తొలి దశ వాణిజ్య ఒప్పంద పత్రాలతో చైనా ఉపాధ్యక్షుడు లియు హి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్
వాషింగ్టన్: దాదాపు ఏడాదిన్నరగా ప్రపంచ దేశాలను కలవరపరుస్తున్న వాణిజ్య యుద్ధానికి విరామమిచ్చే దిశగా అగ్రరాజ్యాలు అమెరికా, చైనా ముందడుగు వేశాయి. తొలి దశ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా ఉపాధ్యక్షుడు లియు హి దీనిపై సంతకం చేశారు. మేథోహక్కుల పరిరక్షణ, బలవంతపు టెక్నాలజీ బదిలీకి ముగింపు, రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో సమతౌల్యం పాటించడం, వివాదాల పరిష్కారానికి సమర్థమంతమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం తదితర అంశాలు ఇందులో ఉన్నాయి. దీనితో అమెరికా నుంచి చైనాకు మరింతగా వ్యవసాయోత్పత్తులు, ఆర్థిక సేవల ఎగుమతికి అవకాశం లభించనుంది.
‘ఇది చారిత్రక ఒప్పందం. భవిష్యత్‌లో సముచిత రీతిలో ద్వైపాక్షిక వాణిజ్యం నిర్వహించే దిశగా ముందడుగు. గతంలో జరిగిన తప్పులను రెండు దేశాలు దీనితో సరిదిద్దుకుంటున్నాయి‘ అని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ డీల్‌తో ఇరు దేశాలకు గణనీయంగా ప్రయోజనాలు చేకూరతాయని, ఇది ప్రపంచశాంతికి దోహదపడగలదని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. త్వరలోనే తాను చైనాలో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. అమెరికా మేథోహక్కులను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పేందుకు చైనా చెప్పుకోతగ్గ ప్రయత్నాలే చేస్తోందని ట్రంప్ తెలిపారు. అయితే, రెండో దశ ట్రేడ్ డీల్ కుదిరే దాకా చైనాపై టారిఫ్‌లు యథాప్రకారం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతం..
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యేందుకు ఈ డీల్ తోడ్పడగలదని లియు హి ఈ సందర్భంగా చెప్పారు. గత రెండేళ్లుగా ఆర్థిక, వాణిజ్య రంగాల్లో రెండు దేశాలు క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. చర్చల ప్రక్రియలో పలు సవాళ్లు ఎదురైనప్పటికీ వెనక్కి తగ్గకుండా చిట్టచివరికి ఒప్పందం కుదుర్చుకోగలిగామని పేర్కొన్నారు. మరోవైపు, ఇరు పక్షాలు డీల్‌ను సజావుగా అమలు చేయగలవని ఆశిస్తున్నట్లు ట్రంప్‌కు రాసిన లేఖలో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ పేర్కొన్నారు. టెలికం సంస్థ హువావేపై అగ్రరాజ్యం ఆంక్షలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. చైనా కంపెనీలతో అమెరికా సముచిత రీతిలో వ్యవహరించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రపంచ దేశాలకు ఊరట..
అగ్రరాజ్యాల మధ్య కుదిరిన తొలి దశ డీల్‌తో ప్రపంచ దేశాలకు ఊరట లభించగలదని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. డీల్‌లోని అంశాల కన్నా .. ఒక ఒప్పందమంటూ కుదరడం మంచి పరిణామం అని పేర్కొన్నారు. అమెరికా నుంచి మరిన్ని దిగుమతులకు చైనా అంగీకరించడం, దశలవారీగా చైనా ఉత్పత్తులపై సుంకాలను తొలగించేందుకు కట్టుబడి ఉన్నామంటూ అమెరికా ప్రకటించడం.. ఈ డీల్‌లోని ముఖ్యాంశాలుగా వారు తెలిపారు. డీల్ ప్రకారం.. వచ్చే రెండేళ్లలో అమెరికా నుంచి 200 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు చైనా అంగీకరించినట్లు హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక వెల్లడించింది. అయితే, ఇది సంధిలాంటిది మాత్రమేనని, అమెరికా నుంచి చైనా మరిన్ని ఉత్పత్తులు కొనుగోలు చేసేలా చేర్చిన నిబంధన కచ్చితంగా అమలు చేయడం కష్టమేనని చైనా విశ్లేషకుడు ఐనార్ తాంగ్‌జెన్ వ్యాఖ్యానించారు.
పోటాపోటీగా సుంకాల పోరు..
చైనాతో భారీ వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు 2018లో ట్రంప్.. వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. అప్పట్నుంచి రెండు దేశాల మధ్య సుంకాలపరమైన పోరు కొనసాగుతోంది. అమెరికా ఇప్పటిదాకా సుమారు 360 బిలియన్ డాలర్ల పైగా విలువ చేసే చైనా దిగుమతులపై సుంకాలు విధించింది. చైనా కూడా దానికి తగ్గట్లుగా దాదాపు 110 బిలియన్ డాలర్ల విలువ చేసే అమెరికన్ ఉత్పత్తులపై సుంకాలు విధించింది. వాణిజ్య పోరు ప్రభావం.. ఈ రెండు దేశాలకే పరిమితం కాకుండా మిగతా ప్రపంచ దేశాలపై కూడా పడింది.
Comments
Please login to add a commentAdd a comment