సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటంలో సమిష్టి కృషి, నిబద్ధతతోనే విజయం వరిస్తుందని ప్రధాని∙మోదీ పేర్కొన్నారు. కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతూనే తగిన జాగ్రత్తలతో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారంటూ ప్రచారంలోకి వస్తున్న వదంతులను కొట్టిపారేయాలని అన్నారు. ఇండియా ఇప్పుడు అన్‌లాకింగ్(అన్‌లాక్ 1.0)æ దశలో ఉందని గుర్తుచేశారు.
అన్‌లాక్ 2.0 గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. అన్‌లాక్ 1.0 తదనంతర పరిస్థితులు, కోవిడ్–19 మహమ్మారి కట్టడి ప్రణాళికపై చర్చించేందుకు ప్రధాని మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బుధవారం 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులతో చర్చించారు. మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణ సంబంధిత పనుల్లో వేగం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజల భాగస్వామ్యం కీలకం
కరోనా వైరస్ సోకిన బాధితులు చాలామంది చికిత్సతో పూర్తిగా కోలుకుంటున్నారని, వారి సంఖ్యను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎంలకు మోదీ సూచించారు. తద్వారా కరోనా వల్ల నెలకొన్న భయాందోళనల నుంచి ప్రజలను బయటకు తీసుకురావాలని చెప్పారు. పోరాటంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని వెల్లడించారు. తమ రాష్ట్రాల్లో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రులు ఈ సందర్భంగా మోదీకి వివరించారు.
ఆరోగ్య సేతుతో సానుకూల ఫలితాలు
కొన్ని పెద్ద రాష్ట్రాలు, నగరాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల్లో ప్రజల సహకారం, పాలనా యంత్రాంగం సంసిద్ధత, కరోనా యోధుల అంకితభావం కారణంగా కరోనా వ్యాప్తి అదుపులో ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కోవిడ్ నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజలకు టెలిమెడిసిన్ సేవలు అందించేందుకు సీనియర్ వైద్యుల బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. హెల్ప్‌లైన్‌లను సమర్థవంతంగా అమలు చేయడానికి యువ వాలంటీర్ల బృందాన్ని నియమించుకోవాలన్నారు. ఆరోగ్య సేతు యాప్‌ను పెద్ద సంఖ్యలో డౌన్‌లోడ్ చేసిన రాష్ట్రాల్లో సానుకూల ఫలితాలు వస్తున్నాయని మోదీ గుర్తుచేశారు.
సరిపడా టెస్టింగ్ కిట్లు ఉన్నాయి
కరోనా బారినపడి కోలుకుంటున్నవారి సంఖ్య భారీగా పెరుగుతుండడం మంచి పరిణామమన్నారు. కొందరు బాధితులకే ఐసీయూ సేవలు అవసరమవుతున్నాయని చెప్పారు. 900కుపైగా కరోనాటెస్టింగ్ ల్యాబ్‌లు, లక్షలాది ప్రత్యేక పడకలు, వేల సంఖ్యలో ఐసోలేషన్, క్వారంటైన్ సెంటర్లు, సరిపడా టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. కోటికిపైగా పీపీఈ కిట్లు, అంతే సంఖ్యలో ఎన్095 మాస్కులు ఇప్పటికే రాష్ట్రాలకు పంపిణీ చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment