అమెరికాతో పాటు పలుదేశాల్లో ఆర్థిక వ్యవస్థల్ని పాక్షికంగా తెరిచినందున ప్రపంచ ప్రధాన ఈక్విటీ మార్కెట్లన్నీ గతవారం ప్రథమార్ధంలో జోరుగా ర్యాలీ జరిపినప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...తిరిగి చైనాతో ట్రేడ్‌వార్‌ను తెరపైకి తేవడంతో ఆ మార్కెట్లన్నీ వారాంతంలో హఠాత్ పతనాన్ని చవిచూసాయి. భారత్ మార్కెట్‌కు శుక్రవారం సెలవుకావడంతో ప్రపంచ మార్కెట్ల ప్రభావం ఇక్కడ పడలేదు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులు ఇచ్చినప్పటికీ, దేశంలో పారిశ్రామికోత్పత్తి, ఆర్థిక రంగ కార్యకలాపాలకు ప్రధానమైన పెద్ద నగరాలన్నీ రెడ్‌జోన్లు అయినందున, మరో రెండు వారాలు ఆర్థిక వ్యవస్థ నిస్తేజంగా వుండిపోతుంది. అటు అంతర్జాతీయ అంశాలు, ఇటు దేశీయ వార్తల ప్రతికూలతను భారత్ మార్కెట్ తట్టుకోవాలంటే..కేంద్రం కొద్దిరోజులుగా తాత్సారం చేస్తున్న ఆర్థిక ప్యాకేజీని తక్షణమే ప్రకటించాల్సివుంటుంది. అది ఇన్వెస్టర్లను మెప్పించాల్సివుంటుంది. ఇక మన సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి.....
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
ఏప్రిల్ 30తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్‌వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ అనూహ్యంగా 33,887 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన తర్వాత, అంతక్రితంవారంతో పోలిస్తే 2391 పాయింట్ల భారీలాభంతో 33,718 పాయింట్ల వద్ద ముగిసింది. గత గురు, శుక్రవారాల్లో యూరప్, అమెరికా మార్కెట్లు పతనమైన నేపథ్యంలో ఈ సోమవారం సెన్సెక్స్ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 32,170 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ లోపున 31,660–31,275 పాయింట్ల శ్రేణి మధ్య గట్టి మద్దతు లభ్యమవుతున్నది. ఈ శ్రేణిని కోల్పోతే ఏప్రిల్ నెలలో జరిగిన ర్యాలీకి 38.2 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 30,750 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఈ సోమవారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే క్రమేపీ 33,880 పాయింట్ల స్థాయిని తిరిగి పరీక్షించవచ్చు. అటుపైన ముగిస్తే 34,100 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఆపైన కొద్దిరోజుల్లో 34,900 పాయింట్ల వరకూ పెరిగే చాన్స్ వుంటుంది.
నిఫ్టీ 9,390 మద్దతు కోల్పోతే...
క్రితం వారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ...గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన రైజింగ్ వెడ్జ్ ప్యాట్రన్ అప్పర్‌బ్యాండ్ అయిన 9,500 పాయింట్ల స్థాయిని ఛేదించినంతనే 9,889 పాయింట్ల గరిష్టస్థాయికి శరవేగంగా ర్యాలీ జరిపింది. ఈ స్థాయి 12,430 పాయింట్ల గరిష్టం నుంచి 7,511 పాయింట్ల కనిష్టంవరకూ జరిగిన పతనానికి 50 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి. వచ్చేవారం సైతం ఈ స్థాయిని పరిరక్షించుకుంటేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. ఈ సోమవారం మార్కెట్ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 9,390 పాయింట్ల సమీపంలో నిఫ్టీకి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే 9,260–9,140 పాయింట్ల శ్రేణి వరకూ తగ్గవచ్చు. ఈ లోపున 8,980 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. 7,511 పాయింట్ల నుంచి 9,889 పాయింట్ల వరకూ జరిగిన ర్యాలీకి 38.2 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 8,980 పాయింట్ల స్థాయిని కోల్పోతే నిఫ్టీ ప్రస్తుత రిలీఫ్‌ర్యాలీకి తెరపడినట్లే. అయితే ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే మరోదఫా 9,890 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన 9,960 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఆపైన కొద్దిరోజుల్లో 10,200 వరకూ కూడా పెరిగే చాన్స్ వుంటుంది.
– పి. సత్యప్రసాద్
సెన్సెక్స్ 32,170 మద్దతుకు ఇటూ...అటూ
Published Mon, May 4 2020 6:25 AM | Last Updated on Mon, May 4 2020 6:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment