సమిష్టి కృషి అవసరమన్న వాణిజ్యశాఖ మంత్రి గోయల్
ఐఐఎఫ్‌టీ వార్షిక స్నాతకోత్సవ ప్రసంగం
న్యూఢిల్లీ: భారత్ 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ‘‘భారీ’’ ఎగుమతుల లక్ష్యాన్ని సాధించడానికి సమిష్టి కృషి అవసరమని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. ఐఐఎఫ్‌టీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) వార్షిక స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ప్రసంగిస్తూ భారత్ వచ్చే ఆరేళ్ల కాలంలో ఎగుమతుల లక్ష్యాన్ని సాధించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
‘‘2030 నాటికి 2 ట్రిలియన్ల డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని సాధించడానికి మనమంతా భాగస్వాములు అవుదాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) భారత్ ఎగుమతుల విలువ 800 బిలియన్ డాలర్లను అధిగమిస్తుంది. 2 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించడానికి మనం నిజంగా సమిష్టిగా ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. ఇది యాదృచ్చికంగా జరగదు. నిర్దిష్ట చర్యల ద్వారానే ఇది సాధ్యమవుతుంది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని సాధించగలమని నేను విశ్వసిస్తున్నాను’’ అని గోయల్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
భారత్ మార్చితో ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో 778 బిలియన్ డాలర్ల వస్తు, సేవల ఎగుమతులు జరిగింది. ఆయా అంశాలపై ఇంకా గోయల్ ఏమన్నారంటే.. ఇతర దేశాలలో భారత్ ఉత్పత్తులు ఎదుర్కొంటున్న నాన్–టారిఫ్ అడ్డంకులను అధ్యయనం చేయడానికి విద్యార్థులు, అధ్యాపకులు సహకరించాలి. తద్వారా అధికారులు వాటిని పరిష్కరించడానికి వీలవుతుంది. త్వరలో దుబాయ్‌లో ఏర్పాటు చేయనున్న ఐఐఎఫ్‌టీ కొత్త క్యాంపస్ ఎగుమతుల పురోగతికి మరింత చొరవ చూపుతుంది.
స్నాతకోత్సవంలో ఎవరేమన్నారంటే...
చర్చల కోసం ఒక కేంద్రాన్ని కూడా ఐఐఎఫ్‌టీ త్వరలో ఏర్పాటు చేయనుంది. ఈ తరహా చొరవ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, నైపుణ్యం వంటి అంశాలకు సంబంధించి ముఖ్యమైనది. ఈ కేంద్రం విద్యార్థులకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై చర్చల్లో అనుసరించాల్సిన నైపుణ్యాలను అందించడానికి దోహదపడుతుంది. భారత్ ఎగుమతుల పురోగతి విషయంలో కేస్ స్టడీస్‌ను సిద్ధం చేయడానికి కూడా ఈ కేంద్రం దోహదపడుతుంది.
– సునీల్ భరత్వాల్, వాణిజ్య కార్యదర్శి
పెరిగిన ర్యాంకింగ్
ఎన్‌ఐఆర్‌ఎఫ్ (నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్) ర్యాంకింగ్ 2024లో మేనేజ్‌మెంట్ విభాగంలో ఐఐఎఫ్‌టీ పన్నెండు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు చేరుకుంది. రిక్రూట్‌మెంట్ కోసం అనేక పెద్ద సంస్థలు క్యాంపస్‌ను సందర్శిస్తున్నాయి.
– రాకేష్ మోహన్ జోషి, ఐఐఎఫ్‌టి వైస్ ఛాన్సలర్
Comments
Please login to add a commentAdd a comment