
ద్వైపాక్షిక వాణిజ్య సమతూకానికి ప్రాధాన్యం
వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్
న్యూఢిల్లీ: ఎగుమతులు పెంచుకోవడం ద్వారా ఇండియా జపాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంలో సమతూకాన్ని తీసుకురానున్నట్లు వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) ఏప్రిల్–జనవరిలో జపాన్‌కు దేశీ ఎగుమతులు 21 శాతంపైగా ఎగసి 5.1 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే సమయంలో దిగుమతుల విలువ 9.1 శాతం పెరిగి 15.92 బిలియన్ డాలర్లను తాకింది. వెరసి 10.82 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు నమోదైంది.
గతేడాది(2023–24)లో జపాన్‌కు భారత్ ఎగుమతులు 5.15 బిలియన్ డాలర్లుకాగా.. దిగుమతులు 17.7 బిలియన్ డాలర్లు. వాణిజ్య లోటు 12.55 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య సమతూకానికి చర్యలు చేపట్టినట్లు గోయల్ తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా ఎగుమతుల పెంపుపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. తద్వారా పరస్పర లబ్దికి వీలుంటుందని ఇండియా–జపాన్ ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడుల(ఎకానమీ అండ్ ఇన్వెస్ట్‌మెంట్) సదస్సులో గోయల్ తెలియజేశారు.
ఈ సందర్భంగా గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధనం, హైటెక్ సెమీకండక్టర్ల తయారీ, ఎల్రక్టానిక్స్ గూడ్స్, ఏఐ తదితర విభాగాలలో మరింత సహకారానికి జపనీస్ సంస్థలను ఆహ్వానించారు. సమీకృత స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(సీఈపీఏ)పై రెండు దేశాలు 2011లో సంతకాలు చేశాయి. 1,400కుపైగా జపనీస్ కంపెనీలు భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. పలు జపనీస్ కంపెనీలతో 8 రాష్ట్రాలలో 11 పారిశ్రామిక టౌన్‌షిప్‌లు విస్తరించాయి. ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ముంబై, అహ్మదాబాద్ హైస్పీ డ్ రైల్ సహా ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై మెట్రో వ్యవస్థలు దేశీ అభివృద్ధిలో జపనీస్ కంపెనీల భాగస్వామ్యాన్ని ప్రతిఫలిస్తున్నట్లు గోయల్ ప్రస్తావించారు. సమీప భవిష్యత్‌లో ముంబై, అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ ట్రయిన్ సరీ్వసులు ప్రారంభంకాగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment