జనధనానికి జవాబుదారీ లేదా? | Devinder Sharma Article Public Money Write-off Calls For Accountability | Sakshi
Sakshi News home page

జనధనానికి జవాబుదారీ లేదా?

Published Tue, Jun 29 2021 12:11 AM | Last Updated on Tue, Jun 29 2021 12:11 AM

Devinder Sharma Article Public Money Write-off Calls For Accountability - Sakshi

కరోనా వల్ల మధ్యతరగతి మరింత నిరుపేదదైంది. నిరుద్యోగం పెరిగిపోయింది. కానీ, కోటీశ్వరుల సంపద మాత్రం 35 శాతం పెరిగింది. కార్పొరేట్‌ లాభాలు పెరిగినంత మాత్రాన ధనికుల నుంచి అధికంగా పన్ను వసూళ్ళు ఉంటాయని అనలేం. కోటీశ్వరులకు భారీగా పన్ను రాయితీలు లభిస్తుంటే, మిగతా వర్గాలు మరిన్ని పన్నులు చెల్లిస్తున్నాయి. ఇప్పుడు వీధిలోని సామాన్యుడు సైతం పెట్రోలు, డీజిల్‌పై పన్నుల రూపంలో రూ. 5.70 లక్షల కోట్లు అధికంగా చెల్లించాల్సి వచ్చింది. బ్యాంకులు వ్యవసాయ ఋణాలు మాఫీ చేస్తే గగ్గోలు పెడుతుంటాం. కానీ, కోటీశ్వరులకు లాభం కలిగేలా లక్షల కోట్ల మేర మొండి బకాయిలు మాఫీ చేస్తుంటే మాట్లాడం! ప్రజాధనాన్ని ఇలా చట్టబద్ధంగా కొట్టేస్తుంటే, అనుమతించాల్సిందేనా?

కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. సామాన్యులు కష్టపడి పొదుపు చేసుకున్న సొమ్ములు కరిగిపోయాయి. మరోపక్క నిరు ద్యోగం పెరిగిపోయింది. కరోనా విస్ఫోటనం మొదలైన తొలి ఏడాదిలోనే అదనంగా 23 కోట్ల మంది నిశ్శబ్దంగా దారిద్య్ర రేఖ దిగు వకు జారిపోయారు. అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం (ఎ.పి.యు.) లోని సుస్థిర ఉపాధి కేంద్రం (సీఎస్‌ఈ) ఈ లెక్కలు చెప్పింది. ఇదే కరోనా తొలి ఏడాదిలోనే దేశంలో మధ్యతరగతి వర్గంలో 3.2 కోట్ల మంది తగ్గిపోయారని మరో అధ్యయనంలో ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ తేల్చింది. కనీవినీ ఎరుగని ఈ మహమ్మారి మన మధ్యతరగతిపైన, నిరుపేదలపైన ఎంత గట్టి దెబ్బకొట్టిందో ఈ రెండు అధ్యయనాలూ కలతపరిచేలా గుర్తుచేస్తున్నాయి. 

ఇక, ఈ ఏడాది విరుచుకు పడ్డ కరోనా రెండో వేవ్‌ ఎంత తీవ్రంగా దెబ్బ తీసిందో ఇంకా తెలియరాలేదు. ఎవరిని ఏ మేరకు దెబ్బ తీసిందన్నది పక్కన పెడితే, సమాజంలోని అన్ని వర్గాల ప్రజాలపైనా ప్రభావమైతే పడిందన్నది నిర్వివాదాంశం. గృహస్థులు దాచుకున్న డబ్బులు అనూహ్యంగా తరిగిపోయాయి. నిరుద్యోగం ఆకాశానికి అంటింది. దాంతో, ప్రభుత్వం చివరకు అవసరార్థులైన 80 కోట్ల మందికి నెలకు 5 కిలోల ఉచిత రేషన్‌ ఇచ్చే పథకాన్ని వచ్చే నవంబర్‌ దాకా పొడిగించాల్సి వచ్చింది. కానీ, గత ఆర్థిక సంవత్స రంలోనే లిస్టెడ్‌ కంపెనీల కార్పొరేట్‌ నికర లాభాలు మాత్రం 57.6 శాతం పైకి ఎగబాకాయి. ఒక వైపు కరోనా దెబ్బతో ఆర్థిక వ్యవస్థ అస్తుబిస్తు అవుతున్న సమయంలోనే, మిగులు ధనాన్ని అందిపుచ్చు కున్న స్టాక్‌ మార్కెట్లు కూడా పైకి దూసుకుపోయాయి. భారతదేశం లోని కోటీశ్వరుల సంపద ఏకంగా 35 శాతం పెరిగింది. అంబానీ సంపద 8,400 కోట్ల డాలర్లకూ, అదానీ ఐశ్వర్యం 7,800 కోట్ల డాలర్లకూ ఎగబాకాయని బ్లూమ్‌బర్గ్‌ తేల్చింది. 

ఒక్క మాటలో– కరోనా వల్ల ధనికుల వద్ద సంపద మరింత పోగుపడితే, పేదసాదలు మరింత నిరుపేదలయ్యారు. ఇంకా లోతు ల్లోకి వెళితే– కార్పొరేట్‌ లాభాలు పెరిగినంత మాత్రాన ధనికుల నుంచి అధికంగా పన్ను వసూళ్ళు ఉంటాయని అనలేం. వాస్తవంలో ధనవంతులకు భారీ పన్ను రాయితీలు, సులభంగా డబ్బు లభిస్తే, దేశంలోని మిగతా వర్గాలు మరిన్ని పన్నులు చెల్లించాల్సి వస్తోంది. కార్పొరేట్‌ పన్ను వసూళ్ళు గణనీయంగా పడిపోయాయి. గత పదేళ్ళలో ఎన్నడూ లేనంత కనిష్ఠానికి చేరాయి. ఇలా పన్ను వసూలు తగ్గిపోవడం ప్రపంచ వ్యాప్త ధోరణికి తగ్గట్లే ఉంది. 2019 సెప్టెం బర్‌లో దేశ ఆర్థికశాఖ మంత్రి కార్పొరేట్‌ పన్ను ప్రాతిపదికను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. అలాగే, నూతన ఉత్పత్తి సంస్థలకేమో 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ. 1.45 లక్షల కోట్ల మేర ఆదాయం పోతుంది. 

ఇదే సమయంలో కార్పొరేట్లతో నుంచి సగటు కుటుంబాలకు పన్ను ప్రాతిపదిక ఎలా మారిందో చూద్దాం. 2020 –21లో కార్పొరేట్‌ పన్నులు, వ్యక్తిగత ఆదాయపు పన్నులతో కూడిన ప్రత్యక్ష పన్ను వసూళ్ళు రూ. 9.45 లక్షల కోట్లు. కానీ, అదే సమయంలో పరోక్ష పన్ను వసూళ్ళు దాన్ని దాటేశాయి. ఏకంగా రూ. 11.37 లక్షల కోట్లకు గరిష్ఠానికి చేరాయి. ఇది కాక, వీధిలోని సామాన్యుడు పెట్రోలు, డీజిలుపై పన్నుల (ఎక్సైజ్, వ్యాట్‌) రూపంలో రూ. 5.70 లక్షల కోట్లు అధికంగా చెల్లించాల్సి వచ్చింది. అందులో దాదాపు 60 శాతం మేర ఇంధనపు పన్ను కేవలం ద్విచక్ర వాహనదారుల నుంచే వస్తోంది. ఇది కాక, రియల్‌ ఎస్టేట్‌ రిజిస్ట్రీ, మద్యంపై ఎక్సైజ్‌ సుంకంతో పాటు వినియోగదారులు చెల్లించే ఎలక్ట్రిసిటీ డ్యూటీని కలుపుకొని చూడండి. అవన్నీ చూస్తే, చివరకు సామాన్యుడు చెల్లిస్తున్న పరోక్ష పన్నుల వాటా చాలా ఎక్కువ. అంటే, కనీసం ఇప్పుడిక అభివృద్ధికి కేవలం తమ వల్లనే వనరులు సమకూరుతున్నాయని వ్యక్తిగత పన్ను చెల్లింపు దారులు అనలేరు. పన్ను చెల్లింపుదారులు కానివారిది కూడా ఆదాయ సృష్టిలో గణనీయంగా అధిక వాటాయే. చివరకు ప్లాస్టిక్‌ చెప్పులు వేసుకొనే సాధారణ కూలీ కూడా జి.ఎస్‌.టి. చెల్లిస్తున్నాడని మర్చి పోకండి. దీన్నిబట్టి ఒక విషయం స్పష్టమవుతోంది. దేశంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన పన్ను కడుతూనే ఉన్నారన్న మాట.

గమనిస్తే – దేశం స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో కార్పొరేట్‌ లాభం వాటా గత పదేళ్ళలో ఎన్నడూ లేనంత గరిష్ఠమైన 2.63 శాతా నికి చేరింది. కానీ, అదే సమయంలో 2020–21లో ఏకంగా రూ. 1.53 లక్షల కోట్ల మేర కార్పొరేట్‌ మొండి బకాయిలను భారతీయ బ్యాంకులు మాఫీ చేశాయి. బ్యాంకులకున్న ఈ నిరర్థక ఆస్తులు (ఎన్‌.పి.ఎలు) ఇంకా పెరుగుతాయని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ అంచనా. ఇది ఇలా ఉండగా, 2017–18 నుంచి గత నాలుగేళ్ళలో బ్యాంకులు మాఫీ చేసిన మొత్తాలు భారీగా రూ. 6.96 లక్షల కోట్ల మేర ఉన్నాయి. నిజానికి, వ్యవసాయ ఋణాలను మాఫీ చేసినప్పు డల్లా గగ్గోలు పెట్టేస్తుంటారు కానీ, బ్యాంకులు క్రమం తప్పకుండా చేసే ఈ మొండి బకాయిల మాఫీ మాత్రం ఎవరి కంటికీ కనపడదు. 

ఇది చాలదన్నట్టు, అనేక ఆర్థిక మోసాలలో రూ. 5 లక్షల కోట్ల బ్యాంకు సొమ్ము ఇరుక్కుపోయింది. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన జవాబు ఆధారంగా ఇటీవలే ఓ వార్తాపత్రిక తన కథనంలో అదెలా జరిగిందో వెల్లడించింది. ఆ మొత్తంలో 76 శాతం వాటా అగ్రశ్రేణిలో నిలిచిన 50 ఋణ ఖాతాల లావాదేవీలదే! ఇలాంటి దీర్ఘకాలిక ఎగవేతదారులను శిక్షించడం కోసం దివాలా నియమావళి (ఐ.బి.సి)ని తీసుకొచ్చారు. కానీ, దాని వల్ల ఆశించినది జరగడం లేదు. ఇటీవల రెండు దివాలా వ్యవహారాల్లో బ్యాంకులు (లేదా ఋణదాతలు) తామిచ్చిన అప్పులో ఏకంగా 93 నుంచి 96 శాతం మేర మాఫీ చేయాల్సి వచ్చింది. దానిపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఒక కేసులో అప్పులలో కూరుకుపోయిన వీడియోకాన్‌ గ్రూపులోని 13 సంస్థలపై వేదాంత గ్రూపునకు చెందిన ట్విన్‌ స్టార్‌ టెక్నాలజీస్‌ దాదాపుగా ఏమీ చెల్లించకుండానే నియంత్రణ సాధించింది. ఆ కార్యాచరణకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌.సి.ఎల్‌.టి.) ఆమోదం తెలిపింది. 64 వేల కోట్లకు పైగా మొత్తానికి గాను ఏక మొత్తపు చెల్లింపు పరిష్కారం కింద కేవలం 2 వేల కోట్ల పైన మాత్రమే వేదాంత గ్రూపు చెల్లించింది. మొత్తం సొమ్ములో అది కేవలం 4.15 శాతం. మరోమాటలో చెప్పాలంటే, బ్యాంకులతో సహా ఋణదాతలు మిగతా 95.85 శాతం బకాయిని మాఫీ చేయడానికి ఒప్పుకున్నారన్న మాట. ఇదంతా చూసిన ౖఫైనాన్షియల్‌ జర్నలిస్టు – రచయిత్రి సుచేలా దలాల్‌ కడుపు మండి, ‘సామాన్యులు ఒక్కసారి సైకిల్‌ కోసం అప్పు తీసుకొన్నా, బ్యాంకులు ఎలా ప్రవర్తిస్తాయో తెలుసు’ అని వ్యాఖ్యా నించారు. 

ఇలా అనేక కేసుల్లో బిడ్డర్లు కారుచౌక ఒప్పందాలతో దర్జాగా ముందుకు సాగిపోతున్నారు. బ్యాంకులు, ఇతర ఋణదాత సంస్థలే తరచూ 80– 95 శాతం మేర బకాయిని మాఫీ చేసి, నష్టపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, చట్టబద్ధంగా వాళ్ళు ప్రజాధనాన్ని దోచే స్తున్నారన్న మాట! ఎందుకంటే, బ్యాంకుల్లో ఉండేది ప్రజాధనం. బ్యాంకులు ఇలా ఆర్థిక మోసాలలో ఋణమాఫీ చేశాయంటే ప్రజా ధనం నష్టపోయినట్టే్ట! బహుశా, దీనివల్లే వ్యాపారవేత్త హర్ష్‌ గోయెం కాకు చీకాకు వచ్చినట్టుంది. ప్రధానమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్‌ చేస్తూ, ‘జనం కష్టపడి సంపాదించిన డబ్బును ఇలా కొందరు చట్ట బద్ధంగా దొంగిలించడం అనుమతించకూడదు’ అంటూ ఆయన ఏకంగా ఓ ట్వీట్‌ చేశారు. అవును... జరుగుతున్న కథ చూసి, విషయం గ్రహిస్తే– ఎవరైనా ఆ మాటే అంటారు!
వ్యాసకర్త ఆహార, వ్యవసాయరంగ నిపుణులు


దేవిందర్‌ శర్మ
ఈ–మెయిల్‌ : hunger55@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement