అమెరికా–చైనాల ట్రేడ్‌డీల్‌పై పరస్పర విరుద్ధ సంకేతాలు వెలువడటంతో గతవారం అమెరికాతో సహా అన్ని ప్రపంచ ప్రధాన స్టాక్ సూచీలు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ, భారత్ మార్కెట్‌లో రికార్డుల హోరు కొనసాగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మన మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడిన జీడీపీ డేటా తీవ్ర నిరుత్సాహాన్ని కల్గించింది. అయినా, ఈ అంశాన్ని ఇప్పటికే మార్కెట్ చాలావరకూ డిస్కౌంట్ చేసుకున్నందున, సమీప భవిష్యత్‌లో అంతర్జాతీయ పరిణామాలే ఈక్విటీలను నడిపించవచ్చని అధికశాతం విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా ఉన్నాయి.....
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
నవంబర్ 29తో ముగిసినవారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 41,163 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పిన తర్వాత వారాంతంలో చిన్నపాటి కరెక్షన్‌కు లోనయ్యింది. చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 435 పాయింట్ల లాభంతో 40,794 పాయింట్ల వద్ద ముగిసింది. అక్టోబర్ తొలి మూడు వారాల్లోనూ గట్టిగా నిరోధించిన 40,000–40,600 పాయింట్ల శ్రేణి రానున్న రోజుల్లో మద్దతును అందించే అవకాశం వుంటుంది. ఈ వారంలో సెన్సెక్స్‌కు తొలుత 40,600 పాయింట్ల సమీపంలో మద్దతు లభిస్తున్నది. ఈ దిగువన 40,390 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 40,000 పాయింట్ల స్థాయికి దిగజారవచ్చు. ఈ వారం సెన్సెక్స్ రెండో మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే వేగంగా 40,990 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. అటుపైన మరోదఫా 41,160 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఆపైన ముగిస్తే క్రమేపీ 41,450–41,500 పాయింట్ల శ్రేణిని అందుకునే ఛాన్సుంటుంది.
నిఫ్టీ తక్షణ మద్దతు 12,005
కొత్త రికార్డును నెలకొల్పడంలో సెన్సెక్స్‌కంటే వెనుకబడి వున్న ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చిట్టచివరకు గతవారం ఈ ఫీట్ సాధించింది. 12,158 పాయింట్ల వద్ద రికార్డుగరిష్టస్థాయిని నమోదుచేసి, చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 142 పాయింట్ల లాభంతో 12,056 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సోమవారం మార్కెట్ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే నిఫ్టీ 12,005 పాయింట్ల సమీపంలో తొలి మద్దతును పొందవచ్చు. ఈ మద్దతును కోల్పోతే 11,920 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ లోపున 12,800 పాయింట్ల వద్ద గట్టి మద్దతు లభిస్తున్నది. ఈ వారం రెండో మద్దతుస్థాయిని నిఫ్టీ పరిరక్షించుకుంటే 12,100 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. అటుపైన ముగిస్తే తిరిగి 12,160 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఆపైన క్రమేపీ 12,250 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగే అవకాశాలుంటాయి.
సెన్సెక్స్ మద్దతు శ్రేణి 40,000–40,600
Published Mon, Dec 2 2019 6:18 AM | Last Updated on Mon, Dec 2 2019 6:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment