
అహ్మదాబాద్: మన దేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, ఇది ఆషామాషీ విజయం విజయం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ విజయమని, ఈ ఒరవడిని కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ విజయంతో మరింత కష్టపడి, మరిన్ని పెద్ద విజయాలను సాధించగలమనే ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని ఒల్పాడ్‌లో గురువారం జరిగిన మెడికల్ క్యాంప్‌లో వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు లబ్ధిదారులతో ముచ్చటించారు.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందేందుకు అవకాశమున్న ప్రకృతి సేద్యం వైపు మరలాలని రైతులను కోరారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా దేశ వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.2 లక్షల కోట్లను జమ చేశామన్నారు. ఇంటర్నెట్, సాంతికేక పరిజ్ఞానం పుస్తకాల స్థానాన్ని భర్తీ చేయలేవని ప్రధాని మోదీ అన్నారు. పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకోవాలని కోరారు. నవభారత్ సాహిత్య మందిర్ అహ్మదాబాద్‌లో నిర్వహించిన పుస్తక ప్రదర్శన ప్రారంభం సందర్భంగా మోదీ సందేశం పంపించారు.