ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ఫైనాన్షియల్ మార్కెట్లను నెలల తరబడి ఆందోళన పరుస్తున్న రెండు అంశాలు ఒక కొలిక్కి వచ్చాయి. అమెరికా–చైనాల మధ్య తొలిదశ వాణిజ్య ఒప్పందం కుదిరిందన్న ప్రకటన వెలువడటం, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ సజావుగా వైదొలగడానికి (సాఫ్ట్ బ్రెగ్జిట్) అవసరమైన మెజారిటీని ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ, ప్రధాని బోరిస్ జాన్సన్ సాధించడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, మార్కెట్లకు పెద్ద ఊరటనిచ్చే అంశాలు. మన దేశ జీడీపి బాగా పడిపోవడం, పారిశ్రామికోత్పత్తి క్షీణించడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి ప్రతికూలాంశాల్ని సైతం తలదన్ని... ప్రపంచ సానుకూల పరిణామాల ప్రభావంతో స్టాక్ మార్కెట్ మరోదఫా రికార్డుస్థాయిని సమీపించింది. గత ఆరునెలల్లో ఎన్నోదఫాలు రికార్డుస్థాయి వద్ద జరిగిన బ్రేకవుట్లు విఫలమయ్యాయి. ట్రేడ్ డీల్, బ్రెగ్జిట్ సమస్యలకు పరిష్కారం లభించబోతున్నందున, ఈ వారం మన మార్కెట్ వ్యవహరించే శైలి... దీర్ఘ, మధ్యకాలిక ట్రెండ్‌కు కీలకం కానున్నది. ఇక సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా ఉన్నాయి...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
డిసెంబర్ 13తో ముగిసినవారంలో మూడోరోజైన బుధవారం 40,135 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన బీఎస్‌ఈ సెన్సెక్స్... అదేరోజున రికవరీ ప్రారంభించి, చివరిరోజైన శుక్రవారం 41,056 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగింది. చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 565 పాయింట్ల లాభంతో 41,010 పాయింట్ల వద్ద ముగిసింది. నవంబర్ 28 నాటి 41,164 పాయింట్ల రికార్డుస్థాయి సెన్సెక్స్‌కు ఈ వారం కీలకం కానుంది. ఈ స్థాయిని బలంగా ఛేదిస్తే వేగంగా 41,400 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన ర్యాలీ కొనసాగితే 41,650 పాయింట్ల వరకూ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వారంలో రికార్డుస్థాయిపైన స్థిరపడలేకపోయినా, బలహీనంగా ప్రారంభమైనా 40,850–40,710 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే 40,590 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 40,330 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు.
నిఫ్టీకి 12,160 కీలకస్థాయి
నిఫ్టీ గతవారం 11,832 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన తర్వాత వేగంగా 12,098 పాయింట్ల గరిష్టస్థాయిని చేరింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 165 పాయింట్ల లాభంతో 12,087 పాయిం ట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీకి నవంబర్ 28 నాటి 12,158 పాయింట్ల రికార్డుస్థాయే కీలకం. ఈ స్థాయిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో అధిగమిస్తే 12,220 పాయింట్ల స్థాయిని అందు కోవొచ్చు. అటుపైన క్రమేపీ 12,250–1300 పాయింట్ల శ్రేణిని చేరవచ్చు. ఈ వారం పైన ప్రస్తావించిన కీలకస్థాయిని దాటలేకపోయినా, బలహీనంగా ప్రారంభమైనా 12,035–12,005 పాయింట్ల వద్ద తక్షణ మద్దతును పొందవచ్చు. ఈ లోపున ముగిస్తే 11,950 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 11,880 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు.
సెన్సెక్స్ 41,164 స్థాయిని అధిగమిస్తే..
Published Mon, Dec 16 2019 3:40 AM | Last Updated on Mon, Dec 16 2019 3:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment