
జామ్‌నగర్: మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) గుజరాత్ చేరుకున్నారు. శనివారం రాత్రి జామ్‌నగర్ సర్క్యూట్ హౌస్‌లో బస చేసిన ఆయన నేడు (ఆదివారం) రిలయన్స్ ఫౌండేషన్ జంతు రక్షణ, పునరావాస కేంద్రమైన ‘వంతారా’ను సందర్శించనున్నారు. ప్రధాని తన పర్యటనలో భాగంగా గిర్ జిల్లాలోని ససన్ గిర్ జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించి, జంగిల్ సఫారీ చేయనున్నారు. సోమవారం ప్రధాని మోదీ సోమనాథ్ మహాదేవ్ ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటనపై గుజరాత్ మంత్రి ములుభాయ్ బేరా మీడియాతో మాట్లాడుతూ ప్రధాని రాకకు సంబంధించి అన్ని సన్నాహాలు పూర్తి చేశామని, ఆయన జామ్‌నగర్, ద్వారక, గిర్ జిల్లాల్లో జరిగే వివిధ కార్యక్రమాలకు హాజరవుతారన్నారు.
జంతు సంరక్షణ కేంద్రం సందర్శన
ఈ రోజు(ఆదివారం) సాయంత్రం ప్రధాని మోదీ జామ్‌నగర్(Jamnagar)లోని ‘వంతారా’ జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించనున్నారు. తరువాత ఆయన ససాన్ చేరుకుంటారు. అక్కడి అటవీ శాఖ కార్యాలయ అతిథి గృహం ‘సింగ్ సదన్’ను సందర్శిస్తారు. అలాగే ఈరోజు జరిగే సోమనాథ్ ట్రస్ట్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.
జంగిల్ సఫారీ..
మార్చి 3న ప్రధాని గిర్ జాతీయ ఉద్యానవనంలో జంగిల్ సఫారీలో పాల్గొంటారు. అక్కడి నుండి సింగ్ సదన్‌కు చేరుకుని ఎన్‌బీడబ్ల్యు సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వన్యప్రాణులకు సంబంధించిన జాతీయ స్థాయి అంశాలపై చర్చించనున్నారు.
సోమనాథ్ ఆలయంలో పూజలు
అదే రోజున ప్రధాని ససాన్‌లో అటవీశాఖ సిబ్బందితో సంభాషించనున్నారు. తరువాత సోమనాథ్ ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. అనంతరం సోమనాథ్ నుండి రాజ్‌కోట్ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు.
ఇది కూడా చదవండి: సునీతా విలియమ్స్ రాకకు సమయం ఆసన్నం