crops
-
6 జిల్లాల్లో శీతల గాలులు: పంటలను ఇలా రక్షించుకుందాం!
తెలంగాణా రాష్ట్రంలో వచ్చే రెండు రోజు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, ఉదయపు వేళల్లో దట్టంగా పొగమంచు ఆవరించే అవకాశం ఉందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయ వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా. పి. లీలారాణి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వివిధ పంటలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రైతులు ఈ కింది సూచనలు పాటించాలని డా. పి. లీలారాణి సూచించారు.వరి: తెలంగాణా జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాలలో 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. చలి ప్రభావంతో యాసంగి నారుమడుల్లో నారు ఎదగక పోవచ్చు. ఆకులు పసుపు, ఎరుపు రంగుల్లోకి మారవచ్చు. కొన్నిసార్లు నారు చనిపోవచ్చు. అందువల్ల రైతులు కొన్ని రక్షణ చర్యలు చేపట్టాలి. నారుమళ్ళపై ఇనుప చువ్వలు లేదా వెదురు కర్రలతో ఊతమిచ్చి పైన పలుచని పాలిథిన్ షీట్ లేదా ఖాళీ యూరియా బస్తాలతో తయారు చేసిన పట్టాలతో సాయంత్రం పూట కప్పి, మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలి. రాత్రి వేళల్లో నారుమడిలో నీరు నిండుగా ఉంచి తెల్లవారుజామున తీసివేసి, కొత్త నీరు పెట్టాలి. ∙200 చదరపు మీటరు విస్తీర్ణం గల నారుమడికి ఆఖరి దుక్కిలో 2 క్వింటాళ్లు బాగా చివికిన కోళ్ళు లేదా గొర్రెల ఎరువు వేయాలి. విత్తే సమయంలో 1 కిలో నత్రజని, 1కిలో భాస్వరం, 1 కిలో పొటాషియం ఇచ్చే రసాయనిక ఎరువులు వేయాలి. వరి నారుమళ్ళలో జింక్ ధాతువు లోపం నివారణకు 2 గ్రా. జింక్ సల్ఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.వరుసగా వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి లేదా ప్రతి యాసంగిలో దమ్ములో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ వేయాలి. చలి వాతావరణం, పొగమంచు వరిని అగ్గి తెగులు ఆశించటానికి అనుకూలం. పొలంలో, పొలంగట్లపైన ఉండే గడ్డి కలుపు మొక్కలు అగ్గి తెగులను వ్యాప్తి చేస్తాయి. కాబట్టి, పొలం గట్లపై కలుపు లేకుండా చూసుకోవాలి. వరి నారుమళ్ళలో అగ్గి తెగులు గమనిస్తే, నివారణకు 0.5 గ్రా. ట్రైసైక్లాజోల్ లేదా 1.5 మి.లీ. ఐసోప్రొథైయోలిన్ లేదా 2.5 మి.లీ. కాసుగామైసిన్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్న: చలి వల్ల మొక్కజొన్నలో భాస్వరం లోపించి ఆకులు ఊదా రంగులోకి మారుతాయి. భాస్వరం లోప లక్షణాలు గమనించినట్లైతే నివారణకు 10 గ్రా. 19–19–19 లేదా డి.ఎ.పి మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.మిరప : ప్రస్తుత చలి వాతావరణం మిరపను బూడిద తెగులు ఆశించటానికి అనుకూలం. నివారణకు, 3గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 1 మి.లీ. అజాక్సిస్ట్రోబిన్ లేదా 2.5గ్రా. టేబుకొనజోల్ + గంధకం లేదా 1.5గ్రా. కార్బండజిమ్ + మాంకోజేబ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.మామిడి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో తేనెమంచు పురుగు, బూడిద తెగులు ఆశించటానికి అనుకూలం. నివారణకు, 0.3గ్రా. డైనోటేఫురాన్ + 1గ్రా. కార్బండజిమ్ + 2.5 మి.లీ. వేపనూనె లేదా 0.5 గ్రా. థయోమిథాక్సామ్ + 2 మి.లీ. హెక్సాకొనజోల్ + 2.5 మి.లి వేప నూనె మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కుసుమ: నవంబర్‌లో విత్తుకున్న కుసుమ పంటకు పేనుబంక ఆశించే అవకాశం ఉంది. నివారణకు 2 మి.లీ. డైమిథోయెట్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
నేలలపై శ్రద్ధ పెట్టాలి!
2024 అంతర్జాతీయ భూముల దినోత్సవం (డిసెంబర్ 5) సందర్భంగా ‘మట్టి గణాంకాల సేకరణ, పర్యవేక్షణ, నిర్వహణ’పై దృష్టిని కేంద్రీకరించాలని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు పిలుపునిచ్చింది.‘మన కాళ్ల కింద ఉన్న నేల ఒక జీవవ్యవస్థ. అనేక జాతుల మనోహరమైన మొక్కలు, జంతుజాలానికి నిలయం. మనకు పోషకాహారంతో పాటు స్వచ్ఛమైన నీరు, జీవవైవిధ్యాన్ని అందిస్తున్న నేలలపై శ్రద్ధ పెట్టి పరిరక్షించుకోవటానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాల’ని ప్రముఖ నేలల నిపుణుడు డాక్టర్ వి. రామ్మూర్తి సూచించారు. బెంగళూరులోని నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ లాండ్ యూజ్ ప్లానింగ్ (ఐసిఎఆర్ అనుబంధం)ప్రాంతీయ కార్యాలయం అధిపతిగా ప్రధాన శాస్త్రవేత్త (వ్యవసాయం)గా ఆయన వ్యవహరిస్తున్నారు.దక్షిణాది రాష్ట్రాల్లో నేలల బాగోగులపై అధ్యయనం చేసి, విధాన నిర్ణేతలకు తగు సూచనలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని అనేక మండలాల్లో నేలల స్థితిగతులపై తమ సంస్థ జరిపిన అధ్యయనంలో వెల్లడైన విషయాలను ఆయన ‘సాక్షి సాగుబడి’కి వెల్లడించారు. 2 రాష్ట్రాల్లో నేలలపై అధ్యయనంతెలంగాణలోని గజ్వేల్, ఇంద్రవెల్లి, మహబూబ్‌నగర్ రూరల్ మండలాల్లో.. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లా రాయచోటి, తొండూరు మండలాల్లో, అనంతపురం జిల్లా కదిరి, ఓబుల దేవర చెరువు(ఓడిసి) మండలాల్లోని నేలల స్థితిగతులపై నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ లాండ్ యూజ్ ప్లానింగ్ తరఫున అధ్యయనం చేశామని డా. రామ్మూర్తి తెలిపారు. భూమి స్థితిగతులను తెలుసుకోవడానికి అది ఏ రకం భూమి? మట్టి ఎంత లోతుంది? వంటి వివరాలతో పాటు భూసారాన్ని అంచనా వేయటానికి సేంద్రియ కర్బనం ఆయా నేలల్లో ఎంత శాతం ఉందో మట్టి పరీక్షల ద్వారా నిర్థారణ చేస్తారు. సేంద్రియ కర్బనాన్ని మూడు స్థాయిల్లో (తక్కువ – 0.50% లోపు, మధ్యస్థం – 0.50–0.75% మధ్య, అధికం – 0.75% కన్నా ఎక్కువ) లెక్కిస్తారు. సేంద్రియ కర్బనం తెలంగాణ నేలలతో పోల్చితే రాయలసీమ నేలల్లో తక్కువగా ఉందని డా. రామ్మూర్తి అన్నారు. ఈ తేడాలకు కారణం ప్రకృతి వైపరీత్యాలు, వర్షపాతం, సాగు పద్ధతి కారణాలని తెలిపారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని పరీక్షలు నిర్వహించిన సాగు భూముల్లో 100% నేలల్లో సేంద్రియ కర్బన శాతం అధికంగా (అంటే.. 0.75% కన్నా ఎక్కువగా) ఉండటం విశేషం. అనంతపురం జిల్లా ఇనగలూరు పంచాయతీలోని 46.29% సాగు భూముల్లో సేంద్రియ కర్బనం తక్కువగా, 35.26% భూముల్లో మధ్యస్థంగా, 18.45% భూముల్లో అధికంగా ఉందని వెల్లడైందన్నారు (పూర్తి వివరాలు పట్టికలో). వరి, పత్తి, మిర్చికి రసాయనాల వాడకం ఎక్కువవరి, పత్తి, మిర్చి పంటలకు రసాయనిక ఎరువులు మరీ ఎక్కువగా వేస్తున్నారు. ఎంత అవసరమో గమనించకుండా పక్క రైతును చూసి వేస్తున్నారు. పురుగుమందుల పిచికారీ కూడా అంతే. పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులను చాలా మంది రైతులు వాడటం లేదు. అదే పంటను ప్రతి ఏటా సాగు చేస్తున్నారు. అందుకే సేంద్రియ కర్బనం అడుగంటుతోందని డా. రామ్మూర్తి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, రైతులు ఇప్పటికైనా జాగ్రత్తపడి సేంద్రియ కర్బనాన్ని అన్ని సాగు భూముల్లోనూ 0.7 శాతానికి పెంచుకోకపోతే భూములు సాగు యోగ్యం కాకుండా పోతాయని హెచ్చరిస్తున్నారాయన.΄పొటెన్షియల్ క్రాప్ జోన్లు ఆయా భూముల స్వభావం, భూసార పరిస్థితులు, ఆప్రాంత వాతావరణం, వర్షపాతం, అక్కడి ప్రజల ఆసక్తి, మార్కెట్ స్థితిగతులపై 20 ఏళ్ల క్రితం నాటి నుంచి సమాచారం సేకరించి విశ్లేషించామని డా. రామ్మూర్తి చెప్పారు. ఈ సమాచారంతో శాస్త్రీయంగా ΄పొటెన్షియల్ క్రాప్ జోన్స్ నివేదికలు ఇస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పత్తి, వరి, జొన్న, వేరుశనగ పంటలకు ఏయే జిల్లాలో ఎన్ని హెక్టార్ల భూమిలో ‘చాలా బాగా, ఒక మాదిరిగా, కొంతమేరకు’ ఆయా పంటల సాగుకు అనువుగా ఉన్నాయో చెప్పామన్నారు.అన్ని మండలాల్లో మట్టిని అధ్యయనం చేయాలిభూమిపై మన జీవితం ఆరోగ్యకరమైన నేలలపై ఆధారపడి ఉంటుంది. మన పాదాల కింద ఉన్న నేల ఒక జీవవ్యవస్థ. అనేక మనోహరమైన మొక్కలు, చెట్లు, జంతువులకు నిలయం. మట్టి మనకు పోషకాహారాన్ని, స్వచ్ఛమైన నీటిని, జీవవైవిధ్యాన్ని అందిస్తుంది. ప్రతి జిల్లాలో అన్ని మండలాల్లోని ΄పొలాల్లో మట్టి పరీక్షలు చేసి, అధ్యయనం చేయాలి. మన మట్టిలో వుండే పోషకాలు ఏమిటి? మట్టిలోని జీవరాశి ఏమేమి ఉన్నాయి? ఏమేమి లేవు? కాలక్రమంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి? సాగు భూములు బాగుండాలంటే వాటిని ఎలా నిర్వహించుకోవాలి? అనే విషయాలపై పాలకులు శ్రద్ధ చూపాలి.ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ్రపోత్సాహమిస్తే మట్టి ఎలా ఉందో పరీక్షించి ఎక్కువగా ఎరువులు వేయకుండా నివారించటంతో పాటు పంటల మార్పిడి,‡మట్టిని పంటలతో కప్పి ఉంచటం వంటి భూసంరక్షణ పద్ధతులపై రైతులకు చైతన్యం కలిగిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సుసంపన్న సాంస్కృతిక జీవనానికి, ఆరోగ్యకరమైన జీవనానికి కూడా మట్టి మూలాధారం. మట్టి ద్వారానే 95% ఆహారం మనకు వస్తోంది. ఇందులో 18 సూక్ష్మ,స్థూల పోషకాంశాలు ఉంటాయి. వీటిలో 15 పోషకాంశాలను నేల నుంచి మిగతా మూడిటిని వాతావరణం నుంచి మనం ΄పొందుతున్నాం. ఈ స్పృహతో సాగు నేలల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. – డాక్టర్ వి. రామ్మూర్తి (94803 15146), అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త (వ్యవసాయం),్ర పాంతీయ కార్యాలయం, ఐసిఎఆర్– నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ లాండ్ యూజ్ ప్లానింగ్, బెంగళూరుఅవును..! మీరు చదివింది, ఈ ఫొటోలో చూస్తోంది.. నిజమే! మన పుచ్చ తోటల్లో పాదులు నేలపై పరచుకొని ఉంటాయి. పుచ్చ కాయలు నేలపైనే పెరుగుతాయి కదా. సౌతాఫ్రికాలో ఒక కంపెనీ పాలీహౌస్‌లలో పుచ్చ పాదులు నిలువుగా ఎగబాగుకుతున్నాయి. పుచ్చ కాయలు వాటికి వేలాడుతున్నాయి. ట్రెల్లిస్ పద్ధతిలో పెరిగే టొమాటోల మాదిరిగా ఈ పుచ్చకాయలు వేలాడుతున్నాయి కదూ.. కాండీ బాల్ సీడ్లెస్ పుచ్చకాయలు కిలో నుంచి కిలోన్నర వరకు బరువు పెరుగుతాయి. అదేమాదిరిగా కిలో బరువు పెరిగే స్మైల్ మెలన్స్ (ఇదో రకం కర్బూజ) పండ్లను కూడా నిలువు తోటల్లో పెంచుతున్నారు. టొమాటోలు వంటి కాయలు బరువు తక్కువగా ఉంటాయి కాబట్టి తీగజాతి మొక్కలు మొయ్యగలుగుతాయి.అయితే, ఇలాంటి నిలువు తోటలో పుచ్చకాయలు, కర్బూజ కాయల బరువు మొక్కలకు భారం కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాస్టిక్ నెట్ కవర్లతో కాయలను ప్లాస్టిక్ వైర్లకు కట్టేస్తున్నారు. ‘నిలువు తోటలో పెరిగిన పుచ్చకాయలను మేం త్వరలోనే అమ్మకానికి పెట్టబోతున్నాం. సౌతాఫ్రికా మార్కెట్లో మేమే ఫస్ట్’ అంటున్నారు ఆ కంపెనీ ప్రతినిధి ఫ్రాంకోయిస్ ఫౌరీ. పాలీహౌస్‌లు, నెట్‌హౌస్‌లలో, మేడపై ఇంటిపంటల్లో ట్రెల్లిస్ పుచ్చ, కర్బూజ సాగు సాధ్యమే అని గ్రహించాలి!12 నుంచి విశాఖ ఆర్గానిక్ మేళాగో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఏపీ రైతు సాధికార సంస్థ, ప్రకృతి వ్యవసాయదారుల సేవాల సంఘం సంయుక్తంగా డిసెంబర్ 12 నుంచి 15వ తేదీ వరకు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 5వ విశాఖ ఆర్గానిక్ మేళా నిర్వహించనున్నాయి. రైతులు, ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయదారులు, ఆహారోత్పత్తుల ఉత్పత్తిదారుల, వినియోగదారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. 12న ఉ. 10 గంటలకుప్రారంభోత్సవంతో పాటు సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళనం ఉంటుంది. 13న ఉ. 10 గం.కు ఆరోగ్య అవగాహన సదస్సు, 14న ఆహారప్రాసెసింగ్పై సదస్సు, 15 సేంద్రియ ఇంటిపంటలు/ మిద్దె తోటల సదస్సు, ముగింపు సమావేశం జరుగుతాయి. అందరూ ఆహ్వానితులే. ఇతర వివరాలకు.. 78934 56163, 91001 86522. -
నిర్మల్ పల్లెల్లో ‘ఇథనాల్’ మంట
నిర్మల్/దిలావర్పూర్: తమ పచ్చని పంటపొలాల్లో ఇథనాల్ చిచ్చు పెట్టొద్దంటూ నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు కొన్ని నెలలుగా చేపడుతున్న నిరసన మంగళవారం తీవ్రరూపు దాల్చింది. దిలావర్పూర్ మండలంలోని దిలావర్పూర్–గుండంపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే తొలగించాలన్న తమ డిమాండ్‌ను అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఆయా గ్రామాల ప్రజల సహనం నశించింది. బంద్ పాటించడంతోపాటు దిలావర్పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద 61వ నంబర్ జాతీయ రహదారిపై ఒక్కసారిగా వందలాది మంది నిరసనకారులు రాస్తారోకోకు దిగారు. నిర్మల్–భైంసా మార్గంలో దాదాపు 12 గంటలపాటు రోడ్డుపై బైఠాయించారు. దీంతో హైవేపై కొన్ని గంటలపాటు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.ఆర్డీవో నచ్చజెప్పినా..: నిరసనకారులు రోడ్డుపైనే మధ్యాహ్నం, రాత్రి వంటావార్పు చేసుకోవడంతోపాటు సాయంత్రం నుంచి అక్కడే చలిమంటలు వేసుకున్నారు. వారికి నచ్చజెప్పేందుకు మధ్యాహ్నం 3 గంటల వేళ నిర్మల్ ఆర్డీవో రత్నకల్యాణి రాగా ఆమెను నిరసనకారులు అడ్డుకున్నారు. 20 మంది గ్రామస్తులను కలెక్టరేట్‌కు తీసుకెళ్లి కలెక్టర్‌తో మాట్లాడిస్తానని చెప్పినా వారు ససేమిరా అన్నారు. గతంలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. అందుకే కలెక్టరే తమ వద్దకు రావాలంటూ ఆమెను ఘెరావ్ చేశారు. దీంతో ఆమె రాత్రి 9:30 గంటల వరకు వాహనంలోనే కూర్చుండి పోయారు. చివరకు జిల్లా ఎస్పీ జానకీ షర్మిల స్వయంగా రోప్‌పార్టీ పోలీసులతో వచ్చి అడ్డుగా కూర్చున్న మహిళలను బలవంతంగా పక్కకు తప్పించి ఆర్డీఓను వాహనంలో నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంతో కోపోద్రిక్తులైన నిరసనకారులు ఆర్డీవో వాహనాన్ని బోల్తా పడేసి దానిపై చలిమంటల్లోని కర్రలను విసిరేశారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో లక్ష్మణచాంద మండల ఎస్సై సుమలత గాయపడ్డారు. మరోవైపు కొన్ని గంటలపాటు వాహనంలో కూర్చుండిపోయిన ఆర్డీఓ సైతం అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది.చేతిలో ప్లకార్డులు, పురుగుమందు డబ్బాలుమాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ‘కనబడుట లేదు..’ అంటూ వారి ఫొటోలతో కూడిన ప్లకార్డులను నిరసనకారులు ప్రదర్శించారు. అలాగే కొందరు మహిళలు పురుగుల మందు డబ్బాలు తీసుకొచ్చి ఇప్పటికైనా ఫ్యాక్టరీని తీసేయకపోతే తమకు అవే దిక్కంటూ చూపించారు.300 మంది పోలీసుల మోహరింపు..నిరసనకారులు బంద్‌తోపాటు ఆందోళన చేయొచ్చన్న సమాచారంతో నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దకు మంగళవారం వేకువ జామునే నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డితోపాటు జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, దాదాపు 300 మంది పోలీసు బలగాలను పంపించారు. రోజంతా రాస్తారోకో చేస్తున్నంత సేపు శాంతియుతంగానే ఉండాలని, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తమ సిబ్బందిని ఆదేశించారు. రాత్రిపూట ఆందోళనకారులను అడ్డుకునేందుకు నిజామాబాద్ జిల్లా నుంచీ బలగాలను రప్పించారు.సీఎంవోకు నివేదిక పంపాం: కలెక్టర్నిర్మల్ చైన్‌గేట్: ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనపై ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక పంపినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ ఓ ప్రకటనలో తెలిపారు. వారి ఆవేదనను సీఎంవోకు నివేదించినట్లు వివరించారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.ఆది నుంచి వద్దంటూనే..దిలావర్పూర్–గుండపల్లి గ్రామాల మధ్య శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌కు సమీపంలో దాదాపు 40ఎకరాల్లో పీఎంకే గ్రూప్ ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ప్రహరీతోపాటు దాదాపు నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. రూ. వందల కోట్ల పెట్టుబడితో పెడుతున్న తమ ఫ్యాక్టరీ జీరో పొల్యూషన్‌తో కూడినదని నిర్వాహకులు చెబుతున్నారు. కానీ సమీపంలోని దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాలు తొలి నుంచీ ఈ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. గతేడాది సైతం ఈ గ్రామాలు చేపట్టిన పరిశ్రమ ముట్టడి ఉద్రిక్తంగా సాగింది. రైతులపై పోలీసులు లాఠీచార్జి చేసే వరకూ పరిస్థితి వెళ్లింది. నాటి నుంచి ఆయా గ్రామస్తులు దీక్షలు, నిరసనలు కొనసాగిస్తున్నారు. తాజాగా దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాలతో పాటు సమీపంలోని సముందర్‌పల్లి, కాండ్లి, టెంబరేణి, లోలం గ్రామాలూ ఆందోళనలో భాగమయ్యాయి. -
రైతు లాభాలకు పంట మార్పిడి ఊతం!
వ్యవసాయం ఆశల జూదమంటారు. సకాలంలో వానలు కురవకపోవడం మొదలుకొని వాతావరణ మార్పులు, నకిలీ విత్తనాలు, ఎరువుల కొరత.. ఇలా రకరకాల కారణాలు రైతును దెబ్బతీయవచ్చు. అయితే ఇవేవీ రైతు నియంత్రణలో ఉన్న అంశాలు కావు. కానీ.. రైతులు తమ చేతుల్లో ఉన్నవీ సక్రమంగా చేసుకోకపోవడంతో కూడా నష్టపోతున్నాడని అంటున్నారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ జి.పద్మజ. పైగా ఈ విషయం గురించి తెలియని వారు ఉండరని, ఆచరణలో పెట్టకపోవడం వల్ల రైతులు కనీసం 25 శాతం పంట దిగుబడిని నష్టపోతున్నాడని చెబుతున్నారు. ఏంటా విషయం. దిగుబడి నాలుగో వంతు పెరిగే మార్గమేది? ఒక్క ముక్కలో చెప్పాలంటే... పంట మార్పిడి!అంతేనా అని అనుకోకండి.. రైతు ఆదాయాన్ని పెంచుకునేందుకు పంట మార్పిడి అద్భుతమైన సాధనం. పైగా రసాయనిక ఎరువుల ధాటికి నానాటికీ తీసికట్టుగా మారుతున్న నేల సారానికి టానిక్గానూ పనిచేస్తుంది ఇది. దురదృష్టం ఏమిటంటే.. ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ మన మన రైతన్నలు పంట మార్పిడిని సీరియస్‌గా తీసుకోవడం లేదని అంటున్నారు డాక్టర్ జి.పద్మజ. ఈ నేపథ్యంలో అసలు పంట మార్పిడి వల్ల కలిగే లాభాలను ఇంకోసారి తరచి చూద్దాం...భూసారం, దిగుబడులు పెరుగుతాయి..వరి, మొక్కజొన్న, పత్తి వంటి వాణిజ్య పంటలు మట్టిలోని పోషకాలను తగ్గిస్తూంటాయి. దీనివల్ల ఏటికేడాదీ దిగుబడి కూడా తగ్గుతూంటుంది. అయితే.. పంటలను మార్చి మార్చి వేసుకోవడం అది కూడా మట్టిలో నత్రజనిని చేర్చగల వాటిని వేసుకోవడం ద్వారా పోషకాలను మళ్లీ భర్తీ చేసుకోవచ్చు. తద్వారా నేల సారం పెరుగుతుంది. దిగుబడులు కూడా ఎక్కువవుతాయి. ఉదాహరణకు.. వేరుశనగ, పప్పుధాన్యాల పంటలు మట్టిలో నత్రజనిని పెంచుతాయి. ఫలితంగా వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు నేల నుంచే తగినంత నత్రజని అందుతుంది. కృత్రిమంగా అందించాల్సిన అవసరం తగ్గుతుంది కూడా. పంట మార్పిడి చేసుకోవడం వల్ల దిగుబడి సుమారు 25 శాతం వరకూ పెరుగుతుందని పరిశోధనలు చెబుతూండగా.. వరి, మొక్కజొన్న, కాయధాన్యాల విషయంలో ఈ పెరుగుదల 20 శాతమని ఇప్పటికే స్పష్టమైంది. మార్పిడులు ఇలా...వరి వేసిన తరువాత మినుములు లేదా నువ్వుల్లాంటి నూనెగింజల సాగు చేయడం మేలు. దీనివల్ల నేలలో నత్రజని మోతాదు పెరగడమే కాకుండా.. చీడపీడల బెడద కూడా తగ్గుతుంది. మొక్కజొన్న పంటను వేరుశనగ లేదా కాయగూర పంటలతో మార్పిడి చేసుకోవడం మేలు. ఒకవేళ ప్రధాన పంటగా వేరు శనగ వేస్తూంటే.. తరువాతి పంటగా మొక్కజొన్న వేసుకోవచ్చు. ఇది నేలలో సేంద్రీయ పదార్థం మోతాదులను కూడా పెంచుతుంది. పత్తి పంటకు మార్పిడిగా పెసలు వేస్తే చీడపీడల బెడద తగ్గుతుంది. నేలలో నత్రజని మోతాదు ఎక్కువ అవుతుంది. ప్రధాన పంటల సాగు తరువాత కాయధాన్యాలను సాగు చేయడం.. వ్యర్థాలను మళ్లీ నేలలో కలిపేస్తే మేలు కలిగించే సూక్ష్మజీవులు కూడా ఎక్కువవుతాయి. వేర్వేరు పంటల సాగు వల్ల రైతు ఆదాయమూ పెరుగుతుంది. రైతుకు ఎంతవరకూ లాభం...?పంట మార్పిడిని తగు విధంగా అమలు చేస్తే రైతు ఆదాయం 15 నుంచి 20 శాతం ఎక్కువ అవుతుంది. ఒక సంవత్సరంలో వేర్వేరు పంటలు సాగు చేస్తారు కాబట్టి మార్కెట్ రిస్క్ తక్కువ అవుతుంది. పైగా ఎక్కువ డిమాండ్ ఉన్న, ఆదాయం అందించే కూరగాయల్లాంటివి సాగు చేసుకునే వీలేర్పడుతుంది. పైగా పంట మార్పిడి వల్ల నేలలో నత్రజని మోతాదు ఎక్కువై ఇన్పుట్ ఖర్చులు 10 - 15 శాతం వరకూ తగ్గుతాయి. అంటే రసాయన ఎరువులు, క్రిమి, కీటకనాశినుల వాడకం తగ్గుతుందని అర్థం. పంటలు మార్చి మార్చి సాగు చేయడం వల్ల చీడపీడలకు అవకాశాలూ తగ్గుతాయి. ఒకే రకమైన పంట సాగు చేస్తూంటే చీడపీడలు కూడా వాటికి అలవాటు పడిపోతాయి కాబట్టి సమస్య ఎక్కువవుతుంది. ఉదాహరణకు వరికి సోకే కాండం తొలుచు పురుగు కాయధాన్యాల మొక్కలపై జీవించలేదు. వరి తరువాత ఈ కాయధాన్యాల సాగు చేస్తే సహజసిద్ధంగా చీడపీడల సమస్య తగ్గిపోతుంది. దేశంలో వ్యవసాయంపైనే ఆధారపడిన అరవైశాతం గ్రామీణుల జీవనోపాధి అవకాశాలను పెంచేందుకు, ఆహార భద్రతకు పంట మార్పిడి అన్నది ఎంతో ఉపయోగపడుతుంది. భూసారం, దిగుబడులు పెంచే పంటమార్పిడి గ్రామీణ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమయ్యేందుకు తద్వారా ఉపాధి అవకాశాలను పెంచేందుకు కారణమవుతుంది. ఆసక్తి లేదు ఎందుకు?తెలుగు రాష్ట్రాల్లో రైతులు పంటమార్పిడిపై అంతగా ఆసక్తి చూపకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. మొదటిది పంట మార్పిడి వల్ల వచ్చే ప్రయోజనాలపై అవగాహన లేకపోవడమైతే.. రెండోది పంట మార్పిడి ప్రయోజనాలపై తగిన ప్రచారం లేకపోవడం. వ్యవసాయ, హార్టికల్చర్ విస్తరణాధికారులు ఇతర బాధ్యతలు నిర్వర్తించరావడం వల్ల వారు రైతులకు పూర్తిగా అందుబాటులో లేకుండా పోయారు. ఇక మూడో కారణం మార్కెట్, ఆర్థిక పరిమితులు. పంటల మార్పిడి వల్ల వేర్వేరు పంటల విత్తనాలు, ఎరువులు, కొన్నిసార్లు వ్యవసాయ పరికరాల అవసరమూ ఏర్పడుతుంది. ఇవి రైతులపై కొంత ఆర్థిక భారం మోపే అవకాశం ఉంటుంది. పైగా అన్ని రకాల పంటలకు మద్దతు ధర లభించని నేపథ్యంలో రైతులు పంట మార్పిడిపై ఆసక్తి చూపడం లేదు. చివరగా.. ఒకే రకమైన పంటలు వేయడం (మోనోక్రాపింగ్) అనే సంప్రదాయానికి రైతులు గుడ్ బై చెప్పాలి. రిస్క్ తక్కువన్న అంచనాతో అప్పటివరకూ ఇతరులు పాటిస్తున్న పద్ధతులను గుడ్డిగా అనుసరించడం వల్ల పంట మార్పిడికి ధైర్యం చేయలేకపోతున్నారు. గ్రామస్థులంతా మూకుమ్మడిగా పంట మార్పిడి తీర్మానం చేసుకుని ఆచరిస్తే బహుళ ప్రయోజనాలు కలుగుతాయి.చేయాల్సింది ఇది...రైతులందరూ పంట మార్పిడిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరమెంతైనా ఉంది. అలాగే పైలెట్ ప్రోగ్రామ్‌తోపాటు డెమాన్స్ట్రేషన్ల ద్వారా వ్యవసాయ అధికారులు పంట మార్పిడి లాభాలు రైతుకు అర్థమయ్యేలా వివరించాలి. సీజన్‌ను బట్టి మారిపోయే పంటలకు తగ్గట్టుగా నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. కాయధాన్యాలు, పప్పుధాన్యాలతోపాటు నూనెగింజల పంటల విత్తనాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అంతేకాకుండా.. మద్దతు ధరలు దక్కేలా చూడటం. మార్కెట్ ఒడిదుడుకులను వీలైనంత మేరకు తగ్గించడం ద్వారా రైతులు పంట మార్పిడిపై ఆసక్తి చూపేలా చేయాలి. చివరగా..విధానపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా పంటల మార్పిడి అనేది దేశంలో లక్షలాది రైతు కుటుంబాల ఆదాయాన్ని పెంచే, ఆహార భద్రత కల్పించే సాధనంగా మారుతుంది!తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం...తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వరి, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి పంటల సాగు ఎక్కువ. ఒక్క తెలంగాణలోనే సుమారు 65 లక్షల ఎకరాల్లో వరి పండిస్తూండగా వార్షిక దిగుబడి కోటీ అరవై లక్షల టన్నుల వరకూ ఉంది. అలాగే తెలంగాణలో మొక్కజొన్న సాగు 28 లక్షల ఎకరాల్లోనూ, వేరుశనగ దాదాపు అరవై వేల ఎకరాల్లోనూ సాగులో ఉంది. రైతులందరూ పంట మార్పిడి చేపట్టడం ద్వారా దిగుబడులు పెరగడంతోపాటు సాగునీటిపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. -
వంటింటి వ్యర్థాలతో ఇంట్లోనే కంపోస్ట్ ఎరువు తయారీ ఎలా?
వంట గదిలో కూరగాయలు, పండ్ల తొక్కలు, వ్యర్థాల నుండి ఇంట్లోనే తయారు చేసుకోగలిగే కంపోస్ట్ ఎరువు ఇంటిపంట మొక్కలకు సులభంగా, త్వరగా పోషకాలను అందిస్తుంది. అంతేకాదు, ఇది అద్భుతమైన ఎరువు కూడా.మూత ఉండే డస్ట్ బిన్‌కు చుట్టూ బెజ్జాలు పెట్టి గాలి పారాడేలా (ఎరేటెడ్ బిన్) చేస్తే చాలు. అందులో వంటగది వ్యర్థాలను ప్రతి రోజూ వేస్తూ ఉండాలి. వారానికోసారి ఆ చెత్తపైన కాస్త మట్టిని చల్లి, కదిలియ తిప్పండి. తడి వ్యర్థాలతోపాటు కొన్ని ఎండిన ఆకులు లేదా చిత్రిక పట్టిన చెక్క వ్యర్థాలు వంటివి కూడా కలపాలి. తడి, పొడి చెత్త కలిపి వేయాలి. కొంచెం శ్రద్ధ, తగుమాత్రం తేమ ఉండేలా చూసుకుంటూ ఉంటే వాసన, పురుగులు రాకుండా చూసుకోవచ్చు. గాలి తగులుతూ ఉండే బిన్లో చేసిన కం΄ోస్టు కాబట్టి దీన్ని ఏరోబిక్ హోమ్ కంపోస్టు అంటున్నాం. వంటింటి వ్యర్థాలను, ఎండు ఆకులను మున్సిపాలిటీ వాళ్లకు ఇవ్వకుండా.. వాటితో ఇంటి దగ్గరే మనం తయారు చేసే కం΄ోస్టు వల్ల భూగోళాన్ని వేడెక్కించే కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. ప్రతి కిలో కం΄ోస్టుకు 3.8 కిలోల ఉద్గారాల విడుదలను నిరోధించిన వాళ్లం అవుతాం. ఈ పని మన భూమికి మంచిది!ఇదీ చదవండి: హెల్దీ సంచోక్స్ : లాభాలు అన్నీ ఇన్నీ కావు! -
ఆరు పంటలకు ‘మద్దతు’
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైతన్నలకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర సర్కారు తీపి కబురు అందించింది. 2025–26 మార్కెటింగ్ సీజన్‌కు గాను ఆరు పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) పెంచుతూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఉద్యోగులకు కరువు భత్యాన్ని(డీఏ) మరో 3 శాతం పెంచింది. దీంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమైంది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. గోధుమలు, ఆవాలు, మైసూరు పప్పు, శనగలు, పొద్దుతిరుగుడు గింజలు, బార్లీ పంటలకు మద్దతు ధర పెంచినట్లు తెలిపారు. రబీ పంట సీజన్‌కు సంబం«ధించి నాన్–యూరియా ఎరువులకు రూ.24,475 కోట్ల రాయితీ ఇస్తున్నట్లు వివరించారు. రైతుల ఆదాయం పెంచడమే ధ్యేయంగా ‘పీఎం అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్’కు రూ.35 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు వివరించారు. పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు త్వరలో జరగబోయే పలు రాష్ట్రాల అసెబ్లీ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. నరేంద్ర మోదీ పాలనలో రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని చెప్పారు. మోదీ ప్రభుత్వం పట్ల రైతన్నలు సానుకూలంగా ఉన్నారని వివరించారు. రూ.2,642 కోట్లతో చేపట్టనున్న వారణాసి–పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ(డీడీయూ) మల్టీ–ట్రాకింగ్ పాజెక్టుకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వారణాసిలో గంగా నదిపై రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు తెలిపారు. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఆరు రకాల రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. కనీస మద్దతు ధర పెంచినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. రైతాంగం సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు దీపావళి కానుక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. వారికి కరువు భత్యం 3 శాతం పెంచుతూ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ పెంపు ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. దీనికారణంగా కేంద్ర ఖజానాపై రూ.9,448 కోట్ల భారం పడనుందని వెల్లడించారు. డీఏ పెంపుతో దాదాపు కోటి మందికిపైగా ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందుతారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో డీఏ 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వచి్చంది. ప్రస్తుతం దేశంలో 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 64.89 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. -
జన్యు మార్పిడి పంటలతో ప్రజారోగ్యానికి ముప్పు
సాక్షి, హైదరాబాద్: జన్యు మార్పిడి పంటల మూలంగా ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి ప్రమాదం వాటిల్లుతుందని దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ చైర్మన్ సుంకేట అన్వే‹Ùరెడ్డి అధ్యక్షతన జన్యు మార్పిడి పంటలపై దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘం నాయకులతో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ జాతీయ నాయకులు కోదండరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, రైతు స్వరాజ వేదిక సంఘం ప్రతినిధులు కవిత, కె.రవి, తమిళనాడు రైతు సంఘం ప్రతినిధులు పీఎన్ పాండ్యన్, సుందర విమల నందన్, కర్ణాటక రైతు సంఘం ప్రతినిధి బాలకృష్ణన్, కేరళ రైతు సంఘం ప్రతినిధులు కేవీ బిజు, ఉష, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ రైతు సంఘం నాయకులు సాగర్, భారతీయ కిసాన్ సంఘం ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాదాపు 40 రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.మన ఆహారం, వ్యవసాయంలో జన్యు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించవద్దని వారు కోరారు. ప్రజలందరితో, వివిధ వర్గాలతో, ప్రత్యేకంగా రైతులు, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి జన్యుమార్పిడి పంటలపై జాతీయ విధానాన్ని రూపొందించాలని భారత ప్రభుత్వానికి ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన దరిమిలా ఈ సదస్సు జరిగింది.ఈ జన్యు మార్పిడి విత్తనాల వలన రైతు విత్తన స్వాతంత్రం కోల్పోవడంతో పాటు విత్తనం కార్పొరేట్ రంగాల చేతుల్లోకి వెళ్తుందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై దేశవ్యాప్తంగా రైతులతోపాటు వినియోగదారులను సైతం కలుపుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జన్యు మార్పిడి పంటల ఆలోచన విధానానికి స్వస్తి పలికేలా ముందుకు సాగుతామని నిర్ణయించారు. స్వావలంబన, ఆరి్థక నష్టాలు, రైతుల పైన భారం, పర్యావరణ విధ్వంసం కలిగించే జన్యుమార్పిడి పంటలను అనుమతించబోమని ఏకగ్రీవంగా తీర్మానించారు. -
చపాటా మిర్చికి త్వరలో జీఐ ట్యాగ్!
సాక్షి, సిద్దిపేట: ఒక ప్రాంతంలో పండించే పంటలకు, ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) లభిస్తే అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం లభిస్తుంది. రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పటివరకు రాష్ట్రానికి చెందిన 17 రకాల ఉత్పత్తులు జీఐ గుర్తింపు పొందాయి. మరిన్ని ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ కోసం కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం కసరత్తు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో త్వరలో వరంగల్ చపాటా మిర్చికి జీఐ గుర్తింపు లభించే అవకాశం ఉంది. వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూగెం, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో చపాటా మిర్చిని పండిస్తున్నారు.సుమారు 7 వేల ఎకరాల్లో దీని సాగు జరుగుతోంది. పంటను వరంగల్, ఖమ్మం, గుజరాత్, ముంబై, ఆహ్మదాబాద్ మార్కెట్లకు తరలించి అక్కడి నుంచి వియత్నాం, థాయ్‌లాండ్, మలేషియా, ఇంగ్లండ్, అమెరికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆహారంలో కృత్రిమ రంగును నిషేధించిన దేశాల్లో ఈ చపాటా మిర్చికి ఎక్కువ డిమాండ్ ఉంది. కృత్రిమ రంగులకు ప్రత్యామ్నాయంగా ఈ చపాటా మిర్చిని ఉపయోగిస్తారు. ఇందులో నుంచి ఓల్యూరోసిస్ అనే ఎరుపు రంగు ద్రావణాన్ని తీసి ఫుడ్ కలర్‌గా వినియోగిస్తారు. మన దగ్గర వీటిని ఎక్కువగా పచ్చళ్ల తయారీలో వినియోగిస్తారు.తిమ్మంపేట చిల్లి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ నర్సంపేట, వరంగల్, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ పంటకు జీఐ ట్యాగ్ కోసం 2022లో దరఖాస్తు చేశాయి. ఎంత మంది రైతులు దీనిని పండిస్తున్నారు. దీని వలన లాభాలు తెలుపుతూ పలు అంశాలతో కూడిన నివేదికను చెన్నైలోని జీఐ కార్యాలయంలో అందజేశారు. ఈ క్రమంలో ఈ నెలలో రైతులతో చెన్నైలో జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. సాగు విధానం, ఉపయోగాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తి అయితే చపాటా మిర్చికి జీఐ ట్యాగ్ లభించే అవకాశం ఉంది. సాధారణ మిర్చిని క్వింటాల్ రూ.8 వేల నుంచి రూ.18 వేల వరకు విక్రయిస్తుండగా..చపాటా మిర్చి రూ.30 వేల నుంచి 35 వేలు పలుకుతుంది.మరికొన్ని పంటలకు కూడా..⇒ ఆర్మూరు పసుపునకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనికి జీఐ ట్యాగ్ సాధించేందుకు తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇందుకు నాబార్డు సహకరిస్తోంది. దశాబ్దాలుగా ఈ ప్రాంత రైతులు ప్రధాన పంటగా పసుపును సాగు చేస్తున్నారు. జీఐ ట్యాగ్ పొందితే ఎగుమతులు పెరిగే అవకాశాలున్నాయి. అధిక ధరలు పలకడంతో రైతులకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది. ఇక రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ సీతాఫలాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి ఇతర జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు, ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తుంటారు. దీనికి జీఐ ట్యాగ్ కోసం కూడా ఉద్యాన వర్సిటీ కసరసత్తును ప్రారంభించింది. వర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. అలాగే కొల్లాపూర్ మామిడి, జగిత్యాల పొడుగు బీరకాయలు, నల్లగొండ పచ్చడి దోసకాయలు, నిజామాబాద్ గుత్తి బీరకాయలు సైతం జీఐ గుర్తింపు కోసం దరఖాస్తు ప్రక్రియలో ఉన్నాయి. ప్లాంట్ అథారిటీలో నల్లగొండ పచ్చడి దోసకాయను నమోదు చేయించేందుకు ఉద్యాన వర్సిటీ దరఖాస్తు చేయించింది. నమోదు జరిగితే ఈ దోసకాయకు చట్టబద్ధమైన రక్షణ ఉంటుంది.జీఐ ట్యాగ్ ఉన్న 17 ఉత్పత్తులివే..పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ ఫిలిగ్రీ, గద్వాల చీరలు, నిర్మల్ బొమ్మలు, చేర్యాల నకాశి కళ, నిర్మల్ ఫర్నిచర్, నారాయణపేట చీరలు, పుట్టపాక తేలియా రుమాలు, గొల్లభామ చీరలు, ఆదిలాబాద్ డోక్రా ఇత్తడి బొమ్మలు, వరంగల్ డర్రీస్, నిర్మల్ చిత్రాలు, తాండూరు కందిపప్పు, పాతబస్తీ లక్కగాజులు, హైదరాబాద్ హలీం, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, బంగినపల్లి మామిడి ఉన్నాయి.ఎన్నో ప్రయోజనాలుజీఐ ట్యాగ్‌తో పంటల ఎగుమతులు పెరిగేందుకు, అధిక ధరలు లభించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా రైతులకు మేలు జరుగుతుంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో పాటు ఆర్థిక వృద్ధికి తోడ్పతుంది. ఈ ఉత్పత్తులను ఇతరులు అనధికారికంగా ఉపయోగించడాన్ని నిరోధిస్తుంది. – నీరజ ప్రభాకర్, వీసీ, తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం -
అన్నదాతలకు అపార నష్టం
సాక్షి, అమరావతి: కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా నది, బుడమేరుకు పోటెత్తిన వరదలు తోడవటంతో రైతుల ఆశలన్నీ గల్లంతయ్యాయి. గడచిన 10 రోజులుగా లక్షలాది ఎకరాల్లో పంటలన్నీ ముంపు నీటిలో చిక్కుకోవడంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు విలవిల్లాడిపోతున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 16 జిల్లాల పరిధిలో 5.03 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 4,53,845 ఎకరాల్లో వ్యవసాయ, 12 జిల్లాల పరిధిలో 49,340 ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపునకు గురైనట్టు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 365 మండలాల్లో 2,475 గ్రామాల పరిధిలో 2.50 లక్షల మంది రైతులు ముంపు ప్రభావానికి గురైనట్టుగా లెక్కతేల్చారు.వరి పంటకు ఎనలేని నష్టంకృష్ణా నదీ పరివాహక ప్రాంతాలైన ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అత్యధిక విస్తీర్ణంలో పంటలకు అపారమైన నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. ఆయా జిల్లాల్లో వరి పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అత్యధికంగా 3.50 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతినగా.. ఆ తర్వాత పత్తి, మొక్కజొన్న, అపరాలు, చిరుధాన్యాలు, మిరప, అరటి, పసుపు, కంద, నిమ్మ, కూరగాయలు, ఉల్లి, ఆయిల్‌పామ్, బొప్పాయి, పూలు, కొబ్బరి తదితర పంటలు దెబ్బతిన్నాయి. ఇసుక మేటలు వేయడం ద్వారా 525 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా.. కృష్ణా జిల్లాలో 140 ఎకరాల్లో మల్బరీ తోటలకు నష్టం వాటిల్లింది. పాడి, మత్స్య రైతులకు తీవ్ర నష్టంఓ మత్స్యకారుడు మృతి చెందగా.. 83 బోట్లు పూర్తిగాను, 202 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నట్టు మత్స్య శాఖ గుర్తించింది. 349 మోటర్ బోట్లు పూర్తిగా దెబ్బతినగా.. 2,440 వలలు ధ్వంసమయ్యాయి. 10వేల హెక్టార్లలో ఫిష్ సీడ్ ఫామ్స్, ఇసుక మేటలు వేయడం వల్ల 18 వేల హెక్టార్లలో చేపల చెరువులు దెబ్బతిన్నాయి. పశు సంవర్ధక శాఖకు సంబంధించి 10 జిల్లాల పరిధిలో 116 పశువులు, 340 మేకలు, గొర్రెలు, 5 ఎద్దులు, 32 దూడలతో పాటు 71,639 కోళ్లు చనిపోగా, 92 పశువుల షెడ్లు కూలిపోయినట్టు లెక్కతేల్చారు. అత్యధికంగా కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, ఏలూరు జిల్లాల పరిధిలోని 73 మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ జిల్లాల పరిధిలో 46,826 పశువులపై తీవ్ర ప్రభావం చూపింది. వ్యవసాయ పంటలకు రూ.301.35 కోట్ల నష్టంఎస్డీఆర్ ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్) నిబంధనల ప్రకారం ప్రాథమికంగా వ్యవసాయ పంటలకు రూ.301.35 కోట్లు, ఉద్యాన పంటలకు, రూ.40.97 కోట్లు, మత్స్య శాఖకు రూ.141.90 కోట్లు, సెరీ కల్చర్‌కు రూ.2.68 కోట్లు, పశు సంవర్ధక శాఖకు రూ.66.60 నష్టం వాటిల్లినట్టు లెక్కతేల్చారు. కాగా.. తుది నష్టం అంచనాలకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ నెల 10వ తేదీలోగా పంట నష్టం అంచనాలు రూపొందించి, 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సోషల్ ఆడిట్ కింద రైతు సేవా కేంద్రా(ఆర్బీకే)ల్లో జాబితాలు ప్రదర్శించనున్నారు. 18న తుది అంచనాల జాబితాలను ప్రదర్శిస్తారు. -
Heavy Rains: వరద విధ్వంసం
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: మూడు రోజుల పాటు కురిసిన కుండపోత వానలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాయి. వందల గ్రామాలకు వెళ్లే రహదారులు కొట్టుకుపోయాయి. అనేక చోట్ల చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి. లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఏకబిగిన కురిసిన వానలతో జనావాసాల్లోకి వరదలు పోటెత్తడంతో వేలాది ఇళ్లు నీటమునిగాయి. సామగ్రి, నిత్యావసరాలు పాడైపోయాయి. ద్విచక్రవాహనాలు, కార్లు దెబ్బతిన్నాయి. సోమవారం మధ్యాహ్నం సమయానికి వర్షాలు తగ్గుముఖం పట్టినా.. వరదలు ఇంకా తగ్గలేదు. ఈ క్రమంలో పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఖమ్మం జిల్లాలో తొలిసారిగా డ్రోన్ల సాయంతో వరదలో చిక్కుకున్న ప్రజలకు ఆహార పొట్లాలను అందించారు. భారీ వర్షాలతో ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో ఎక్కువ నష్టం జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కలసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లాల ఇన్చార్జి మంత్రులు తమ జిల్లాల్లో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 110 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి.. 4వేల మందిని వాటిలోకి తరలించారు. ఖమ్మం సర్వం మున్నేరార్పణం భారీ వరదలతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు పరీవాహక ప్రాంతం అల్లకల్లోలమైంది. వరద తాకిడితో పదులకొద్దీ ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వందలాది ఇళ్ల పైకప్పులు, గోడలు కూలిపోయాయి. ఇళ్లలో ఉన్న వస్తువులతోపాటు ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా కొట్టుకుపోయాయి. ఒక్కసారిగా వచ్చిన వరదతో లోతట్టు ప్రాంత ప్రజలు కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు చేరారు. ఖమ్మం నగరంతోపాటు పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మంరూరల్ మండల పరిధిలో ఇళ్లు దెబ్బతిన్నాయి. ఫ్రిడ్జ్‌లు, టీవీలు, ఇతర ఎల్రక్టానిక్ సామాగ్రి తడిసి దెబ్బతిన్నాయి. ఖమ్మంలోని మోతీనగర్‌లో ఓ కుటుంబం దాచుకున్న బంగారం, డబ్బులు వరదనీటిలో కొట్టుకుపోయాయి. ఎఫ్‌సీఐ గోడౌన్ వద్ద 250కిపైగా లారీలు నీట మునిగిపోయాయి. ఒక్కో లారీ మరమ్మతుకు రూ.లక్షకుపైగా ఖర్చవుతుందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాలోని ఆకేరు వాగు పొంగి తిరుమలాయపాలెం మండలాన్ని ముంచెత్తింది. పాలేరు వరదతో కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఖమ్మం నగరంలో రామన్నపేట, వెంకటేశ్వరనగర్, పద్మావతినగర్, సారథినగర్, మామిళ్లగూడెం, బొక్కలగడ్డ, కాల్వొడ్డు, నయాబజార్, మంచికంటి నగర్, మోతీనగర్, పెద్దమ్మతల్లిగుడి రోడ్డు, ప్రకాశ్‌నగర్, దంసలాపురం కాలనీ.. ఖమ్మంరూరల్ మండలంలోని పోలేపల్లి, సాయిగణే‹Ùనగర్, కరుణగిరి, పెద్దతండా ప్రాంతాలు, చింతకాని, ముదిగొండ, మదిర, ఎర్రుపాలెం మండలాల్లోని పలు గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగింది. మున్నేరు వరద తగ్గడంతో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రోడ్లపై ఉన్న బురదను తొలగిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులు ఇళ్లకు చేరుకొని అన్నీ శుభ్రం చేసుకుంటున్నారు. యంత్రాంగం విఫలమవడంతోనే.. మున్నేరు వరద విషయంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది కూడా జూలై 26 అర్ధరాత్రి నుంచి రెండు రోజుల పాటు మున్నేరు పరీవాహక ప్రాంతాన్ని వరద ముంచింది. ఆ సమయంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ, పునరావాస కేంద్రాలకు తరలించారు. కానీ ఈసారి అదే తరహాలో మున్నేరుకు భారీ వరద వస్తున్నా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారని స్థానికులు మండిపడుతున్నారు. జల విలయంలోనే మహబూబాబాద్! భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో, అందులోనూ మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విధ్వంసం జరిగింది. నెల్లికుదురు మండలం రావిరాల మొదలుకొని వందలాది గ్రామాలు నీట మునిగాయి. చాలా గ్రామాల చుట్టూ ఇంకా వరద కొనసాగుతుండటంతో జలదిగ్బంధంలోనే ఉండిపోయాయి. ప్రజలు ఇళ్లలో తడిసిపోయిన సామగ్రిని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేరుకొని తొగరాయ్రి, కూచిపూడి గ్రామాలు సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో అంతర గంగ వరదతో కకావికలమైన తొగర్రాయి, కూచిపూడి గ్రామాలు సోమవారం కూడా తేరుకోలేదు. ఆ రెండు గ్రామాలు 70శాతానికిపైగా మునగడంతో.. ప్రజలు నిత్యవసర వస్తువులతోపాటు పంట పొలాలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారు. తొగýర్రాయి, కూచిపూడి, గణపవరంలలో వెయ్యికి పైగా వ్యవసాయ మోటార్లు కొట్టుకుపోయినట్టు రైతులు వాపోతున్నారు. కోదాడ మండలంలో తీవ్రంగా నష్టపోయిన తొగర్రాయి, కూచిపూడి గ్రామాలను ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి సోమవారం సందర్శించారు. ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. మిగిలింది కట్టుబట్టలే! ఈ ఫొటోలో కనిపిస్తున్నది సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం నారాయణపురం చెరువు పక్కన ఉన్న మోహనరావు ఇల్లు. ఇంటి ముందు ఎయిర్ కంప్రెషర్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. శనివారం సాయంత్రం భారీ వర్షాలతో చెరువు కట్ట తెగడంతో నీరంతా ఒక్కసారిగా ముంచెత్తింది. మోహన్‌రావు, ఆయన భార్య, ఇద్దరు కుమారులు దూరంగా పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ ఇల్లు దెబ్బతిన్నది, సామగ్రి అంతా కొట్టుకుపోయింది. తమకు కట్టుబట్టలే మిగిలాయని మోహనరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ఇల్లు చూసినా ఇదే దుస్థితి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో వరద బీభత్సానికి అన్ని ఇళ్లలో బియ్యం, నిత్యావసరాలు, ఇతర సామగ్రి అంతా తడిసి పాడైపోయాయి. ‘‘తినడానికి తిండి గింజలు లేకుండా పోయి బతకలేని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఆదుకుని నిరుపేద కుటుంబాలను చేరదీయాలి’’ అని గ్రామానికి చెందిన రాస యాకన్న ఆవేదన కోరుతున్నాడు. తడిసిపోయిన బియ్యాన్ని బయటపడేస్తూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఫారంలో ఒక్క కోడీ మిగల్లేదు.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో బెజ్జం సమ్మయ్య, ఎస్కే అమీర్ కలిసి కోళ్లఫారం నడుపుతున్నారు. ఆదివారం భారీ వర్షంతో ఫారంలోకి వరద ముంచెత్తింది. ఒక్కటీ మిగలకుండా రెండున్నర వేల కోళ్లు మృతి చెందాయి. ‘‘ఒక్కో కోడి కేజీన్నర బరువుదాకా పెరిగింది. నాలుగైదు రోజుల్లో కంపెనీ వారికి అప్పగించాల్సి ఉంది. అలాంటిది నోటిదాకా వచ్చిన కూడును వరద లాగేసింది..’’ అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పొలాల నిండా.. కంకర, ఇసుక మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరి రోడ్డుకు సమీపంలోని వరిచేన్లలో వేసిన కంకర, ఇసుక మేటలివి. ఇటీవల ఇక్కడ రోడ్డు పనులు ప్రారంభించారు. దానికోసం తెచ్చిన కంకర, ఇసుక అంతా వరదకు కొట్టుకొచ్చి పొలాల్లో చేరింది. తిరిగి పొలాన్ని బాగు చేసుకోవాలంటే చాలా ఖర్చవుతుందని రైతులు వాపోతున్నారు. -
లక్షల ఎకరాల్లోని పంటలు వరదలోనే...
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో కుండపోత వర్షాలు, వరదలకు లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రెండు మూడు రోజులుగా పంటలన్నీ నీళ్లలోనే నానుతున్నాయి. అన్ని జిల్లాల్లో కలిపి 15 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు నీటమునిగినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. అందులో 4.15 లక్షల ఎకరాల మేర నష్టం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. పంట నష్టం జరిగిన రైతులకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో త్వరలో పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేస్తామని అధికారులు అంటున్నారు. వరి రైతు విలవిల.. వరదల వల్ల వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది సహా ఇతరత్రా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షాల దెబ్బకు అధికంగా మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, నల్లగొండ, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం జిల్లాల్లో పంటలు నీటమునిగాయి. నాట్ల దశలోనే వరి ఉండటంతో రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లనుంది. పెరగనున్న చీడపీడల బెడద.. ఆధిక వర్షాల వల్ల వివిధ పంటల్లో కొన్ని రకాల చీడపీడల ఉధృతి అధికంగా ఉంటుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న వరి, పత్తి, మొక్కజొన్న, సోయాచిక్కుడు, కంది, పెసర, మినుము వంటి పంటల్లో ప్రస్తుతం ఉన్న దశలో కొన్ని రకాల చీడపీడలు ఆశించే అవకాశం ఉందన్నారు. వరి పంట పసుపు రంగులోకి మారుతుందని.. కొనల నుంచి తెల్లటి చారలు ఏర్పడతాయన్నారు. అలాగే పత్తిలో పచ్చ దోమ అధికమవుతుందని.. ఎండు తెగులు కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉందన్నారు. సోయా చిక్కుడు పంట కాత దశలో ఉన్నందున వేరుకుళ్ల, ఎండు తెగులు ఆశించే అవకాశం, కాయలుపై పక్షి కన్ను తెగులు, ఆకులపై కొన్ని రకాల శిలీంద్రాల వల్ల ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వివిధ జిల్లాల్లో వరద నష్టం ఇలా.. ⇒ ఖమ్మం జిల్లాలో ఆకేరు, పాలేరు పొంగిపొర్లడం, మున్నేరు, వైరాకు భారీ వరద పోటెత్తడంతో వేలాది ఇళ్లు నీట మునిగాయి. కొన్ని ఇళ్లు కూలాయి. 37,716 మంది రైతులకు చెందిన 57,410 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలో మొత్తం రూ. 11,99,65,000 వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా 38 చెరువులు ఉప్పొంగాయి. 180 వరకు చేపల చెరువులు పొంగిపొర్లాయి. దీంతో సుమారు రూ. 4.20 కోట్ల విలువైన 3,500 టన్నుల మత్య్స సంపదకు నష్టం జరిగింది. ఏదులాపురం సెక్షన్లో 11 కేవీ టవర్, 1,935 స్తంభాలు దెబ్బతిన్నాయి. నాలుగు సబ్స్టేషన్లలో నీరు నిలిచింది. ⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 60 వేల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. మహబూబాబాద్ జిల్లాలో 78, జనగామలో 8, వరంగల్‌లో 2, జయశంకర్ భూపాలపల్లిలో 8, ములుగులో 6, హనుమకొండలో 2 చెరువులు కలిపి మొత్తం 104 చెరువులకు గండ్లు పడ్డాయి. ⇒ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరదల్లో చిక్కుకొని ఇద్దరు మరణించగా వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా ప్రకారమే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 22,344 ఎకరాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. సూర్యాపేట జిల్లాలో 23 చోట్ల రోడ్లు తెగిపోగా, 35 రోడ్లు దెబ్బతిన్నాయి. మరో 15 చెరువుల కట్టలు తెగిపోయినట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది. ⇒ ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా 7,746 ఎకరాల్లో వరి, పత్తి, వేరుశనగ తదితర పంటలకు నష్టం వాటిల్లింది. సుమారు 140 వరకు ఇళ్ల ధ్వంసమవగా 10 ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురయ్యాయి. ⇒ ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారు 2 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. కాలువలకు గండి పడింది. అక్కడక్కడ కుంటల కట్టలు తెగిపోయాయి. గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 4 ఎకరాల్లో ఇసుక మేటలు నాకు 13 ఎకరాలు పొలం ఉంది. మరో 16 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. మొత్తం వరి సాగు చేశా. ఇప్పటికే ఎకరానికి రూ. 20 వేల చొప్పున పెట్టుబడి పెట్టా. భారీ వర్షాల కారణంగా పోతిరేణికుంట చెరువు నీరంతా 4 ఎకరాల పొలాన్ని ముంచెత్తడంతో ఇసుక మేటలు వేశాయి. కొన్నిచోట్ల పొలం కోతకు గురైంది. – దేవరం ప్రభాకర్‌రెడ్డి, రైతు, హుజూర్నగర్, సూర్యాపేట జిల్లాదిగుబడి బాగా వస్తుందనుకుంటే.. ఇసుక మేటలు వేసిన పొలం మధ్య నిలబడిన ఈయన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటకు చెందిన రైతు బేతమల్ల రమేశ్. బంధం చెరువు కింద 2.20 ఎకరాల్లో వరి సాగుచేశాడు. అప్పు తెచ్చి రూ. 80 వేల పెట్టుబడి పెట్టాడు. 40 రోజుల క్రితం నాట్లు వేయగా చేను ఏపుగా పెరిగింది. ఈసారి దిగుబడి బాగా వస్తుందని సంబురపడ్డాడు. కానీ భారీ వర్షాలతో బంధం చెరువుకు గండిపడి రమేశ్ పొలాన్ని ముంచెత్తింది. ఇసుకమేటలతో నిండిన తన పొలాన్ని చూసి రమేశ్ కన్నీటిపర్యంతమయ్యాడు. ఇప్పుడు ఇంకెక్కడి నుంచి అప్పు తేవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.రూ. 40 వేలు ఆకేరు పాలు ఈ రైతు పేరు రమావత్ శ్రీను. తిరుమలాయపాలెం మండలం రమణా తండాకు చెందిన ఈయన రూ. 40 వేల పెట్టుబడి ఖర్చుతో 2 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. జూన్ ప్రారంభంలోనే పత్తి గింజలు నాటగా పత్తి ప్రస్తుతం కాత దశలో ఉంది. మరో పంట నెలలో చేతికి అందుతుందని శ్రీను అనుకుంటుండగా ఆదివారం ఆకేరు వాగు ముంచెత్తడంతో చేనును ముంచెత్తింది. వరద తగ్గాక సోమవారం వెళ్లే సరికి పత్తి చేనులోని మొక్కలన్నీ నేలవాలి నామరూపాల్లేకుండా పోయాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక శ్రీను కన్నీరుమున్నీరవుతున్నాడు. -
మేలు చేసే కొత్త వంగడాలు
సాక్షి, అమరావతి: ఆధునిక బయో టెక్నాలజీ ద్వారా ఆహార పంటల పోషక నాణ్యతను మెరుగుపర్చే బయో ఫోర్టీఫైడ్ పంటలకు ప్రాముఖ్యత, ప్రాబల్యం పెరుగుతోంది. మొక్కల పెరుగుదల సమయంలోనే పంటలలో పోషక స్థాయిలను పెంచడం లక్ష్యంగా శాస్త్రవేత్తలు కొత్త వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు. దేశంలోని అగ్రో ఎకలాజికల్ జోన్స్‌కు అవసరమైన బయో ఫోర్టీఫైడ్ పంట రకాలను ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేసారు.వ్యాధులు, తెగుళ్లను తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే ఈ రకాలు అన్నదాతల పాలిట వరంగా మారనున్నాయి. వీటిలో వ్యవసాయ పంటల్లో 69 రకాలు, ఉద్యాన పంటల్లో 40 రకాలు ఉన్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్)తోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ విశ్వ విద్యాలయాలు అభివృద్ధి చేసిన రకాలు ఉన్నాయి. వీటిలో 34 రకాల వంగడాలు తెలుగు రాష్ట్రాల్లో సాగుకు అనువైనవి ఉన్నాయి. ఈ వంగడాల్లో 3 ఆంధ్రప్రదేశ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినవి కాగా, 5 రకాలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవి.జన్యుపరమైన లోపాలకు దూరంగా.. నూతన వంగడాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న వంగడాలతో పోలిస్తే ఈ కొత్త రకాలలో జన్యు పరమైన లోపాలు లేవని నిర్ధారించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకోగలవు. ఎరువులకు మెరుగైన రీతిలో స్పందిస్తాయి. తెగుళ్లు, వ్యాధులను సమర్ధంగా ఎదుర్కొంటాయి. పంట నాణ్యతతో పాటు ముందుగానే పరిపక్వం చెందుతాయి. అధిక పోషక విలువలతో అధిక ఆహార ఉత్పత్తిని, ఉత్పాదకతను కలిగి ఉండాయి.ఫలితంగా వీటి సాగు ద్వారా పర్యావరణ పరిరక్షణతో కూడిన వ్యవసాయం చేసేందుకు దోహద పడతాయని, వ్యవసాయ యోగ్యం కాని భూములు సైతం సాగులోకి తెచ్చేందుకు ఊతమిస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ వంగడాలు పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులోకి రావాలంటే కనీసం మూడేళ్లు పడుతుందని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో విడుదలైన వంగడాల్లో 34 రకాలు తెలుగు రాష్ట్రాలలో సాగుకు అనువైనవి. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి విడుదలైన 8 రకాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన మరో 26 రకాలు ఉన్నాయి. -
సాగు ఢమాల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం పంటల సాగు గణనీయంగా పడిపోయింది. రాష్ట్రమంతా వర్షాలు పూర్తి స్థాయిలో పడకపోవడం, చెరువులు, కుంటలు నిండకపోవడం, ఇటీవలి కాలం వరకు జలాశయాల్లో తగినంత నీరు లేకపోవడం..తదితర కారణాలతో పంటల సాగు విస్తీర్ణం భారీగా పడిపోయిందని వ్యవసాయశాఖ వర్గాలు విశ్లేíÙస్తున్నాయి. గత ఏడాది వానాకాలంలో ఇదే సమయానికి సాగైన పంటలతో పోలిస్తే, ఈసారి ఏకంగా 15.30 లక్షల ఎకరాల మేరకు సాగు తగ్గిపోయింది. ఈ వానాకాలం సీజన్లో 1.34 కోట్ల ఎకరాల్లో పంటల సాగు జరుగుతుందని పంటల ప్రణాళికలో వ్యవసాయశాఖ అంచనా వేసింది.అత్యధికంగా 66 లక్షల ఎకరాల్లో వరి, 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని పేర్కొంది. కానీ ఆశించిన స్థాయిలో సాగు జరగక పోవడం ఆందోళన కలిగిస్తోంది. రైతుభరోసా కింద పెట్టుబడి సాయం ఇవ్వకపోవడం, రుణమాఫీకి ముందు పంట రుణాలు ఇవ్వకపోవడం వంటి కారణాలు కూడా సాగు తగ్గడానికి కారణాలుగా రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే కొందరు రైతులు భూముల్ని కౌలుకు ఇవ్వకుండా వదిలేశారన్న చర్చ కూడా జరుగుతోంది. కౌలు రైతులకు పెట్టుబడి సాయం చేస్తే, తమకు రైతు భరోసా రాదని కొందరు రైతులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 8.79 లక్షల ఎకరాల మేర తగ్గిన వరి గతేడాది వానాకాలం సీజన్ ఇదే సమయానికి అన్ని పంటలు కలిపి 99.89 లక్షల (దాదాపు కోటి) ఎకరాల్లో సాగయ్యాయి. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 84.59 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు వేసినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే సాగు విస్తీర్ణం ఏకంగా 15.29 లక్షల ఎకరాల్లో విస్తీర్ణం తగ్గిందని వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వరి, పత్తి సాగు గణనీయంగా పడిపోయింది.గతేడాది వానాకాలంలో ఇదే సమయానికి 34.37 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడగా, ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 25.58 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. అంటే గతేడాదితో పోలిస్తే 8.79 లక్షల ఎకరాలు తగ్గింది. దీనిని బట్టి చూస్తే పంటల ప్రణాళిక ప్రకారం ఈ సీజన్లో 66 లక్షల ఎకరాల్లో సాగు సాధ్యమయ్యేలా కని్పంచడం లేదు. వరికి రూ.500 బోనస్ కేవలం సన్నాలకే ఇస్తామని ప్రభుత్వం చెప్పడం, ఆ వరి రకాల పేర్లను మొన్నమొన్నటి వరకు బహిరంగపరచకపోవడం, ఇప్పుడు వాటిని రైతులకు అందుబాటులో ఉంచకపోవడం తదితర కారణాలు ఏమైనా రైతులను గందరగోళపరిచాయా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. గతేడాది వానాకాలంలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగవడం గమనార్హం. పత్తి సాగూ తగ్గింది.. పత్తి విషయానికొస్తే.. గతేడాది ఇదే సమయానికి 44.32 లక్షల ఎకరాల్లో సాగవగా, ఈసారి కేవలం 41.65 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అంటే 2.67 లక్షల ఎకరాల మేర విస్తీర్ణం తగ్గిందన్నమాట. వాస్తవానికి పత్తి సాగును 60 లక్షల ఎకరాలకు పెంచాలని, వీలైతే 70 లక్షల ఎకరాలకు పెంచినా మంచిదేనన్న అభిప్రాయంతో వ్యవసాయ శాఖ ఉంది. ఆ మేరకు ప్రణాళికలు వేసుకుంది.కానీ కీలకమైన సమయంలో రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంలో విఫలమైంది. అనేకమంది రైతులు విత్తనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు గతేడాది పత్తి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకోవడంతో రైతులు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉండిపోయారని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. ఇక గతేడాదితో పోలిస్తే మొక్కజొన్న సాగు 93,635 ఎకరాల్లో, కంది 35,176 ఎకరాల్లో, సోయాబీన్ 72,744 ఎకరాల్లో తగ్గింది. వనపర్తి జిల్లాలో 20.59 శాతమే సాగు రాష్ట్రంలో అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో 20.59 శాతమే పంటలు సాగయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 32.02 శాతం, ములుగు జిల్లాలో 32.57 శాతం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 41.67 శాతం, రంగారెడ్డి జిల్లాలో 44.89 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో అత్యంత ఎక్కువగా పంటల సాగు నమోదు కావడం గమనార్హం. ఆ జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 5,62,098 ఎకరాలు కాగా, 5,63,481 ఎకరాల్లో సాగైంది. జిల్లాల వారీగా వరి, పత్తి సాగు ఇలా.. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వరి నాట్లు ఊపందుకోలేదు. నల్లగొండ జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 2.54 లక్షల ఎకరాల్లో నాట్లు పడగా, ఇప్పుడు కేవలం 79,085 ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. సూర్యాపేట జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 1.87 లక్షల ఎకరాల్లో నాట్లు పడగా, 97,087 ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో గతేడాది 2.21 లక్షల ఎకరాల్లో నాట్లు పడగా, ఇప్పుడు కేవలం 1.50 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. మెదక్ జిల్లాలో గతేడాది 2.49 లక్షల ఎకరాల్లో నాట్లు పడగా, ఇప్పుడు కేవలం 1.22 లక్షల ఎకరాల్లోనే పడ్డాయి.ఇదేవిధంగా కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగాం, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో నాట్లు గణనీయంగా తగ్గాయి. ఇక పత్తి నల్లగొండ జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 5.86 లక్షల ఎకరాల్లో సాగైతే, ఈ ఏడాది ఇప్పటివరకు 5.22 లక్షల ఎకరాలకే పరిమితమైంది. నాగర్‌కర్నూలు జిల్లాలో గతేడాది 2.41 లక్షల ఎకరాల్లో సాగైతే, ఇప్పుడు 1.89 లక్షల ఎకరాలకే పరిమితమైంది. నారాయణపేట జిల్లాలో గతేడాది 2.02 లక్షల ఎకరాల్లో సాగవగా, ఇప్పుడు 1.65 లక్షల ఎకరాలకే పరిమితమైంది. జనగామలో గతేడాది ఇదే సమయానికి 1.35 లక్షల ఎకరాల్లో సాగవగా, ఇప్పుడు కేవలం 97,225 ఎకరాల్లోనే సాగైంది. సంగారెడ్డి, పెద్దపల్లి, నిర్మల్ తదితర జిల్లాల్లోనూ పత్తి సాగు తగ్గింది. వర్షాల కోసం చూస్తున్నా.. నాకు నాలుగున్నర ఎకరాల సొంత పొలం ఉంది. ఏటా మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకుంటా. నాలుగున్నర ఎకరాల్లో మెట్ట పంటలు వేసి మిగతా 20 ఎకరాల్లో వరి సాగు చేస్తా. అయితే ముసురు వర్షాలకు కారణంగా ఇప్పటివరకు మూడెకరాల్లోనే వరి నాట్లు వేశా. మిగిలిన 17 ఎకరాల సాగుపై ఎటూ తోచడం లేదు. ప్రస్తుతానికైతే మరో పదెకరాల వరకు నారుమడి సిద్ధం చేసుకున్నా. కానీ ఇదే పరిస్థితి ఆగస్టు నెలాఖరు వరకు ఉంటే వేసిన మూడెకరాల వరి కూడా పండదు. అందుకే భారీ వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాం. – మల్లు వెంకటేశ్వర్‌రెడ్డి, మాచన్‌పల్లి, మహబూబ్‌నగర్ జిల్లా 15,131చెరువులు ఖాళీరాష్ట్రంలో 34,716 చెరువులు, కుంటలున్నాయి. అందులో 3,247 చెరువులు ఇటీవలి వర్షాలతో అలుగు పోస్తున్నాయి. 6,735 చెరువులు నిండుగా నీటితో కళకళలాడుతున్నాయి. 3,438 చెరువుల్లో 50 నుంచి 75% నీటి నిల్వలున్నాయి. 6,165 చెరువుల్లో మాత్రం 25 నుంచి 50% మాత్రమే నీరు చేరింది. 15,131 చెరువుల్లో నీటి నిల్వలు ఇంకా 25% లోపలే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ 61.34 శాతం చెరువుల్లో 50% కంటే తక్కువగానే నీటినిల్వలున్నాయి. -
మద్దతు ధర టీడీపీ, జేడీ(యూ)కేనా?
సాక్షి, న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధర కల్పించి, రైతన్నలకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు గురువారం పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శన చేపట్టారు. తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్) తదితర పార్టీల సభ్యులు పార్లమెంట్ మకర ద్వారం మెట్లపై గుమికూడారు. ఉల్లిపాయలు, కూరగాయల దండలను మెడపై ధరించి కేంద్ర ప్రభుత్వ తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. ‘పంటలకు కనీస మద్దతు ధర కల్పించండి’, ‘రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోండి’ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. శివసేన(ఉద్ధవ్) ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ... ‘‘తెలుగుదేశం పార్టీ, జేడీ(యూ)లకు బీజేపీ ప్రభుత్వం కనీస మద్దతు ధర(స్పెషల్ ప్యాకేజీ) అందించింది. అదే తరహాలో రైతులకు కూడా కనీస మద్దతు ధర అందించాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ సమానమేనని గుర్తించుకోవాలి. రైతులు దేశంలో ప్రధాన వాటాదార్లు. అందుకే వారికి మద్దతు ప్రకటిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. మహారాష్ట్ర నుంచి విదేశాలకు ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగేలా చూడడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. -
'ఇండ్ గ్యాప్' సాగు బాట.. రసాయనాల్లేని పంట!
రసాయనిక అవశేషాలు లేని నాణ్యమైన పంట దిగుబడులు పండించి ప్రజారోగ్యానికి పెద్దపీట వేసే దిశగా ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఇండియా గుడ్ అగ్రికల్చర్ ్రపాక్టీసెస్ (ఐ.జి.ఎ.పి.– ఇండ్ గ్యాప్) మంచి ఫలితాలనిస్తున్నాయి. అనేక మంది రైతులు గ్యాప్ పద్దతులకు అనుగుణంగా ఆహార పంటలు పండించేందుకు ఆసక్తి చూపుతున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని దశల వారీగా తగ్గిస్తూ, రసాయనిక అవశేషాల్లేని నాణ్యమైన, అధిక పంట దిగుబడుల ఉత్పత్తి సాధించటం ఇండ్ గ్యాప్ పద్ధతిలో ముఖ్యమైన అంశం.తుంగభద్ర సేంద్రియ వ్యవసాయ ధాన్య విత్తన రైతుల పరస్పర సహాయ సహకార సంఘంలో సభ్యులైన రైతులు గ్యాప్ పద్ధతులను ఆచరిస్తూ ఆదర్శంగా నిలిచారు. 2023–24లో కర్నూలు జిల్లాలోని సీ.బెలగల్ మండలం కొండాపురం (రంగాపురం), గుండ్రేవుల గ్రామాల్లోని 50 మంది రైతులు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. గ్యాప్ పద్ధతులనుపాటిస్తూ బీపీటీ 5204 రకం వరి పంటను సాగు చేశారు. రైతులు ఒక్కొక్కరు అరెకరం నుంచి మూడు ఎకరాల వరకు మొత్తం 24.09 హెక్టార్లలో గ్యాప్ పద్దతులకు అనుగుణంగా వరి పండించారు.గ్యాప్ నిబంధనల ప్రకారం వరి సాగు పూర్తిగా వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో జరిగింది. 10–15 రోజులకోసారి డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహించి రైతులకు గ్యాప్ పద్దతులపై అవగాహన కల్పించారు. కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, సి.బెలగల్ ఏవో మల్లేష్ యాదవ్, జిల్లా వనరుల కేంద్రం అధికారులు ప్రతి పొలంబడికి వెళ్లి పంటలను పరిశీలించి రైతులకు సూచనలు ఇస్తూ వచ్చారు.కొండాపురం, గుండ్రేవుల గ్రామాల్లోని 50 మంది రైతుల్లో ప్రతి రైతు 100 శాతం గ్యాప్ పద్దతులుపాటించారు. నాట్లకు ముందు సామూహికంగా పచ్చి రొట్ట ఎరువు పంట సాగు చేసి, పూత దశలో పొలంలో కలిపి దున్నేశారు. ఎకరాకు 3–4 టన్నుల పశువుల ఎరువు వేసుకున్నారు. కొందరు రైతులు వేపచెక్క, వర్మీ కంపోస్టు కలిపి వేసుకున్నారు. పురుగుల బెడదను తగ్గించుకునేందుకు ఎకరాకు 5–6 లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు ఏర్పాటు చేసుకున్నారు. సాధారణంగా రసాయనిక వ్యవసాయం చేసే రైతులు ఈ ్రపాంతంలో ఎకరానికి 6–8 బస్తాల రసాయనిక ఎరువులు వేస్తూ ఉంటారు.గ్యాప్ పద్ధతిలో 4 బస్తాల వరకు రసాయనిక ఎరువులు, అనుమతించిన కొన్ని పురుగుమందులను తగు మోతాదులో మాత్రమే ఉపయోగిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. పంట సాగు కాలంలో ఏపీ ఆర్గానిక్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ అధికారుల బృందం మూడు దఫాలు పరిశీలించింది. వరి కోతలు పూర్తి కాగానే మూడు శ్యాంపుల్స్ సేకరించి గుంటూరులోని వ్యవసాయ శాఖ ల్యాబ్‌కు పంపారు. అక్కడ జరిపిన పరీక్షల్లో రసాయనిక అవశేషాల ప్రభావం జీరో ఉన్నట్లు స్పష్టం కావడంతో సర్టిఫికేషన్ అథారిటీ ఈ సొసైటీ రైతులకు ఉమ్మడిగా ఇండ్ గ్యాప్ సర్టిఫికెట్‌ను 2024 జనవరిలో జారీ చేసింది. ఆ తర్వాత రైతులు వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి బియ్యాన్ని మంచి ధరకు అమ్ముకున్నారు.దిగుబడితో పాటు ధరా ఎక్కువే!అతిగా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడి ధాన్యం పండించిన రైతులు బియ్యం క్వింటాలు రూ.5,500 ప్రకారం విక్రయించుకుంటే, ఇండ్ గ్యాప్ సర్టిఫికెట్ పొందిన సహకార సంఘం రైతుల బియ్యానికి రూ.7,000 ధర లభించింది. మామూలుగా అయితే వరి సాగులో ఎకరాకు సగటున రూ. 45 వేల వరకు పెట్టుబడి వ్యయం అవుతుంది. ఇండ్ గ్యాప్ పద్ధతిలో ఖర్చు రూ.28 వేలు మాత్రమే. సగటున ఎకరాకు ధాన్యం దిగుబడి 2.51 క్వింటాళ్లు అదనంగా వచ్చింది. మొత్తం 50 మంది రైతులు 24.09 హెక్టార్లలో 102.9 టన్నుల దిగుబడి సాధించి రూ. 71 లక్షల ఆదాయం పొందారు. సాధారణ రసాయనిక వ్యవసాయ రైతులతో పోల్చితే ఇది రూ. 14.4 లక్షల అధికం కావటం విశేషం. ఈ స్ఫూర్తితో తుంగభద్ర సహకార సంఘం రైతులు ఈ ఏడాది కూడా గ్యాప్ పద్ధతిలోనే వరి సాగు కొనసాస్తున్నారు. – గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు (అగ్రికల్చర్)నికరాదాయం పెరిగింది..8 ఎకరాల వ్యవసాయం చేస్తున్నా. నేను 2.75 ఎకరాల్లో ఇండ్ గ్యాప్ పద్ధతిలో వరి సాగు చేశాను. మిగతా పొలంలో పత్తి, ఉల్లి, మొక్కజొన్న పంటలు సాధారణ పద్ధతిలోనే పండిస్తున్నాను. సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్తల సూచనలు చాలా ఏళ్లుగాపాటిస్తుండటంతో గ్యాప్ పద్ధతిని అనుసరించటం నాకు సులువైంది.వేప చెక్కను ఎక్కువగా వినియోగించడం, గో ఆధారిత పద్దతులుపాటించడం వల్ల పంట భూముల్లో సూక్ష్మ జీవులు విశేషంగా అభివృద్ది చెంది వరి పంట ఎదుగుదలకు తోడ్పడుతున్నాయి. కెమికల్స్ వాసన లేకుండా వరి పండించాను.మామూలుగా అయితే ఎకరాకు వరి సాగులో రూ.45–50 వేల వరకు పెట్టుబడి వ్యయం వస్తుంది. గ్యాప్ పద్ధతులుపాటించడం వల్ల ఎకరాకు రూ.28 వేలు చొప్పున 2.75 ఎకరాల్లో రూ. 77 వేలు ఖర్చయింది. 41 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. మిల్లింగ్ చేయగా 27 క్వింటాళ్ల బియ్యం వచ్చాయి. కర్నూలు తీసుకెళ్లి క్వింటా రూ.7,000కు అమ్మాను. క్వింటాకు రూ. వంద రవాణా ఖర్చు వచ్చింది. రూ.1.09 లక్షల నికరాదాయం వచ్చింది. మా సంఘంలోని 50 మంది రైతుల్లో క్వింటా బియ్యం రూ.7,500కి అమ్మిన వాళ్లూ కొందరు ఉన్నారు. ఈ ఏడాది కూడా గ్యాప్ పద్ధతిలోనే వరి సాగు చేస్తున్నాం. – పి.మధుసూదన్‌రెడ్డి (94900 96333), రైతు, కొండాపురం, సీ.బెలగల్ మండలం, కర్నూలు జిల్లాఇండ్ గ్యాప్ సర్టిఫికేషన్‌కు శ్రీకారం..ఇండ్ గ్యాప్ పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తులకు దేశంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. మన దేశంలో అమలయ్యే గ్యాప్ పద్ధతులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(క్యు.సి.ఐ.) ‘ఇండ్ గ్యాప్’ సర్టిఫికేషన్‌ను అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం 2023–24 ఖరీఫ్ నుంచి ఏపీ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణ సంస్థ ద్వారా ఈ ఇండ్ గ్యాప్ సర్టిఫికేషన్ వ్యవస్థ రైతులకు దేశంలోనే తొలిగా అందుబాటులోకి తెచ్చింది. 2023–24లో ఏపీలోని ప్రతి జిల్లాలో పైలెట్ ్రపాజెక్టు కింద ఒక పంటను గ్యాప్ పద్ధతిలో పొలంబడిలో భాగంగా సాగు చేయించడం విశేషం.ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్న అనేక సహకార సంఘాలు, ఎఫ్.పి.సి.లు వ్యవసాయ శాఖ పొలంబడి కార్యక్రమం ద్వారా ఇండ్ గ్యాప్ పద్ధతులను అనుసరించి లబ్ధిపొందటం విశేషం. విత్తన ధృవీకరణ సంస్థ ద్వారా ఉత్పత్తులపై పరీక్షలు చేయించి రైతులకు ఈ సర్టిఫికేషన్ ఇస్తారు. తద్వారా రైతులు మంచి మార్కెట్ ధరకు విక్రయించి మంచి నికరాదాయాన్ని పొందుతున్నారు. దిగుబడులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా క్రమంగా కెమికల్ వాడకాన్ని తగ్గిస్తూ.. అదే సమయంలో సేంద్రియం వైపు మళ్లే విధంగా రైతుల్లో అవగాహన కల్పించడం గమనార్హం.ఇవి చదవండి: పిల్లల నుంచి పోషణ కోసం.. తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించవచ్చా? -
ప్రిస్కిప్షన్ లేకుండానే పురుగుమందులు!
గ్లైపోసేట్ కలుపు మందును బీజీ–3 పత్తి పంటలో కలుపు నివారణకు ఉపయోగిస్తారు. వాస్తవానికి బీజీ–3 పత్తి విత్తనంపై నిషేధముంది. కానీ అనేకమంది రైతులు దీనిని సాగు చేయడంతో పాటు గ్లైపోసేట్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఎరువులు, పురుగు మందు దుకాణాల్లో అందుబాటులో ఉండటంతో అవగాహన లేకుండానే రైతులు దాన్ని కొంటున్నారు. కొందరు రైతులు వరిలో పెరిగే కలుపు నివారణకు కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. గతంలో ఒక రైతు అలాగే వరిలో కలుపు నివారణకు ఉపయోగిస్తే పంట మొత్తం మాడిపోయింది.సాక్షి, హైదరాబాద్: మనం ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు డాక్టర్ ప్రిస్కిప్షన్ (మందుల చిట్టీ) ఆధారంగానే మందులు వాడుతుంటాం. కానీ వ్యవసాయం చేసే రైతులు పంటలకు వచి్చన చీడపీడలను వదిలించేందుకు తమ ఇష్టారాజ్యంగా పురుగు మందులు వాడేస్తున్నారు. దీంతో పంటలు విషతుల్యమవుతున్నాయి. మోతాదుకు మించి వాడటంతో ఆయా పంటలు వినియోగిస్తున్న మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. మరోవైపు పంటల్ని కొత్త కొత్త చీడపీడలు ఆశిస్తున్నాయి.వ్యవసాయాధికారులు ప్రిస్క్రిప్షన్ రాసిస్తేనే రైతులకు దుకాణాదారులు పురుగు మందులు విక్రయించాలనే నిబంధన రాష్ట్రంలో బేఖాతర్ అవుతోంది. దీంతో రాష్ట్రంలో విచ్చలవిడిగా పురుగు మందుల విక్రయాలు జరుగుతున్నాయి. వ్యవసాయాధికారుల పర్యవేక్షణ లోపంతో పరిస్థితి ఇష్టారాజ్యంగా మారింది. భారీగా సాగు..పురుగుమందుల వినియోగం తెలంగాణలో వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, పప్పు ధాన్యాల పంటలు ఎక్కువగా సాగవుతుంటాయి. వానాకాలంలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు. అందులో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.48 లక్షల ఎకరాలు కాగా, వరి సాధారణ సాగు విసీర్తం 57.18 లక్షల ఎకరాలు. ఇక పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 8.52 లక్షల ఎకరాలు, మొక్కజొన్న సాధారణ సాగు విసీర్ణం 6.09 లక్షల ఎకరాలు, సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.29 లక్షల ఎకరాలుగా ఉంది.లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగు చేస్తున్న రైతాంగం..వాటిని కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తున్నారు. ఒక్క వానాకాలం సీజన్‌కే అన్ని రకాల ఎరువులూ కలిపి 24.40 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని నిర్ధారించారు. అందులో యూరియానే 10.40 లక్షల మెట్రిక్ టన్నులు ఉండటం గమనార్హం. వీటికితోడు భారీగా పురుగుమందుల వినియోగంతో పంటలు విషతుల్యమవుతున్నాయి. ఎకరానికి 360 కిలోల పురుగు మందుల వినియోగం! నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ తాజా అధ్యయన నివేదిక ‘భారత వ్యవసాయ పరిస్థితి’ప్రకారం పంజాబ్, హరియాణ తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా పురుగు మందులు వినియోగిస్తున్నారు. అంటే పురుగుమందుల వాడకంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నమాట. పంజాబ్‌లో రైతులు ఎకరానికి 500 కిలోలు, హరియాణలో 440 కిలోలు పురుగు మందులు వినియోగిస్తుండగా, తెలంగాణలో 360 కిలోల పురుగు మందులు ఉపయోగిస్తున్నారని నివేదిక తెలిపింది. ఆరు జిల్లాల్లో ఎక్కువ గతంలో వ్యవసాయ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో క్రిమి సంహారక రసాయనాల వినియోగం అత్యధికంగా ఉంది. వరి, పత్తి, కంది పంటలకు ఎక్కువగా క్రిమి సంహారక రసాయనాలు వినియోగిస్తున్నట్లు తేలింది. రైతులు దుకాణాదారుల వద్దకు వెళ్లడం.. వారు ఏది ఎంత వాడమంటే అంత వాడుతున్న పరిస్థితి నెలకొంది. వాస్తవానికి భూసార పరీక్షలు నిర్వహించి, వ్యవసాయాధికారుల సూచనలకు అనుగుణంగా ఎరువులు, పురుగుమందుల వాడకం ఉండాలి. నిజానికి పంటలను చీడపీడలు పట్టిపీడిస్తుంటే వ్యవసాయశాఖ అధికారులు వాటిని పరిశీలించి ఏ మందులు వాడాలో సూచిస్తూ మందుల చిట్టీ (ప్రిస్కిప్షన్) రాయాలి. కానీ అవేవీ జరగడంలేదు.ఆరోగ్యంపై ప్రభావం రసాయన పురుగుమందులను విచ్చలవిడిగా వినియోగించిన పంటలు మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. గ్లైపోసేట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తే క్యాన్సర్ సోకే ప్రమాదముంది. ఆ మందు చల్లినచోట చుట్టుపక్కల పంటలపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. పశువులు, పక్షులపై ప్రభావం చూపి జీవవైవిధ్యానికి నష్టం వాటిల్లుతుంది. ఇతరత్రా మందులు వాడిన పంటలు తినడం వల్ల కూడా దీర్ఘకాలంలో అనారోగ్యానికి గురయ్యేందుకు అవకాశం ఉంటుంది.అయినా ఏళ్లుగా మూసపద్ధతి సాగుకు అలవాటు పడిన రైతులు మోతాదుకు మించి ఎరువులు, పురుగు మందులు వాడుతున్నారని, మోతాదుకు మించి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల తెగుళ్లు నశించకపోగా ఏటా కొత్తవి పుట్టుకొస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి భూమిని, వాతావరణాన్ని కలుíÙతం చేయడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులపైనా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వారు పేర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో రైతులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారని తెలిపారు. -
ఏలూరు జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్..రైతులకు భారీ నష్టం
-
గడ్డినే కాదు, జీవులనూ చంపుతుంది!
ఒక ఉత్పత్తి గురించి అనేక దేశాలు గోస పడుతున్నాయి. అయినా దాని మీద శాశ్వత నిషేధం విధించడం లేదు. కలుపు సంహారక సమ్మేళనం గ్లైఫోసేట్ (గడ్డి మందు) వల్ల పర్యావరణం మీద, వ్యవసాయ కార్మికుల మీద, గ్రామీణ ప్రజల ఆరోగ్యం మీద దుష్ప్రభావాలు పెరుగుతున్నాయి. నేరుగా క్యాన్సర్ కలుగజేసే దీన్ని ఆహార పంటల క్షేత్రాలలో వినియోగించడం చాలా ప్రమాదకరం. దీన్ని పిచికారీ చేసిన పంట వ్యర్థాలను తిని గొర్రెలు, మేకలు, ఇతర పశువులు కూడా చనిపోయాయి. అయినా దీన్ని వినియోగం ఆపడం, ఉత్పత్తిని నిలిపివేయడం, అడ్డుకోవడం సవాలుతో కూడుకున్నదని స్పష్టమవుతోంది. వివిధ దేశాల రాజకీయ సంకల్పం పెద్ద కంపెనీల గణనీయమైన లాబీయింగ్ శక్తి ముందు దిగదుడుపే అని అర్థమవుతోంది.2015లో గ్లైలఫోసేట్ నిషేధాన్ని ఆమోదించి, అమలుచేసిన మొట్టమొదటి దేశం శ్రీలంక. కానీ ఈ నిషేధాన్ని 2018లో పాక్షికంగా మార్చవలసి వచ్చింది. 2022లో పూర్తిగా ఉపసంహరించబడింది. 2014లో ఒక స్థానిక శాస్త్రవేత్త గ్లైలఫోసేట్ వలన ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్’ వస్తున్నదని పరిశోధించి చెప్పిన దరిమిలా శ్రీలంక నాయకత్వం దీని మీద దృష్టి పెట్టింది. 2015లో ఎన్నికైన మైత్రిపాల సిరిసేన ప్రభుత్వం ఈ నిషేధాన్ని ఆమోదించింది. ఈ నిషేధం అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బౌద్ధ సన్యాసి రథనా థెరో మద్దతు కొరకు ఇచ్చిన వాగ్దానం. కానీ తర్వాత నిషేధంలో వెనక్కి తగ్గడం, తరువాత పూర్తిగా ఎత్తి వేయడం జరిగింది. ఈ లాబీయింగ్ వెనుక అమెరికా ప్రభుత్వం, బేయర్ కంపెనీ (అప్పట్లో మోన్శాంటో) ఉన్నదని అందరికీ తెలుసు. డిసెంబర్ 2023లో, నెలల తరబడి తర్జనభర్జనల తర్వాత, ఐరోపా కూటమి దేశాలలో కొన్ని నిషేధించాలని కోరినా, దీని లైసెన్స్‌ను పునరుద్ధరించాలని యూరోపియన్ కమిషన్ నిర్ణయించింది. మరో పదేళ్లపాటు వినియోగాన్ని ఆమోదించింది. ఆస్ట్రియా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బెల్జియం, లక్సెంబర్గ్, జర్మనీ వంటి కొన్ని యూరప్ దేశాలు కొన్ని ప్రాంతాల్లో, ఇళ్లల్లో దీని వాడకంపై పాక్షిక నిషేధాలనో, పరిమితులనో విధిస్తున్నాయి.గ్లైఫోసేట్ ఒక రసాయన ఉత్పత్తి. ఇదివరకు మోన్శాంటో, తరువాత దానిని కొన్న బేయర్ కంపెనీ అంతర్జాతీయ గుత్తాధిపత్య కంపెనీ. చాలా శక్తిమంతమైన ఐరోపా కూటమి కూడా ఈ కంపెనీ ఒత్తిడికి తలొగ్గి జీవరాశికి, మానవాళికి ప్రమాదకరంగా పరిణమించిన గ్లైఫో సేట్ వాడకం ఆపలేకపోయింది. సాంకేతిక, మార్కెట్, నియంత్రణ వ్యవస్థల మధ్య ఏర్పడిన ఒక సంక్లిష్టమైన పరస్పర అవగాహన వల్ల ఆధునిక వ్యవసాయంలో గ్లైఫోసేట్‌కు ప్రోత్సాహం లభించిందని ఒక ఆధ్యయనం చెబుతున్నది. ఇందులో 4 కీలక విషయాలు ఇమిడి ఉన్నాయి. (1) జన్యుమార్పు పంటల మీద ఉపయోగం కోసం గ్లైఫో సేట్ వినియోగం; (2) కొత్త వ్యవసాయ వినియోగాలను ప్రోత్సహించడం ద్వార ప్రపంచవ్యాప్త సాధారణ గ్లైఫోసేట్ మార్కెట్ పెరుగుదల; (3) గ్లైఫోసేట్ వాడకంతో మిళితం చేసే డిజిటల్ వ్యవసాయం, జీనోమ్ ఎడిటింగ్ వంటి కొత్త సాంకేతిక ప్రోత్సాహం; (4) కార్పొరేట్ మార్కెట్ శక్తి పెరుగుదల వల్ల వ్యవసాయ పరిశోధన కార్యక్రమాల్లో ప్రభుత్వ పెట్టుబడి తగ్గి హెర్బిసైడ్ రహిత కలుపు నియంత్రణ మీద పరిశోధనలు ఆగిపోవడం.మన దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో ప్రభుత్వాలు ఆ మధ్య వరుసగా ఒక మూడు సంవత్సరాలు దీనిమీద 60 రోజులు పాటు నిషేధం ప్రకటించాయి. ఈ తాత్కాలిక నిషేధం ఉద్దేశ్యం చట్టవిరుద్ధమైన, హెర్బిసైడ్–తట్టుకునే బీటీ పత్తి విత్తనాలను ఉపయోగించకుండా అరికట్టడానికి అని చెప్పారు. ఈ తాత్కాలిక నిషేధం కూడా కాగితాలకే పరిమితం అయ్యింది. ఆ పరిమిత నిషేధ కాలంలో కూడా బహిరంగంగానే అమ్మకాలు జరిగాయి. పురుగు మందుల నియంత్రణ చట్టం, 1968 ప్రకారం రాష్ట్రాలు విష రసాయనాలను 60 రోజుల వరకు మాత్రమే నిషేధించవచ్చు. కేంద్ర ప్రభు త్వానికి మాత్రమే శాశ్వతంగా నిషేధించే అధికారం ఉంది. వివిధ రాష్ట్రాలు కోరినా కేంద్రం నిషేధం గురించి స్పందించడం లేదు. కేరళ, సిక్కిం రాష్ట్రాలు మాత్రం కొన్ని అధికరణలను ఉపయోగించి శాశ్వత నిషేధం విధించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కేంద్రానికి రాసి మిన్నకున్నాయి. ఇతర విషయాలలో అధ్యయనాలకు బృందాలను పంపే రాష్ట్రాలు మరి కేరళ, సిక్కిం ఎట్లా సాధించాయో తెలుసు కునే ప్రయత్నం చేయలేదు.2019–21 మధ్య స్వదేశీ జాగరణ్ మంచ్ అవగాహన కార్య క్రమాలు చేపట్టి, గ్లైఫోసేట్ను పూర్తిగా నిషేధించాలని కోరుతూ రెండు లక్షల మంది సంతకాలతో కూడిన మెమోరాండంను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రికి సమర్పించింది. స్వదేశీ జాగరణ్ మంచ్ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ. అనేక విషయాలలో ఆర్ఎస్ఎస్ అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆరోపణ ఎదురుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, గ్లైఫోసేట్ మీద మాత్రం ఆ సంస్థ కోరిన నిషేధం విధించలేకపోతున్నది. రాజకీయ ఒత్తిడులలో ఉండే అధికార క్రమం ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నది. అక్టోబర్ 2020లో, పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా మరియు పాన్ ఆసియా పసిఫిక్ సంయుక్తంగా ‘స్టేట్ ఆఫ్ గ్లైఫోసేట్ యూజ్ ఇన్ ఇండియా’ నివేదికను విడుదల చేశాయి. దీని వాడకం విచ్చలవిడిగా ఉందని నివేదించాయి. దీని వల్ల పర్యావరణం మీద, వ్యవసాయ కార్మికుల మీద, గ్రామీణ ప్రజల ఆరోగ్యం మీద దుష్ప్ర భావాలు పెరుగుతున్నాయని పేర్కొంది. నేరుగా క్యాన్సర్ కలుగజేసే దీన్ని ఆహార పంటల క్షేత్రాలలో వినియోగించడం ప్రమాదకరం.ప్రజల నుంచి, సంస్థల నుంచి వచ్చిన ఒత్తిడుల నేపథ్యంలో నిషేధించకుండా కేంద్ర ప్రభుత్వం 2020లో కొన్ని ఆంక్షలు ప్రకటించింది. దీని ప్రకారం పెస్ట్ కంట్రోల్ ఆపరేటర్ల ద్వారా తప్ప ఏ వ్యక్తి కూడా దీన్ని పిచికారీ చేయరాదు. అంటే సాధారణ రైతులు ఉప యోగించరాదు. కేవలం రసాయన పిచికారి చేసే సంస్థల ద్వారానే ఉపయోగించాలని కొత్త నిబంధన తెచ్చింది. తదుపరి కంపెనీ నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి ఈ ఆంక్షలను సవరించారు. శిక్షణ పొందిన వారు ఎవరైనా ఉపయోగించవచ్చు అని చెప్పారు. ఆ శిక్షణ ఇవ్వడానికి ఒక కేంద్ర పరిశోధన సంస్థకు అప్పజెప్పితే వారు కొన్ని ఆన్లైన్ తరగతులు నిర్వహించి ఒక సర్టిఫికెట్ ఇస్తున్నారు.రైతులలో పూర్తి అవగాహన లేకపోవడం, పురుగుమందు / విత్తన కంపెనీల మార్కెట్ మాయాజాలం, కొరవడిన ప్రభుత్వ నియంత్రణ వంటి కారణాల వల్ల, రైతులు దీన్ని వాడుతున్నారు. రైతులు తాము కొన్నవి గ్లైఫోసేట్ తట్టుకునే విత్తనాలు అనుకుని, కాయ కాసిన తరుణంలో, గడ్డిని తొలగించటానికి దీన్ని వాడటం వల్ల, మొత్తం పంట మాడిపోయి నష్టపోయిన ఉదంతాలు ఉన్నాయి. దీని వాడకం మీద ఆంక్షలు ఉండడంతో, ప్రభుత్వం నుంచి పరిహారం కోరే అవకాశం కూడా లేకుండా పోయింది. గ్లైఫోసేట్ పిచికారీ చేసిన గడ్డి అని తెలియక దాన్ని నోట్లో పెట్టుకున్న ఒక అమ్మాయి చనిపోయింది. అనేక విధాలుగా గ్రామాలలో అమాయకులు ఈ విష రసాయనాల బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. పంట ఎండపెట్టడానికి ఓపిక లేని రైతులు పంట కోతకోచ్చే సమయానికి దీన్ని వాడు తున్నారు. దాని వల్ల మొక్క మాడుతుంది, చచ్చిపోతుంది. అట్లాంటి పంట వ్యర్థాలు విషపూరితం అవుతాయి. దీన్ని పిచికారీ చేసిన పంట వ్యర్థాల్నితిని గొర్రెలు, మేకలు, ఇతర పశువులు కూడా చనిపోయాయి.క్యాన్సర్ ప్రమాదాల గురించి వినియోగదారులను హెచ్చరించడంలో కంపెనీ విఫలమైందని పేర్కొంటూ మో¯Œ శాంటో (ఇప్పుడు బేయర్ యాజమాన్యంలో ఉంది)తో సహా గ్లైఫోసేట్‌తో సంబంధం ఉన్న రౌండప్ తయారీదారులపై అమెరికాలో వేలకొద్దీ కోర్టు వ్యాజ్యాలు దాఖలైనాయి. 2019 నాటికి ఇవి 42,700. ఇతర దేశంలో గ్లైఫోసేట్ మీద ఈగ వాలితే అమెరికా ప్రభుత్వం వాలిపోతుంది. అదే అమెరికాలో వేల కొద్ది వ్యాజ్యాలను ఆ కంపెనీ ఎదుర్కుంటున్నది.మానవాళికి, జీవకోటికి ప్రమాదకరంగా పరిణమించిన ఈ వ్యాపార వస్తువును నిషేధించలేని పాలనా వ్యవస్థలను, అందులోని లోపాలను అధ్యయనం చేయాలి. ఒక వ్యాపార వస్తువుని నియంత్రించలేని దేశాధినేతల బలహీనతలు ఇక్కడే తేలిపోతున్నవి. ప్రజా రోగ్యాన్ని దెబ్బ తీస్తూ, పర్యావరణానికి దీర్ఘకాల హాని చేసే రసాయనాల నియంత్రణ మీద ఒక వైపు అంతర్జాతీయ చర్చలు జరుగు తుంటే మన దేశంలో మాత్రం ఏ చర్యా లేదు. ఇది మారాలి. ఈ పరిస్థితి మారాలంటే మన రాజకీయం మారాలి. డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
46 లక్షల ఎకరాల్లో పంటల సాగు
సాక్షి, హైదరాబాద్: వానాకాలం పంటల సాగును ఈ సారి పెద్ద ఎత్తున చేపడుతున్నారు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇప్పుడు అధికంగా పంటలు వేస్తున్నారు. గత సంవత్సరం వానాకాలంలో ఇదే సమయానికి 25.79 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, ఈ సీజన్లో బుధవారం నాటికి 46.85 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ ఏడాది వానాకాలం అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 35.76 శాతం విస్తీర్ణంలో పంటలు వేశారు. ఇప్పటివరకు వేసిన పంటల్లో అత్యధికంగా పత్తి ఏకంగా 33.81 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.48 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 66.97 శాతం వేశారు. ఈ ఏడాది పత్తిని 60 లక్షల ఎకరాల్లో పండించాలని చేయాలని ప్రభుత్వం రైతులకు పిలుపునిచ్చింది. కాగా, వరి సాధారణ సాగు విసీర్తం 57.18 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.71 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. అంటే మూడు శాతానికే పరిమితమైంది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 8.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.81 లక్షల ఎకరాల్లో వేశారు. అందులో ఒక్క కంది పంటనే 2.37 లక్షల ఎకరాలు కావడం గమనార్హం. మొక్కజొన్న సాధారణ సాగు విసీర్ణం 6.09 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.92 లక్షల ఎకరాలు సాగైంది. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.29 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.55 లక్షల ఎకరాల్లో పంట వేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 99.96 శాతం.. ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో పంటల సాగు నమోదైంది. ఇప్పటివరకు సాగైన జిల్లాల్లో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలోనే నమోదు కావడం విశేషం. ఈ జిల్లా సాధారణ పంటల సాగు విస్తీర్ణం 5,62,594 ఎకరాలు కాగా, 5,62,386 ఎకరాల్లో సాగైంది. అంటే 99.96 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఇంత తక్కువ కాలంలో ఇంత సాగు కావడం విశేషం. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో కేవలం 8.16 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆయా ప్రాంతాలను బట్టి సాధారణం, అధికం, అత్యధిక వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ తెలిపింది. 17 జిల్లాల్లో అధికం నుంచి అత్యధిక వర్షపాతం నమోదైందని పేర్కొంది. నారాయణపేట, నాగర్‌కర్నూలు, వనపర్తి, గద్వాల, నల్లగొండ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మహబూబాబాద్, జనగాం, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఏ జిల్లాలోనూ లోటు వర్షపాతం నమోదు కాలేదని వ్యవసాయ శాఖ తెలిపింది. -
17 లక్షల ఎకరాల్లో సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 19 వరకు 17 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పత్తి 15.60 లక్షల ఎకరాలు, కంది 76 వేల ఎకరాల్లో సాగయిందని చెప్పారు. రానున్న రోజుల్లో వరినాట్లు, ఆరుతడి పంటల సాగు ఊపందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం సచివాలయంలో వానాకాలం పంటల సాగు, ఎరువుల నిల్వ, సరఫరాపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎరువుల సరఫరా పారదర్శకంగా జరగాలని, ఎవరైనా నిబంధనలు అతిక్రమించి అమ్మకాలు చేస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేయాలని, అదే విధంగా విక్రయాలను పరిశీలించాలని సూచించారు. 10.40 ఎల్ఎంటీల యూరియా కేటాయింపు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 10.40 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) యూరియా, 2.40 ఎల్ఎంటీల డీఏపీ, 10.00 ఎల్ఎంటీల కాంప్లెక్స్ , 0.60 ఎల్ఎంటీల ఎంవోపీ ఎరువులు కేటాయించిందని మంత్రి తెలిపారు. జూలై చివరి నాటికి 5.65 ఎల్ఎంటీల యూరియా అవసరం కాగా ఇప్పటికే 8.35 ఎల్ఎంటీల యూరియా, అలాగే 1.57 ఎల్ఎంటీల డీఏపీ, 1.30 ఎల్ఎంటీల కాంప్లెక్స్, 0.38 ఎల్ఎంటీల ఎంవోపీ అందుబాటులో తెచ్చామన్నారు. 1.07 ఎల్ఎంటీల యూరియా, 0.54 ఎల్ఎంటీల డీఏపీ, 1.06 ఎల్ఎంటీల కాంప్లెక్స్ ఎరువులను రైతులు కొనుగోలు చేశారని మంత్రికి అధికారులు వివరించారు. ఆగస్టు వరకు సరిపడా ఎరువుల కోసం కేంద్ర మంత్రికి లేఖఆగస్టు నెల వరకు సరిపడా ఎరువులను వీలైనంత త్వరగా రాష్ట్రానికి సరఫరా చేయాలని కోరుతూ కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ మంత్రి జేపీ నడ్డాకు మంత్రి లేఖ రాశారు. వానాకాలం పంటలు తెలంగాణలో ముందుగా ప్రారంభమవుతాయని, దానికి తగ్గట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే రెండు నెలలకు సరిపడా ఎరువులను ముందుగానే తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. రాష్ట్ర కేటాయింపుల ప్రకారం ఆగస్టు నెల వరకు కేటాయించిన డీఏపీ, ఇతర ఎరువులను వెంటనే సరఫరా చేసేలా తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. -
చేనుకుచేవ.. రైతుకు రొక్కం..బయోచార్!
పిఠాపురం: గత కొన్నేళ్లుగా మోతాదుకు మించి వాడుతున్న రసాయనిక ఎరువులు, పురుగు మందులతో భూమి తన సహజ గుణాలను కోల్పోయింది. దీంతో ఆశించిన నాణ్యమైన ఉత్పత్తులను అందించలేక, క్రమంగా చౌడుబారుతోంది. మొక్కలకు ఉపయోగపడే సూక్ష్మజీవులు భూమిలో అంతరించిపోతున్నాయి. తద్వారా భూమి సారాన్ని కోల్పోయి నిస్తేజంగా మారి, నాణ్యమైన పంటలు పండే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఈ సమస్య నుంచి రైతులను ఆదుకోవడానికి పూర్వం వాడుకలో ఉండే బయోచార్ను (బయో అంటే జీవం.. చార్ అంటే బొగ్గు) మళ్లీ వాడుకలోకి తీసుకు రావడానికి ప్రకృతి వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.బయోచార్‌తో ఇదీ మేలు... వాస్తవానికి 1850 నుంచే ఈ పద్ధతి వినియోగంలో ఉన్నప్పటికీ కాలక్రమంలో మరుగున పడిపోయింది. ఎలాంటి ఎరువునైనా మొక్కలు గ్రహించి మంచి దిగుబడి రావడానికి బయోచార్ ఒక మంచి ఔషధంగా పని చేస్తుంది. ఆమ్ల గుణాలున్న మట్టి పీహెచ్ స్థితిని సాధారణ స్థాయికి తీసుకుని రావడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. సహజంగా మనం ఎన్ని ఎరువులు వేసినా, వాటిలో మొక్కకు 30 నుంచి 40 శాతం మాత్రమే అందుతాయి. పంటలకు వేసే ఎరువుల్లో బయోచార్ను కలపడం ద్వారా వంద శాతం ఎరువులను మొక్కలు గ్రహించే అవకాశముంటుంది. మట్టిలో తేమ శాతాన్ని క్రమబద్దీకరించి, తగిన తేమ అందేలా చేయడంలో దీనికి మించింది మరొకటి లేదు. మొక్కలకు పోషకాలు అందని చోట ఇది ఉ్రత్పేరకంగా పని చేసి, మొక్కలకు పోషకాలు అందేలా చేస్తుంది. ముఖ్యమైన సూక్ష్మజీవుల సంఖ్యను పెంచుతుంది. నేలలో రసాయనాల గాఢతను తగ్గించి, సహజంగా మార్చుతుంది. ఉపయోగించే విధానం... కర్ర బొగ్గు 50 కేజీలు, చివికిన పశువుల పెంట 50 కేజీలు, రసాయనాలు వాడని అడవి మట్టి లేదా పుట్ట మట్టి 10 కేజీలు తీసుకుని, 8 నుంచి 10 లీటర్ల నీరు, రెండు కేజీల బెల్లం కరిగించి తీసుకోవాలి. దీంతో పాటు ద్రవ జీవామృతాన్ని నేరుగా దీనిలో కలపాలి. వీటన్నిటినీ బాగా కలియబెట్టి వారం పది రోజుల పాటు ఒక డబ్బాలో వేసి నీడలో పెట్టాలి. రోజుకోసారి కలుపుతూ ఉండాలి. లోపల గాలి తగిలే విధంగా గోనె సంచి మూత పెట్టి ఉంచుకోవాలి. పది రోజుల తరువాత బయోచార్ తయారవుతుంది. దీన్ని వరి దమ్ములో వేసుకోవాలి, ఉద్యాన పంటల్లో మొక్కల మొదళ్ల చుట్టూ పళ్లెం కట్టి దానిలో బయోచార్ను వేసి మట్టితో కప్పివేయాలి. దీనివల్ల పంట నాణ్యత పెరుగుతుంది.బయోచార్ తయారీ ఇలా.. బహిరంగంగా కాల్చడం » రెండు మీటర్ల పొడవు, ఒక మీటరు లోతున గొయ్యి తవి్వ, దానిలో వృక్ష వ్యర్థాలను వేసి, ఒకసారి మంట మండిన తరువాత దాన్ని పచ్చటి ఆకులతో కప్పి బయటి నుంచి ఆమ్లజని అందకుండా చేయాలి. తద్వారా రెండు రోజులకు బయోచార్ తయారవుతుంది. » స్థానికంగా లభ్యమయ్యే వృక్ష వ్యర్థాలను, నిరుపయోగంగా పడి ఉండే కట్టెలను కాల్చడానికి వీలుగా గుల్ల తయారీ బట్టీల మాదిరిగా అర్ధచంద్రాకారంలో బట్టీలను తయారు చేసుకోవాలి. ఆ బట్టీల్లో వృక్ష వ్యర్థాలు వేసి, కాల్చి రెండు రోజుల తరువాత తీసుకుంటే బయోచార్ సిద్ధమవుతుంది. నాణ్యత, దిగుబడి పెరిగాయి... రెండేళ్లుగా బయోచార్ ద్వారా నువ్వులు, వేరుశనగ, ఆకుకూరలు పండిస్తున్నాను. దీన్ని వేయక ముందు పంటలు నాసిరకంగా ఉత్పత్తయ్యేవి. బయోచార్ వాడటం మొదలు పెట్టాక పంటల నాణ్యతతో పాటు దిగుబడి బాగా పెరిగింది. నేల సారవంతంగా మారి వర్షాభావ పరిస్థితులను తట్టుకుని, మొక్కలు జీవంతో ఉంటున్నాయి. తేమ తగ్గిపోకుండా ఉంచడంలో ఇది చాలా బాగా పని చేస్తోంది. భూమిలో కార్బన్ శాతం పెరగడానికి ఇది బాగా ఉపయోగపడుతోంది. – దుర్గాప్రసాద్, ఫార్మసీ సైంటిస్టు, రైతు, బలభద్రపురం, జగ్గంపేట మండలం, కాకినాడ జిల్లా బయోచార్‌తో మంచి ఫలితాలు.. మా పొలంలో ఆరేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. గత ఏడాది ప్రకృతి వ్యవసాయ అధికారులు బయోచార్ గురించి వివరించడంతో దీన్ని ఉపయోగించడం ప్రారంభించాం. దీనివల్ల పంటలకు నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. తడులు తక్కువగా పెట్టినా ఇబ్బంది ఉండటం లేదు. పంటలు గతంలో కంటే ఆశాజనకంగా, నాణ్యతగా వస్తున్నాయి. ఎరువుల వాడకమూ తగ్గింది. కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటున్నాయి. మొక్కల పెరుగుదల చాలా బాగుంది. – ఎం.మల్లీశ్వరి, రైతు, ఒమ్మంగి, ప్రత్తిపాడు మండలం, కాకినాడ జిల్లా ప్రయోగాత్మకంగా చేపట్టాం... బయోచార్ విధానాన్ని గత ఏడాది నుంచి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఆచరణలోకి తెచ్చాం. ఈ ఏడాది 1,500 ఎకరాల్లో ఈ విధానంలో సాగు చేయాలని నిర్ణయించాం. ఇప్పటి వరకూ 50 ఎకరాల్లో 60 మంది రైతులు ఈ విధానంలో సాగు చేపట్టారు. ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ విధానం అమలుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. దీన్ని ఒకసారి ఉపయోగిస్తే కనీసం 60 నుంచి 80 రోజుల పాటు పంటలకు పోషకాలను అందిస్తుంది. ఎనిమిదేళ్లపాటు ఫలితం ఉంటుంది. ఎరువుల వాడకం 60 నుంచి 70 శాతం తగ్గిపోతుంది. నీటి ఎద్దడి ఉన్నా పంటలు నష్టపోకుండా దిగుబడులు ఇస్తాయి. – ఎలియాజర్, ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి, కాకినాడ కమిటీతో బయోచార్ పంటల సాగు... బయోచార్‌తో లాభాలను జిల్లాలోని రైతులకు తెలియజేస్తున్నాం. 2024 రబీలో 19 మంది రైతు శాస్త్రవేత్తలతో బయోచార్ తయారు చేయించి, పొలాల్లో వేయించి, ఆ పొలాల పరిస్థితిని అంచనా వేశాం. ఈ ఏడాది ఖరీఫ్, వచ్చే రబీలో 19 మంది రైతు మెంబర్లతో దీన్ని తయారు చేయించి, వారి పొలాల్లో వేయించి, పంటల తీరును ఇతర రైతులకు తెలియజేసేవిధంగా అవగాహన కల్పించాం. ఎక్కువ మంది రైతులు ఈ విధానంలో పంటలు సాగు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – రేష్మ సోమ, జిల్లా పాయింట్ పర్సన్, ప్రాజెక్టు లింక్ అసోసియేట్, కాకినాడ -
Telangana Rains Photos: తెలంగాణలో అకాల వర్షం కారణంగా ఆవేదనలో అన్నదాత (ఫొటోలు)
-
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
కడెం(ఖానాపూర్): రబీ సీజన్లో సాగు చేసిన పంటలకు నీరందించాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు ఆందోళన చేపట్టారు. నిర్మల్ జిల్లాలోని సదర్మాట్ కాలువకు నీటిని విడుదల చేయాలని కడెం మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన రైతులు నచ్చన్ఎల్లాపూర్ వద్ద నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహదారిపై గురువారం బైఠాయించారు. వారం రోజులుగా సదర్మాట్ కాలువకు నీటిని విడుదల చేయకపోవడంతో కడెం మండలంలోని లింగాపూర్, మాసాయిపేట్, నచ్చన్ఎల్లాపూర్, పెద్దూర్‌తండా, చిట్యాల్, ధర్మాజీపేట్, తదితర గ్రామాల్లోని సుమారు 13 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని వారితో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. రైతులు ఆందోళన చెందవద్దు: ఎమ్మెల్యే వెడ్మ సదర్మాట్ రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, కాలువ నీళ్లు వస్తాయ ని రైతులు ఆందోళన చెందవద్దని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హామీ ఇచ్చారు. సదర్మాట్ చివరి ఆయకట్టు వరకు నీటిని విడుదల చేయాలని ఈఎన్సీ నుంచి ఎస్ఈకి గురువారమే ఆదేశాలు వచ్చాయని ఆయన వెల్లడించారు. -
భగీరథ ప్రయత్నం!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఆరుగాలం శ్రమించి వేసుకున్న పంటలను కాపాడుకొనేందుకు రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. కళ్ల ముందే ఎండిపోతున్న పంటలను బతికించుకొనేందుకు రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. కరువు కారణంగా భూగర్భ జలాలు అడుగంటి బోర్లు వట్టిపోవడంతో పంటలను ఎలాగైనా కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టులో ఇప్పటికే వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోగా సాగర్ బ్యాక్ వాటర్ కింద సాగు చేసుకుంటున్న రైతులు పంటలను కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బత్తాయి, మామిడి వంటి పండ్ల తోటలతోపాటు వేరుశనగ, వరి పంటలను బతికించుకొనేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. ముఖ్యంగా సాగర్ జలాశయం డెడ్ స్టోరేజికి చేరడంతో బ్యాక్ వాటర్ కిలోమీటర్ల మేర తగ్గిపోయింది. దీంతో నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలంలోని నంభాపురం, పెద్దగట్టు, పుట్టంగండి తదితర ప్రాంతాల్లో గిరిజన రైతులు పంటకు నీరందించేందుకు కిలోమీటర్ల పొడవునా పైపులైన్లు వేసుకొని మోటార్లు పెట్టి నీటిని తరలిస్తున్నారు. పెద్దవూర మండలం పాత్తితండా, పర్వేదుల తదితర గ్రామాల రైతులు పదుల సంఖ్యలో సాగర్ వెనుక జలాశయంలోని లోతట్టు ప్రాంతాల్లో కొద్దిపాటి నీళ్లు ఉన్న ప్రదేశాలకు దూరంగా బావులు తవ్వి అక్కడి నుంచి 7–8 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసుకుంటున్నారు. పంటల కోసం తంటాలు పడుతున్నాం పంటలు ఎండిపోకుండా నానా తంటాలు పడుతున్నాం. అప్పులు చేసి మరీ పంటలను కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నాం. నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజికి చేరడంతో బ్యాక్ వాటర్ నుంచి పంటలకు నీటిని అందించేందుకు కిలోమీటర్ల పొడవునా పైప్లైన్లు వేస్తున్నాం. – రమావత్ పత్తి, నంభాపురం -
ఆశలు..అడుగంటి.. గణనీయంగా పడిపోయిన భూగర్భ జలమట్టాలు
సాక్షి ప్రతినిధులు మహబూబ్‌నగర్/ కరీంనగర్/ ఖమ్మం: రాష్ట్రంలో ఎండలు మండిపోతుండటం, భూగర్భ జలాలు అడుగంటడంతో పలు జిల్లాల్లో పంటలు ఎండి పోతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. నీటి కొరత మామిడి లాంటి పంటల దిగుబడిపై ప్రభావం చూపిస్తోందని రైతులు చెబుతున్నారు. అప్పులు చేసి వివిధ రకాల పంటలు సాగు చేసిన రైతులు పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో బోర్లు వట్టి పోవడంతో నీరందక ఇప్పటివరకు లక్షకు పైగా ఎకరాల్లో పంటలు ఎండినట్లు అంచనా. ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా మండే ఎండలు,అడుగంటిన భూగర్భ జలాలతో పంటలు ఎండిపోతున్నాయి. నిజానికి 2022–23 యాసంగిలో మొత్తం 5,15,375 ఎకరాల్లో పంటలు సాగైతే ఈ ఏడాది 3,55,827 ఎకరాల్లోనే సాగు చేశారు. పాలేరు రిజర్వాయర్ పరిధిలోని పాత కాల్వ కింద కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో సుమారు5 వేలకు పైగా ఎకరాల్లో వరి ఎండింది. భగీరథ ప్రయత్నం చేసినా.. ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన శీలం విష్ణు ఈ ఏడాది యాసంగిలో వైరా నది కింద11 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశాడు. మరో 20 రోజుల్లో వరి చేతికి అందనుండగా వైరా రిజర్వాయర్‌లో నీటిమట్టం తగ్గిపోయింది. దీంతో వైరా నదిలో పొక్లెయినర్‌తో గుంతలు తవ్విం చి మోటారు ద్వారా పైరుకు నీరందించే ప్రయత్నం చేశాడు. అయినా ఫలితం లేక 80 శాతం మేర పంట ఎండిపోయింది. పెట్టిన పెట్టుబడి అంతా నేల పాలైందని విష్ణు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధానంగావరి పంటపై రైతాంగం ఆధారపడుతుంది.పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఈసారి మార్చి 31 వరకు వేసంగి పంటకు నీరందింది. కానీ గతేడాదితో పోలిస్తే ఆశించినంత మేరకు అందలేదు. ఫలితంగా వేలాది ఎకరాల్లో వరి ఎండిపోయింది. పలుచోట్ల పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. కరీంనగర్ జిల్లాలో దాదాపు 25వేల ఎకరాల వరకు వరి పంట సాగునీరు అందక ఎండిపోయిందని అనధికారిక అంచనా. పెద్దపల్లి జిల్లాలో ఎండలు దంచికొడుతుండటంతో చెరువులు, బావులు వట్టిపోతున్నాయి. మంథని, ముత్తరాం, రామగిరి, కాల్వ శ్రీరాంపూర్, ఓదెలా మండలాల్లో సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. వీర్నాపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో మాత్రం కొంతమేర వరి పంట ఎండిపోయింది. ఇక జగిత్యాల జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్ట్ అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కింద కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరందక జిల్లావ్యాప్తంగా దాదాపు 10 వేల ఎకరాల వరకు పొలాలు ఎండిపోయాయి. ఈనిన వరి ఎండిపోయింది.. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు లకావత్శ్రీనివాస్. ఊరు సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌మండలం సేవాలాల్ తండా. యాసంగిలోమూడెకరాల్లో వరి పంట వేశాడు. 3 బోరు బావులు నమ్ముకుని పంట సాగు చేస్తే భూగర్భజలాలు కాస్తా అడుగంటిపోయాయి. దీంతో బోర్లు వట్టిపోయి 3 ఎకరాల్లో ఈనిన పంటఎండిపోయింది. ఇటీవల రూ.లక్ష వెచ్చించి550 ఫీట్ల లోతులో బోరు వేయించాడు.కానీ నీళ్లు పడక పోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు. బకెట్‌తో నీళ్లు పోస్తూ.. ఈమె రైతు బోయ అంజమ్మ.నారాయణపేట జిల్లా మరికల్ మండలంఅప్పంపల్లికి చెందిన ఈమె పదేళ్లుగా కూరగాయల సాగు చేస్తోంది. ఈ ఏడాది అరఎకరంలో బెండతో పాటు ఇతర కూరగాయలు సాగు చేసింది. ఎండల తీవ్రత కారణంగా బోర్లల్లో నీటిమట్టం దాదాపుగా అడుగంటి పోయింది. వచ్చే కొద్దిపాటి నీటిని బిందెలు,బకెట్ల ద్వారా పోస్తూ పంటలు కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. 5 బోర్లువేశాడు మక్తల్ మండలం ఉప్పర్‌పల్లికి చెందిన రవీందర్‌రెడ్డికి 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.ఈ యాసంగిలో బోరుబావి కింద రెండు ఎకరాల్లో వరి, మిగతా మిరప తోట సాగు చేశాడు.భూగర్భజలాలు అడుగంటడంతో సుమారు రూ.1.20 లక్షలు వెచ్చించి ఐదు బోర్లు వేశాడు. రెండింటిలో నీరు పడలేదు. మూడింటిలో అంతంత మాత్రంగా నీరు పడింది. మిరపతోటకు నీరు సక్రమంగాఅందకపోవడంతో రూ.40 వేల వ్యయంతో స్ప్రింక్లర్లు వేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చేసిన అప్పు ఎలా తీర్చాలని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.