
మహిళా దినోత్సవంలో ప్రధాని మోదీ
స్త్రీల భద్రతే ప్రాథమ్యమని వెల్లడి
నవాసరీ (గుజరాత్): ఏ సమాజంలోనైనా, దేశంలోనైనా మహిళలను గౌరవించడమే ప్రగతి దిశగా తొలి అడుగని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. మహిళల సారథ్యంలో సమాజ ప్రగతి దిశగా భారత్ కొన్నేళ్లుగా ముందుకు సాగుతోందన్నారు. ‘‘నారీ శక్తికి నా నమస్సులు. మహిళల ఆత్మగౌరవానికి, భద్రతకు, సాధికారతకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. వారిపై నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు నూతన చట్టాల్లో మరిన్ని కఠినమైన నిబంధనలు పొందుపరిచాం. వలస పాలన నాటి కాలం చెల్లిన చట్టాల స్థానంలో తెచి్చన పూర్తి దేశీయ చట్టాల్లో అత్యాచారం వంటి దారుణ నేరాలకు మరణశిక్షకు వీలు కల్పించాం.
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తదితరాల ద్వారా మహిళలకు సత్వర న్యాయం అందిస్తున్నాం. వారిపై తీవ్ర నేరాల్లో 45 నుంచి 60 రోజుల్లోపే తీర్పులు వచ్చేలా చర్యలు చేపట్టాం. విచారణ క్రమంలో బాధిత మహిళలకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురవకుండా నిబంధనలు పొందుపరిచాం’’అని వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం గుజరాత్‌లో నవాసరీ జిల్లా వన్‌శ్రీ బోర్సీ గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం లక్షన్నర మందికి పైగా మహిళలు హాజరైన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఆడపిల్ల ఆలస్యంగా ఇంటికొస్తే పెద్దవాళ్లు లక్ష ప్రశ్నలడుగుతారు. అదే మగపిల్లాడు ఆలస్యమైతే పట్టించుకోరు. కానీ అతన్ని కూడా కచ్చితంగా నిలదీయాలి’’అని తల్లిదండ్రులకు సూచించారు.
ప్రపంచంలోకెల్లా సంపన్నుడిని నేనే
తాను ప్రపంచంలోకెల్లా సంపన్నుడిని అంటూ ఈ సందర్భంగా మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది విని కొందరికి ఆశ్చర్యంతో కనుబొమ్మలు ముడిపడవచ్చు. కానీ ఇది నిజం. కాకపోతే సంపదపరంగా కాదు. కోట్లాది మంది తల్లులు, సోదరీమణులు, కూతుళ్ల ఆశీస్సులు నాకున్నాయి. ఆ రకంగా నేను అందరి కంటే సంపన్నుడిని.
వారి ఆశీస్సులే నాకు అతి పెద్ద బలం, నా పెట్టుబడి. అవే నాకు తి రుగులేని రక్షణ కవచం కూడా’’అని వివరించారు.
ప్రధాని సోషల్ ఖాతాల్లో... మహిళల విజయగాథలు
పలు రంగాల్లో తమదైన ముద్ర వేసిన పలువురు మహిళా ప్రముఖులు శనివారం ప్రధాని మోదీ సోషల్ మీడియా హాండిళ్లను ఒక రోజు పాటు తామే నిర్వహించారు. తమ విజయగాథలను పంచుకున్నారు. కలలను నిజం చేసుకునేందుకు అమ్మాయిలు ధైర్యంగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. చెస్ గ్రాండ్‌మాస్టర్ ఆర్ వైశాలి, పారిశ్రామికవేత్తగా మారిన రైతు అనితా దేవి, అణు శాస్త్రవేత్త ఎలినా మిశ్రా, అంతరిక్ష శాస్త్రవేత్త శిల్పీ సోనీ తదితరులు వీరిలో ఉన్నారు.
గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞా్ఞనంద సోదరి అయిన వైశాలి ఆరేళ్ల వయసు నుంచే చెస్ ఆడుతున్నారు. రైతు ఉత్పత్తుల కంపెనీ ద్వారా తన గ్రామానికి చెందిన వందలాది మంది మహిళలకు ఉపాధి కల్పించినట్టు అనితాదేవి వివరించారు. ఇది వారికి సంపాదనతో పాటు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కూడా కల్పించిందన్నారు. మహిళలకు ఆర్థిక సాధికారత అవసరాన్ని ఫ్రాంటియర్ మార్కెట్స్ సీఈఓ అజితా షా వివరించారు. అనంతరం వారి విజయగాథలను ప్రస్తుతిస్తూ మోదీ పలు పోస్టులు చేశారు. వికసిత భారత్ లక్ష్యసాధనలో మహిళలదే కీలక పాత్ర అని అభిప్రాయపడ్డారు.
మహిళా పోలీసుల రక్షణ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నవాసరీ సభలో ప్రధాని మోదీకి పూర్తిగా మహిళలతో కూడిన అంగరక్షక దళం భద్రత కల్పించడం విశేషం. బహిరంగ సభతో పాటు ఆయన రక్షణ బాధ్యతలను కూడా 2,500 మందికి పైగా మహిళా పోలీసు సిబ్బందే చూసుకున్నారు. వీరిలో 2,145 మంది కానిస్టేబుళ్లు, 187 మంది ఎస్సైలు, 61 మంది ఇన్‌స్పెక్టర్లు, 19 మంది డీఎస్పీలు, ఐదుగురు ఎస్పీలు, ఒక డీఐజీ తదితరులున్నారు. హెలిప్యాడ్ వద్ద మోదీ రాక మొదలుకుని సభనుద్దేశించి ప్రసంగం, లఖ్‌పతీ దీదీ లబి్ధదారులకు సన్మానం, అనంతరం ఆయన వెనుదిరిగేదాకా సర్వం వారి కనుసన్నల్లోనే సాగింది. మొత్తం ఏర్పాట్లను అదనపు డీజీపీ నిపుణా తోర్వానే పర్యవేక్షించారు. పురుష సిబ్బంది పార్కింగ్, ట్రాఫిక్ విధులకే పరిమితమయ్యారు. ఇంతటి భారీ కార్యక్రమ భద్రత ఏర్పాట్లను పూర్తిగా మహిళా పోలీసు సిబ్బందే చూసుకోవడం దేశంలో ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment