నీటిలో తేలాడే పంటలు!
- ఇది ‘ఫ్లోటిగేషన్’ సేద్య పద్ధతి
- చెరువులు, రిజర్వాయర్లలోనూ వరి, కూరగాయల సాగు సాధ్యమేనంటున్న నిపుణులు
- ఎరువులు, పురుగుల మందుల ఖర్చు లేకుండా సేంద్రియ దిగుబడులు
పొలాల్లోనే కాదు.. చెరువులు, సరస్సులు, రిజర్వాయర్లలో నిల్వ ఉండే నీటిపైనకూడా నిశ్చింతగా పంటలు పండించవచ్చు. ఇలా నీటిపై తేలాడే పద్ధతిలో పంటలు పండించడాన్ని ‘ఫ్లోటిగేషన్’ అంటారు. హైదరాబాద్‌కు చెందిన పర్యావరణవేత్త డాక్టర్ నక్కా సాయి భాస్కర్ రెడ్డి ఈ పద్ధతిలో ప్రయోగాత్మకంగా సేంద్రియ పంటలు పండించి సత్ఫలితాలు పొందారు. నీటిలో తేలియాడే వస్తువులతో ముందుగా ‘ఫ్లోట్స్’ను తయారు చేసుకోవాలి. ఇందుకోసం ప్లాస్టిక్ జాలీ బకెట్లు, కట్టెల బొగ్గు (బయోచార్), ఫ్లోటింగ్ క్యూబ్స్, షేడ్ నెట్ అవసరమవుతాయి. జాలీ బకెట్ నీటిలో తేలియాడేలా ఫ్లోటింగ్ క్యూబ్స్‌ను ఉపయోగించాలి. ఫ్లోటింగ్ క్యూబ్స్‌కు బదులు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను జాలీ బకెట్ చుట్టూ కట్టుకోవచ్చు. జాలీ బకెట్‌లో షేడ్‌నెట్ అమర్చుకోవాలి. అందులో కట్టెల బొగ్గును వేయాలి. బొగ్గులో మిశ్రమంగా కోకోపిట్‌ను గానీ, తవుడును గానీ కలుపుకోవచ్చు.
అందులో విత్తనాలు లేదా నాట్లుగానీ వేసి ఆ బకెట్‌ను నీటిలో తేలేలా ఉంచాలి. చెరువులు, కొలనులు, డ్రైనేజీలు, రిజర్వాయర్లలో కూడా వరితో పాటు కూరగాయలు వంటి పంటల్ని ఈ పద్ధతిలో పండించవచ్చు. మొక్క తనకవసరమైన పోషకాలను నీటి నుంచే తీసుకుంటుంది. కట్టెల బొగ్గుకు నీటిని శుద్ధి చేసే గుణం ఉంటుంది. కాబట్టి, పొలాల నుంచి వెళ్లే మురుగు నీటి కాలువల్లోనూ కట్టెల బొగ్గు శుద్ధి చేస్తుంది. మొక్కల వేళ్ల వద్దకు చేపలు వస్తుంటాయి. వాటి కోసం పక్షులూ వచ్చి వాల్తాయి. ఫ్లోటిగేషన్ పద్ధతిలో ఎరువులు, పురుగులు మందుల అవసరంలేదు. కలుపు సమస్య ఉండదు. పంట పండిన తర్వాత.. పంటల తెప్పలను ఒడ్డుకు లాక్కెళ్లి కోత కోసుకోవచ్చు. ఫ్లోటిగేషన్ పంటల ద్వారా చెరువులు, రిజార్వాయర్లలో నీరు ఆవిరైపోవడాన్ని చాలా వరకు తగ్గించవచ్చని డా. సాయి భాస్కర్ (96767 99191) సూచిస్తున్నారు.
- అరుణ్ కుమార్ మరపట్ల, సాగుబడి డెస్క్
చెరువుపైనే చేను: వ్యవసాయ భూముల్లోనే కాక నీటిలో కూడా పంటలు పండించొచ్చని నిరూపిస్తున్నాడు కేరళకు చెందిన ఒక రైతు. గ్రామ చెరువులో ఈ రైతు చేపల్ని పెంచుతూ, చెరువు నీటిపై వరి పంటను సాగు చేస్తున్నాడు. ప్లాస్టిక్ బుట్టల్లో కొంత పశువుల ఎరువు కలిపిన మట్టి మిశ్రమాన్ని నింపి.. వరి నారు నాటాడు. చెరువులో తెప్పను ఉంచి.. తెప్ప లోపలి నుంచి మొక్క వేర్లు నీటిలోకి వేలాడేలా ఏర్పాటు చేశాడు. ఇంకేముంది.. నెలలు గడిచే సరికి పంట కోతకు వచ్చేసింది. నీటిలోకి దిగి పంటను కోయడమొక్కటి తప్పిస్తే ఇక ఏ ఇబ్బంది లేకుండా పంట పండిందంటున్నాడీ రైతు.