ఆద్యంతం లాభ, నష్టాల మధ్య కదలాడిన బుధవారం నాటి ట్రేడింగ్‌లో చివరకు స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం విషయమై వెలువడిన ప్రతికూల, సానుకూల వార్తలు ప్రభావం చూపించాయి. నేటి పాలసీలో ఆర్‌బీఐ కీలక రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించగలదన్న అంచనాలతో బ్యాంక్, వాహన షేర్లు లాభపడటం కలసివచ్చింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 175 పాయింట్లు లాభపడి 40,850 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 49 పాయింట్లు పెరిగి 12,043 పాయింట్ల వద్ద ముగిశాయి. మూడు రోజుల వరుస నష్టాల అనంతరం నిఫ్టీ 12,000 పాయింట్లపైకి ఎగబాకింది.
411 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్....
సెన్సెక్స్ నష్టాల్లోనే ఆరంభమైంది. ఆ తర్వాత లాభాల్లోకి వచ్చింది. భారత్ బాండ్ ఈటీఎఫ్‌ను అందుబాటులోకి తెస్తామని కేంద్రం ప్రకటించడంతో మార్కెట్‌పై ఒత్తిడి పెరిగింది. మళ్లీ నష్టాల్లోకి జారిపోయింది. అయితే వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం తొలి దశ ఒప్పందం దాదాపు ఖరారైందని వార్తల కారణంగా నష్టాలన్నీ రికవరీ అయ్యాయి. గత నెలలో సేవల రంగానికి సంబంధించి ఐహెచ్‌ఎస్‌మార్కిట్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 52.7కు చేరడం సానుకూల ప్రభావం చూపించింది. ఒక దశలో 199 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, మరో దశలో 212 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 411 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఇటీవల బాగా పెరిగిన నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ భారీగా 1.6 శాతం నష్టపోయింది.
లాభాల బాటలో వాహన షేర్లు
ఉత్పత్తి వ్యయాలు పెరుగుతుండటంతో వాహనాల ధరలను వాహన కంపెనీలు పెంచుతున్నాయి. దీంతో వాహన షేర్లు 7 శాతం వరకూ లాభపడ్డాయి. టాటా మోటార్స్ 7 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 0.5 శాతం పెరిగాయి. అయితే మారుతీ తగ్గింది.
వాణిజ్య ఒప్పంద లాభాలు
Published Thu, Dec 5 2019 6:17 AM | Last Updated on Thu, Dec 5 2019 6:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment