ఆర్గానిక్‌ ఎగుమతులకు చక్కని అవకాశాలు | Piyush Goyal launches 8th edition of National Programme for Organic Production | Sakshi
Sakshi News home page

ఆర్గానిక్‌ ఎగుమతులకు చక్కని అవకాశాలు

Published Fri, Jan 10 2025 1:42 AM | Last Updated on Fri, Jan 10 2025 8:01 AM

Piyush Goyal launches 8th edition of National Programme for Organic Production

మూడేళ్లలో రూ.20,000 కోట్ల మేర 

కేంద్ర వాణిజ్య మంత్రి గోయల్‌ 

న్యూఢిల్లీ: సేంద్రీయ ఉత్పత్తుల (రసాయనిక ఎరువులు, పురుగు మందులు వినియోగించని) ఎగుమతులకు చక్కని అవకాశాలున్నాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. వచ్చే మూడేళ్లలో ఆర్గానిక్‌ ఉత్పత్తుల ఎగుమతులు రూ.20,000 కోట్లకు చేరుకోవచ్చన్నారు. నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ ఆర్గానిక్‌ ప్రొడక్షన్‌ (ఎన్‌పీఓపీ) ఎనిమిదో ఎడిషన్‌ను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడారు. 

సేంద్రీయ ఉత్పత్తులకు సంబంధించి ప్రమాణాలు, పారదర్శకత, నిబంధనలపై ఇందులో స్పష్టత ఇచ్చారు. ‘‘ప్రస్తుతానికి ఆర్గానిక్‌ ఉత్పత్తుల ఎగుమతులు రూ.5,000–6,000 కోట్లుగా ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో రూ.20,000 కోట్లను సులభంగా చేరుకుంటాం. ప్రస్తుత స్థాయితో పోల్చితే 3–3.5 రెట్లు’’అని తెలిపారు. అంతర్జాతీయంగా రూ.లక్ష కోట్ల మేర సేంద్రీయ ఉత్పత్తులకు డిమాండ్‌ ఉందని, రానున్న సంవత్సరాల్లో ఇది రూ.10 లక్షల కోట్లకు చేరుకుంటుందన్నారు. 

ఇది భారత్‌కు చక్కని అవకాశమని, దీన్ని జారవిడుచుకోరాదన్నారు. సేంద్రీయ సాగును ఎక్కువ మంది రైతులు చేపట్టిన దేశాల్లో భారత్‌ కూడా ఉన్నట్టు మంత్రి తెలిపారు. ఈ రంగం వృద్ధికి అవసరమైన పరిష్కారాలతో స్టార్టప్‌లు ముందుకు రావాలని పిలపునిచ్చారు. భారత సేంద్రీయ ఎగుమతుల రంగాన్ని బలోపేతం చేయడం, 2030 నాటికి 2 బిలియన్‌ డాలర్ల విలువైన ఆహారోత్పత్తుల ఎగుమతులను చేరుకునే లక్ష్యాలతో ఎనిమిదో ఎడిషన్‌ ఎన్‌పీవోపీని విడుదల చేయడం గమనార్హం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సేంద్రీయ ఉత్పత్తులకు విశ్వసనీయత పెంచడం, ఆర్గానిక్‌ ఉత్పత్తుల ప్రమాణాలను పెంచడంలోనూ ఎన్‌పీవోపీ కీలక పాత్ర పోషిస్తుంటుంది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement