అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆ దేశ కేంద్ర బ్యాంక్, ఫెడరల్ రిజర్వ్ సంశయాలు వ్యక్తం చేయడంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా గురువారం నష్టపోయింది. గత మూడు రోజుల లాభాల నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 20 పైసలు పతనమై 75.02కు చేరడం.... ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 394 పాయింట్లు పతనమై 38,220 పాయింట్ల వద్ద, నిఫ్టీ 96 పాయింట్లు క్షీణించి 11,312 పాయింట్ల వద్ద ముగిశాయి.
మరో దఫా నష్టాలు...!
సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోనే ఆరంభమయ్యాయి. రోజంతా నష్టాలు కొనసాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 459 పాయింట్లు, నిఫ్టీ 118 పాయింట్ల మేర పతనమయ్యాయి. మార్కెట్లో మరో దఫా నష్టాలు ఉండొచ్చని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఫెడ్ భయాలు...!
అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒకింత రికవరీ అయింది. అయితే ఈ రికవరీ కొనసాగుతుందో,లేదో అన్న సంశయాలను ఫెడరల్ రిజర్వ్ మినట్స్ (జూలై సమావేశం) వెల్లడించాయి. దీంతో ఆసియా, యూరప్ మార్కెట్లు 1–4 శాతం మేర నష్టపోయాయి.
► సెన్సెక్స్ 30 షేర్లలో ఐదు షేర్లు–ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, పవర్ గ్రిడ్, టాటా స్టీల్,హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 25 షేర్లు నష్టపోయాయి.
► హెచ్‌డీఎఫ్‌సీ షేర్ 2.3 శాతం నష్టంతో రూ.1,785 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే.
► ఎన్‌టీపీసీ షేర్ 7 శాతం లాభంతో రూ.101 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే కావడం గమనార్హం.
► దాదాపు 170కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. టాటా కమ్యూనికేషన్స్, టాటా కాఫీ, జేబీ కెమికల్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
► ఒక్కో ఈక్విటీ షేర్‌కు మూడు బోనస్ షేర్ల జారీకి(3:1) ఆమోదం లభించడంతో ఆర్తి డ్రగ్స్ షేర్ 18 శాతం లాభంతో రూ. 2,839 వద్ద ముగిసింది. ఈ షేర్ ఈ ఏడాది 400 శాతం ఎగసింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై రూ.2,893ను తాకింది.
► డిస్కమ్‌ల రుణ పరిమితి పెరగడంతో విద్యు త్ రంగ షేర్లు 12 శాతం వరకూ ఎగిశాయి.
► దాదాపు 400కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. రెప్కో హమ్ ఫైనాన్స్, అరవింద్ ఫ్యాషన్స్, ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్, ఫ్యూచర్ కన్సూమర్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
మార్కెట్‌కు ‘ఫెడ్’ భయాలు!
Published Fri, Aug 21 2020 5:22 AM | Last Updated on Fri, Aug 21 2020 5:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment