Bilateral trade relations
-
జపాన్ ఎగుమతులకు బూస్ట్
న్యూఢిల్లీ: ఎగుమతులు పెంచుకోవడం ద్వారా ఇండియా జపాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంలో సమతూకాన్ని తీసుకురానున్నట్లు వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) ఏప్రిల్–జనవరిలో జపాన్‌కు దేశీ ఎగుమతులు 21 శాతంపైగా ఎగసి 5.1 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే సమయంలో దిగుమతుల విలువ 9.1 శాతం పెరిగి 15.92 బిలియన్ డాలర్లను తాకింది. వెరసి 10.82 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు నమోదైంది. గతేడాది(2023–24)లో జపాన్‌కు భారత్ ఎగుమతులు 5.15 బిలియన్ డాలర్లుకాగా.. దిగుమతులు 17.7 బిలియన్ డాలర్లు. వాణిజ్య లోటు 12.55 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య సమతూకానికి చర్యలు చేపట్టినట్లు గోయల్ తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా ఎగుమతుల పెంపుపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. తద్వారా పరస్పర లబ్దికి వీలుంటుందని ఇండియా–జపాన్ ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడుల(ఎకానమీ అండ్ ఇన్వెస్ట్మెంట్) సదస్సులో గోయల్ తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధనం, హైటెక్ సెమీకండక్టర్ల తయారీ, ఎల్రక్టానిక్స్ గూడ్స్, ఏఐ తదితర విభాగాలలో మరింత సహకారానికి జపనీస్ సంస్థలను ఆహ్వానించారు. సమీకృత స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(సీఈపీఏ)పై రెండు దేశాలు 2011లో సంతకాలు చేశాయి. 1,400కుపైగా జపనీస్ కంపెనీలు భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. పలు జపనీస్ కంపెనీలతో 8 రాష్ట్రాలలో 11 పారిశ్రామిక టౌన్‌షిప్‌లు విస్తరించాయి. ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ముంబై, అహ్మదాబాద్ హైస్పీ డ్ రైల్ సహా ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై మెట్రో వ్యవస్థలు దేశీ అభివృద్ధిలో జపనీస్ కంపెనీల భాగస్వామ్యాన్ని ప్రతిఫలిస్తున్నట్లు గోయల్ ప్రస్తావించారు. సమీప భవిష్యత్‌లో ముంబై, అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ ట్రయిన్ సరీ్వసులు ప్రారంభంకాగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
India-U.S relations: ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు
వాషింగ్టన్: ట్రంప్ 2.0తో మోదీ 3.0 తొలి భేటీ బంపర్ హిట్టయింది. భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 కల్లా రెండింతలకు పెంచి 500 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయం జరిగింది. అందులో భాగంగా భారత్‌కు అమెరికా అత్యాధునిక ఎఫ్–35 యుద్ధ విమానాలను అందజేయడమే గాక రక్షణ ఉత్పత్తులను ఎగుమతులను ఇతోధికంగా పెంచనుంది. భారీగా చమురు, సహజవాయువు కూడా సరఫరా చేయనుంది. ఇరు దేశాలూ పౌర అణు సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)తో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) జరిపిన సమావేశం ఇలాంటి పలు కీలక ఒప్పందాలకు వేదికైంది. రెండు రోజుల అమెరికా పర్యటన(Usa Tour)లో భాగంగా అధ్యక్షునితో మోదీ శుక్రవారం (భారత కాలమానం ప్రకారం) వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో భేటీ అయ్యారు. మోదీ మూడోసారి ప్రధానిగా, ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించాక వారి మధ్య ఇదే తొలి సమావేశం కావడం విశేషం. మోదీని ట్రంప్ అత్యంత ఆత్మీయంగా స్వాగతించారు. చాలాసేపటిదాకా కరచాలనం చేయడమే గాక ప్రధానిని గట్టిగా హత్తుకున్నారు. ‘మీరో అద్భుతమైన వ్యక్తి. గొప్ప మిత్రుడు. మిమ్మల్నెంతగానో మిస్సయ్యాం’ అంటూ అత్యంత ఆప్యాయంగా పలకరించారు. అనంతరం భారత్, అమెరికా వాణిజ్య, దౌత్య సంబంధాలు, రక్షణ రంగంలో పరస్పర సహకారంతో పాటు పలు అంశాలపై నేతలిద్దరూ సుదీర్ఘంగా చర్చించుకున్నారు. పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తర్వాత 44 నిమిషాల పాటు మీడియాతో సంయుక్తంగా మాట్లాడారు. అమెరికాకు మోదీ చిరకాల మిత్రుడంటూ మీడియా ముఖంగా కూడా ట్రంప్ పదేపదే ప్రశంసించారు. భారీ వర్తక ఒప్పందం: ట్రంప్ చైనాతో పాటు పలు దేశాలపై దూకుడైన టారిఫ్‌ల యుద్ధం ప్రకటించిన ట్రంప్, భారత్‌పై టారిఫ్‌ల విషయంలో మాత్రం కాస్త సున్నితంగానే స్పందించారు. కాకపోతే పరస్పర టారిఫ్‌ల విషయంలో మాత్రం అస్సలు మొహమాటపడబోమని మోదీ సమక్షంలో ట్రంప్ కుండబద్దలు కొట్టారు. అమెరికాపై భారత్ విధించే సుంకాలనే తామూ విధించి తీరతామన్నారు. పలు అమెరికా ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న దిగుమతి సుంకాలు చాలా హెచ్చుగా, ఏకపక్షంగా ఉన్నాయంటూ సంయుక్త మీడియా భేటీలోనే ఆక్షేపించారు. అయితే, అమెరికా నుంచి చమురు, సహజవాయువు దిగుమతుల పరిమాణాన్ని భారీగా పెంచేందుకు మోదీ సమ్మతించారని అధ్యక్షుడు వెల్లడించారు. ఆ రెండింట్లో భారత్‌కు తామే అతి పెద్ద సరఫరాదారులం కాబోతున్నట్టు చెప్పారు. ‘‘భారత్‌తో వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు రక్షణ హార్డ్‌వేర్ తదితర ఉత్పత్తుల ఎగుమతులను ఈ ఏడాది నుంచి ఏటా బిలియన్ డాలర్ల మేరకు పెంచనున్నాం. అంతేగాక ప్రపంచంలోకెల్లా అత్యంత అధునాతనమైన ఎఫ్–35 స్టెల్త్ ఫైటర్లను భారత్‌కు అందజేస్తాం. భారత్‌తో అతి త్వర లో భారీ వర్తక ఒప్పందం కుదరనుంది. పౌర అణు ఇంధన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. ఇందులో భా గంగా అమెరికా అణు పరిజ్ఞానాన్ని భారత్ తన మార్కెట్లలోకి అనుమతించనుంది’’ అని వెల్లడించారు. భారత్–పశి్చమాసియా–యూరప్ ఆర్థిక కారిడార్ దిశగా కృషి చేయాలని అంగీకారానికి వచ్చామన్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు ముకుతాడు వేసే దిశగా అధినేతల భేటీలో మరిన్ని నిర్ణయాలు జరిగాయి. వాటిలో భాగంగా భారత్‌కు మరో 6 అత్యాధునిక పీ–8ఐ దీర్ఘశ్రేణి సముద్ర నిఘా విమానాలను విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లు, స్ట్రైకర్ యుద్ధ వాహనాలను భారత్‌లో సంయుక్త తయారీ తదితరాలకూ సమ్మతించింది. పదేళ్లకు రోడ్‌మ్యాప్: మోదీ భారత్, అమెరికా పరస్పర సహకారాత్మక బంధం మెరుగైన ప్రపంచానికి బాటలు పరుస్తుందని మోదీ ఆశాభావం వెలిబుచ్చారు. రక్షణ రంగంలో పరస్పర సహకారానికి వచ్చే పదేళ్ల కాలానికి రోడ్‌మ్యాప్ రూపొందించుకుంటామని చెప్పారు. అంతరిక్ష రంగంలో సహకారాన్ని మరింత పెంపొందించుకుంటామని చెప్పారు. 2025ను అమెరికా–భారత్ పౌర అంతరిక్ష సహకార సంవత్సరంగా అభివర్ణించారు. ‘‘అన్ని విషయాల్లోనూ అమెరికా ప్రయోజనాలకే ట్రంప్ పెద్దపీట వేస్తారు. ఇది నేనెంతగానో అభినందించే విషయం. భారత ప్రయోజనాలకు నేను కూడా అంతే’’ అని వివరించారు. వ్యాపారవేత్త గౌతం అదానీ వివాదంపై ట్రంప్‌తో చర్చించారా అని ప్రశ్నించగా వ్యక్తులను గురించి అంశాలేవీ ప్రస్తావనకు రాలేదని చెప్పారు. చైనాతో లద్దాఖ్ వివాదాన్ని ప్రస్తావించగా సరిహద్దు ఘర్షణలు ఎవరికీ మంచివి కావని అభిప్రాయపడ్డారు. ట్రంప్ జోక్యం చేసుకుని చైనా, భారత్, రష్యా, అమెరికా కలసికట్టుగా సాగాలని అభిలషించారు. ట్రంప్‌తో భేటీ అద్భుతంగా సాగిందని అనంతరం మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. రెండు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని శుక్రవారం ఆయన భారత్ బయల్దేరారు. ముంబై దోషుల్ని శిక్షించాల్సిందే ఇస్లామిక్ రాడికల్ ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు అమెరికా సంఘీభావం ప్రకటించింది. దాన్ని రూపుమాపేందుకు సంయుక్తంగా పోరాడతామని ట్రంప్ స్పష్టం చేశారు. 2008 ముంబై ఉగ్ర దాడుల దోషులందరికీ శిక్ష పడేలా చూడాల్సిందేనని పాకిస్తాన్‌కు స్పష్టం చేశారు. ఆ దాడుల్లో నిందితుడైన తహవ్వుర్ రాణాను భారత్‌కు అప్పగిస్తున్నట్టు సంయుక్త విలేకరుల భేటీలో అధ్యక్షుడు ధ్రువీకరించారు. ‘‘ప్రపంచంలోకెల్లా అత్యంత హింసాత్మక వ్యక్తుల్లో ఒకరిని భారత్‌కు అప్పగిస్తున్నామని చెప్పేందుకు సంతోషిస్తున్నా. ముంబై ఉగ్ర దాడులకు పాల్పడ్డందుకు అక్కడ న్యాయ విచారణను ఎదుర్కొంటాడు. త్వరలో మరికొందరిని కూడా అప్పగిస్తాం’’ అని పేర్కొన్నారు. తద్వారా ఖలిస్తానీ వేర్పాటువాది పన్ను తదితరులకు పరోక్షంగా హెచ్చరిక సంకేతాలిచ్చారు. రాణా అప్పగింత పట్ల అమెరికాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికా తొలినుంచీ కలసికట్టుగా పని చేస్తున్నాయని గుర్తు చేశారు. ముంబై తరహా దాడులను నివారించేందుకు, అల్‌ఖైదా, ఐసిస్, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా తదితర ఉగ్ర సంస్థల ఆట కట్టించేందుకు సంయుక్త కృషిని కొనసాగిస్తామని ఇరు దేశాల సంయుక్త ప్రకటన కూడా పేర్కొంది. పాక్ మూలాలున్న రాణా కెనడా జాతీయుడు. పాక్–అమెరికా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో పాటు ముంబై దాడుల్లో ప్రధాన నిందితుడు. ప్రస్తుతం లాస్ ఏంజెలిస్ జైల్లో ఉన్నాడు. భారత్‌లో అమెరికా వర్సిటీల క్యాంపస్‌లు పలు ప్రఖ్యాత అమెరికా విశ్వవిద్యాలయాలు త్వరలో భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేయనున్నాయి. ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చల్లో ఈ మేరకు నిర్ణయం జరిగింది. ఉన్నత విద్యా రంగంలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంచుకోవాలని కూడా నిశ్చయించారు. ఇందుకోసం పరస్పర సంయుక్త డిగ్రీలు తదితర పథకాలతో పాటు జాయింట్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నారు. అమెరికాలో చదువుతున్న 3 లక్షలకు పై చిలుకు భారత విద్యార్థుల వల్ల అక్కడి ఆర్థిక వ్యవస్థకు ఏటా 8 బిలియన్ డాలర్ల దాకా అందుతోందని నేతలిద్దరూ గుర్తు చేసుకున్నారు. అమెరికాలోని భారత సమాజానిది ఇరు దేశాల బంధంలో అతి కీలక పాత్ర అని మీడియా భేటీలో ట్రంప్ చెప్పారు. లాస్ ఏంజెలిస్, బోస్టన్ నగరాల్లో త్వరలో భారత కాన్సులేట్లు తెరవనున్నట్టు వెల్లడించారు.మానవ అక్రమ రవాణాపై పోరు: మోదీ మనుషుల అక్రమ రవాణా భారత్‌కు మాత్రమే పరిమితమైన సమస్య కాదని ప్రధాని మోదీ అన్నారు. దాన్ని ప్రపంచ సమస్యగా అభివరి్ణంచారు. పెద్ద కలలు కనే సాధారణ కుటుంబాలకు చెందిన అమాయకులను పరాయి దేశాల్లో అక్రమ వలసదారులుగా మారుస్తున్న ఈ జాఢ్యంపై దీనిపై దేశాలన్నీ కలసికట్టుగా పోరాడాల్సి ఉందన్నారు. ‘‘పరాయి దేశంలో అక్రమంగా ప్రవేశించే వారెవరికీ అక్కడ నివసించే హక్కుండబోదు. అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్టు తేలిన భారతీయులందరినీ వెనక్కు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని స్పష్టం చేశారు. ఈ అంశం ట్రంప్–మోదీ చర్చల్లో కూడా ప్రస్తావనకు వచ్చిందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ తెలిపారు.తటస్థం కాదు, శాంతివైపే ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ శాంతివైపే నిలిచింది తప్ప ఏనాడూ తటస్థ వైఖరితో వ్యవహరించలేదని మోదీ స్పష్టం చేశారు. ఈ విషయమై కొన్ని దేశాలకు ఉన్న అభిప్రాయం అపోహ మాత్రమేనన్నారు. ‘‘రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి సాధనకు దౌత్యమే మార్గం తప్ప యుద్ధం కాదు. ఈ దిశగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతిస్తున్నా. ఇది యుద్ధాల యుగం కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు స్పష్టంగా చెప్పా’’ అని చెప్పారు.బేరాల్లో నాకన్నా మొనగాడు: ట్రంప్ట్రంప్, మోదీ సంయుక్త మీడియా సమావేశం అత్యంత స్నేహపూర్వకంగా, పలు సందర్భాల్లో సరదా మాటలతో సాగింది. ఇద్దర్లో ఎవరు మెరుగ్గా బేరమాడతారని మీడియా ప్రశ్నించగా ఆ విషయంలో మోదీదే పై చేయంటూ ట్రంప్ టక్కున బదులిచ్చారు. ‘‘మోదీ నా కంటే చాలా గట్టిగా, మెరుగ్గా బేరమాడగలరు. ఆయనతో పోటీ కూడా పడలేను. అందులో అనుమానమే లేదు’’ అంటూ నవ్వులు పూయించారు. భేటీ పొడవునా మోదీని అధ్యక్షుడు పదేపదే ప్రస్తుతించారు. ‘‘ఆయనో గొప్ప నాయకుడు. ప్రధానిగా అద్భుతంగా రాణిస్తున్నారు. దేశాధినేతలతో పాటు ఎవరిని చూసినా ఆయన గురించే మాట్లాడతారు. భారత్‌లోనూ, అమెరికాలోనూ మోదీ, నేను ఎంతో సమయం కలిసి గడిపాం. ఆయన ప్రత్యేకమైన వ్యక్తి. అందమైన భారతదేశంలో ఐదేళ్ల కింద పర్యటించా. నా భార్య మెలానియాతో కలిసి అద్భుతమైన సమయం గడిపా. అప్పుడు మోదీ ఇచ్చిన అద్భుతమైన ఆతిథ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడాయనకు అదే తరహాలో ఆతిథ్యం ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా మిత్రుడు మోదీకి మరోసారి స్వాగతం పలికినందుకు ఎంతో థ్రిల్లవుతున్నా’’ అని చెప్పుకొచ్చారు. జనవరి 20న ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక అమెరికాలో పర్యటించిన తొలి విదేశీ నేతల్లో మోదీ ఉన్నారు.మాగా.. మిగా కలిస్తే మెగా ట్రంప్ నినదించిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (ఎంఏజీఏ–మాగా) స్ఫూర్తితో మేక్ ఇండియా గ్రేట్ అగైన్ (ఎంఐజీఏ–మిగా) నినాదం ఇస్తున్నానని ప్రధాని మోదీ ప్రకటించారు. రెండూ కలిసి మెగా భాగస్వామ్యంగా మారతాయని ధీమా వెలిబుచ్చారు.మిషన్ 500భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణాన్ని 2030 కల్లా 500 బిలియన్ డాలర్లకు పెంచాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇందులో భా గంగా పరస్పర సుంకాలను బాగా తగ్గించుకోవాలని, మార్కెట్ యాక్సెస్‌ను పెంపొందించుకోవాలని తీర్మానించాయి. మోదీ–ట్రంప్ భేటీ అనంతరం ఇరు దేశాలు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ముఖ్యాంశాలు... → ఈ సంవత్సరాంతానికల్లా ద్వైపాక్షిక వర్తక ఒప్పందం (బీటీఏ) కుదరనుంది. ఇరు దేశాల నుంచి ఉన్నత స్థాయి ప్రతినిధులు లోతుగా చర్చిస్తారు. → సైనిక భాగస్వామ్యం, వేగవంతమైన వాణిజ్య, సాంకేతిక బంధం దిశగా అవకాశాలను నిశితంగా పరిశీలించేందుకు ఉద్దేశించిన ‘కాంపాక్ట్’ మిషన్‌ను ముందుకు తీసుకెళ్లే మార్గాలను అన్వేషిస్తారు. → వస్తువులు, సేవల రంగంతో పాటు అన్నింటా వరక్త వాణిజ్యాలు మరింత వేగవంతం అవుతాయి. → నాసా–ఇస్రో సంయుక్త ఆక్సియోమ్ మిషన్ ద్వారా భారత వ్యోమగామి తొలిసారి ఐఎస్ఎస్కు వెళ్లనున్నాడు. → త్వరలో నాసా–ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ (నిసార్) మిషన్‌ను ప్రయోగించనున్నాం. → ట్రాన్స్‌ఫారి్మంగ్ ద రిలేషన్షిప్ యుటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ (ట్రస్ట్) పథకం ద్వారా రక్షణ, ఏఐ, సెమీ కండక్టర్లు, క్వాంటమ్, బయోటెక్నాలజీ, ఇంధన, అంతరిక్ష తదితర రంగాల్లో ప్రభుత్వాల, ప్రైవేటు స్థాయిలో పరస్పరం మరింత సహాయక సహకారాలు. -
భారత్, ఇండొనేసియా మధ్య స్థానిక కరెన్సీలోనే వాణిజ్యం
ముంబై: ద్వైపాక్షిక వాణిజ్య లావాదేవీలను స్థానిక కరెన్సీలోనే నిర్వహించుకోవడంపై భారత్, ఇండొనేíసియా దృష్టి పెట్టాయి. ఇందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఇండోనేసియా ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, బ్యాంక్ ఇండోనేసియా గవర్నర్ పెర్రీ వార్జియో దీనిపై సంతకాలు చేశారు. సీమాంతర లావాదేవీలను భారతీయ రూపాయి (ఐఎన్ఆర్), ఇండొనేషియా రూపియా (ఐడీఆర్) మారకంలో నిర్వహించడాన్ని ప్రోత్సహించే దిశగా ఫ్రేమ్ వర్క్ ను రూపొందించడానికి ఇది ఉపయోగ పడనుంది. -
రూపాయి-దిర్హామ్ వాణిజ్యం విస్తరణ:పెట్టుబడులకు అపార అవకాశాలు
భారత్-యూఏఈ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రూపీ-దిర్హామ్ రూపంలో మరింత విస్తరించు కునేందుకు ఆసక్తిగా ఉన్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఇది ద్వైపాక్షిక వాణిజ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. రెండు దేశాలూ యూఏఈ నుంచి భారత్‌కు తక్కువ వ్యయానికే నిధులు పంపుకునేందుకు ఇది సాయపడుతుందన్నారు. 11వ భారత్–యూఏఈ ఉన్నత స్థాయి టాస్‌్కఫోర్స్ సమావేశం కోసం వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గురువారం నుంచి యూఏఈలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఆయన వెంట అధికారుల బృందం కూడా ఉంది. ‘‘ఆర్బీఐ, యూ ఏఈ సెంట్రల్ బ్యాంక్‌తో ఇప్పుడే చర్చలు పూర్త య్యాయి. పరిశ్రమ, బ్యాంకర్లతో కలసి రూపీ–దిర్హా మ్ వాణిజ్యాన్ని మరింత వేగంగా, పెద్ద మొత్తంలో అమలు చేయాలని నిర్ణయించాం’’అని మీడియా ప్ర తినిధులకు పీయూష్ గోయల్ చెప్పారు. దేశీ కరెన్సీల రూపంలో వాణిజ్యం నిర్వహించుకోవడం వల్ల మొత్తం వాణిజ్యంపై 5% ఆదా చేసుకోవచ్చన్నారు. పెట్టుబడులకు అపార అవకాశాలు ఆహార, పారిశ్రామిక పార్క్‌లు భారత్‌లో ఏర్పాటు చేయడంపైనా ఇరువైపులా చర్చలు జరిగినట్టు మంత్రి గోయల్ చెప్పారు. యూఏఈ ఇన్వెస్టర్లు భారత్‌లో ఆర్థిక సేవలు, శుద్ధ ఇంధనాలు, మౌలిక రంగం, విద్య, హెల్త్‌కేర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్టు తెలిపారు. భారత్‌లో విమానయాన రంగం యూఏఈ పెట్టుబడిదారులకు నమ్మకమైనదిగా మారినట్టు చెప్పారు. రవాణా, పర్యాటక రంగాలకు భారత్ సర్కారు ప్రోత్సాహాన్నిస్తున్నట్టు పేర్కొన్నారు. రానున్న రజుల్లో తయారీ, సేవల రంగాల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయన్నారు. ఇరు దేశాల మధ్య పెట్టుబడులు, సంబంధాలకు ఇప్పుడు చంద్రుడు కూడా హద్దు కాదని అభివర్ణించారు. ఆవిష్కరణలతో పాటు, పెట్రోలియం, పెట్రోలియం కెమికల్ రంగాల్లో అప్‌స్ట్రీమ్ (అన్వేషణ, ఉత్పత్తి), డౌన్‌స్ట్రీమ్ (మార్కెటింగ్, విక్రయాలు) పట్ల రెండు దేశాల్లో ఆసక్తి ఉన్నట్టు ప్రకటించారు. భారత్-యూఏఈ గతేడాది మేలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని అమలు చేయడం గమనార్హం. 2021-22లో ద్వైపాక్షిక వాణిజ్య 72.9 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2022–23లో అది 84.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఏఐ ఎతిహాద్‌తో ఎన్పీసీఐ ఒప్పందం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ)కు చెందిన అంతర్జాతీయ విభాగం ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్, గురువారం యూఐఈకి చెందిన ఏఐ ఎతిహాద్ పేమెంట్స్‌తో ఒప్పందం చేసుకుంది. వాణిజ్య మంత్రి గోయల్ సమక్షంలో ఇది కుదిరింది. దీంతో రెండు దేశాల్లోని వారు తక్కువ వ్యయానికే రియల్ టైమ్ (అప్పటికప్పుడు) సీమాంతర చెల్లింపులు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. దేశీ లావాదేవీలు నిర్వహించుకున్నంత సులభంగా సీమాంతర లావాదేవీలు చేసుకోవచ్చని ఈ ఒప్పందం స్పష్టం చేస్తోంది. నగదు పంపిస్తున్నప్పుడు రెండు దేశాల కరెన్సీ విలువ, చార్జీల వివరాలు కనిపిస్తాయి. దీంతో పారదర్శకత పెరగనుంది. గ్లోబల్ కార్డ్‌ల అవసరం లేకుండా డొమెస్టిక్ కార్డులను వినియోగించి నగదు పంపించుకోవచ్చు. ఈ ఒప్పందంతో ఎన్పీసీఐ ఉత్పత్తి అయిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ), యూఏఈకి చెందిన ఇన్స్టంట్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ (ఐపీపీ) మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. దీంతో యూపీఐ లావాదేవీ మాదిరే సులభంగా నిర్వహించుకోవచ్చు. అలాగే, భారత్‌కు చెందిన రూపే స్విచ్, యూఏఈ స్విచ్ మధ్య కూడా అనుసంధాన ఏర్పడుతుంది. దీంతో కార్డుల నుంచి కూడా నగదు పంపుకోవడం సాధ్యపడుతుంది. ఈ ఒప్పందం యూఏఈలో ఉపాధి పొందుతున్న 35 లక్షల భారతీయులకు (ప్రవాసులు) ప్రయోజనం చేకూర్చనుంది. -
ఎఫ్‌టీఏపై బ్రిటన్‌తో చర్చలు ముమ్మరం
న్యూఢిల్లీ: భారత్, బ్రిటన్ మధ్య ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కోసం చర్చలు వేగవంతమయినట్లు వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంపొందించడమే ఈ ఒప్పందం లక్ష్యమని వివరించారు. భారతదేశం ‘రికార్డు‘ సమయంలో యునైడెట్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)తో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసిందని, ఇప్పుడు బ్రిటన్‌తోనూ చర్చలు వేగంగా జరుగుతున్నాయని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలు తమ మధ్య వర్తకం చేసే గరిష్ట సంఖ్యలో వస్తువులపై కస్టమ్స్ సుంకాలను గణనీయంగా తగ్గిస్తాయి లేదా తొలగిస్తాయి. అంతేకాకుండా, ఒప్పందం చేసుకున్న దేశాలు వస్తువులు, పెట్టుబడులలో వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి నిబంధనలను సులభతరం చేస్తాయి. జనవరిలో భారతదేశం, బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం అధికారికంగా చర్చలు ప్రారంభించాయి. దీపావళి నాటికి చర్చలు ముగించాలని గడువును నిర్దేశించుకున్నాయి. భారత్‌కే కొన్ని సవాళ్లు కెనడా, యూరోపియన్ యూనియన్ (ఈయూ), ఇజ్రాయెల్‌లతో కూడా భారతదేశం ఇదే విధమైన ఒప్పందాలపై చర్చలు జరుపుతోందని మంత్రి తెలిపారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరపడానికి అనేక ఇతర దేశాలు ఆసక్తిని కనబరుస్తున్నాయని వెల్లడించారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ), యురేషియన్ ఎకనమిక్ యూనియన్ (ఈఏఈయూ), యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ) ఈ ఒప్పందాలపై చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే, పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునే విషయంలో భారత్ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొన్న ఆయన, అనేక దేశాలతో ఏకకాలంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి భారత్ వాణిజ్య మంత్రిత్వ శాఖ వద్ద తగినంత వనరులు లేవని వ్యాఖ్యానించడం విశేషం. జీసీసీ.. గల్ఫ్ ప్రాంతంలోని ఆరు దేశాల యూనియన్. ఈ యూనియన్‌లో బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలు ఉన్నాయి. ఇక ఈఎఫ్‌టీఏలో స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లీచ్టెన్స్టెయిన్ సభ్య దేశాలు. ఐదు దేశాల ఈఏఈయూలో రష్యా, అర్మేనియా, బెలారస్, కజకిస్తాన్, కిర్గిస్తాన్ సభ్యులుగా ఉన్నాయి. వ్యాపార సంఘాల్లో ఐక్యతకు పిలుపు దేశీయ వ్యాపారుల సంఘాలు ఉత్పత్తుల నాణ్యతపై దృష్టి సారించాలని, ఐక్యంగా పని చేయాలని గోయెల్ ఈ సందర్భంగా కోరారు. విధాన పరమైన క్లిష్ట అంశాలను సరళతరం చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే దాదాపు 30,000 నియమ, నిబంధనలను సడలించినట్లు తెలిపారు. -
తాలిబన్లు తెచ్చిన తంటాలు..భారత్‌లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా...?
న్యూఢిల్లీ: అఫ్టనిస్తాన్ను తాలిబన్లు కైవసం చేసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల దృష్టి అప్ఘనిస్తాన్‌పై పడింది. తాలిబన్లు ఇప్పటికే లిథియం నిక్షేపాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తోన్నాయి. రానున్న రోజుల్లో తాలిబన్ల చేతిలో ఉన్న అఫ్ఘనిస్తాన్‌తో సంబంధాలు ఏవిధంగా ఉంటాయనే సందిగ్ధంలో అనేక దేశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే భారత్-అఫ్ఘనిస్తాన్ ద్వైపాక్షిక వాణిజ్యసంబంధాలపై పెను ప్రభావం చూపనుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) ఆందోళన వ్యక్తం చేసింది. అఫ్ఘనిస్తాన్ తాలిబన్ల హస్తగతం పలు వస్తువుల ధరలు ఆకాశానంటే అవకాశం ఉందని తెలుస్తోంది. (చదవండి: మొబైల్ రీచార్జ్ టారిఫ్‌ల పెంపు తప్పనిసరి కానుందా..!) ఆకాశమే హద్దుగా పెరగనున్న ధరలు..! అఫ్ఘనిస్తాన్ ఎండుద్రాక్ష, వాల్నట్స్, బాదం, అత్తి పండ్లు, పైన్ గింజలు, పిస్తా, ఎండిన ఆప్రికాట్, నేరేడు పండు, చెర్రీ, పుచ్చకాయ, మరికొన్ని ఔషధ మూలికలను భారత్‌కు ఎగుమతి చేస్తోంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌కు భారతదేశ ఎగుమతులలో టీ, కాఫీ, మిరియాలు, పత్తి, బొమ్మలు, పాదరక్షలు ఇతర వినియోగించదగిన వస్తువులు ఉన్నాయని సీఎఐటీ జాతీయ అధ్యక్షుడు బిసి భారతీయా తెలిపారు. ఇండియా- అఫ్ఘనిస్తాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంలో భాగంగా 2020-21 సంవత్సరంలో 1.4 బిలియన్ డాలర్లు, 2019-20లో 1.52 బిలియన్ డాలర్ల వ్యాపారం ఇరు దేశాలు మధ్య కొనసాగుతుంది. అఫ్ఘనిస్తాన్కు భారత ఎగుమతుల విలువ 826 మిలియన్లు డాలర్లు కాగా, దిగుమతులు 2020-21 సంవత్సరంలో 510 మిలియన్ డాలర్లుగా ఉంది. ఈ తరుణంలో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యంపై అనిశ్చితి కారణంగా అఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని వస్తువుల ధరలు భారతీయ మార్కెట్లలో పెరగవచ్చని సీఏఐటీ అగ్ర ప్రతినిధులు తెలిపారు. వాస్తవానికి తాలిబాన్లు అఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో దిగుమతి, ఎగుమతుల రవాణా పూర్తిగా నిలిచిపోయింది. అంతేకాకుండా భారీ మొత్తంలో చెల్లింపులకు నిరోధం ఏర్పడుతుందని సీఏఐటీ వెల్లడించింది. పలు వ్యాపారులు ప్రమాదకర స్థితిలోకి వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. భారత ప్రభుత్వ మద్దతు తప్పనిసరి..! ప్రస్తుత పరిస్థితిని గుర్తించి తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వ్యాపారులకు కచ్చితంగా మద్దతును అందించాలని సీఏఐటీ పేర్కొంది. దేశంలో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉన్నందున ఆఫ్ఘనిస్తాన్‌తో ఒక నిర్దిష్ట కాలానికి వాణిజ్యం పూర్తిగా నిలిచిపోతుందని వారు అభిప్రాయపడ్డారు. అఫ్గనిస్తాన్‌కు ఎక్కువగా వాయుమార్గం ద్వారానే ఎగుమతి, దిగుమతులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అఫ్ఘనిస్తాన్ ఎయిర్‌స్పేస్‌పై పూర్తి గా నిషేధం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అఫ్ఘన్‌లో నెలకొన్న అనిశ్చితి తగ్గిన తరువాతనే ఇరు దేశాల దైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు ఓ కొలిక్కి వస్తాయని సీఏఐటీ వెల్లడించింది. చదవండి: Wikipedia:హ్యాక్..! లిస్ట్‌లో టాప్ సెలబ్రిటీలు..! -
వాణిజ్య యుద్ధానికి విరామం!!
వాషింగ్టన్: దాదాపు ఏడాదిన్నరగా ప్రపంచ దేశాలను కలవరపరుస్తున్న వాణిజ్య యుద్ధానికి విరామమిచ్చే దిశగా అగ్రరాజ్యాలు అమెరికా, చైనా ముందడుగు వేశాయి. తొలి దశ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా ఉపాధ్యక్షుడు లియు హి దీనిపై సంతకం చేశారు. మేథోహక్కుల పరిరక్షణ, బలవంతపు టెక్నాలజీ బదిలీకి ముగింపు, రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో సమతౌల్యం పాటించడం, వివాదాల పరిష్కారానికి సమర్థమంతమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం తదితర అంశాలు ఇందులో ఉన్నాయి. దీనితో అమెరికా నుంచి చైనాకు మరింతగా వ్యవసాయోత్పత్తులు, ఆర్థిక సేవల ఎగుమతికి అవకాశం లభించనుంది. ‘ఇది చారిత్రక ఒప్పందం. భవిష్యత్‌లో సముచిత రీతిలో ద్వైపాక్షిక వాణిజ్యం నిర్వహించే దిశగా ముందడుగు. గతంలో జరిగిన తప్పులను రెండు దేశాలు దీనితో సరిదిద్దుకుంటున్నాయి‘ అని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ డీల్‌తో ఇరు దేశాలకు గణనీయంగా ప్రయోజనాలు చేకూరతాయని, ఇది ప్రపంచశాంతికి దోహదపడగలదని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. త్వరలోనే తాను చైనాలో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. అమెరికా మేథోహక్కులను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పేందుకు చైనా చెప్పుకోతగ్గ ప్రయత్నాలే చేస్తోందని ట్రంప్ తెలిపారు. అయితే, రెండో దశ ట్రేడ్ డీల్ కుదిరే దాకా చైనాపై టారిఫ్‌లు యథాప్రకారం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతం.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యేందుకు ఈ డీల్ తోడ్పడగలదని లియు హి ఈ సందర్భంగా చెప్పారు. గత రెండేళ్లుగా ఆర్థిక, వాణిజ్య రంగాల్లో రెండు దేశాలు క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. చర్చల ప్రక్రియలో పలు సవాళ్లు ఎదురైనప్పటికీ వెనక్కి తగ్గకుండా చిట్టచివరికి ఒప్పందం కుదుర్చుకోగలిగామని పేర్కొన్నారు. మరోవైపు, ఇరు పక్షాలు డీల్‌ను సజావుగా అమలు చేయగలవని ఆశిస్తున్నట్లు ట్రంప్‌కు రాసిన లేఖలో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ పేర్కొన్నారు. టెలికం సంస్థ హువావేపై అగ్రరాజ్యం ఆంక్షలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. చైనా కంపెనీలతో అమెరికా సముచిత రీతిలో వ్యవహరించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలకు ఊరట.. అగ్రరాజ్యాల మధ్య కుదిరిన తొలి దశ డీల్‌తో ప్రపంచ దేశాలకు ఊరట లభించగలదని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. డీల్‌లోని అంశాల కన్నా .. ఒక ఒప్పందమంటూ కుదరడం మంచి పరిణామం అని పేర్కొన్నారు. అమెరికా నుంచి మరిన్ని దిగుమతులకు చైనా అంగీకరించడం, దశలవారీగా చైనా ఉత్పత్తులపై సుంకాలను తొలగించేందుకు కట్టుబడి ఉన్నామంటూ అమెరికా ప్రకటించడం.. ఈ డీల్‌లోని ముఖ్యాంశాలుగా వారు తెలిపారు. డీల్ ప్రకారం.. వచ్చే రెండేళ్లలో అమెరికా నుంచి 200 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు చైనా అంగీకరించినట్లు హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక వెల్లడించింది. అయితే, ఇది సంధిలాంటిది మాత్రమేనని, అమెరికా నుంచి చైనా మరిన్ని ఉత్పత్తులు కొనుగోలు చేసేలా చేర్చిన నిబంధన కచ్చితంగా అమలు చేయడం కష్టమేనని చైనా విశ్లేషకుడు ఐనార్ తాంగ్జెన్ వ్యాఖ్యానించారు. పోటాపోటీగా సుంకాల పోరు.. చైనాతో భారీ వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు 2018లో ట్రంప్.. వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. అప్పట్నుంచి రెండు దేశాల మధ్య సుంకాలపరమైన పోరు కొనసాగుతోంది. అమెరికా ఇప్పటిదాకా సుమారు 360 బిలియన్ డాలర్ల పైగా విలువ చేసే చైనా దిగుమతులపై సుంకాలు విధించింది. చైనా కూడా దానికి తగ్గట్లుగా దాదాపు 110 బిలియన్ డాలర్ల విలువ చేసే అమెరికన్ ఉత్పత్తులపై సుంకాలు విధించింది. వాణిజ్య పోరు ప్రభావం.. ఈ రెండు దేశాలకే పరిమితం కాకుండా మిగతా ప్రపంచ దేశాలపై కూడా పడింది. -
జపాన్ టు ఇండియా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్స్) ఎంట్రీ, సక్సెస్‌తో విదేశీ కంపెనీల్లో ఉత్సాహం నెలకొంది. వాణిజ్య స్థిరాస్తి రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు పలు విదేశీ కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇప్పటికే భారత స్థిరాస్తి రంగంలోకి అమెరికా, కెనడా దేశాల కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జపాన్‌కు చెందిన పలు రియల్టీ కంపెనీలు ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఎంబసీతో మిట్సుబిషి చర్చలు.. జపాన్‌కు చెందిన మిట్సుబిషి కార్పొరేషన్, సుమిటోమో కార్పొరేషన్, మిట్సుయి గ్రూప్, మోరీ బిల్డింగ్స్ దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో వాణిజ్య స్థిరాస్తి ప్రాజెక్ట్‌ల నిర్మాణం, నిర్వహణ, పారిశ్రామిక పార్క్‌ల నిర్మాణానికి ఆసక్తి ఉన్నట్లు తెలిసింది. మిట్సుబిషీ నుంచి ముగ్గురు, సుమిటోమో నుంచి 810 మంది ఇండియన్ ప్రతినిధులు కమర్షియల్ ప్రాపర్టీస్ కోసం పనిచేస్తున్నారు. మిట్సుబిషి, సుమిటోమో కార్పొరేషన్స్ దీర్ఘకాలం పాటు భారీ అద్దెలు వచ్చే కమర్షియల్ ప్రాజెక్ట్‌లను కొనేందుకు ఆసక్తి ఉన్నట్లు సమాచారం. దక్షిణాది రాష్ట్రాల్లో కమర్షియల్ ప్రాపర్టీల నిర్మాణం కోసం మిట్సుబిషి కార్పొరేషన్ బెంగళూరుకు చెందిన ఎంబసీ గ్రూప్‌తో చర్చలు జరుపుతుంది. ఎంబసీతో పాటూ స్థానికంగా ఉన్న మరిన్ని కంపెనీలతో చర్చలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మిట్సుబిషీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ శ్రీరామ్ ప్రాపర్టీస్ చెన్నై ప్రాజెక్ట్‌లో పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే సుమిటోమి ఎంట్రీ.. గత సెప్టెంబర్‌తో మిట్సుబిషీ, సింగపూర్ ప్రభుత్వ కంపెనీ టీమాసీక్ హోల్డింగ్ అనుబంధ సంస్థ సుర్బానా జురోంగ్ సంయుక్తంగా కలిసి ఆగ్నేయాసియాలోని పలు ప్రాంతాల్లో అర్బన్ బిల్డింగ్ ప్రాజెక్ట్‌లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఐదేళ్లలో 2.5 బిలియన్ డాలర్లతో రైల్, రోడ్స్, హౌజింగ్, షాపింగ్ సెంటర్స్, ఆసుపత్రులు వంటి పలు అభివృద్ధి పనులకు ప్రణాళికలు చేసింది. ఇండియాతో పాటూ మయన్మార్, వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక దేశాల్లో ప్రాజెక్ట్‌లకు ప్రణాళికలు చేస్తుంది. సుమిటోమో రియల్టీ అండ్ డెవలప్మెంట్ కంపెనీ స్థానికంగా ఇండియన్ కంపెనీలతో కలిసి జాయింట్ వెంచర్‌గా కమర్షియల్ ప్రాపర్టీల నిర్మాణానికి ప్రణాళికలు చేస్తుంది. గతేడాది సుమిటోమో ఎన్సీఆర్లో మిక్స్డ్ యూజ్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధికి ఆటో పరికరాల తయారీ సంస్థ కృష్ణ గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. 90 శాతం పెట్టుబడులు విదేశీ కంపెనీలవే.. అమెరికాకు చెందిన బ్లాక్‌స్టోన్, కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ (సీపీపీఐబీ) కంపెనీలు భారత స్థిరాస్తి రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే బ్లాక్‌స్టోన్, బ్రూక్‌ఫీల్డ్ కంపెనీలు వాణిజ్య రియల్టీ రంగంలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి కూడా. 2018లో రియల్టీ రంగంలోకి సుమారు 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. 44 శాతం ఇన్వెస్ట్మెంట్స్ అమెరికా, కెనడా, సింగపూర్ వంటి విదేశీ కంపెనీల నుంచి వచ్చినవే. 90 శాతం విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ దేశంలోని ప్రముఖ మెట్రో నగరాలైన హైదరాబాద్, ముంబై, పుణె, బెంగళూరు వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చినవేనని కేపీఎంజీ తెలిపింది. రీట్స్, రెరా, జీఎస్టీలతో రెడ్ కార్పెట్.. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రియల్టీ రంగంలో లావాదేవీల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు కేంద్రం గత 34 ఏళ్లలో విప్లవాత్మక చట్టాలను తీసుకొచ్చింది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్స్), రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా), వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ల అమలుతో రియల్టీ రంగంలో పారదర్శకత నెలకొందని.. అందుకే విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. భారత వాణిజ్య స్థిరాస్తి రంగం దీర్ఘకాల పె ట్టుబడులు, రిటర్న్స్‌కు సరైన ప్రాంతమని, అందుకే దేశ, విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారని అనరాక్ క్యాపిటల్ ఎండీ శోభిత్ అగర్వాల్ తెలిపారు. ఇండియా జపాన్ ద్వైపాక్షిక వాణిజ్యం ఇలా... ► జపాన్‌కు చెందిన బహుళ జాతి కంపెనీ సుజుకీ మోటర్ కార్పొరేషన్ 1981లో తొలిసారిగా మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ ప్రారంభించింది. నాటి నుంచి 2016 అక్టోబర్ వరకు మన దేశంలో 1305 జపాన్ కంపెనీలు నమోదయ్యాయి. ప్రధానంగా ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిజినెస్ సర్వీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి, హెల్త్‌కేర్ రంగాల్లో ఉన్నాయి. ► 2013లో 16.31 బిలియన్ డాలర్లుగా ఉన్న ఇండియా జపాన్ ద్వైపాక్షిక వాణిజ్యం 2019–20 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ► దేశీయ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో జపాన్ వాటా 7 శాతం. ► 2000 నుంచి 2018 మధ్య కాలంలో జపాన్ నుంచి 27.28 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష నిధులు (ఎఫ్‌డీఐ) వచ్చాయి. ► 2017–18లో జపాన్ నుంచి ఇండియాకు 10.97 బిలియన్ డాలర్ల దిగుమతులు, మన దేశం నుంచి జపాన్‌కు 4.73 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. ► 2007–08లో 6.3 బిలియన్ డాలర్లుగా ఉన్న దిగుమతులు.. 2017–18 నాటికి 10.97 బి.డాలర్లకు పెరిగాయి. అంటే 11 ఏళ్లలో దిగు మతుల్లో 73% వృద్ధి నమోదైంది. జపాన్ నుం చి ప్రధానంగా ఎలక్ట్రికల్ మిషనరీ, రవాణా పరికరాలు, కెమికల్స్, అనుబంధ ఉత్పత్తులు, ఇనుము, ఉక్కు దిగుమతి అవుతుంటాయి. -
మోదీ, మెర్కెల్‌తో వాణిజ్య దిగ్గజాలు
బెంగళూరు: ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలు మరిం తగా మెరుగుపర్చుకునే దిశగా భారత పర్యటనలో ఉన్న జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఆమె బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విందు నిర్వహించారు. పలువురు భారతీయ వ్యాపార దిగ్గజాలు కూడా ఇందులో పాల్గొన్నారు. విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా, టీసీఎస్ సీఈవో ఎన్ చంద్రశేఖరన్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్, ఎల్అండ్టీ చీఫ్ ఏఎం నాయక్ తదితరులు వీరిలో ఉన్నారు. అందుబాటులో ఉన్న అపార వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడంపైనా, పరస్పరం సహకరించుకోవడంపై ఇరు వర్గాలు ఆశావహంగా ఉన్నట్లు టీసీఎస్ సీఈవో ఎన్ చంద్రశేఖరన్ ఈ సందర్భంగా చెప్పారు. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల్లో భారత్ కాంతికిరణంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. భారత్ చాలా కీలకమైన మార్కెట్ అని, పెట్టుబడులకు అనువైన పరిస్థితుల కల్పన కోసం పలు చర్యలు తీసుకుంటోందని జర్మనీ గుర్తిస్తోందని ఐసీఐసీఐ సీఈవో చందా కొచర్ తెలిపారు. అంతకు ముందు భారత ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ నిర్వహించిన కార్యక్రమంలో మోదీ, మెర్కెల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అయిదు ఒప్పందాలు కుదిరాయి.