Organic production
-
ఆర్గానిక్ ఎగుమతులకు చక్కని అవకాశాలు
న్యూఢిల్లీ: సేంద్రీయ ఉత్పత్తుల (రసాయనిక ఎరువులు, పురుగు మందులు వినియోగించని) ఎగుమతులకు చక్కని అవకాశాలున్నాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. వచ్చే మూడేళ్లలో ఆర్గానిక్ ఉత్పత్తుల ఎగుమతులు రూ.20,000 కోట్లకు చేరుకోవచ్చన్నారు. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్పీఓపీ) ఎనిమిదో ఎడిషన్‌ను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడారు. సేంద్రీయ ఉత్పత్తులకు సంబంధించి ప్రమాణాలు, పారదర్శకత, నిబంధనలపై ఇందులో స్పష్టత ఇచ్చారు. ‘‘ప్రస్తుతానికి ఆర్గానిక్ ఉత్పత్తుల ఎగుమతులు రూ.5,000–6,000 కోట్లుగా ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో రూ.20,000 కోట్లను సులభంగా చేరుకుంటాం. ప్రస్తుత స్థాయితో పోల్చితే 3–3.5 రెట్లు’’అని తెలిపారు. అంతర్జాతీయంగా రూ.లక్ష కోట్ల మేర సేంద్రీయ ఉత్పత్తులకు డిమాండ్ ఉందని, రానున్న సంవత్సరాల్లో ఇది రూ.10 లక్షల కోట్లకు చేరుకుంటుందన్నారు. ఇది భారత్‌కు చక్కని అవకాశమని, దీన్ని జారవిడుచుకోరాదన్నారు. సేంద్రీయ సాగును ఎక్కువ మంది రైతులు చేపట్టిన దేశాల్లో భారత్ కూడా ఉన్నట్టు మంత్రి తెలిపారు. ఈ రంగం వృద్ధికి అవసరమైన పరిష్కారాలతో స్టార్టప్‌లు ముందుకు రావాలని పిలపునిచ్చారు. భారత సేంద్రీయ ఎగుమతుల రంగాన్ని బలోపేతం చేయడం, 2030 నాటికి 2 బిలియన్ డాలర్ల విలువైన ఆహారోత్పత్తుల ఎగుమతులను చేరుకునే లక్ష్యాలతో ఎనిమిదో ఎడిషన్ ఎన్పీవోపీని విడుదల చేయడం గమనార్హం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సేంద్రీయ ఉత్పత్తులకు విశ్వసనీయత పెంచడం, ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రమాణాలను పెంచడంలోనూ ఎన్‌పీవోపీ కీలక పాత్ర పోషిస్తుంటుంది. -
నీటిలో తేలాడే పంటలు!
- ఇది ‘ఫ్లోటిగేషన్’ సేద్య పద్ధతి - చెరువులు, రిజర్వాయర్లలోనూ వరి, కూరగాయల సాగు సాధ్యమేనంటున్న నిపుణులు - ఎరువులు, పురుగుల మందుల ఖర్చు లేకుండా సేంద్రియ దిగుబడులు పొలాల్లోనే కాదు.. చెరువులు, సరస్సులు, రిజర్వాయర్లలో నిల్వ ఉండే నీటిపైనకూడా నిశ్చింతగా పంటలు పండించవచ్చు. ఇలా నీటిపై తేలాడే పద్ధతిలో పంటలు పండించడాన్ని ‘ఫ్లోటిగేషన్’ అంటారు. హైదరాబాద్‌కు చెందిన పర్యావరణవేత్త డాక్టర్ నక్కా సాయి భాస్కర్ రెడ్డి ఈ పద్ధతిలో ప్రయోగాత్మకంగా సేంద్రియ పంటలు పండించి సత్ఫలితాలు పొందారు. నీటిలో తేలియాడే వస్తువులతో ముందుగా ‘ఫ్లోట్స్’ను తయారు చేసుకోవాలి. ఇందుకోసం ప్లాస్టిక్ జాలీ బకెట్లు, కట్టెల బొగ్గు (బయోచార్), ఫ్లోటింగ్ క్యూబ్స్, షేడ్ నెట్ అవసరమవుతాయి. జాలీ బకెట్ నీటిలో తేలియాడేలా ఫ్లోటింగ్ క్యూబ్స్‌ను ఉపయోగించాలి. ఫ్లోటింగ్ క్యూబ్స్‌కు బదులు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను జాలీ బకెట్ చుట్టూ కట్టుకోవచ్చు. జాలీ బకెట్లో షేడ్‌నెట్ అమర్చుకోవాలి. అందులో కట్టెల బొగ్గును వేయాలి. బొగ్గులో మిశ్రమంగా కోకోపిట్‌ను గానీ, తవుడును గానీ కలుపుకోవచ్చు. అందులో విత్తనాలు లేదా నాట్లుగానీ వేసి ఆ బకెట్‌ను నీటిలో తేలేలా ఉంచాలి. చెరువులు, కొలనులు, డ్రైనేజీలు, రిజర్వాయర్లలో కూడా వరితో పాటు కూరగాయలు వంటి పంటల్ని ఈ పద్ధతిలో పండించవచ్చు. మొక్క తనకవసరమైన పోషకాలను నీటి నుంచే తీసుకుంటుంది. కట్టెల బొగ్గుకు నీటిని శుద్ధి చేసే గుణం ఉంటుంది. కాబట్టి, పొలాల నుంచి వెళ్లే మురుగు నీటి కాలువల్లోనూ కట్టెల బొగ్గు శుద్ధి చేస్తుంది. మొక్కల వేళ్ల వద్దకు చేపలు వస్తుంటాయి. వాటి కోసం పక్షులూ వచ్చి వాల్తాయి. ఫ్లోటిగేషన్ పద్ధతిలో ఎరువులు, పురుగులు మందుల అవసరంలేదు. కలుపు సమస్య ఉండదు. పంట పండిన తర్వాత.. పంటల తెప్పలను ఒడ్డుకు లాక్కెళ్లి కోత కోసుకోవచ్చు. ఫ్లోటిగేషన్ పంటల ద్వారా చెరువులు, రిజార్వాయర్లలో నీరు ఆవిరైపోవడాన్ని చాలా వరకు తగ్గించవచ్చని డా. సాయి భాస్కర్ (96767 99191) సూచిస్తున్నారు. - అరుణ్ కుమార్ మరపట్ల, సాగుబడి డెస్క్ చెరువుపైనే చేను: వ్యవసాయ భూముల్లోనే కాక నీటిలో కూడా పంటలు పండించొచ్చని నిరూపిస్తున్నాడు కేరళకు చెందిన ఒక రైతు. గ్రామ చెరువులో ఈ రైతు చేపల్ని పెంచుతూ, చెరువు నీటిపై వరి పంటను సాగు చేస్తున్నాడు. ప్లాస్టిక్ బుట్టల్లో కొంత పశువుల ఎరువు కలిపిన మట్టి మిశ్రమాన్ని నింపి.. వరి నారు నాటాడు. చెరువులో తెప్పను ఉంచి.. తెప్ప లోపలి నుంచి మొక్క వేర్లు నీటిలోకి వేలాడేలా ఏర్పాటు చేశాడు. ఇంకేముంది.. నెలలు గడిచే సరికి పంట కోతకు వచ్చేసింది. నీటిలోకి దిగి పంటను కోయడమొక్కటి తప్పిస్తే ఇక ఏ ఇబ్బంది లేకుండా పంట పండిందంటున్నాడీ రైతు. -
సమస్య: చెత్త.. పరిష్కారం: కంపోస్టు
ప్రతి కుటుంబం పాల్గొన్నప్పుడే ‘స్వచ్ఛ భారత్’ పేరిట ప్రారంభమైన ప్రజాఉద్యమం విజయవంతమవుతుంది. ప్రతి ఇల్లూ చెత్త ఉత్పత్తి కేంద్రమే! వంట చేస్తూ ఉండే ఇంట్లో రోజుకు 750 గ్రాముల నుంచి 1500 గ్రాముల తడి/పొడి చెత్త(కూరగాయలు, పండ్ల తొక్కలు వగైరా) తయారవుతుంది. ఇది చక్కని కంపోస్టుగా మార్చదగిన ప్రకృతి వనరు! కుళ్లే అవకాశం ఉన్న (సేంద్రియ) చెత్తలో 60% నీరే ఉంటుంది. కానీ, సాధారణంగా ఏ ప్లాస్టిక్ కవర్లోనో, చెత్తబుట్టలోనో వేసి అవతల పడేస్తుంటాం. ఇందుకోసం బోలెడంత మంది సిబ్బంది, డీజిల్.. ప్రజాధనం ఎంతో వృథా అవుతోంది. అందువల్లే ఇది సమాజానికి సమస్యగా మారుతోంది. వట్టి సేంద్రియ చెత్త అయితే నేలలో కలిసిపోతుంది. కానీ, బాటిల్స్, ప్లాస్టిక్, ట్యూబ్‌లైట్లు, కాలం చెల్లిన మందులతో సేంద్రియ చెత్తను కలిపి పారేస్తుండడం వల్లనే నగరాలు, పట్టణాల వెలుపల చెత్తకుప్పలు పర్యావరణానికి గొడ్డలిపెట్టులా తయారవుతున్నాయి. ఆ చుట్టుపక్కల మనుషులకు, జీవజాలానికి పెనుసమస్యగా మారుతోంది. మన వల్ల తయారవుతున్న చెత్త సమస్యను పరిష్కరించే బాధ్యతను మనమే తీసుకుందాం. ప్రతి ఆవాసంలోనూ కంపోస్టు తయారీ యూనిట్లు విధిగా ఏర్పాటు చేయాలని బిల్డర్లు, ప్లానర్ల మీద వత్తిడి తెద్దాం. వాన నీటి సంరక్షణకు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు తీయించమని అడుగుదాం. మనలో ఈ చైతన్యం రాకపోతే నగరాలు కుప్పకూలే రోజెంతో దూరంలో లేదు. తడి చెత్తను ఇంటి దగ్గరే కంపోస్టు చేసుకుంటూ.. పొడి చెత్తను మాత్రమే మున్సిపాలిటీ వాళ్లకివ్వాలి. ఈ పని చేయడం వల్ల భూమిలో కలవని చెత్తలోంచి పనికొచ్చే వాటిని ఏరుకొని బతికే పేదల పని సులువవుతుంది. కంపోస్టు తయారీ కోసం సిద్ధం చేసిన మట్టి కుండల్లో సేంద్రియ చెత్తను వేయడం అలవాటు చేసుకుందాం.. మూడు నెలలకు అది చక్కని కంపోస్టుగా మారుతుంది. కాలనీ స్థాయిలో పెట్టుకునే కంపోస్టు యూనిట్లలో మరింత త్వరగానే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. పంటల ద్వారా మనకు కూరగాయలు, పండ్లు, ధాన్యాలను ఇస్తున్నది నేలతల్లి. వంటింటి వ్యర్థాల్లోని పోషకాలను తిరిగి నేలతల్లి ఒడికి చేర్చడం మన కనీస బాధ్యత. ‘స్వచ్ఛ భారత్’కు మన వంతు తోడ్పడదాం. మీకు కిచెన్ గార్డెన్ లేకపోయినా సరే కంపోస్టు చేయడం మొదలుపెట్టండి! చెత్త ఒక సమస్య.. కంపోస్టు ఒక పరిష్కారం. కంపోస్టు పద్ధతులపై అదనపు సమాచారం కోసం www.dailydump.org/ వెబ్సైట్ చూడండి!