సాక్షి, న్యూఢిల్లీ: కొన్ని వారాల ప్రయత్నాలతో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అన్‌లాక్ 1.0 పరిస్థితులు, భావి ప్రణాళికలపై చర్చించేందుకు ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం దాదాపు రెండు గంటలపాటు సాగింది. కోవిడ్ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడడం ఇది ఆరోసారి. కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్న 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధానమంత్రి మంగళవారం మాట్లాడారు. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని.. దేశంలో కొన్ని వారాలుగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ప్రధాని వివరించారు. మహమ్మారిని ఎదుర్కోవటానికి సకాలంలో తీసుకున్న నిర్ణయాలు దేశంలో దాని వ్యాప్తిని నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేశాయని ప్రధాని తెలిపారు. సహకార సమాఖ్యవాదానికి మనం ప్రపంచానికి ఒక ఉదాహరణను అందించామని ప్రజలు గుర్తుంచుకుంటారని ఆయన అన్నారు. ప్రతి ప్రాణాన్ని కాపాడటానికి ప్రయత్నించామని ప్రధాని అన్నారు. ప్రపంచవ్యాప్త ఆరోగ్య నిపుణులు భారతీయులు చూపిన క్రమశిక్షణను ప్రశంసిస్తున్నారని, దేశంలో రికవరీ రేటు ఇప్పుడు 50% పైగా ఉందని ఆయన అన్నారు. క్రమశిక్షణ సడలితే వైరస్‌కు వ్యతిరేకంగా మన పోరాటం బలహీన పడుతుందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment