అమెరికా–చైనాల వాణిజ్య ఒప్పందంపై జనవరి 15న సంతకాలు జరగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం, చైనా కేంద్ర బ్యాంకు పెద్ద ఎత్తున 115 బిలియన్ డాలర్ల నిధుల్ని వ్యవస్థలోకి విడుదల చేయడం వంటి పాజిటివ్ వార్తల నేపథ్యంలో పలు ప్రపంచ దేశాల సూచీలు కొత్త రికార్డుల్ని నెలకొల్పినా, భారత్ స్టాక్ సూచీలు...కొత్త గరిష్టస్థాయిల్ని నమోదు చేయలేకపోయాయి. ఈ లోపున అమెరికా డ్రోన్ దాడులతో మధ్యప్రాచ్యంలో సృష్టించిన సంక్షోభ ఫలితంగా కొత్త ఏడాది తొలివారంలో మన మార్కెట్ నష్టాలతో ముగిసింది. మధ్యప్రాచ్య సంక్షోభ ప్రభావంతో క్రూడ్, బంగారం ధర అమాంతం పెరిగాయి. దీంతో మన వాణిజ్యలోటు పెరగడం, రూపాయి క్షీణించడం వంటి ప్రతికూల పరిణామాలు ఏర్పడతాయి. పరిస్థితి తీవ్రతరమైతే ఆ దేశాల నుంచి భారతీయులు పంపించే రెమిటెన్సులు తగ్గడం కూడా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఈ రిస్క్‌లను స్టాక్ మార్కెట్ ఎంతవరకు తట్టుకుంటుందో..ఇప్పుడే అంచనా వేయలేము. ఇక స్టాక్ సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
జనవరి 3తో ముగిసిన ఈ ఏడాది తొలివారంలో పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 110 పాయింట్ల స్వల్పనష్టంతో 41,465 పాయింట్ల వద్ద ముగిసింది. గత కొద్దిరోజులుగా 41,700–41,800 శ్రేణి మధ్య పలు దఫాలు అవరోధాన్ని ఎదుర్కొంటున్నందున, ఈ శ్రేణిని ఛేదించి, ముగిసేంతవరకూ కన్సాలిడేషన్ ప్రక్రియ కొనసాగవచ్చు. ఈ వారం మార్కెట్ క్షీణిస్తే తొలుత 41,260 పాయింట్ల వద్ద మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే 41,130 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ లోపున 41,000–40,730 పాయింట్ల శ్రేణి మధ్యలో మద్దతు పొందవచ్చు. ఇక మార్కెట్ పెరిగితే 41,700–41,810 ్రÔó ణి వద్ద మరోదఫా గట్టి అవరోధాన్ని చవిచూడవచ్చు. ఈ శ్రేణిని దాటితే వేగంగా 41,980 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే క్రమేపీ 42,200 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు.
నిఫ్టీ తక్షణ మద్దతు 12,150...
గత కాలమ్‌లో ప్రస్తావించిన రీతిలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ క్రితం వారం మరో రెండు దఫాలు 12,290 సమీపంలో గట్టి అవరోధాన్ని చవిచూసి ముందడుగు వేయలేకపోయింది. అంతక్రితం వారంతో పోలిస్తే 19 పాయింట్ల స్వల్పనష్టాన్ని చవిచూసింది. గత 10 ట్రేడింగ్ సెషన్లలో దాదాపు ఐదు దఫాలు 12,290 పాయింట్ల స్థాయి వద్ద నిఫ్టీకి అవరోధం కలిగింది. రానున్న రోజుల్లో ఈ స్థాయిని దాటేంతవరకూ కన్సాలిడేషన్ లేదా కరెక్షన్ బాటలో నిఫ్టీ కదులుతుంది. ఈ వారం నిఫ్టీ తగ్గితే 12,150 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే వెనువెంటనే 12,115 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 12,070–11,980 పాయింట్ల శ్రేణి వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ వారం నిఫ్టీ తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే, మరోదఫా 12,290 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిని దాటితే 12,360 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపై 12,425 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు.
– పి. సత్యప్రసాద్
సెన్సెక్స్ 41,700–41,810 శ్రేణిని అధిగమిస్తేనే...
Published Mon, Jan 6 2020 5:23 AM | Last Updated on Mon, Jan 6 2020 5:23 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment