కోవిడ్‌ సంక్షోభం మన స్వయంకృతం | Krishan Chander Singh Article On Corona Pandemic | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ సంక్షోభం మన స్వయంకృతం

Published Sat, May 8 2021 2:30 AM | Last Updated on Sat, May 8 2021 2:30 AM

Krishan Chander Singh Article On Corona Pandemic - Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌ భారీ స్థాయిలో దాడి చేయనుందని కేంద్ర ప్రభుత్వాన్ని గత మార్చిలోనే హెచ్చరించామని ఇప్పుడు కొందరు సాంక్రమిక వ్యాధుల నిపుణులు చెబుతున్నారు. కానీ తూర్పు భారత్‌కి ఆభరణంలా వెలుగుతున్న పశ్చిమబెంగాల్‌లో అధికారాన్ని కైవసం చేసుకోవడం అనే ఏకైక లక్ష్యంపైనే బీజేపీ సర్వశక్తులూ కేంద్రీకరించింది. అలాగే ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కుంభమేళాను సంవత్సరం ముందుకు జరిపి మరీ నిర్వహించారు. ఈ కుంభమేళాకు మొత్తం కోటిమంది భక్తులు హాజరుకావడంలో తనకు కలిగే రాజకీయ ప్రయోజనాన్ని బీజేపీ ఏమాత్రం వదిలిపెట్టదల్చుకోలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే కరోనా సెకండ్‌ వేవ్‌ ముందు ఇలా చేతులెత్తేయడం మన స్వయంకృతమే.

మార్చి 12న ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికాతో కూడిన క్వాడ్‌ దేశాల ప్రారంభ సదస్సును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్వహించారు. భారత్‌ నేతృత్వంలోని వ్యాక్సిన్‌ మైత్రి కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసే విషయంలో తక్కిన మూడు దేశాలు ఆమోదం తెలిపాయని మన విదేశాంగ శాఖ కార్యదర్శి హర్‌‡్ష శృంగ్లా పేర్కొన్నారు. అయితే బీజేపీ అగ్రనాయకత్వం నిర్దేశకత్వంలో సౌత్‌ బ్లాక్‌.. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయడానికి బదులుగా ప్రతిపక్షాలపై మూకుమ్మడి దాడి తలపెట్టడంపైనే తన శక్తులన్నింటినీ కేంద్రీకరించింది. పైగా, 2022లో జరగాల్సిన కుంభమేళాను హిందూ మతాధిపతుల చర్చల అనంతరం సంవత్సరం ముందుకు జరిపి 2021 ఏప్రిల్‌లోనే నిర్వహించారు. ఎన్నికల కమిషన్‌ మరింత అసంబద్ధంగా వ్యవహరించి అసెంబ్లీ ఎన్నికలను నెలరోజులపాటు వేడుకలాగా జరిపింది. ఇలా భారత్‌పై కరోనా సెకండ్‌ వేవ్‌ సంపూర్ణంగా దాడి చేయడానికి అన్నివిధాలా రంగం సిద్ధం చేసి పెట్టారు. దాని ఫలితాన్ని మనందరం చూస్తున్నాం.

కరోనా సెకండ్‌ వేవ్‌ భారీ స్థాయిలో దాడి చేయనుందని ప్రభుత్వాన్ని గత మార్చిలోనే హెచ్చరించామని ఇప్పుడు కొందరు సాంక్రమిక వ్యాధుల నిపుణులు చెబుతున్నారు. కానీ పశ్చిమబెంగాల్‌లో అధికారాన్ని కైవసం చేసుకోవడం అనే లక్ష్యంపైనే బీజేపీ కేంద్రీకరించింది. అలాగే ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కుంభమేళాను సంవత్సరం ముందుకు జరిపి మరీ నిర్వహించారు. ఈ కుంభమేళాకు మొత్తం కోటిమంది భక్తులు హాజరుకావడంలో తనకు కలిగే రాజకీయ ప్రయోజనాన్ని బీజేపీ ఏమాత్రం వదిలిపెట్టదల్చుకోలేదు.  సైంటిస్టుల హెచ్చరికలు, సోషల్‌ మీడియా పోస్టులు లేదా ప్రముఖ అంతర్జాతీయ పత్రికల్లో కరోనా ప్రమాదం గురించిన వార్తలు తమ చెవినపడని రీతిలో బీజేపీ అగ్రనాయకత్వం బబుల్‌లో దాక్కుండి పోయిందా అనే ప్రశ్న తలెత్తుతోంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు గ్లోబల్‌ కోవిడ్‌ హబ్‌గా భారత్‌ ప్రపంచదేశాల ముందు అవమానకరంగా నిలబడింది. భారత్‌ నుంచి పరోక్ష మార్గాల ద్వారా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాలని ప్రయత్నించే సొంత పౌరులను కూడా జైల్లో పెడతానని క్వాడ్‌ సభ్యదేశమైన ఆస్ట్రేలియా హెచ్చరించడం కేంద్ర ప్రభుత్వానికి పుండుమీద కారం రాసినట్లయింది. లక్షలాదిమంది కరోనా బారిన పడుతుండటం, వేలాదిమంది మరణించడం, ఆసుపత్రుల్లో ప్రవేశానికి కూడా తావు లేకపోవడం, ఆసుపత్రుల్లో చేరినవారు ఆక్సిజన్‌ కొరతతో కుప్పగూలిపోవడం వంటి భారత్‌ గురించిన భీతి కలిగించే వార్తలు ప్రపంచమంతా వ్యాప్తి చెందాయి.

వినియోగంలో లేని లక్షలాది ఆస్ట్రాజెనెకా టీకా డోసులు అమెరికన్‌ వేర్‌ హౌస్‌లలో వృథాగా పడి ఉంటున్నప్పటికీ భారత్‌కు ఒక్క టీకా కూడా ఇవ్వకుండా మోచేయిని అడ్డుతున్న అమెరికాతో మనకు భాగస్వామ్య ఒప్పందాలు అవసరమా అంటూ దేశీయంగా తీవ్రంగా ప్రశ్నలు మొదలయ్యాయి. మరోవైపున దేశీయంగా ప్రజలను గాలికి వదిలిపెట్టిన భారత జాతీయవాద ప్రభుత్వం.. గొప్పలు చెబుతూ కోట్లాది వ్యాక్సిన్‌ డోసులను అభివృద్ధి చెందుతున్న దేశాలకు పంపడంపై చాలామంది మండిపడుతున్నారు. పైగా ప్రస్తుత సంక్షోభాన్ని జాతీయ సంక్షోభంగా గుర్తించడానికి, ప్రకటించడానికి కూడా వెనుకాడుతున్న కేంద్రప్రభుత్వం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అమిత ప్రాధాన్యం ఇవ్వడం దేశప్రజలను మండిస్తోంది.

చివరగా, ఏప్రిల్‌ 25న అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సల్లివాన్‌ ట్వీట్‌ చేస్తూ, భారత్‌కు మరిన్ని సరఫరాలను,  వ్యాక్సిన్‌ వనరులను పంపుతామని వాగ్దానం చేశారు. కొత్త కరోనా వైరస్‌ ప్రభంజనాన్ని తట్టుకోవడంలో భారత్‌ సిద్ధం కాలేకపోయిందని గ్రహించిన ఇతర దేశాలు కూడా ఇప్పుడు మనకు సహాయం చేస్తామని చెబుతున్నాయి.  గత సంవత్సరం కరోనా తొలి వేవ్‌ సందర్భంగా సీరో–సర్వేలను ఆమోదించడంలో భారత రాజకీయ నాయకత్వం కుప్పిగంతులు వేయడంతో భారత్‌ పాక్షికతతో వ్యవహరిస్తోందని నిపుణులు నిర్ధారించారు. పైగా వ్యాక్సినేషన్‌ కూడా ప్రారంభం కావడంతో ఇకపై ఎలాంటి వేవ్‌ వచ్చినా సరే భారత్‌ దాన్ని అధిగమించి ముందంజలో ఉంటుందని మన విధాన నిర్ణేతలు భావించారు. 

2001లో, భుజ్‌ భూకంపం తర్వాత, అబు దుబాయిలో భారత రాయబారిగా ఉన్న నేను అక్కడి భారతీయ కమ్యూనిటీ నుంచి సహాయ సామగ్రిని సేకరించి అహమ్మదాబాద్‌కు విమానంలో తీసుకుపోయాను. కానీ అలాంటి సహాయాన్ని కూడా తక్షణం బాధితులకు అందించడం చాలా కష్టమైపోయింది. ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత 40 దేశాలనుంచి భారత్‌ అంతర్జాతీయ సహాయాన్ని ఆమోదిస్తోంది. ప్రతి దేశం విభిన్నమైన వైద్య సామగ్రిని, మందులను భారత్‌కు పంపిస్తున్నాయి కానీ, కొన్ని దేశాలు ఇంగ్లీషు భాషలో కాకుండా తమ సొంత బాషల్లో ముద్రించిన ప్యాకింగ్‌లను పంపించడంతో వాటిని భారత్‌లో ప్రజలు వినియోగించడం చాలా కష్టమవుతోంది. ఇక చైనా తనవంతుగా గత రెండువారాలుగా భారత్‌కు 5,000 వెంటిలేటర్లు, 21,569 ఆక్సిజన్‌ తయారీ యంత్రాలను, 3,800 టన్నుల మందులను 61 విమానాల్లో పంపించినట్లు ప్రకటించుకుంది. లద్దాఖ్‌లో ఇప్పటికీ తన బలగాలను ఉపసంహరించుకోని చైనానుంచి అలాంటి సహాయం వస్తోందని ప్రకటించడానికి కూడా భారత్‌ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంటోంది. అదే సమయంలో చాలా ఆలస్యంగా భారత్‌కు సహాయం పంపుతానని ప్రకటించిన అమెరికాను.. చైనా ప్రభుత్వం గేలి చేస్తోంది.

పైగా అత్యవసరమైన సహాయ సామగ్రిని పంపిణీ చేసే విషయంలో కేంద్రంలోని బీజేపీ నాయకత్వానికి, వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్షాల నాయకత్వంలోని ప్రభుత్వాలకు మధ్య వివాదాలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌లో బీజేపీ ఆశలు భగ్నమైన నేపథ్యంలో బీజేపీయేతర ప్రతిపక్ష ప్రభుత్వాలు కేందాన్ని వేలెత్తి చూపుతున్నాయి. కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి విభాగాలను, కాన్‌సంట్రేటర్లను, వెంటిలేటర్లు, యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ వంటివాటిని పంపిణీ చేయడాన్ని అత్యంత సమర్థవంతంగా, సమాన ప్రాతిపదికపై నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రక్రియ పనిచేయడానికే కొన్ని రోజుల సమయం పడుతోంది. ప్రారంభంలో కరోనా వ్యతిరేక సామగ్రిని దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ఔషధ సంస్థలకు వేగంగా పంపిస్తూ వచ్చారు. అయితే కేంద్రం పంపిణీ చేస్తున్న విధానాలపై రోజువారీగా వివరించడంలో పారదర్శకతను పాటించాల్సి ఉంటుంది. ఈలోగా ప్రత్యేకించి ఢిల్లీ వంటి కరోనా సెకండ్‌ వేవ్‌ విరుచుకుపడుతున్న నగరాలకు ఆక్సిజన్‌ ఉత్పత్తి విభాగాల సరఫరాను ఏ ప్రాతిపదికన చేస్తున్నారో చెప్పాలంటూ వివిధ న్యాయస్థానాలు కేంద్రాన్ని నిలదీయటం ప్రారంభించాయి.

కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌పై మేధో సంపత్తి హక్కుల రక్షణను ఎత్తివేయాలని భారత్‌ చేస్తూ వస్తున్న డిమాండును శుక్రవారం రాత్రి అమెరికా ప్రభుత్వం బలపర్చింది. భారత్‌ ఈ చిరకాల డిమాండ్‌ సాధ్యమైతే వర్థమాన దేశాలకు ఇది అతిపెద్ద విజయం అవుతుంది. కాబట్టి కరోనా సంక్షోభంపై భారత్‌ మార్గం స్పష్టమైపోయింది. ఒకటి ఆసుపత్రులకు తక్షణం వైద్యసామగ్రిని సరఫరా చేయడం, రోగులందరికీ చికిత్స అందించడం. ఇక రెండోది. సకాలంలో వ్యాక్సిన్‌ని అందించేలా తయారీ సంస్థలను త్వరపెట్టడం. మూడు. కేంద్రం తనకు, రాష్ట్రాలకు, ప్రైవేట్‌ ఆసుపత్రులకు కూడా ఒకే ధరతో వ్యాక్సిన్‌ అందించేలా సేకరణ విధానాన్ని రూపొందించుకోవాలి. నాలుగు. డబ్ల్యూటీవో మేధోసంపత్తి హక్కులపై రక్షణను ఎత్తివేసిన వెంటనే వ్యాక్సిన్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి సరఫరా చేయడానికి సిద్ధమవడం. దీనికోసం ఇప్పటికే మూతపడిన ప్రభుత్వ రంగ సంస్థల విభాగాలను మళ్లీ ఉపయోగించుకోవాలి. 


కె.సి. సింగ్‌ 
వ్యాసకర్త ఇరాన్‌లో భారత్‌ మాజీ రాయబారి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement