
అమెరికా ఉత్పత్తులపై 10% టారిఫ్ వేయనున్న చైనా
చైనా ఉత్పత్తులపై 30% టారిఫ్ విధించనున్న అమెరికా
ఎట్టకేలకు టారిఫ్ యుద్ధానికి తాత్కాలికంగా తెరదించిన అమెరికా, చైనా
ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారు
జెనీవా: ఎడాపెడా టారిఫ్‌లు విధించుకుంటూ వాణిజ్యయుద్ధాన్ని మొదలెట్టిన అమెరికా, చైనా ఎట్టకేలకు శాంతించాయి. పరస్పర వాణిజ్య ప్రయోజనాలే పరమావధిగా సమష్టిగా సంధికి ఆమోదముద్ర వేశాయి. ఇందులోభాగంగా సోమవారం స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగర వేదికగా వాణిజ్య ఒప్పందాన్ని కుదర్చుకుని టారిఫ్ రణానికి ముగింపు పలికినట్లు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.
చైనా ఉత్పత్తులపై 145 శాతం టారిఫ్ విధిస్తామని ట్రంప్ సర్కార్, అందుకు దీటుగా అమెరికా ఉత్పత్తులపై 125 శాతం టారిఫ్ వసూలుచేస్తామని జిన్‌పింగ్ ప్రభుత్వం గతంలో ప్రకటించడం తెల్సిందే. సోమవారం కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందంతో ఈ టారిఫ్‌లు భారీగా దిగిరానున్నాయి. ఒప్పందం మేరకు ఇకపై చైనా ఉత్పత్తులపై అమెరికా 30 శాతం టారిఫ్‌లు విధించనుంది. అమెరికా ఉత్పత్తులపై చైనా కేవలం 10 శాతం టారిఫ్‌లు విధించనుంది.
తొలుత 3 నెలలపాటు అమలు
తొలుత 90 రోజులపాటు ఈ టారిఫ్‌లనే అమలుచేసి, సమీక్ష జరిపి అందుకు అనుగుణంగా తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నారు. జెనీవాలో ఈ మేరకు అమెరికా, చైనా తరఫున అత్యున్నత స్థాయి అధికారులు మంతనాల జరిపి ట్రేడ్ డీల్‌ను ఖరారుచేశారు. ఐక్యరాజ్యసమితిలో స్విస్ రాయబారి అధికారిక నివాసంలో జరిగిన ఈ చర్చల్లో అమెరికా తరఫున అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్, వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి జేమ్సన్ గ్రీర్ పాల్గొన్నారు. ఆర్థిక, వాణిజ్యం సంబంధాలపై ఇకమీదటా ద్వైపాక్షిక చర్చలు కొనసాగుతాయని స్కాట్‌బెసెంట్ అన్నారు.
‘‘ ఇరువైపులా పెరిగిన అత్యధిక టారిఫ్‌లతో వాణిజ్యం ఒక్కసారిగా స్తంభించిపోయింది. చైనాతో వాణిజ్యబంధం బలోపేతానికే కృషిచేస్తున్నాం. అందుకే పెంచిన టారిఫ్‌లను మళ్లీ తగ్గిస్తున్నాం. సమతుల వాణిజ్యం కోరుకుంటున్నాం. ఈ తరహా వాణిజ్యాన్ని సాకారాంచేస్తాం’’ అని బెసెంట్ వ్యాఖ్యానించారు. తర్వాత చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ ఇరువైపులా 91 శాతం టారిఫ్ తగ్గించుకున్నాం. మేం మరో 90 రోజులకోసం మరో 24 శాతం తగ్గించాం. దీంతో అమెరికాపై మా టారిఫ్ 10 శాతానికి దిగొచ్చింది. ఏప్రిల్ రెండో తేదీన అమెరికా టారిఫ్‌లు పెంచాక మేం తీసుకున్న ప్రతీకార నిర్ణయాలనూ ఉపసంహరించుకుంటున్నాం’’ అని చైనా ఆ ప్రకటనలో పేర్కొంది.
అయితే 90 రోజులపాటు ఈ రేట్లనే కొనసాగించి తర్వాత సమీక్ష జరపనున్నారు. దీనిపై కొందరు అంతర్జాతీయ ఆర్థికవేత్తలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ‘‘ ఇది తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం లాంటిదే. 90 రోజుల తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’’ అని క్యాపిటల్ ఎకనమిక్స్‌లో చీఫ్ ఆసియా ఎకానమిస్ట్ మార్క్ విలియమ్స్ వ్యాఖ్యానించారు. ‘‘ 90 రోజుల తర్వాత ఏం జరుగుతుందనే ఇక్కడ అసలు ప్రశ్న’’ అని చైనాలో యురోపియన్ యూనియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు జేన్స్ ఎస్కీలెండ్ అన్నారు. సింథటిక్ డ్రగ్ అయిన ఫెంటానిల్‌ను తమ దేశంలోకి చైనా పోటెత్తిస్తోందంటూ ట్రంప్ సర్కార్ తొలుత టారిఫ్‌ల పెంపు జెండా ఎగరేయడం తెల్సిందే.