Commerce and Industry Minister
-
ఆర్గానిక్ ఎగుమతులకు చక్కని అవకాశాలు
న్యూఢిల్లీ: సేంద్రీయ ఉత్పత్తుల (రసాయనిక ఎరువులు, పురుగు మందులు వినియోగించని) ఎగుమతులకు చక్కని అవకాశాలున్నాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. వచ్చే మూడేళ్లలో ఆర్గానిక్ ఉత్పత్తుల ఎగుమతులు రూ.20,000 కోట్లకు చేరుకోవచ్చన్నారు. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్పీఓపీ) ఎనిమిదో ఎడిషన్‌ను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడారు. సేంద్రీయ ఉత్పత్తులకు సంబంధించి ప్రమాణాలు, పారదర్శకత, నిబంధనలపై ఇందులో స్పష్టత ఇచ్చారు. ‘‘ప్రస్తుతానికి ఆర్గానిక్ ఉత్పత్తుల ఎగుమతులు రూ.5,000–6,000 కోట్లుగా ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో రూ.20,000 కోట్లను సులభంగా చేరుకుంటాం. ప్రస్తుత స్థాయితో పోల్చితే 3–3.5 రెట్లు’’అని తెలిపారు. అంతర్జాతీయంగా రూ.లక్ష కోట్ల మేర సేంద్రీయ ఉత్పత్తులకు డిమాండ్ ఉందని, రానున్న సంవత్సరాల్లో ఇది రూ.10 లక్షల కోట్లకు చేరుకుంటుందన్నారు. ఇది భారత్‌కు చక్కని అవకాశమని, దీన్ని జారవిడుచుకోరాదన్నారు. సేంద్రీయ సాగును ఎక్కువ మంది రైతులు చేపట్టిన దేశాల్లో భారత్ కూడా ఉన్నట్టు మంత్రి తెలిపారు. ఈ రంగం వృద్ధికి అవసరమైన పరిష్కారాలతో స్టార్టప్‌లు ముందుకు రావాలని పిలపునిచ్చారు. భారత సేంద్రీయ ఎగుమతుల రంగాన్ని బలోపేతం చేయడం, 2030 నాటికి 2 బిలియన్ డాలర్ల విలువైన ఆహారోత్పత్తుల ఎగుమతులను చేరుకునే లక్ష్యాలతో ఎనిమిదో ఎడిషన్ ఎన్పీవోపీని విడుదల చేయడం గమనార్హం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సేంద్రీయ ఉత్పత్తులకు విశ్వసనీయత పెంచడం, ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రమాణాలను పెంచడంలోనూ ఎన్‌పీవోపీ కీలక పాత్ర పోషిస్తుంటుంది. -
చర్చల దశలోనే టెస్లా, స్టార్‌లింక్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత్‌లో అమెరికన్ టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా, స్టార్‌లింక్ పెట్టుబడులకు సంబంధించి ఇంకా ఎటువంటి చర్చ జరగలేదని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండు అంశాలూ వేర్వేరు మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్నందున, ఏమి జరుగుతుందో తనకు వ్యక్తిగతంగా తెలియదని అన్నారు. ‘‘నాకు తెలిసినంత వరకు మేము ఎటువంటి చర్చలు జరపలేదు‘అని టెస్లా– స్టార్‌లింక్ పెట్టుబడుల అవకాశాలపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘ ఈ రెండు విభాగాలూ వేర్వేరు మంత్రిత్వ శాఖలు నిర్వహణలో ఉన్నాయి. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆటోమొబైల్స్‌ను చూస్తుంది. స్టార్‌లింక్ అంశాలను అంతరిక్ష శాఖ నిర్వహిస్తుంది. కాబట్టి, ఏమి జరుగుతుందో నాకు వ్యక్తిగత పరిజ్ఞానం లేదు’’ అని వాణిజ్యమంత్రి స్పష్టం చేశారు. నేపథ్యం ఇదీ... ఈ ఏడాది ఏప్రిల్‌లో మస్క్ చివరి క్షణంలో తన భారత్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ‘టెస్లాలో కీలక బాధ్యతలు నిర్వహించాల్సిన తక్షణ అవసరం ఉందంటూ పర్యటనకు కారణంగా చెప్పారు. నిజానికి ఈ సమావేశంలో ఆయన ప్రధాని నరేంద్రమెదీతో సమావేశం కావాల్సి ఉంది. భారత్‌లో టెస్లా తయారీ యూనిట్‌ను స్థాపించడానికి ప్రణాళికలు, బిలియన్ల డాలర్ల పెట్టుబడులపై చర్చలు, భారతదేశంలో టెస్లా ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడంపై విధాన ప్రకటన వంటి అంశాలు మస్క్ పర్యటనలో భాగమని అప్పట్లో వార్తలు వచ్చాయి. కేవలం ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే కాకుండా, ఆయన తన శాటిలైట్ ఇంటర్నెట్ వ్యాపారం స్టార్‌లింక్ కోసం భారతీయ మార్కెట్‌పై కూడా దృష్టి సారించినట్లు సమాచారం. స్టార్‌లింక్ భారతదేశంలో సేవలకు లైసెన్స్ పొందడానికి అన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుందని కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ నెల ప్రారంభంలో తెలిపారు. శాటిలైట్ ఇంటర్నెట్ సరీ్వస్ ప్రొవైడర్ సేవల ప్రారంభానికి తగిన అన్ని అనుమతులనూ పొందే ప్రక్రియలో ఉందని, వారు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత లైసెన్స్ పొందుతారని మంత్రి చెప్పారు. అంతేకాకుండా ఈ ఏడాది మార్చిలో విద్యుత్–వాహన విధానాన్ని ప్రభుత్వం ఆమోదించింది. కనీసం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో భారతదేశంలో తయారీ యూనిట్లను స్థాపించే కంపెనీలకు దిగుమతి సుంకం రాయితీలను అందించాలన్నది ఈ విధానంలో కీలక అంశం. టెస్లా వంటి ప్రధాన ప్రపంచ సంస్థలను ఆకర్షించే లక్ష్యంతో ఈ చర్య తీసుకోవడం జరిగింది. ఈవీ ప్యాసింజర్ కార్ల తయారీ విభాగాలను ఏర్పాటు చేసే కంపెనీలు 35,000 అమెరికా డాలర్లు, అంతకంటే ఎక్కువ ధర కలిగిన వాహనాలపై 15 శాతం తక్కువ కస్టమ్స్/ దిగుమతి సుంకంతో పరిమిత సంఖ్యలో కార్లను దిగుమతి చేసుకోవడానికీ పాలసీ అనుమతించింది. ప్రభుత్వం ఆమోద పత్రం జారీ చేసిన తేదీ నుండి ఐదు సంవత్సరాల వ్యవధిలో ఉంటాయని పాలసీ వివరించింది. ట్రంప్ ’భారత్ స్నేహితుడే’ సంబంధాల్లో ఎలాంటి సమస్య లేదు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు మిత్రుడని, భారత్–అమెరికా మధ్య స్నేహం చిగురించి మరింతగా వృద్ధి చెందుతుందని గోయల్ అన్నారు. భారత్–అమెరికా భాగస్వామ్యంలో ఎలాంటి సమస్యలను తాను ఊహించడం లేదని పేర్కొన్న ఆయన, వాషింగ్టన్లో కొత్త పరిపాలనలో అమెరికాతో భారత్ సంబంధాలు మరింత బలపడతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 10 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో వివిధ కార్యక్రమాలు సంస్కరణలపై మీడియాతో మాట్లాడుతూ, టెస్లా– స్టార్‌లింక్ పెట్టుబడి ప్రణాళికలు, ల్యాప్‌టాప్ దిగుమతి విధానం, యూరోపియన్ యూనియన్ ‘ఏకపక్ష‘ గ్రీన్ ఎకానమీ నిబంధనల వంటి పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, భారత్‌సహా అన్ని ప్రధాన దేశాలలో విదేశీ ఉత్పత్తులపై అత్యధిక సుంకాలను విధిస్తున్నాయని విమర్శించారు. అధికారంలోకి వస్తే, పరస్పర పన్నును ప్రవేశపెడతానని తెలిపారు. కాగా, నేడు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడైన ప్రధాని మోదీ భారతదేశ అంతర్జాతీయ సంబంధాలను గతంలో కంటే మెరుగ్గా నిర్వహిస్తున్నట్లు గోయల్ ఈ సందర్బంగా అన్నారు. మోదీ నేతృత్వంలో అమెరికాతో భారతదేశ సంబంధాలు ప్రతి సంవత్సరం మెరుగవుతున్నాయని అన్నారు. ల్యాప్‌టాప్ దిగుమతి విధానంపై కొత్త మార్గదర్శకాలు భారత్ ల్యాప్‌టాప్ దిగుమతి విధానంపై కొత్త మార్గదర్శకాలు ఎల్రక్టానిక్స్ –ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో ఇంకా చర్చల దశలో ఉన్నాయని వాణిజ్య మంత్రి తెలిపారు. 300 చట్టాలు డీక్రిమినలైజ్.. 300కుపైగా చట్టాలను డీక్రిమనలైజ్ (నేరపూరిత చర్యల జాబితా నుంచి బయటకు) చేసే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు. వినియోగించుకోకపోతే.. సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ మూత సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్‌ను ఉపయోగించాలని, లేకుంటే ఈ పథకాన్ని మూసివేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి పియుష్ గోయల్ మరో కార్యక్రమంలో పరిశ్రమకు స్పష్టం చేశారు.నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (ఎన్ఎస్డబ్ల్యూఎస్) అనేది వ్యాపార అవసరాలకు అనుగుణంగా దరఖాస్తులు, ఆమోదాలకు పరిశ్రమ వినియోగించుకునే విధంగా అభివృద్ధి చేసిన ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్. 32 కేంద్ర శాఖలు, 29 రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతుల కోసం తగిన అప్లికేషన్ సేవలను అందిస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై డీపీఐఐటీ–సీఐఐ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ‘‘ఎన్ఎస్డబ్ల్యూఎస్ అవసరమా? లేదా అనే అంశంపై ఎంపిక ఇప్పుడు మీ (పరిశ్రమ) వద్ద ఉంది. మీకు దానిపై ఆసక్తి లేదని మీరు భావిస్తే... సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్‌ను మూసివేయడానికి వెనకాడబోము. కేంద్రం దాని కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తోంది’’ అని అన్నారు. ఎన్ఎస్డబ్ల్యూఎస్ పరిపూర్ణంగా ఉండకపోవచ్చని, అయితే దానిని మెరుగుపరచడానికి పరిశ్రమ నుండి వచ్చే సూచనలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మంత్రి తెలిపారు. జన్ విశ్వాస్ 2.0 బిల్లు గురించి మాట్లాడుతూ, పరిశ్రమకు రెట్రాస్పెక్టివ్ ప్రయోజనాలను (గతానికి వర్తించే విధంగా) అందించడానికి ప్రభుత్వం ప్రయతి్నస్తుందని చెప్పారు. భారత్‌లో వ్యాపారాలకు సంబంధించి ఎప్పటి కప్పుడు తగిన సూచనలు, సలహాలు చేయడానికి, ఆయా విభాగాల్లో మరింత మెరుగుదలకు సూచనలు, సలహాలు పొందానికి సీఐఐ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ)– రెగ్యులేటరీ అఫైర్స్ పోర్టల్‌ను మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు. -
ఆరేళ్లలో ఎగుమతుల లక్ష్యం 2 ట్రిలియన్ డాలర్లు!
న్యూఢిల్లీ: భారత్ 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ‘‘భారీ’’ ఎగుమతుల లక్ష్యాన్ని సాధించడానికి సమిష్టి కృషి అవసరమని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. ఐఐఎఫ్‌టీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) వార్షిక స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ప్రసంగిస్తూ భారత్ వచ్చే ఆరేళ్ల కాలంలో ఎగుమతుల లక్ష్యాన్ని సాధించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘‘2030 నాటికి 2 ట్రిలియన్ల డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని సాధించడానికి మనమంతా భాగస్వాములు అవుదాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) భారత్ ఎగుమతుల విలువ 800 బిలియన్ డాలర్లను అధిగమిస్తుంది. 2 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించడానికి మనం నిజంగా సమిష్టిగా ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. ఇది యాదృచ్చికంగా జరగదు. నిర్దిష్ట చర్యల ద్వారానే ఇది సాధ్యమవుతుంది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని సాధించగలమని నేను విశ్వసిస్తున్నాను’’ అని గోయల్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.భారత్ మార్చితో ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో 778 బిలియన్ డాలర్ల వస్తు, సేవల ఎగుమతులు జరిగింది. ఆయా అంశాలపై ఇంకా గోయల్ ఏమన్నారంటే.. ఇతర దేశాలలో భారత్ ఉత్పత్తులు ఎదుర్కొంటున్న నాన్–టారిఫ్ అడ్డంకులను అధ్యయనం చేయడానికి విద్యార్థులు, అధ్యాపకులు సహకరించాలి. తద్వారా అధికారులు వాటిని పరిష్కరించడానికి వీలవుతుంది. త్వరలో దుబాయ్‌లో ఏర్పాటు చేయనున్న ఐఐఎఫ్‌టీ కొత్త క్యాంపస్ ఎగుమతుల పురోగతికి మరింత చొరవ చూపుతుంది.స్నాతకోత్సవంలో ఎవరేమన్నారంటే... చర్చల కోసం ఒక కేంద్రాన్ని కూడా ఐఐఎఫ్‌టీ త్వరలో ఏర్పాటు చేయనుంది. ఈ తరహా చొరవ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, నైపుణ్యం వంటి అంశాలకు సంబంధించి ముఖ్యమైనది. ఈ కేంద్రం విద్యార్థులకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై చర్చల్లో అనుసరించాల్సిన నైపుణ్యాలను అందించడానికి దోహదపడుతుంది. భారత్ ఎగుమతుల పురోగతి విషయంలో కేస్ స్టడీస్‌ను సిద్ధం చేయడానికి కూడా ఈ కేంద్రం దోహదపడుతుంది. – సునీల్ భరత్వాల్, వాణిజ్య కార్యదర్శిపెరిగిన ర్యాంకింగ్ ఎన్ఐఆర్ఎఫ్ (నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్) ర్యాంకింగ్ 2024లో మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎఫ్‌టీ పన్నెండు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు చేరుకుంది. రిక్రూట్మెంట్ కోసం అనేక పెద్ద సంస్థలు క్యాంపస్‌ను సందర్శిస్తున్నాయి. – రాకేష్ మోహన్ జోషి, ఐఐఎఫ్టి వైస్ ఛాన్సలర్ -
స్టార్టప్‌ల కోసం ‘భాస్కర్’ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: అంకుర సంస్థలు, ఇన్వెస్టర్లు తదితర వర్గాలకు కేంద్ర హబ్‌గా ఉపయోగపడే భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ (BHASKAR) ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. స్టార్టప్‌లు, మదుపరులు, సర్వీస్ ప్రొవైడర్లు, ప్రభుత్వ శాఖలు పరస్పరం సహకరించుకోవడానికి, ఆలోచనలు పంచుకోవడానికి ఈ పోర్టల్ ఒక వేదికగా ఉపయోగపడగలదని మంత్రి చెప్పారు. ఇందులో రిజిస్టర్ చేసుకునేవారికి ప్రత్యేకంగా భాస్కర్ (BHASKAR) ఐడీ కేటాయిస్తారు. వనరులు, భాగస్వాములు, అవకాశాల వివరాలను యూజర్లు సులువుగా పొందేందుకు, వేగవంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడేలా ఇందులో సెర్చ్ ఫీచరును శక్తిమంతంగా తీర్చిదిద్దారు. స్టార్టప్ ఇండియా కింద చేపట్టే అన్ని కార్యక్రమాలు, సంస్థలను ఒకే గొడుగు కిందికి తెచ్చే విధంగా కంపెనీల చట్టంలోని సెక్షన్ 8 కింద లాభాపేక్షరహిత కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. ఇన్వెస్ట్ ఇండియా తరహాలో పరిశ్రమ వర్గాల పర్యవేక్షణలోనే ఉండే ఈ సంస్థలో నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా భాగమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అటు, భాస్కర్ పోర్టల్‌ను మరింత పటిష్టంగా మార్చేందుకు పరిశ్రమవర్గాలన్నీ ముందుకు రావాలని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో 1,46,000 పైచిలుకు ప్రభుత్వ గుర్తింపు పొందిన అంకురాలు ఉండగా రాబోయే రోజుల్లో వీటి సంఖ్య 50 లక్షలకు పెంచే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది జనవరి 16 నాటికి దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక స్టార్టప్ ఉంటుందని భాటియా చెప్పారు. -
రూపాయిలో వాణిజ్యానికి పలు దేశాల ఆసక్తి
న్యూఢిల్లీ: పలు వర్ధమాన దేశాలు, సంపన్న దేశాలు భారత్‌తో రూపాయి మారకంలో వాణిజ్యం చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ విధానంలో లావాదేవీల వ్యయాలు తగ్గే అవకాశాలు ఉండటమే దీనికి కారణమని పేర్కొన్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌తో పాటు పలు గల్ఫ్ దేశాలు ఈ జాబితాలో ఉన్నట్లు ఆయన చెప్పారు. ‘ఈ విధానాన్ని సత్వరం ప్రారంభించేలా బంగ్లాదేశ్, శ్రీలంక ఇప్పటికే మనతో చర్చలు జరుపుతున్నాయి. పలు గల్ఫ్ దేశాలు కూడా దీనిపై ఆసక్తి చూపుతున్నాయి. దీని వల్ల ఒనగూరే ప్రయోజనాలు తెలిసే కొద్దీ మరిన్ని దేశాలు కూడా ఇందులో చేరొచ్చు. సింగపూర్ ఇప్పటికే కొంత మేర లావాదేవీలు జరుపుతోంది‘ అని మంత్రి వివరించారు. ఈ పరిణామం భారత అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారత్ ఇప్పటికే నేపాల్, భూటాన్ వంటి పొరుగు దేశాలతో రూపాయి మారకంలో వాణిజ్య లావాదేవీలు నిర్వహిస్తోంది. యూఏఈ నుంచి కొనుగోలు చేసిన క్రూడాయిల్‌కి తొలిసారిగా రూపాయల్లో చెల్లింపులు జరిపింది. -
పోటీతత్వంతోనే అంతర్జాతీయంగా రాణింపు
న్యూఢిల్లీ: ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం కింద ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఆరంభ మద్దతుగానే పరిశ్రమ చూడాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రానున్న రోజుల్లో పరిశ్రమ మరింత వృద్ధి చెందాలంటే పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. పీఎల్ఐ పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు, దీని కింద ప్రయోజనం పొందిన సంస్థలు నిర్మాణాత్మక విమర్శలు, అభిప్రాయాలను పంచుకోవాలని కోరారు. భారత్‌ను తయారీ కేంద్రంగా మలచాలన్నది ప్రభుత్వ యోచన అని, ఈ విషయంలో అసలైన సుదీర్ఘ ప్రయాణం ముందున్నట్టు చెప్పారు. పీఎల్ఐ పథకంపై నిర్వహించిన కార్యక్రమంలో వందలాది భాగస్వాములు, అధికారులు పాల్గొన్నారు. ‘‘ప్రభుత్వ సబ్సిడీలపై ఆధారపడే విధంగా మిమ్మల్ని మార్చాలని కోరుకోవడం లేదు. మీ కృషిని ఆరంభించేందుకు ప్రోత్సాహంగానే (కిక్‌స్టార్ట్) దీన్ని చూడాలి. కానీ, అంతిమంగా పోటీయే నిలుస్తుంది. ఒకరితో మరొకరు, ప్రపంచంతోనూ పోటీ పడి రాణించాల్సి ఉంటుంది’’అని గోయల్ చెప్పారు. సౌకర్యమని చెప్పి దేశీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా, పరిశ్రమ క్రమంగా అంతర్జాతీయ మార్కెట్లపై దృష్టి సారించాలని సూచించారు. భారత్‌ను తయారీ శక్తిగా మలిచేందుకు ప్రభుత్వం, లబ్దిదారులు (కంపెనీలు) మధ్య సహకారం అవసరమని, ఒకరికొకరి మద్దతు కూడా కీలకమన్నారు. విలువ జోడించాలి.. భారత తయారీలో స్థూల విలువ జోడింపు (జీవీఏ/విడిభాగాలు కూడా ఇక్కడే తయారైనవి) కేవలం 17.4 శాతమే ఉందని, అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు, మరింత మంది ఉపాధి కల్పనకు ఇది చాలదని డీపీఐఐటీ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ అన్నారు. పరిశ్రమ మరింత విలువను జోడించడంపై దృష్టి సారించాలని సూచించారు. మొబైల్, వైట్గూడ్స్లో దేశీయంగా ఉత్పత్తుల తయారీకి విలువ తోడవుతున్నట్టు తెలిపారు. పీఎల్ఐ పథకం విషయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయని, వీటి పరిష్కారానికి ప్రభుత్వం పనిచేస్తున్నట్టు చెప్పారు. 10 ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు, 14పీఎల్ఐ పథకాలకు సంబంధించి రంగాల వారీ ముఖ్య సంస్థలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. -
స్టార్టప్ వ్యవస్థ బలోపేతానికి కృషి
గురుగ్రామ్: అంకుర సంస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. స్టార్టప్‌ల వ్యవస్థను ప్రోత్సహించేందుకే తప్ప నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయతి్నంచబోదని ఆయన స్పష్టం చేశారు. ఆ వ్యవస్థలో భాగమైన వర్గాలే స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. స్టార్టప్20 సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. అంకుర సంస్థల పురోగతికి అవరోధాలు కలి్పంచాలనేది ప్రభుత్వల ఉద్దేశం కాదనే స్పష్టమైన సందేశం స్టార్టప్‌లకు చేరాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. భారత్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని అంకుర సంస్థలను ఆహ్వానించారు. 2030 నాటికి అంకుర సంస్థల వ్యవస్థలోకి జీ20 దేశాలన్నీ కలిసి ఏటా 1 లక్ష కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టేలా చూసేందుకు స్టార్టప్20 గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలు సాకారమైతే స్టార్టప్‌లకు మరిన్ని ప్రయోజనాలు చేకూరగలవని గోయల్ చెప్పారు. మంచి స్టార్టప్‌లకు నిధుల కొరత లేదు: అమితాబ్ కాంత్ సరైన అంకుర సంస్థలకు పెట్టుబడుల కొరతేమీ లేదని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు. పటిష్టమైన వ్యాపార విధానాలున్న మంచి స్టార్టప్‌లకు నిధుల లభ్యత బాగానే ఉందని ఆయన చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు స్టార్టప్ వ్యవస్థ చురుగ్గా పని చేస్తోందని స్టార్టప్20 శిఖర్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భారత్‌లో 1,00,000 పైచిలుకు స్టార్టప్‌లు, 108 యూనికార్న్‌లు (బిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే అంకురాలు) ఉన్నాయని అమితాబ్ కాంత్ తెలిపారు. -
ఎగుమతులు @ 447 బిలియన్ డాలర్లు
రోమ్: భారత్ వస్తు ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 2021–22తో పోల్చితే 6 శాతం పెరిగి 447 బిలియన్ డాలర్లకు చేరినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇదే సమయంలో దేశ దిగుమతులు 16.5 శాతం ఎగసి 714 బిలియన్ డాలర్లకు చేరినట్లు వెల్లడించారు. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు 267 బిలియన్ డాలర్లకు చేరింది. పెట్రోలియం, ఫార్మా, రసాయనాలు, సముద్ర ఉత్పత్తుల రంగాల నుంచి ఎగుమతుల్లో మంచి వృద్ధి నమోదయినట్లు ఆయన వెల్లడించారు. ఫ్రాన్స్, ఇటలీల్లో ఏప్రిల్ 11 నుంచి 13వ తేదీ వరకూ పర్యటించిన గోయల్ ఈ సందర్భంగా పలు కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. ఆయా దేశాలతో వాణిజ్య, పెట్టుబడుల సంబంధాలు మరింత పురోగమించడం లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులకు తెలిపిన అంశాల్లో ముఖ్యమైనవి... ► వస్తు, సేవలు కలిపి ఎగుమతులు కొత్త రికార్డులో 14 శాతం వృద్ధి నమోదయ్యింది. విలువలో 770 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఒక్క సేవల ఎగుమతులు చూస్తే, 27.16 శాతం పెరిగి 323 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక విభాగాల దిగుమతులు 892 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ భారత్ ఎకానమీ క్రియాశీలత, పురోగమనానికి సూచికలుగా ఎగుమతి–దిగుమతి గణాంకాలు ఉన్నాయి. ► అన్ని దేశాలతో పటిష్ట వాణిజ్య సంబంధాలు నెరపడానికి భారత్ కృషి సల్పుతోంది. ► ఇన్వెస్టర్ల పెట్టుబడులకు భారత్ అత్యంత ఆకర్షణ ప్రదేశంగా ఉంది. ఎకానమీ పరంగా చూస్తే, భారత్ ఎంతో పటిష్టంగా ఉంది. వస్తు, సేవల పన్ను వసూళ్లు భారీగా నమోదవుతున్నాయి. ఎగుమతులు బాగున్నాయి. ద్రవ్యోల్బణం దిగివస్తోంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు పటిష్టంగా 600 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. విదేశాల నుంచి భారత్‌కు పంపుతున్న రెమిటెన్సులు 100 బిలియన్ డాలర్లుపైగానే ఉంటున్నాయి. పెట్టుబడుల ప్రవాహం బాగుంది. ► ఎగుమతుల భారీ వృద్ధి లక్ష్యంగా సమర్థవంతమైన విదేశీ వాణిజ్య పాలసీ (ఎఫ్టీపీ)ని భారత్ ఇప్పటికే ఆవిష్కరించింది. 2030 నాటికి దేశ ఎగుమతులను ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు చేర్చడంతో పాటు రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చేయాలని పాలసీలో నిర్దేశించడం జరిగింది. -
నిధుల సమీకరణకు ‘ద్వంద్వ లిస్టింగ్’ మార్గం
ముంబై: చిన్న వ్యాపార సంస్థలు (ఎస్ఎంఈలు) తమ మూలధన సమీకరణ పక్రియను విస్తృతం చేయడానికి ‘‘ద్వంద్వ లిస్టింగ్’’ను పరిగణనలోకి తీసుకోవాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ విజ్ఞప్తి చేశారు. బొంబాయి స్టాక్ ఎక్సే్చంజ్ (బీఎస్ఈ) ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌తోపాటు గాంధీనగర్ గిఫ్ట్సిటీలో ఉన్న ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లో లిస్ట్ అయ్యే అవకాశాలు, ప్రయోజనాలను పరిశీలించాలని కోరారు. బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై 400 కంపెనీల లిస్టింగ్ అయిన సందర్భాన్ని పురష్కరించుకుని జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ సూచన చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► నిధుల సమీకరణకు సంబంధించి లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో కొన్ని గిఫ్ట్ సిటీ ప్లాట్‌ఫామ్ లేదా ముంబై బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ లేదా రెండింటిలో ద్వంద్వ లిస్టింగ్ జరగాలని మేము కోరుకుంటున్నాం. ఈ దిశలో మార్గాలను అన్వేషించడానికి కేంద్ర ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఇవ్వడానికి తగిన చర్యలపై కసరత్తు జరుగుతోంది. ఉంటుందన్నది పరిశీలించాలి. ► ద్వంద్వ లిస్టింగ్ దేశీయ మూలధన సమీకరణకు దోహదపడుతుంది. అదే విధంగా గిఫ్ట్ సిటీలో పెట్టుబడుల యోచనలో ఉన్న అంతర్జాతీయ సంస్థల నిధులను పొందడంలోనూ ఇది సహాయపడుతుందని భావిస్తున్నాం. ► అంతర్జాతీయ ఫండ్లు కూడా ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌ల గురించి తెలుసుకునేలా తగిన చర్యలు అవసరం. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, సావరిన్ వెల్త్ ఫండ్లు ఈ ఎక్సే్ఛంజ్‌ల్లో పెట్టుబడులు పెట్టేలా బీఎస్ఈ ప్రయత్నాలు జరపాలి. ► ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ భారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మనం దానిని మరింత విస్తృతం చేయాలి. మరింత మంది దేశీయ పెట్టుబడిదారులను పొందాలి. అలాగే అంతర్జాతీయ పెట్టుబడిదారులకు వీటిపై అవగాహన కల్పించాలి. ► ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో మొదట లిస్టయిన 150 చిన్న కంపెనీలు ఇప్పుడు ప్రధాన ప్లాట్‌ఫామ్‌లపై వ్యాపారం చేయడానికి అన్ని అర్హతలూ పొందాయి. ► మహమ్మారి సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న చిన్న మధ్య తరహా పరిశ్రలను పునరుద్ధరించడానికి కేంద్రం తగిన అన్ని చర్యలూ తీసుకుంది. ఈ దిశలో ఈసీఎల్‌జీసీ, టీఆర్‌ఈడీఎస్‌సహా పలు పథకాలను, చర్యలను అమలు చేసింది. ► మనం మహమ్మారిని అధిగమించగలిగాము. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితిని, ముఖ్యంగా ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధ పరిణామాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నాం. ఈ భౌగోళిక ఉద్రిక్తతలు మన పరిశ్రమ విశ్వాసం, స్ఫూర్తిని నిరోధించలేదు. ► స్టార్టప్‌ల విషయంలో దేశం పురోగమిస్తోంది. భారత్ 100 కంటే ఎక్కువ యునికార్న్‌లకు (బిలియన్ డాలర్లపైన విలువగలిగిన సంస్థలు), 70–80 ‘సూనికార్న్‌లకు‘ (యూనికార్న్‌లుగా మారడానికి దగ్గరిగా ఉన్న సంస్థలు) నిలయంగా ఉంది. స్టార్టప్ ఎకోసిస్టమ్‌తో అనుసంధానానికి బీఎస్ఈ ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. స్టార్టప్స్‌లోకి భారీ దేశీయ పెట్టుబడులు వెళ్లడానికి ఈ వ్యవస్థ దోహదపడుతుందని భావిస్తున్నాం. దేశీయ ఇన్వెస్టర్లు యూనికార్న్స్‌లో పెట్టుబడులకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ ధోరణి మారాలి. బీఎస్ఈ చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎస్ఎంఈ) ప్లాట్‌పామ్‌పై 400 కంపెనీలు లిస్టయిన చరిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ముంబై ఎక్సే్చంజీ బిల్డింగ్‌లో బుల్ వద్ద కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్. కార్యక్రమంలో బీఎస్ఈ చైర్మన్ ఎస్ఎస్ ముంద్రా, బీజేపీ ఎంపీ రామ్ చరణ్ బోహ్రా తదితరులు పాల్గొన్నారు. బీఎస్ఈ ఎంఎస్ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 60,000 కోట్లు దాటింది. -
స్టార్టప్‌లకు ఏఐఎఫ్‌ల దన్ను
న్యూఢిల్లీ: ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్) స్టార్టప్‌లకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే 720 స్టార్టప్‌లలో రూ.11,206 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రకటించింది. స్టార్టప్‌ల కోసం ఉద్దేశించిన ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్).. స్టార్టప్లలలోనే పెట్టుబడులు పెట్టే 88 ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్)కు రూ.7,385 కోట్లు సమకూర్చనున్నట్టు తెలిపింది. స్టార్టప్ ఎకోసిస్టమ్ బలోపేతానికి కావాల్సిన నిధులను సమీకరించడంలో ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు పేర్కొంది. ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ మద్దతుతో ఏఐఎఫ్‌లు రూ.48,000 కోట్ల పెట్టుబడులను స్టార్టప్‌లకు అందించే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపింది. వీటిల్లో చిరేట్ వెంచర్స్, ఇండియా క్వొటెంట్, బ్లూమ్ వెంచర్స్, ఇవీ క్యాప్, వాటర్‌బ్రిడ్జ్, ఓమ్నివేర్, ఆవిష్కార్, జేఎం ఫైనాన్షియల్, ఫైర్‌సైడ్ వెంచర్స్ కీలకంగా పనిచేస్తున్నట్టు పేర్కొంది. -
భారత్‌లో పెట్టుబడులు పెట్టండి
అబుదాబి: పెట్టుబడులు పెట్టేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వద్ద పుష్కలంగా నిధులు ఉన్నాయని, ఇన్వెస్ట్ చేయడానికి భారత్‌లో అపార అవకాశాలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ చెప్పారు. కనెక్టివిటీ, కృత్రిమ మేధ, కొత్త టెక్నాలజీలు, డేటా అనలిటిక్స్ వంటి వివిధ రంగాల్లో ఇరు దేశాలు పనిచేయగలవని ఆయన పేర్కొన్నారు. ఇండియా–యూఏఈ స్టార్టప్ ఫోరం 2022 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘యూఏఈ వద్ద పెట్టుబడుల సామర్థ్యాలు ఉన్నాయి. భారీ మార్కెట్ రూపంలో భారత్ .. పెట్టుబడులకు ఆకర్షణీయమైన కేంద్రంగా నిలుస్తోంది. కాబట్టి ఇరు దేశాలకు ఒకదానితో మరొకదానికి పోటీ లేదు. రెండూ భాగస్వాములుగా కలిసి పనిచేయవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. అంకుర సంస్థలకు సదుపాయాలు కల్పించడంతో పాటు స్టార్టప్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఉందని, నంబర్ వన్ స్థానానికి చేరాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ఆయన పేర్కొన్నారు. దుబాయ్ ఎక్స్పో సందర్భంగా భారత స్టార్టప్‌లకు మంచి స్పందన లభించిందని.. పలు అంకుర సంస్థలు నిధులను సమీకరించుకున్నాయని, అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయని గోయల్ చెప్పారు. అంకుర సంస్థలు తమ ఆవిష్కరణ ప్రయోజనాలు .. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు కూడా చేరువయ్యేలా చూడాలని ఆయన సూచించారు. -
భారత్‌కు భారీ ఎఫ్‌డీఐలు: గోయల్
న్యూఢిల్లీ: భారత్‌కు భారీ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వస్తున్నట్లు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై మధ్య ఎఫ్‌డీఐలు 62 శాతం పెరిగి 27 బిలియన్ డాలర్లకు చేరినట్లు వెల్లడించారు. గడచిన ఏడు సంవత్సరాలుగా ఎఫ్‌డీఐల విషయంలో భారత్ మంచి ఫలితాలు సాధించిందని, ఇదే ధోరణి ఇక ముందూ కొనసాగుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్కరణలు ఇందుకు దోహదపడతాయని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. 2021– బహుళజాతి సంస్థలు (ఎన్ఎన్సీ) అనే అంశంపై ఇండస్ట్రీ బాడీ సీఐఐ నిర్వహించిన జాతీయ సదస్సులో ఈ మేరకు ఆయన ప్రసంగించారు. యూఏఈ, ఆస్ట్రేలియాలతో త్వరలో ఎఫ్‌టీఏలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై (ఎఫ్‌టీఏ)లపై గోయల్ మాట్లాడుతూ, యుఏఈ, ఆస్ట్రేలియా, యూకే, యూరోపియన్ యూనియన్ (ఈయూ), ఇజ్రాయెల్, జీసీసీ (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్)) గ్రూప్‌తో సహా పలు దేశాలతో భారత్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. రానున్న 60 నుంచి 100 రోజుల్లో యూఏఈ, ఆస్ట్రేలియాలతో ఎఫ్టీఏలకు సంబంధించి కీలక అవగాహనలకు వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన తెలిపారు. తయారీ రంగంలో పెట్టుబడులకు బహుళజాతి కంపెనీలు భారత్‌ను స్థావరంగా ఎంచుకోవాలని, తద్వారా అధిక వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలు పొందాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఎఫ్‌టీఏ కింద, రెండు భాగస్వామ్య దేశాలు తమ మధ్య వర్తకం చేసే గరిష్ట సంఖ్యలో వస్తువులపై కస్టమ్స్ సుంకాలను తగ్గిస్తాయి. లేదా తొలగిస్తాయి. సేవలలో వాణిజ్యాన్ని మెరుగుపరచడానికి, పెట్టుబడులను పెంచుకోడానికి కూడా ఆయా దేశాలు నిబంధనలను సరళీకరిస్తాయి. -
ఐదు నెలల గరిష్టానికి టోకు ధరలు
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 12.54 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 ఇదే నెలతో పోల్చితే 2021 అక్టోబర్‌లో టోకు బాస్కెట్ ఉత్పత్తుల ధర 12.54 శాతం ఎగసిందన్నమాట. గడచిన ఐదు నెలల్లో ఈ స్థాయిలో ధరల తీవ్రత ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల భారీ పెరుగుదల, సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ ఉత్పత్తుల ధరల తీవ్రత వంటి అంశాలు దీనికి కారణమని గణాంకాలు సూచిస్తున్నాయి. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ధరలన్నీ పైపైకి... ► మినరల్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, క్రూడ్ పెట్రోలియం, సహజవాయువు, కెమికల్స్, రసాయన ఉత్పత్తుల వంటివి గతేడాది అక్టోబర్‌తో పోల్చితే తాజా సమీక్షా నెలల్లో భారీగా పెరిగాయి. ► తయారీ రంగంలో సమీక్షా నెల్లో ద్రవ్యోల్బణం 12.04 శాతంకాగా, సెప్టెంబర్‌లో 11.41 శాతం. ► ఫ్యూయెల్ అండ్ పవర్ రంగాల్లో 2021 అక్టోబర్ ద్రవ్యోల్బణం 37.18 శాతం. సెప్టెంబర్‌లో 24.81 శాతం. ఒక్క క్రూడ్ పెట్రోలియం ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 71.86% ఉంటే, అక్టోబర్‌లో ఏకంగా 80.57 శాతానికి ఎగసింది. ► ఆహార ధరల విభాగానికి వస్తే, సెప్టెంబర్‌లో 4.69 శాతం తగ్గాయి (2020 ఇదే నెలతో పోల్చి). అయితే అక్టోబర్‌లో ఈ తగ్గుదల కేవలం 1.69 శాతంగానే ఉంది. కూరగాయల ధరల తగ్గుదల 18.49 శాతం ఉంటే, ఉల్లి విషయంలో తగ్గిన శాతం 25.01 శాతం అని గణాంకాలు వెల్లడించాయి. ఏప్రిల్ నుంచీ రెండంకెల్లోనే... టోకు ధరల ద్రవ్యోల్బణం రెండంకెల్లో కొనసాగడం ఏప్రిల్ నుంచీ ఇది వరుసగా ఏడవనెల.అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021 ఏప్రిల్– 2022 మార్చి) ఇప్పటి వరకూ ఒక అంకెలో టోకు ద్రవ్యోల్బణం లేదన్నమాట. టోకు ద్రవ్యోల్బణం స్పీడ్ ఏప్రిల్ (10.74%), మే (13.11%) జూన్ (12.07%), జూలై (11.16%), ఆగస్టు (11.39%) నెలల్లో రెండంకెల పైనే కొనసాగింది. సెప్టెంబర్‌లో 10.66%గా నమోదుకాగా, తాజాగా అక్టోబర్‌లో 12.54%గా ఉంది. అయితే ప్రస్తుతం ఈ స్థాయి ద్రవ్యోల్బణం కొనసాగడానికి 2020 ఇదే నెలల్లో ద్రవ్యోల్బణ పరిస్థితిపై లో బేస్ ఎఫెక్ట్ ఉండడమూ కారణమన్న అంచనాలు ఉన్నాయి. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఉదాహరణకు 2020 అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం కేవలం 1.31 శాతం. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల దిగువ బాట నుంచి ‘యూ టర్న్’ తీసుకుని అక్టోబర్‌లో 4.48 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. -
వేల కంపెనీలు మూతపడ్డాయ్, ఏ రాష్ట్రంలో ఎక్కువంటే
కరోనా వేళ వేలాది కంపెనీలు మూతపడ్డాయి. 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 జూన్ 30 వరకు 15 నెలల్లో కార్పొరేట్ వ్యవహారాల శాఖ వద్ద నమోదైన కంపెనీల్లో 17,228 మూతపడినట్టు వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్‌ప్రకాష్ రాజ్యసభకు తెలిపారు. ఇందులో తమిళనాడు రాష్ట్రానికి చెందినవి 1,899 ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుతానికి నోటిఫై చేసిన 379 ప్రత్యేక ఆర్థిక మండళ్లు దేశంలో పనిచేస్తున్నట్టు తెలిపారు. అలాగే, 2014–20 మధ్య ఏడు ఆర్థిక సంవత్సరాల్లో దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 440 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తెలిపారు. -
ఎగుమతి రంగాలపై ప్రత్యేక దృష్టి
న్యూఢిల్లీ: ఎగుమతులకు సంబంధించి భారత్‌కు అనుకూల పరిస్థితులు ఉన్న 12–13 రంగాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ వెల్లడించారు. టెక్స్టైల్స్ తదితర రంగాలు వీటిలో ఉన్నాయని ఆయన వివరించారు. ప్రస్తుతం 37 బిలియన్ డాలర్లుగా ఉన్న టెక్స్టైల్స్ రంగం ఎగుమతులు వచ్చే 10 సంవత్సరాల్లో 100 బిలియన్ డాలర్లకు చేరగలవని గోయల్ పేర్కొన్నారు. సేవల రంగం ఎగుమతులు కూడా మెరుగైన వృద్ధి రేట్లు సాధిస్తున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో మిగతా రంగాలతో పోలిస్తే అధిక స్థాయిలో ఎగుమతులకు ఆస్కారమున్న రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా గోయల్ చెప్పారు. 2019–20 ఏప్రిల్– డిసెంబర్ మధ్య కాలంలో ఎగుమతులు సుమారు 2 శాతం, దిగుమతులు దాదాపు 9 శాతం క్షీణించిన నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అసంబద్ధ పోటీ నుంచి దేశీ పరిశ్రమలను కాపాడేందుకు భారత్ కొన్ని రక్షణాత్మక విధానాలు పాటించడం తప్పనిసరిగా మారిందని చెప్పారు. ఈ–కామర్స్ సంస్థలకు వేల కోట్ల నష్టాలా.. ఎలా... బిలియన్ల డాలర్ల పెట్టుబడులతో భారత్నేమీ ఉద్ధరించడం లేదంటూ అమెజాన్‌ను గతంలో ఆక్షేపించిన గోయల్ తాజాగా ఈ–కామర్స్ కంపెనీల నష్టాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ–కామర్స్ కంపెనీలు వేల కోట్ల నష్టాలు ప్రకటిస్తుండటంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. రూ. 5,000 కోట్ల టర్నోవరుపై ఏకంగా రూ. 6,000 కోట్ల నష్టాలు ప్రకటించిందంటే నమ్మశక్యంగా అనిపించదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ–కామర్స్ సంస్థలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని గోయల్ స్పష్టం చేశారు. అలాంటి సంస్థలను ఎప్పుడూ స్వాగతిస్తామని చెప్పారు. అమెజాన్‌పై గతంలో చేసిన వ్యాఖ్యల మీద స్పందిస్తూ మంత్రి తాజా వివరణనిచ్చారు. ‘ఈ–కామర్స్‌తో ఇంత మందికి ప్రయోజనం చేకూరుతుందన్న హామీలు వినడానికి ఆకర్షణీయంగానే ఉంటాయి. కానీ చట్టరీత్యా ఆమోదయోగ్యం కాని విధానాల వల్ల పది రెట్లు మంది ప్రయోజనాలు దెబ్బతినకూడదు’ అని గోయల్ చెప్పారు. -
రాజు స్థానంలో ప్రభు
న్యూఢిల్లీ: పౌర విమానయాన శాఖ మంత్రిగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు సోమవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. పి. అశోక్‌గజపతి రాజు ఈ పదవికి రాజీనామా చేయడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిఫారసు మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో రైల్వే మంత్రిగా పనిచేసిన సురేశ్ ప్రభు.. 2017లో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. అంతకుముందు ఆ శాఖను నిర్వర్తిస్తున్న నిర్మలా సీతారామన్ రక్షణ శాఖ మంత్రిగా నియమితులవడంతో వాణిజ్య, పరిశ్రమల శాఖను ప్రభుకు కేటాయించారు. 2000 నుంచి 2002 వరకు వాజపేయి ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. -
ఫ్లిప్‌కార్ట్‌పై సీసీఐకి ఫిర్యాదు
న్యూఢిల్లీ: ఈకామర్స్ సైట్ల డిస్కౌంట్లపై వివాదం చెలరేగిన నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర ఆన్లైన్ రిటైలర్లపై ఫిర్యాదు వచ్చినట్లు గుత్తాధిపత్య వ్యాపార ధోరణుల నియంత్రణ సంస్థ సీసీఐ వర్గాలు తెలిపాయి. సదరు సంస్థలు అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టే అంశం మీద త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వివరించాయి. అక్టోబర్ 6న బిగ్ బిలియన్ డే పేరుతో ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ సేల్ ప్రకటించడం, మిగతా ఈకామర్స్ సంస్థలు కూడా పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ఇస్తుండటం వంటి అంశాలపై చిన్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సంప్రదాయ స్టోర్స్‌ను దెబ్బతీస్తున్న ఇలాంటి ఆన్లైన్ సంస్థల వ్యాపారాలను నియంత్రించాలని వ్యాపార సంస్థల సమా ఖ్య సీఏఐటీ గతంలోనే వాణిజ్య శాఖను కోరింది.