Economy System
-
రాబోయే ఐదేళ్లు భారత్‌కు ఎంతో క్లిషమైంది: జైశంకర్
ఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా రానున్న ఐదేళ్లు చాలా క్లిష్టమైనది అంటూ కామెంట్స్ చేశారు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్. అన్నారు. ప్రస్తుతం భారత్ ఇబ్బందికర(కఠిన) పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఇక, ఇదే సమయంలో అమెరికా ఎన్నికలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.కాగా, జైశంకర్ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రానున్న ఐదేళ్ల కాలం భారత్‌కు ఎంతో క్లిషమైనది. మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఉక్రెయిన్‌లో ఏం జరుగుతోంది?. ఆగ్నేయాసియా.. తూర్పు ఆసియా.. ఇలా వివిధ ప్రాంతాల్లో ఏమవుతుందో చూస్తూనే ఉన్నాం. యుద్ధాల కారణంగా ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. అది భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది.ప్రస్తుతం ఎన్నో దేశాలు ఆర్థిక కష్టాల్లో ఉన్నాయి. ఒక దేశం వాణిజ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటే.. మరోకరు విదేశీ మారకపు కొరతను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో వివిధ రకాల ఆటుపోట్లు ఉన్నాయి. మరోవైపు.. కోవిడ్ సమస్య కూడా ఇంకా తీరలేదు. పలు దేశాలపై కోవిడ్ ప్రభావం ఇంకా ఉంది. ఇక, వాతావరణ మార్పులపై కూడా ఆందోళన వ్యక్తం చేయాల్సిన సమయం వచ్చింది. ప్రకృతి విపత్తుల కారణంగా ఎన్నో దారుణ పరిస్థితులు జరుగుతున్నాయన్నారు. ఇక, ఏది ఏమైనప్పటికీ తాను మాత్రం ఆవకాశవాదిని అని చెప్పుకొచ్చారు. సమస్యలకు పరిష్కారాల గురించే ఆలోచిస్తానన్నారు.మరోవైపు.. అమెరికా అధ్యక్ష ఎన్నికలపైన కూడా జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాల ఎన్నికలపై మనం స్పందించకూడదు. ఎందుకంటే ఇతరులు కూడా మన అంతర్గత అంశాల్లో మాట్లాడకూడదు. అందుకే ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోలేను. కానీ, గత 20 సంవత్సరాలను పరిశీలిస్తే అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఉన్నప్పటికీ భారత్ కలిసి ముందుకు సాగిందన్నారు. అందుకే ఈసారి కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా... భారత్ వారితో కలిసి పని చేస్తుందన్నారు. -
వృద్ధిలో భారత్ వేగం.. చైనా నెమ్మది
న్యూఢిల్లీ: ఎకానమీ బాటలో భారత్ వేగంగా పరోగమిస్తుంటే.. చైనా నెమ్మదిస్తోందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. ‘చైనా స్లోస్... ఇండియా గ్రోస్’ అన్న శీర్షికన విడుదలైన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ఆసియా–పసిఫిక్ గ్రోత్ ఇంజిన్... చైనా నుండి దక్షిణ, ఆగ్నేయాసియాలకు మారుతుందని అంచనా. ►చైనా వృద్ధి రేటు 2023లో 5.4 శాతంగా అంచనా. 2024లో ఇది 4.6 శాతానికి తగ్గుతుంది. 2025లో 4.8 శాతానికి పెరుగుతుంది. 2026లో మళ్లీ 4.6 శాతానికి తగ్గుతుంది. ►ఇక భారత్ వృద్ధి 2026లో 7 శాతానికి పెరుగుతుంది. ఇదే సమయంలో వియత్నా వృద్ధి 6.8%, ఫిలిప్పైన్స్ వృద్ధి రేటు 6.4 %, ఇండోనేíÙ యా వృద్ధి 5 శాతంగా నమోదయ్యే వీలుంది. భారత్‌తో పాటు ఇండోనేíÙయా, మలేíÙయా, ఫి లిప్పైన్స్లో దేశీయ డిమాండ్ పటిష్టంగా ఉంది. ►భారత్ వృద్ధి రేటు 2023–24, 2024–25లో 6.4 శాతంగా ఉంటుంది. 2025లో 6.9 శాతంగా, 2026లో 7 శాతంగా సంస్థ అంచనావేస్తోంది. అధిక ఆహార ద్రవ్యోల్బణం, బలహీన ఎగుమతి పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్‌లో ఆర్థిక క్రియాశీలత, డిమాండ్ పటిష్టంగా ఉన్నాయి. ►ఆసియా–పసిఫిక్ సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను ఎక్కువగా ఉంచే అవకాశం ఉన్నందున, ఈ ప్రాంతంలోని రుణ గ్రహీతలకు రుణ వ్యయాలు, సేవలు భారీగా ఉంటాయి. ►మధ్యప్రాచ్యంలో సంఘర్షణలు విస్తరిస్తే.. అవి ప్రపంచ సరఫరా చైన్‌ను దెబ్బతీయవచ్చు. ఇది ఇంధన వ్యయాలను పెంచుతుంది. తద్వారా ద్రవ్యోల్బణం పెరుగుతంది. అధిక ఇన్పుట్ ఖర్చులు కార్పొరేట్ మార్జిన్లను తగ్గించే అవకాశం ఉంది. ఇది డిమాండ్ పరిస్థితులనూ దెబ్బతీసే అవకాశం ఉంది. ►ఆసియా–పరిఫిక్ ప్రాంత వృద్ధి అంచనాలను (చైనా మినహా) 2024కు సంబంధించి 4.4 శాతం నుంచి 4.2 శాతానికి తగ్గిస్తున్నాం. పారిశ్రామిక వృద్ధి అవకాశాలపైనా ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు. ప్రత్యేకించి ఎగుమతుల ఆధారిత తయారీ రంగం కఠిన పరిస్థితులను ఎదుర్కొనే ఇబ్బందులు ఉన్నాయి. -
గూగుల్ విధానాలు .. భారత ఎకానమీకి హానికరం
న్యూఢిల్లీ: దేశీ పోటీదారులను అణగదొక్కేలా టెక్ దిగ్గజం గూగుల్ పాటిస్తున్న పోటీ వ్యతిరేక విధానా లు భారత వినియోగదారులు, ఆర్థిక వ్యవస్థకు హాని చేస్తున్నాయని మ్యాప్‌మైఇండియా సీఈవో, ఈడీ రోహన్ వర్మ వ్యాఖ్యానించారు. ‘గూగుల్ పోటీ వ్యతిరేక విధానాల ద్వారా కొత్త మార్కెట్లలో గుత్తాధిపత్యాన్ని చలాయిస్తుందని, తయారీ సంస్థలు.. యూజర్లలో ప్రత్యామ్నాయ ఆపరేటింగ్ సిస్ట మ్స్, యాప్ స్టోర్స్, యాప్స్ విస్తరణను అసాధ్యం చేస్తుందని పరిశ్రమ, ప్రభుత్వం, నియంత్రణ సంస్థలకు.. ఈ వ్యవహారాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేసిన వారందరికీ తెలుసు. గూగుల్ పోటీ వ్యతిరేక విధానాలనేవి మ్యాప్‌మైఇండియా వంటి స్వదేశీ పోటీ సంస్థలను గొంతు నొక్కడం ద్వారా భారతీ య వినియోగదారులు, ఎకానమీకి చేటు చేస్తాయి‘ అని వర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌లకు సంబంధించి గుత్తాధిపత్యం చలాయిస్తోందంటూ సీసీఐ రూ. 1,338 కో ట్ల జరిమానా విధించడాన్ని సవాలు చేస్తూ, ఎన్సీఎల్ఏటీని గూగుల్ ఆశ్రయించిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ), ప్రభుత్వం, పార్లమెంటు తీసుకుంటున్న అద్భుతమైన చర్యలు అమలు కాకుండా నిరోధించేందుకు, తనకు అనుకూలంగా వ్యవహరించేలా అందర్నీ ప్రభావితం చేసేందుకు, ఒత్తిడి తెచ్చేందుకు గూగుల్ ప్రయత్నాలు మొదలుపెట్టిందని వర్మ చెప్పారు. 2020లో కోవిడ్ విజృంభించినప్పుడు మ్యాప్‌మైఇండియా యాప్ కోవిడ్ కంటైన్మెంట్ జోన్లు, టెస్టింగ్.. ట్రీట్మెంట్ సెంటర్లు మొదలైన వివరాలన్నీ అందించేదని, గూగుల్ మ్యాప్స్‌లో ఇవేవీ ఉండేవి కావని వర్మ చెప్పారు. అలాంటి తమ యాప్‌ను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించిందని, అనేకానేక ఉత్తరప్రత్యుత్తరాల తర్వాత గానీ పునరుద్ధరించలేదని వివరించారు. మరోవైపు, సీసీఐ ఆదేశాలతో భారతీయ యూజర్లు, వ్యాపారవర్గాలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతోనే తాము ఎన్సీఎల్ఏటీలో అప్పీలు చేసినట్లు గూగుల్ ప్రతినిధి తెలిపారు. -
5 ట్రిలియన్ డాలర్ల లక్ష్య సాకారానికి స్టార్టప్‌లు
హైదరాబాద్: ప్రధాన మంత్రి లక్ష్యమైన ‘2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడం’ సాకారానికి స్టార్టప్‌లు ముఖ్య పాత్ర పోషిస్తాయని, ఈ స్టార్టప్‌ల నిధుల అవసరాలను తీర్చడంలో ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్) కీలకంగా పనిచేస్తాయని చిన్న పరిశ్రమ అభివృద్ధి బ్యాంక్ (సిడ్బీ) సీఎండీ సుబ్రమణియన్ రామన్ పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిధుల అవసరాలు, అభివృద్ధి, ప్రోత్సాహకాలను సిడ్బీ చూస్తుంటుంది. ఈ నెల 27న ఇన్వెస్టర్ కనెక్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, వాణిజ్య బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. స్టార్టప్‌లకు సంబంధించి ఫండ్స్ ఆఫ్ ఫండ్స్, కొత్తగా ఏర్పాటైన క్రెడిట్ గ్యారంటీ స్టార్టప్‌లకు సంబంధించి సమాచారాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం. స్టార్టప్‌లకు కావాల్సిన నిధులను సమీకరించడంలో ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా డీపీఐఐటీ జాయింట్ సెక్రటరీ శృతీసింగ్ అభినందించారు. -
ఆర్థిక విధానంపై అప్పుడే యూ టర్న్.. చిక్కుల్లో బ్రిటన్ ప్రధాని
దాదాపు నెలన్నర క్రితం సంగతి. సెప్టెంబర్ 5న భారత సంతతికి చెందిన మాజీ మంత్రి రిషి సునాక్‌ను ఓడించి లిజ్ ట్రస్ బ్రిటన్ ప్రధాని పీఠమెక్కారు. అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోయిన జీవన వ్యయాన్ని తగ్గిస్తానని, చుక్కలనంటుతున్న ఇంధన ధరలకు ముకుతాడు వేస్తానని, కట్టు తప్పుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానని ప్రకటించారు. ‘చేసి చూపిస్తా’మంటూ ప్రతిజ్ఞ చేశారు. కానీ నెల రోజుల్లోనే అన్నివైపుల నుంచీ ఆమెకు గట్టిగా సెగ తగులుతోంది. ఆర్థిక వ్యవస్థను పట్టాలకెక్కించేందుకు ఆమె ప్రతిపాదించిన విధానాలన్నీ ద్రవ్యోల్బణ కట్టడిలో ఒక్కొక్కటిగా విఫలమవుతున్నాయి. ట్రస్ తొలి మినీ బడ్జెట్ అన్ని వర్గాల్లోనూ తీవ్ర విమర్శల పాలైంది. ప్రధానంగా కార్పొరేషన్ ట్యాక్స్‌ను 19 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని దాన్ని ఎప్పట్లా 25 శాతంగానే కొనసాగిస్తామంటూ యూ టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలన్నీ కన్జర్వేటివ్ నేతలు, ఎంపీలను బాగా కలవరపెడుతున్నాయి. వారిలో ట్రస్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని బ్రిటిష్ మీడియా పేర్కొంటోంది. ఆర్థిక మంత్రిపై ఇప్పటికే వేటు పడింది. ప్రధాని మార్పు కూడా అనివార్యమని ఎంపీల్లో అత్యధికులు భావిస్తున్నారని చెబుతోంది. సమస్యలను చక్కదిద్దడంలో, సొంత పార్టీ నేతల విశ్వాసాన్ని నిలుపుకోవడంలో విఫలమవుతున్న ట్రస్ ఏ క్షణమైనా తప్పుకోవాల్సి రావచ్చంటున్నారు! ఆమె రాజీనామాకు టోరీ ఎంపీలు త్వరలో బహిరంగ పిలుపు ఇచ్చే అవకాశముందని బ్రిటిష్ మీడియాలో వార్తలొస్తున్నాయి!! ఆరేళ్లు, నలుగురు ప్రధానులు ఆరేళ్లుగా అధికార కన్జర్వేటివ్ పార్టీకి అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడంపై 2016లో బ్రెగ్జిట్ రిఫరెండం నిర్వహించినప్పటి నుంచి ఏకంగా నలుగురు ప్రధానులు మారారు! 2016లో డేవిడ్ కామెరాన్ తప్పుకుని థెరెసా మే ప్రధాని అయ్యారు. కానీ బ్రెగ్జిట్ ఒప్పందంపై ప్రతిష్టంభన ఆమె పీఠానికి ఎసరు పెట్టింది. 2019లో బోరిస్ జాన్సన్ పగ్గాలు చేపట్టారు. మూడేళ్లయినా నిండకుండానే ఆయనా అనేకానేక వివాదాల్లో చిక్కుకున్నారు. దాంతో అయిష్టంగానే గత జూలైలో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడిక ట్రస్ వంతు కూడా వచ్చినట్టేనంటూ ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఆర్థిక విధానాలపై యూ టర్న్ తీసుకోవడం ఆమెకు అప్రతిష్ట తెచ్చిపెట్టిందంటున్నారు. ఇవీ ‘తప్పు’టడుగులు... ► ఆర్థిక మంత్రిగా తొలిసారిగా నల్ల జాతీయుడైన క్వాసీ క్వార్టెంగ్ను ట్రస్ ఎంచుకున్నారు. పౌరుల నివాస పన్నులు, ఇంధన ఖర్చులను తగ్గించడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రతిష్టంభనను వదిలించేందుకు ఆయన ప్రకటించిన మినీ బడ్జెట్ పూర్తిగా బెడిసికొట్టింది. ఏకంగా 4,500 కోట్ల పౌండ్ల మేరకు పన్ను తగ్గింపులను ప్రకటించారు. ద్రవ్యోల్బణం చుక్కలనంటుతున్న వేళ ఇది ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తుందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. బ్రిటన్ కరెన్సీ పౌండ్ విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. ► తొలుత ఆర్థిక మంత్రి నిర్ణయాన్ని సమర్థించిన ట్రస్, కొద్ది రోజులకే యూ టర్న్ తీసుకుంటూ అత్యధిక స్థాయి ఆదాయ పన్ను రేటు తగ్గింపును రద్దు చేయడం వివాదానికి దారితీసింది. పైగా ఇది సొంత పార్టీలోనూ ఆమెపై తీవ్ర అసంతృప్తికి దారి తీయడంతో ఎటూ పాలుపోక క్వాసీని తప్పించి జెరెమీ హంట్‌కు ఆర్థిక శాఖ అప్పగించారు. రిషి పన్నుల పెంపు ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె, ఇప్పుడు ఆయన బాటలోనే నడవడాన్ని అసమర్థతగానే అంతా భావిస్తున్నారు. రిషివైపే టోరీ ఎంపీల మొగ్గు? ట్రస్ తప్పుకుంటే తదుపరి ప్రధానిగా రిషి పేరే ప్రముఖంగా విన్పిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనే సమర్థ ప్రత్యామ్నాయమని కన్జర్వేటివ్ ఎంపీలు భావిస్తున్నట్టు బ్రిటిష్ మీడియా చెబుతోంది. రిషీని ప్రధానిగా, పెన్నీ మోర్డంట్ను ఆయనకు డిప్యూటీగా నియమించే ఆలోచన సాగుతోందంటున్నారు. లేదంటే మోర్డంట్ ప్రధానిగా, రిషి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టొచ్చని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. చివరికి మళ్లీ బోరిస్ జాన్సనే తిరిగొచ్చినా ఆశ్చర్యం లేదంటున్న వాళ్లూ ఉన్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
సవాళ్లు ఉన్నా... ప్రపంచంలో మనమే ఫస్ట్
ముంబై: భౌగోళిక రాజకీయ సంక్షోభం ఉన్నప్పటికీ భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో మొదట ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్ష సందర్భంగా దాస్ ఈ విశ్లేషణ చేశారు. అప్పటి మూడురోజుల సమావేశ మినిట్స్ శుక్రవారం విడుదలయ్యాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచడానికి ఈ సమావేశంలో ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. కమిటీలో సభ్యురాలు అషీమా గోయల్ మాత్రం 35 బేసిస్ పాయింట్ల మేర మాత్ర మే పెంపునకు తన అంగీకారం తెలిపారు. ఎకానమీ క్రమంగా పురోగతి చెందుతోందని, ఈ విషయంలో తగిన సానుకూల సంకేతాలు అందుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మే తర్వాత 1.9 శాతం అప్ సెప్టెంబర్ తాజా సమీక్ష పెంపు నిర్ణయంతో రెపో రేటు కరోనా ముందస్తు స్థాయికన్నా ముప్పావుశాతం అధికం కావడం గమనార్హం. వృద్ధి మందగమనాన్ని నిరోధించడానికి 2019 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ 2020 మే 22 వరకూ మొత్తం 250 బేసిస్ పాయింట్ల రెపో రేటును తగ్గించింది. ఇందులో మహమ్మారి ప్రారంభమైన తర్వాత (2020 మార్చి నుంచి 2020 మే మధ్య) తగ్గింపే 115 బేసిస్ పాయింట్లు. అంటే మహమ్మారికి ముందు వరకూ రెపో రేటు 5.15 శాతంగా ఉంది. 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 శాతానికి) తగ్గించిన నాటి నుంచి 4 శాతం వద్ద రెపో రేటు (వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ నిర్ణయం) కొనసాగింది. ద్రవ్యోల్బణం కట్టడిలోనే ఉంటుందన్న భరోసాను ఇస్తూ, వృద్ధే లక్ష్యంగా సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్బీఐ కొనసాగిస్తూ వచ్చింది. నాలుగేళ్ల తర్వాత (2018 ఆగస్టు అనంతరం) మొదటిసారి సారి ఆర్బీఐ మే 4వ తేదీన ఆకస్మికంగా రెపో రేటును 0.40 శాతం పెంచింది. జూన్ 8వ తేదీ, ఆగస్టు 5వ తేదీన 50 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నిర్ణయంతో రెపో మే తర్వాత 1.9 శాతం పెరిగినట్లయ్యింది. దీనితో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్ల పెంపును షురూ చేశాయి. పెంపు దిశగా తప్పని అడుగులు 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం గాడిన పడుతూ, అప్పట్లో వ్యవస్థలోకి విడుదలైన అదనపు లిక్విడిటీని వెనక్కు తీసుకోడానికి చర్యలు ప్రారంభించే తరుణంలోనే పలు దేశాల వాణిజ్య యుద్ధం ప్రతికూలతను తీసుకువచ్చింది. ఈ సమస్య పరిష్కారంలోపే ప్రపంచంపై కోవిడ్–19 విరుచుకుపడింది. కరోనాను ఎదుర్కొనే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అమెరికాసహా పలు దేశాలు మరింత సరళతర వడ్డీరేట్లకు మళ్లాయి. వ్యవస్థలో ఈజీ మనీ ప్రపంచ దేశాల ముందుకు తీవ్ర ద్రవ్యోల్బణం సవాలును తెచ్చింది. దీనికితోడు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసింది. దీనితో ధరల కట్టడే లక్ష్యంగా అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్‌సహా ప్రపంచ దేశాలు కీలక రేట్లను పెంచడం ప్రారంభించాయి. ఇక ఇదే సమయంలో భారత్‌లో ఒకవైపు ద్రవ్యోల్బణం సవాళ్లు, మరోవైపు అమెరికా వడ్డీరేట్ల పెంపుతో ఈక్విటీల్లోంచి వెనక్కు వెళుతున్న విదేశీ నిధులు వంటి ప్రతికూలతలు ఎదురవడం ప్రారంభమైంది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2–6 శాతం మధ్య కట్టడి చేయాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తుండగా, ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఆగస్టు వరకూ వరుసగా ఎనిమిది నెలలు (జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం, మార్చిలో 17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం, ఏప్రిల్‌లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతం, మేలో 7.04 శాతం, జూన్‌లో 7.01 శాతం, జూలైలో 6.71 శాతం, ఆగస్టులో 7 శాతం) ఈ రేటు అప్పర్ బ్యాండ్ దాటిపోవడం ప్రారంభమైంది. దీనితో భారత్ కూడా కఠిన ఆర్థిక విధానంవైపు అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రెపో రేటు 6.5 శాతం వరకూ వెళ్లే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కీలక నిర్ణయాల్లో కొన్ని... ► 2022–23లో ఆర్థిక వృద్ధి అంచనా 7 శాతంకాగా, సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ భావిస్తోంది. డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో ఈ రేటు 4.6 శాతం చొప్పున ఉంటుందని అంచనావేసింది. జూన్ త్రైమాసికంలో 13.5 శాతం వృద్ధి నమోదయిన సంగతి తెలిసిందే. ► రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతంకాగా, క్యూ2 , క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1 శాతం, 6.5 శాతం, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనా వేసింది. -
ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఆషామాషీ కాదు: మోదీ
అహ్మదాబాద్: మన దేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, ఇది ఆషామాషీ విజయం విజయం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ విజయమని, ఈ ఒరవడిని కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ విజయంతో మరింత కష్టపడి, మరిన్ని పెద్ద విజయాలను సాధించగలమనే ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని ఒల్పాడ్లో గురువారం జరిగిన మెడికల్ క్యాంప్‌లో వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు లబ్ధిదారులతో ముచ్చటించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందేందుకు అవకాశమున్న ప్రకృతి సేద్యం వైపు మరలాలని రైతులను కోరారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా దేశ వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.2 లక్షల కోట్లను జమ చేశామన్నారు. ఇంటర్నెట్, సాంతికేక పరిజ్ఞానం పుస్తకాల స్థానాన్ని భర్తీ చేయలేవని ప్రధాని మోదీ అన్నారు. పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకోవాలని కోరారు. నవభారత్ సాహిత్య మందిర్ అహ్మదాబాద్‌లో నిర్వహించిన పుస్తక ప్రదర్శన ప్రారంభం సందర్భంగా మోదీ సందేశం పంపించారు. -
అమెరికాలో ఆర్థిక మాంద్యం రాదు: బైడెన్
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో చిక్కుకుంటుందని భావించడం లేదని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. వరుసగా రెండో త్రైమాసికంలోనూ జీడీపీ మరింత పడిపోతుందనే అంచనాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగిత గణాంకాలు ఆశాజనకంగా ఉన్నందున..ప్రస్తుత వేగం పుంజుకున్న అభివృద్ధి, స్థిరత్వాన్ని సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోని పలువురు ఉన్నతాధికారులు కూడా మాంద్యం భయాలను కొట్టిపారేస్తున్నారు. పటిష్టమైన లేబర్ మార్కెట్ల వల్ల అలాంటి పరిస్థితి రాదని అంటున్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో జీడీపీలో 1.6%క్షీణత నమోదైంది. రెండో త్రైమాసికంలోనూ ఇదే పరిస్థితి పునరావృతం అయ్యే అవకాశముందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. అయితే, స్వల్ప వృద్ధి నమోదవుతుందనే విషయంలో ఆర్థికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
క్రిప్టోలను నిషేధించాలి
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను, ద్రవ్య.. ఆర్థిక విధానాల స్థిరత్వాన్ని క్రిప్టో కరెన్సీలు దెబ్బతీసే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో వాటిపై నిషేధం విధించాలన్న అభిప్రాయంతో ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాలు వెల్లడించారు. ‘దేశ ద్రవ్య, ఆర్థిక విధానాలను అస్థిరపర్చే అవకాశమున్నందున క్రిప్టోలపై చట్టాలను రూపొందించాలని ఆర్బీఐ సూచించింది. క్రిప్టోకరెన్సీలను నిషేధించాలన్నది ఆర్బీఐ అభిప్రాయం‘ అని లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో మంత్రి పేర్కొన్నారు. ఏ కరెన్సీనైనా కేంద్రీయ బ్యాంకులు లేదా ప్రభుత్వాలే జారీ చేయాల్సి ఉంటుందని.. క్రిప్టోలు ఆ కోవకు చెందవు కాబట్టి వాటిని కరెన్సీగా పరిగణింపజాలమని ఆర్బీఐ పేర్కొంది. అధికారిక కరెన్సీల విలువకు ఒక చట్టబద్ధత ఉంటుందని, కానీ క్రిప్టోలన్నీ కూడా స్పెక్యులేషన్‌పైనే పనిచేస్తాయి కాబట్టి దేశ ద్రవ్య, ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించింది. క్రిప్టోకరెన్సీలకు సరిహద్దులేమీ లేకపోవడంతో వీటిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాల్సిన అవసరం ఉంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అప్పుడు మాత్రమే క్రిప్టోలపై నిషేధం సమర్థంగా అమలు కాగలదని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పాతాళానికి రూపాయి, మరింత పతనం తప్పదా? -
ఎకానమీకి సేవల దన్ను..
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం సవాళ్లలోనూ సేవల రంగం ఎకానమీకి మేలో దన్నుగా నిలిచింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ మేలో 58.9గా నమోదయ్యింది. గడచిన 11 సంవత్సరాల్లో సేవల రంగంలో ఈ స్థాయి పటిష్టత నమోదుకావడం ఇదే తొలిసారి. ఏప్రిల్‌లో సూచీ 57.9 వద్ద ఉంది. కొత్త వ్యాపారాల్లో పురోగతి సూచీ పటిష్ట స్థాయికి దోహదపడింది. నిజానికి ఈ సూచీ 50పైన ఉంటే పురోగతిగా, ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. దీని ప్రకారం సేవల సూచీ వృద్ధి బాటన నిలవడం ఇది వరుసగా పదవనెల. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ సేవా రంగంలో వృద్ధిని పెంచడంలో సహాయపడింది. మే నెలలో వ్యాపార కార్యకలాపాలు 11 సంవత్సరాలలో అత్యంత వేగంతో పుంజుకున్నాయి, జూలై 2011 తరువాత కొత్త ఆర్డర్లలో వేగవంతమైన పెరుగుదల ఇదే తొలిసారి’’ అని ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పొలియానా డి లిమా పేర్కొన్నారు. భారత్ ఎకానమీలో సేవల రంగం వాటా దాదాపు 60%గా ఉంది. తయారీ–సేవలు కలిపినా అదుర్చ్... ఇక సేవలు, తయారీ కలగలిపిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ ఏప్రిల్‌లో 57.6గా ఉంటే, మేలో 58.3కు ఎగసింది. నవంబర్ తర్వాత ఈ స్థాయి పెరుగుదల ఇదే తొలిసారి. భారత్ తయారీ రంగం (పారిశ్రామిక ఉత్పత్తిలో 75%) మే నెల్లో స్థిరంగా ఉంది. -
Davos: ఆర్థిక విచ్ఛిన్నంతో విపరిణామాలు
దావోస్: ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంతో మరింత విపరిణామాలు చూడాల్సి వస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ఆర్థికవేత్తలు హెచ్చరించారు. డబ్ల్యూఈఎఫ్ వేదికగా వీరు నివేదికను విడుదల చేశారు. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాలు ఎక్కువగా ఉండడం, యూరోప్, లాటిన్ అమెరికాలో వాస్తవ వేతనాలు తగ్గిపోవడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. ఇటీవలి కాలంలో ప్రపంచం అతిపెద్ద ఆహార సంక్షోభాన్ని (భద్రతలేమి) ఎదుర్కొంటోందని, ముఖ్యంగా ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలో ఈ పరిస్థితులు నెలకొన్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక కార్యకలాపాల వేగం తగ్గడం, అధిక ద్రవ్యోల్బణం, తక్కువ వేతనాలు, అతిపెద్ద ఆహార అభద్రత అన్నవి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ విచ్చిన్నం కారణంగా తలెత్తే విపరిణామాలని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీకి సంబంధించి గత అంచనాలను తగ్గించేసింది. అమెరికా, చైనా, లాటిన్ అమెరికా, దక్షిణాసియా, పసిఫిక్, తూర్పు ఆసియా, మధ్యప్రాచర్యం, ఉత్తర ఆఫ్రికాలో మోస్తరు ఆర్థిక వృద్ధి ఉండొచ్చని పేర్కొంది. -
నిరుద్యోగిత తగ్గుతోంది
కోల్‌కతా: దేశంలో నిరుద్యోగితా రేటు తగ్గుతోందని, ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థాయికి వస్తోందని సీఎంఐఈ (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీస్ మంత్లీ టైమ్ సీరిస్) డేటా పేర్కొంది. ఫిబ్రవరిలో భారత నిరుద్యోగితా రేటు 8.10 శాతం ఉండగా, మార్చి నాటికి 7.6 శాతానికి దిగివచ్చిందని సంస్థ గణాంకాలు వెల్లడించాయి. ఏప్రిల్2 నాటికి ఈ రేటు 7.5 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. దేశంలో అర్బన్ నిరుద్యోగిత 8.5 శాతం వద్ద, గ్రామీణ నిరుద్యోగిత 7.1 శాతం వద్ద ఉందని తెలిపింది. దేశంలో హర్యానా, రాజస్థాన్, జమ్ము, కాశ్మీర్, బీహార్, త్రిపుర, బెంగాల్లో నిరుద్యోగిత అధికంగా, కర్నాటక, గుజరాత్లో అల్పంగా ఉందని తెలిపింది. గతేడాది మేలో దేశ నిరుద్యోగిత 11.84 శాతంగా నమోదైంది. భారత్ లాంటి పేద దేశానికి 8 శాతం నిరుద్యోగిత కూడా ఎక్కువేనని, దీన్ని ఇంకా తగ్గించాలని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. -
1982 తర్వాత అమెరికాలో మళ్లీ మొదలైన ‘సెగ’
వాషింగ్టన్: అమెరికా ద్రవ్యోల్బణం సెగ చూస్తోంది. కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ఫెడ్ పెద్ద చేత్తో మార్కెట్లోకి నిధులు కుమ్మరించింది. దీంతో గడిచిన ఏడాది కాలంలో ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతూ నాలుగు దశాబ్దాల్లోనే గరిష్ట స్థాయి అయిన 7.5 శాతాన్ని తాకింది. 2022 జనవరి నెలకు వినియోగ ధరల ద్రవ్యోల్బణం 7.5 శాతానికి చేరినట్టు అమెరికా కార్మిక శాఖ గురువారం ప్రకటించింది. ఇలా ద్రవ్యోల్బణం ఏడాది కాలంలో కట్టలు తెంచుకోవడం అమెరికా చరిత్రలో చివరిగా 1982లో చోటు చేసుకుంది. ఆహారం, ఇంధనం, అపార్ట్మెంట్ అద్దెలు, విద్యుత్ చార్జీలు పెరగడం ద్రవ్యోల్బణం సెగలకు కారణాలు. 2021 డిసెంబర్ చివరి నుంచి చూస్తే ఒక నెలలో ద్రవ్యోల్బణం 0.6% పెరిగింది. గత సెప్టెంబర్ నుంచి అక్టోబర్‌కు 0.9%, అక్టోబర్ నుంచి నవంబర్‌కు 0.7% చొప్పున ధరలు పెరిగాయి. ఫెడ్ పెద్ద ఎత్తున నిధులు జొప్పించడం, వడ్డీ రేట్లు అత్యంత కనిష్ట స్థాయిలో ఉండడం, బలమైన వినియోగ డిమాండ్ ద్రవ్యోల్బణం రెక్కలు విప్పుకోవడానికి తోడ్పడ్డాయి. -
వృద్ధికి ఒమిక్రాన్ ముప్పు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ, ఎకానమీ స్థిరంగా ముందుకు సాగుతున్నప్పటికీ వృద్ధి సాధనకు ఒమిక్రాన్ వేరియంట్పరంగా ముప్పు ఇంకా పొంచే ఉంది. దీనికి ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్లు కూడా తోడయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండో ఆర్థిక స్థిరత్వ నివేదిక ముందుమాటలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్–మే మధ్యలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ పెను విధ్వంసం సృష్టించిన తర్వాత వృద్ధి అంచనాలు క్రమంగా మెరుగుపడ్డాయని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ పెట్టుబడులు, ప్రైవేట్ వినియోగం గణనీయంగా పెరగడంపై నిలకడైన, పటిష్టమైన రికవరీ ఆధారపడి ఉంటుందని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు ఈ రెండూ ఇంకా మహమ్మారి పూర్వ స్థాయులకన్నా దిగువనే ఉన్నాయని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ అంశం ఆందోళనకరంగానే ఉందని అంగీకరించిన దాస్.. ఆహార, ఇంధన ధరల కట్టడి చేసే దిశగా సరఫరావ్యవస్థను పటిష్టం చేసేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీటుగా నిల్చిన ఆర్థిక సంస్థలు.. మహమ్మారి విజృంభించిన వేళలోనూ ఆర్థిక సంస్థలు గట్టిగానే నిలబడ్డాయని దాస్ తెలిపారు. ఇటు విధానపరంగా అటు నియంత్రణ సంస్థపరంగాను తగినంత తోడ్పాటు ఉండటంతో ఆర్థిక మార్కెట్లలో స్థిరత్వం నెలకొందని ఆయన పేర్కొన్నారు. బ్యాంకుల దగ్గర పుష్కలంగా మూలధనం, నిధులు ఉండటంతో భవిష్యత్‌లోనూ ఎలాంటి సవాళ్లు వచ్చినా తట్టుకుని నిలబడగలవని దాస్ చెప్పారు. స్థూల ఆర్థిక.. ఆర్థిక స్థిరత్వంతో పటిష్టమైన, నిలకడైన సమ్మిళిత వృద్ధిని సాధించేందుకు తోడ్పడేలా ఆర్థిక వ్యవస్థను బలంగా తీర్చిదిద్దేందుకు ఆర్బీఐ కట్టుబడి ఉందని ఆయన వివరించారు. రిటైల్ రుణాల విధానాలపై ఆందోళన.. రిటైల్ రుణాల క్వాలిటీ అంతకంతకూ క్షీణిస్తుండటంపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక స్థిరత్వ నివేదిక ప్రకారం .. ఏప్రిల్ నుంచి డిసెంబర్ తొలి వారం మధ్యలో రుణ వితరణ 7.1 శాతం (అంతక్రితం ఇదే వ్యవధిలో 5.4 శాతం) వృద్ధి చెందింది. ఇటీవలి కాలంలో హోల్‌సేల్ రుణాలు వెనక్కి తగ్గగా.. వృద్ధి వేగం ఇంకా మహమ్మారి పూర్వ స్థాయి కన్న తక్కువగానే ఉన్నప్పటికీ .. రిటైల్ రుణాలు మాత్రం రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతున్నాయని నివేదిక పేర్కొంది. గత రెండేళ్లలో నమోదైన రుణ వృద్ధిలో హౌసింగ్, ఇతర వ్యక్తిగత రుణాల వాటా 64 శాతం మేర ఉంది. రిటైల్ ఆధారిత రుణ వృద్ధి విధానం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోందని నివేదిక తెలిపింది. కన్జూమర్ ఫైనాన్స్ పోర్ట్‌ఫోలియోలో ఎగవేతలు పెరిగినట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో పెరిగిన రుణ వితరణలో రిటైల్ / వ్యక్తిగత రుణాల వాటా 64.4%గా (అంతక్రితం ఇదే వ్యవధిలో 64.1%) ఉంది. ఇందులో హౌసింగ్ రుణాల వాటా 31.2 శాతంగా (అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో 30%) నమోదైంది. ఎన్నారైలు స్థిరాస్తులు కొనేందుకు.. ముందస్తు అనుమతులు అక్కర్లేదు.. కొన్ని సందర్భాల్లో మినహా ఎన్నారైలు (ప్రవాస భారతీయులు), ఓసీఐలు (ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా) భారత్‌లో స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి లేదా బదిలీ చేయించుకోవడానికి ముందస్తుగా ఎటువంటి అనుమతులు అవసరం ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది. వ్యవసాయ భూమి, ఫార్మ్ హౌస్, ప్లాంటేషన్ ప్రాపర్టీలకు మాత్రం ఇది వర్తించదని తెలిపింది. ఓఐసీలు భారత్‌లో స్థిరాస్తులను కొనుగోలు చేసే నిబంధనలకు సంబంధించి వివిధ వర్గాల నుంచి సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో ఆర్బీఐ ఈ మేరకు వివరణనిచ్చింది. మొండిబాకీలు పెరుగుతాయ్.. ఆర్థిక వ్యవస్థపై ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న పక్షంలో బ్యాంకుల స్థూల మొండిబాకీలు (జీఎన్‌పీఏ) వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ఏకంగా 8.1–9.5 శాతానికి ఎగియవచ్చని ఆర్థిక స్థిరత్వ నివేదిక హెచ్చరించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇవి 6.9 శాతంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో జీఎన్‌పీఏలు 8.8 శాతంగా ఉండగా 2022 సెప్టెంబర్ నాటికి ఇవి 10.5 శాతానికి ఎగియవచ్చని అంచనా. అలాగే ప్రైవేట్ బ్యాంకుల్లో 4.6 శాతం నుంచి 5.2 శాతానికి, విదేశీ బ్యాంకుల్లో 3.2 శాతం నుంచి 3.9 శాతానికి పెరగవచ్చని నివేదిక అంచనా వేసింది. విభాగాలవారీగా చూస్తే వ్యక్తిగత, హౌసింగ్, వాహన రుణాల్లో జీఎన్‌పీఏ పెరిగింది. మరోవైపు, ఫుడ్ ప్రాసెసింగ్, రసాయనాలు వంటి కొన్ని ఉప–విభాగాలు మినహాయిస్తే పారిశ్రామిక రంగంలో జీఎన్‌పీఏల నిష్పత్తి తగ్గుతోంది. -
బ్యాంకుల్లో పాలన మెరుగుపడాలి
ముంబై: బ్యాంకుల్లో కార్పొరేట్గవర్నెన్స్ (పాలన) మరింత బలోపేతం కావాల్సిన అవసరాన్ని ఆర్బీఐ ప్రస్తావించింది. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకునే క్రమంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా తమ మూలధన నిధులను బలోపేతం చేసుకోవాలని, తగినన్ని నిల్వలు ఉండేలా చూసుకోవాలని సూచించింది. ‘భారత్‌లో బ్యాంకింగ్ ధోరణులు, పురోగతి 2020–21’ పేరుతో వార్షిక నివేదికను ఆర్బీఐ మంగళవారం విడుదల చేసింది. ‘‘కరోనా మహమ్మారి చూపించిన ప్రభావం వల్ల కార్పొరేట్, గృహాలు ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రభుత్వం, ఆర్బీఐ కలసికట్టుగా ఆర్థిక స్థిరత్వ సవాళ్లను కట్టడి చేయగలిగాయి. ఆర్థిక వ్యవస్థ కోలుకునే క్రమంలో వచ్చే సవాళ్లకు తగ్గట్టు బ్యాంకులు బ్యాలన్స్‌షీట్లను బలోపేతం చేసుకోవాలి’’అని అభిప్రాయపడింది. ఆర్థిక వృద్ధిపైనే.. ఇకమీదట బ్యాంకు బ్యాలన్స్ షీట్లు పుంజుకోవడం అన్నది ఆర్థిక వృద్ధిపైనే ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. 2021–22లో ఇప్పటి వరకు చూస్తే రుణ వృద్ధి పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ నాటికి ఆరు నెలల్లో డిపాజిట్లు 10 శాతం వృద్ధి చెందాయి. గతేడాది ఇదే కాలంలో ఇది 11 శాతం మేర ఉంది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల స్థూల ఎన్పీఏల నిష్పత్తి 2020 మార్చి నాటికి 8.2 శాతంగా ఉంటే, 2021 మార్చి నాటికి 7.3 శాతానికి తగ్గింది. 2021 సెప్టెంబర్ నాటికి 6.9 శాతానికి దిగొచ్చింది’’ అని వివరించింది. సవాళ్లను అధిగమించేందుకు వ్యూహాత్మక విధానం భవిష్యత్తు సవాళ్లను అధిగమించేందుకు భారత ఆర్థిక వ్యవస్థకు శ్రద్ధతో కూడిన వ్యూహాత్మక విధానం అనుసరణీయమని ఆర్బీఐ పేర్కొంది. వాతావణం మార్పులు, టెక్నాలజీ ఆవిష్కరణలు, కరోనా మహమ్మారి కారణంగా ఎదురవుతున్న సవాళ్లను నివేదికలో ప్రస్తావించింది. వాతావరణ మార్పుల తాలూకు సంస్థాగత ప్రభావం ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక స్థిరత్వంపై ఏ మేరకు ఉంటుందో మదింపు చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు రుణాలు (గ్రీన్ ఫైనాన్స్), ద్రవ్యోల్బణం, వృద్ధి తదితర స్థూల ఆర్థిక అంశాలపై వాతావరణ మార్పుల ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలుసుకునేందుకు అధ్యయనం చేస్తున్నట్టు వివరించింది. ఎన్బీఎఫ్సీలు నిలదొక్కుకోగలవు రానున్న రోజుల్లో బ్యాంకిగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) నిలదొక్కుకుని బలంగా ముందుకు సాగుతాయన్న విశ్వాసాన్ని ఆర్బీఐ వ్యక్తం చేసింది. టీకాలు విస్తృతంగా ఇవ్వడం, ఆర్థిక వ్యవస్థ పుంజకుంటూ ఉండడం అనుకూలిస్తుందని పేర్కొంది. కరోనా మహమ్మారి ఎన్‌బీఎఫ్‌సీల సామర్థ్యాన్ని పరీక్షించినప్పటికీ.. ఈ రంగం బలంగా నిలబడి, తగినంత వృద్ధితో కొనసాగుతున్నట్టు తెలిపింది. కోపరేటివ్ బ్యాంకులు విస్తరించాలి కరోనా మహమ్మారి కాలంలో పట్టణ, గ్రామీణ సహకార బ్యాంకింగ్ (కోపరేటివ్ బ్యాంకులు) రం గం బలంగా నిలబడినట్టు ఆర్బీఐ తెలిపింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకునే కొద్దీ ఇవి మరింత బలోపేతమై, విస్తరించాల్సి ఉందని పేర్కంది. వీటి నిధుల స్థాయి, లాభాలు మెరుగుపడినట్టు తెలిపింది. ప్రాథమిక నమూనాలోనే డిజిటల్ కరెన్సీ సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విషయంలో తొలినాళ్లలో ప్రాథమిక నమూనాతోనే వెళ్లడం సరైనదన్న అభిప్రాయంతో ఆర్బీఐ ఉంది. ‘సమగ్రంగా పరీక్షించాలి. అప్పుడే ద్రవ్య విధానం, బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రభావం పరిమితంగా ఉంటుంది’ అని పేర్కొంది. నగదుకు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన, బలమైన, సౌకర్యవంతమైన సాధనంగా ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది. పౌరులకు, ఆర్థిక సంస్థలకు ప్రతిష్టాత్మక సీబీడీసీని అందించడంపైనే భారత చెల్లింపుల పురోగతి ఆధారపడి ఉంటుందని పేర్కొంది. రూ.36,342 కోట్ల మోసాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి ఆరు నెలల్లో బ్యాంకింగ్ రంగంలో మోసాలకు సంబంధించి 4,071 కేసులు నమోదయ్యాయి. మోసపోయిన మొత్తం రూ.36,342 కోట్లుగా ఉందని ఆర్బీఐ తన నివేదికలో వెల్లడించింది. వీటిల్లో రుణ మోసాలే ఎక్కువగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో మోసపూరిత కేసులు 3,499తో పోలిస్తే పెరిగాయి. కానీ, గతేడాది మోసాల విలువ రూ.64,261 కోట్లతో పోలిస్తే సగం మేర తగ్గింది. వీటిని మరింత వివరంగా చూస్తే.. ‘‘2021–22 మొదటి ఆరు నెలల్లో రుణ మోసాలకు సంబంధించి 1,802 కేసులు నమోదు అయ్యాయి. వీటితో ముడిపడిన మొత్తం రూ.35,060 కోట్లు. కార్డు, ఇంటర్నెట్ రూపంలో మోసాలకు సంబంధించి నమోదైన కేసులు 1,532. వీటి విలువ రూ.60 కోట్లే’’ అని నివేదిక తెలియజేసింది. డిపాజిట్లకు సంబంధించి 208 మోసాలు నమోదైనట్టు, వీటి విలువ రూ.362 కోట్లుగా పేర్కొంది. -
ఆర్థిక వ్యవస్థకు సవాళ్లున్నాయ్...
ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి, ద్రవ్యోల్బణం, ద్రవ్య విధాన సాధారణీకరణ, వినియోగ డిమాండ్ రూపంలో ఆర్థిక వ్యవస్థకు ఎన్నో సవాళ్లున్నట్టు బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఇండియా తెలిపింది. జీడీపీ 8.2 శాతం మేర వృద్ధి చెందొచ్చని, ఇంతకంటే తగ్గే రిస్క్‌లు కూడా ఉన్నట్టు పేర్కొంది. సాగు రంగం స్థిరంగా 4 శాతం మేర వృద్ధి సాధించడం, సేవల రంగం బలంగా ఉండడం వృద్ధికి మద్దతునిచ్చే అంశాలుగా తెలిపింది. స్థూల అదనపు విలువ (జీవీఏ) 2021–22లో 8.5 శాతం అంచనా నుంచి 2022–23లో 7 శాతానికి, జీడీపీ వృద్ధి 2021–22లో అంచనా 9.3 శాతం నుంచి 2022–23లో 8.2 శాతానికి తగ్గొచ్చని బ్యాంకు ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ పేర్కొంది. త్రైమాసికం వారీగా వృద్ధిలో హెచ్చుతగ్గులు ఉంటాయని నివేదికలో వివరించింది. 2022–23 మొదటి క్వార్టర్లో రెండంకెల వృద్ధి నమోదవుతుందని, నాలుగో త్రైమాసికంలో వార్షికంగా చూస్తే తక్కువ స్థాయికి చేరుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం వ్యవస్థలో లిక్విడిటీ ఎక్కువగా ఉండగా.. దీన్ని సాధారణీకరించే దిశగా, ద్రవ్యోల్బణం నియంత్రణ దిశగా ఆర్బీఐ తీసుకునే చర్యలు, వినియోగ డిమాండ్‌పై పడే ప్రభావం జీడీపీ వృద్ధి అంచనాలను మరింత కిందకు తీసుకెళ్లే అంశాలుగా తెలిపింది. వినియోగంపై వడ్డీ రేట్ల ప్రభావం.. ‘‘బ్యాంకుల రుణ వితరణలో వృద్ధి 6 శాతంగా ఉంటే.. రిటైల్ రుణాలకు డిమాండ్ బలంగా 12 శాతం మేర ఉంది. మానిటరీ పాలసీ సాధారణీకరించినట్టయితే రుణ రేట్లు పెరగొచ్చు. ఇది వినియోగ డిమండ్‌ను దెబ్బతీస్తుంది’’ అని బ్యాంకు ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఇండియా పేర్కొంది. బలహీన రుతుపవనాల రూపంలోనూ మరో రిస్క్ ఉన్నట్టు తెలిపింది. 2022–23 సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.6 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. -
లక్ష కోట్ల డాలర్ల ఎకానమీ లక్ష్యం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను 1 లక్ష కోట్ల డాలర్ల (సుమారు రూ. 75 లక్షల కోట్లు) ఎకానమీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ప్రపంచంలోనే టాప్ 2 డిజిటల్ దేశాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలని నిర్దేశించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆజాదీ కా డిజిటల్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వచ్చే 25 ఏళ్ల ప్రణాళికలను మంత్రి వివరించారు. ప్రభుత్వ సర్వీసులను మరింతగా డిజిటలీకరించడం, సమ్మిళిత వృద్ధికి తోడ్పడేలా అస్పష్టతకు తావు లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చట్టాలను రూపొందించడం వంటి అంశాలపై కేంద్రం ప్రధానంగా దృష్టి పెడుతోందని ఆయన చెప్పారు. ఇంటర్నెట్, టెక్నాలజీలు సురక్షితంగా, విశ్వసనీయంగా. అందరికీ అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ‘‘కొంగొత్త టెక్నాలజీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చెయిన్, క్వాంటమ్ కంప్యూటింగ్, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, సైబర్ సైక్యూరిటీ లాంటి అనేక విభాగాల్లో మనం లీడర్లుగా ఎదగాలి’’ అని మంత్రి ఆకాంక్ష వ్యక్తం చేశారు. మరోవైపు, ప్రభుత్వ సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చే అంశంలో మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాష్ సాహ్ని చెప్పారు. ప్రస్తుతం సర్వీసులు వివిధ మాధ్యమాల ద్వారా లభిస్తున్నాయని, రాబోయే రోజుల్లో ఎక్కడైనా ఏ సర్వీస్ అయినా, ఏ మాధ్యమంలోనైనా లభించే పరిస్థితి రావాలని ఆయన పేర్కొన్నారు. అటు సైబర్ సెక్యూరిటీపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అదనపు కార్యదర్శి రాజేంద్ర కుమార్ చెప్పారు. ప్రస్తుతం ఈ విషయంలో భారత్.. ప్రపంచంలోనే 10వ స్థానం లో ఉందని ఆయన తెలిపారు. గడిచిన మూడేళ్లుగా సైబర్ సెక్యూరిటీ అంశంలో భారత్ గణనీయంగా పురోగతి సాధించిందని వివరించారు. -
ఆర్బీఐ పాలసీ సమావేశం ప్రారంభం
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) కీలక మూడు రోజుల పాలసీ సమావేశం బుధవారం ప్రారంభమైంది. గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఈ కమిటీ దేశ ఆర్థిక వ్యవస్థ, వడ్డీరేట్లపై ప్రధాన నిర్ణయాలను శుక్రవారం వెలువరించనుంది. అంతర్జాతీయంగా ఏడేళ్ల గరిష్టానికి పెరిగిన కమోడిటీ ధరలు, దేశీయంగా ధరల తీవ్రత కట్టడి ఆవశ్యకత, రూపాయి బలహీనత, ఈక్విటీ మార్కెట్ల అనిశ్చితి వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ధరల కట్టడికి చర్యలు తీసుకుంటూనే, వృద్ధి లక్ష్యంగా యథాతథ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం)ను కొనసాగించే అవకాశాలే అధికమని మెజారిటీ ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. ఇదే జరిగితే వరుసగా ఎనిమిది ద్వైమాసిక సమావేశంలోనూ ఆర్బీఐ యథాతథ రేటును కొనసాగించినట్లవుతుంది. 2020 మే 22 తర్వాత ఇప్పటి వరకూ రెపో విషయంలో ఆర్బీఐ యథాతథ పరిస్థితినే అను సరిస్తోంది. -
ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్టంగా ఉన్నాయని ఆర్థికమంత్రిత్వశాఖ నెలవారీ ఆర్థిక సమీక్షా నివేదిక పేర్కొంది. కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్ సవాళ్లు విసిరినప్పటికీ భారత్ ఎకానమీ 2021–22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధిని నమోదుచేసుకోవడాన్ని ప్రస్తావిస్తూ, భారత్ ఎకానమీ ‘వీ’ (V) నమూనా వృద్ధి తీరును ఇది ప్రతిబింబిస్తున్నట్లు పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► మూడవ వేవ్ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేరళ, మహారాష్ట్రల్లో కేసులు పెరుగుతుండడం ఆందోళనలను మరింత పెంచుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో మహమ్మారి నియంత్రణ, నిర్వహణ యంత్రాంగాలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. డెల్టా వేరియంట్ పెద్ద సవాళ్లని వస్తున్న వార్తలు తీవ్ర అప్రమత్తత పాటించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటిస్తున్నాయి. పండుగల వాతావరణం కావడంతో ప్రజలు మాస్‌్కలు ధరించడం, భౌతిక దూరం పాటించడంసహా కోవిడ్–19 మార్గదర్శకాలను తు.చ.తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. ► ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం చక్కటి పనితీరును పోషిస్తోంది. వర్షపాతంలో 9 శాతం లోటు ఉన్నప్పటికీ, ఖరీఫ్ సాగు సెపె్టంబర్ 3 నాటికి సాధారణ స్థాయిలో ఉంది. ► రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ, ట్రాక్టర్ కొనుగోళ్లు పెరగడం వంటి అంశాలు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ రానున్న నెలల్లో పటిష్టం అవుతుందన్న సంకేతాలను ఇస్తోంది. ► ఇక పారిశ్రామిక రంగం కూడా స్థిరంగా పురోగమిస్తోంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ విస్తృత ప్రాతిపదికన మెరుగుపడుతున్న సంకేతాలు ఉన్నాయి. ఉత్పత్తి విలువలు 2019 జూన్ స్థాయికి రికవరీ అవుతున్నాయి. జూలైలో ఎనిమిది కీలక మౌలిక రంగాల గ్రూప్ వృద్ధి రేటు 9.4 శాతం వృద్దిరేటును నమోదుచేసుకుంది. క్రూడ్ ఆయిల్, రిఫైనరీ ప్రొడక్టులు మినహా అన్ని రంగాలూ కోవిడ్–19 ముందస్తు స్థాయిని అధిగమించాయి. ► ద్యుత్ వినియోగం, రైల్వే రవాణా, రహదారుల టోల్ వసూళ్లు, ఈ–వే బిల్లులు, డిజిటల్ లావాదేవీలు, విమాన ప్రయాణీకులు సంఖ్య, జీఎస్టీ వసూళ్లు ఇలా ప్రతి విభాగంలోనూ సానుకూల రికవరీ సంకేతాలు ఉన్నాయి. సేవలు, తయారీ కలగలిపిన ఇండియా పీఎంఐ కాంపోజిట్ ఇండెక్స్ కూడా 55.4కు పెరగడం హర్షణీయ పరిణామం. -
ఎకానమీకి లోబేస్ భరోసా.. జీడీపీ జూమ్!
న్యూఢిల్లీ: అంచనాలకు అనుగుణంగానే భారత్ ఆర్థిక వ్యవస్థ 2021–22 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 20.1 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంది. ఇందుకు లోబేస్ ప్రధాన కారణమైంది. అయితే ఇదే కాలంలో దేశం మహమ్మారి సెకండ్‌వేవ్ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఎకానమీ తగిన సానుకూల ఆర్థిక ఫలితాన్ని సాధించడం కొంతలో కొంత ఊరట. లోబేస్ అంటే..? ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ బేస్ 2020 ఏప్రిల్–జూన్ కాలాన్ని తీసుకుంటే కరోనా కష్టాలతో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో అసలు వృద్ధిలేకపోగా (2019 ఇదే కాలంలో పోల్చి) 24.4 శాతం క్షీణతను ఎదుర్కొంది. అప్పటి లోబేస్తో పోల్చితే జీడీపీ విలువ తాజా సమీక్షా కాలంలో 20.1 శాతం పెరిగిందన్నమాట. విలువలు ఇలా... 2020–21 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.26,95,421 కోట్లు (2019–20 తొలి క్వార్టర్‌తో పోల్చితే 24.4 శాతం డౌన్). జాతీయ గణాంకాల కార్యాలయం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం తాజా సమీక్షా కాలంలో(2021–22 ఏప్రిల్–జూన్) ఈ విలువ రూ.32,38,020 కోట్లకు చేరింది. వెరసి వృద్ధి రేటు 20.1 శాతంగా నమోదయ్యింది. అయితే తాజా సమీక్షా నెల్లో విలువ కరోనా ముందు కాలంలో పోల్చితే ఇంకా వెనుకబడి ఉండడం గమనార్హం. 2019–20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎకానమీ పరిమాణం రూ.35,66,708 కోట్లు. అప్పటితో పోల్చితే, ఎకానమీ ఇంకా రూ. 3,28,688 కోట్లు వెనుకబడి ఉండడం గమనార్హం. శాతాల్లో చెప్పాలంటే కోవిడ్–19 ముందస్తు కాలంతో పోల్చితే ఇంకా 9.2 శాతం ఎకానమీ వెనుకబడి ఉందన్నమాట. రంగాల వారీగా... ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలనలోకి తీసుకునే గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) విలువ ప్రకారం తాజా సమీక్షా కాలంలో (ఏప్రిల్–జూన్) వివిధ రంగాల వృద్ధి తీరు ఇలా... ► తయారీ: ఈ రంగం ఉత్పత్తి 49.6% ఎగసింది. 2020–21 ఏప్రిల్–జూన్ మధ్య ఈ విభాగం 36 శాతం క్షీణించింది. ► వ్యవసాయ రంగం: వృద్ధి 3.5% నుంచి 4.5%కి చేరింది. ► నిర్మాణం: 49.5% క్షీణత నుంచి 68.3% వృద్ధికి మళ్లింది. ► మైనింగ్: 18.6 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. 2020–21 ఏప్రిల్–జూన్ మధ్య ఈ విభాగం 17.2 శాతం క్షీణించింది. ► విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ఇతర యుటిలిటీ సేవలు: ఈ విభాగంలో తాజా సమీక్షా కాలంలో 14.3 శాతం వృద్ధి నమోదుకాగా, 2020 ఇదే కాలంలో 9.9 శాతం క్షీణత నమోదయ్యింది. ► వాణిజ్యం, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్లు, సేవలు: 48.1 శాతం క్షీణత 34.3 శాతం వృద్ధిబాటకు వచ్చింది. ► ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవలు: 2020 ఏప్రిల్–జూన్ మధ్య 5 శాతం క్షీణిస్తే, తాజా సమీక్షా కాలంలో 3.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతర సేవల రంగాలు మైనస్ 10.2% నుంచి 5.8% వృద్ధి బాటలోకి వచ్చాయి. త్రైమాసికం పరంగా 16.9 శాతం పతనం త్రైమాసికం పరంగా చూస్తే, ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య ఎకానమీ విలువ 38.96 లక్షల కోట్లు. తాజా సమీక్షా కాలంలో ఈ విలువ రూ.32.38 లక్షల కోట్లు. అంటే త్రైమాసికపరంగా చూసినా ఎకానమీ 16.9% డౌన్లో ఉందన్నమాట. దీనికి ప్రధానంగా ఏప్రిల్–మే నెలల్లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కోవిడ్–19 సెకండ్‌వేవ్ కారణం. ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలనలోకి తీసుకునే గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) విలువలో చూస్తే క్యూ1లో వృద్ధి రేటు (2020 ఇదే కాలంలో పోల్చి) 18.8% పురోగమించింది. అయితే 2020 జనవరి–మార్చి కాలంతో చూస్తే, విలువ 13.3% క్షీణించడం గమనార్హం. 2021–22పై అంచనాలు ఇలా... కోవిడ్–19 మహమ్మారి సవాళ్ల నేపథ్యంలో గడచిన ఆర్థిక సంవత్సరం ఎకనామీ 7.3 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. అయితే లోబేస్‌కుతోడు ఎకానమీ ఊపందుకుని 2021–22లో వృద్ధి రేటు 17 శాతం వరకూ నమోదవుతుందన్న అంచనాల నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం సెకండ్‌వేవ్ సవాళ్లు ప్రారంభమయ్యాయి. దీనితో పలు ఆర్థిక, రేటింగ్, విశ్లేషణా సంస్థలు 2021–22పై తమ వృద్ధి అంచనాలను రెండంకెల లోపునకు కుదించేశాయి. 7.5 శాతం నుంచి 9.5 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందన్న అంచనాలను తాజాగా వెలువరిస్తున్నాయి. ఆర్బీఐ, ఐఎంఎఫ్, ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ 9.5 శాతం అంచనావేస్తుండగా, మూడీస్ అంచనా 9.3 శాతంగా ఉంది. అయితే ప్రపంచబ్యాంక్ వృద్ధి రేటు అంచనా 8.3 శాతంగా ఉంది. ఫిచ్ రేటింగ్స్ మాత్రం 10 శాతం వృద్దిని అంచనావేస్తోంది. కాగా, 2021లో 9.6 శాతం, 2022లో 7 శాతం వృద్ధి నమోదవుతుందని మూడీస్ తాజా నివేదికలో అంచనా వేసింది. కీలక రంగాలు విలువల్లో... ఒక్క వ్యవసాయ రంగం మినహా అన్ని రంగాల విలువలూ కోవిడ్–19 ముందస్తు స్థాయికన్నా తక్కువగానే ఉండడం గమనార్హం. 2019 ఏప్రిల్–జూన్ మధ్య తయారీ రంగం ఉత్పత్తి విలువ 5.67 లక్షల కోట్లయితే, ఈ విలువ 2021 ఏప్రిల్–జూన్ మధ్య రూ.5.43 లక్షల కోట్లుగా ఉంది. సేవల రంగం విలువ మాత్రం కోవిడ్ ముందస్తు స్థాయి (రూ.6.64 లక్షల కోట్లు)కి ఇంకా చాలా దూరంలో ఉంది. సమీక్షా కాలంలో ఈ విలువ రూ.4.63 లక్షల కోట్లుగా ఉంది. వ్యవసాయ రంగం విలువ రూ.4.49 లక్షల కోట్ల నుంచి రూ.4.86 లక్షల కోట్లకు ఎగసింది. దేశ ఎకానమీలో పారిశ్రామిక, వ్యవసాయ రంగాల వాటా 15 శాతం చొప్పున ఉండగా, సేవల రంగం విలువ దాదాపు 60 శాతం వరకూ ఉంది. వేగవంతమైన వృద్ధి హోదా తాజా గణాంకాల ప్రకారం, ప్రపంచంలో వేగవంతమైన వృద్ధిని నమోదుచేసుకున్న దేశాల్లో మొదటి స్థానం హోదాను భారత్ దక్కించుకుంది. 2021 ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో చైనా వృద్ధి రేటు 7.9 శాతం. భవిష్యత్ వృద్ధికి బాటలు మొదటి త్రైమాసికంలో సానుకూల ఆర్థిక ఫలితాలు వచ్చాయి. ఆర్థిక సంవత్సరం రానున్న నెలల్లో ఎకానమీ మరింత మెరుగుపడుతుందన్న సంకేతాలను ఈ గణాంకాలు అందిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి అంచనాలను ఎగువముఖంగా సవరించే అవకాశం ఉంది. – రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఆర్థిక మూలాలు పటిష్టం భారత్ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న వ్యవస్థాగత సంస్కరణలు, చేస్తున్న భారీ మూలధన వ్యయాలు వృద్ధికి బాటలు వేస్తున్నాయి. ఎకానమీలో ‘వీ’ (ఠి) నమూనా వృద్ధి ధోరణి నమోదవుతుందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుదల ధోరణి ఎకానమీకి కలిసివస్తుంది. – కేసీ సుబ్రమణ్యం, సీఈఏ పునరుత్తేజం: పారిశ్రామిక రంగం ఎకానమీ కోవిడ్–19 సవాళ్ల నుంచి కోలుకుని పునరుత్తేజం అవుతున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని భారత్ పారిశ్రామిక రంగం పేర్కొంది. సెకండ్‌వేవ్ సవాళ్లు ఉన్నప్పటికీ, మొదటి త్రైమాసికంలో ఎకానమీ తగిన మంచి ఫలితాన్ని ఇచ్చిందని ఇండస్ట్రీ చాంబర్–సీఐఐ పేర్కొంది. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కార్యక్రమాలు వృద్ధికి ఊతం ఇస్తున్నట్లు పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సంజయ్ అగర్వాల్ పేర్కొన్నారు. -
కోవిడ్ వల్లనే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు
నెల్లూరు (అర్బన్): కరోనా మహమ్మారి వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ఛిన్నాభిన్నమైందని, అందుకే ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు కాస్త ఆలస్యమయ్యాయని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక దర్గామిట్టలోని ఎన్జీవో భవన్లో ఆ సంఘం నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జీతాలు కాస్త ఆలస్యం కావడానికి గత ప్రభుత్వం తెచ్చిన సీఎఫ్ఎంఎస్ విధానం కూడా మరో కారణమన్నారు. ఇటీవల ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ సీఎఫ్ఎంఎస్ వల్ల నష్టం జరుగుతుందని, ఈ విధానం పనికిరాదన్నారని గుర్తు చేశారు. అందువల్ల సీఎఫ్ఎంఎస్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. అడగకుండానే ప్రభుత్వం 27 శాతం ఐఆర్ ఇచ్చిందన్నారు. త్వరలోనే ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించనుందన్నారు. ముఖ్యమంత్రి ఆగస్టు 15న మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేస్తామని తెలిపారన్నారు. ఆ హామీని త్వరగా అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నేపల్లి పెంచలరావు, నాయుడు వెంకటస్వామి పేర్కొన్నారు. -
జనధనానికి జవాబుదారీ లేదా?
కరోనా వల్ల మధ్యతరగతి మరింత నిరుపేదదైంది. నిరుద్యోగం పెరిగిపోయింది. కానీ, కోటీశ్వరుల సంపద మాత్రం 35 శాతం పెరిగింది. కార్పొరేట్ లాభాలు పెరిగినంత మాత్రాన ధనికుల నుంచి అధికంగా పన్ను వసూళ్ళు ఉంటాయని అనలేం. కోటీశ్వరులకు భారీగా పన్ను రాయితీలు లభిస్తుంటే, మిగతా వర్గాలు మరిన్ని పన్నులు చెల్లిస్తున్నాయి. ఇప్పుడు వీధిలోని సామాన్యుడు సైతం పెట్రోలు, డీజిల్‌పై పన్నుల రూపంలో రూ. 5.70 లక్షల కోట్లు అధికంగా చెల్లించాల్సి వచ్చింది. బ్యాంకులు వ్యవసాయ ఋణాలు మాఫీ చేస్తే గగ్గోలు పెడుతుంటాం. కానీ, కోటీశ్వరులకు లాభం కలిగేలా లక్షల కోట్ల మేర మొండి బకాయిలు మాఫీ చేస్తుంటే మాట్లాడం! ప్రజాధనాన్ని ఇలా చట్టబద్ధంగా కొట్టేస్తుంటే, అనుమతించాల్సిందేనా? కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. సామాన్యులు కష్టపడి పొదుపు చేసుకున్న సొమ్ములు కరిగిపోయాయి. మరోపక్క నిరు ద్యోగం పెరిగిపోయింది. కరోనా విస్ఫోటనం మొదలైన తొలి ఏడాదిలోనే అదనంగా 23 కోట్ల మంది నిశ్శబ్దంగా దారిద్య్ర రేఖ దిగు వకు జారిపోయారు. అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం (ఎ.పి.యు.) లోని సుస్థిర ఉపాధి కేంద్రం (సీఎస్ఈ) ఈ లెక్కలు చెప్పింది. ఇదే కరోనా తొలి ఏడాదిలోనే దేశంలో మధ్యతరగతి వర్గంలో 3.2 కోట్ల మంది తగ్గిపోయారని మరో అధ్యయనంలో ప్యూ రీసెర్చ్ సెంటర్ తేల్చింది. కనీవినీ ఎరుగని ఈ మహమ్మారి మన మధ్యతరగతిపైన, నిరుపేదలపైన ఎంత గట్టి దెబ్బకొట్టిందో ఈ రెండు అధ్యయనాలూ కలతపరిచేలా గుర్తుచేస్తున్నాయి. ఇక, ఈ ఏడాది విరుచుకు పడ్డ కరోనా రెండో వేవ్ ఎంత తీవ్రంగా దెబ్బ తీసిందో ఇంకా తెలియరాలేదు. ఎవరిని ఏ మేరకు దెబ్బ తీసిందన్నది పక్కన పెడితే, సమాజంలోని అన్ని వర్గాల ప్రజాలపైనా ప్రభావమైతే పడిందన్నది నిర్వివాదాంశం. గృహస్థులు దాచుకున్న డబ్బులు అనూహ్యంగా తరిగిపోయాయి. నిరుద్యోగం ఆకాశానికి అంటింది. దాంతో, ప్రభుత్వం చివరకు అవసరార్థులైన 80 కోట్ల మందికి నెలకు 5 కిలోల ఉచిత రేషన్ ఇచ్చే పథకాన్ని వచ్చే నవంబర్ దాకా పొడిగించాల్సి వచ్చింది. కానీ, గత ఆర్థిక సంవత్స రంలోనే లిస్టెడ్ కంపెనీల కార్పొరేట్ నికర లాభాలు మాత్రం 57.6 శాతం పైకి ఎగబాకాయి. ఒక వైపు కరోనా దెబ్బతో ఆర్థిక వ్యవస్థ అస్తుబిస్తు అవుతున్న సమయంలోనే, మిగులు ధనాన్ని అందిపుచ్చు కున్న స్టాక్ మార్కెట్లు కూడా పైకి దూసుకుపోయాయి. భారతదేశం లోని కోటీశ్వరుల సంపద ఏకంగా 35 శాతం పెరిగింది. అంబానీ సంపద 8,400 కోట్ల డాలర్లకూ, అదానీ ఐశ్వర్యం 7,800 కోట్ల డాలర్లకూ ఎగబాకాయని బ్లూమ్‌బర్గ్ తేల్చింది. ఒక్క మాటలో– కరోనా వల్ల ధనికుల వద్ద సంపద మరింత పోగుపడితే, పేదసాదలు మరింత నిరుపేదలయ్యారు. ఇంకా లోతు ల్లోకి వెళితే– కార్పొరేట్ లాభాలు పెరిగినంత మాత్రాన ధనికుల నుంచి అధికంగా పన్ను వసూళ్ళు ఉంటాయని అనలేం. వాస్తవంలో ధనవంతులకు భారీ పన్ను రాయితీలు, సులభంగా డబ్బు లభిస్తే, దేశంలోని మిగతా వర్గాలు మరిన్ని పన్నులు చెల్లించాల్సి వస్తోంది. కార్పొరేట్ పన్ను వసూళ్ళు గణనీయంగా పడిపోయాయి. గత పదేళ్ళలో ఎన్నడూ లేనంత కనిష్ఠానికి చేరాయి. ఇలా పన్ను వసూలు తగ్గిపోవడం ప్రపంచ వ్యాప్త ధోరణికి తగ్గట్లే ఉంది. 2019 సెప్టెం బర్లో దేశ ఆర్థికశాఖ మంత్రి కార్పొరేట్ పన్ను ప్రాతిపదికను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. అలాగే, నూతన ఉత్పత్తి సంస్థలకేమో 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ. 1.45 లక్షల కోట్ల మేర ఆదాయం పోతుంది. ఇదే సమయంలో కార్పొరేట్లతో నుంచి సగటు కుటుంబాలకు పన్ను ప్రాతిపదిక ఎలా మారిందో చూద్దాం. 2020 –21లో కార్పొరేట్ పన్నులు, వ్యక్తిగత ఆదాయపు పన్నులతో కూడిన ప్రత్యక్ష పన్ను వసూళ్ళు రూ. 9.45 లక్షల కోట్లు. కానీ, అదే సమయంలో పరోక్ష పన్ను వసూళ్ళు దాన్ని దాటేశాయి. ఏకంగా రూ. 11.37 లక్షల కోట్లకు గరిష్ఠానికి చేరాయి. ఇది కాక, వీధిలోని సామాన్యుడు పెట్రోలు, డీజిలుపై పన్నుల (ఎక్సైజ్, వ్యాట్) రూపంలో రూ. 5.70 లక్షల కోట్లు అధికంగా చెల్లించాల్సి వచ్చింది. అందులో దాదాపు 60 శాతం మేర ఇంధనపు పన్ను కేవలం ద్విచక్ర వాహనదారుల నుంచే వస్తోంది. ఇది కాక, రియల్ ఎస్టేట్ రిజిస్ట్రీ, మద్యంపై ఎక్సైజ్ సుంకంతో పాటు వినియోగదారులు చెల్లించే ఎలక్ట్రిసిటీ డ్యూటీని కలుపుకొని చూడండి. అవన్నీ చూస్తే, చివరకు సామాన్యుడు చెల్లిస్తున్న పరోక్ష పన్నుల వాటా చాలా ఎక్కువ. అంటే, కనీసం ఇప్పుడిక అభివృద్ధికి కేవలం తమ వల్లనే వనరులు సమకూరుతున్నాయని వ్యక్తిగత పన్ను చెల్లింపు దారులు అనలేరు. పన్ను చెల్లింపుదారులు కానివారిది కూడా ఆదాయ సృష్టిలో గణనీయంగా అధిక వాటాయే. చివరకు ప్లాస్టిక్ చెప్పులు వేసుకొనే సాధారణ కూలీ కూడా జి.ఎస్.టి. చెల్లిస్తున్నాడని మర్చి పోకండి. దీన్నిబట్టి ఒక విషయం స్పష్టమవుతోంది. దేశంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన పన్ను కడుతూనే ఉన్నారన్న మాట. గమనిస్తే – దేశం స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో కార్పొరేట్ లాభం వాటా గత పదేళ్ళలో ఎన్నడూ లేనంత గరిష్ఠమైన 2.63 శాతా నికి చేరింది. కానీ, అదే సమయంలో 2020–21లో ఏకంగా రూ. 1.53 లక్షల కోట్ల మేర కార్పొరేట్ మొండి బకాయిలను భారతీయ బ్యాంకులు మాఫీ చేశాయి. బ్యాంకులకున్న ఈ నిరర్థక ఆస్తులు (ఎన్.పి.ఎలు) ఇంకా పెరుగుతాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంచనా. ఇది ఇలా ఉండగా, 2017–18 నుంచి గత నాలుగేళ్ళలో బ్యాంకులు మాఫీ చేసిన మొత్తాలు భారీగా రూ. 6.96 లక్షల కోట్ల మేర ఉన్నాయి. నిజానికి, వ్యవసాయ ఋణాలను మాఫీ చేసినప్పు డల్లా గగ్గోలు పెట్టేస్తుంటారు కానీ, బ్యాంకులు క్రమం తప్పకుండా చేసే ఈ మొండి బకాయిల మాఫీ మాత్రం ఎవరి కంటికీ కనపడదు. ఇది చాలదన్నట్టు, అనేక ఆర్థిక మోసాలలో రూ. 5 లక్షల కోట్ల బ్యాంకు సొమ్ము ఇరుక్కుపోయింది. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన జవాబు ఆధారంగా ఇటీవలే ఓ వార్తాపత్రిక తన కథనంలో అదెలా జరిగిందో వెల్లడించింది. ఆ మొత్తంలో 76 శాతం వాటా అగ్రశ్రేణిలో నిలిచిన 50 ఋణ ఖాతాల లావాదేవీలదే! ఇలాంటి దీర్ఘకాలిక ఎగవేతదారులను శిక్షించడం కోసం దివాలా నియమావళి (ఐ.బి.సి)ని తీసుకొచ్చారు. కానీ, దాని వల్ల ఆశించినది జరగడం లేదు. ఇటీవల రెండు దివాలా వ్యవహారాల్లో బ్యాంకులు (లేదా ఋణదాతలు) తామిచ్చిన అప్పులో ఏకంగా 93 నుంచి 96 శాతం మేర మాఫీ చేయాల్సి వచ్చింది. దానిపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఒక కేసులో అప్పులలో కూరుకుపోయిన వీడియోకాన్ గ్రూపులోని 13 సంస్థలపై వేదాంత గ్రూపునకు చెందిన ట్విన్ స్టార్ టెక్నాలజీస్ దాదాపుగా ఏమీ చెల్లించకుండానే నియంత్రణ సాధించింది. ఆ కార్యాచరణకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్.సి.ఎల్.టి.) ఆమోదం తెలిపింది. 64 వేల కోట్లకు పైగా మొత్తానికి గాను ఏక మొత్తపు చెల్లింపు పరిష్కారం కింద కేవలం 2 వేల కోట్ల పైన మాత్రమే వేదాంత గ్రూపు చెల్లించింది. మొత్తం సొమ్ములో అది కేవలం 4.15 శాతం. మరోమాటలో చెప్పాలంటే, బ్యాంకులతో సహా ఋణదాతలు మిగతా 95.85 శాతం బకాయిని మాఫీ చేయడానికి ఒప్పుకున్నారన్న మాట. ఇదంతా చూసిన ౖఫైనాన్షియల్ జర్నలిస్టు – రచయిత్రి సుచేలా దలాల్ కడుపు మండి, ‘సామాన్యులు ఒక్కసారి సైకిల్ కోసం అప్పు తీసుకొన్నా, బ్యాంకులు ఎలా ప్రవర్తిస్తాయో తెలుసు’ అని వ్యాఖ్యా నించారు. ఇలా అనేక కేసుల్లో బిడ్డర్లు కారుచౌక ఒప్పందాలతో దర్జాగా ముందుకు సాగిపోతున్నారు. బ్యాంకులు, ఇతర ఋణదాత సంస్థలే తరచూ 80– 95 శాతం మేర బకాయిని మాఫీ చేసి, నష్టపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, చట్టబద్ధంగా వాళ్ళు ప్రజాధనాన్ని దోచే స్తున్నారన్న మాట! ఎందుకంటే, బ్యాంకుల్లో ఉండేది ప్రజాధనం. బ్యాంకులు ఇలా ఆర్థిక మోసాలలో ఋణమాఫీ చేశాయంటే ప్రజా ధనం నష్టపోయినట్టే్ట! బహుశా, దీనివల్లే వ్యాపారవేత్త హర్ష్ గోయెం కాకు చీకాకు వచ్చినట్టుంది. ప్రధానమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ, ‘జనం కష్టపడి సంపాదించిన డబ్బును ఇలా కొందరు చట్ట బద్ధంగా దొంగిలించడం అనుమతించకూడదు’ అంటూ ఆయన ఏకంగా ఓ ట్వీట్ చేశారు. అవును... జరుగుతున్న కథ చూసి, విషయం గ్రహిస్తే– ఎవరైనా ఆ మాటే అంటారు! వ్యాసకర్త ఆహార, వ్యవసాయరంగ నిపుణులు దేవిందర్ శర్మ ఈ–మెయిల్ : hunger55@gmail.com -
బడ్జెట్: తెలంగాణ రాష్ట్ర ప్రస్తావనేది..!
ఆశలు అడియాసలయ్యాయి. సాగునీటి ప్రాజెక్టుకు జాతీయహోదా లేదు. విభజన హామీల ఊసులేదు. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఉనికిలేదు. పన్నుల వాటా, జీఎస్టీ పరిహారం చెల్లింపులో ఊరట లేదు. పురపాలికలు, పరిశ్రమలకు ప్రోత్సాహకాల జాడలేదు. మెట్రోరైలుకు మళ్లీ మొండిచేయి. స్పష్టంగా చెప్పాలంటే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2021–22 వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన ఒక్క ప్రతిపాదన కూడా కనిపించలేదు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ గాడిలో పడేందుకు అండగా నిలబడుతుందనుకున్నవారికి తెలుగింటి కోడలు నిర్మలాసీతారామన్ మొండిచెయ్యే చూపింది. – సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర సాగునీటి రంగానికి ఈసారి కూడా కేంద్ర బడ్జెట్ నిధుల వరద పారించలేదు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా, మిషన్ కాకతీయకు ఆర్థిక సాయంపై రాష్ట్ర ప్రజల ఆశలను ఆవిరి చేసింది. కాళేశ్వరానికి జాతీ య హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్ రాసిన లేఖ లను కేంద్రం పట్టించుకోలేదు. ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చులో సింహభాగం అప్పు ల ద్వారానే సమకూర్చుకుంటున్నామని, ఆర్థికసాయం చేయాలని రాష్ట్రం చేసిన ప్రతిపాదనను కేంద్రం పట్టించుకోలేదు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లు అందిస్తున్నందున భగీరథ అప్పుల చెల్లింపులకు నిధులివ్వాలని, దాని నిర్వహణకు ఆర్థిక సహకారం అందించాలని సీఎం కోరినా స్పందన కరువైంది. చదవండి: (బడ్జెట్ 2021-22: ఓ లుక్కేయండి!) ఇక, నదుల అనుసంధాన ప్రక్రియకు కూడా నిధులు లేవు. అయితే, భగీరథ స్ఫూర్తితో కేంద్రం రూపొందించిన జల్‌జీవన్ మిషన్‌కు గత ఏడాది బడ్జెట్లో రూ.11,218 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది దాన్ని రూ.49,757 వేల కోట్లకు పెంచింది. పీఎంకేఎస్‌వై కింద కేటాయించిన రూ.11,588కోట్ల నుంచి కొమురంభీం, గొల్ల వాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ–2, దేవాదుల, జగన్నాథ్‌పూర్, భీమా, వరద కాల్వ ప్రాజెక్టులకు రావాల్సిన రూ.200 కోట్లలో ఏమైనా విదిలిస్తారేమోనని రాష్ట్రం ఎదురుచూడాల్సి వస్తోంది. పురపాలకం.. ఇదీ వాలకం పురపాలక శాఖ పరిధిలో అమలవుతున్న పలు ప్రాజెక్టులకుగాను రూ.1,950 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, ఒక్కరూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదు. సీవరేజీ మాస్టర్ ప్లాన్‌కు రూ.750 కోట్లు, నాలాల అభివృద్ధికి రూ.240 కోట్లు, వరంగల్ నియో మెట్రోకు రూ.210 కోట్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు రూ.750 కోట్లు కావాలని అడిగినా, ఏ ఒక్క ప్రాజెక్టుకూ రూపా యి కూడా లేదు. మెట్రోరైలు ప్రాజెక్టు, జాతీయ రహదారులకు నిధులివ్వకుండా తెలుగింటి కోడలు నిరాశే మిగిల్చింది. పునర్విభజన.. ఏదీ ఆలోచన? ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం రాష్ట్రాలకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. ఆర్థిక సంఘం సిఫారసు మేరకు కేంద్ర పన్నుల్లో వాటాను తగ్గించిన కేంద్రం అదే ఆర్థిక సంఘం రాష్ట్రానికి సిఫారసు చేసిన స్పెషల్ గ్రాంటును విస్మరించింది. రూ. 730 కోట్ల స్పెషల్ గ్రాంటుతోపాటు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 2019 నుంచి ఇవ్వాల్సిన రూ.900 కోట్లు, నీతి ఆయోగ్ మిషన్ భగీరథకు సిఫారసు చేసిన వేల కోట్ల రూపాయల గురించి నిర్మలమ్మ పద్దులో ఒక్క సుద్ది కూడా లేదు. కేంద్ర ప్రాయోజిత పథకాల అమల్లో స్వేచ్ఛ, పింఛన్ పెంపు కింద ఆసరాల గురించి రాష్ట్రం ఆశించినా వాటి గురించి ఏమీ చెప్పలేదు. పన్నుల్లో వాటా, జీఎస్టీ పరిహారం చెల్లింపులో తనకు అనుకూలంగా మార్పులు చేసుకుంటున్న కేంద్రం రాష్ట్రాలకు ఎలాంటి వెసులుబాటు ఇవ్వలేదు. ఐటీఐఆర్‌తో పాటు బయ్యారం స్టీల్‌ఫ్యాక్టరీ, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ ఏర్పాటు లాంటి విభజన హామీలు మళ్లీ అటకెక్కాయి. ఈ నేపథ్యంలో 2021–22గాను రాష్ట్రం రూపొందించే బడ్జెట్‌పై ప్రభావం ఉంటుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పరిశ్రమలు.. ఆశలు అడియాశలు పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల్లో కనీసం ఒక్కటి కూడా కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావనకు నోచుకోలేదు. హైదరాబాద్ ఫార్మాసిటీలో అంతర్గత మౌలిక సదుపాయాల కోసం కనీసం రూ.870 కోట్లు, వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్కులో మౌలిక వసతుల కోసం కనీసం రూ.300 కోట్లు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిసరాల్లో ఏర్పాటయ్యే నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్)లో మౌలిక వసతుల కల్పనకు తొలిదశలో రూ. 500 కోట్లు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటయ్యే నేషనల్ డిజైన్ సెంటర్‌కు రూ.200 కోట్ల ప్రాథమిక మూలధనం, ‘హైదరాబాద్– వరంగల్’ఇండస్ట్రియల్ కారిడార్‌కు రూ.3 వేల కోట్లు, ‘హైదరాబాద్– నాగపూర్’కారిడా ర్కు రూ.2 వేల కోట్లు.. ఇలా మొత్తంగా 2021–22 కేంద్ర బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి రాసిన ఏ లేఖను కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక, రాష్ట్ర విభజనహామీల్లో కీలకమైన ఐటీఐఆర్ ప్రాజెక్టు కింద నిధులు మంజూరు చేయాలని తాజాగా కేటీఆర్ చేసిన ప్రతిపాదనను కూడా కేంద్రప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. దీంతో ఇక, ఈ ప్రాజెక్టు కోల్డ్‌స్టోరేజీలోకి నెట్టేసినట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఎంఎస్ఎంఈ పరిశ్రమలను పునర్విచించడం, ఒకటి, రెండు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు రాష్ట్రంలోని పారిశ్రామిక రంగంపై కొంత మేర సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. రూ. 2.50 కోట్ల పెట్టుబడి ఉండే వాటిని ఎంఎస్ఎంఈలుగా గుర్తించాలన్న నిర్ణయంతో రాష్ట్రంలోని మరికొన్ని పరిశ్రమలకు ఈ జాబితా లో స్థానం లభించనుంది. పూర్తి నిరాశాజనకం కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో రైతులకు, బడుగు, బలహీన వర్గాలకు ఎలాంటి ఉపయోగం లేదని, పూర్తి నిరాశాజనకంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎంపీ లు, బీజేపీ నేతల అసమర్థత వల్లే రాష్ట్రం అన్యాయానికి గురైందని సోమవారం ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఎప్పటి మాదిరిగానే రైల్వే కేటాయింపుల్లో రాష్ట్రానికి మొండిచేయి చూపిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్‌కు మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ప్రత్యేక డివిజన్ డిమాండ్‌పై కేంద్రం ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని కేంద్ర సంస్థలకే నిధులు సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో తెలంగాణకు మళ్లీ నిరాశే ఎదురైంది. కేవలం తెలంగాణలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు మాత్రమే ఈ బడ్జెట్ పద్దుల్లో ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్రంలోని గిరిజన వర్సిటీకి రూ. 26.90 కోట్లు, ఐఐటీ హైదరాబాద్‌లో ఈఏపీ ప్రాజెక్టులకు రూ. 150 కోట్లు కేటాయించింది. జపాన్ ఆర్థికసాయంతో ఐఐటీ క్యాంపస్ అభివృద్ధికి రూ. 460.31 కోట్లు కేటాయించింది. హైదరాబాద్ అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్, రీసెర్చ్ సంస్థకు సర్వే, అణు ఖనిజాల అన్వేషణ నిమిత్తం రూ. 329.19 కోట్లు, హైదరాబాద్, మొహాలి, అహ్మాదాబాద్, గువాహటి, హజిపూర్, కోల్‌కతా, రాయ్‌బరేలి, మధురైల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ (నైపర్)కు రూ. 215.34 కోట్లు, హైదరాబాద్, కోల్‌కతా, గువాహటి, చెన్నైల్లోని డైరెక్టరేట్ ఆఫ్ హిందీ సంస్థలకు రూ.30 కోట్లు, హైదరాబాద్‌సహా దేశవ్యాప్తంగా ఉన్న 12 సీ–డాక్ కేంద్రాలకు రూ. 200 కోట్లు కేటాయించింది. సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్, ఐటీ (సి–మెట్)లో హైదరాబాద్‌సహా మూడు కేంద్రాలకు రూ. 80 కోట్లను ఆర్థిక మంత్రి కేటాయిం చారు. హైరరాబాద్ లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డుకు రూ.23.84 కోట్లు, హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కు రూ.124 కోట్లు, హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్‌ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఎన్సీఓఐఎస్)కు రూ. 24.50 కోట్లు, సింగరేణిలో పెట్టుబడులకు రూ. 2500 కోట్లు, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్ లిమిటెడ్ మూసివేత ఖర్చులకు రూ. 233.14 కోట్లు, మిథానిలో పెట్టుబడులకు రూ.1184.68 కోట్లు కేటా యించారు. తెలంగాణకు అన్యాయం జరిగింది: ఉత్తమ్ సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు అన్యా యం చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి బీజేపీ వల్ల నష్టం జరుగుతోందని చెప్పేందుకు పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ నిదర్శనమన్నారు. ఢిల్లీలోని విజయ్‌చౌక్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదన్నారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనల్లో ఒక్క అంశాన్ని కూడా ప్రస్తావించలేదని విమర్శించారు. ఆర్థిక మాం ద్యంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో పెట్రోల్, డీజిల్‌పై సెస్ పెంచడం దారుణమన్నారు. గత ఆరేళ్లలో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నా వారికి మేలు చేసే చర్యలు బడ్జెట్లో ఏమాత్రం లేవన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యిందని కేంద్ర ఆర్థిక మంత్రి చేసి న ప్రకటన పచ్చి అబద్ధమని మండిపడ్డారు. నయా క్యాపిటలిస్టులకు దోచిపెట్టే బడ్జెట్ : భట్టి సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేసిందని, కొద్దిమంది నయా క్యాపిటలిస్టులకు ప్రజల సొమ్మును దోచిపెట్టే విధంగా బడ్జెట్‌ను తయారుచేశారని కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత భట్టివిక్రమార్క విమర్శించారు. కార్పొరేట్ శక్తుల కోసమే కేంద్రం పనిచేస్తోందని ఈ బడ్జెట్ నిరూపిస్తోందని, సామాన్యులు, పేద, మధ్యతరగతి ప్రజల గురించి ఆలోచించకుండా బడ్జెట్ పెట్టారని ధ్వజమెత్తారు. సోమవారం అసెంబ్లీ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ జాతి సంపదను కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం చేసేలా బడ్జెట్ ఉందన్నారు. బయ్యారం ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్‌కోచ్ ఫ్యాక్టరీ, నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా, గిరిజన వర్సిటీ లాంటి విభజన హామీల గురించి కనీసం ప్రస్తావించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణకు ఇంత అన్యాయం చేస్తుంటే టీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు నిద్రపోతున్నారా.. గాడిదలు కాస్తున్నారా అని ప్రశ్నించారు. ఇది చరిత్రాత్మక బడ్జెట్: బండి సంజయ్ సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను రాష్ట్ర బీజేపీ స్వాగతించింది. ప్రజాసంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి ఆకాంక్షించేలా ఈ బడ్జెట్ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని, పేద, మధ్యతరగతి జీవన ప్రమాణాలను పెంపొందించేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. అదనంగా మరో కోటి మంది మహిళలకు ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల సాయంతో పాటు మరిన్ని జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్ ద్వారా మహిళల జీవితాల్లో వెలుగులు నింపేలా బడ్జెట్ ఉంద న్నారు. ఈ బడ్జెట్ ద్వారా 2021–22లో భారత ఆర్థిక ప్రగతి పరుగు పెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. రాష్ట్రానికి మొండి చేయి చాడ వెంకట్‌రెడ్డి తెలంగాణకు బడ్జెట్లో మొండిచేయి చూపారు. దీర్ఘకాలికంగా ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఎంఎంటీఎస్ మెట్రో రైలు విస్తరణ ఊసే లేదు. కేంద్రం బరితెగించి కార్పొరేట్లకు అనుకూలంగా ప్రైవేటీకరణకు తలుపులు బార్లా తెరిచింది. ఈ ఏడాది 1.75 లక్షల కోట్ల మేర ఆస్తులను అమ్మకాల ద్వారా సమకూర్చుకోవా లని అనుకోవడం దారుణం. పెట్రోల్, డీజిల్‌పై సెస్ మోపడం దుర్మార్గం. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను 49 నుంచి 75 శాతానికి పెంచడం, మరిన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకోవాలని నిర్ణయించడం దేశ భక్తులపనా? రాష్ట్రానికి నిధులు రాబట్టాలి: తమ్మినేని పేదలను మరింత పేదరికంలోకి, కార్పొరేట్లను మరింత లాభాల్లోకి నెట్టేలా ఈ బడ్జెట్ ఉంది. వ్యవసాయ చట్టాల రద్దుకు దేశ వ్యాప్తంగా ఉద్య మం జరుగుతుంటే టీఆర్ఎస్ కేంద్రానికి వత్తాసు పలికినా.. బడ్జెట్లో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి నిధులు వచ్చేలా చూడాలి. నిత్యావసర సరుకులపై ప్రభావం చూపే పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతుంటే మళ్లీ సెస్ విధించి పేదల బతుకులతో చెలగాటమాడుతోంది. -
1946 తరువాత ఎన్నడూ లేనంత పతనం
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థ గత 74 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత పతనాన్ని 2020లో నమోదుచేసుకుంది. క్షీణత 3.5 శాతంగా నమోదయ్యింది. అయితే నాల్గవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) 4 శాతం వృద్ధి నమోదుకావడం కొంత ఊరటనిచ్చే అంశం. వార్షికంగా చూస్తే, 1946 తరువాత ఇంత తీవ్ర పతనాన్ని చూడ్డం ఇదే తొలిసారని వాణిజ్య మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. కోవిడ్–19 నేపథ్యంలో రెస్టారెంట్లు, ఎయిర్‌లైన్స్ వంటి పలు సేవా రంగాలు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాయని, దాదాపు కోటి మంది అమెరికన్లు ఉపాధి కోల్పోయారని... ఈ ఫలితం గురువారం విడుదలైన వార్షిక గణాంకాల్లో కనిపించందనీ ఉన్నత స్థాయి వర్గాలు వ్యాఖ్యానించాయి. జూన్, సెప్టెంబర్ త్రైమాసికాల్లో అమెరికా జీడీపీ 33 శాతంపైగా పతనమైన సంగతి తెలిసిందే. జనవరి–మార్చి త్రైమాసికంలో క్షీణరేటు 5 శాతంగా ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు సమయం 1946లో 11.6 క్షీణత తర్వాత ప్రపంచ ఆర్థిక సంక్షోభం 2009 కాలంలో ఎకానమీ 2.5 శాతం పతనమైంది. 1932 తీవ్ర మాంద్యం సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ 12.9 శాతం పతనమైంది. అమెరికా జీడీపీ వృద్ధి గణాంకాలను మూడుసార్లు సవరించడం జరుగుతుంది. దీని ప్రకారం తాజా– డిసెంబర్ త్రైమాసిక గణాంకాలను మరో రెండు సార్లు సవరిస్తారు. 2021 సంవత్సరానికి సంబంధించి ఎకానమీ అవుట్‌లుక్ అనిశ్చితిగానే కొనసాగుతుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. వ్యాక్సినేషన్ దేశ వ్యాప్తంగా లభ్యం అయ్యేంత వరకూ క్లిష్ట పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తున్నారు. -
బడ్జెట్.. డిమాండ్‌ను పెంచాలి
న్యూఢిల్లీ: డిమాండ్‌ను పెంచడంపై రానున్న బడ్జెట్లో ప్రధానంగా దృష్టి సారించాలని దేశీయ పరిశ్రమల అభిప్రాయంగా ఉంది. అంతేకాదు మౌలిక సదుపాయాలు, సామాజిక రంగంపైనా వ్యయాలను ప్రోత్సహించాలని ఆశిస్తోంది. ఫిక్కీ, ధ్రువ అడ్వైజర్స్ సంయుక్తంగా ఒక సర్వే నిర్వహించి.. పారిశ్రామికవేత్తల అభిప్రాయాలతో కూడిన నివేదికను బుధవారం విడుదల చేసింది. దేశంలో తయారీ వ్యవస్థ బలోపేతంపై ప్రభుత్వం విధానపరమైన దృష్టి సారించాలని కోరింది. పరిశోధన, అభివృద్ధికి మద్దతుగా నిలవాలని.. భవిష్యత్తు టెక్నాలజీలకు ప్రోత్సాహకాలు అందించాలని కోరుతున్నట్టు సర్వే నివేదిక తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల కార్యక్రమం దేశీయంగా కొనసాగుతున్న తరుణంలో ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవాన్ని అందించే చర్యలను వేగవంతం చేయాలని కోరింది. వృద్ధి క్రమం సానుకూలంగా మారినందున.. ప్రభుత్వం నుంచి నిరంతర మద్దతు అవసరమని.. కొన్ని రంగాల్లో డిమాండ్ మెరుగుపడగా, ఇది స్థిరంగా కొనసాగుతుందా అన్నది చూడాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. డిమాండ్‌ను పెంచేందుకు పన్నుల విధానాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది. పన్నుల ఉపశమనం అవసరం.. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు బడ్జెట్‌ను సమర్పించనున్న విషయం తెలిసిందే. ఈ విడత బడ్జెట్లో వ్యక్తిగత పన్ను ఉపశమనానికి తప్పకుండా చోటు ఉండాలని సర్వేలో 40 శాతం మంది పారిశ్రామిక వేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రత్యక్ష పన్నుల విధానంలో పన్ను శ్లాబులను మరింత విస్తృతం చేయాలని 47 శాతం మంది కోరారు. ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం పన్ను రాయితీలు, ఉపసంహరణలు కల్పించాలని 75 శాతం మంది కోరడం గమనార్హం. ముఖ్యంగా ఆవిష్కరణలు, ఎగుమతులకు పన్ను రాయితీలు ఇవ్వాలని ఎక్కువ మంది కోరినట్టు ఈ సర్వే నివేదిక తెలియజేసింది. -
కొత్త ఏడాది ఆశావహమే
ముంబై: కరోనా కల్లోలం నుంచి ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా కోలుకుంటోంది. ఉద్యోగాల భర్తీ పట్ల కంపెనీలు ఆశావహంగా ఉన్నాయని, ఉద్యోగార్థులు నిరాశపడవలసిన పనిలేదని నౌకరీడాట్‌కామ్ తాజా సర్వే పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న 1,327 కంపెనీలు, కన్సల్టెంట్లపై నిర్వహించిన ఈ సర్వే ఇంకా ఏం చెప్పిందంటే... ► రానున్న 3–6 నెలల వ్యవధిలోనే ఉద్యోగాల భర్తీ కరోనా ముందటి స్థాయికి చేరగలదని సర్వేలో పాల్గొన్న 26% కంపెనీలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. అయితే ఉద్యోగాల భర్తీ కరోనా ముందు స్థాయికి చేరడానికి 6 నెలల నుంచి ఏడాది కాలం పడుతుందని 34% కంపెనీలు భావిస్తున్నాయి. ► కరోనా కల్లోలం మెడికల్, హెల్త్‌కేర్, ఐటీ, బీపీఓ/ఐటీఈఎస్ రంగాలపై పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే రిటైల్, ఆతిథ్య, పర్యాటక రంగాలపై పెను ప్రభావమే చూపింది. అయితే ఈ రంగాలతో పాటు వాహన రంగంలో కూడా ఉద్యోగాల భర్తీ క్రమేపీ మెరుగుపడుతోంది. ► 2020 ఆరంభంలో హైరింగ్ మార్కెట్ సానుకూలంగానే ఉంది. ఉద్యోగాల కల్పన పెరిగింది. మార్చి నుంచి కరోనా కల్లోలం ఉద్యోగ మార్కెట్‌పై ప్రభావం చూపించడం మొదలైంది. ఏప్రిల్, మే నెలల్లో హైరింగ్ 60 శాతం తగ్గింది. నౌకరీడాట్‌కామ్ ప్లాట్ఫార్మ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఇదే అత్యంత కనిష్ట స్థాయి. ► నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ గత నెలలో 28 శాతం తగ్గింది. అయితే అంతకు ముందటి నెలలతో పోల్చితే ఉద్యోగాల భర్తీ క్రమక్రమంగా పెరుగుతోంది. -
ఎకానమీ రికవరీ ఊహించిన దానికన్నా బాగుంది
న్యూఢిల్లీ: ఆర్థికాభివృద్ధికి రానున్న బడ్జెట్ (2021–22)లో తీసుకోవాల్సిన చర్యలపై ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) చర్చించింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన మంగళవారం ఎఫ్ఎస్డీసీ 23వ సమావేశం వర్చువల్‌గా జరిగింది. ‘‘ఆర్థిక వ్యవస్థ క్రియాశీలత పుంజుకుంటోంది. గతంలో ఊహించినదానికన్నా వేగంగా రికవరీ అవుతోంది’’ అని సమావేశం అనంతరం వెలువడిన ఒక ప్రకటన తెలిపింది. ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ సమావేశంలో మాట్లాడుతూ, ఆర్థిక ఒడిదుడుకులు తత్సంబంధ అంశాలపై నియంత్రణా సంస్థల మరింత జాగరూకత, నిరంతర నిఘా అవసరమని అన్నారు. ప్రభుత్వం, ఫైనాన్షియల్ సెక్టార్ నియంత్రణా సంస్థలు తీసుకున్న చర్యల వల్ల సెప్టెంబర్ త్రైమాసికంలో క్షీణ రేటు గణనీయంగా 7.5 శాతానికి తగ్గిందని (మొదటి త్రైమాసికంలో 23.9 శాతం) సమావేశం అభిప్రాయపడింది. ఎఫ్ఎస్డీసీ సభ్యులయిన ఆర్బీఐ, ఇతర రెగ్యులేటర్లు సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనలను సమావేశం చర్చించింది. ఆర్బీఐ గవర్నర్‌తో పాటు, సెబీ, ఐఆర్డీఏఐ, ఐబీబీఐ, పీఎఫ్ఆర్డీఏ, ఐఎఫ్ఎస్సీఏ చైర్మన్లు సమావేశంలో పాల్గొన్నారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్, రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే, ఫైనాన్షియల్ సెక్రటరీ దేబాశిష్ పాండా తదితర ఆర్థికశాఖ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు. గత ఏడాది నరేంద్రమోదీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎఫ్ఎస్డీసీ నాల్గవ సమావేశం ఇది. దేశం కరోనా కోరల్లో చిక్కుకున్న తర్వాత జరిగిన రెండవ సమావేశం. ఇంతక్రితం మేలో ఎఫ్ఎస్డీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం కేంద్రం రూ.21 లక్షల కోట్ల స్వావలంభన భారత్ ప్యాకేజ్ ప్రకటించింది. కొత్త బడ్జెట్లో మౌలిక రంగానికి పెద్దపీట ఆర్థిక మంత్రి సీతారామన్ సూచన అసోచామ్ ఫౌండేషన్ వీక్‌లో ప్రసంగం మౌలిక రంగానికి 2021–22 వార్షిక బడ్జెట్లో పెద్దపీట వేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఆర్థిక పునరుద్ధరణ చర్యలు కొనసాగేందుకు బడ్జెట్లో తగిన చర్యలు ఉంటాయని వివరించారు. కోవిడ్–19 మహమ్మారి ప్రభావంతో నెమ్మదించిన పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ రానున్న నెలల్లో తిరిగి వేగవంతమవుతుందని ఆమె అన్నారు. పార్లమెంటులో ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టే అవకాశమున్న బడ్జెట్‌ను సీతారామన్ ప్రస్తావిస్తూ, ‘‘మౌలిక రంగంలో ప్రభుత్వ వ్యయాలు మరింతగా కొనసాగుతాయి. బహుళ ప్రయోజనాలకు ఈ చర్య దోహదపడుతుంది. ఆర్థిక పునరుద్ధరణకు సహాయపడుతుంది’’ అని అసోచామ్ (భారత వాణిజ్య, పరిశ్రమల మండళ్ల సమాఖ్య) ఫౌండేషన్ వీక్ ప్రారంభ కార్యక్రమం సందర్భంగా చేసిన ప్రసంగంలో ఆమె పేర్కొన్నారు. ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... 1.ప్రభుత్వ వాటాల అమ్మకం కార్యక్రమం మరింత ఊపందుకోనుంది. ఇప్పటికే క్యాబినెట్ ఆమోదం పొందిన కంపెనీల నుంచి పెట్టుబడుల ఉపసంహరణలను మరింత వేగవంతం చేయడం జరుగుతుంది. 2.ప్రభుత్వ బ్యాంకులు, కంపెనీల నుంచి పెట్టుబడుల ఉపంసహరణ వల్ల ఆయా కంపెనీలు మార్కెట్ నుంచి నిధులను సమీకరించుకోగలుగుతాయి. బాండ్, మార్ట్‌గేజ్‌కి సంబంధించి డెట్ మార్కెట్‌ను మరింత విస్తృతం చేయడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. 3.ప్రభుత్వ మార్కెట్ రుణ సమీకరణ లక్ష్యం రూ.12 లక్షలకోట్లలో ఇప్పటికే రూ.9.06 లక్షల కోట్లు సాకారమైంది. దీనివల్ల ప్రాజెక్టుల్లో ప్రభుత్వ వ్యయాలు అనుకున్న విధంగా జరుగుతాయి. -
ఆర్థిక వృద్ధికి చర్యలు కొనసాగుతాయి
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ విషయంలో జాగ్రత్తతో కూడిన ఆశావాదంతోనే ప్రభుత్వం ఉందని, ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు మద్దతు చర్యలు కొనసాగుతాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్‌బజాజ్ తెలిపారు. ఫిక్కీ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించిన ఆయన మాట్లాడారు. రెండో త్రైమాసికం జీడీపీ గణాంకాలు (జూలై–సెప్టెంబర్) మార్కెట్ అంచనాల కంటే మెరుగ్గా ఉన్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వీతీయ భాగంలో (2020 అక్టోబర్ నుంచి 2021 మార్చి వరకు) మరింత పురోగతి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా.. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ మైనస్ 23.9 శాతం స్థాయిలో ఉంటుందని మార్కెట్లు అంచనా వేయగా.. కేవలం మైనస్ 7.5 శాతంగానే నమోదు కావడం గమనార్హం. ‘‘మేము సానుకూల ధోరణితో ఉన్నాము. అదే సమయంలో ఆర్థిక ప్రగతి విషయంలో అప్రమత్తతతో కూడినా ఆశావాదంతోనే ఉన్నాము. మూడు, నాలుగో త్రైమాసికాల్లో మరింత మెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నాము. మేమే కాదు అంతర్జాతీయ సంస్థలు, రేటింగ్ ఏజెన్సీలు సైతం దేశ ఆర్థిక వృద్ధి విషయంలో వాటి అంచనాలను మెరుగుపరిచాయి’’ అని తరుణ్ బజాజ్ వివరించారు. పండుగలు ముగిసిన తర్వాత కూడా డిమాండ్ కొనసాగుతుండడం రెండు, మూడో త్రైమాసికాల్లో వృద్ధికి మద్దతునిస్తుందన్నారు. ఇక్కడి నుంచి ఆర్థిక వ్యవస్థ ప్రగతి కోసం అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వరంగ సంస్థల నూతన విధానం త్వరలోనే నూతన ప్రభుత్వరంగ సంస్థల విధానంతో ప్రభుత్వం ముందుకు వస్తుందని తరుణ్ బజాజ్ తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ కింద వ్యూహాత్మక రంగాల్లో గరిష్టంగా నాలుగు ప్రభుత్వరంగ సంస్థలే ఉంటాయని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుమించి ఉంటే వాటిని ప్రైవేటీకరించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. ఈ విధానం ఎంతో ప్రతిష్టాత్మకమైనదన్న తరుణ్ బజాజ్.. త్వరలోనే అమల్లోకి రానుందన్నారు. ప్రభుత్వం పట్ల ఆలోచనలో ఇది ఎంతో మార్పును తెస్తుందన్నారు. -
బ్యాంకింగ్ రేస్‌లో... టాటా, బిర్లా, బజాజ్!
ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే ఆర్థిక రంగం ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం బలంగా ఉండాలి. అయితే ప్రస్తుతం మన దేశంలో బ్యాంకింగ్ రంగం బలహీనంగానే ఉంది. మన బ్యాంకింగ్ రంగంలో అధిక ప్రభావం ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు మొండిబకాయిల భారంతో కునారిల్లుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలోని ఉత్పాదకత రంగాల ఆర్థిక అవసరాలను తీర్చడానికి మరిన్ని ప్రైవేట్ బ్యాంక్‌లు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ దిశగా ఇటీవల ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ కొన్ని ప్రతిపాదనలు చేసింది. భారీ కార్పొరేట్ సంస్థలను బ్యాంకింగ్ రంగంలోకి అనుమతించడం, రూ.50,000 కోట్ల పైబడిన ఆస్తులున్న ఎన్బీఎఫ్సీలను బ్యాంక్‌లుగా మారే వెసులుబాటును ఇవ్వడం, ప్రమోటర్ వాటాను 15 శాతం నుంచి 26 శాతానికి పెంచుకునే ప్రతిపాదనలు వాటిల్లో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయానికి మరో మూడు నెలలు పట్టవచ్చు. ముందు వరుసలో భారీ ఎన్బీఎఫ్సీలు... బ్యాంక్ లైసెన్స్‌లు పొందడానికి టాటా, బిర్లా, బజాజ్, పిరమళ్ సంస్థలు రేసులో ఉన్నాయి. ఈ దిగ్గజ సంస్థలకు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్(ఎన్బీఎఫ్సీ) సంస్థలున్నాయి. రూ.50,000 కోట్ల పైబడిన ఆస్తులున్న ఎన్బీఎఫ్సీలను బ్యాంక్‌లుగా మార్చుకునే వెసులుబాటు ఉండటం ఈ సంస్థలకు కలసివస్తోంది. టాటా గ్రూప్‌నకు చెందిన టాటా క్యాపిటల్ ఆస్తులు రూ.83,280 కోట్లుగా ఉన్నాయి. ఈ కంపెనీ అనుబంధ సంస్థ టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ ఆస్తులు రూ.46,807 కోట్లుగా ఉన్నాయి. బ్యాంక్ లైసెన్స్ పొందడానికి ఆసక్తిగా ఉన్నామని టాటా గ్రూప్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్‌లకు సంబంధించి ప్రస్తుతానికి ప్రతిపాదనలే వెలువడ్డాయని, ఈ దశలో తమ బ్యాంకింగ్ ప్రణాళికలను వివరించడం సముచితం కాదని ఆయన పేర్కొన్నారు. పూర్తి స్పష్టత వచ్చాక ఈ విషయమై పరిశీలన జరుపుతామని వివరించారు. 2012లో కూడా కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్‌లు ఇస్తామని ఆర్బీఐ ప్రకటించింది. అప్పుడు టాటా గ్రూప్ కూడా దరఖాస్తు చేసింది. అయితే నిబంధనలు మరీ కఠినంగా ఉన్నాయంటూ 2013లో తన దరఖాస్తును వెనక్కి తీసుకుంది. ఇక బిర్లా గ్రూప్‌నకు చెందిన ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఆస్తులు రూ.70,015 కోట్లుగా ఉన్నాయి. బ్యాంక్ లైసెన్స్ పొందడానికి ఈ సంస్థ కూడా రేసులో ఉంటుందని నిపుణులంటున్నారు. మరోవైపు పిరమళ్ గ్రూప్ కూడా బ్యాంక్ లైసెన్స్ రేసులో ఉంది. సంక్షోభంలో కూరుకుపోయిన డీహెచ్ఎఫ్ఎల్ రిటైల్ ఆస్తులను కొనుగోలు చేయాలనుకుంటున్న ఈ గ్రూప్ ఎన్బీఎఫ్సీ ఆస్తులు రూ.50,000 కోట్ల మేర ఉన్నాయి. ఎన్బీఎఫ్సీ రంగంలో పిరమళ్ గ్రూప్‌నకు మంచి అనుభవం ఉంది. అయితే ఈ కంపెనీకి రియల్ ఎస్టేట్ రంగానికి ఎక్స్పోజర్ బాగా ఉండటం ఆందోళన కలిగించే అంశమని కొంతమంది నిపుణులంటున్నారు. డీహెచ్ఎఫ్ఎల్ రిటైల్ ఆస్తుల్ని కొనుగోలు చేస్తే, పిరమళ్ గ్రూప్‌నకు నిలకడైన క్యాష్ ఫ్లోస్ ఉంటాయని వారంటున్నారు. బ్యాంక్ లైసెన్స్‌ల కోసం 2012లోనే బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ సంస్థలు ప్రయత్నాలు చేశాయి. కానీ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, బంధన్ బ్యాంక్‌లకు మాత్రమే అప్పుడు లైసెన్స్‌లు లభించాయి. తాజా ప్రతిపాదనల కారణంగా మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్ తదితర సంస్థలు తమ ప్రమోటర్ల వాటాను తగ్గించుకునే ప్రయత్నాలు చేయవచ్చని నిపుణులంటున్నారు. కార్పొరేట్ సంస్థలకు బ్యాంక్ లైసెన్స్...! కార్పొరేట్ సంస్థలకు బ్యాంక్ లైసెన్స్‌లు ఇచ్చే దిశగా ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ సూచనలు చేసింది. అయితే ఈ కమిటీలో ఒక్క వ్యక్తి మినహా మిగిలిన వారందరూ కార్పొరేట్లకు బ్యాంక్ లైసెన్స్‌లు ఇవ్వొద్దనే సూచించారు. అయితే బ్యాంకింగ్ చట్ట సవరణ అంశాన్ని ఈ కమిటీ ప్రభుత్వ అభీష్టానికే వదిలేసింది. కాగా ఇవి సాహసోపేత ప్రతిపాదనలని నిపుణులంటున్నారు. అయితే కార్పొరేట్ హౌజ్‌లకు బ్యాంక్ లైసెన్స్‌లు లభించడం కష్టమేనని మాక్వెరీ క్యాపిటల్ పేర్కొంది. అంతే కాకుండా యస్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ల సంక్షోభం నేపథ్యంలో ఉదారంగా బ్యాంక్ లైసెన్స్‌లు ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని వివరించింది. కాగా కార్పొరేట్ హౌజ్‌లకు బ్యాంక్ లైసెన్స్‌లు ఇవ్వడం ప్రమాదకరమని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్సులు సరికాదు..! రేటింగ్ దిగ్గజం ఎస్ అండ్ పీ ప్రకటన బడా కార్పొరేట్ సంస్థలకు బ్యాంకింగ్ లైసెన్సులు ఇవ్వడం సరికాదన్న అభిప్రాయాన్ని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) వ్యక్తం చేసింది. భారత్ కార్పొరేట్ పాలన బలహీనంగా ఉందని, అలాగే గత కొన్ని సంవత్సరాలుగా రుణ చెల్లింపుల్లో వైఫల్యం చెందుతున్నాయని సోమవారం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రతిపాదన పలు అనుమానాలకు తావిస్తుందని తెలిపింది. కొత్తగా బ్యాంకులను నెలకొల్పడానికి బడా కార్పొరేట్ సంస్థలకు అనుమతి ఇవ్వవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంతర్గత కార్యాచరణ బృందం సమర్పించిన ఒక నివేదికను శుక్రవారం సెంట్రల్ బ్యాంక్ ప్రజాబాహుళ్యంలో ఉంచింది. దీనిపై ఒక నిర్ణయానికి ముందు సంబంధిత వర్గాలు, నిపుణుల సలహాలను తీసుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. నివేదికపై 2021 జనవరి 15వ తేదీలోపు అభిప్రాయాలను తెలపాలని కోరింది. ఎస్అండ్పీ ప్రకటనలో ముఖ్యాంశాలు ... ► కార్పొరేట్లే బ్యాంకింగ్ నిర్వహించే అంశంలో పలు క్లిష్టతలు ఉంటాయి. అంతర్గత గ్రూప్‌లకు రుణం, నిధుల మళ్లింపు, పరస్పర ప్రయోజనాల కోణంలో ప్రశ్నలు, ఆర్థిక స్థిరత్వం వంటి ఎన్నో అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. రుణ బకాయిల చెల్లింపుల్లో కార్పొరేట్ల వైఫల్యాల వల్ల ఫైనాన్షియల్ వ్యవస్థలో నెలకొనే ప్రతికూలతలు మరింత తీవ్రమయ్యే అవకాశాలూ ఉంటాయి. ► 2020 మార్చి నాటికి మొత్తం కార్పొరేట్ రుణాల్లో దాదాపు 13% మొండిబకాయిలు(ఎన్పీఏ)గా మారడం ఇప్పుడు చర్చనీయాంశం. ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో ఎన్పీఏల సమస్య తీవ్రంగా ఉంది. ► అయితే రూ.50,000 కోట్లు, ఆపైన భారీ రుణ పరిమాణం కలిగి, 10 సంవత్సరాలకు పైగా చక్కటి వ్యాపార నిర్వహణ కలిగిన పెద్ద బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీలను (ఎన్బీఎఫ్సీ) బ్యాంకులగా మార్చే ప్రతిపాదన మంచిదే. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. అది పిడుగుపాటే..! కార్పొరేట్ బ్యాంకింగ్‌పై రఘురామ్ రాజన్, విరాల్ ఆచార్య ఆర్బీఐ మాజీ గరవ్నర్ రఘురామ్ రాజన్, మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్యలు కూడా ఈ అంశంపై తీవ్ర ప్రతికూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిని అమలుచేస్తే, అది బ్యాంకింగ్‌పై పిడుగుపాటు అవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఇరువురు సంయుక్తంగా రాసిన ఒక ఆర్టికల్ సోమవారం రాజన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో పోస్ట్ అయ్యింది. బ్యాంకింగ్ రంగంలో కార్పొరేట్ సంస్థల జోక్యం ఎంతమాత్రం సమంజసం కాదని ఆర్టికల్ పేర్కొంది. ఇలాంటి క్లిష్ట రుణదాత–గ్రహీత అనుసంధాన వ్యవస్థ సజావుగా మనుగడ సాగించిన చరిత్ర ఏదీ లేదనీ పేర్కొంది. రుణ గ్రహీతే యజమానిగా ఉన్న ఒక బ్యాంక్ మంచి వ్యాపారం ఎలా చేయగలుగుతుందని ఆర్టికల్ రచయితలు ప్రశ్నించారు. ఫైనాన్షియల్ వ్యవస్థలో ఎక్కడో ఒకచోట జరిగే ‘పేలవ రుణ తీరు’ను ప్రతిసారీ కట్టడి చేయడం సాధ్యంకాదని ఇప్పటికే పలు సందర్భాల్లో రుజువయ్యిందని ఆర్టికల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్ ప్రతిపాదన మంచిదికాదని స్పష్టం చేసింది. ప్రతిపాదనను క్షుణ్ణంగా పరిశీలిస్తే, ‘‘అసలు ఇప్పుడు ఈ అవసరం ఏమి వచ్చింది...’’ అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోందని ఆర్టికల్ పేర్కొంది. ఆర్బీఐ అధికారాల పెంపు అవశ్యం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారాలను మరింత పెంచాలన్న సూచించిన ఆర్టికల్, ఈ పరిస్థితి ఉన్నట్లయితే, మొండిబకాయిల సమస్య ఇంతలా పెరిగేది కాదనీ స్పష్టం చేసింది. ఆర్బీఐకి మరిన్ని అధికారాలు, మొండిబకాయల తగ్గింపునకు ఆర్బీఐ వర్కింగ్ కమిటీ చేసిన పలు ప్రతిపాదనలను తొలుత అమలు చేయాలని, ‘కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్’ను ప్రస్తుతం పక్కనపడేయాలనీ తమ ఆర్టికల్‌లో ఆర్థిక నిపుణులు సూచించారు. ప్రపంచంలో పలు దేశాల తరహాలోనే భారత్‌లో కూడా బ్యాంకింగ్ వైఫల్యం వల్ల ఖాతాదారులు నష్టపోయే పరిస్థితి ఉండదని వారు అన్నారు. ఇందుకు యస్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంకులను ప్రస్తావించారు. అందువల్ల బ్యాంకుల్లో తమ డబ్బుకు భద్రత ఉంటుందని డిపాజిటర్లు భావిస్తారని పేర్కొన్నారు. అందువల్లే బ్యాంకులు పెద్ద ఎత్తున డిపాజిట్లను సమీకరించగలుగుతున్నాయని కూడా విశ్లేషించారు. ప్రస్తుతం రాజన్, ఆచార్యలు ఇరువురూ అమెరికాలో ఉన్నారు. యూనివర్శిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్ విభాగానికి సంబంధించి ప్రొఫెసర్‌గా రాజన్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, స్టెర్న్ స్కూల్ ప్రొఫెసర్‌గా ఆచార్య పనిచేస్తున్నారు. -
డ్రాగన్ శకం ముగిసింది!
గతమెంతో ఘనకీర్తి..?! భవిష్యత్తులో చైనా ఇదేవిధంగా చెప్పుకోవాల్సిన దుస్థితి వస్తుందేమో. పిన్ను నుంచి పెద్ద యంత్రం వరకు ఏ ఉత్పత్తిని అయినా తయారు చేయగలదు చైనా. అందుకే అంత వేగంగా ఎదిగి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాగలిగింది. కానీ, కరోనాతో, అమెరికాతో వాణిజ్య కయ్యం కారణంగా చైనా పరిస్థితి మారిపోనుందని నిపుణులు, పారిశ్రామికవేత్తల మాటలను పరిశీలిస్తే అర్థమైపోతోంది. ‘ప్రపంచానికి పరిశ్రమగా చైనా రోజులు ముగిసినట్టే’.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు... ఫాక్స్‌కాన్ బాస్ యంగ్ లీ!. దీనికి కారణంగా ట్రేడ్ వార్ (వాణిజ్య యుద్ధం)ను ఆయన పేర్కొన్నారు. యాపిల్ ఐఫోన్ల నుంచి, డెల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఇలా ఒకటేమిటి అన్నింటికీ తయారీ కేంద్రం చైనాయే. యాపిల్ కు ప్రధాన తయారీ భాగస్వాముల్లో ఒకటైన ఫాక్స్‌కాన్ తోపాటుచైనా కేంద్రంగా విస్తరించిన డజను వరకు టెక్నాలజీ కంపెనీలు ఇప్పుడు చైనా బయట వైపునకు చూస్తున్నాయి. చైనా మార్కెట్‌కు, యూఎస్ మార్కెట్‌కు సరఫరా వ్యవస్థలను వేర్వేరుగా నిర్వహించాల్సిన ఆవశ్యకతను మారిన పరిస్థితుల్లో అవి అవగతం చేసుకున్నాయి. చైనా బయట క్రమంగా మరింత తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకోనున్నట్టు హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీ కంపెనీ (ఫాక్స్ కాన్ గా ట్రేడయ్యే సంస్థ) చైర్మన్ యుంగ్ లీ తెలిపారు. ప్రస్తుతానికి మొత్తం తయారీ సామర్థ్యంలో 30 శాతం చైనా బయట ఈ సంస్థ ఏర్పాటు చేసుకుంది. గతేడాది జూన్ నాటికి ఇది 25 శాతమే. ఏడాదిలో చైనా వెలుపల 5 శాతం తయారీని పెంచుకున్న ఈ సంస్థ.. భవిష్యత్తులో దీన్ని మరింతగా పెంచుకునే ప్రణాళికలతో ఉంది. చైనాలో తయారై అమెరికాలోకి ప్రవేశించే ఉత్పత్తులపై పెరిగే టారిఫ్‌ల భారం పడకుండా ఉండేందుకు గాను ఫాక్స్ కాన్ సంస్థ భారత్, ఆగ్నేయాసియా, ఇతర ప్రాంతాలకు తయారీని తరలించే ప్రయత్నాల్లో ఉన్నట్టు కంపెనీ ఫలితాల ప్రకటన సందర్బంగా యంగ్ లీ స్వయంగా మీడియాకు వెల్లడించారు. ‘‘భారత్ లేదా ఆగ్నేయాసియా లేదా అమెరికా.. ఏదైనా సరే ఆయా ప్రాంతాల్లో తయారీ ఎకోసిస్టమ్ ఉంది’’ అని లీ పేర్కొన్నారు. అయితే, ఫాక్స్ కాన్ తయారీలో చైనా ఇక ముందూ కీలకపాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. కాకపోతే ప్రపంచానికి తయారీ కేంద్రంగా చైనా దశకం ముగిసినట్టేనని వ్యాఖ్యానించారు. భారత్ లో ఫాక్స్ కాన్ విస్తరణ అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రం కావడంతో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి సంస్థలు తమ తయారీ కేంద్రాలను చైనా బయట కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాయి. అవసరమైతే యాపిల్ ఉత్పత్తులను పూర్తిగా చైనా బయట తయారు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని యంగ్ లీ గతేడాదే ఓ సందర్భంలో చెప్పడం గమనార్హం. దీర్ఘకాలంలో చైనాకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రాలు ఏర్పాటు కావడం తథ్యమని లీ మాటలతో స్పష్టమవుతోంది. ఫాక్స్‌కాన్ కు మన దేశంలోనూ తయారీ కేంద్రాలున్నాయి. మరిన్ని పెట్టుబడులతో సామర్థ్య విస్తరణ చేయనున్నట్టు ఈ సంస్థ ఇటీవలే ప్రకటించింది కూడా. భారత్ లో తయారీకి అమెరికాకు చెందిన యాపిల్ ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో యాపిల్ తయారీ భాగస్వామిగా ఫాక్స్‌కాన్ సంస్థ భారత మార్కెట్ పట్ల విస్తరణ ప్రణాళికలతో ఉంది. అమెరికాకు సరఫరా చేసే ఉత్పత్తుల తయారీకి భారత్ ను ప్రధానంగా ఫాక్స్‌కాన్ పరిశీలిస్తుండడం గమనార్హం. యాపిల్ ఐపాడ్, మ్యాక్ ఉత్పత్తులకు డిమాండ్ కారణంగా ఫాక్స్ కాన్ జూన్ క్వార్టర్ లో 5,835 కోట్ల భారీ లాభాన్ని ప్రకటించడం గమనార్హం. ఈ సంస్థ తైవాన్ కు చెందినది. టెన్సెంట్ హోల్డింగ్స్‌కు చెందిన వీచాట్ వినియోగాన్ని అమెరికా పౌరులు వినియోగించకుండా నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. పోటీతత్వంతో స్వావలంబన భారత్ భారత్ తన అవసరాలను దేశీయంగా తీర్చుకునేందుకు (ఆత్మ నిర్భర్) దేశీయ పరిశ్రమ కచ్చితంగా మరింత పోటీనిచ్చే విధంగా మారాల్సిన అవసరం ఉందని మాజీ కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు రక్షణాత్మక విధానాలను అవలంబిస్తున్నతరుణంలో.. భారత్ కూడా తన అవసరాలకు తనపైనే ఆధారపడాల్సిన అవసరం ఉందన్నారు. స్వేచ్ఛాయుత మార్కెట్ కలిగిన అమెరికా సైతం రక్షణాత్మక విధానాలను అనుసరిస్తున్న విషయాన్ని ప్రభు గుర్తు చేశారు. కనుక రానున్న రోజుల్లో ఆత్మనిర్భర్ కు మరే ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. ‘‘మన పరిశ్రమలను మరింత పోటీయుతంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోటీతత్వం మన పరిశ్రమల సమర్థతను పెంచుతుంది. ఆ పోటీయే మనకు మేలు చేస్తుందని నేను నమ్ముతున్నాను’’ అంటూ పీహెచ్ డీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహంచిన కార్యక్రమంలో భాగంగా పేర్కొన్నారు. ఉద్యోగ కల్పనకు కేంద్రం ఎన్నో విధాానాలను అమలు చేసినట్టు ప్రభు చెప్పారు. చైనా ఉత్పత్తులకు తగ్గిన ఆదరణ! న్యూఢిల్లీ: చైనా తయారీ ఉత్పత్తుల పట్ల భారతీయుల్లో ఆసక్తి తగ్గుతోందని సోషల్ మీడియా వేదిక లోకల్‌సర్కిల్స్ తన సర్వేలో వెల్లడించింది. నవంబరు 10–15 మధ్య దేశవ్యాప్తంగా 204 జిల్లాల్లో ఈ సర్వే చేపట్టారు. దీని ప్రకారం సర్వేలో పాలుపంచుకున్న వారిలో పండుగల సీజన్లో కేవలం 29 శాతం మంది మాత్రమే చైనా ఉత్పత్తులను కొనుగోలు చేశారు. గతేడాది ఈ సంఖ్య 48 శాతం ఉంది. 2019లో చేపట్టిన సర్వేలో 14,000 మందికిపైగా పాల్గొన్నారు. 2019తో పోలిస్తే ప్రస్తుత సీజన్లో చైనా ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారి సంఖ్య 40 శాతం తగ్గిందని లోకల్‌సర్కిల్స్ ఫౌండర్ సచిన్ తపారియా తెలిపారు. ఈ ఏడాది చైనా ఉత్పత్తులు కొన్నవారిలో 71 శాతం మంది తాము స్పృహతో కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు. డబ్బుకు తగ్గ విలువ కాబట్టే ఆసక్తి చూపామని 66% మంది తెలిపారు. దాడి తర్వాత పెరిగిన వ్యతిరేకత.. జూన్‌లో గాల్వన్ వ్యాలీలో చైనా సైనికుల దాడిలో భారత జవాన్లు వీర మరణం పొందిన సంఘటన తర్వాత చైనా ప్రొడక్ట్స్ పట్ల భారతీయుల్లో వ్యతిరేకత అధికమైంది. వచ్చే ఏడాది కాలంలో చైనా ఉత్పత్తులను బహిష్కరిస్తామని 87 శాతం మంది వెల్లడించారు. దేశీయంగా తయారైన ప్రొడక్ట్స్ ఖరీదు ఉన్నప్పటికీ నాణ్యత మెరుగ్గా ఉంటుందని అత్యధికులు ఈ విషయాన్ని వ్యక్తపరిచారు. పండుగల సమయంలో లైట్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు ఒకసారి మాత్రమే వినియోగించేవి కావడంతో నాణ్యత ప్రధాన అంశం కాదని చాలా మంది అభిప్రాయపడ్డారు. -
మన నినాదం ‘వోకల్ ఫర్ లోకల్’
జైపూర్/న్యూఢిల్లీ: దీపావళి పండుగ సందర్భంగా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసి, దేశీయ వ్యాపారులకు ఊతం ఇచ్చినట్లుగానే స్థానిక ఆర్థిక వ్యవస్థకు మద్దతు కొనసాగించాలని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వోకల్ ఫర్ లోకల్ (స్థానికానికి మద్దతుగా గళమెత్తాలి) అనే సందేశాన్ని దశదిశలా వ్యాపింపజేయాలని కోరారు. ప్రఖ్యాత జైన మత బోధకుడు విజయ్ వల్లభ్ సురీశ్వర్ 151వ జయంతి సందర్భంగా రాజస్తాన్‌లోని పాలీ పట్టణంలో నెలకొల్పిన ఆయన విగ్రహాన్ని ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జైన ఆచార్యుడు విజయ్ వల్లభ్ విద్య, మహిళా సాధికారత కోసం ఎంతగానో కృషి చేశారని మోదీ కొనియాడారు. కరోనా మహమ్మారిపై ప్రజల్లో అవగాహన పెంచడంలో మీడియా ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కరోనాపై పోరాటం విషయంలో ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణలో మీడియా ఒక విలువైన భాగస్వామి అని తెలిపారు. సోమవారం నేషనల్ ప్రెస్ డే సందర్భంగా ఆయన లిఖితపూర్వక సందేశం ఇచ్చారు. సానుకూలమైన విమర్శలు లేదా విజయగాధలను ప్రచారం చేయడం ద్వారా మీడియా ప్రజలకు మేలు చేస్తోందన్నారు. -
‘దీపావళికి స్థానిక ఉత్పత్తులే కొనండి’
వారణాసి: సొంత నియోజకవర్గం వారణాసిలో రూ. 614 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫెరెన్స్ విధానంలో శ్రీకారం చుట్టారు. ఈ దీపావళి పండుగ సమయంలో స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించి, ప్రచారం చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చినట్లు అవుతుందని, అలాగే, వాటిని తయారు చేసినవారి ఇళ్లల్లో దీపావళి వెలుగులు నింపినట్లు అవుతుందని పేర్కొన్నారు. ఎస్సీఓ సమావేశాలకు మోదీ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నడుమ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో చైనా, పాకిస్తాన్ అధినేతలతో ప్రధాని మోదీ మంగళవారం వర్చువల్ వేదికగా భేటీకానున్నారు. ఈ సమావేశంలో వచ్చే ఏడాదికి ఎజెండాను ఖరారు చేస్తారు. కరోనా కారణంగా ఎస్సీఓ అధినేతల వార్షిక సమావేశం తొలిసారిగా ఆన్లైన్లో జరగనుంది. భారత్ చైనా సరిహద్దు వివాదం నెలకొన్న నేపథ్యంలో ఎస్సీఓ ఈ నెలలో ఐదు సమావేశాలను నిర్వహించనుంది. ఈ వార్షిక సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ అధ్యక్షత వహిస్తారు. సమావేశాల్లో రాజకీయాలు, భద్రత, ఆర్థిక వాణిజ్యం లాంటి విషయాలపై దృష్టి సారించి, ప్రపంచ పరిస్థితులపై మాస్కో డిక్లరేషన్‌ను రూపొందించనున్నారు. -
గ్రామాల్లో తగ్గిన ఉపాధి..
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజల ఆర్థిక స్థితిగతులు తీవ్రంగా దెబ్బతిన్నట్టు వివిధ సంస్థల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వివిధ రంగాల్లో మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని ఆ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కోవిడ్ మహమ్మారి దాదాపు అన్ని రంగాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్రంగా ప్రభావితం చేసింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన అవకాశాల తగ్గుదల, పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉద్యోగ, ఉపాధి రంగాలు ఇంకా పుంజుకోకపోవడం వంటి కారణాలతో భారత లేబర్ మార్కెట్ ఒత్తిళ్లకు గురవుతోంది. ఉపాధి కల్పనే మందు.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల కల్పన ద్వారా లేబర్ మార్కెట్ పుంజుకునేలా చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఉపాధి కల్పన రేట్ మరింత దిగజారకుండా చర్యలు తీసుకోవడం సవాళ్లతో కూడుకున్నదని, ఇందుకోసం ఆర్థికరంగం అదనపు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాల్సిన అవసరముందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా విశ్లేషణలో పేర్కొంది. అఖిలభారత స్థాయి అంచనాల్లో గ్రామీణ భారతానికి అధిక ప్రాధాన్యం ఉన్నందున అక్కడ ‘ఎంప్లాయ్మెంట్ రేట్’ దిగజారకుండా చూడాల్సిన అవసరముందని తెలిపింది. ఆర్థికరంగం ఒడిదుడుకులు.. అక్టోబర్ తొలి 3 వారాల్లో సగటు గ్రామీణ ఎంప్లాయ్మెంట్ రేట్ 39.1 శాతం ఉండగా, సెప్టెంబర్‌లో 39.8 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో సగటు ఎంప్లాయ్మెంట్ రేట్ అక్టోబర్ మొదటి 3 వారాల్లో 34.8 శాతం కాగా, సెప్టెంబర్‌లో 34.4 శాతంగా ఉంది. కరోనాతో గత ఏప్రిల్ నెలలో తలెత్తిన తీవ్ర పరిస్థితుల ప్రభావం కారణంగా భారత ఆర్థిక రికవరీ ప్రక్రియ స్తబ్ధతకు గురైనట్టు సీఎంఐఈ విశ్లేషించింది. ఆ స్థితి నుంచి ఆర్థిక రంగం గత మేలో బాగానే కోలుకోగా, జూన్‌లోనూ మెరుగైన స్థితిలో ఉంటూ జూలైలోనూ అదే కొనసాగినట్టు వెల్లడించింది. ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్లలో అది నిలిచిపోయి, అక్టోబర్‌లోనూ స్తబ్ధత కొనసాగిందని పేర్కొంది. -
సంస్కరణలతో దీర్ఘకాలంలో స్థిరవృద్ధి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావాలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థ మూలాల బలోపేతానికి సాయపడతాయని.. తద్వారా దీర్ఘకాలంలో స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధ్యపడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ మేరకు ఓ నివేదిక విడుదల చేసింది. ‘‘విధానపరమైన వాతావరణానికితోడు భాగస్వాములు అందరూ కలసి తీసుకున్న చర్యలు.. అవకాశాలను సొంతం చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి సామర్థ్యాన్ని ఇనుమడింపజేస్తుంది’’ అంటూ కేంద్ర ఆర్థిక శాఖ రూపొందించిన నెలవారీ ఆర్థిక నివేదిక తెలియజేసింది. కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉండడం అన్నది స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి వృద్ధి రేటుకు ప్రతికూలంగా మారుతుందని.. అయితే ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలు దీన్ని అధిగమించేలా చేస్తాయంటూ వివరించింది. సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 30 మధ్య దేశంలో కరోనా కేసులు గరిష్టాలకు చేరినట్టు తెలుస్తోందని పేర్కొంది. వ్యవసాయ రంగంలో తాజాగా చేపట్టిన సంస్కరణలు ఎప్పుడో సాకారం కావాల్సినవిగా అభిప్రాయపడింది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ, ఆర్థిక వ్యవస్థను క్రమంగా తెరవడం అన్నవి దేశ ఆర్థిక రికవరీకి తోడ్పడ్డాయంటూ కేంద్ర ఆర్థిక శాఖ తన నివేదికలో పేర్కొంది. -
ఆర్థిక వ్యవస్థకు ‘జీఎస్టీ’ ఆశా కిరణం
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడుతోందని సెప్టెంబర్ నెల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు సూచిస్తున్నాయి. సమీక్షా నెలలో వసూళ్ల పరిమాణం 4 శాతం వృద్ధితో (2019 ఇదే నెలతో పోల్చి) రూ.95,480 కోట్లకు ఎగసింది. 2019 సెప్టెంబర్‌లో ఈ వసూళ్లు రూ.91,916 కోట్లు. ఇక ఆగస్టులో వసూలయిన జీఎస్టీ వసూళ్లకన్నా సెప్టె ంబర్ వసూళ్లు 10% అధికంకావడం మరో విశేషం. వివిధ విభాగాలను చూస్తే... ► సెప్టెంబర్ 2020 జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ రూ.17,741 కోట్లు. ► స్టేట్ జీఎస్టీ రూ.23,131 కోట్లు. ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 47,484 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలయిన రూ.22,442 కోట్లుసహా). ► సెస్ రూ.7,124 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలయిన రూ.788 కోట్లుసహా). నెలల వారీగా చూస్తే నెల వసూళ్లు (రూ. కోట్లలో) ఏప్రిల్ రూ.32,172 మే రూ.62,151 జూన్ రూ.90,917 జూలై రూ.87,422 ఆగస్టు రూ.86,449 -
మరిన్ని చర్యలకు సిద్ధం
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ రికవరీ అంత ఆశాజనకంగా ఏమీ లేదన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్. కనుక వృద్ధికి మద్దతుగా అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు ఆర్బీఐ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఫిక్కీ నిర్వహించిన వర్చువల్ సమావేశాన్ని ఉద్దేశించి దాస్ మాట్లాడారు. కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉందో ప్రభుత్వం విడుదల చేసిన జీడీపీ గణాంకాల ఆధారంగా తెలుస్తోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ కాలంలో దేశ జీడీపీ మైనస్ 23.9%కి పడిపోయిన విషయం తెలిసిందే. ‘‘వ్యవసాయానికి సంబంధించిన సంకేతాలు ఎంతో ఆశాజనకంగానే ఉన్నప్పటికీ.. తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ), ఉపాధిలేమి పరిస్థితులు రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) స్థిరపడతాయని కొన్ని అంచనాల ఆధారంగా తెలుస్తోంది. అదే సమయంలో కొన్ని ఇతర రంగాల్లోనూ పరిస్థితులు తేలికపడతాయి’’ అని దాస్ చెప్పారు. ఆర్థిక రికవరీ ఇంకా పూర్తి స్థాయిలో గాడిన పడలేదని.. ఇది క్రమంగా సాధ్యపడుతుందని పేర్కొన్నారు. లిక్విడిటీ, వృద్ధి, ధరల నియంత్రణకు అన్ని చర్యలను ఆర్బీఐ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ‘ఎన్బీఎఫ్సీ’లు బలహీనంగా.. ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడంతోపాటు.. మధ్య కాలానికి మన్నికైన, స్థిరమైన వృద్ధిని సాధించడమే విధానపరమైన చర్యల ఉదేశమని శక్తికాంతదాస్ వివరించారు. ‘‘మార్కెట్లను చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తూనే ఉంటాము. ఆర్బీఐ పోరాటానికి సిద్ధంగా ఉందని నేను గతంలోనే చెప్పారు. అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు తదుపరి చర్యలు ఉంటాయి’’ అని దాస్ తెలిపారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం (ఎన్బీఎఫ్సీ) బలహీనంగా ఉండడం ఆందోళనకరమన్నారు. అగ్రస్థాయి 100 ఎన్బీఎఫ్సీలను ఆర్బీఐ క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తోందని.. ఏ ఒక్క పెద్ద సంస్థ కూడా వైఫల్యం చెందకూడదన్నదే తమ ఉద్దేశ్యమని తెలిపారు. డిపాజిటర్ల ప్రయోజనాలు ముఖ్యం.. డిపాజిటర్ల ప్రయోజనాలు, ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని రుణ పునర్వ్యవస్థీకరణ పథకాన్ని రూపొందించామని దాస్ చెప్పారు. ఏ బ్యాంకింగ్ వ్యవస్థకు అయినా డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా స్పష్టం చేశారు. -
ఇది యాంత్రిక రికవరీయే..!
న్యూఢిల్లీ: ఆర్థిక రంగం కోలుకోవడం అన్నది యాంత్రికంగా చోటు చేసుకుంటున్నదే కానీ.. లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా ఆగిపోయిన ఆర్థిక కార్యకలాపాలు పూర్వపు స్థితికి చేరుకుంటున్నాయని ప్రభుత్వం భావించడం సరికాదంటున్నారు ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. స్వల్ప కాలం నుంచి మధ్యకాలానికి భారత్ వృద్ధి అవకాశాలు చూడ్డానికి బలహీనంగానే ఉన్నాయన్నారు. ఈ మేరకు ఆర్థిక వ్యవస్థపై తన అభిప్రాయాలను ఓ వార్తా సంస్థతో పంచుకున్నారు. కరోనా వైరస్ రావడానికి పూర్వమే మన దేశ వృద్ధి రేటు 2017–18లో ఉన్న 7 శాతం నుంచి 2019–20లో 4.2 శాతానికి క్షీణించిన విషయం తెలిసిందే. ‘‘మీరు పేర్కొంటున్న ఆర్థిక రికవరీ సంకేతాలను లాక్ డౌన్ నాటి క్షీణించిన పరిస్థితుల నుంచి యాంత్రికంగా జరిగే రికవరీగానే మేము చూస్తున్నాము. దీన్ని మన్నికైన రికవరీగా చూడడం పొరపాటే అవుతుంది. కరోనా మహమ్మారి ఇప్పటికీ విస్తరిస్తూనే ఉంది. రోజువారీ కేసుల సంఖ్య పెరగడమే కాకుండా, కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. కనుక స్వల్పకాలం నుంచి మధ్య కాలానికి వృద్ధి అవకాశాలు బలహీనంగానే ఉండనున్నాయి. మహమ్మారి సమసిపోయిన తర్వాత (దీన్ని త్వరలోనే చూస్తామన్నది నా ఆశాభావం) ఈ సమస్యలు మరింత పెద్దవి కానున్నాయి. ద్రవ్యలోటు భారీగా పెరిగిపోనుంది. రుణ భారం కూడా భారీగానే ఉంటుంది. ఆర్థిక రంగం దారుణ పరిస్థితులను చూస్తుంది. ఈ సవాళ్లను ఏ విధంగా పరిష్కరించుకుంటామన్న దానిపైనే మధ్యకాల వృద్ధి అవకాశాలు ఆధారపడి ఉంటాయి’’ అంటూ సుబ్బారావు వివరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఆశావహం.. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల నడుమ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పట్టణాలతో పోలిస్తే మెరుగ్గా కోలుకోవడాన్ని సానుకూల సంకేతంగా దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విస్తరించడం మంచి చర్యగా పేర్కొన్నారు. మన ఆర్థిక వ్యవస్థకు కనీస భద్రతా రక్షణలు ఉండడాన్ని తక్కువ మంది గుర్తించిన మరో సానుకూల అంశంగా చెప్పారు. 4 కోట్ల మంది పట్టణ కార్మికులు కరోనా లాక్ డౌన్ల కారణంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిపోయారని, అయినప్పటికీ అక్కడ భారీ కేసులు ఏమీ లేకపోవడాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రభుత్వ ఖర్చే వృద్ధి చోదకం ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం తగినంత నిధులను ఖర్చు చేయడం లేదన్న విమర్శలకు సుబ్బారావు స్పందిస్తూ.. రుణాలు తీసుకుని ఖర్చు చేయడం ప్రభుత్వానికి పెద్ద కష్టమైన విషయం కాదన్నారు. ‘‘ప్రభుత్వం చేసే వ్యయమే స్వల్పకాలంలో వృద్ధిని నడిపించగలదు. వద్ధికి ఆధారమైన ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు, ఎగుమతులు అన్నీ కూడా మందగించి ఉన్నాయి. ఆర్థిక వృద్ధి క్షీణతను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇప్పుడు మరింత ఖర్చు చేయకపోతే మొండి బకాయిలు సహా పలు సమస్యలు ఆర్థిక వ్యవస్థను చుట్టుముడతాయి’’ అని సుబ్బారావు చెప్పారు. అయితే, కేంద్రం రుణాలకు పరిమితి మాత్రం ఉండాలన్నారు. -
ఎకానమీకి ‘రుణ’ పునరుత్తేజం!
ముంబై: బ్యాంకింగ్ రుణ పునర్వ్యవస్థీకరణ ఆర్థికరంగం పునరుత్తేజానికి దోహదపడుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ విశ్లేషించారు. రుణ పునఃచెల్లింపులకు తగిన సమయం కల్పించడం వల్ల ద్రవ్య లభ్యత విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంస్థలకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని ఆయన అన్నారు. రుణ పునర్వ్యవస్థీకరణ వల్ల వ్యాపార పునరుద్ధరణ జరుగుతుందని, దీనితో ఉపాధి అవకాశాలకు విఘాతం కలగదని గవర్నర్ అన్నారు. అంతిమంగా ఇది ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడుతుందన్నారు. ఒక వార్తా సంస్థకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► భారత స్టాక్ మార్కెట్ సర్దుబాటు జరగాలి. వాస్తవ ఆర్థిక పరిస్థితిని మార్కెట్ ప్రతిబింబించడం లేదు. ► ఒకవైపు బ్యాంకుల ఆర్థిక పరిపుష్ఠి ఎంతో ముఖ్యమైన అంశం. మరోవైపు కోవిడ్–19 నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న చిన్న వ్యాపార సంస్థల ప్రయోజనాల పరిరక్షణా ముఖ్యం. ఈ రెండు అంశాల సమతౌల్యతకు తగిన ప్రయత్నం జరుగుతుంది. ► రుణ చెల్లింపులపై మారటోరియం గడువు ఈ నెలాఖరుతో ముగిసిపోతుంది. ‘‘మారటోరియం’’ అనేది తాత్కాలిక పరిష్కార మార్గమే. దీనిని దీర్ఘకాలికంగా కొనసాగించలేము. ► ఆరు నెలల మారటోరియం ముగిసిపోతే, మొండిబకాయిలు భారీగా పెరిగిపోతాయన్న ఆందోళన ఉంది. అయితే ఒక కొత్త ప్రణాళిక కింద కొత్త మారటోరియం విధానం తీసుకురావడం, లేదా అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత మారటోరియంనే కొనసాగించడం వంటి చర్యలు తీసుకోడానికి బ్యాంకులకు తగిన సౌలభ్యత ఉంటుంది. ► కరోనా వైరస్ నేపథ్యంలో సవాళ్లను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు మద్దతునివ్వడానికి పాలనా, అధికార యంత్రాంగం తగిన ప్రయత్నాలు అన్నీ చేస్తోంది. మొండిబకాయిలు 2 దశాబ్దాల గరిష్టానికి చేరిన నేపథ్యంలో ఫైనాన్షియల్ రంగం స్థిరత్వం అవసరం. ఆర్థిక వృద్ధికి దోహదపడే దిశలో రుణ వృద్ధి జరిగేందుకు బ్యాంకులు ప్రయత్నం చేస్తున్నాయి. ఆర్బీఐ అవసరమైన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటుంది. ► కంపెనీల రుణ పునర్వ్యవస్థీకరణ విషయంలో నియమించిన నిపుణుల కమిటీ త్వరలో తన సిఫారసులను చేయనుంది. అనంతరం ఈ విషయంలో అనుసరించాల్సిన విధానాలను సెప్టెంబర్ 6 లోపు ప్రకటించడం జరుగుతుంది. ఏ అకౌంట్‌కు సంబంధించి రుణ పునర్వ్యవస్థీకరణ అవసరమో బ్యాంకులు అంతర్గతంగా ఒక నిర్ధారణకు రాగలుగుతాయి. ► రుణ పునర్వ్యవస్థీకరణ రియల్టీ రంగానికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నాం. ► కరోనాపై పోరులో మనం విజయం సాధిస్తాము. అయితే దానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేను. అయితే విజయం మాత్రం కచ్చితంగా మనదే. ► సరళతర ద్రవ్య పరపతి విధానంవైపే ఆర్బీఐ మొగ్గుచూపుతోంది. వడ్డీరేట్లు తగ్గుదలకే అవకాశం ఉంది. అయితే అత్యంత జాగరూకత, పరిపక్వతతో ఈ విధానాన్ని రూపొందించాల్సి ఉంది. ద్రవ్యోల్బణం అంశాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ► ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై నిర్ణయించాల్సింది కేంద్రమే. దీనిపై కేంద్రం అడిగితే, ఆర్బీఐ తన అభిప్రాయాలను తెలియజేస్తుంది. ► ప్రైవేటు బ్యాంకుల యాజమాన్య సమీక్షకు ఆర్బీఐ అంతర్గత కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్‌లో ఇది తుది నివేదికను అందజేస్తుంది. మొండిబకాయిల ప్రస్తుత స్థితి... 2021 మార్చి నాటికి మొత్తం అన్ని బ్యాంకుల రుణాల్లో స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) 12.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని ఇటీవల విడుదల చేసిన ద్వైవార్షిక ఆర్థిక వ్యవహారాల స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్)లో స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేర్కొనడం ఇక్కడ గమనార్హం. ఆర్థిక అనిశ్చిత పరిస్థితి మరింత విషమిస్తే, ఈ రేటు ఏకంగా 14.7 శాతానికీ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని విశ్లేషించింది. 2020 మార్చి నాటికి మొత్తం బ్యాంకింగ్ జీఎన్‌పీఏ రేటు కేవలం 8.5 శాతంగా ఉన్న విషయం గమనార్హం. రుణ నిబంధనలు తరచూ మార్చేయొద్దు బ్యాంకులకు ఆర్బీఐ సూచన ముంబై: వ్యాపార సంస్థలకిచ్చే రుణాలకు సంబంధించిన నిబంధనలను సహేతుక కారణాలు లేకుండా తరచూ మార్చేయొద్దని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంకు సూచించింది. రుణ సదుపాయాలను సమీక్షించేందుకు క్రమబద్ధంగా నిర్దిష్ట కాలవ్యవధిని నిర్దేశించాలని, మధ్యలో పదే పదే సమీక్షలు జరపడాన్ని నివారించాలని పేర్కొంది. సమీక్ష ఎప్పుడెప్పుడు జరపాలి, ఏ విధానాలను పాటించాలి తదితర అంశాలకు సంబంధించి బోర్డు ఆమోదిత విధానాన్ని రూపొందించుకోవాలని తెలిపింది. బ్యాంకులు ఒక్కో రకంగా భారీ స్థాయిలో వడ్డీ రేట్లు వసూలు చేస్తున్నాయని, ప్రభుత్వం ఉద్దీపనలు ఇస్తున్నా వ్యాపార సంస్థలకు తగు విధంగా ఆర్థిక తోడ్పాటు ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ తాజా ఆదేశాలు ఇచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
మార్కెట్‌కు ‘ఫెడ్’ భయాలు!
అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆ దేశ కేంద్ర బ్యాంక్, ఫెడరల్ రిజర్వ్ సంశయాలు వ్యక్తం చేయడంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా గురువారం నష్టపోయింది. గత మూడు రోజుల లాభాల నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 20 పైసలు పతనమై 75.02కు చేరడం.... ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 394 పాయింట్లు పతనమై 38,220 పాయింట్ల వద్ద, నిఫ్టీ 96 పాయింట్లు క్షీణించి 11,312 పాయింట్ల వద్ద ముగిశాయి. మరో దఫా నష్టాలు...! సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోనే ఆరంభమయ్యాయి. రోజంతా నష్టాలు కొనసాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 459 పాయింట్లు, నిఫ్టీ 118 పాయింట్ల మేర పతనమయ్యాయి. మార్కెట్లో మరో దఫా నష్టాలు ఉండొచ్చని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫెడ్ భయాలు...! అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒకింత రికవరీ అయింది. అయితే ఈ రికవరీ కొనసాగుతుందో,లేదో అన్న సంశయాలను ఫెడరల్ రిజర్వ్ మినట్స్ (జూలై సమావేశం) వెల్లడించాయి. దీంతో ఆసియా, యూరప్ మార్కెట్లు 1–4 శాతం మేర నష్టపోయాయి. ► సెన్సెక్స్ 30 షేర్లలో ఐదు షేర్లు–ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, టాటా స్టీల్,హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 25 షేర్లు నష్టపోయాయి. ► హెచ్డీఎఫ్సీ షేర్ 2.3 శాతం నష్టంతో రూ.1,785 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► ఎన్టీపీసీ షేర్ 7 శాతం లాభంతో రూ.101 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే కావడం గమనార్హం. ► దాదాపు 170కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. టాటా కమ్యూనికేషన్స్, టాటా కాఫీ, జేబీ కెమికల్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► ఒక్కో ఈక్విటీ షేర్‌కు మూడు బోనస్ షేర్ల జారీకి(3:1) ఆమోదం లభించడంతో ఆర్తి డ్రగ్స్ షేర్ 18 శాతం లాభంతో రూ. 2,839 వద్ద ముగిసింది. ఈ షేర్ ఈ ఏడాది 400 శాతం ఎగసింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై రూ.2,893ను తాకింది. ► డిస్కమ్‌ల రుణ పరిమితి పెరగడంతో విద్యు త్ రంగ షేర్లు 12 శాతం వరకూ ఎగిశాయి. ► దాదాపు 400కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. రెప్కో హమ్ ఫైనాన్స్, అరవింద్ ఫ్యాషన్స్, ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్, ఫ్యూచర్ కన్సూమర్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
పటిష్టంగా దేశ ఎకానమీ
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ వ్యవస్థాగతంగా పటిష్టంగా ఉన్న నేపథ్యంలో పరిశ్రమల వర్గాలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. పెట్టుబడులకు ఊతమిచ్చే దిశగా కార్పొరేట్ ట్యాక్స్ రేట్లు తగ్గించడంతో గత ఆరేళ్లుగా కేంద్రం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టిందని పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన వెబినార్‌లో పేర్కొన్నారు. దిగుమతులపై ఆధారపడటం తగ్గాలి: మంత్రి మాండవీయ నౌకాశ్రయాల్లో కార్గో హ్యాండ్లింగ్‌కు ఉపయోగపడే క్రేన్లు మొదలైన కీలక ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ధి సాధించడంపై దేశీ కంపెనీలు మరింతగా దృష్టి పెట్టాలని కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. అలాగే, ఔషధాల తయారీలో ప్రధానమైన ముడి పదార్థాల ఉత్పత్తి కూడా దేశీయంగా పెంచాలని, తద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాది ప్రాంత సీఈవోలతో పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వర్చువల్ ప్లాట్‌ఫాం ద్వారా మంత్రి ఈ విషయాలు తెలిపారు. -
ఫలితాలు కనిపిస్తున్నాయి
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన పరిణామాల నుంచి ఎకానమీని గట్టెక్కించేందుకు కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ, క్రమంగా లాక్డౌన్ ఎత్తివేయడం వంటి చర్యల ఫలితాలు కనిపించడం మొదలైందని ఒక సర్వేలో వెల్లడైంది. వ్యాపారాల పనితీరు మెరుగుపడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ – ధృవ అడ్వైజర్స్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన ఈ సర్వేలో వివిధ రంగాల సంస్థలకు చెందిన 100 పైగా టాప్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు (సీఎక్స్‌వో) పాల్గొన్నారు. రికవరీ దాఖలాలు కనిపిస్తున్నప్పటికీ, ఇది స్థిరంగా నిలబడి ఉండేలా ప్రభుత్వం నుంచి నిరంతరంగా తోడ్పాటు అవసరమవుతుందని సర్వే తెలిపింది. మార్కెట్ డిమాండ్‌ను మెరుగుపర్చడానికి గట్టి చర్యలు అవసరమని లేకపోతే ప్రాథమిక స్థాయిలో ఉన్న ఈ రికవరీ మళ్లీ కుంటుపడిపోతుందని పేర్కొంది. సర్వే ప్రకారం ప్రస్తుతం 30 శాతం సంస్థలు 70 శాతం పైగా వ్యాపార సామర్థ్యాన్ని వినియోగించుకుంటున్నాయి. 45 శాతం సంస్థలు సమీప భవిష్యత్తులో ఈ స్థాయి సామర్థ్యాన్ని వినియోగించుకోనున్నాయి. ఇక సవాళ్ల విషయానికొస్తే, దశలవారీగా అన్లాకింగ్, ఖర్చుల నియంత్రణ, బలహీన డిమాండ్, నిధుల లభ్యత మొదలైన వాటిని సీఎక్స్‌వోలు ప్రస్తావించారు. కరోనా వైరస్ మహమ్మారి రెండో విడతలో మరింతగా విజృంభించిన పక్షంలో వ్యాపారాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడొచ్చని కొందరు సీఎక్స్‌వోలు అభిప్రాయపడ్డారు. ఇక చైనా నుంచి అకస్మాత్తుగా దిగుమతులు ఆగిపోవడం వంటి అంశాలు సైతం ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ఉద్యోగాల కోత..: తమ తమ కంపెనీల్లో దాదాపు 10 శాతం మేర ఉద్యోగాల్లో కోత పడొచ్చని సర్వేలో పాల్గొన్న వారిలో 32 శాతం మంది సీఎక్స్‌వోలు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో నిర్వహించిన సర్వే ప్రకారం వీరి సంఖ్య 40 శాతం. ఎకానమీ అన్‌లాకింగ్‌తో క్రమంగా ఎగుమతులు, నిధుల ప్రవాహం, ఆర్డర్లు, సరఫరా వ్యవస్థలు మెరుగుపడటం మొదలైందని సర్వే పేర్కొంది. ఇటీవలి కాలంలో ఎగుమతులు మెరుగుపడ్డాయని 22 శాతం మంది సీఎక్స్‌వోలు తెలిపారు. ఇక 25 శాతం మంది ఆర్డర్ బుక్ మెరుగుపడిందని, 21 శాతం మంది నిధుల లభ్యత బాగుపడిందని పేర్కొన్నారు. కొనుగోళ్లకు మరింత సమయం.. మరోవైపు, ఆర్థిక ప్యాకేజీకి విషయానికొస్తే.. అయిదింట ఒక కంపెనీ మాత్రమే ప్రభుత్వం ప్రకటించిన అత్యవసర రుణ హామీ పథకం ఫలితాలిస్తోందన్నాయి. రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలు కేవలం పావు శాతం సంస్థలకు లభించింది. అది కూడా స్వల్పంగా 25–50 బేసిస్ పాయింట్ల స్థాయిలో మాత్రమే దక్కింది. -
ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది
సాక్షి, న్యూఢిల్లీ: కొన్ని వారాల ప్రయత్నాలతో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అన్‌లాక్ 1.0 పరిస్థితులు, భావి ప్రణాళికలపై చర్చించేందుకు ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం దాదాపు రెండు గంటలపాటు సాగింది. కోవిడ్ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడడం ఇది ఆరోసారి. కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్న 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధానమంత్రి మంగళవారం మాట్లాడారు. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని.. దేశంలో కొన్ని వారాలుగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ప్రధాని వివరించారు. మహమ్మారిని ఎదుర్కోవటానికి సకాలంలో తీసుకున్న నిర్ణయాలు దేశంలో దాని వ్యాప్తిని నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేశాయని ప్రధాని తెలిపారు. సహకార సమాఖ్యవాదానికి మనం ప్రపంచానికి ఒక ఉదాహరణను అందించామని ప్రజలు గుర్తుంచుకుంటారని ఆయన అన్నారు. ప్రతి ప్రాణాన్ని కాపాడటానికి ప్రయత్నించామని ప్రధాని అన్నారు. ప్రపంచవ్యాప్త ఆరోగ్య నిపుణులు భారతీయులు చూపిన క్రమశిక్షణను ప్రశంసిస్తున్నారని, దేశంలో రికవరీ రేటు ఇప్పుడు 50% పైగా ఉందని ఆయన అన్నారు. క్రమశిక్షణ సడలితే వైరస్‌కు వ్యతిరేకంగా మన పోరాటం బలహీన పడుతుందని హెచ్చరించారు. -
మళ్లీ సైన్యం చేతుల్లోకి పాక్ పెత్తనం?
కరాచీ: పొరుగు దేశం పాకిస్థాన్‌లో మళ్లీ మిలటరీ పెత్తనం మొదలైందా? కీలకమైన ప్రభుత్వ విభాగాలకు పలువురు మిలటరీ జనరళ్లు నేతృత్వం వహిస్తూండటం దీన్నే సూచిస్తోందా? అవునంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవైపు ఆర్థిక వ్యవస్థ నానాటికీ తీసికట్టుగా మారిపోతూండటం, పెరిగిపోతున్న ధరలు.. సన్నిహితులే అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటూండటంతో ప్రధాని ఇమ్రాన్ మళ్లీ ఆర్మీ సాయం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారని ఈ క్రమంలోనే జాతీయ విమాన సర్వీసులతోపాటు విద్యుత్తు రెగ్యులేటరీ సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్లతోపాటు పలు ఇతర విభాగాల్లో ప్రస్తుత, మాజీ మిలటరీ అధికారులను అధ్యక్షులుగా నియమించారని విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్థాన్‌లో మిలటరీ పెత్తనం కొత్తేమీ కాకపోయినప్పటికీ.. 2018 నాటి ఎన్నికల్లో మిలటరీ ప్రమేయం లేని కొత్త పాకిస్థాన్‌ను ఆవిష్కరిస్తానన్న ప్రచారంతో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని గద్దెనెక్కడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. పార్లమెంటులో 46 శాతం సీట్లు గెలుచుకున్న ఇమ్రాన్ పార్టీ అధికారంలో ఉండేందుకు పలు చిన్న చితక పార్టీలతో పొత్తు పెట్టుకుంది. అయితే ఇటీవలి పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా తన ప్రాబల్యం తగ్గినట్లు ప్రధాని ఇమ్రాన్ భావిస్తున్నారు. మిలటరీ సాయం ఉంటే అధికారంలో కొనసాగవచ్చునని అంచనా వేస్తున్నారు. మిలటరీ అధికారులకు కీలక పదవులు అప్పగించడం పాకిస్థాన్ ప్రభుత్వం విధానాల రూపకల్పన, అమలులో పౌర సమాజం పాత్రను తగ్గిస్తోందని, భవిష్యత్తులోనూ మిలటరీ ప్రాభవం మరింత పెరగనుందని అట్లాంటిక్ కౌన్సిల్ అనే సంస్థకు చెందిన ప్రవాస పాకిస్థానీ ఉజైర్ యూనస్ చెబుతున్నారు. కోవిడ్ వైరస్‌కు సంబంధించి అధికార టెలివిజన్ ఛానెల్లో మిలటరీ యునిఫామ్‌లు వేసుకున్న వారు ప్రభుత్వ అధికారులకు సాయం చేస్తూండటం కూడా అధికారం మిలటరీ వైపు మళ్లిపోతోందన్న అంచనాలకు బలం చేకూరుస్తోంది. ఆర్థిక వ్యవస్థ కుదేలు.. కరోనా వైరస్ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోవడం కూడా పాకిస్థాన్‌లో ఆర్మీ పెత్తనం పెరిగేందుకు కారణమని రాజకీయ విశ్లేషకుల అంచనా. దేశవ్యాప్తంగా ఇప్పటికే సుమారు లక్షకుపైగా కరోనా కేసులు నమోదు కాగా, 2200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థ 68 ఏళ్ల కనిష్టానికి చేరుకుందని సెంట్రల్ బ్యాంక్ అంచనా వేసింది. మార్చి నెలలో కరోనా ఉధృతంగా ఉన్నప్పుడే ప్రభుత్వంలో మిలటరీ ప్రమేయం పెరుగుతోందన్న ఆరోపణలు రాగా, వాటిని ఇమ్రాన్ కొట్టిపారేశారు. అయితే ఆ మరుసటి రోజే ఆర్మీ ప్రతినిధి స్వయంగా లాక్‌డౌన్‌ను ప్రకటించడం, ఆ తరువాత కూడా పలు పత్రికా ప్రకటనలు కూడా ఆర్మీ మీడియా విభాగమే విడుదల చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఆర్మీ, మిలటరీ పెత్తనం పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వంపై ఇమ్రాన్ పట్టు తగ్గిపోవడం ఖాయమని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ విశ్లేషకుడు స్పష్టం చేశారు. -
ఉపాధికి మరో 40 వేల కోట్లు
న్యూఢిల్లీ: స్వయం సమృద్ధి భారత్ లక్ష్యంగా, దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే దిశగా ప్రధాని మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో చిట్టచివరి వివరాలను ఐదోరోజు ఆదివారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఉపాధి హామీ, వైద్యారోగ్యం, విద్య తదితర రంగాలపై ఈ రోజు దృష్టి పెట్టినట్లు వివరించారు. సొంతూళ్లకు వెళ్తున్న వలస కూలీలకు ఉపాధి కల్పించేందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ. 40 వేల కోట్లను అదనంగా కేటాయించామన్నారు. ‘బడ్జెట్లో ప్రకటించిన రూ. 61 వేల కోట్లకు ఇది అదనం. ఈ మొత్తంతో 300 కోట్ల పని దినాలను సృష్టించవచ్చు’అని నిర్మల చెప్పారు. ఐదు విడతలుగా తాము ప్రకటించిన ప్యాకేజీ మొత్తం విలువ రూ. 20.97 లక్షల కోట్లని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన రూ. 8.01 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ఇందులో భాగమేనన్నారు. అయితే, ఇందులో ప్రభుత్వం నికరంగా చేసే ఖర్చు ఎంతో వివరించేందుకు ఆమె నిరాకరించారు. కానీ, ఉపాధి హామీ పథకంలో పెంపుదల, ఉచిత ఆహార ధాన్యాలు, కొన్ని వర్గాలకు పన్ను రాయితీలు, కరోనాపై పోరు కోసం వైద్యారోగ్య రంగానికి కేటాయించిన రూ. 15 వేల కోట్లు మొదలైన వాటితో కలిపి నికర ప్రభుత్వ ఖర్చు సుమారు రూ. 2.1 లక్షల కోట్లు ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ఐదు విడతలుగా తెలిపిన ప్యాకేజీలో ఎంఎస్ఎంఈ, వీధి వ్యాపారులు, రైతులు, వలస కూలీలు, వ్యవసాయ అనుబంధ రంగాల్లోని వారు.. తదితరాలకు పలు ఉపశమన చర్యలను ప్రకటించారు. అంటువ్యాధుల ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు ► పీఎం కిసాన్ పథకం కింద ఈ లాక్డౌన్ కాలంలో దేశవ్యాప్తంగా 8.19 కోట్ల మంది రైతులకు రూ. 2 వేల చొప్పున 16,394 కోట్ల రూపాయలను అందించాం. మహిళల జన్‌ధన్ ఖాతాల్లో రూ.10,025 కోట్లను జమ చేశాం. ► ప్రజారోగ్య రంగానికి నిధుల వాటా పెంచాలని నిర్ణయించాం. క్షేత్రస్థాయి వైద్య కేంద్రాల్లో పెట్టుబడులను పెంచుతాం. అన్ని ఆసుపత్రుల్లో అంటువ్యాధుల ప్రత్యేక కేంద్రాలను, తాలూకా స్థాయి వరకు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తాం. గ్రామాల్లోనూ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తాం. ► కరోనాపై పోరు కోసం కేంద్రం ప్రకటించిన రూ. 15 వేల కోట్లలో రూ. 4,113 కోట్లను ఆరోగ్య శాఖ ఇప్పటికే విడుదల చేసింది. ‘పీఎం ఈ– విద్య’ ► డిజిటల్, ఆన్లైన్ విద్యకు సంబంధించి ‘పీఎం ఈ– విద్య’పేరుతో ఒక బహుముఖ కార్యక్రమాన్ని అతిత్వరలో ప్రారంభిస్తాం. ఇందులో భాగంగా, అలాగే, 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, ప్రతీ తరగతికి ఒక ప్రత్యేక చానెల్ ఉంటుంది. మే 30 నుంచి ఆన్లైన్ కోర్సులను ప్రారంభించుకునేందుకు 100 అత్యున్నత విద్యాసంస్థలకు అనుమతిస్తున్నాము. పాఠశాల విద్యలో ‘డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ (దీక్ష)’ను విస్తృతంగా ఉపయోగిస్తాం. విద్యార్థులు, ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ► భవిష్యత్తులో అవసరమైన నైపుణ్యాల సముపార్జనకు ఉపయోగపడేలా త్వరలో జాతీయ స్థాయిలో కొత్త కరిక్యులమ్ విధానాన్ని ప్రారంభిస్తాం. డిసెంబర్ నాటికి ‘నేషనల్ ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ మిషన్’ను ప్రారంభిస్తాం. లాక్డౌన్ కారణంగా విద్యార్థుల్లో ఉత్పన్నమవుతున్న మానసిక సమస్యల పరిష్కారానికి ‘మనోదర్పణ్’ కార్యక్రమాన్ని రూపొందించాము. 5 శాతానికి రాష్ట్రాల రుణ పరిమితి.. షరతులు వర్తిస్తాయి రాష్ట్రాల రుణ పరిమితి ఆ రాష్ట్ర జీడీపీలో 3% వరకు ఉండగా, దాన్ని 2020–21 నుంచి 5 శాతానికి పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. తద్వారా రాష్ట్రాలకు రూ. 4.28 లక్షల కోట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయన్నారు. అయితే, ఇందుకు రాష్ట్రాలు ‘ఒక దేశం– ఒక రేషన్ కార్డ్’, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’, ‘విద్యుత్ సరఫరా’, ‘పట్టణ స్థానిక సంస్థల ఆదాయం’ మొదలైన 4 అంశాల్లో సంస్కరణలను అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉన్న 3% పరిమితి ప్రకారం రాష్ట్రాలకు రూ. 6.41 లక్షల కోట్ల వరకు నికర రుణ పరిమితి ఉంది. ఈ పరిమితిని పెంచాలంటూ ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు ప్రధానికి లేఖలు రాశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రుణ పరిమితి పెంపుపై నిర్ణయం తీసుకున్నట్లు నిర్మల తెలిపారు. ‘3% నుంచి 3.5% వరకు షరతులు ఉండవు. 3.5% నుంచి 4.5% వరకు పరిమితి పెంపు 4 విడతలుగా 0.25% చొప్పున, సంస్కరణల అమలుకు సంబంధించిన షరతుల అమలుపై ఆధారపడి ఉంటుంది. కనీసం మూడు సంస్కరణల అమలును విజయవంతంగా పూర్తి చేసినప్పుడు మిగతా 0.5% పెంపు ఉంటుంది’అని ఆమె వివరించారు. ‘3%లో 75% రుణంగా పొందేందుకు కేంద్రం రాష్ట్రాలకు అనుమతివ్వగా రాష్ట్రాలు అందులో 14% మాత్రమే అప్పుగా పొందాయి. మిగతా 86% నిధులు నిరుపయోగంగానే ఉన్నాయి’అని మంత్రి నిర్మల తెలిపారు. -
ఆర్థిక ప్యాకేజీ.. సాయంత్రం 4గంటలకు వివరాలు
న్యూఢిల్లీ: కరోనాతో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్యాకేజీలో ఏ రంగానికి ఎలాంటి కేటాయింపులు దక్కాయో తెలుసుకునేందుకు దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్యాకేజీ పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ప్యాకేజీలో ఇప్పటికే ఉన్న కొన్ని భూమి, కార్మిక చట్టాలలో సంస్కరణలు ఉంటాయని భావిస్తున్నారు. అంతేకాకుండా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను జంప్‌స్టార్ట్ చేయడానికి అవసరమైన అదనపు లిక్విడిటీ మద్దతు ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. (చదవండి: రెండు నెలల తర్వాత బయటకు) -
రీస్టార్ట్‌కి రెడీ అవుదాం
న్యూఢిల్లీ: కరోనా, లాక్డౌన్లతో దారుణంగా దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం సాయం అందించాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభ్యర్థించారు. తమ రాష్ట్రాల్లో జోన్లను నిర్ధారించే అధికారం తమకే ఉండాలని కోరారు. కరోనా నియంత్రణ, లాక్డౌన్ నిర్వహణ, ఆర్థిక రంగ ఉద్దీపన సహా పలు అంశాలపై సోమవారం ప్రధాని మోదీ రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా అంశాలపై వారి అభిప్రాయాలను తెల్సుకున్నారు. కరోనా మహమ్మారిపై పోరుకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ విషయంలో సమతుల వ్యూహం అవసరమని సీఎంలతో భేటీలో వ్యాఖ్యానించారు. రాష్ట్రాలు ఇచ్చే సూచనల ఆధారంగానే ఆ వ్యూహం రూపొందుతుందన్నారు. లాక్‌డౌన్‌కు సంబంధించి తమ సమగ్ర వ్యూహాలను మే 15 లోగా పంపించాలని ముఖ్యమంత్రులను ప్రధాని కోరారు. గ్రామాలకు విస్తరించవద్దు కరోనా నుంచి భారత్ విజయవంతంగా బయటపడిందన్న భావనలో ప్రపంచం ఉందని మోదీ అన్నారు. ఈ విజయంలో రాష్ట్రాలు నిర్ణయాత్మక పాత్ర పోషించాయని ప్రశంసించారు. కరోనా గ్రామాలకు వ్యాపించకుండా చూడడం అతి పెద్ద సవాలన్నారు. లాక్డౌన్ నిబంధనలను సరిగా పాటించని ప్రాంతాల్లోనే కరోనా వ్యాప్తి చెంది, సమస్యాత్మకంగా మారాయన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఎక్కడున్న వారు అక్కడే ఉంటే మంచిదని, కష్ట సమయంలో తమ వాళ్లతో ఉండాలనుకుంటారు కనుక తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. వ్యాప్తిని తగ్గించే దిశగా దృష్టి పెట్టాలని, ప్రజలు ‘రెండు గజాల దూరం’సహా అన్ని నిబంధనలను పాటించేలా చూడాలని పీఎం కోరారు. ఏ ప్రాంతాల్లో వైరస్ ప్రభావ తీవ్రంగా ఉంది, ఏ ప్రాంతాల్లో వ్యాప్తి చెందే అవకాశాలున్నాయనే విషయంలో స్పష్టమైన సమాచారం కేంద్రం వద్ద ఉందన్నారు. వైరస్‌ను నియంత్రించేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందన్నారు. ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభం దాదాపు ఆరు గంటల పాటు పీఎం–సీఎంల కాన్ఫరెన్స్ కొనసాగింది. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోనున్నాయని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. ఆర్థిక కార్యకలాపాలను పూర్తి స్థాయిలో పునఃప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో వలస కార్మికులు తమ గ్రామాలకు వెళ్లిపోతున్న పరిస్థితుల్లో పారిశ్రామిక కార్యకలాపాల పునరుద్ధరణ ప్రస్తుతం సమస్యగా మారిన అంశం భేటీలో చర్చకు వచ్చింది. అందరు ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకున్న తరువాతనే లాక్‌డౌన్‌ను ఎత్తివేయడమా? లేక కొనసాగించడమా? అనే విషయంపై నిర్ణయం తీసుకోవాలనుకున్నట్లు సీఎంలతో వ్యాఖ్యానించారు. హోం, ఫైనాన్స్, డిఫెన్స్ మంత్రులూ.. భేటీలో హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి(ఆంధ్రప్రదేశ్), చంద్రశేఖర రావు(తెలంగాణ), ఉద్ధవ్ ఠాక్రే(మహారాష్ట్ర) తదితరులు భేటీలో పాలు పంచుకున్నారు. కరోనాకి సంబంధించి పీఎం– సీఎంల మధ్య ఇది ఐదవ వీడియో కాన్ఫరెన్స్. ఈ భేటీలో దాదాపు సీఎంలందరికీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం లభించింది. పొడిగింపునకే మొగ్గు కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో పలువురు సీఎంలు లాక్‌డౌన్‌ను మరోసారి పొడగించాలని ప్రధానికి సూచించారు. ఈ నెల మొత్తం రైలు, విమాన ప్రయాణాలపై నిషేధం కొనసాగించాలని తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులు ప్రధానిని కోరారు. కంటెయిన్మెంట్ ప్రాంతాలను మినహాయించి, దేశ రాజధాని ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. లాక్‌డౌన్‌ను కొనసాగించాలని అస్సాం, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల సీఎంలు కోరారు. సొంత ప్రాంతాలకు ఆకలిదప్పులకు ఓర్చుకుంటూ కాలినడకన వెళ్తున్న వలస కార్మికుల గురించి మెజారిటీ సీఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో వైరస్ ప్రభావం లేని ప్రాంతాల్లో ఎయిర్, రైల్, మెట్రో ప్రయాణాలకు అనుమతించాలని కేరళ సీఎం విజయన్ కోరారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఉండాలన్నారు. లాక్డౌన్ నుంచి వ్యూహాత్మకంగా బయటకు వచ్చే వ్యూహాన్ని జాగ్రత్తగా రూపొందించాల్సి ఉందని పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ కోరారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందించాలన్నారు. దీదీ సీరియస్ కరోనాపై పోరులో పశ్చిమబెంగాల్‌ను అనవసరంగా టార్గెట్ చేస్తున్నారని ఆ రాష్ట్ర సీఎం మమత బెనర్జీ ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ‘బెంగాల్‌ను రాజకీయంగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. సంక్షోభం నుంచి బయటపడేందుకు కేంద్రం ఒక స్పష్టమైన వ్యూహంతో ముందుకు రావాలి’ అని మమత డిమాండ్ చేశారని తెలిపాయి. ఆ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు.. కోవిడ్‌పై పోరు విషయంలో ప్రస్తుతం అవలంబిస్తున్న విధానంలోని వైరుధ్యాలను ఆమె ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. ఒకవైపు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలంటూనే.. మరోవైపు, మినహాయింపుల పేరుతో రైళ్లను నడపడం, రాష్ట్రాల సరిహద్దులను తెరవడాన్ని ఆమె ఆక్షేపించారు. ఏ రంగాలకు మినహాయింపునివ్వాలన్నది క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా రాష్ట్రాలే నిర్ణయించుకోవడం మంచిదన్నారు. ప్రధాని మొదట మాట్లాడిన సీఎంలలో మమత ఒకరని అధికార వర్గాలు తెలిపాయి. -
‘లాక్డౌన్ తర్వాతి ప్లాన్ రూపొందించాలి’
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంతోపాటు కరోనాపై పోరు, లాక్డౌన్ అనంతర పరిస్థితులపై తగు ప్రణాళికతో ప్రధాని మోదీ ముందుకు రావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దేశ ప్రజలకు ప్రధాని స్పష్టమైన అవగాహన కల్పించాలని కోరింది. కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా మాట్లాడుతూ..‘మరోసారి లాక్డౌన్ పెడతారా? ఈ లాక్ డౌన్ ఎంతకాలానికి ముగుస్తుంది? ఈ విషయాలపై ప్రధాని మోదీ 130 కోట్ల దేశ ప్రజలకు స్పష్టతనివ్వాలి’ అని కోరారు. వలస కార్మికులందరినీ రైళ్లలో ఆహారం అందించి ఉచితంగా సొంతూళ్లకు చేర్చాలని కోరారు. -
విదేశీ పెట్టుబడులు ఆకర్షించేది ఎలా..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే చర్యలపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు దేశీయంగా పెట్టుబడులను ప్రోత్సహించేందుకు అనుసరించతగిన వ్యూహాలపై చర్చించేందుకు కేంద్ర మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సమావేశమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పియుష్ గోయల్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. చైనాపై అంతర్జాతీయంగా వ్యతిరేకత వ్యక్తమవుతుండటం, పలు కంపెనీలు ఇతర దేశాలవైపు చూస్తుండటం తదితర పరిణామాల నేపథ్యంలో ఈ అత్యున్నత స్థాయి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫాస్ట్–ట్రాక్ పద్ధతిన విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు, దేశీయంగా వివిధ రంగాలను ప్రోత్సహించేందుకు పాటించతగిన వివిధ వ్యూహాలపై ఇందులో చర్చించినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. అలాగే పెట్టుబడుల ఆకర్షణలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించేలా రాష్ట్రాల ప్రభుత్వాలకు తోడ్పాటు అందించడంపైనా విస్తృతంగా చర్చించినట్లు వివరించింది. ఇన్వెస్టర్లకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి అవసరమైన అనుమతులు అందేలా చూడటం, వారి సమస్యలను పరిష్కరించడం వంటి అంశాల్లో తగు చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. వృద్ధిని వేగవంతం చేసే దిశగా సంస్కరణల పురోగతికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు మోదీ ట్వీట్ చేశారు. -
రెండు నెలల పాటు నో ఎంట్రీ
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికాలోకి కొన్ని రకాలైన వలసలను రానున్న 60 రోజులపాటు నిషేధిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన కోవిడ్ కారణంగా ఉద్యోగ భద్రత కోల్పోతున్న అమెరికన్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడుట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలోకి ఉద్యోగాల కోసం రావాలనుకుంటున్న వారికే ఈ నిషేధ ఉత్తర్వులు వర్తిస్తాయని, ఇప్పటికే అమెరికాలో ఉంటున్న వారికి ఇవి వర్తించవన్నారు. అమెరికన్ల ఉద్యోగాల రక్షణ కోసం అధికారిక ఉత్తర్వులపై సంతకం చేశానన్నారు. కరోనాతో దాదాపు 2 కోట్ల మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారని, వారికి మళ్లీ ఉపాధి కల్పించాల్సి∙ఉందన్నారు. వలసలకు విరామం ఇవ్వడం ద్వారా.. కరోనా ప్రభావం అంతమై, మళ్లీ ఆర్థిక వ్యవస్థ గాడిన పడ్డాక దేశంలో ఉద్యోగ అవకాశాలు మొదట అమెరికన్లకే లభిస్తాయన్నారు. అమెరికన్లకు కాకుండా, కొత్తగా వచ్చిన విదేశీయులకు ఉద్యోగావకాశాలు కల్పించడం అన్యాయమవుతుందన్నారు. 60 రోజుల తర్వాత నిషేధం తొలగించాలా? కొంతకాలం కొనసాగించడమా? అనేది నిర్ణయిస్తామని చెప్పారు. మినహాయింపులు ఈ కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో పలు మినహాయింపులు ఉన్నాయి. ఇవి అమల్లోకి వచ్చిన తేదీ నాటికి అమెరికా వీసా, లేదా గ్రీన్ కార్డ్ ఉన్నవారికి ఈ ఉత్తర్వులు వర్తించబోవు. ఆ తేదీ నాటికి విదేశాల్లో ఉన్న, ఎలాంటి ఇమిగ్రంట్ వీసా కానీ, లేదా వేరే ఏ అధికారిక ట్రావెల్ డాక్యుమెంట్ కానీ లేనివారికే అవి వర్తిస్తాయి. ఉద్యోగ నిమిత్తం అమెరికాకు రావాలనుకుంటున్న వైద్యులు, ఇతర వైద్య సిబ్బందికి, ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో చట్టబద్ధమైన శాశ్వత నివాసితులుగా రావాలనుకుంటున్నవారికి ఈ నిషేధం వర్తించదు. అమెరికన్ల జీవిత భాగస్వాములు, వారి 21 ఏళ్లలోపు పిల్లలు, అమెరికన్లు దత్తత తీసుకోవాలనుకునేవారు నిషేధ పరిధిలోకి రారు. అన్ని రకాల ఇమిగ్రంట్ వీసాలపై తాత్కాలిక నిషేధం విధించబోతున్నట్లు ఇటీవల ట్రంప్ చెప్పడం తెల్సిందే. ఐటీ నిపుణులు, వ్యవసాయ కార్మికుల అందుబాటుపై ఈ నిర్ణయం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పారిశ్రామిక, రాజకీయ వర్గాలు విమర్శించాయి. నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కరోనాను కట్టడి చేయడంలో తన వైఫల్యాన్ని.. ట్రంప్ ఇలా కప్పిపుచ్చుకుంటున్నారని డెమొక్రాట్లు విమర్శలు గుప్పించారు. భారత్ సమీక్ష వలసలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ అమెరికా జారీ చేసిన ఉత్తర్వులను భారత ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఆ ఉత్తర్వులు భారతీయులపై, భారత్–అమెరికాల మధ్య సంబంధాలపై చూపే ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని పేర్కొన్నాయి. -
మార్కెట్‌కు ప్యాకేజ్ బూస్టర్
కరోనా వైరస్ కల్లోలంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకునే చర్యల్లో భాగంగా ఆర్బీఐ కొన్ని లిక్విడిటీ పెంచే చర్యలను తీసుకుంది. దీంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. రూపాయి మారకం పుంజుకోవడం, ప్రపంచ మార్కెట్లు లాభాల్లోనే ట్రేడవడం కలసివచ్చాయి. అమెరికాలో కరోనా కేసుల చికిత్సలో గిలీడ్ ఔషధం మంచి ఫలితాలను చూపిస్తోందన్న వార్తలు సానుకూల ప్రభావం చూపించాయి. ఆరంభ లాభాలను కోల్పోయినప్పటికీ, సెన్సెక్స్ 31,500 పాయింట్లు, నిఫ్టీ 9,250 పాయింట్ల ఎగువున ముగిశాయి. సెన్సెక్స్ 986 పాయింట్ల లాభంతో 31,589 పాయింట్ల వద్దకు చేరింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 274 పాయింట్లు పెరిగి 9,267 పాయింట్ల వద్ద ముగిసింది. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 3.22 శాతం, నిఫ్టీ 3.03 శాతం చొప్పున లాభపడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీలు నెల గరిష్టానికి చేరాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 429 పాయింట్లు, నిఫ్టీ 155 పాయింట్లు చొప్పున పెరిగాయి. స్టాక్ సూచీలు వరుసగా రెండో వారమూ లాభపడ్డాయి. అదిరిపోయే ఆరంభం... సెన్సెక్స్, నిఫ్టీలు ఆరంభంలోనే దుమ్మురేపాయి. ఆర్బీఐ గవర్నర్ ఉదయం గం.10లకు కీలక ప్రకటన చేయనున్నారన్న వార్తల కారణంగా సెన్సెక్స్, నిఫ్టీలు భారీ గ్యాపప్‌తో మొదలయ్యాయి. సెన్సెక్స్ 1,054 పాయింట్లు, నిఫ్టీ 330 పాయింట్ల భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. మ«ధ్యాహ్నం లాభాలు తగ్గినా, రోజంతా ఇదే జోరు కొనసాగింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,116 పాయింట్లు, నిఫ్టీ 331 పాయింట్ల మేర పెరిగాయి. లాభాలకు కారణాల్లో కొన్ని... ఆర్బీఐ లిక్విడిటీ బూస్ట్: పలు చర్యలకు తోడు అవసరమైతే, మరిన్ని చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభయమివ్వడంతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. అంచనాల కన్నా చైనా జీడీపీ బెటర్ : ఈ ఏడాది మొదటి త్రైమాసిక కాలంలో చైనా జీడీపీ 6.8 శాతం తగ్గి్గంది. జీడీపీ గణాంకాలు వెల్లడించినప్పటి నుంచి ఇదే తొలి తగ్గుదల అయినప్పటికీ, అంచనాల కంటే (జీడీపీ 8.2 శాతం తగ్గుతుందన్న అంచనాలున్నాయి)తక్కువగానే జీడీపీ తగ్గడం... ఇన్వెస్టర్లకు ఒకింత ఊరటనిచ్చింది. రెమ్డిసివిర్... సత్ఫలితాలు..! అమెరికా బయోటెక్నాలజీ కంపెనీ గిలీడ్ సైన్సెస్ ఔషధం, రెమ్డిసివిర్....కరోనా చికిత్సలో మంచి ఫలితాలు చూపిస్తోందన్న వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. లాభాల్లో ప్రపంచ మార్కెట్లు చైనా జీడీపీ అంచనాల కంటే తక్కుగానే తగ్గడం, కరోనా చికిత్సలో అమెరికా ఔషధం సత్ఫలితాలనిస్తుండటం, అమెరికాతో సహా పలు యూరప్ దేశాలు లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తేయనుండటం.. ఈ కారణాలన్నింటి కారణంగా ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి. రూ.3 లక్షల కోట్ల లాభం మార్కెట్ భారీ లాభాలతో ఇన్వెస్టర్ల సంపద రూ. 3 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 2.83 లక్షల కోట్ల పెరిగి రూ. 123.50 లక్షల కోట్లకు ఎగసింది. -
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతాం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎవరూ ఊహించని అనిశ్చిత స్థితిలో ప్రపంచం ప్రస్తుతం కొట్టుమిట్టాడుతోందని, ఆరోగ్యరంగంలో మౌలిక వసతులను పటిష్టం చేయడం ద్వారా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సీఈఓ క్లబ్ హైదరాబాద్‌కు చెందిన సుమారు వంద మంది ముఖ్యులతో కేటీఆర్ శనివారం వీడియో కాల్ ద్వారా సంభాషించారు. లాక్డౌన్ ప్రభావంతో పాటు, వ్యాపార వాణిజ్య కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. వైరస్ వ్యాపిస్తున్న తీరును బట్టి రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాన్ని మార్చుకుంటోందని, సరైన సమయంలో అప్రమత్తమై దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడాన్ని సరైన చర్యగా అభివర్ణించారు. కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సర్వ శక్తులూ ఒడ్డుతోందని, సమాజంలో అట్టడుగు వర్గాల పట్ల అత్యంత శ్రద్ధ చూపుతోందన్నారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు వివిధ రంగాలకు చెందిన నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతుందని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. లైఫ్ సైన్సెస్ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరిగి వేగం పుంజుకోవడంలో దోహదం చేస్తుందన్నారు. సీఈఓలు పేర్కొన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత మేర పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఈఓలు అభినందించారు. -
మరో ఉద్దీపనపై కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ దెబ్బతో కుదేలవుతున్న ఆర్థి క వ్యవస్థ స్థితిగతులను సమీక్షించేందుకు కేంద్ర ఆర్థి క మంత్రి నిర్మలా సీతారామన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సమావేశమయ్యారు. ఎకానమీ పరిస్థితులను సమీక్షించడంతో పాటు దెబ్బతిన్న రంగాలకు మరో ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చే అంశాన్ని ఇందులో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, భవిష్యత్‌లో సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన వనరుల సమీకరణ అంశం కూడా చర్చకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. లఘు సంస్థలు, వ్యవసాయం, ఆతిథ్యం, పౌర విమానయానం తదితర అన్ని రంగాలన్నీ .. కరోనా వైరస్ మహమ్మారిపరంగా తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కరోనా దెబ్బతో భారత స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సున్నా స్థాయికి కూడా పడిపోయే అవకాశం ఉందంటూ పలు అంతర్జాతీయ ఏజెన్సీలు నివేదికలు ఇస్తున్నాయి. దీంతో లాక్డౌన్ ముగిశాక ఎకానమీని సాధ్యమైనంత త్వరగా పట్టాలమీదికి ఎక్కించేందుకు తీసుకోతగిన చర్యలు సిఫార్సు చేసేందుకు కేంద్రం ప్రత్యేకంగా ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అతనూ చక్రవర్తితో అత్యున్నత స్థాయి కమిటీ వేసింది. వివిధ రంగాలకు ఉద్దీపనలతో పాటు బడుగు వర్గాల సంక్షేమానికి చర్యల గురించి కూడా ఈ కమిటీ సిఫార్సు చేయనుంది. -
నా జీవితంలో అతి పెద్ద నిర్ణయం
కంటికి కనిపించని శత్రువు కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్న దేశ ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టడానికి ఆంక్షల్ని ఎత్తి వేయడం పెను సవాల్‌గా మారిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆ నిర్ణయమే తన జీవితంలో అతి పెద్దదన్న ట్రంప్ దానిని ఎప్పుడు తీసుకుంటారో వెల్లడించలేదు. కోవిడ్ –19 దెబ్బతో అగ్రరాజ్యం సంక్షోభంలో పడిపోయింది. దేశంలోని 33 కోట్ల మందిలో 95 శాతానికి పైగా ఇళ్లకే పరిమితమయ్యారు. కొద్ది వారాల్లోనే 1.7 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. వైట్ హౌస్‌లో శుక్రవారం ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ ప్రజల్ని ఇల్లు కదలవద్దన్న ఆంక్షల్ని ఎత్తి వేయడమే తాను జీవితంలో తీసుకోబోయే అతి పెద్ద నిర్ణయమని వ్యాఖ్యానించారు. దేశాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టాలంటే ప్రజలందరూ మళ్లీ పనుల్లోకి రావాలని, దానికి తగిన సమయం కోసం చూస్తున్నామని అన్నారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికి ఆ దేవుడిపైనే భారం వేశారు. అయితే కచ్చితంగా ఆ నిర్ణయం నేను నా జీవితంలో తీసుకునే అతి పెద్ద నిర్ణయం అవుతుంది’అని ట్రంప్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
లాక్డౌన్ పొడిగింపునకే మొగ్గు!
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రక్కసిని పూర్తిగా అంతమొందించేందుకు ఏప్రిల్ 14వ తేదీ తరువాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన సంకేతాలిచ్చారు. లాక్‌డౌన్‌ను కనీసం 2 వారాలైనా కొనసాగించేందుకు దాదాపు అన్ని రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో ఉన్నట్లు స్పష్టమవుతోందని ప్రధాని పేర్కొన్నారు. కోవిడ్ –19పై పోరులో ముందుండి పోరాడుతున్న వైద్యులు, ఇతర శాఖల సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలను తగినన్ని అందుబాటులో ఉంచుతామని ప్రధాని సీఎంలకు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లాక్డౌన్ కారణంగా కుదేలయిన రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను ఆదుకునేందుకు, కోవిడ్–19పై పోరు కొనసాగించేందుకు కేంద్రం సాయం అందించాలని పలువురు సీఎంలు ప్రధానిని అభ్యర్థించారు. కరోనా వైరస్ వ్యాప్తిని సంపూర్ణంగా అడ్డుకునేందుకు లాక్‌డౌన్‌ను కొనసాగించడమే అత్యుత్తమ, ఏకైక మార్గమని పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు అమరీందర్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్ ప్రధానికి సూచించారు. ఏప్రిల్ ఆఖరు దాకా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని వారు ప్రధానికి సూచించారు. పంజాబ్, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ తెల్లని వస్త్రంతో చేసిన మాస్క్‌ను ధరించగా, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కూడా మాస్క్‌లతో ఈ భేటీలో పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏ మేరకు ఫలితాలను ఇచ్చాయన్నది రానున్న 3, 4 వారాల్లో తేలుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు. వైరస్‌ను పూర్తిగా రూపుమాపేందుకు రానున్న 3, 4 వారాలు అత్యంత కీలకమన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో మమతా బెనర్జీ (బెంగాల్), యోగి ఆదిత్యనాథ్(ఉత్తరప్రదేశ్), ఉద్ధవ్ ఠాక్రే(మహారాష్ట్ర), ఎంఎల్ ఖట్టర్(హరియాణా), నితీశ్‌కుమార్(బిహార్) తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కొన్ని ఆంక్షల సడలింపుతో లాక్‌డౌన్‌ను కొనసాగించనున్నారన్న వార్తల నేపథ్యంలో శనివారం ఉదయం 11 గంటలకు ఈ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ప్రాణాలూ ముఖ్యమే.. అభివృద్ధీ ముఖ్యమే మొదట లాక్డౌన్ ప్రకటించినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వాల ప్రాథామ్యమని చెప్పామని, అయితే, ఇప్పుడు ప్రభుత్వాల లక్ష్యం ప్రాణాలను కాపాడటంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడటం కూడా అని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘లాక్డౌన్ ప్రకటిస్తున్న సమయంలో ప్రాణాలు ఉంటేనే అభివృద్ధి అన్నాను. నా మాటలను అర్థం చేసుకున్న దేశప్రజలు లాక్డౌన్ నిబంధనలను అద్భుతంగా పాటించారు. ఇప్పుడు ప్రాణాలతో పాటు దేశాభివృద్ధిపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది’ అన్నారు. కరోనా కట్టడిలో కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తున్నాయన్నారు. ఔషధాలు, నిత్యావసర వస్తువులు తగినన్ని అందుబాటులో ఉన్నాయని, వాటిని అక్రమంగా నిల్వ చేస్తే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. వైద్య సిబ్బంది, ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్ విద్యార్థులపై దాడులను ప్రధాని ఖండించారు. కోవిడ్ 19కి చికిత్స లేనందున భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం తప్పని సరి అని ప్రధాని పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్లలో రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దేశం అన్ని రంగాల్లో స్వయం సమృద్ధం కావడానికి ఈ సంక్షోభాన్ని ఉపయోగించుకోవాలన్నారు. -
చమురు ఉత్పత్తి కోతకు డీల్...
లండన్: డిమాండ్ పడిపోయిన నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు మరింత పతనమై, తమ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలకుండా ముడిచమురు ఉత్పత్తి దేశాలు అసాధారణ చర్యలు తీసుకుంటున్నాయి. రేట్ల పతనానికి అడ్డు కట్ట వేసే దిశగా ఉత్పత్తిని భారీగా తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఉత్పత్తి దేశాలన్నీ దీనిపై ఒక అంగీకారానికి వచ్చినట్లు సుదీర్ఘంగా సాగిన వర్చువల్ సమావేశం అనంతరం పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్ వెల్లడించింది. ఈ డీల్ ప్రకారం జూలై దాకా ఒపెక్, దాని భాగస్వామ్య దేశాలు చమురు ఉత్పత్తిని రోజుకు 10 మిలియన్ బ్యారెళ్ల మేర (బీపీడీ) తగ్గించుకోనున్నాయి. ఆ తర్వాత నుంచి డిసెంబర్ దాకా 8 మిలియన్ బీపీడీకి, 2021 నుంచి 16 నెలల పాటు 6 మిలియన్ బీపీడీకి పరిమితం చేయనున్నాయి. తొలుత ఈ డీల్‌కు ఒప్పుకోకపోయినప్పటికీ ఉత్పత్తి కోతతో తమకు వాటిల్లే నష్టాలను భర్తీ చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భరోసా ఇవ్వడంతో మెక్సికో కూడా అంగీకారం తెలిపింది. అమెరికాతో పాటు మరిన్ని దేశాలు కూడా తమవంతుగా ఉత్పత్తి కోతలను పరిశీలిస్తున్నాయి. తాజా డీల్‌తో ప్రపంచవ్యాప్తంగా చమురు ఉత్పత్తిలో 15 శాతానికి కోతపడవచ్చని విశ్లేషకుల అంచనా. ఇటు పరిమాణంపరంగాను, అటు ఉత్పత్తి కోతలో భాగమవుతున్న దేశాల సంఖ్యాపరంగాను ఇది అసాధారణమని తెలిపారు. ఇంధన రంగంలో బద్ధవిరోధులైన దేశాలు కూడా ఇందులో పాలు పంచుకోవడం విశేషమని పేర్కొన్నారు. ఇది సరిపోదు.. అయితే, భారీగా పడిపోయిన క్రూడాయిల్ డిమాండ్‌పరమైన నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రతిపాదిత కోతలేమీ సరిపోయే అవకాశాలు లేవని విశ్లేషకులు చెప్పారు. ఇప్పటికే నిల్వలు భారీగా పేరుకుపోయాయని, ఉత్పత్తి కోతలపై ఆయా దేశాలు ఆలస్యంగా నిర్ణయాలు తీసుకున్నాయని పేర్కొన్నారు. ఒకవేళ ఉత్తర అమెరికన్ సంస్థలు 5 మిలియన్ బ్యారెళ్ల మేర ఉత్పత్తిని తగ్గించుకున్నా.. ఇంకా 5–10 మిలియన్ బీపీడీ మేర సరఫరా అధికంగానే ఉంటుందని అంచనా. ఏప్రిల్‌లో సరఫరా, డిమాండ్ మధ్య 27.4 మిలియన్ బీపీడీ స్థాయిలో అసమతౌల్యత ఉంటుందని రీసెర్చ్ సంస్థ రైస్టాడ్ ఎనర్జీ అంచనా. డిమాండ్‌కి మించి సరఫరా! కరోనా వైరస్ వ్యాప్తితో చమురు డిమాండ్, ధరలపైనా ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో ఉత్పత్తి తగ్గించుకోవాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే, దీని వల్ల అమెరికన్ సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందనే ఉద్దేశంతో, తన మార్కెట్ వాటాను కాపాడుకునేందుకు రష్యా అంగీకరించలేదు. ఇది సౌదీ అరేబియాకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఉత్పత్తిని భారీగా పెంచేసి రేట్లను తగ్గించేయడం ద్వారా ధరలపరమైన పోరుకు తెరతీసింది. అప్పట్నుంచి రేట్ల పతనం మొదలైంది. రేట్లు పడిపోవడంతో చాలా దేశాలు చౌకగా చమురు కొనుగోళ్లకు ఎగబడి నిల్వ చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు స్టోరేజీలో సగటున 79 శాతం దాకా నిండుగా ఉందని అంచనా. 7.4 బిలియన్ బ్యారెళ్ల చమురు, తత్సంబంధ ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయని.. ఇవి కాకుండా 1.3 బిలియన్ బ్యారెళ్లు రవాణాలో ఉన్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. 2020లో గరిష్ట.. కనిష్టాలు... నిజానికి 2020 తొలి మూడు నెలల్లోనే అంతర్జాతీయంగా క్రూడ్ ధర భారీ ఎగువ, దిగువ స్థితులను చూడ్డం గమనార్హం. అంతక్రితం మూడు నెలల నుంచీ క్రూడ్ ధర అప్‌ట్రెండ్‌లోనే ఉంది. జనవరిలో అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ మరణించడం, ఆ తర్వాత భౌగోళిక ఉద్రిక్త పరిణామాలు చోటుచేసుకోవడంతో ముడిచమురు రేటు ఒక్కసారిగా ఎగిసింది. అప్పటికి 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. అయితే ఆ వెంటనే.. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు, క్రూడ్ ఉత్పత్తికి భయంలేదన్న సంకేతాలు.. తత్సబంధ పరిణామా లతో క్రమంగా చల్లారింది. అటు తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావంతో క్రూడ్ ధర మరికొంత చల్లారగా, రష్యా–సౌదీ అరేబియాల మధ్య మార్చి మొదటి వారంలో చోటుచేసుకున్న ‘ధరల యుద్ధం’తో 19 సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది. ఈ మూడు నెలల కాలంలో ధరల పరిస్థితిని చూస్తే, అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో నైమెక్స్ లైట్ స్వీట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 66.6–19.27 డాలర్ల గరిష్ట, కనిష్ట స్థాయిలను చూడగా, బ్రెంట్ క్రూడ్ ధర 75.6–21.65 డాలర్ల గరిష్ట, కనిష్ట స్థాయిల్లో తిరుగాడాయి. శుక్రవారం గుడ్‌ఫ్రైడే సెలవు రోజు కాగా, గురువారం ట్రేడింగ్‌లో నైమెక్స్ లైట్ స్వీట్ క్రూడ్ ధర 23.21 డాలర్ల వద్ద ముగియగా, బ్రెంట్ 31.82 డాలర్ల వద్ద ఉంది. తాజా డీల్ నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ సందర్భంగా క్రూడ్ ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
లాక్‌డౌన్‌తో ఉద్యోగాలకు ముప్పు
న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్‌తో దేశ ఎకానమీపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. వీటితో భారీగా ఆదాయాలు, డిమాండ్ పడిపోవడంతో పాటు గణనీయంగా ఉద్యోగాల కోతలు కూడా ఉంటాయని కార్పొరేట్లు భావిస్తున్నారు. కంపెనీల సీఈవోలతో పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వివిధ రంగాల సంస్థలకు చెందిన సుమారు 200 మంది సీఈవోలు ఇందులో పాల్గొన్నారు. ‘గత త్రైమాసికంతో (జనవరి–మార్చి) పోలిస్తే ప్రస్తుత క్వార్టర్లో (ఏప్రిల్–జూన్) ఆదాయాలు 10 శాతం, లాభాలు 5 శాతం పైగా తగ్గిపోతాయని మెజారిటీ సంస్థలు భావిస్తున్నాయి. జీడీపీ వృద్ధిపై కరోనా ఏ మేరకు ప్రభావం చూపబోతోందన్నది ఇది తెలియజేస్తోంది. సర్వేలో పాల్గొన్న 52 శాతం సంస్థలు.. తమ తమ రంగాల్లో గణనీయంగా ఉద్యోగాల్లో కోతలు ఉంటాయని అంచనా వేస్తున్నాయి’ అని సీఐఐ వెల్లడించింది. -
సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆర్థిక చేయూత కావాలి...
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం చేయూతనివ్వాలని దేశీయ పరిశ్రమలు కేంద్రాన్ని కోరాయి. రుణ చెల్లింపులపై మారటోరియం విధించడం, పన్నుల తగ్గింపు, ప్రజలకు రూ.2లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనలు అందించాలని సూచించాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా వైరస్ రాకముందే మందగమనంలో ఉంది. గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఏడేళ్ల కనిష్ట స్థాయి 4.7 శాతానికి పడిపోయింది. తాజాగా కరోనా వైరస్‌తో దేశవ్యాప్తంగా అన్నీ మూతేయాల్సి వస్తుండడంతో ఆర్థిక వృద్ధి మరింత పడిపోయే ప్రమాదం ఉంది. విధానపరమైన చర్యలను ప్రభుత్వం వెంటనే అమల్లోకి తీసుకురాకపోతే 2020–21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 5 శాతం లోపునకు పడిపోవచ్చంటూ దేశీయ పరిశ్రమలు ఆందోళన వ్యక్తం చేశాయి. ద్రవ్య, పరపతి పరమైన ఉద్దీపన చర్యలను తక్షణమే ప్రకటించాలని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కోరారు. దేశ జీడీపీలో ఒక శాతానికి సమానమైన రూ.2 లక్షల కోట్లను పేదలకు ఆధార్ ఆధారిత ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో అందించాలని సీఐఐ కోరింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. స్టాక్ మార్కెట్లలో అస్థిరతలను తగ్గించేందుకు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును తొలగించడాన్ని పరిశీలించాలని.. అలాగే, డివిడెండ్ పంపిణీ పన్నును 25 శాతంగా నిర్ణయించాలని కోరింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడంతోపాటు, వసూలు కాని రుణాలను ఎన్పీఏలుగా గుర్తించడానికి ప్రస్తుతమున్న 90 రోజుల గడువును తాత్కాలికంగా అయినా 180 రోజులకు పెంచాలని సీఐఐ సూచనలు చేసింది. ఏడాది చివరి వరకు విరామం.. కార్పొరేట్ కంపెనీలు, వ్యక్తులకు రుణ చెల్లింపులపై ఈ ఏడాది చివరి వరకు మారటోరియం (విరామం) ప్రకటించాలని అసోచామ్ కోరింది. ఎల్ఐసీ ద్వారా వెంటనే ఎన్‌బీఎఫ్‌సీలకు నిధులను అందించాలని సూచించింది. మన దేశంపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న అసోచామ్.. దురదృష్టవశాత్తూ దేశ రుణ మార్కెట్ బలహీనంగా ఉన్న, ఆర్థిక వ్యవస్థ మందగమనం సమయంలో ఈ సంక్షోభం వచ్చిందని వ్యాఖ్యానించింది. -
కరోనాపై ఆర్బీఐ ‘వార్’..!!
ముంబై: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా రిజర్వ్ బ్యాంక్ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంది. మార్చి 19 నుంచే వ్యాపార విపత్తు ప్రణాళిక (బీసీపీ)ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ముంబైలోని ఒక రహస్య ప్రదేశంలో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసింది. కేవలం 24 గంటల వ్యవధిలో వార్ రూమ్ అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్బీఐ అధికారి ఒకరు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్‌కు చెందిన 90 మంది కీలక సిబ్బందితో పాటు ఇతరత్రా విభాగాలకు చెందిన 60 మంది ముఖ్యమైన ఉద్యోగులు, ఫెసిలిటీ స్టాఫ్ 70 మంది ఇందులో విధులు నిర్వర్తిస్తుంటారని పేర్కొన్నారు. ఈ వార్ రూమ్ .. ప్రత్యేకంగా డెట్ నిర్వహణ, రిజర్వుల నిర్వహణ, ద్రవ్యపరమైన కార్యకలా పాలు పర్యవేక్షిస్తుందని అధికారి తెలిపారు. బీసీపీ కింద నగదు బదిలీ లావాదేవీ సేవలైన రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్), స్ట్రక్చర్డ్ ఫైనాన్షియల్ మెసేజింగ్ సిస్టమ్ (ఎస్‌ఎఫ్‌ఎంఎస్) మొదలైనవి పర్యవేక్షిస్తారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సేవలకు సంబంధించిన ఈ–కుబేర్, ఇంటర్‌బ్యాంక్ లావాదేవీల్లాంటివి కూడా వీటిలో ఉంటాయని వివరించారు. ప్రపంచంలోనే తొలిసారి.. ‘ఒక కేంద్రీయ బ్యాంకు ఇలాంటి బీసీపీని అమలు చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. చరిత్రలో కూడా ఇదే తొలిసారి. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కూడా ఇలాంటివి ఏర్పాటు కాలేదు‘ అని అధికారి వివరించారు. ‘సాధారణంగా సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ సమస్యలు, అగ్నిప్రమాదాలు, ప్రకృతి విపత్తులు మొదలైన వాటికి మాత్రమే బీసీపీ లాంటిది ఉంటుంది. కానీ కరోనా వైరస్ మహమ్మారితో యుద్ధంలో ఆర్బీఐ ప్రకటించిన బీసీపీ లాంటిది మరెక్కడా లేదు‘ అని చెప్పారు. దేశవ్యాప్తంగా 31 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు, ప్రధాన కార్యాలయంలో 14,000 మంది పైగా సిబ్బంది ఉన్నారు. అత్యంత కీలక కార్యకలాపాలను 1,500 మంది దాకా సిబ్బంది నిర్వహిస్తుంటారు. ప్రధాన కార్యాలయంలో 2,000 దాకా సిబ్బంది ఉండగా.. గత వారం రోజులుకాగా కేవలం 10% మందే విధులకు హాజరవుతున్నారు. ఇలా ఏర్పాటు చేశారు.. వార్ రూమ్ ఏర్పాటు చేసిన తీరుతెన్నులను అధికారి వివరించారు. 150 మంది ఆర్బీఐ సిబ్బంది, 60 మంది సర్వీస్ ప్రొవైడర్లు, 70 శాతం మంది ఫెసిలిటీ స్టాఫ్ (మెయింటెనెన్స్, సెక్యూరిటీ, కిచెన్, ఫ్రంట్ డెస్క్, అడ్మినిస్ట్రేషన్ వంటి విభాగాల వారు)కి సరిపడే ఒక భవంతిని ఆర్బీఐ తీసుకుంది. ఈ సిబ్బంది అందరూ నిరంతరం ఆ భవంతిలోనే ఉంటారు. తీవ్ర విపత్తు పరిస్థితులైతే తప్ప బైటికి రావడానికి ఉండదు. వారందరికీ అవసరమైన వాటిని అత్యంత పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తూ, సరఫరా చేసేందుకు ప్రత్యేక సిబ్బంది ఉంటారు. రెండు బ్యాచ్‌ల కింద వార్ రూమ్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారు. నోట్లను ముట్టుకుంటే చేతులు కడుక్కోండి: ఐబీఏ కరోనా మహమ్మారి నేపథ్యంలో కరెన్సీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) ప్రజలకు విజ్ఞప్తి చేసింది. నోట్లను లెక్కపెట్టిన తర్వాత, ముట్టుకున్న తర్వాత తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలంటూ సూచించింది. సాధ్యమైనంత వరకూ బ్యాంకు శాఖలకు వెళ్లకుండా ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్‌ను వినియోగించాలని కోరింది. ఇందుకు ‘కరోనా సే డరో న, డిజిటల్ కరో నా‘ (కరోనాతో భయం వద్దు.. డిజిటల్ సర్వీసులు ఉపయోగించుకోండి) అనే ప్రచార కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. -
బంగారం... 1,300 డాలర్లకు వచ్చే అవకాశం!
అంతర్జాతీయంగా తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదురయితే, పసిడి ధర వేగంగా పెరగడం సహజం. ఆర్థిక వ్యవస్థపై నిజానికి కోవిడ్–19(కరోనా) వైరస్ ప్రభావం కారణంగా అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్–నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర ఈ నెల మొదట్లో పసిడి ఎనిమిదేళ్ల గరిష్టం 1,704 డాలర్లను తాకింది. అయితే అటు తర్వాత పెట్టుబడులకు సురక్షిత సాధనంగా భావించే ఈ మెటల్ నుంచీ డబ్బును ఇన్వెస్టర్లు ఉపసంహరించి డాలర్లోకి పంప్ చేయడం ప్రారంభించారు. దీనితో ఆరు ప్రధాన కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 103 స్థాయి దాటేసింది (52 వారాల కనిష్టం 95.61). పసిడి 20వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 1,501 డాలర్ల వద్ద ముగిసింది. ఒక దశలో 1,460 డాలర్ల స్థాయినీ చూసింది. పసిడి 52 వారాల కనిష్టం 1,266 డాలర్లు. బులిష్ ధోరణే...: భారీగా పెరిగిన పసిడి నుంచి ప్రస్తుతం లాభాల ఉపసంహరణే జరుగుతోంది తప్ప, మెటల్ బేరిష్ ధోరణిలోకి వెళ్లలేదన్నది పలువురి అభిప్రాయం. ఒకవేళ అలా అయినా మహాఅయితే మరో 150 డాలర్లు పతనం కావచ్చని, 1,360, 1,300 డాలర్లు పసిడికి పటిష్ట మద్దతని వాదనలు ఉన్నాయి. పసిడి కొనుగోళ్లకు ఇది సువర్ణ అవకాశమని యూబీఎస్ గ్రూప్‌లో కమోడిటీ, విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వానీ గార్డెన్ పేర్కొంటున్నారు. పలు సెంట్రల్ బ్యాంకులు సరళతర ఆర్థిక విధానాలు అనుసరిస్తున్న నేపథ్యంలో తిరిగి పసిడి భారీగా పెరగడం ఖాయమన్నది ఆయన విశ్లేషణ. కరోనా ప్రభావంతో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమై కరెన్సీ యుద్ధం ప్రారంభమయిన పక్షంలో పసిడే ఇన్వెస్టర్లకు ఏకైక పెట్టుబడి సాధనమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. -
అంతర్జాతీయ అంశాలే నడిపిస్తాయ్..
ముంబై: కోవిడ్–19(కరోనా వైరస్) తాజా పరిణామాలు, ఏజీఆర్ అంశం వంటి పలు కీలక అంశాలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ గురించి ఎప్పుడు ఏం వినాల్సి వస్తుందో అనే అంశంపైనే మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. చైనాలోని వూహాన్లో ఉద్భవించిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న నేపథ్యంలో పరిశ్రమలు మూత పడి ఆర్థిక వ్యవస్థ మరింత మందగమనంలోకి జారిపోవచ్చనే భయాలు పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ మరణాల సంఖ్య ఇప్పటికే 1,500 దాటిపోవడం, వూహాన్లో అసలు ఏం జరుగుతుందో ప్రపంచానికి అందించాలనుకున్న ఇద్దరు జర్నలిస్ట్‌ల ఆచూకీ తెలియకుండా పోవడం వంటి పరిణామాలు సోమవారం ట్రేడింగ్‌పై ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇక అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌ను అడ్డుకోవడం సమీప భవిష్యత్తులో సాధ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తేల్చి చెప్పిన కారణంగా మార్కెట్ గమనానికి ఇది అత్యంత కీలకంగా మారిపోయిందని ట్రేడింగ్ బెల్స్ సీనియర్ అనలిస్ట్ సంతోష్ మీనా అన్నారు. ఇప్పటికే 28 దేశాలకు వ్యాపించి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈ వైరస్ సూచీల ప్రయాణానికి అతి పెద్ద సవాలుగా మారిందని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోడీ అన్నారు. క్రూడ్ ధర పెరిగింది ముడి చమురు ధరలు గడిచిన 5 ట్రేడింగ్ సెషన్లలో నాలుగు రోజులు లాభపడ్డాయి. వీక్ ఆన్ వీక్ ఆధారంగా న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 5 శాతం మేర పెరిగింది. శుక్రవారం 1.76 శాతం లాభపడి 57.33 డాలర్లకు చేరుకుంది. కరోనా వైరస్ కారణంగా క్రూడ్ ధరల్లో పెరుగుదల నమోదైంది. ఇది ఇలానే కొనసాగితే మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని దలాల్ స్ట్రీట్ పండితులు చెబుతున్నారు. ఇక డాలరుతో రూపాయి మారకం విలువ 71.36 వద్దకు చేరుకుంది. బడ్జెట్ తరువాత నుంచి 71.10–71.50 శ్రేణిలోనే కదలాడుతోంది. అవెన్యూ సూపర్‌మార్ట్ (డీమార్ట్) స్టేక్ సేల్‌లో ఎఫ్ఐఐ నిధులు ఉండనున్నందున ఈ వారంలో రూపాయి మారకం విలువకు మద్దతు లభించే అవకాశం ఉందని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కరెన్సీ రీసెర్చ్ రాహుల్ గుప్తా విశ్లేషించారు. ఆర్థిక అంశాల ప్రభావం.. ఫెడ్ జనవరి పాలసీ సమావేశం మినిట్స్‌ను ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) ఈనెల 20న (గురువారం) ప్రకటించనుంది. ఇదే రోజున ఆర్బీఐ మినిట్స్ వెల్లడికానున్నాయి. అమెరికా తయారీ పీఎంఐ, సర్వీసెస్ పీఎంఐ 21న వెల్లడికానున్నాయి. ఫిబ్రవరిలో ఎఫ్‌పీఐ నిధులు రూ. 24,617 కోట్లు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటి వరకు మన క్యాపిటల్ మార్కెట్లో రూ. 24,617 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఫిబ్రవరి 1–14 కాలంలో వీరు స్టాక్ మార్కెట్లో రూ. 10,426 కోట్లు, డెట్ మార్కెట్లో రూ. 14,191 కోట్లు ఇన్వెస్ట్‌చేసినట్లు డిపాజిటరీల డేటా పేర్కొంది. ఈ వారంలో ట్రేడింగ్ 4 రోజులే.. మహా శివరాత్రి సందర్భంగా శుక్రవారం (21న) దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలు సెలవు ప్రకటించాయి. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. -
‘కరోనా’, గణాంకాలు కీలకం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ పరిణామాలు, ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. వీటితో పాటు ఈ వారంలో వెలువడే కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, ప్రపంచ మార్కెట్ల పోకడ, దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి తదితర అంశాలు కూడా స్టాక్ మార్కెట్ కదలికలకు కీలకమని వారంటున్నారు. కరోనా కలకలం... కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య ఆదివారం నాటికి చైనాలో 811కు పెరిగింది. ఇది 2002–03లో ప్రబలిన సార్స్ వైరస్ మరణాల కంటే అధికం. కరోనా వైరస్ 25 దేశాలకు విస్తరించిందని, 37,000 మంది ఈ వైరస్ బారిన పడ్డారని అంచనా. కరోనా వైరస్‌కు సంబంధించిన ఏమైనా ప్రతికూల వార్తలు వస్తే, మార్కెట్‌పై ప్రభావం తీవ్రంగానే ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంచనాలను మించే కరోనా కల్లోలం ఉండే అవకాశాలున్నాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి. గణాంకాల ప్రభావం... ఈ నెల 12న డిసెంబర్ నెల పారిశ్రామికోత్పత్తి, జనవరి నెల రిటైల్ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడతాయి. ఇక శుక్రవారం(ఈనెల14న) జవనరి నెల టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. ఈనెల 11 (మంగళవారం)న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. చివరి దశ క్యూ3 ఫలితాలు... డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు చివరి దశకు వచ్చాయి. ఈ వారంలో 2,000కు పైగా కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. దీంట్లో నిఫ్టీ సూచీలోని 9 కంపెనీలున్నాయి. గెయిల్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, బీపీసీఎల్, వొడాఫోన్ ఐడియా, నాల్కో, భెల్, ఆయిల్ ఇండియా, హిందాల్కో, నెస్లే ఇండియా, పీఎఫ్సీ, సెయిల్, అశోక్ లేలాండ్, తదితర కంపెనీలు ఈ వారంలోనే ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తున్నాయి. కరోనాపై మార్కెట్ కన్ను...: వృద్ధి పుంజుకుంటుందని స్పష్టంగా తేలేదాకా, మార్కెట్ పరిమిత శ్రేణిలోనే కదలాడుతుందని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ సిద్ధార్థ ఖేమ్కా అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్ సంబంధిత పరిణామాలను మార్కెట్ జాగ్రత్తగా గమనిస్తోందని పేర్కొన్నారు. వృద్ధి బాగా ఉండగలదన్న అంచనాలున్న రంగాల షేర్లు పుంజుకుంటాయని వివరించారు. బడ్జెట్, ఆర్బీఐ పాలసీ, కీలక కంపెనీల క్యూ3 ఫలితాలు వంటి ముఖ్యమైన అంశాలు ముగిశాయని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ పేర్కొన్నారు. ఇక మార్కెట్ వాస్తవిక అంశాలకు సర్దుబాటు అవుతుందని వ్యాఖ్యానించారు. సమీప భవిష్యత్తులో కరోనా వైరస్ సంబంధిత పరిణామాలే మార్కెట్‌కు కీలకమని వివరించారు. కరోనాకు సంబంధించి ప్రపంచ మార్కెట్ల ప్రతిస్పందన మన మార్కెట్‌ను ప్రభావితం చేస్తుందని శామ్కో ఎనలిస్ట్ ఉమేశ్ గుప్తా పేర్కొన్నారు. వరుసగా ఆరో నెలా ఎఫ్‌పీఐల పెట్టుబడులు భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడుల ప్రవాహం వరుసగా ఆరో నెలా కొనసాగుతోంది. డిపాజిటరీల డేటా ప్రకారం.. ఫిబ్రవరి 3–7 మధ్య ఎఫ్‌పీఐలు డెట్ సెగ్మెంట్లో రూ. 6,350 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అయితే, ఇదే వ్యవధిలో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ. 1,173 కోట్లు ఉపసంహరించుకున్నారు. నికరంగా రూ. 5,177 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. చైనా ఎకానమీ, ప్రపంచ వృద్ధిపై కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో భారత్ వంటి వర్ధమాన మార్కెట్లపై ఎఫ్‌పీఐలు ఆచితూచి వ్యవహరిస్తున్నారని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ సీనియర్ ఎనలిస్టు మేనేజరు హిమాంశు శ్రీవాస్తవ తెలిపారు. -
సంపన్నుల సేవ ఇంకెంతకాలం?
ప్రభుత్వరంగ సంస్థల్లో అధిక పెట్టుబడులు పెట్టడానికి బదులుగా తరుగుతున్న రాబడులకు పరిష్కారంగా భారత ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణే ఏకైక మార్గం అనే మార్గంలో ప్రయాణిస్తోంది. ఈ ప్రక్రియలో ఉన్న ప్రమాదాలు వెనువెంటనే అవగతం కాకపోవచ్చు కానీ దేశంలో సంపన్నులకు, పేదలకు మధ్య అంతరం మరింత పెరగడం మాత్రం ఖాయం. సమాజంలో అశాంతికి, ఆందోళనలకు సంపదల మధ్య అగాథ పూరితమైన అంతరమే కారణమని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని ఒక శాతం సంపన్న భారతీయులు సమాజంలో అట్టడుగున ఉన్న 95.3 కోట్లమంది లేక మొత్తం జనాభాలో 70 శాతం మంది నిర్భాగ్యుల సంపద కంటే నాలుగు రెట్లు అధిక సంపద పోగేసుకున్నారు. మన దేశంలో 63 మంది బిలియనీర్ల మొత్తం సంపద 2018–19 కేంద్ర బడ్జెట్ కంటే ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో అతికొద్దిమంది సంపన్నులకు మాత్రమే కాకుండా ప్రతి భారతీయుడికీ ప్రయోజనం కలిగించే ఆర్థిక వ్యవస్థ రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నేటి బడ్జెట్ పరీక్షగా మిగలనుంది. భారతీయ ఆర్థిక వ్యవస్థకి 2019 కలిసిరాని సంవత్సరం. కానీ ఈ సంవత్సరం కూడా భారతీయ అతి సంపన్నుల సంపద భారీగా పెరగడం విశేషం. దేశంలోని ఒక శాతం సంపన్న భారతీయులు సమాజంలో అట్టడుగున ఉన్న 95.3 కోట్లమంది లేక మొత్తం జనాభాలో 70 శాతం మంది నిర్భాగ్యుల సంపద కంటే నాలుగు రెట్లు అధిక సంపద పోగేసుకున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మన దేశంలో 63 మంది బిలియనీర్ల మొత్తం సంపద 2018–19 కేంద్ర బడ్జెట్ కంటే ఎక్కువగా ఉంటోంది. అదే సమయంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కొట్టుమిట్టులాడుతోందని ప్రతి సూచి కూడా సూచిస్తోంది. కాగా, 2016–17 ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్ర ఆర్థిక మంత్రులుగా పనిచేసిన వారు అభివృద్ధిని ప్రోత్సహించడం, ఉద్యోగాలు సృష్టించడం పేరిట కార్పొరేట్ పన్నులను తగ్గిస్తూ వస్తున్నారు. కానీ పన్నుల రాయితీ పొందిన సమయంలో అటు ప్రభుత్వం, ఇటు కార్పొరేట్ రంగం ఇచ్చిన హామీలు ఏవీ అమలు కాకుండా పోయాయి. దేశంలో సులభతర వ్యాపార అనుమతుల విషయంలో ర్యాంకులు పైపైకి వెళుతున్నాయి. కార్మిక చట్టాలు, పర్యావరణ సంబంధ క్రమబద్ధీకరణలు బలహీనపడుతున్నాయి కానీ అభివృద్ధి మాత్రం చోటు చేసుకోవడం లేదు. దీనికి బదులుగా ఇటీవల విడుదల చేసిన నీతి ఆయోగ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ సూచిక ప్రకారం, దేశంలో 22 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల్లో దారిద్ర్యం, ఆకలి పెరుగుతున్నాయి. ఈ కీలక సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టి మదుపులు పెంచడానికి బదులుగా మీడియా తాజా వార్తలు సూచించినట్లుగా తగ్గిన ప్రభుత్వ రాబడుల నేపథ్యంలో ఈ సంవత్సరం బడ్జెట్లో 2 లక్షల కోట్ల రూపాయల వరకు కోత విధించనున్నారు. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోలేదంటే ఆశ్చర్యం కలిగించదు. వినియోగదారుల్లో డిమాండ్ తగ్గుముఖం పట్టడం, పెరుగుతున్న నిరుద్యోగం, కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థ వంటి తీవ్ర సమస్యలకు పరిష్కారం ఏమిటంటే ప్రభుత్వ వ్యయాన్ని ప్రత్యేకించి కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే మౌలిక సౌకర్యాల కల్పన ప్రాజెక్టుల్లో ప్రభుత్వ వ్యయాన్ని పెంచడమేనని కీన్సియన్ ఆర్థిక సిద్ధాంతం నిర్దేశిస్తోంది. ప్రభుత్వవ్యయం పెంచడమన్నది మొత్తం ఆర్థిక వ్యవస్థకు జీవం పోయడమే కాకుండా మరిన్ని ఉద్యోగాల కల్పనకు దోహదం చేస్తుంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న సరకులకు వినియోగదారుల నుంచి డిమాండ్ బలహీనపడినప్పుడు కార్పొరేట్ రంగ పన్నులను తగ్గించడం అనేది ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోయే ఉత్పత్తిలో మదుపు చేసే విషయంలో కంపెనీలకు ఎలాంటి ప్రోత్సాహకాలనూ అందించలేదు. కార్పొరేట్ పన్నులను తగ్గించిన పక్షంలో కంపెనీలు అపార లాభాలను వెనకేసుకుంటాయి. పైగా దేశంలో పేరుకుపోయిన ఆర్థిక అసమానతలను మరింతగా పెంచుతాయి. అంతే తప్ప ఉద్దీపనలు, కార్పొరేట్ రంగానికి పన్ను రాయితీలు ఆర్థిక పెరుగుదలకు ఎంతమాత్రం దోహదపడవు. మొత్తంమీద ఆర్థిక వ్యవస్థకు సరైన చికిత్స ప్రభుత్వ ఖర్చును తగ్గించడమే అని భారత్ ఆలోచిస్తున్నట్లు కనబడుతోంది. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు చెందిన సంస్థాగత బలహీనతలను ఎవరూ పట్టించుకోరు. అవేమిటంటే పేలవమైన మౌలిక సదుపాయాల కల్పన, మానవ సామర్థ్యాలు తగినంతగా లేకపోవడం, సరకుల ఉత్పత్తిని పెంపొందించగలిగే పొందికైన పారిశ్రామిక విధానం లోపించడం. పన్నులను ఎగ్గొట్టడానికి అనుమతించే కేంద్ర పన్నుల వ్యవస్థలోని చిల్లులను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రూపంలో వస్తున్న కలెక్షన్లను మరింతగా మెరుగుపర్చవలసి ఉంది. భారతదేశం తన పొరుగుదేశమైన చైనా ఉదాహరణ నుంచి నేర్చుకోవలసిన అవసరముంది. ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల్లో భారీ పెట్టుబడులు పెట్టడం, పారిశ్రామికీకరణకు సంబంధించి స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ప్రయత్నాలను అత్యంత నిర్దిష్టంగా చేపట్టడం, ప్రత్యేకించి విద్యపై మదుపును చైతన్యవంతంగా పెంచుతూ పోవడం అనేవి దశాబ్దాలుగా చైనా ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి రేటును సాధిస్తూ రావడానికి ప్రధాన కారణాలు. బలిష్టంగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థల్లో అధిక పెట్టుబడులు పెట్టడానికి బదులుగా తరుగుతున్న రాబడులకు పరిష్కారంగా భారత ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణే ఏకైక మార్గం అనే మార్గంలో ప్రయాణిస్తోంది. ఈ ప్రక్రియలో ఉన్న ప్రమాదాలు వెనువెంటనే అవగతం కాకపోవచ్చు కానీ దేశంలో సంపన్నులకు, పేదలకు మధ్య అంతరం మరింత పెరగడం మాత్రం ఖాయం. సమాజంలో అశాంతికి, ఆందోళనలకు సంపదల మధ్య అగాథ పూరితమైన అంతరమే కారణమని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ పంథాను నిశితంగా గమనించినట్లయితే సామాజిక సంక్షేమరంగాలపై మదుపులో భారీ కోతలు ఖాయమని అర్థమవుతుంది. ఉదాహరణకు ఒక్క పాఠశాల విద్యలోనే దాదాపు రూ.3,000 కోట్ల వరకు కోత విధించనున్నారు. హాస్యాస్పదమైన అంశం ఏమిటంటే, ఈ సంవత్సరమే భారతీయ బిలియనీర్ల సంపద రోజుకు రూ. 1,710 కోట్లవరకు పెరుగుతూ పోయింది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యపై ఇంత భారీ కోత వల్ల విద్యారంగంలో ఇప్పటికే తగినన్ని నిధుల కేటాయింపు లేక కునారిల్లుతున్న పథకాలు తీవ్రంగా దెబ్బతిననున్నాయి. పైగా విద్యా బడ్జెట్‌ను రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించి రూపొందించిన నూతన విద్యా విధానం ముసాయిదా కూడా ముందంజ వేయని పరిస్థితి ఏర్పడింది. దేశంలో 31 కోట్లమంది వయోజనులు నిరక్షరాస్యులుగా ఉంటున్నప్పుడు భారత్ ఒక బలమైన ఆర్థిక శక్తిగా అవుతుందని ఎలా ఊహించగలం? బహుశా భారతీయ ఆర్థిక విధానంలో అసమానత్వం పట్ల అత్యంత నిర్లక్ష్యం ప్రదర్శించిన కారణంగానే మన అభివృద్ధి రేటు తగ్గుముఖం పడుతోంది. ప్రపంచ అసమానత్వంపై 2015 అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చేసిన విశ్లేషణ చూపుతున్నట్లుగా, 20 శాతం అతి సంపన్నుల ఆదాయ వాటా ప్రతి సంవత్సరం పెరుగుతుండగా, స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) తగ్గుముఖం పడుతోంది. సమాజంలో అట్టడుగున ఉంటున్న 20 శాతం మంది నిరుపేదల ఆదాయం పెరిగినప్పుడే జీడీపీలో పెరుగుదల సాధ్యపడుతుంది. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలతో పరస్పరం ముడిపడివున్న అభివృద్ధి చట్రంలో పేద, మధ్యతరగతి ప్రజల పాత్ర చాలా ముఖ్యమైనదని ఐఎమ్ఎఫ్ అధ్యయనకారులు చెబుతున్నారు. అందుకే దశాబ్దాలుగా బలపడుతూ వచ్చిన భారతీయ సంపన్న వర్గం పన్నుల రూపంలో తన న్యాయమైన వాటాను చెల్లించవలసిన సమయం ఆసన్నమైంది. భారతీయ అత్యంత సంపన్నవర్గంపై సంపదపన్నును తిరిగి ప్రవేశపెట్టడం, వారసత్వ పన్ను, సంపద పన్ను వంటివాటిని పటిష్టంగా అమలు చేయడం ద్వారా మాత్రమే భారతదేశం సంపన్నదేశంగా మారగలదు. లాభాలపై డివిడెండ్లను ప్రకటించే రంగాలపై మరింత చురుకైన పన్నుల విధానాన్ని అమలు పర్చడానికి కేంద్రప్రభుత్వం డివిడెండ్ పన్నుపై దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే కొన్నేళ్లలో అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలన్న తన దార్శనికతను కేంద్రప్రభుత్వం ఫలవంతం చేయాలంటే, చైనాను అధిగమించాలనే కలను సాకారం చేసుకోవాలంటే.. దేశ ఆర్థిక వ్యవస్థను వెనక్కు లాగుతున్న సంస్థాగత అవరోధాలను పరిష్కరించాల్సి ఉంది. పైగా దాదాపు వందకోట్లమంది నిరుపేదలు, మధ్యతరగతి, బలహీన వర్గాల సమాధులపై దేశంలోని ఒక్క శాతం సంపన్నులు పునాదులు నిర్మించుకునే క్రమం ఇంకా కొనసాగినట్లయితే భారత ఆర్థిక వ్యవస్థ ముందంజ వేయడం అసాధ్యం. అసంభవం కూడా. అందుకే అతికొద్దిమంది సంపన్నులకు మాత్రమే కాకుండా ప్రతి భారతీయుడికీ ప్రయోజనం కలిగించే ఆర్థిక వ్యవస్థ రూపకల్పన సమస్యను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించగలుగుతుందా అనే విషయానికి వస్తే ఈ ఏడాది బడ్జెట్ ప్రభుత్వ చిత్తశుద్ధికి పరీక్షగా మిగిలిపోనుంది. అంజెలా తనేజా (ది వైర్ సౌజన్యంతో) వ్యాసకర్త కేంపెయిన్ లీడ్, ఇనీక్వాలిటీ, ఆక్స్‌ఫామ్ ఇండియా -
సమగ్ర బడ్జెట్ మాత్రమే వృద్ధికి ఊతం
దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపే విధానాలను ఆర్థికమంత్రి ప్రతి ఏటా బడ్జెట్లో ప్రస్తావించడం రివాజు కాగా ప్రభుత్వం చేపట్టిన కీలక విధానాలను ఇటీవల కాలంలో బడ్జెట్ ప్రసంగంలో కాకుండా బాహాటంగా ప్రకటించటం అలవాటుగా మారింది. పెద్దనోట్ల రద్దు వంటి కీలకమైన ద్రవ్యవిధాన ప్రకటనలు కూడా బడ్జెట్ సమర్పణకు వెలుపలనుంచే వచ్చాయి. కార్పొరేట్ రంగానికి 2019 సెప్టెంబర్ 19న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ పన్ను రాయితీని కూడా బడ్జెట్ సమావేశాలకు ఎంతో ముందుగా ప్రకటించారు. దీంతో బడ్జెట్ విశ్వసనీయత దెబ్బతింటోంది. ప్రభుత్వాల రాజకీయ ప్రేరేపిత లక్ష్యాలకు, ద్రవ్యవ్యవస్థ పటిష్టతకు మధ్య అంతరం పెరిగిపోతున్న నేటి తరుణంలో తాజా బడ్జెట్ ప్రజానుకూలతను, అదే సమయంలో ఆర్థిక ప్రక్రియ జవాబుదారీతనాన్ని సమతుల్యం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మునుపటి సంవత్సరాల్లో మాదిరి కాకుండా ‘ప్రభుత్వ ఆర్థికం’ అనేది కేంద్ర బడ్జెట్ సమర్పణ రోజున విస్తృత స్థాయిలో ప్రకటితం కావటం లేదు. ఆర్థిక మంత్రి కేంద్రబడ్జెట్ సమర్పణలో కొత్త ఆర్థిక విధానాలు, పథకాలు వెల్లడిస్తుండటం రివాజు. కానీ ఈరోజు అత్యంత ప్రధానమైన ఆర్థిక విధాన ప్రకటనలను సంవత్సరం పొడవునా ప్రకటిస్తూ వచ్చారు. ఇవన్నీ బడ్జెట్ ప్రసంగానికి విడిగా ప్రకటితమవుతూ వచ్చాయి. నిజానికి బడ్జెట్ సమర్పణలో కాకుండా ముఖ్యమైన ద్రవ్యసంబంధ ప్రకటనలు ప్రత్యేకించి మూలధన సేకరణ, మదుపునకు సంబంధించిన ప్రకటనలు బడ్జెటుకు ముందూ లేక ఆ తర్వాత వెల్ల డిస్తూ వస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిన పెద్దనోట్ల రద్దు వంటి కీలకమైన ద్రవ్యవిధాన ప్రకటనలు కూడా బడ్జెట్ సమర్పణకు వెలుపలనుంచే వచ్చాయి. మందకొడిగా ఉంటున్న మదుపులకు ఊతమిచ్చేందుకు కార్పొరేట్ రంగానికి 2019 సెప్టెంబర్ 19న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ పన్ను రాయితీని కూడా బడ్జెట్ సమావేశాలకు ఎంతో ముందుగా ప్రకటించారు. ఈ ధోరణి కారణంగా మారుతున్న పరిస్థితుల్లో బడ్జెట్ విశ్వసనీయత అనేది ముఖ్యమైన అంశంగా మారుతోంది. బడ్జెట్లో ఇచ్చిన హామీలు, ఆ ప్రకటనలకు మద్దతుగా బడ్జెట్లో కేటాయింపులకు చాలా వ్యత్యాసం ఉంటోంది. ఈ అంతరాన్ని సాంకేతికంగా నిర్దిష్టమైన రీతిలో విశ్లేషించడం లేదు. బడ్జెట్లో అత్యధిక కేటాయింపులు చేయడం అంటే అత్యధికంగా ఖర్చుపెట్టడం అని కాదు. ఈ అంతరమే బడ్జెట్ విశ్వసనీయతను కుదించివేసింది. విధానపరమైన అనిశ్చితత్వం, ముందే గ్రహించని ద్రవ్య ప్రకటనలు అనేవి మదుపుదారు విశ్వాసాన్ని దెబ్బతీయడమే కాకుండా సూక్ష్మ ఆర్థిక స్థిరత్వానికి నష్టం కలుగుజేస్తాయి. గత ఆర్థిక బడ్జెట్ (2019–20)లో చేసిన ప్రకటనలను చూస్తే ఆర్థిక గణన తక్కువగా ప్రభుత్వ రాజకీయ దార్శనికత ఎక్కువగా ప్రతిఫలించాయని చెప్పాలి. నిబంధనల ఆధారిత ద్రవ్య, ఆర్థిక విధాన వ్యవస్థ భారతదేశంలో ఆర్థిక, ద్రవ్య విధానాలు నిబంధనల ఆధారితంగా మారుతున్నాయి. బడ్జెట్ రూపకల్పన కానీ, ద్రవ్య విధానానికి సంబంధించిన రోడ్ మ్యాప్ కానీ కేంద్రం తీసుకొచ్చిన విత్త బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎమ్) చట్టం ద్వారా నడుస్తోంది. ఇక ద్రవ్య విధానంకేసి చూస్తే కొన్ని సంవత్సరాలకు ముందు కేంద్ర బడ్జెట్ ‘నూతన ద్రవ్య విధాన చట్రం’ ప్రకటించింది. ఈ ప్రకటనకు ముందు కేంద్రప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంకు ఒక ఒప్పం దంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ద్రవ్యవిధాన అధికారులపై ఒకే ఒక లక్ష్యాన్ని విధించింది. అంటే ద్రవ్యోల్బణంపై గురిపెట్టాలని వారికి ముఖ్యంగా సూచించింది. ఇతర అనేక సూక్ష్మ ఆర్థిక సమస్యలను చేపట్టడంతోపాటు, ద్రవ్య అధికారుల జోక్యం ప్రధానంగా ద్రవ్యోల్బణ నియంత్రణపైనే కేంద్రీకరించాలని నిర్దేశించారు. ఇక విత్త విధానం రంగంపై విత్త బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టం నియంత్రణ ఉంటోంది. ఇది ప్రభుత్వం రుణం తీసుకునే సామర్థ్యంపై పరిమితిని విధించింది. ఇది భారత్‌లో బడ్జెట్ రూపకల్పనపై ప్రభావం వేయటం లేదా? కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న రుణాలు, లోటుకు సంబంధించి నిర్దిష్ట నిబంధనలను విధించేలా విత్త ఏకీకరణ వైపుగా ఒక రోడ్ మ్యాప్ తీసుకువచ్చారు. విత్తపరమైన క్రమశిక్షణ అనేది ఆర్థిక అభివృద్ధిని పెంపొందించాలని సూచించారు. అయితే విత్తపరమైన ఏకీకరణ నిజంగా ఆర్థిక పురోగతిని ప్రోత్సహించిందా? దీనికి సంబంధించిన ఆధారాలు మిశ్రమ స్వభావంతో ఉన్నాయి. నిబంధనల ఆధారితమైన విత్తవిధానపరమైన విజ్ఞతను నిర్వహించేందుకు ఆర్థిక, సామాజిక వ్యయాలకు సంబంధించిన అవగాహన పెరుగుతూ వస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా స్థూల మూలధన సేకరణ దెబ్బతింటూ వస్తోంది. కారణం.. పరిమితి మించిన లోటు విధానాలు విత్తపరమైన ఏకీకరణ మార్గాల వైపు కేంద్రీకరించకుండా కేవలం లక్ష్యాల సాధనమీదే దృష్టి సారించాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కంటే రాష్ట్ర ప్రభుత్వాలే మూలధన కల్పనపై సాపేక్షికంగా ఎక్కువగా ఖర్చుపెడుతున్నాయి. ఇంతకుముందు, స్థూల మూలధన కల్పనకు ప్రత్యేకించి మౌలిక వసతుల కల్పన కోసం మూలధన నిర్ణయాలపై వ్యూహ రచనకు సంబంధించి కేంద్ర బడ్జెట్ సమర్పించేవరకు వేచి ఉండాల్సి వస్తోంది. అయితే, పీపీపీ నమూనాల ద్వారా మౌలిక వసతుల కల్ప నకు రుణసహాయం చేసే విషయంలోనూ అలాగే కేంద్ర స్థాయిలో నిలి చిపోయిన మూలధన కల్పన విషయంలోనూ ఇటీవల ఒక విధానపరమైన మార్పు జరిగింది. కానీ ఇలాంటి ప్రకటనలు ఉద్దేశపూర్వకంగానే కేంద్ర బడ్జెట్లో కనిపించడం లేదు. ఒకవేళ వాటిని బడ్జెట్లో పొందుపర్చినప్పటికీ వాటికి అవసరమైన ఫైనాన్స్ విషయంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాబట్టి సూక్ష్మ ఆర్థిక విధాన రూపకల్ప నలో స్పష్టమైన పరివర్తన నేపథ్యంలో కూడా బడ్జెట్ రూపకల్పనలో స్పష్టమైన మార్పు కనబడుతోంది. అదేమిటంటే, వివేకం స్థానంలో నియంత్రిత వివేకం, నిబంధనలు ముందుపీటికి రావడమే. సంస్థలు ప్రణాళిక కమిషన్‌కు మంగళం పలకడంతో, ప్రాంతీయ అసమానతలను ఎలా పరిష్కరిస్తారు అనేది పరిష్కరించవలసిన ప్రశ్నగా రంగంలోకి వచ్చింది. బడ్జెట్‌తోపాటు, 15వ ఆర్థిక కమిషన్ అవార్డును కూడా 2020 ఫిబ్రవరిలో ప్రకటించనున్నారు. సమాఖ్య రాజకీయ వ్యవస్థలో సమగ్ర ఆర్థిక సంస్థగా 15వ ఆర్థిక కమిషన్ కీలక పాత్ర వహిస్తుందా? ప్రాంతీయ అసమానతలను పరిష్కరించగలుగుతుందా? అనేది కీలక ప్రశ్న. మరొక సమాఖ్య సంస్థ జీఎస్టీ కౌన్సిల్. ప్రారంభించిన రెండేళ్ల తర్వాత కూడా జీఎస్టీ వ్యవస్థ దేశంలో స్థిరపడలేకపోవడం పెద్ద సమస్య. జీఎస్టీ ద్వారా ఆదాయ సమీకరణకు సంబంధించి తాజా బడ్జెట్ కొంత అంతర్దృష్టిని అందించాల్సి ఉంది. అలాగే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆలోచనకూడా బడ్జెట్లో ప్రతిఫలించాలి. సమభావం సమస్యను పరిష్కరించడంలోని న్యాయ, విత్త సంస్థల మధ్య అనుసంధానం లేకపోవడం స్పష్టంగా కనబడుతూనే ఉంది. ఆర్థిక పురోగతి పునరుద్ధరణ ప్రస్తుత ఆర్థిక మాంద్య పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక పురోగతిని ముందుకు తీసుకెళ్లడంలో ద్రవ్యవిధానం పాత్ర ఏమిటన్నది కీలకమైన అంశం. 2020 బడ్జెట్ దీన్ని పరిష్కరిస్తుందా? ఆర్థిక ఉద్దీపన అనేది ఆర్థిక వృద్ధికి తప్పనిసరిగా దారితీస్తుందా అనే అంశాన్ని తీవ్రంగా చర్చించారు. కొంతమంది ఆర్థిక వేత్తల అభిప్రాయం ప్రకారం భారతదేశంలో ఆర్థిక వృద్ధి మందగమనం అనేది స్వభావరీత్యా సాపేక్షికంగా వ్యవస్థీకృతమైనది. వ్యవస్థీకృతమైన అవరోధాలను పరిష్కరించే విధానాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. బడ్జెటరీ విధానాలు ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తున్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రతికూల స్వభావంతో ఉంటున్నాయా ఆనేది తీవ్రంగా చర్చించాల్సిన విషయంగా ఉంటోంది. ఇటీవలి బడ్జెట్లలో వ్యయానికి సంబంధించిన నిర్ణయాలు, చివరి దశలో తీసుకునే నిర్ణయాలకు మధ్య స్పష్టమైన అనుసంధానం ఉంటోంది. ఉదాహరణకు నిరుపేద గృహాలలో మహిళలకు వంట గ్యాస్ అందించడం. ఎన్నికల్లో గెలవడానికి, మెజారిటీ సాదించడానికి సోషల్ సెక్టర్ బడ్జెట్ తప్పనిసరి ప్రమాణంగా ఉంటున్నట్లయితే బడ్జెట్ చట్రం అనేది వచ్చిన ఫలితాలను కాకుండా ఆర్థిక పెట్టుబడులపైనే ఎక్కువగా కేంద్రీకరించే ప్రమాదం ఉంది. అలాగే ఆర్థిక పురోగతిపై పెద్దనోట్ల రద్దు వంటి.. బడ్జెట్లో ముందుగా పేర్కొనని విత్త సంబంధ ప్రకటనలు కలిగించే ప్రభావాల గురించి అంచనా వేయాల్సిన అవసరం ఉంది. అలాగే విధాన ప్రక్రియను సంస్కరించాల్సి ఉంది కూడా. పట్టణ కేంద్రాల కంటే జిల్లాలు పెద్దనోట్ల రద్దు కారణంగా తీవ్రంగా దెబ్బతినిపోయాయని ఒక అధ్యయనం పేర్కొంది. దీంతో ఆర్థిక కార్యాచరణ కుదుపులకు గురైంది. బ్యాంక్ రుణ పెరుగుదల కూడా తగ్గిపోయింది. చివరగా బడ్జెట్‌కు జవాబుదారీతనం కల్పించే యంత్రాంగాలు ప్రత్యేకించి కాగ్ ద్వారా చేసే పాలసీపరమైన మదింపు, బడ్జెట్ సమర్పణ తర్వాత పార్లమెంటులో జరిగే చర్చల ప్రక్రియద్వారా బడ్జెట్ పారదర్శకత, జవాబుదారీతనం బలోపేతమవుతుంది. విత్తపరమైన విధానాలకు సంబంధించిన రాజకీయ, ఆర్థిక స్వావలంబన కోసం ఏటా జరిగే బడ్జెట్ సైకిల్స్ నుంచి సమర్థవంతమైన మధ్యంతర ద్రవ్య చట్రాన్ని ఏర్పర్చాలనే అభిప్రాయాన్ని చాలామంది అంగీకరిస్తున్నారు. ఇది ఆర్థిక ప్రగతికి శుభపరిణామం. లేఖా చక్రవర్తి (ది వైర్ సౌజన్యంతో) వ్యాసకర్త ఆర్థికవేత్త, ప్రొఫెసర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ -
దేశ ఆర్థిక మూలాలు పటిష్టం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితుల నుంచి తిరిగి పుంజుకునే సత్తా ఎకానమీకి పుష్కలంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2024 నాటికి దేశ ఎకానమీ 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరగలదని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాలు సమష్టిగా పనిచేస్తే ఇది సాధ్యమేనని మోదీ పేర్కొన్నారు. గురువారం నీతి ఆయోగ్‌లో పలువురు ఆర్థికవేత్తలు, ప్రైవేట్ ఈక్విటీ .. వెంచర్ క్యాపిటలిస్ట్‌లు, వ్యాపార దిగ్గజాలు, వ్యవసాయ రంగ నిపుణులు మొదలైన వారితో బడ్జెట్ ముందస్తు సమవేశంలో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ విషయాలు తెలిపినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. రెండు గంటలపాటు జరిగిన చర్చల్లో వివిధ రంగాల్లో నిపుణులు తమ అభిప్రాయాలు తెలియజేశారు. విధానకర్తలు, వివిధ వర్గాలు సమన్వయంతో కలిసి పనిచేసేందుకు ఇవి తోడ్పడగలవని మోదీ చెప్పారు. 5 ట్రిలియన్ (లక్ష కోట్లు) డాలర్ల ఎకానమీగా ఎదగాలనే లక్ష్యం అకస్మాత్తుగా పుట్టుకొచ్చినది కాదని.. దేశ సామర్థ్యంపై అవగాహనతోనే దీన్ని నిర్దేశించుకున్నామని ఆయన తెలిపారు. ‘దేశాన్ని ముందుకు నడిపించేందుకు, ఉద్యోగాలను కల్పించేందుకు అవసరమైన సత్తా.. టూరిజం, పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మొదలైన రంగాల్లో పుష్కలంగా ఉన్నాయి’ అని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి వేదికల్లో జరిగే మేధోమథనాలు దేన్నైనా సాధించగలమనే స్ఫూర్తి నింపగలవని ఆయన చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 11 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోనుందన్న అంచనాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎకానమీకి ఊతమిచ్చేందుకు తీసుకోదగిన చర్యల గురించి అన్ని వర్గాల అభిప్రాయాలు తెలుసుకుంటున్న మోదీ.. సోమవారం పలువురు వ్యాపార దిగ్గజాలతో సమావేశమైన సంగతి తెలిసిందే. రుణ వితరణ పెరగాలి... రుణ వితరణ పెంచాలని .. ఎగుమతుల వృద్ధికి, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో గవర్నెన్స్ మెరుగుపడటానికి, వినియోగానికి డిమాండ్ పెంచేందుకు, ఉద్యోగాల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్వల్పకాలికంగా తీసుకోదగ్గ చర్యలపై సత్వరం నిర్ణయం తీసుకుంటామని, దీర్ఘకాలిక అంశాలకు సంబంధించి వ్యవస్థాగతమైన సంస్కరణలు అవసరమైనందున కాలక్రమేణా అమలు చేయగలమని మోదీ హామీ ఇచ్చారు. ‘ఆర్థిక వృద్ధి, స్టార్టప్స్, నవకల్పనలు తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది‘ అని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్.. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆర్థిక మంత్రి గైర్హాజరు... దాదాపు 40 మంది పైగా నిపుణులు, ఆర్థిక వేత్తలు, వ్యాపార దిగ్గజాలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వాణిజ్య మంత్రి పియూష్ గోయల్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తదితరులు దీనికి హాజరయ్యారు. అయితే, బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ వర్గాలతో ప్రి–బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్నందున.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి హాజరు కాలేదు. ఫిబ్రవరి 1న ఆమె రెండోసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. -
వ్యవస్థలోకి మరిన్ని నిధులు..
ముంబై: తగిన ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెంపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తసుకుంది. ఓపెన్‌మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓ) ద్వారా జనవరి 6న ప్రభుత్వ బాండ్ల కొనుగోలు, అమ్మకం చర్యలను చేపట్టనుంది. రూ.10,000 కోట్ల చొప్పున బాండ్ల కొనుగోలు, అమ్మకానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటన ఒకటి తెలిపింది. అర్హులు తమ బిడ్స్, ఆఫర్లను జనవరి 6 ఉదయం 10.30 నుంచి 12.00 గంటల మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ సిస్టమ్‌పై ఎలక్ట్రానిక్ ఫార్మేట్ రూపంలో సమర్పించవచ్చని గురువారం విడుదలైన ఆర్బీఐ ప్రకటన తెలిపింది. బాండ్ల కొనుగోలు ద్వారా బ్యాంకింగ్‌సహా ఫైనాన్స్ సంస్థల్లోకి మరింత నిధులు పంప్ చేయడానికి వీలు కలుగుతుంది. అలాగే బాండ్ల విక్రయ చర్య... వ్యయాలకు సంబంధించి కేంద్రానికి మరిన్ని నిధులు సమకూరడానికి దోహదపడుతుంది. ఇప్పటికే ఈ తరహా ఓఎంఓ చర్యలను రెండుసార్లు ఆర్బీఐ చేపట్టింది. -
సినిమా సూపర్ హిట్ కలెక్షన్లు ఫట్
జనం పెట్టే ఖర్చులు తగ్గాయంటే... ఓలా, ఉబెర్ బుకింగులు పెరిగాయంటారు ఆర్థిక మంత్రి!!. మరి అదే నిజమైతే కార్ల విక్రయాలు కూడా పెరగాలి కదా? అనేది సామాన్యుడి సందేహం. వీటి మధ్య సంబంధం ఉందనుకుంటే ఉంది!. లేదనుకుంటే లేదు!!. 2019లో మన ఆర్థిక వ్యవస్థ తీరు చూసినా ఇలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఎకానమీ మందగమనంతో నత్తనడకన నడుస్తోంది. విక్రయాలు తగ్గిపోయాయని ఆటోమొబైల్, వినియోగ వస్తువుల కంపెనీలు మొత్తుకుంటున్నాయి. స్టాక్ మార్కెట్లు మాత్రం రోజుకో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అటు సంస్కరణల ఊతంతో సులభతర వ్యాపార నిర్వహణ ర్యాంకుల్లో భారత్ భారీగా ఎగబాకినా.. ఇటు పారిశ్రామిక దిగ్గజాలు మాత్రం వ్యాపార వర్గాల నోరు నొక్కేస్తోందంటూ ప్రభుత్వంపై బాహాటంగానే విరుచుకుపడుతున్నారు. మందగమనం సమస్యకు చికిత్స చేసేందుకు ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించినా ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో 2019 సింహావలోకనంతో పాటు కొత్త సంవత్సరంపై నెలకొన్న అంచనాల సమాహారమిది... స్టాక్ మార్కెట్లు.. ‘రికార్డ్’ల పరుగు ఎకానమీ పరిస్థితి ఎలా ఉన్నా.. స్టాక్ మార్కెట్లు మాత్రం రయ్‌మని ఎగిశాయి. నిఫ్టీ సుమారు 13 శాతం, సెన్సెక్స్ దాదాపు 15 శాతం పెరిగాయి. 2017 తర్వాత దేశీ సూచీలకు 2019 బాగా కలిసొచ్చింది. ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.10.2 లక్షల కోట్లు ఎగిసింది. ఈ ఏడాది జనవరి 1న 36,162 పాయింట్లుగా ఉన్న సెన్సెక్స్ 5,000 పాయింట్లు పైగా పెరిగి తాజాగా 41,000 పైకి చేరింది. ఎకానమీతో సంబంధం లేనట్లుగా స్టాక్ మార్కెట్లు అలా పెరుగుతూ పోవడంపై ఆర్థికవేత్తలు కూడా అయోమయంలో పడ్డారు. స్టాక్ మార్కెట్ల ర్యాలీ కొన్ని షేర్లకే పరిమితం కావడం గమనార్హం. 2018 జనవరిలోని ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలతో పోలిస్తే మిడ్ క్యాప్ సూచీ 19 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 33 శాతం పడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన తొలి దేశీ కంపెనీగా రికార్డు సృష్టించింది. కార్పొరేట్ ట్యాక్స్ రేటును తగ్గించడం, ఆఖరు దశలో నిల్చిపోయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఊతమిచ్చేందుకు రూ. 25,000 కోట్ల నిధి ఏర్పాటు చేయడం, విదేశీ ఇన్వెస్టర్లపై పన్ను ప్రతిపాదనలను ఉపసంహరించడం వంటి అంశాలు మార్కెట్ల పరుగుకు దోహదపడ్డాయి. 2019లో రూ.లక్ష కోట్లకు పైగా విదేశీ నిధులు వచ్చాయి. ఇది క్రితం ఏడాదితో పోలిస్తే 7.5 శాతం అధికం. వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందని స్టాక్ ఇన్వెస్టర్లతో పాటు వ్యూహాత్మక ఇన్వెస్టర్లు కూడా బుల్లిష్‌గా ఉన్నారనడానికి ఇది నిదర్శనంగా పరిశీలకులు భావిస్తున్నారు. టెల్కోలకు షాక్ ట్రీట్మెంట్.. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) లెక్కింపు విషయంలో కేంద్రం ఫార్ములానే సమర్ధి స్తూ సుప్రీం కోర్టు ఆదేశాలివ్వడంతో పాత ప్రైవేట్ టెల్కోల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఈ దెబ్బతో టెల్కోలు ఏకంగా రూ. 1.47 లక్షల కోట్లు కేంద్రానికి చెల్లించాల్సి వస్తోంది. వీటికి కేటాయింపులు జరపడంతో వొడాఫోన్ ఐడియా సంస్థ దేశ కార్పొరేట్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో రూ. 50,921 కోట్ల పైచిలుకు నష్టాలను సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రకటించింది. ఎయిర్టెల్ కూడా రూ. 23,045 కోట్ల నష్టాలు నమోదు చేసింది. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే కంపెనీని మూసేయక తప్పదని వొడాఫోన్ ఐడియా ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తానికి రంగంలోకి దిగిన కేంద్రం.. టెల్కోలకు ఊరటనిచ్చేలా స్పెక్ట్రం బాకీల చెల్లింపుపై రెండేళ్ల మారటోరియం ప్రకటించింది. ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జీల వివాదం కూడా తెరపైకి వచ్చింది. ఈ చార్జీలను కొనసాగించాలంటూ పాత టెల్కోలు, ఎత్తివేయాలని కొత్త టెలికం సంస్థ జియో వాదించాయి. చివరికి 2021 దాకా దీని గడువును ట్రాయ్ పొడిగించింది. ఈలోగా టెల్కోలన్నీ కలిసికట్టుగా చార్జీలను పెంచేశాయి. రేటు పెరిగినా డేటా వినియోగానికి డిమాండ్ తగ్గదని, ఆదాయాలు గణనీయంగా మెరుగుపడతాయని కంపెనీలు ఆశిస్తున్నాయి. కనీస చార్జీల ప్రతిపాదనను ట్రాయ్ పరిశీలిస్తోంది. అటు ప్రభుత్వ రంగ టెల్కోలకు కాస్త ఊరట లభించింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ను విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. రూ.69,000 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించింది. ఇరు సంస్థల్లో 92,000 మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ఎంచుకున్నారు. మ్యూచువల్ ఫండ్స్ కొనసాగిన జోష్.. 2019లో మ్యూచువల్ ఫండ్స్ అసెట్స్ భారీగా పెరిగాయి. 2019 నవంబర్ నాటికే ఏయూఎం 18 శాతం (సుమారు రూ. 4.2 లక్షల కోట్లు) ఎగిసి రూ.27 లక్షల కోట్లకు చేరింది. ఇన్వెస్టర్ల ధీమాను పెంచేందుకు సెబీ తీసుకుంటున్న చర్యలు, డెట్ స్కీముల్లోకి భారీగా పెట్టుబడుల రాకతో.. కొత్త ఏడాది కూడా ఇదే ధోరణి కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. 2020లో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ 17–18 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చని, ఎకానమీ పుంజుకుంటే ఈక్విటీ ఫండ్స్‌లోకి కూడా భారీగా పెట్టుబడులు రావొచ్చని ఫండ్ సంస్థల సమాఖ్య యాంఫీ అంచనా వేస్తోంది. బీమా రంగం... ధీమాగా వృద్ధి బీమా పరిశ్రమ వృద్ధి స్థిరంగా కొనసాగింది. నవంబర్ దాకా చూస్తే కొత్త ప్రీమియం వసూళ్లు వార్షికంగా సుమారు 37 శాతం వృద్ధితో రూ. 1.7 లక్షల కోట్లుగా నమోదైనట్లు కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. రాబోయే రోజుల్లో పరిశ్రమ 15% వృద్ధి రేటు సాధించవచ్చని అంచనా వేసింది. కుటుంబాలు చేసే పొదుపు మొత్తాలు.. బంగారం వంటి వాటి వైపు కాకుండా ఇతరత్రా ఆర్థిక అసెట్స్‌వైపు మళ్లుతుండటం, ప్రభుత్వ విధానాలు, బీమా విస్తృతికి సంస్థల ప్రయత్నాలు ఇందుకు దోహదపడగలవని పరిశ్రమవర్గాలు పేర్కొ న్నాయి. ఎకానమీ అస్తవ్యస్తం.. అంతర్గత, అంతర్జాతీయ సవాళ్లతో ఈ ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థకు కష్టంగానే గడిచింది. వినియోగం, ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతులు.. అన్నీ మందగించాయి. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అగ్రగామి దేశం హోదాను భారత్ కోల్పోయింది. సెప్టెంబర్ క్వార్టర్లో జీడీపీ వృద్ధి.. ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5 శాతానికి పడిపోయింది. 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం దిశగా దూసుకెళ్లాల్సిన ఎకానమీ... మందగమనం దెబ్బతో కుంటినడకలు నడుస్తోంది. ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు దేశ వృద్ధి రేటు అంచనాలకు భారీగా కోతలు పెట్టాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్రం పలు సంస్కరణలు ప్రవేశపెడుతోంది. కార్పొరేట్ ట్యాక్స్ రేటును పాతిక శాతానికి తగ్గించడం, ఆర్థిక రంగ పునర్వ్యవస్థీకరణ, వడ్డీ రేట్ల కోత వంటివి వీటిలో కీలకం. కార్పొరేట్ ట్యాక్స్ కోత వల్ల సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీలు కాస్త మెరుగైన ఫలితాలు ప్రకటించగలిగాయి. సులభతరంగా వ్యాపారాలు నిర్వహించడానికి అనువైన దేశాల జాబితాలో భారత్ 77వ స్థానం నుంచి 63వ స్థానానికి వచ్చింది. మరోవైపు, ఆర్బీఐ కీలక పాలసీ రేట్లను తగ్గించినా.. ఆ ప్రయోజనాలను ఖాతాదారులకు బ్యాంకులు పూర్తిగా బదలాయించకపోతుండటంతో దేశీయంగా వినియోగానికి ఊతం లభించడం లేదు. దీంతో వచ్చే సంవత్సరం కూడా పరిస్థితి పెద్దగా మెరుగుపడేలా కనిపించడం లేదనేది పరిశీలకుల మాట. అయితే, ఇన్ఫ్రాపై వచ్చే అయిదేళ్లలో రూ.100 లక్షల కోట్లు వెచ్చించాలన్న ప్రభుత్వ ప్రణాళికతో ఎకానమీకి కొంత ఊతం లభించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. రియల్టీ అంతంతమాత్రం... రియల్టీ రంగంపైనా ఆర్థిక మందగమన ప్రభావం గణనీయంగా పడింది. టాప్ 7 నగరాల్లో రిటైల్ లీజింగ్ కార్యకలాపాలు క్రితం ఏడాదితో పోలిస్తే 35 శాతం తగ్గాయి. 2018లో 5.5 మిలియన్ చ.అ. లీజింగ్ నమోదు కాగా 2019లో ఇది 3.6 మి.చ.అ.లకు పరిమితమైందని రియల్టీ సేవల సంస్థ అనరాక్ నివేదికలో వెల్లడైంది. ఆటోమొబైల్, జ్యుయలరీ, ఎలక్ట్రానిక్స్, హైపర్మార్కెట్లు మొదలైన విభాగాల్లో లీజింగ్ తగ్గగా.. ఫుడ్ అండ్ బెవరేజెస్, సినిమా, సౌందర్య సంరక్షణ సేవల విభాగాల్లో పెరిగింది. అయితే, వచ్చే ఏడాది రిటైల్ లీజింగ్ మళ్లీ పుంజుకోవచ్చని అంచనాలున్నాయి. పసిడి.. జిగేల్ జిగేల్ పసిడి మెరుపులు ఈ ఏడాది మరింత కాంతివంతమయ్యాయి. అంతర్జాతీయంగా ఔన్సు (31.1 గ్రాములు) బంగారం ధర 1,400 డాలర్ల శ్రేణిని ఛేదించింది. 2013 తర్వాత మళ్లీ తొలిసారి ఈ ఏడాది ఆగస్టులో 1,500 డాలర్ల మార్కును అధిగమించింది. దేశీయంగా రేటు ఏకంగా 25 శాతం పెరిగింది. సంవత్సరం తొలినాళ్లలో రూ.31,500 స్థాయిలో ఉన్న పది గ్రాముల బంగారం ధర దాదాపు రూ.8,000 పెరిగి ఒక దశలో రూ. 40,000 స్థాయిని కూడా తాకింది. సాధారణంగా.. అనిశ్చితి, ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారాన్ని పరిగణిస్తారు. ఈ కారణాలే ఈ ఏడాది పసిడి పరుగుకు దోహదపడ్డాయి. అంతర్జాతీయంగా భౌగోళిక.. రాజకీయ... వాణిజ్య అనిశ్చితి, అమెరికా – చైనా మధ్య సుదీర్ఘంగా కొనసాగిన టారిఫ్‌ల యుద్ధం వంటివన్నీ ఇన్వెస్టర్లను పసిడివైపు మొగ్గేలా చేశాయి. ప్రపంచ ఎకానమీపై కమ్ముకున్న నీలినీడలతో.. షేర్ల వంటి రిస్కీ సాధనాల కన్నా బంగారం, ఇతరత్రా సురక్షిత సాధనాలే ఆకర్షణీయంగా ఉంటాయని 2019 రెండో త్రైమాసిక నివేదికలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. సాధారణ ఇన్వెస్టర్ల తరహాలోనే సెంట్రల్ బ్యాంకులు కూడా పసిడిని భారీగా కొని నిల్వలు పెంచుకుంటున్నాయి. వచ్చే ఏడాది కూడా భౌగోళిక, రాజకీయ అనిశ్చితి, కనిష్ట స్థాయిల్లో వడ్డీ రేట్లు, డాలరు బలహీనపడే అవకాశాల నేపథ్యంలో బంగారం పరుగు కొనసాగుతుందని భావిస్తున్నారు. కీలకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికలతో మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో 2020లో ఔన్సు బంగారం ధర 1,620 డాలర్ల స్థాయిని తాకవచ్చని అంచనాలున్నాయి. అయితే, ఇప్పటికే పెద్ద మొత్తంలో కొనుగోళ్లు జరిపేసిన స్పెక్యులేటివ్ ఇన్వెస్టర్లు.. 2020లో అమ్మకాలకు దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫలితంగా పసిడి రేటు తగ్గే చాన్సు కూడా ఉందనేది నిపుణుల అంచనా. ఆటోమొబైల్ రివర్స్ గేర్‌లోనే... డిమాండ్ లేక అమ్మకాలు తగ్గడం మొదలుకుని ప్లాంట్ల మూసివేతలు, ఉద్యోగాల కోతలు, వందల మంది డీలర్ల దివాలా.. కొత్త కాలుష్య ప్రమాణాలు, ఎలక్ట్రిక్ వాహనాల విధానాలు.. ఇలా వివిధ కారణాలు ఆటోమొబైల్ పరిశ్రమను తెరిపిన పడనివ్వకుండా చేశాయి. ఎకానమీలో మందగమనం, ధరల పెంపుతో ప్యాసింజర్ వాహన విక్రయాలు క్షీణించగా, అధిక నిల్వలు పేరుకుపోయి.. ఫైనాన్స్ అవకాశాలు తగ్గిపోయి వాణిజ్య వాహన అమ్మకాలు పడిపోయాయి. ఉద్యోగ కల్పన, డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటంతో ద్విచక్ర వాహన విక్రయాలు భారీగా తగ్గాయి. అయితే, వాహనాల కొనుగోళ్లకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తుండటం, రుణ లభ్యతను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటూ ఉండటం తదితర చర్యలు రాబోయే రోజుల్లో ప్యాసింజర్ వాహనాలకు సానుకూలంగా ఉండగలవన్న అంచనాలు నెలకొన్నాయి. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో సెంటిమెంటు మెరుగుపడుతుండటం .. ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ల అమ్మకాలకూ సానుకూలంగా ఉండవచ్చని అంచనా. డీల్ స్ట్రీట్ .. కార్పొరేట్లు డీలా కార్పొరేట్లు రుణ సంక్షోభాల్లో కూరుకుపోవడంతో 2019లో విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్ఏ) డీల్స్ ఒక మోస్తరు స్థాయికే పరిమితమయ్యాయి. లిక్విడిటీ కొరత, విదేశీ ఇన్వెస్టర్లు కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవడం, అంతర్జాతీయంగా అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం వంటి అంశాలతో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అవలంబించారు. న్యాయసేవల సంస్థ బేకర్ మెకెంజీ నివేదిక ప్రకారం 2019లో మొత్తం మీద సుమారు రూ. 52.1 బిలియన్ డాలర్ల విలువ చేసే డీల్స్ జరిగాయి. 2019లో సగటు ఎంఅండ్ఏ డీల్ పరిమాణం 81 మిలియన్ డాలర్లుగా నమోదైంది. గడిచిన మూడేళ్లతో పోలిస్తే ఇదే అత్యల్పం. తయారీ, ఇంధనం, స్టార్టప్, ఫార్మా, బ్యాంకింగ్, ఐటీ, ఇన్ఫ్రా, రిటైల్, ఈ–కామర్స్ రంగాల్లో గణనీయంగా ఒప్పందాలు కుదిరాయి. వ్యాపారాలకు అనువైన సంస్కరణలు, అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు తిరిగొస్తుండటం వంటి అంశాల ఊతంతో 2020, 2021 సంవత్సరాల్లో డీల్స్ పరిస్థితి మళ్లీ పుంజుకోగలదని బేకర్ మెకెంజీ ఒక నివేదికలో తెలిపింది. బ్యాంకింగ్... ఫైనాన్స్ సవాళ్లమయం ఐఎల్అండ్ ఎఫ్ఎస్ దివాలా ప్రభావాలతో 2019 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం కష్టాలు కొనసాగాయి. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్, అల్టికో క్యాపిటల్ వంటి సంస్థలు దివాలా తీశాయి. ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభంతో రుణ లభ్యత కొరవడి ఆటోమొబైల్ వంటి ఇతర రంగాలపైనా ప్రభావం పడింది. మొండిబాకీలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విలీనాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం 10 బ్యాంకులను నాలుగు కింద విలీనం చేసింది. యూనియన్ బ్యాంకులో విలీనంతో తెలుగువారి ఆంధ్రా బ్యాంకు కనుమరుగు కానుంది. నెఫ్ట్ సేవలు ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులోకి వచ్చాయి. ఎట్టకేలకు దివాలా కోడ్ ప్రయోజనాలు కనిపించడం ప్రారంభమైంది. ఎస్సార్ స్టీల్ వంటి కేసులు పరిష్కారం కావడంతో బ్యాంకులకు వేల కోట్ల మేర మొండిబాకీల రికవరీ సాధ్యపడింది. అయితే, ఇంకా చాలా కేసుల పరిష్కారానికి సుదీర్ఘ సమయం పట్టేస్తుండటం ఆందోళనకర విషయం. మొండిబాకీల (ఎన్పీఏ) భారం ఈసారి కాస్త తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ ఆఖరు నాటికి స్థూల ఎన్పీఏలు రూ. 8.94 లక్షల కోట్లకు తగ్గాయి. క్రితం ఏడాది ఇదే వ్యవధిలో స్థూల మొండిబాకీలు రూ. 10.18 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇక, సుదీర్ఘ వివాదానికి ఫుల్స్టాప్ పెడుతూ బిమల్ జలాన్ సిఫార్సుల మేరకు రిజర్వ్ బ్యాంక్ .. 2018–19 కేంద్రానికి గాను తన వద్ద ఉన్న మిగులు నిధుల్లో రూ. 1.76 లక్షల కోట్లు కేంద్రానికి బదలాయించేందుకు అంగీకరించింది. మందగమనంతో కొట్టుమిట్టాడుతున్న ఎకానమీకి ఊతమిచ్చేలా కీలక వడ్డీ రేట్లను 135 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు .. దశాబ్ద కనిష్ట స్థాయి 5.15 శాతానికి దిగివచ్చింది. అయితే, ద్రవ్యోల్బణం ఎగియడంతో డిసెంబర్లో రేట్ల కోతకు కాస్త విరామమిచ్చింది. -
జైట్లీ సంస్కరణలు ప్రశంసనీయం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ హితాన్ని తన ప్రథమ కర్తవ్యంగా భావించి చివరిదాకా అదే సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి అరుణ్ జైట్లీ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జైట్లీ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఉపరాష్ట్రపతి నివాసంలో ‘ద రినైసన్స్ మ్యాన్: ద మేనీ ఫాసెట్స్ ఆఫ్ అరుణ్ జైట్లీ’ పుస్తకాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. తర్వాత వెంకయ్య మాట్లాడారు. ‘జైట్లీ దశాబ్దాలుగా నాకు ఆత్మీయ మిత్రుడు. ముఖ్యమైన సమయాల్లో ఆయన విలువైన సూచనలు ఇచ్చేవారు. అలాంటి జైట్లీ ఇకలేరనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకున్నా’అని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టిన జైట్లీ రాష్ట్రాల ఆర్థిక మంత్రులను కలుపుకొని ఏకాభిప్రాయ సాధనతో కీలకమైన జీఎస్టీ వంటి పన్ను సంస్కరణలు తీసుకొచ్చారని ప్రశంసించారు. పుస్తకాన్ని వెంకయ్య కొడుకు హర్షవర్ధన్, కూతురు దీప తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జైట్లీ భార్య సంగీత, లోక్‌సభ స్పీకర్ బిర్లా, కేంద్ర మంత్రి మురళీధరన్ తదితరులు పాల్గొన్నారు. -
దేశ ఆర్థిక వ్యవస్థలో ఏపీ వాటాను పెంచుతాం
సాక్షి, హైదరాబాద్ : భారత ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ వాటాను రానున్న రెండే ళ్లలో మూడింతలు పెంచడ మే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న ఎనిమిది రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉందన్నారు. హైదరాబాద్‌లో రెండు రోజులుగా జరుగుతున్న భారత్, అమెరికా రక్షణ సంబంధాల అంతర్జాతీయ సదస్సులో గురువారం ఆయన ప్రసంగించారు. ఏపీ ఆర్థిక వ్యవస్థను పురోభివృద్ధి బాటలో నడిపేందుకు రూపొందిస్తున్న రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే రంగాలు, అంశాలను గుర్తించినట్టు తెలిపారు. రక్షణ రంగానికి సంబంధించి రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న డిఫెన్స్ కారిడార్లు కీలక పాత్ర పోషిస్తా యని గుర్తిం చామన్నారు. భారతీయ సైనిక బలగాలు, నౌకదళంతో ఏపీ ఇప్పటికే పలు ఒప్పందాలు కుదుర్చుకుందని, రామాయపట్నం పోర్టులో నేవీ బేస్, దొనకొండలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఏర్పాటులను గౌతంరెడ్డి ఉదహరించారు. సబ్‌మెరైన్, ఎయిర్‌క్రాఫ్ట్ బేస్, ఆఫ్‌షోర్ రిజర్వులతో ఇప్పటికే విశాఖ కీలక కేంద్రంగా ఉందన్నారు. -
వ్యవసాయానికి ఉద్దీపన వద్దా?
గ్రామీణ కుటుంబాల ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోందని అన్ని జాతీయ స్థాయి నివేదికలూ సూచిస్తున్నాయి. కానీ ఆర్థికవేత్తలు మాత్రం నిరుపేదలను ఆదుకోకుండా ఉండటం ఎలా అనే అంశంపై రెండుగా చీలిపోయి ఉన్నారు. ఆర్థిక మందగమనం అనే వ్యాధికి చికిత్స మాత్రం నిచ్చెనమెట్ల మీద ఉన్నవారికే అందించాలని వీరు సూచిస్తున్నారు. దేశ జనాభాలో 50 శాతానికి పైగా ప్రజలకు ఆలంబనగా ఉంటున్న వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతున్నప్పుడు ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం కూడా తీవ్రంగానే ఉంటుంది. అందుచేత వ్యవసాయాన్ని పునరుద్ధరించడమే కీలక విషయం. ప్రస్తుతం భారతీయ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక ఉద్దీపన అవసరం ఏ రంగానికైనా ఉంది అంటే అది వ్యవసాయ రంగం మాత్రమే. పేదల చేతికి ఎంత ఎక్కువగా డబ్బు అందిస్తే అంత ఎక్కువగా దేశంలో డిమాండ్ సృష్టించవచ్చు. ఇదే ఇప్పుడు అత్యంత అవసరమైన చర్య. దశాబ్దాలుగా భారతీయ వ్యవసాయం దుస్థితి బాటలో సాగుతోందని సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. దేశ ప్రజలు వినియోగంపై వెచ్చిస్తున్న వ్యయంపై, లీక్ అయిన ‘నేషనల్ సాంపిల్ సర్వే ఆఫీసు (ఎన్ఎస్ఎస్ఓ) 2017–18’ నివేదిక ప్రకారం గ్రామీణ కుటుంబాలు ఆహా రంపై అతితక్కువగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం బుట్ట దాఖలు చేయాలని నిర్ణయించిందనుకోండి. పోతే ‘2016 ఎకనమిక్ సర్వే’ మరింత చేదు వార్తను తెలిపింది. దేశంలోని 17 రాష్ట్రాల సగటు వ్యవసాయ కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 20,000కు మించి లేదట. అంటే వ్యవసాయ కుటుం బాలు రోజువారీ వినియోగంపై ఎంత తక్కువగా ఖర్చుపెడుతున్నాయో దీన్నిబట్టే తెలుస్తుంది. ‘వినియోగ వ్యయంపై సర్వే’ ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో ఆహారంపై నెలకు సగటున ఒక కుటుంబం రూ. 580 లు (రోజుకు 19 రూపాయలు) మాత్రమే ఖర్చుపెడుతోందని వెల్లడించగా, ఎకనమిక్ సర్వే మరింత ఆసక్తికరమైన డేటాను బయటపెట్టింది. వ్యవసాయ కుటుంబాలు అమ్మగలుగుతున్న ఉత్పత్తులపైనే కాకుండా గృహ వినియోగం కోసం వారు భద్రపర్చుకున్న ఆదాయాన్ని కూడా కలుపుకుని రైతు కుటుంబాల ఆదాయాన్ని అది వెల్లడించింది. దేశం లోని వ్యవసాయ కుటుంబాలు నెలకు రూ. 1,700 కంటే తక్కువ ఆదాయ స్థాయిలతో ఎలా జీవిస్తున్నాయా అని ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. వ్యవసాయ ధరలు కనిష్టస్థాయిలో ఉంటూండగా, వ్యవసాయ ఆదాయాలు 14 ఏళ్ల కనిష్టస్థాయికి పడిపోయాయి. ఇక వ్యవసాయ వేతనాలు కూడా గత కొన్నేళ్లుగా పతనమవుతూ వస్తున్నాయి. లీకైన మరొక డాక్యుమెంట్ ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2017–18’ నివేదిక ఇంకా దారుణమైన విషయం బయటపెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో 3.4 కోట్ల మంది దినసరి కూలీలు 2011–18 మధ్య కాలంలో తమ ఉపాధిని కోల్పోయారు. వీరిలో 3 కోట్లమంది వ్యవసాయ కూలీలే. గత 45 ఏళ్లలో నిరుద్యోగం పరాకాష్టకు చేరుకోవడంతో సంక్షోభం వ్యవసాయ పరిధిని దాటిపోయింది. ఈ అన్ని నివేదికలూ గ్రామీణ కుటుంబాల ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోందని సూచిస్తున్నాయి. రైతు కుటుంబాల ఆర్థిక సంపన్నతా లేమి అనేది భవిష్యత్తులో గ్రామీణ వ్యయంపై కూడా తన ప్రభావం చూపనుంది. అయితే ఆర్థికవేత్తలు మాత్రం అధోజగత్ సహోదరులను ఆదుకోకుండా ఉండటం ఎలా అనే అంశంపై రెండుగా చీలిపోయి ఉన్నారు. బలహీనమైన వినియోగదారీ డిమాండ్, ప్రైవేట్ పెట్టుబడులు మందగించిపోవడం అనే రెండు ప్రధాన అంశాలే ఆర్థిక వ్యవస్థను మందగింప జేస్తున్నాయని ప్రధాన స్రవంతి ఆర్థిక వేత్తలు ఒప్పుకుంటున్నారు. వీటివల్లే ఈ జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీయ ఆర్థిక వృద్ధి రేటు 4.5 శాతానికి పడిపోయింది. అంటే ఆరేళ్లలో ఇది అత్యంత తక్కువ వృద్ధి రేటు అన్నమాట. కానీ ఆర్థిక మందగమనం అనే వ్యాధికి చికిత్స మాత్రం నిచ్చెనమెట్ల మీద ఉన్నవారికే అందించాలని వీరు సూచిస్తున్నారు. అయితే పారిశ్రామిక సంస్థలు మాత్రం ఆర్థిక మందగమనాన్ని అవకాశంగా మల్చుకోవాలని చూస్తున్నాయి. చౌక శ్రమ, సరళతరమైన భూ సేకరణ, కార్పొరేట్ పన్ను తగ్గింపు, పన్నుల ఉగ్రవాదాన్ని తొలగించడం, దివాలా సమస్యలను సత్వరం తీర్చడం వంటి వాటి రూపంలో మరిన్ని సంస్కరణలను అమలు చేసేలా వ్యవస్థను ప్రభావితం చేయాలని ఇవి చూస్తున్నాయి. దీనికోసం సెక్టర్ ఆధారిత ఉద్దీపన కోసం పట్టుబడుతున్నాయి.పిరమిడ్ పునాదిపైనే మరింత దృష్టి పెట్టాలనే అంశాన్ని ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు అంగీకరిస్తుండగా, మరింత సంస్కరించడం ద్వారానే ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని కొంతమంది ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను ముందుకు నెట్టాలంటే కార్పొరేట్ పన్ను ఉద్దీపన, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ సెక్టార్, బ్యాంక్ కన్సాలిడేషన్, మూలధన సేకరణ, ఎగుమతి ప్రోత్సాహకాలు, మైక్రో, చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలకు కొన్నిరాయితీలు కల్పించడం అవసరమని వీరు చెబుతున్నారు. కొందరు ఆర్థికవేత్తలయితే ఇప్పటికే సంపదల మేట మీద సౌకర్యవంతంగా కూర్చున్న కొన్ని పరిశ్రమలకు పన్ను విధింపును ఎందుకు ఎత్తివేయాలని ప్రశ్నించారు. కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోవడానికి ఇది మార్గం కానే కాదని వీరు చెబుతున్నారు. ఇప్పటికే జీడీపీ 5 శాతం లోపు పడిపోయిన నేపథ్యంలో కార్పొరేట్ పన్ను రేటును భారీగా తగ్గించడం, ప్రతి సంవత్సరం 1.45 లక్షల కోట్ల ఉద్దీపనను అందించడం అనేది పన్ను రూపేణా వచ్చే ప్రభుత్వ రాబడిని మరింత బలహీన పరుస్తుంది. పన్ను రాయితీలు గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టులలో మరిన్ని పెట్టుబడులను కల్పించి వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తాయని, ఇది మరిన్ని ఉద్యోగాల కల్పనకు దారితీస్తుందని చేస్తున్న వాదనను అంతర్జాతీయ అనుభవం తోసిపుచ్చుతోంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక తగ్గించిన కార్పొరేట్ పన్నులు అటు పెట్టుబడులనూ తీసుకురాలేదని, ఇటు ఉద్యోగాలనూ కల్పించలేదని పైగా పన్నుల తగ్గింపు ద్వారా మిగిలిన మొత్తాన్ని కార్పొరేట్ రంగం స్టాక్ మార్కెట్లో మదుపు చేసిందని నోబెల్ గ్రహీత పాల్ క్రూగ్మన్ స్పష్టం చేశారు. కార్పొరేట్ పన్నులు భారీగా తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించగానే ఆ మరుసటి దినం భారతీయ స్టాక్ మార్కెట్లు పండుగ చేసుకున్నాయంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఆ సంబరాలు ఇంకా కొనసాగుతుండగా, పన్ను రేటు తగ్గింపు తర్వాత విదేశీ నిధుల ప్రవాహం పెరుగుతూ వచ్చింది. కానీ, కేవలం 5 రూపాయల బిస్కెట్ కూడా కొనలేకపోతున్న చాలామంది పేదవారి గురించీ, అష్టకష్టాలు పడి పండిం చిన పంటను మార్కెట్లో తగిన ధరకు అమ్ముకోలేకపోతున్న రైతుగురించీ, దినసరి వేతనాలను కూడా పొందడం కష్టమైపోతున్న వ్యవసాయ, వ్యవసాయేతర కూలీల గురించే నేను ఆందోళన చెందుతున్నాను. ఇక వ్యవసాయరంగంలో నిరుపేదలకు ఎలాంటి ప్రోత్సాహకాలనూ కేంద్రం ప్రకటించడం లేదు. గిట్టుబాటు ధర లేమితో 2000–2017 మధ్య 16 ఏళ్ల కాలంలో రూ. 45 లక్షల కోట్లను రైతులు నష్టపోయారు. కాగా గత రెండేళ్లలో వ్యవసాయ రంగ నిజ ఆదాయాల పెరుగుదల దాదాపుగా జీరోగా ఉంటోందని నీతి ఆయోగ్ సొంత అంచనాలే చూపుతున్నాయి. మరోమాటలో చెప్పాలంటే, గత రెండు దశాబ్దాలుగా రైతుల ఆదాయాలు పతనబాటలోనే నడుస్తున్నాయి. వ్యవసాయ వేతనాల్లో వృద్ధి రేటు కూడా పడిపోతోంది. దేశ జనాభాలో 50 శాతానికి పైగా ప్రజలకు ఆలంబనగా ఉంటున్న వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతున్నప్పుడు ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం కూడా తీవ్రంగానే ఉంటుంది. అందుచేత వ్యవసాయాన్ని పునరుద్ధరించడమే కీలక విషయం. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక ఉద్దీపన అవసరం ఏ రంగానికైనా ఉంది అంటే అది వ్యవసాయ రంగం మాత్రమే. రైతులకు పరిహారం చెల్లించాల్సిన సమయం కూడా నేడు ఆసన్నమైంది. పారిశ్రామిక రంగానికి రూ.1.45 లక్షల కోట్ల రూపాయల పన్ను రాయితీని కేటాయించినప్పుడు, అదే మొత్తాన్ని వ్యవసాయ రంగానికి కూడా అందిస్తే ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్ కింద ఇప్పుడు ఇస్తున్న మొత్తాన్ని ప్రతి రైతు కుటుంబానికి మూడు రెట్లు పెంచి ఇవ్వవచ్చు. అంటే సంవత్సరానికి ఒక్కో రైతుకు రూ. 18,000లు, లేక నెలకు రూ. 1,500లు ఇవ్వవచ్చు. ఈ పథకాన్ని భూమి లేని రైతుకూలీలకు కూడా పొడిగించవచ్చు. ఇప్పటికే పీఎం–కిసాన్ పథకం కింద రూ. 75,000ల కోట్లు కేటాయించారు. దీనికి మరొక రూ. 1.45 లక్షల కోట్లను అదనంగా చేర్చి ఇవ్వాల్సి ఉంది. పేదల చేతికి ఎంత ఎక్కువగా డబ్బు అందిస్తే అంత ఎక్కువగా డిమాండ్ సృష్టించవచ్చు. ఈ చర్యలతోపాటు ప్రభుత్వ ధాన్యసేకరణను మరింత సమర్థవంతంగా చేయడానికి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ అజమాయిషీలో నడిచే మండీల నెట్వర్క్ని విస్తరించాలి. అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధరకు ప్రకటించిన మేరకు హామీ ఇవ్వాలి. లోటును చెల్లించడం ద్వారా కనీస మద్దతు ధర, మార్కెట్ ధరలకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలి. వీటికి అదనంగా కేరళ అనుభవం నుంచి పాఠాలు తీసుకుని ప్రతి రాష్ట్రంలోనూ రుణ ఉపశమన కమిషన్‌ను ఏర్పర్చాలి. గ్రామీణ రహదారులు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు వంటి ప్రజా రంగ సేవలపై అధిక మదుపును చేయాలి. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
సెన్సెక్స్ 41,164 స్థాయిని అధిగమిస్తే..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ఫైనాన్షియల్ మార్కెట్లను నెలల తరబడి ఆందోళన పరుస్తున్న రెండు అంశాలు ఒక కొలిక్కి వచ్చాయి. అమెరికా–చైనాల మధ్య తొలిదశ వాణిజ్య ఒప్పందం కుదిరిందన్న ప్రకటన వెలువడటం, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ సజావుగా వైదొలగడానికి (సాఫ్ట్ బ్రెగ్జిట్) అవసరమైన మెజారిటీని ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ, ప్రధాని బోరిస్ జాన్సన్ సాధించడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, మార్కెట్లకు పెద్ద ఊరటనిచ్చే అంశాలు. మన దేశ జీడీపి బాగా పడిపోవడం, పారిశ్రామికోత్పత్తి క్షీణించడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి ప్రతికూలాంశాల్ని సైతం తలదన్ని... ప్రపంచ సానుకూల పరిణామాల ప్రభావంతో స్టాక్ మార్కెట్ మరోదఫా రికార్డుస్థాయిని సమీపించింది. గత ఆరునెలల్లో ఎన్నోదఫాలు రికార్డుస్థాయి వద్ద జరిగిన బ్రేకవుట్లు విఫలమయ్యాయి. ట్రేడ్ డీల్, బ్రెగ్జిట్ సమస్యలకు పరిష్కారం లభించబోతున్నందున, ఈ వారం మన మార్కెట్ వ్యవహరించే శైలి... దీర్ఘ, మధ్యకాలిక ట్రెండ్‌కు కీలకం కానున్నది. ఇక సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా ఉన్నాయి... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... డిసెంబర్ 13తో ముగిసినవారంలో మూడోరోజైన బుధవారం 40,135 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన బీఎస్ఈ సెన్సెక్స్... అదేరోజున రికవరీ ప్రారంభించి, చివరిరోజైన శుక్రవారం 41,056 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగింది. చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 565 పాయింట్ల లాభంతో 41,010 పాయింట్ల వద్ద ముగిసింది. నవంబర్ 28 నాటి 41,164 పాయింట్ల రికార్డుస్థాయి సెన్సెక్స్‌కు ఈ వారం కీలకం కానుంది. ఈ స్థాయిని బలంగా ఛేదిస్తే వేగంగా 41,400 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన ర్యాలీ కొనసాగితే 41,650 పాయింట్ల వరకూ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వారంలో రికార్డుస్థాయిపైన స్థిరపడలేకపోయినా, బలహీనంగా ప్రారంభమైనా 40,850–40,710 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే 40,590 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 40,330 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. నిఫ్టీకి 12,160 కీలకస్థాయి నిఫ్టీ గతవారం 11,832 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన తర్వాత వేగంగా 12,098 పాయింట్ల గరిష్టస్థాయిని చేరింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 165 పాయింట్ల లాభంతో 12,087 పాయిం ట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీకి నవంబర్ 28 నాటి 12,158 పాయింట్ల రికార్డుస్థాయే కీలకం. ఈ స్థాయిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో అధిగమిస్తే 12,220 పాయింట్ల స్థాయిని అందు కోవొచ్చు. అటుపైన క్రమేపీ 12,250–1300 పాయింట్ల శ్రేణిని చేరవచ్చు. ఈ వారం పైన ప్రస్తావించిన కీలకస్థాయిని దాటలేకపోయినా, బలహీనంగా ప్రారంభమైనా 12,035–12,005 పాయింట్ల వద్ద తక్షణ మద్దతును పొందవచ్చు. ఈ లోపున ముగిస్తే 11,950 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 11,880 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. -
ప్రైవేట్...‘సై’రన్
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో మందగమనం నేపథ్యంలో ఆదాయాన్ని పెంచుకునే దిశగా కేంద్రం భారీ స్థాయిలో ప్రైవేటీకరణకు తెరతీసింది. పలు ప్రభుత్వ రంగ దిగ్గజాల్లో (పీఎస్‌యూ) డిజిన్వెస్ట్‌మెంట్ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చమురు దిగ్గజం బీపీసీఎల్, షిప్పింగ్ సంస్థ ఎస్సీఐ, కార్గో సేవల సంస్థ కాన్‌కర్‌లో వాటాల విక్రయానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో పాటు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను 51 శాతం లోపునకు తగ్గించుకునే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. దీని ప్రకారం, దేశీయంగా రెండో అతి పెద్ద రిఫైనర్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)లో కేంద్రం తనకున్న మొత్తం 53.29% వాటాలను విక్రయించడంతో పాటు యాజమాన్య అధికారాలను కూడా బదలాయించనుంది. ఇందులో నుమాలిగఢ్ రిఫైనరీని మినహాయించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రైవేటీకరణపై ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళన తలెత్తకుండా చూసేందుకు దీన్ని ప్రభుత్వ రంగ చమురు సంస్థ పరిధిలోకి చేర్చనున్నట్లు ఆమె వివరించారు. మరోవైపు, కార్పొరేట్ ట్యాక్స్‌ను 22 శాతానికి తగ్గిస్తూ ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ స్థానంలో ప్రత్యేక బిల్లును క్యాబినెట్ ఆమోదించింది. దీన్ని ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు, ఇతర ఊరట చర్యల కారణంగా ప్రభుత్వానికి ఏటా రూ. 1.45 లక్షల కోట్ల మేర ఆదాయం తగ్గనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 1.05 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. క్యాబినెట్ నిర్ణయాల్లో ముఖ్యాంశాలు.. ► షిప్పింగ్ కార్పొరేషన్(ఎస్సీఐ)లో మొత్తం 63.75% వాటాలను.. అలాగే కంటెయినర్ కార్పొరేషన్(కాన్కర్)లో 30.9% వాటాలు ప్రభుత్వం విక్రయించనుంది. ప్రస్తుతం కాన్‌కర్‌లో కేంద్రానికి 54.80 శాతం వాటాలు ఉన్నాయి. ► టీహెచ్‌డీసీ ఇండియా, నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (నీప్కో)లో మొత్తం వాటాలను ఎన్టీపీసీకి కేంద్రం విక్రయించనుంది. ► నియంత్రణ అధికారాలు తనకే ఉండే విధంగా.. ఇండియన్ ఆయిల్(ఐవోసీ)లో వాటాలను 51% లోపునకు తగ్గించుకోనుంది. ఇందులో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకున్న వాటాల కారణంగా నియంత్రణాధికారాలు కేంద్రానికే ఉంటాయి. ఐవోసీలో కేంద్రానికి ప్రస్తుతం 51.5% వాటా ఉండగా... 26.4% వాటాలను దాదాపు రూ. 33,000 కోట్లకు విక్రయించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ► కాంట్రాక్టర్లు, ప్రభుత్వ సంస్థలకు మధ్య నెలకొనే చెల్లింపుల వివాదాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భాల్లో ప్రభుత్వ సంస్థలు ఆర్బిట్రేషన్ ఉత్తర్వులను సవాల్ చేసినా.. చెల్లించాల్సి న మొత్తంలో 75%(బ్యాంకు పూచీకత్తుకు ప్రతి గా) కాంట్రాక్టరుకు చెల్లించేందుకు ఓకే చెప్పింది. టెల్కోలకు ఊరట.. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న టెలికం కంపెనీలకు ఊరటనిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. టెల్కోలు కట్టాల్సిన స్పెక్ట్రం చెల్లింపులకు సంబంధించి రెండేళ్ల పాటు మారటోరియం విధించింది. 2020–21, 2021–22 సంవత్సరాల్లో జరపాల్సిన చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. దీంతో భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో సంస్థలకు సుమారు రూ. 42,000 కోట్ల మేర ఊరట లభించనుంది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) వివాదంలో ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో టెల్కోలు..దాదాపు 1.4 లక్షల కోట్ల మేర లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు కట్టాల్సి రానున్న సంగతి తెలిసిందే. -
పెళ్లిళ్లు అవుతున్నాయ్.. మాంద్యమెక్కడ?
న్యూఢిల్లీ: ‘విమానాశ్రయాలు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రజలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి’ అని కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సురేశ్ అంగడీ అన్నారు. ఆర్థికమాంద్య పరిస్థితులు ఉన్నాయని అసత్యాలు ప్రచారం చేసి ప్రధాని మోదీ ప్రతిష్టను తగ్గించేందుకే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ‘మూడేళ్లకు ఒకసారి ఆర్థిక వ్యవస్థ కొంత మందగించడం సహజమే. అది త్వరలోనే సర్దుకుంటుంది’ అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌సహా ప్రతిపక్ష పార్టీలు ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తాలని యోచిస్తున్నాయి. దీనిపై సురేశ్ అంగడీ మాట్లాడుతూ, ఆర్థిక మందగింపు సహజమేనని, త్వరలో పుంజుకుంటుందని, ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని విమర్శించేందుకు కారణం లేక, దీనిని ప్రస్తావిస్తున్నాయని ఎద్దేవా చేశారు. -
డిపాజిట్లపై ఇన్సూరెన్స్ పెంపు చట్టం శీతాకాల సమావేశాల్లోనే!
న్యూఢిల్లీ: బ్యాంకు డిపాజిట్లపై ప్రస్తుతమున్న రూ.లక్ష బీమా మొత్తాన్ని మరింతగా పెంచేందుకు అవసరమైన చట్టాన్ని రానున్న పార్లమెంటు సమావేశాల్లోనే తీసుకురానున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే, కోపరేటివ్ బ్యాంకుల నియంత్రణకు సంబంధించిన చట్టాన్ని కూడా తేనున్నట్టు చెప్పారు. మంత్రి శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సంక్షేమ కార్యక్రమాలపై వ్యయాలకు కోత విధించే ప్రణాళికేమీ లేదన్నారు. బడ్జెట్లో కేటాయించిన మేరకు పూర్తి నిధుల వినియోగం దిశగా అన్ని శాఖలను ప్రోత్సహించనున్నట్టు చెప్పారు. ఈ నెల 18 (సోమవారం) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏ ఒక్క కంపెనీ వెళ్లిపోకూడదు.. టెలికం కంపెనీల సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తున్నట్టు మంత్రి చెప్పారు. ‘‘ఏ కంపెనీ కూడా కార్యకలాపాలను మూసివేయాలని కోరుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ కార్యకలాపాలు కొనసాగించాలి. వ్యాపారాల్లో ఎన్నో కంపెనీలు కొనసాగే ఆర్థిక వ్యవస్థను కోరుకుంటున్నాం. ఒక్క టెలికం రంగమే కాదు.. ప్రతీ రంగంలోనూ ప్రతీ కంపెనీ కొనసాగాలన్నదే నా అభిలాష’’ అని మంత్రి బదులిచ్చారు. టెలికం కంపెనీలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు సెక్రటరీలతో ఏర్పాటు చేసిన కమిటీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రభుత్వం నుంచి సహకారం లేకపోతే భవిష్యత్తులో అదనపు పెట్టుబడులు పెట్టడం అసాధ్యమంటూ వొడాఫోన్ ఐడియా కంపెనీ పేర్కొన్న విషయం తెలిసిందే. -
వృద్ధి పుంజుకుంటుంది
న్యూఢిల్లీ: కేంద్రం ఇటీవల తీసుకుంటున్న చర్యలు ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతాయని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆయా నిర్ణయాలు దేశంలో పెట్టుబడులను ఆకర్షిస్తాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. 21వ అసోచామ్ జేఆర్డీ టాటా స్మారక ఉపన్యాసం చేసిన ఉప రాష్ట్రపతి, జేఆర్డీ టాటా భారత పారిశ్రామిక దిగ్గజమే కాకుండా, ఒక దార్శనికత కలిగిన నాయకుడని ప్రశంసించారు. -
జీఎస్టీ వసూళ్లు పేలవమే..!
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు అక్టోబర్‌లో 5.29 శాతం తగ్గాయి. రూ.95,380 కోట్లుగా నమోదయా్యయి. 2018 ఇదే నెల్లో ఈ వసూళ్లు రూ.1,00,710 కోట్లు. శుక్రవారం ప్రభుత్వం ఈ గణాంకాలను విడుదల చేసింది. జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లకన్నా తగ్గడం ఇది వరుసగా మూడవనెల. నిజానికి పండుగల సీజన్ కావడంతో అక్టోబర్‌లో అయినా రూ. లక్ష కోట్లపైబడి జీఎస్టీ వసూళ్లు జరుగుతాయన్న అంచనా ఉంది. అయితే ఈ అంచనాలూ తప్పడం ఆర్థిక వ్యవస్థలో మందగమనాన్ని ప్రతిబింబిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. సెపె్టంబర్లో జీఎస్టీ వసూళ్లు రూ.91,916 కోట్లు. గణాంకాల ప్రకారం కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.95,380 కోట్లు. అందులో సెంట్రల్ జీఎస్టీ వాటా రూ.17,582 కోట్లు. స్టేట్ జీఎస్టీ వాటా రూ.23,674 కోట్లు. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (ఐజీఎస్టీ) రూ.46,517 కోట్లు. సెస్ రూ.7,607 కోట్లు. అక్టోబర్‌లో తయారీ నీరసం! తయారీ రంగం అక్టోబర్‌లో నిరాశను మిగిలి్చంది. ఐహెచ్ఎస్ మార్కెట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 50.6 పాయింట్లుగా నమోదయ్యింది. గడచిన రెండేళ్లలో ఇంత తక్కువ స్థాయి సూచీ ఇదే తొలిసారి. సెపె్టంబర్లో ఈ సూచీ 51.4 వద్ద ఉంది. అయితే పీఎంఐ 50 పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణించడం జరుగుతుంది. -
వ్యాపారానికి భారత్ భేష్..
వాషింగ్టన్: వ్యాపారం సులభంగా నిర్వహించేందుకు వీలున్న దేశాల జాబితాలో భారత ర్యాంక్ మరింత మెరుగుపడింది. ప్రపంచ బ్యాంక్ తాజాగా ప్రకటించిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకుల్లో మన దేశం 63వ స్థానాన్ని సొంతం చేసుకుంది. గతేడాదిలో 77వ స్థానానికి చేరి సంచలనం సృష్టించిన భారత్.. ఈ సారి ఏకంగా మరో 14 మెట్లు పైకెక్కింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన నేపథ్యంలో ఆర్బీఐ, ఐఎంఎఫ్, పలు రేటింగ్ ఏజెన్సీలు దేశ వృద్ధి రేటులో కోతను విధించిన ప్రస్తుత తరుణంలో భారత ర్యాంక్ మరింత మెరుగుపడడం విశేషం కాగా.. వరుసగా మూడో సారి కూడా టాప్ 10 మెరుగైన దేశాల్లో స్థానం కొనసాగడం మరో విశేషంగా నిలిచింది. ఈ విధమైన రికార్డులను నెలకొల్పడం భారత్‌కే సాధ్యపడిందని వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ సిమియన్ జంకోవ్ కొనియాడారు. వచ్చే రెండేళ్లలో టాప్ 50 వ్యాపార సులభతర దేశాల జాబితాలోకి చేరాలన్న భారత్ లక్ష్యానికి అనుకూలంగా ఇక్కడి వాతావరణం మారుతోందన్నారు. స్పైస్ సూపర్..: భారత్‌లో కంపెనీలను సునాయసంగా ప్రారంభించడం కోసం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. స్పైస్ (సరళీకృత ఎలక్ట్రానిక్ నమోదు) పేరిట నూతన ఒరవడిని సృష్టించింది. ఇదే సమయంలో ఫైలింగ్ రుసుమును రద్దు చేయడం వంటి వ్యాపార సానుకూల నిర్ణయాలను తీసుకుంది. ఢిల్లీలో నిర్మాణ అనుమతులు పొందేందుకు సమయం, ఖర్చులను గణనీయంగా తగ్గించడం.. పరిపాలనా సంస్కరణలు వంటి కీలకాంశాలు భారత ర్యాంకును మరింత పైకి చేర్చాయని ప్రపంచ బ్యాంక్ ఈ సందర్భంగా వెల్లడించింది. జీఎస్టీ సరళీకరణతో మరింత మెరుగు.. వస్తు, సేవల పన్నును మరింత సరళతరం చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తద్వారా నిర్దేశిత లక్ష్యమైన అగ్ర స్థాయి 50 దేశాల జాబితాలోకి చేరుకోవడానికి వీలుంటుందని వివరించారు. జీఎస్టీని సులభతరం చేయడం అనేది కొనసాగుతున్న ప్రక్రియ కాగా, ప్రస్తుతం రిటర్నుల ఆన్లైన్ ఫైలింగ్‌లో ఉన్నటువంటి అవాంతరాలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. -
370 అధికరణ 1953లోనే రద్దయిందా?
ఇలా కుతూహలాన్ని రేకెత్తించే మరిన్ని ప్రశ్న లు.. వాటికి సమాధానాలకు బుధవారం హైదరాబాద్‌లోని ‘శిల్పకళా వేదిక’సాక్ష్యంగా నిలిచింది. జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సం దర్భంగా ఏర్పాటు చేసిన ‘మంథన్ సంవాద్’లో దేశంలో ప్రస్తుత పరిస్థితులు.. ఎదుర్కొంటున్న సమస్యలపై పలువురు తమ భావాలు వెల్లడిం చారు. ఆర్థిక వ్యవస్థ లక్ష్యాలు మందగమనంపై కేంద్ర ఆర్థిక సలహాదారు కె.వి.సుబ్రమణియన్ తన గళాన్ని వినిపించారు. కశ్మీర్ పరిస్థితిపై చరిత్రకారుడు శ్రీనాథ్ రాఘవన్ తనదైన విశ్లేషణ చేశారు. ఈ కాలానికి గాంధీతత్వం ఎలా అనుసరణీయమో ప్రొఫెసర్ సుదర్శన్ అయ్యంగార్ వివరించారు. భారత రాజ్యాంగం ప్రజలకిచ్చిన హక్కులేంటి.. వాటిని కాపాడుకునేందుకు అంద రూ గళమెత్తాల్సిన అవసరమేంటన్న దానిపై సుప్రీంకోర్టు న్యాయవాది మేనక గురుస్వామి ఉపన్యసించారు. – సాక్షి, హైదరాబాద్ అందరూ రాజ్యాంగ పరిరక్షకులే ఇంకొకరి స్వాతంత్య్రంపై నిర్బంధాలు విధిస్తే పౌరులు తమకేంటని అనుకుంటే పొరపాటేనని.. భవిష్యత్తులో అది వారి స్వేచ్ఛ ను హరించే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనక గురుస్వామి అన్నారు. హక్కుల ఉల్లంఘన జరిగిన ప్రతిసారి న్యాయస్థానాల్లో సవాల్ చేయడం ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని సూచించారు. జమ్మూ, కశ్మీర్లో రెండు నెలలుగా ప్రజలకు వైద్య సేవలు అందట్లేదని, అధికారాన్ని ప్రశ్నించేందుకు, హక్కులను కాపాడుకునేందుకు అందు బాటులో ఉన్న అత్యంత శక్తిమంతమైన హెబియస్ కార్పస్ పిటిషన్లకూ దిక్కులేకుండా పోతోందన్నారు. ఎమర్జెన్సీ సమయం లోనూ ఈ పిటిషన్లపై 24 గంటల్లో విచారణ జరిగేదని గుర్తు చేశారు. – మేనక గురుస్వామి అందుకోదగ్గ లక్ష్యమే 2014–19 మధ్య కాలంలో 7.5 శాతం సగటు వృద్ధితో ముందుకెళ్తున్న భారత్.. ప్రధాని మోదీ ఆశిస్తున్నట్లు ఐదు ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యమేమీ కాదని కె.వి.సుబ్రమణియన్ స్పష్టం చేశారు. ఈ లక్ష్యం చేరాలంటే ఏటా ఎనిమిది శాతం వృద్ధి రేటు, కొన్ని విధానపర మార్పులు అవసరమని తెలిపారు. జీడీపీపై ప్రభుత్వం ఇస్తున్న అంకెలు సరైనవేనని భావిస్తు న్నట్లు చెప్పారు. ఆర్థిక మంద గమనాన్ని ఎదుర్కొనేందుకు పెట్టుబడులను ఆకర్షిం చాల్సిన అవసరముందని, ఇది ఉత్పాదకతను పెంచు తుందని.. ఫలితంగా మరిన్ని ఉద్యోగాలు, ఎగుమతులు జరు గుతాయని.. వీటన్నింటి కారణంగా వస్తు, సేవలకు డిమాండ్ పెరిగి ఆర్థిక వ్యవస్థ మరిన్ని పెట్టుబడులు ఆకర్షిస్తుందని వివరించారు. – కె.వి.సుబ్రమణియన్ 1953లోనే తూట్లు జమ్మూ, కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు సాంకేతికంగా 2019లో జరిగినా.. ఆ చట్టం తాలూకు అసలు స్ఫూర్తికి 1953లోనే తూట్లు మొదలయ్యాయని చరిత్రకారుడు, మాజీ సైనికాధికారి శ్రీనాథ్ రాఘవన్ తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు భారత ప్రధానిగా నెహ్రూ స్థానంలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఉండి ఉంటే కశ్మీర్ సమస్య వచ్చి ఉండేది కాదనే వారు.. ఆనాటి కేబినెట్ సమావేశాల వివరాలు చదువుకోవాలని, 370 అధికరణ రూపకల్పనలో అప్పటి రక్షణ మంత్రి అయిన వల్లభ్‌భాయ్ పటేల్ ఎంత కీలక పాత్ర పోషించారో.. అప్పటి కేంద్ర మంత్రి శ్యామాప్రసాద్ ముఖర్జీ ఎలా మద్దతిచ్చారో తెలుసుకోవాలని హితవు పలికారు. 1953లో షేక్ అబ్దుల్లాను నెహ్రూ గద్దె దింపడంతోనే 370 అధికరణ స్ఫూర్తికి తూట్లుపడటం మొదలైందని, తర్వాతి కాలంలో రాష్ట్రపతి ఉత్తర్వుల పేరుతో భారత రాజ్యాంగం ముప్పావు వంతు అక్కడ అమల్లోకి వచ్చిందని తెలిపారు. – శ్రీనాథ్ రాఘవన్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అవసరమా? ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న వ్యక్తిగత, సామాజిక, ప్రాకృతిక సమస్యలకు మహాత్మాగాంధీ ఎప్పుడో సమాధానం చెప్పారని.. ఈ కాలంలోనూ గాంధీతత్వం అనుసరణీయమన్నారు సుదర్శన్ అయ్యంగార్. మహాత్ముడి సిద్ధాం తాలను పరిపూర్ణంగా ఆచరించడం ఈ కాలపు అవసరమని తెలిపారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థపై అందరూ మాట్లాడుతున్నారని.. కానీ అది ఎందుకన్న ప్రశ్న మాత్రం ఎవరూ వేయకపోవడం శోచనీయమన్నారు. ఒకరమైన ఆందోళ నకరమైన వాతావరణం నెలకొన్న ఈ తరుణంలో అధికారంలో ఉన్న వారికి కీలకమైన ప్రశ్నలు వేయాల్సిన అవసరం ఉందన్నారు. – సుదర్శన్ అయ్యంగార్ -
ఆర్థిక పునరుజ్జీవానికి మరో అస్త్రం!
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ మళ్లీ జీవం పోసుకునేందుకు గాను కేంద్ర ప్రభుత్వం మరో విడత ప్రోత్సాహక చర్యల ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. జూన్ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే. ప్రోత్సాహక చర్యల బ్లూప్రింట్ సిద్ధమైందని, కొన్ని రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటిస్తారని ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. అంతకుమించి ఆయన వివరాలు తెలియజేయలేదు. ఇప్పటికే కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ మూడు సార్లు ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించారు. రియల్ ఎస్టేట్ రంగానికి ప్రత్యేక నిధి, ఎగుమతుల రంగాలకు రూ.50,000 కోట్ల పన్ను రాయితీలు, ఆటోమొబైల్ రంగానికి ప్రోత్సాహకాలు ఇప్పటి వరకు ప్రకటించిన వాటిల్లో ఉన్నాయి. తొలిసారి ఆగస్ట్ 23న ప్రకటనలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై పెంచిన సర్‌చార్జీని ప్రభుత్వం ఉపసంహరించుకుంది కూడా. అంతకుముందు బడ్జెట్లో ఈ ప్రకటన చేసిన నాటి నుంచి ఎఫ్‌పీఐలు అదే పనిగా పెద్ద ఎత్తున మార్కెట్లో విక్రయాలు చేస్తుండడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. కాగా, ప్రభుత్వం నుంచి మరిన్ని చర్యలు ఉంటాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సైతం ఇటీవలే అభిప్రాయపడ్డారు. ‘‘సరైన చర్యలు తీసుకుంటే కచి్చతంగా పరిస్థితులు మెరుగుపడతాయి. ప్రభుత్వం వేగంగా స్పందిస్తుండడం సానుకూలం. ఆరి్థక పరిస్థితులను చక్కదిద్దే విషయంలో ప్రభుత్వం నుంచి ఇవే చివరి చర్యలని భావించడం లేదు. ఇవి కొనసాగుతూనే ఉంటాయి. తప్పకుండా సవాళ్లను వారు పరిష్కరిస్తారు’’ అని దాస్ ఇటీవలే పేర్కొన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆరి్థక వ్యవస్థగా రానున్న ఐదేళ్లలో అవతరించేందుకు, ప్రభుత్వరంగ బ్యాంకులను మరింత బలోపేతం చేయాలని భావించిన సర్కారు భారీ విలీనాల దిశగా కూడా అడుగు వేసింది. -
ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూ¯Œ ) కేవలం 5 శాతం వృద్ధి నమోదుచేసుకోవడం ‘ఆశ్చర్యకరం’ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ‘‘క్యూ1లో కనీసం 5.8 శాతం వృద్ధి ఉంటుందని ఆర్బీఐ అంచనావేసింది. 5.5 శాతం ఎంతమాత్రం తగ్గదన్న విశ్లేషణలూ వచ్చాయి. అయితే అంతకన్నా తక్కువకు పడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది’’ అని గవర్నర్ ఇక్కడ ఒక చానెల్‌కు ఇచి్చన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు వృద్ధిని తిరిగి పుంజుకునేలా చేస్తాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలాగే గడచిన నాలుగు ద్వైమాసికాల్లో ఆర్బీఐ 1.1 శాతం రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 5.4 శాతం) కోతకూడా ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యవస్థాగత సంస్కరణల విషయాన్ని ఇప్పటికే తన వార్షిక నివేదికలో ఆర్బీఐ ప్రస్తావించిన విషయాన్ని గవర్నర్ ప్రస్తావించారు. ‘‘ఇందులో ప్రధానమైనది వ్యవసాయ మార్కెటింగ్. ఈ విభాగంలో ప్రభుత్వం నుంచి కీలక చర్యలు ఉంటాయని భావిస్తున్నా’’ అని గవర్నర్ అన్నారు. ‘‘వృద్ధి మందగమనానికి కేవలంఅంతర్జాతీయ అంశాలే కారణమని నేను చెప్పను. ఇందుకు దేశీయ అంశాలూ కొన్ని కారణమే’’ అని కూడా గవర్నర్ వ్యాఖ్యానించడం విశేషం. సౌదీ ఆయిల్ సంక్షోభం పరిణామాలు ఎలా ఉంటాయన్న విషయం ఊహించలేమని గవర్నర్ అన్నారు. అలాగే వాణిజ్య యుద్ధ అనిశి్చతిపైనా ఏదీ చెప్పలేమన్నారు. ఆయా అంశాలన్నీ వృద్ధితీరుపై ప్రభావం చూపుతాయని తెలిపారు. రెపో రేటు కోతతో సరిపోదు: ఎస్బీఐ ఇదిలావుండగా, కేవలం రెపో రేటు కోత వృద్ధికి దోహదపడదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది. వ్యవస్థలో డిమాండ్ మెరుగుదల చర్యలు అవసరమని తెలిపింది. -
ఉద్దీపన ప్యాకేజీతో ఎకానమీకి ఊతం: సీఐఐ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన చర్యలు ఆర్థిక వ్యవస్థను స్థిరపర్చగలవని పరిశ్రమల సమాఖ్య సీఐఐ పేర్కొంది. బహుళ రంగ, బహుముఖ విధానపరమైన చర్యలతో వృద్ధికి ఊతం లభించగలదని సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ తెలిపారు. అంతర్జాతీయంగా ప్రతికూలతలు, వాణిజ్యపరమైన మందగమనం కారణంగా ప్రపంచ ఎకానమీకి అస్తవ్యస్తంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రకటన పరిశ్రమలకు ఊరటనిచ్చేవిగా ఉన్నాయని చెప్పారు. ‘ద్రవ్య లోటుపై ఒత్తిడి పడకుండా బహుళ రంగాలకు ఊతమిచ్చే ప్రతిపాదనలు రూపొందించిన తీరు ప్రశంసనీయం. ఈ ప్రకటనలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిక్సర్ కొట్టారు’ అని కిర్లోస్కర్ తెలిపారు. కొద్ది నెలల్లో ఎకానమీ మళ్లీ పుంజుకోగలదని సీఐఐ ఆశాభావం వ్యక్తం చేసింది.