1+ ఉన్న పునరుత్పత్తి విలువ తర్వాత క్రమంగా 1 కన్నా తక్కువకు పడిపోయింది. అందుకే, రెండో అల బలహీనపడింది. జూలై ఆఖరు నుంచి మళ్లీ పెరిగింది. మిచిగాన్ విశ్వవిద్యాలయం వారు ఇది ముందుగానే అంచనా వేశారు, దాన్ని ఐఎమ్మెస్ నిర్దారించింది. ఫలితంగా, దేశంలో రోజువారీ సగటు కొత్త కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది.
రెండు రోజులు వరుసగా, రోజూ నలభైవేలకు పైగా (గురువారం 42,982) కేసులు నమోదయ్యాయి. రోజువారీ మృతుల సంఖ్య 500 దాటుతోంది. హైదరాబాద్, కాన్పూర్ ఐఐటీలకు చెందిన నిపుణుల బృంద అధ్యయనం ప్రకారం మూడో అల, మూడు నెలల కాలానికి (ఆగస్టు–అక్టోబర్) విస్తరించి ప్రభావం చూపుతుంది. తీవ్ర స్థితిలో రోజూ సగటున లక్ష కేసుల వరకు వెళ్లవచ్చని, ఇప్పుడున్న డెల్టా వైరస్ వైవిధ్యం మరో రూపు సంతరించుకుంటే 1.4 లక్షల వరకు వెళ్లవచ్చనే అభిప్రాయం ఉంది. రెండో అల తీవ్రంగా ఉన్నపుడు, గత మే నెలలో ఒకేరోజు కొత్త కేసుల సంఖ్య 4 లక్షలకు చేరడం చూశాం.
టీకా ప్రక్రియ పుంజుకుంటేనే...
ఉత్పత్తి పెంచుతున్నామని చెప్పినా, ఇతర కంపెనీల టీకాలకూ దేశంలో అనుమతించాం అంటున్నా... టీకాల ప్రక్రియ వేగం పుంజు కోలేదు. సగటున రోజూ 40 లక్షలకు కొంచెం అటిటుగా టీకాలి స్తున్నారు. దేశంలో ఇప్పటివరకు 48.8 కోట్ల టీకాలిచ్చినట్టు కేంద్రం చెప్పింది. రెండు డోసులు పడ్డవారి సంఖ్య 12 కోట్ల లోపే! దేశంలో ఇంకా 62 శాతం మందికి కనీసం ఒక డోసు కూడా అందలేదు. 18 ఏళ్ల లోపు వారిని పక్కన పెట్టినా, 90 కోట్ల మందికి రెండు డోసుల టీకా లివ్వాలి. కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపినట్టు లక్ష్యాల్ని చేరుకునేలా లేదు. ఏడాది చివరినాటికి, వయోజనులందరికీ టీకా సాధ్యపడక పోవచ్చు. సగటున రోజూ కోటి మందికి టీకా ఇవ్వగలిగితే సాధ్యం! కానీ, ఉత్పత్తి ఆ స్థాయిలో లేదు, నిర్వహణ అంతంతే! నెలకు 11 కోట్ల డోసుల నుంచి, వచ్చే డిసెంబరు తర్వాత కోవిషీల్డ్ ఉత్పత్తి సామర్థ్యం 12 కోట్ల డోసులకు, కోవాక్సిన్ ఉత్పత్తి నెలకు 2.5 కోట్ల నుంచి 5.8 కోట్ల డోసులకు పెరుగనున్నట్టు కేంద్రం చెబుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా కూడా టీకా ప్రక్రియ ఏకరీతిలో లేదు. సంపన్నదేశాలు అధికశాతం తమ జనాభాకు రెండు డోసుల టీకాలిచ్చుకొని ‘బూస్టర్’ డోసు గురించి యోచిస్తుంటే, పేద, వెనుకబడిన దేశాలు ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయి. మూడో వంతు దేశాలు తమ ఒక శాతం జనాభాకు కూడా రెండు డోసుల టీకాలివ్వలేకపోయాయి. ప్రపంచ బ్యాంకు జాబితా సంపన్న దేశాల్లో, సగటున ప్రతి 100 మందికి 101 చొప్పున టీకా డోసులు పడ్డాయి. అందుకే, ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘బూస్టర్ డోస్’పై మూడు మాసాల మారిటోరియం విధించాలని నిర్ణయించింది. పేద దేశాల వైపు పంపిణీ, సరఫరా పెంచండని టీకా ఉత్పత్తిదారులకూ సూచించింది.
‘అల’ అదుపు జనం చేతిలో...
సామూహిక రోగనిరోధకత ఇప్పుడప్పుడే సాధ్యపడేలా లేదు. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) వెల్లడించిన, తాజా సెరో సర్వే ఫలితాలు ఇదే ధ్రువీకరిస్తున్నాయి. దేశంలో 67 శాతం (ఆరేళ్ల వయసు పైబడిన) జనాభాకు కోవిడ్ వచ్చి వెళ్లినట్టు ఈ నమూనా అధ్యయనంలో వెల్లడైంది. 70 శాతం మందిలో యాంటీబాడీలు ఏర్పడితే సామూహిక రోగనిరోధకత వస్తుందని మొదట భావించినా, అది 85 శాతం మందిలో ఉండాలని కొత్తగా చెబుతున్నారు. ఇప్పుడ ప్పుడే ఇది సాధ్యపడకపోవచ్చు. మనకున్న వైద్య సదుపాయాల వ్యవస్థ ఎంత లోపభూయిష్టమో రెండో అల ఎత్తిచూపింది. ఈ ఏడాది మొదట్లో మన దేశంలో, ఇంకా ఐరోపా, అమెరికా, కెనడాలలోనూ ‘కోవిడ్ తగ్గిందిలే!’ అని కట్టడిని సడలించారు.
దాంతో, జనం విచ్చల విడిగా వ్యవహరించారు. రెండో అల ఉధృతికి, మూడో అల పుట్టుకకు కారణమైన ప్రభుత్వాలు–పౌరుల నిర్లక్ష్యమే కొంప ముంచింది. తాజా అల తీవ్రతను నియంత్రణలో ఉంచేది పౌర సమాజమే! కోవిడ్‌కి తగ్గ ప్రవర్తన ముఖ్యం. నాణ్యత కలిగిన మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరాన్ని విధిగా పాటించడం, ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రపరచు కోవడం మన నిరంతర ప్రవర్తన కావాలి. జీవన సంస్కృతిలో ఇదొక భాగమవాలి. వైరస్‌తో సహజీవనం అనివార్యమైనపుడు... ఇక ఎన్ని అలలు వచ్చినా, అప్పుడే మనం ఈ మహమ్మారిని గెలువగలుగుతాం.
-దిలీప్ రెడ్డి
ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment