
2026లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అంచనా
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది(2026) ప్రపంచ ఆర్థిక వ్యవస్థ డీలా పడనున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) తాజాగా అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీన వృద్ధి, వ్యవస్థాగత సవాళ్ల దశలోకి ప్రవేశించినట్లు ‘చీఫ్ ఎకానమిస్టుల’ ఔట్‌లుక్ నివేదికలో పేర్కొంది. అయితే భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్లు తెలియజేసింది.
2025లో ఎకానమీ 6.5 శాతం పురోగతి సాధించనున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) అంచనాలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. కాగా.. దేశ ఎగుమతులపై యూఎస్ 50 శాతం అదనపు టారిఫ్‌ల విధింపు కారణంగా భారత్ తయారీ లక్ష్యాలకు విఘాతం కలగనున్నట్లు నివేదిక అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో మొత్తం దక్షిణాసియా ప్రాంత ఔట్‌లుక్‌పై ప్రభావం పడనున్నట్లు తెలియజేసింది.
72 శాతం తీరిలా
డబ్ల్యూఈఎఫ్ సర్వే ప్రకారం 72 శాతం ప్రధాన ఆర్థికవేత్త(చీఫ్ ఎకనమిస్ట్)లు 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనపడనున్నట్లు అంచనా వేయగా.. వాణిజ్య అవరోధాలు పెరగడం, విధానాలలో అనిశి్చతులు, సాంకేతికతలలో వేగవంత మార్పులు ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. అయితే వర్ధమాన మార్కెట్లు ప్రధాన వృద్ధి చోదకాలుగా నిలవనున్నట్లు తెలియజేసింది.
ఈ దిశలో మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా(ఎంఈఎన్‌ఏ), దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియా, పసిఫిక్ వెలుగు రేఖల్లా కనిపిస్తున్నట్లు పేర్కొంది. సర్వేలో పాల్గొన్న ప్రతీ ముగ్గురు ప్రధాన ఆర్థికవేత్తలలో ఒకరు ఈ ప్రాంతాలు అత్యంత పటిష్ట వృద్ధిని సాధించనున్నట్లు అభిప్రాయపడినట్లు వెల్లడించింది. చైనా ఔట్‌లుక్‌పై మిశ్రమ స్పందన కనిపించగా.. 56 శాతంమంది చీఫ్ ఎకనమిస్ట్‌లు అంతంతమాత్ర వృద్ధిని అంచనా వేసినట్లు తెలియజేసింది. ధరల(ద్రవ్యోల్బణ) తగ్గుదల ఒత్తిళ్లు మరింత పెరగనున్నట్లు అభిప్రాయపడ్డారని వివరించింది.