గ్రామీణ కుటుంబాల ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోందని అన్ని జాతీయ స్థాయి నివేదికలూ సూచిస్తున్నాయి. కానీ ఆర్థికవేత్తలు మాత్రం నిరుపేదలను ఆదుకోకుండా ఉండటం ఎలా అనే అంశంపై రెండుగా చీలిపోయి ఉన్నారు. ఆర్థిక మందగమనం అనే వ్యాధికి చికిత్స మాత్రం నిచ్చెనమెట్ల మీద ఉన్నవారికే అందించాలని వీరు సూచిస్తున్నారు. దేశ జనాభాలో 50 శాతానికి పైగా ప్రజలకు ఆలంబనగా ఉంటున్న వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతున్నప్పుడు ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం కూడా తీవ్రంగానే ఉంటుంది. అందుచేత వ్యవసాయాన్ని పునరుద్ధరించడమే కీలక విషయం. ప్రస్తుతం భారతీయ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక ఉద్దీపన అవసరం ఏ రంగానికైనా ఉంది అంటే అది వ్యవసాయ రంగం మాత్రమే. పేదల చేతికి ఎంత ఎక్కువగా డబ్బు అందిస్తే అంత ఎక్కువగా దేశంలో డిమాండ్ సృష్టించవచ్చు. ఇదే ఇప్పుడు అత్యంత అవసరమైన చర్య.
దశాబ్దాలుగా భారతీయ వ్యవసాయం దుస్థితి బాటలో సాగుతోందని సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. దేశ ప్రజలు వినియోగంపై వెచ్చిస్తున్న వ్యయంపై, లీక్ అయిన ‘నేషనల్ సాంపిల్ సర్వే ఆఫీసు (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) 2017–18’ నివేదిక ప్రకారం గ్రామీణ కుటుంబాలు ఆహా రంపై అతితక్కువగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం బుట్ట దాఖలు చేయాలని నిర్ణయించిందనుకోండి. పోతే ‘2016 ఎకనమిక్ సర్వే’ మరింత చేదు వార్తను తెలిపింది. దేశంలోని 17 రాష్ట్రాల సగటు వ్యవసాయ కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 20,000కు మించి లేదట. అంటే వ్యవసాయ కుటుం బాలు రోజువారీ వినియోగంపై ఎంత తక్కువగా ఖర్చుపెడుతున్నాయో దీన్నిబట్టే తెలుస్తుంది.
‘వినియోగ వ్యయంపై సర్వే’ ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో ఆహారంపై నెలకు సగటున ఒక కుటుంబం రూ. 580 లు (రోజుకు 19 రూపాయలు) మాత్రమే ఖర్చుపెడుతోందని వెల్లడించగా, ఎకనమిక్ సర్వే మరింత ఆసక్తికరమైన డేటాను బయటపెట్టింది. వ్యవసాయ కుటుంబాలు అమ్మగలుగుతున్న ఉత్పత్తులపైనే కాకుండా గృహ వినియోగం కోసం వారు భద్రపర్చుకున్న ఆదాయాన్ని కూడా కలుపుకుని రైతు కుటుంబాల ఆదాయాన్ని అది వెల్లడించింది. దేశం లోని వ్యవసాయ కుటుంబాలు నెలకు రూ. 1,700 కంటే తక్కువ ఆదాయ స్థాయిలతో ఎలా జీవిస్తున్నాయా అని ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. వ్యవసాయ ధరలు కనిష్టస్థాయిలో ఉంటూండగా, వ్యవసాయ ఆదాయాలు 14 ఏళ్ల కనిష్టస్థాయికి పడిపోయాయి. ఇక వ్యవసాయ వేతనాలు కూడా గత కొన్నేళ్లుగా పతనమవుతూ వస్తున్నాయి.
లీకైన మరొక డాక్యుమెంట్ ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2017–18’ నివేదిక ఇంకా దారుణమైన విషయం బయటపెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో 3.4 కోట్ల మంది దినసరి కూలీలు 2011–18 మధ్య కాలంలో తమ ఉపాధిని కోల్పోయారు. వీరిలో 3 కోట్లమంది వ్యవసాయ కూలీలే. గత 45 ఏళ్లలో నిరుద్యోగం పరాకాష్టకు చేరుకోవడంతో సంక్షోభం వ్యవసాయ పరిధిని దాటిపోయింది. ఈ అన్ని నివేదికలూ గ్రామీణ కుటుంబాల ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోందని సూచిస్తున్నాయి. రైతు కుటుంబాల ఆర్థిక సంపన్నతా లేమి అనేది భవిష్యత్తులో గ్రామీణ వ్యయంపై కూడా తన ప్రభావం చూపనుంది. అయితే ఆర్థికవేత్తలు మాత్రం అధోజగత్ సహోదరులను ఆదుకోకుండా ఉండటం ఎలా అనే అంశంపై రెండుగా చీలిపోయి ఉన్నారు. బలహీనమైన వినియోగదారీ డిమాండ్, ప్రైవేట్ పెట్టుబడులు మందగించిపోవడం అనే రెండు ప్రధాన అంశాలే ఆర్థిక వ్యవస్థను మందగింప జేస్తున్నాయని ప్రధాన స్రవంతి ఆర్థిక వేత్తలు ఒప్పుకుంటున్నారు.
వీటివల్లే ఈ జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీయ ఆర్థిక వృద్ధి రేటు 4.5 శాతానికి పడిపోయింది. అంటే ఆరేళ్లలో ఇది అత్యంత తక్కువ వృద్ధి రేటు అన్నమాట. కానీ ఆర్థిక మందగమనం అనే వ్యాధికి చికిత్స మాత్రం నిచ్చెనమెట్ల మీద ఉన్నవారికే అందించాలని వీరు సూచిస్తున్నారు. అయితే పారిశ్రామిక సంస్థలు మాత్రం ఆర్థిక మందగమనాన్ని అవకాశంగా మల్చుకోవాలని చూస్తున్నాయి. చౌక శ్రమ, సరళతరమైన భూ సేకరణ, కార్పొరేట్ పన్ను తగ్గింపు, పన్నుల ఉగ్రవాదాన్ని తొలగించడం, దివాలా సమస్యలను సత్వరం తీర్చడం వంటి వాటి రూపంలో మరిన్ని సంస్కరణలను అమలు చేసేలా వ్యవస్థను ప్రభావితం చేయాలని ఇవి చూస్తున్నాయి. దీనికోసం సెక్టర్ ఆధారిత ఉద్దీపన కోసం పట్టుబడుతున్నాయి.పిరమిడ్ పునాదిపైనే మరింత దృష్టి పెట్టాలనే అంశాన్ని ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు అంగీకరిస్తుండగా, మరింత సంస్కరించడం ద్వారానే ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని కొంతమంది ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థను ముందుకు నెట్టాలంటే కార్పొరేట్ పన్ను ఉద్దీపన, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ సెక్టార్, బ్యాంక్ కన్సాలిడేషన్, మూలధన సేకరణ, ఎగుమతి ప్రోత్సాహకాలు, మైక్రో, చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలకు కొన్నిరాయితీలు కల్పించడం అవసరమని వీరు చెబుతున్నారు. కొందరు ఆర్థికవేత్తలయితే ఇప్పటికే సంపదల మేట మీద సౌకర్యవంతంగా కూర్చున్న కొన్ని పరిశ్రమలకు పన్ను విధింపును ఎందుకు ఎత్తివేయాలని ప్రశ్నించారు. కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోవడానికి ఇది మార్గం కానే కాదని వీరు చెబుతున్నారు. ఇప్పటికే జీడీపీ 5 శాతం లోపు పడిపోయిన నేపథ్యంలో కార్పొరేట్ పన్ను రేటును భారీగా తగ్గించడం, ప్రతి సంవత్సరం 1.45 లక్షల కోట్ల ఉద్దీపనను అందించడం అనేది పన్ను రూపేణా వచ్చే ప్రభుత్వ రాబడిని మరింత బలహీన పరుస్తుంది. పన్ను రాయితీలు గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టులలో మరిన్ని పెట్టుబడులను కల్పించి వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తాయని, ఇది మరిన్ని ఉద్యోగాల కల్పనకు దారితీస్తుందని చేస్తున్న వాదనను అంతర్జాతీయ అనుభవం తోసిపుచ్చుతోంది.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక తగ్గించిన కార్పొరేట్ పన్నులు అటు పెట్టుబడులనూ తీసుకురాలేదని, ఇటు ఉద్యోగాలనూ కల్పించలేదని పైగా పన్నుల తగ్గింపు ద్వారా మిగిలిన మొత్తాన్ని కార్పొరేట్ రంగం స్టాక్ మార్కెట్లో మదుపు చేసిందని నోబెల్ గ్రహీత పాల్ క్రూగ్‌మన్ స్పష్టం చేశారు. కార్పొరేట్ పన్నులు భారీగా తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించగానే ఆ మరుసటి దినం భారతీయ స్టాక్ మార్కెట్లు పండుగ చేసుకున్నాయంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఆ సంబరాలు ఇంకా కొనసాగుతుండగా, పన్ను రేటు తగ్గింపు తర్వాత విదేశీ నిధుల ప్రవాహం పెరుగుతూ వచ్చింది. కానీ, కేవలం 5 రూపాయల బిస్కెట్ కూడా కొనలేకపోతున్న చాలామంది పేదవారి గురించీ, అష్టకష్టాలు పడి పండిం చిన పంటను మార్కెట్లో తగిన ధరకు అమ్ముకోలేకపోతున్న రైతుగురించీ, దినసరి వేతనాలను కూడా పొందడం కష్టమైపోతున్న వ్యవసాయ, వ్యవసాయేతర కూలీల గురించే నేను ఆందోళన చెందుతున్నాను.
ఇక వ్యవసాయరంగంలో నిరుపేదలకు ఎలాంటి ప్రోత్సాహకాలనూ కేంద్రం ప్రకటించడం లేదు. గిట్టుబాటు ధర లేమితో 2000–2017 మధ్య 16 ఏళ్ల కాలంలో రూ. 45 లక్షల కోట్లను రైతులు నష్టపోయారు. కాగా గత రెండేళ్లలో వ్యవసాయ రంగ నిజ ఆదాయాల పెరుగుదల దాదాపుగా జీరోగా ఉంటోందని నీతి ఆయోగ్ సొంత అంచనాలే చూపుతున్నాయి. మరోమాటలో చెప్పాలంటే, గత రెండు దశాబ్దాలుగా రైతుల ఆదాయాలు పతనబాటలోనే నడుస్తున్నాయి. వ్యవసాయ వేతనాల్లో వృద్ధి రేటు కూడా పడిపోతోంది. దేశ జనాభాలో 50 శాతానికి పైగా ప్రజలకు ఆలంబనగా ఉంటున్న వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతున్నప్పుడు ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం కూడా తీవ్రంగానే ఉంటుంది. అందుచేత వ్యవసాయాన్ని పునరుద్ధరించడమే కీలక విషయం. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక ఉద్దీపన అవసరం ఏ రంగానికైనా ఉంది అంటే అది వ్యవసాయ రంగం మాత్రమే. రైతులకు పరిహారం చెల్లించాల్సిన సమయం కూడా నేడు ఆసన్నమైంది.
పారిశ్రామిక రంగానికి రూ.1.45 లక్షల కోట్ల రూపాయల పన్ను రాయితీని కేటాయించినప్పుడు, అదే మొత్తాన్ని వ్యవసాయ రంగానికి కూడా అందిస్తే ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్ కింద ఇప్పుడు ఇస్తున్న మొత్తాన్ని ప్రతి రైతు కుటుంబానికి మూడు రెట్లు పెంచి ఇవ్వవచ్చు. అంటే సంవత్సరానికి ఒక్కో రైతుకు రూ. 18,000లు, లేక నెలకు రూ. 1,500లు ఇవ్వవచ్చు. ఈ పథకాన్ని భూమి లేని రైతుకూలీలకు కూడా పొడిగించవచ్చు. ఇప్పటికే పీఎం–కిసాన్ పథకం కింద రూ. 75,000ల కోట్లు కేటాయించారు. దీనికి మరొక రూ. 1.45 లక్షల కోట్లను అదనంగా చేర్చి ఇవ్వాల్సి ఉంది. పేదల చేతికి ఎంత ఎక్కువగా డబ్బు అందిస్తే అంత ఎక్కువగా డిమాండ్ సృష్టించవచ్చు. ఈ చర్యలతోపాటు ప్రభుత్వ ధాన్యసేకరణను మరింత సమర్థవంతంగా చేయడానికి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ అజమాయిషీలో నడిచే మండీల నెట్‌వర్క్‌ని విస్తరించాలి. అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధరకు ప్రకటించిన మేరకు హామీ ఇవ్వాలి. లోటును చెల్లించడం ద్వారా కనీస మద్దతు ధర, మార్కెట్ ధరలకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలి. వీటికి అదనంగా కేరళ అనుభవం నుంచి పాఠాలు తీసుకుని ప్రతి రాష్ట్రంలోనూ రుణ ఉపశమన కమిషన్‌ను ఏర్పర్చాలి. గ్రామీణ రహదారులు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు వంటి ప్రజా రంగ సేవలపై అధిక మదుపును చేయాలి.
దేవీందర్ శర్మ
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్ : hunger55@gmail.com
Comments
Please login to add a commentAdd a comment