న్యూఢిల్లీ: విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, ప్రార్థనా స్థలాలు, ప్రజా రవాణా.. తదితర ప్రజలు గుమికూడే ప్రదేశాలపై మే 3 తరువాత కూడా నిషేధం కొనసాగే అవకాశముందని అధికారులు సోమవారం తెలిపారు. ఈ మేరకు ప్రధాని, ముఖ్యమంత్రుల సమావేశంలో సంకేతాలు వచ్చాయన్నారు. అయితే, లాక్‌డౌన్ కొనసాగింపుపై ఈ వారాంతంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. గ్రీన్ జోన్ జిల్లాల్లో ప్రైవేటు వాహనాలను కొంతవరకు అనుమతించవచ్చన్నారు. రైల్వే, విమానయానానికి మాత్రం మే 3 తరువాత కూడా అనుమతి లభించకపోవచ్చన్నారు. కరోనా వ్యాప్తిని సమీక్షించిన తరువాత మే మూడో వారంలో నియమిత ప్రాంతాలకు వీటిని అనుమతించే విషయం ప్రతిపాదనలో ఉందన్నారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎంలలో ఒడిశా, గోవా, మేఘాలయ సహా ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ను పొడిగించాలని కోరారని, కొందరు మాత్రం హాట్‌స్పాట్స్‌ను మినహాయించి, మిగతా ప్రాంతాల్లో దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని సూచించారని సమాచారం. వేరే రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను సొంత ప్రాంతాలకు పంపేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు సీఎంలు కోరారని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment