పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వెంకయ్య, జైట్లీ భార్య సంగీత
సాక్షి, న్యూఢిల్లీ: దేశ హితాన్ని తన ప్రథమ కర్తవ్యంగా భావించి చివరిదాకా అదే సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి అరుణ్ జైట్లీ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జైట్లీ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఉపరాష్ట్రపతి నివాసంలో ‘ద రినైసన్స్ మ్యాన్: ద మేనీ ఫాసెట్స్ ఆఫ్ అరుణ్ జైట్లీ’ పుస్తకాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. తర్వాత వెంకయ్య మాట్లాడారు. ‘జైట్లీ దశాబ్దాలుగా నాకు ఆత్మీయ మిత్రుడు. ముఖ్యమైన సమయాల్లో ఆయన విలువైన సూచనలు ఇచ్చేవారు.
అలాంటి జైట్లీ ఇకలేరనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకున్నా’అని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టిన జైట్లీ రాష్ట్రాల ఆర్థిక మంత్రులను కలుపుకొని ఏకాభిప్రాయ సాధనతో కీలకమైన జీఎస్టీ వంటి పన్ను సంస్కరణలు తీసుకొచ్చారని ప్రశంసించారు. పుస్తకాన్ని వెంకయ్య కొడుకు హర్షవర్ధన్, కూతురు దీప తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జైట్లీ భార్య సంగీత, లోక్‌సభ స్పీకర్ బిర్లా, కేంద్ర మంత్రి మురళీధరన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment